
- ఒకసారి పెట్టుబడి.. పదిసార్లు దిగుబడి
కొలంబో కంది పంట ఇప్పుడు రైతులందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఒకసారి నాటితే పదిసార్లు దిగుబడినిచ్చే ఈ పంట సాధారణ కంది కంటే రెట్టింపు దిగుబడినిస్తుంది. ఖమ్మం జిల్లా రైతు పండిస్తున్న ఆ వెరైటీ పంట విశేషాలివి.
శ్రీలంకలో ఎక్కువగా పండించే ఈ కంది వంగడాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన రైతు మారం కరుణాకర్‌రెడ్డి సాగు చేస్తున్నారు. 17 ఎకరాల్లో 107 రకాల పంటలను పండిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన, కొలంబో కంది సాగుతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పంట చేతికి అందగా రెండో పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు ఈ వెరైటీ పంటను సాగు చేస్తున్నారు కరుణాకర్‌రెడ్డి. మన ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కంది సాగు చేస్తుంటారు. దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతులకు కొలంబో కంది కల్పతరువుగా మారనుంది.
ఐదేళ్లు దిగుబడి
కొలంబో కంది గింజలను మొక్క కట్టి చేలో ఒకసారి నాటితే చాలు ఐదు సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. ఎకరాకు కేజీ గింజలతో మెక్కలు నాటేతే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి దిగుబడి వస్తుంది. మళ్లీ మళ్లీ మొక్క నాటే అవసరం ఉండదు. మొదటిసారి వచ్చిన దిగుబడే చివరిసారి కూడా వస్తుందని రైతు కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. డిసెంబరు-జనవరి నెలల మధ్య ఒకసారి, జూన్-జూలై మధ్య రెండోసారి పంట చేతికొస్తుంది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు.. ఇలా రెండుసార్లు దిగుబడి వస్తుంది. ఈ క్రమంలో క్వింటాకు రూ.3 వేల చొప్పున అయినా సంవత్సరానికి రూ.లక్షా 20 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు ఆ రైతు. ఈ పంట పూత తియ్యగా వుంటుంది కాబట్టి పురుగు ఆశించే ప్రమాదం వుంది. అందుకే రైతులు పూత దశ నుంచి చివరి దశ వరకు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాంటున్నారు వ్యవసాయాధికారులు.
పెటుబడి తక్కువ ఆదాయం ఎక్కువ
ఒక పంట వేయాలంటే ప్రతీసారి దుక్కిదున్నాల్సిందే. కానీ కొలంబో కందికి ఆ అవసరం లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఐదు సంవత్సరాలు లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం మనం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్న కందిపప్పులో ఈ కొలొంబో రకమే అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని నేలలు కూడా ఈ పంటకు అనువుగా ఉంటాయి.
Credits : Andhrajyothi