ఈడుపుగల్లులో పాల వెల్లువ

  • నిత్యం 900 లీటర్ల పాల ఉత్పత్తి
  • శ్రీనివాసరావు, మణికుమారి దంపతుల కృషి
పశుపోషణకు కొంతకాలంగా ఆదరణ తగ్గినా నిత్యం ఆదాయం అందించే డెయిరీ ఫాంల పట్ల విద్యాధికుల్లో సైతం క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పశువుల పట్ల మక్కువతో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో 250 మేలు జాతి పశువులను పెంచుతూ లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు శ్రీనివాసరావు, మణికుమారి దంపతులు.
ఏడాది పొడవునా రేయింబవళ్లు శ్రమించినా వ్యవసాయం ఒక్కోసారి నష్టాలనే మిగులుస్తుంది. పశుపోషణ అలా కాదు. నిత్యం ఆదాయం తెచ్చి పెడుతుంది. అందుకే పలువురు డెయిరీ ఫాంల ఏర్పాటుపై మొగ్గు చూపుతున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన వీరమాచినేని శ్రీనివాసరావు, మణికుమారి దంపతులకు పశువులంటే ఎనలేని మక్కువ. వీరి తాత, ముత్తాతల కాలం నుంచి పెద్ద సంఖ్యలో పశువులను పోషించేవారు. కార్మికుల కొరత కారణంగా పశువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. క్రమంగా పాలు విక్రయించే స్థాయి నుంచి ఈ కుటుంబమే పాలు కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చింది. డెయిరీ ఎందుకు పెట్టకూడదని ఆలోచించారు శ్రీనివాసరావు, మణికుమారి దంపతులు. 2004లో 10 గేదెలను కొనుగోలు చేసి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్న డైరీని ప్రారంభించారు. క్రమంగా పశువుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. ఈ రోజున శ్రీనివాసరావు డెయిరీలో 250 మేలు జాతి పశువులున్నాయి.
డెయిరీలో మేలు జాతి పశువులు
వీరి డెయిరీలో 200 ముర్రా జాతి గేదెలతో పాటు పుంగనూరు, గిర్‌ ఆవులు, హెచ్‌ఎఫ్‌, ఒంగోలు ఆవులు ఇలా మొత్తంగా సుమారు 250 ఆవులు, గేదెలు ఉన్నాయి. ఒక్క ముర్రా జాతి గేదెల నుంచి రోజూ 15 నుంచి 23 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తోంది. రోజూ సుమారు 900 లీటర్ల దిగుబడి వస్తోంది. లీటర్‌ పాలను రూ. 65 వరకు విక్రయిస్తున్నారు. డెయిరీలో పాలను గ్రామంలోనే విక్రయిస్తారు. ఇంకా పాలు మిగిలితే పాల కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. ఇలా రోజుకు 50 వేల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తున్నది. ఖర్చులు పోను నెలకు లక్షల్లో ఆదాయం లభిస్తున్నది. ఈడుపుగల్లు – ఉప్పలూరు రహదారిపై పచ్చని పంట పొలాల మధ్య 1.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ డైరీని ఏర్పాటు చేశారు. వేసవిలోనూ పశువులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా షెడ్డుపై చల్లటి నీటిని చల్లే స్ర్పేయర్లను అమర్చారు. డెయిరీలో 40 మంది కార్మికులు ఉపాథి పొందుతున్నారు. కార్మికుల కోసం క్వార్టర్స్‌ను కూడా డెయిరీలోనే నిర్మించారు శ్రీనివాసరావు. వారికి ఆహారం, వైద్యం వంటి సదుపాయాలను కూడా ఈ దంపతులు దగ్గర వుండి ఏర్పాటుచేస్తారు.
ఇవిగో బాహుబలి ఎద్దులు!
ప్రముఖ దర్శకుడు నిర్మించిన బాహుబలి చిత్రంలోని ఓ సన్నివేశంలో ఉపయోగించిన ఎద్దులు ఈ ఫాంలోనే వున్నాయి. వీటిని చూసేందుకు సైతం స్థానిక ప్రజలు నిత్యం వచ్చి పోతుంటారు. వీటితో పాటు సినీనటుడు నందమూరి హరికృష్ణకు చెందిన పుంగనూరు ఆవు సైతం ఇదే సావిడిలో ఆకర్షణగా నిలుస్తుంది. పుంగనూరు ఆవు మీద ఉన్న మక్కువతో విజయవాడ వచ్చినప్పుడల్లా హరికృష్ణ ఇక్కడికి వచ్చి ఆవును చూసి వెళ్తుంటారు.
నిరంతర పర్యవేక్షణ ముఖ్యం
పశుపోషణకు నిత్య పర్యవేక్షణ అత్యంత ప్రధానం. నేను నా భార్యా కూడా కార్మికులతో కలిసి పనిచేస్తాం. రోజూ పది గేదెల పాలు పితికితే సంతృప్తిగా వుంటుంది. 20 కుటుంబాలతో పాటు అదనంగా మరో 20 మందికి ఉపాథి కల్పించడం ఆనందాన్నిస్తుంది. జిల్లా స్థాయిలో పలుమార్లు ఉత్తమ పశుపోషణ అవార్డును అందుకున్నాం.
– వి. శ్రీనివాసరావు, డెయిరీ సారథి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *