సాఫ్ట్‌వేర్‌ జంట సేద్యం బాట

  • 400 గొర్రెల పెంపకంతో లాభాలు …
  • మాంసం విక్రయానికి సన్నాహాలు
 
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు కిరణ్‌, సుష్మ దంపతులు. ఉద్యోగాలు సంతృప్తినివ్వకపోవడంతో స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని కృష్ణాజీగూడెం చేరుకున్నారు. గొర్రెలు, మేకల ఫామ్‌ ఏర్పాటు చేశారు. మంచి లాభాలు గడిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మాంసం విక్రయాలు చేపట్టి వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్న ఆ దంపతుల సక్సెస్‌ స్టోరీ. 
స్వయం ఉపాధికి బెస్ట్‌:  కృష్ణాజిగూడెంలో పుట్టిన కిరణ్‌ వరంగల్‌లో చదువుకున్నాడు. బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు. భార్య సుష్మ కూడా ఉద్యోగిని, ఇద్దరికీ వారు చేస్తున్న ఉద్యోగాలు సంతృప్తినివ్వలేదు. ఇద్దరూ కలిసి స్వగ్రామం చేరుకున్నారు. మొదట 50 ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేశారు. సేంద్రియ వ్యవసాయంలో అనుభవం లేకపోవడంతో లాభాలు రాలేదు. గొర్రెల ఫామ్‌ పెడితే లాభదాయకంగా వుంటుందని నిపుణులు సలహా ఇవ్వడంతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసి గొర్రెల ఫామ్‌ నెలకొల్పారు. మొదటగా షెడ్‌ నిర్మించి 35 గొర్రెలతో ఫామ్‌ ప్రారంభించారు. ఒక్కో పొట్టేలును మూడు వేలకు కొనుగోలు చేసి వాటిని పెంచారు. మూడు నెలల్లో రెట్టింపు లాభాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరో నాలుగు షెడ్లు నెలకొల్పారు. ఇప్పుడు 400 గొర్రెలతో వారి ఫామ్‌ కళకళలాడుతోంది. గొర్రెలు, పొట్టేళ్ల కోసం నీటితొట్లను, దాణా తినేందుకు ట్రేలను ఏర్పాటు చేశారు. వాటి పిల్లల కోసం వేరుగా ఒక షెడ్‌ ఏర్పాటు చేశారు. మేతకు అవసరమైన పచ్చి జొన్న చొప్పను సొంతంగా పండించుకుంటే లాభదాయకం అని భావించారు. పదెకరాల భూమిని లీజుకు తీసుకుని పచ్చిజొన్న పండించారు. దీంతో ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది. గొర్రెలు, పొట్టేళ్లను పెంచేందుకు పెద్దగా శ్రమ వుండదు. అవసరమైన మేరకు పనివాళ్లను నియమించుకుని ఫామ్‌ను శ్రద్ధగా అభివృద్ధి చేస్తున్నారు ఆ దంపతులు. పొట్టేళ్ల విక్రయం మంచి లాభాలను తెచ్చి పెడుతుందంటున్నారు సుష్మ. ఖర్చులు పోగా ఏటా రెండు లక్షలకు పైగా లాభాలు ఆర్జిస్తున్నారు ఆ దంపతులు.
మాంసం విక్రయ కేంద్రాలు
కేవలం పొట్టేళ్లు విక్రయిస్తే లాభాలు పరిమితంగా వుంటాయి. అలా కాకుండా మంచి వాతావరణంలో పెంచిన గొర్రెలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తే వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చని ఆలోచించారు కిరణ్‌, సుష్మ. ప్రస్తుతం మార్కెట్‌లో పొట్టేలు మాంసానికి మంచి డిమాండ్‌ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.400 ఉంటే, పట్టణ ప్రాంతాల్లో రూ.600ల పైచిలుకు ధర పలుకుతోంది. త్వరలో గ్రామాల్లోనే కాక, పట్టణాల్లో కూడా మాంసం విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేసి, ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి విక్రయించాలని ఆలోచిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ యువతకు ఉపాథి కల్పించేందుకు ఈ దంపతులు సన్నాహాలు చేస్తున్నారు.
 ఆంధ్రజ్యోతి వ్యవసాయ ప్రతినిధి, జగిత్యాల
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత గొర్రెల ఫామ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఫాం కోసం ఎక్కువ మంది పనివారు అవసరం లేదు. ఖర్చు. శ్రమ కూడా తక్కువే. శ్రద్ధగా పనిచేస్తే ఉద్యోగానికి మించి ఆదాయం వస్తుంది. కొండంత సంతృప్తి మిగులుతుంది.
 కిరణ్‌, సుష్మ
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *