బూమ్‌ స్ర్పేయర్‌ భళా

పంటలకు మందులు చల్లేందుకు ఇప్పటివరకు రైతులు ఉపయోగిస్తున్న పవర్‌ స్ర్పేయర్‌, ట్రాక్టర్‌ స్ర్పేయర్‌ల స్థానంలో మరో ఆధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. పురుగుల మందు ఏమాత్రం వృధాకాకుండా, మొక్క మొత్తం మందును చల్లే వీలున్న బూమ్‌ స్ర్పేయర్‌ విశేషాలు.
పొలంలో పవర్‌ స్ర్పేయర్‌తో పురుగుల మందు చల్లినప్పుడు ఆవిరి రూపంలో ఎక్కువ మందు గాలిలో కలిసిపోతుంది. ట్రాక్టర్‌ స్ర్పేయర్‌తో మందు పిచికారి చేసినా 30 శాతం వరకు నష్టం కలుగుతుంది. పైగా ట్రాక్టర్‌ వల్ల పంట నష్టం కూడా 15 శాతం వరకు వుంటున్నది. ఈ సమస్యలను అధిగమించి పంట నష్టం జరగకుండా, తక్కువ ఖర్చుతో, మొక్క అంతటికీ మందు పడే విధంగా పురుగులు మందును చల్లే బూమ్‌ స్ర్పేయర్‌ మార్కెట్‌లోకి వచ్చింది. రక్షక్‌-400 పేరుతో శక్తిమాన్‌ కంపెనీ ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ర్పేయర్‌ను తయారుచేసింది. దీని ధర రూ.11 లక్షలు. 400 లీటర్ల డబుల్‌ లేయర్‌ హైడెన్సిటీ పాలిథిన్‌ కెమికల్‌ ట్యాంక్‌ కలిగి ఉంటుంది. ఈ యంత్రానికి 12 మీటర్లు (40 అడుగులు) పొడవైన బూమ్‌ కలిగి ఉంటుంది. మందు పిచికారి సమయంలో దీనిని విచ్చుకునేలా చేసి తర్వాత మడతపెట్టే విధంగా డిజైన్‌ చేశారు. ఈ యంత్రానికి సిరామిక్‌ డిస్క్‌తో టువే ట్రిపుల్‌ యాక్షన్‌ 24 నాజిల్స్‌ ఉంటాయి. దీని వలన పెద్దగా పంట నష్టం వుండదు. వరి మళ్లలో వరి సాలు తీయకుండానే ఈ స్ర్పేయర్‌తో మందు కొడితే సాలు ఏర్పరిచే కూలీల ఖర్చు కూడా మిగులుతుంది.
ఖర్చు తక్కువ.. ఫలితం ఎక్కువ
‘మా సంస్థ ద్వారా బూమ్‌ స్ర్పేయర్‌ను కొనుగోలు చేశాం. ఈ యంత్రంతో వరి, పత్తి, శనగ, మిరప, కందిపైర్లలో మందు పిచికారీ చేశాం. ఈ స్ర్పేయర్‌ వల్ల పురుగుల మందు మొక్కలపై పూర్తిగా పడుతుంది. ఎత్తుగా పెరిగే వరి, కంది, జొన్న పంటలకు నష్టం వాటిల్లకుండా, సునాయాసంగా తిరుగుతూ స్ర్పే చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ట్రాక్టర్‌ ద్వారా మందు పిచికారీ చేసేందుకు ఒక హెక్టారుకు రూ.300 తీసుకుంటున్నారు. ఈ యంత్రం కోసం నాలుగు ఎకరాల్లో మందు చల్లేందుకు రూ.700 తీసుకుంటున్నాం’ అన్నారు కామనూరు గ్రామంలోని రాధాప్రకృతి ఫార్మస్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ అధ్యక్షుడు నంద్యాల రాఘవరెడ్డి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *