పుట్టగొడుగుల పెంపకం.. నిత్యం ఆదాయం

స్వయంకృషితో పాలపుట్టగొడుగులు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఆవిరిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి ప్రసన్న. ఆరోగ్యశాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూనే  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.
తక్కువ పెట్టుబడితో, కూలీల ఖర్చు లేకుండా పుట్టగొడుగుల్ని ఎవరైనా పెంచుకోవచ్చు. పట్టణాల్లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ వుండటంతో మార్కెటింగ్‌ ఇబ్బందులు కూడా లేవు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు పుట్టగొడుగులు పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. తొలుత ఎండుగడ్డిని అంగుళం సైజులో ముక్కలు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అనంతరం గడ్డిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన గడ్డిని 20 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టుకోవాలి. పాలిథిన్‌ కవర్లను సంచులుగా తయారుచేసుకుని ఆరబెట్టిన గడ్డిని ఐదు వరసలుగా నింపాలి. సంచుల్లో కొద్దిపాటి గడ్డివేసి దానిపైన విత్తనాలు, మరలా దానిపై గడ్డి, దానిపై విత్తనాలు ఇలా ఐదు వరసలుగా సంచిని నింపుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన సంచిని గాలి ఆడకుండా గట్టిగా మూసి ఉంచాలి. ఆ సంచికి 25 చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఆ సంచులను 21 రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి. పుట్టగొడుగుల తయారీలో భాగంగా మట్టిని సేకరించి దానిని నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన మట్టిలో చాక్‌ పౌడర్‌ కలపాలి. తదుపరి డార్క్‌ రూమ్‌లో ఉంచిన బ్యాగులను 21 రోజుల తర్వాత బ్యాగును సగానికి కట్‌ చేసి తయారుచేసుకున్న మట్టిని నింపాలి.
అనంతరం ఈ బ్యాగులను వెలుతురు గదుల్లోకి మార్చాలి. 24 గంటల గడిచిన తర్వాత రోజుకు రెండుపూటలా పల్చగా తడుపుతూ ఉండాలి. 15 రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తుతాయి. ఈ ప్రక్రియ మొత్తంలో 40 రోజులకు పుట్టగొడుగులు పూర్తిస్థాయిలో తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులు రెండు నెలలపాటు కోసుకోవచ్చు. కేజీ విత్తనాలతో ఐదు కిలోల పుట్టగొడుగులు తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులను ఆన్‌లైన్‌ ద్వారా కిలో రూ.200లకు హైదరాబాద్‌, కాకినాడ, విజయవాడలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ అకౌంట్‌లో ముందుగానే డబ్బులు వేస్తారని, అనంతరం వారి అడ్రస్‌ ప్రకారం సరుకులు పంపిస్తామని తెలిపారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆవిరిపూడి (కూచిపూడి)
నెలకు 20 వేల ఆదాయం
కూలీలపై ఆధారపడకుండా కుటుంబసభ్యులే పనిచేసుకుంటే నెలకు రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎక్కువ విస్తీర్ణంలో పుట్టగొడుగుల పెంపకాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నాను. –
ప్రసన్న
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *