ఈత వనం.. లాభాలు ఘనం

  • మెదక్‌ జిల్లా రైతు వెరైటీ సేద్యం
మామిడి, జామ, అరటి, సపోటా, బొప్పాయి తోటలు పెంచ డం చూశాం కానీ ఈతవనాన్ని పెంచడం అరుదు. తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌ ఈతవనం పెంచి అందరికీ స్వచ్ఛమైన కల్లు అందించి, లాభాలు గడిస్తున్నారు.
మిగిలిన తోటల్లాగా నాటిన వెంటనే ఈతవనంలో లాభాలు రావు. ఈత చెట్లు నాటిన నాటి నుంచి వాటిని జాగ్రత్తగా పెంచాలి. కల్లు గీసే స్థాయికి చెట్లు ఎదిగేందుకు పదేళ్లు పడుతుంది. తనకున్న మూడెకరాల్లో 11 ఏళ్ల క్రితం ఈత మొక్కలు నాటారు మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌. ప్రభుత్వం ఇప్పుడు ఈత మొక్కలను ఉచితంగా అందిస్తున్నది. దశాబ్దం క్రితం మొక్కలను కొనాల్సిందే. 2.80 లక్షలు ఖర్చు చేసి మూడు ఎకరాల్లో 1200 ఈత మొక్కలు నాటారు. ఈత చెట్లకు రోగాలు రాకుండా, పురుగుల నుంచి రక్షించడానికి, మందులు వాడాల్సి ఉంటుంది. ఇతర చెట్లలాగే ఈత చెట్లకు నీరు పెడుతూ, యేటా ఎరువులు వేయాలి. ఈత చెట్లకు రక్షణ చర్యలు తీసుకుంటే మొక్కలు బాగా పెరిగి కల్లు సకాలంలో అందుతుంది. చెట్టు బాగా ఎదిగితే పదో ఏట నుంచి కల్లు గీసే అవకాశం వుంటుంది. కల్లు గీయడంలో జాగ్రత్తలు పాటిస్తే ఈతచెట్టు 20 నుంచి 25 ఏళ్ల పాటు కల్లును అందిస్తుంది. ఈతచెట్ల పెంపకం చేపట్టిన రైతులు ఎక్సైజ్‌శాఖకు కల్లు వచ్చే ఒక్కొక్క చెట్టుకు రూ.15 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చెట్ల నుంచి కల్లు సేకరించేందుకు చెట్టు గీయడం నేర్చుకొని టీఎఫ్‌టీ లైసెన్స్‌ పొందాలన్నారు ఆ రైతు.
నిత్యం ఆదాయం
పదేళ్ల పాటు ఖర్చు చేసినా ఆ తరువాత నుంచి ఈత చెట్లు నిత్యం ఆదాయాన్నిస్తాయి. మా తోటలో స్వచ్ఛమైన కల్లు లభిస్తుండటంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర సుదూర ప్రాంతాల నుంచి కల్లు సేవించడానికి ఇక్కడికి వస్తున్నారు. కల్లు బింకి సైజును బట్టి రూ. 100 నుంచి రూ. 200ల వరకు వస్తుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *