జీడిమామిడికి కొత్త వంగడాల కళ

బాపట్లలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం 11 రకాల కొత్త జీడిమామిడి వంగడాలు రూపొందించింది. ఈ ఏడాది రైతులకు లక్ష జీడిమామిడి మొక్కలు అందించేందుకు బాపట్ల కేంద్రం సన్నాహాలు చేస్తున్నది.
జాతీయ జీడిమామిడి పరిశోధన పథకం కింద బాపట్ల పరిశోధన స్థానంలో 60 ఎకరాల్లో జీడిమామిడి చెట్లు విస్తరించి వున్నాయి. ఈ క్షేత్రంలో శాస్త్రవేత్తలు కొత్తరకాల వంగడాలను తయారుచేయటంతో పాటు ప్రాచుర్యం పొందిన వంగడాల మొక్కల అంటులను తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెట్ల నుంచి వచ్చే పంటను వేలంపాట ద్వారా విక్రయిస్తారు. పరిశోధనా స్థానం ఇప్పటివరకు 11 రకాల వంగడాలను విడుదల చేసింది. విడుదలైన వంగడాలలో బిపిపి-8 అత్యధిక ప్రాచుర్యం పొందింది. అధిక దిగుబడి ఇవ్వడంతో పాటు ఈ హైబ్రీడ్‌ రకం గింజ బరువు 7 నుంచి 8 గ్రాములు ఉంటుంది. దీంతో దీనికి జాతీయ వంగడంగా గుర్తింపు లభించింది. అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం రైతులు ఆసక్తి చూపుతున్నారు. నూతనంగా బిపిపి 10, బిపిపి 11 రకాలను కూడా విడుదల చేశారు. ఇవి కూడా అత్యధిక ప్రాచుర్యం పొందాయి. గత ఏడాది బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం నుంచి 50 వేల మొక్కలు అంటుగట్టి రైతులకు విక్రయించారు. ఈ ఏడాది లక్ష మొక్కలు టార్గెట్‌ పెట్టుకున్నట్లు సీని యర్‌ శాస్త్రవేత్త కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. జీడిమామిడికి ఆశించే పురుగు నివారణకు చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేయాకు దోమ : జీడిమామిడికి తేయాకు దోమ ఆశిస్తే లీటర్‌ నీటికి 0.6 ఎం.ఎల్‌ కరాటే మందును కలిపి పిచికారి చేసుకోవాలి. జీడిమామిడి ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది కాబట్టి ఈ రకం దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.
 
గింజతినే పురుగు : ప్రస్తుత దశలో గింజతినే పురుగు ఆశించే అవకాశం ఉంది. ప్రొఫినోఫాస్‌ మందును పిచికారీ చేసి నివారించుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *