లాభాల్లో రారాజు ఆ కాకర

  • తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రలో డిమాండ్‌..
  • తూర్పుగోదావరి జిల్లాలో 700 ఎకరాల్లో సాగు
కూరగాయల్లో రారాజు ఆకాకర. పోషకాల గనిగా పేరుండటం, శాకాహారులతో
పాటు మాంసాహారులు కూడా ఎక్కువగా వినియోగిస్తుడడంతో ఆకాకరకు
తరగని డిమాండ్‌ వుంది. నిరంతరం మంచి ధర పలికే ఆకాకరను సాగు చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాల రైతులు.
కూరగాయల సాగు నిరంతరం ఆదాయం తెచ్చిపెట్టినా కొన్ని కూరగాయల ధరలు ఒక్కోసారి పాతాళానికి పడిపోతాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు రైతులు నిత్యం మంచి డిమాండ్‌, ధర వుండే ఆకాకర సాగు ప్రారంభించారు. మంచి రుచితో పాటు పోషకాలు పుష్కలంగా వుండటంతో ఆకాకరకు పట్టణాల్లో మంచి గిరాకీ వుంది. దానికి తోడు మంచి ధర పలకడంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి, కొడవలి, తాటిపర్తి గ్రామాలు, ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ రైతులు 700 ఎకరాల్లో అకాకర సాగు చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం కొద్ది విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ పంట సాగు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నది. కిలో వంద రూపాయల నుంచి 250 రూపాయలకు పైగా ధర పలికే ఆకాకర సాగు వల్ల అధిక ఆదాయం వచ్చినా ఖర్చులు, శ్రమ కూడా ఎక్కువే అంటున్నారు రైతులు.
 
పందిరి కోసం అధిక వ్యయం
ఆకాకర రైతులు సొంతంగానే విత్తనాన్ని తయారు చేసుకుంటారు. ఒక పొలంలో పండిన పంట నుంచి విత్తనాలు అదే పొలంలో నాటరు. అలా చేస్తే సరిగా మొలకెత్తదని రైతుల నమ్మకం. తీగ జాతికి చెందిన ఈ పంట సాగులో అధిక భాగం పందిరి వేసేందుకే ఖర్చవుతుంది. మొక్కలు పందిరికి ఎంత బాగా అల్లుకుంటే అంత అధిక దిగుబడి వస్తుంది. దీని సాగుకు ఎకరానికి సుమారు లక్ష నుంచి 1.20 లక్షల వరకూ వ్యయం అవుతుంది. పందరి వేసేందుకే రూ.40 నుంచి 55 వేల వరకూ ఖర్చు చేయాలి. పంట వేసిన 100 రోజులకు దిగుబడులు ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి కాయలను కోస్తారు. ఆరునెలలు పాటు నిరంతరాయంగా దిగుబడులు వస్తాయి. ఎకరానికి సగటున మూడు టన్నుల వరకూ దిగుబడి లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే అత్యధికంగా 4.5 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. విత్తనం వేసిన ఏడాది కాకుండా మరుసటి ఏడాది మొక్కలకు ఉన్న దుంపలతో సాగును కొనసాగిస్తారు. పంట దిగుబడి ప్రారంభంలో 10 కిలోల ఆకాకర ధర రూ.1500 వుంటుంది. పంట చివరి దశకు చేరే కొద్దీ రేటు తగ్గుతూ వచ్చి రూ.500కు చేరుకుంటుంది.
ఈ ప్రాంతంలో పండిన పంటలో 90 శాతం శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, ఇచ్చాపురం, అనకాపల్లి, గుంటూరు, ఒంగోలు మార్కెట్లతో పాటు తెలంగాణాలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్‌ మహారాష్ట్రలోని ముంబయి, కర్నాటకలోని బళ్లారి, బెంగుళూరు తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నది. వ్యాపారులు రైతుల వద్ద పంట కొనుగోలు చేసి వేరే ప్రాంతాలకు లారీల మీద తరలిస్తున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధులు,
పిఠాపురం, గొల్లప్రోలు రూరల్‌
ఎకరాకు లక్ష ఆదాయం
15 ఏళ్లుగా ఆకాకర సాగు చేస్తున్నాం. తుఫాన్లు వస్తే తప్ప ఏటా లాభం వస్తూనే ఉంది. అన్ని ఖర్చులూ పోను ఎకరాకు సుమారు లక్ష ఆదాయం వస్తుంది. గతంలో ఆకాకరను పందిరి పంటగా గుర్తించి సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు అది తీసేశారు. విత్తనాలపై రాయితీ ఇచ్చి, సబ్సిడీ ఇస్తే మరింతమంది రైతులు ఈ పంట సాగు చేస్తారు.
– కందా దొరబాబు, కె. చంటిబాబు,
ఆకాకర రైతులు, వన్నెపూడి
మధుమేహానికి చెక్‌
కాకరకాయను పోలి వుండే ఆకాకర పోషకాల గని. ఇందులో శరీరాన్ని శుద్ధి చేసే ఫినోలిక్‌ అధికంగా లభిస్తుంది. దీనికి శరీరంలోని మాలిన్యాలను తొలగించే శక్తి వుండటంతో కేన్సర్‌, ఊబకాయం వంటి వ్యాధులు దరిచేరకుండా వుంటాయి. అకాల వృద్ధాప్యాన్ని ఆకాకర దరిచేరకుండా చేస్తుంది. ఇందులో లభించే లుటిన్‌ వంటి సెరిటోనాయిడ్స్‌ వల్ల కంటి జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం దరిచేరకుండా చేస్తుంది. వందగ్రాముల ఆకాకరలో కేవలం 17 గ్రాముల కేలరీలు మాత్రమే వుంటాయి. పీచుపదార్ధం కూడా అధికంగా వుండటంతో జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు అలర్జీలను కూడా దరిచేరనివ్వదంటున్నారు నిపుణులు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *