మేలు చేసే మినీట్రాక్టర్‌

కలుపు తీసేందుకు,   పురుగుల మందు చల్లేందుకు సకాలంలో కూలీలు దొరకక రైతులు చాలా సందర్భాల్లో నష్టపోతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే మినీ ట్రాక్టర్‌ రైతులకు వరంగా మారింది.
నాలుగు లక్షల రూపాయల ధర ఉన్న ఈ మినీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నది. ముఖ్యంగా పత్తి, కంది, చెరుకు పంటలలో, మామిడి తోటలు పూల తోటలలో కలుపు తీస్తుంది. పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిస్తుంది. అంతేగాక చిన్న ట్రాక్టర్‌కు వెనక ఉన్న తిరిగే పరికరం (పీ.టీ.వో) ద్వారా పంపు బిగించి, ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న ట్యాంకుకు అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా ఆయా పంట పొలాల్లో క్రిమిసంహారక మందును పిచికారీ చేసుకునే అవకాశం కూడా వుంది. ఈ ట్రాక్టర్‌ ద్వారా ఒక్క రోజుకు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కలుపు తీయడం, క్రిమిసంహారక మందును పిచికారి చేసే వీలున్నది. ఈ పని చేసేందుకు నలభై మంది కూలీలు అవసరమవుతారు. అందుకోసం 12 వేల రూపాయల ఖర్చవుతుంది. మినీ ట్రాక్టర్‌తో పని వేగంగా జరగడంతో పాటు ఖర్చు కూడా తక్కువ. దీంతో రైతులు ఈ ట్రాక్టర్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతంగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయలేని రైతులు గంటకు నాలుగు వందల రూపాయల అద్దె చెల్లించి సేవలు పొందుతున్నారు.
భలే ప్రయోజనం
చిన్న ట్రాక్టర్‌ సన్న, చిన్నకారు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. కూలీల కొరత ఉన్న ఈ పరిస్థితులలో చిన్న ట్రాక్టర్‌ రైతులను ఆదుకుంటుంది. వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై ఇస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
 బుచ్చిరెడ్డి,
హత్నూర మండలం, బడంపేట
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *