కేరళ కనుమల్లో ‘టీ’మ్‌ తోటలు!

ఒక కంపెనీలో ఎవరుంటారు? యజమానులు, ఉద్యోగులు.. అంతే కదూ! కానీ, కేరళలోని కనన్‌ దేవన్‌ తేయాకు తోటల కంపెనీలో మాత్రం.. ఉద్యోగులే యజమానులు. శ్రమను కాచి.. లాభనష్టాలను వడబోసి.. మధురమైన తేనీటి ఫలితాలను తలా కొంత ఆస్వాదిస్తున్నారు. ముప్పావు వంతు కార్మిక భాగస్వామ్యం కలిగిన కంపెనీల్లో కనన్‌ది రుచికరమైన విజయం..
కనన్‌దేవన్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగానే.. వెదురుబుట్టలో నుంచి ఒక్కో తేయాకు రాలుతూ.. టీకప్పులో పడే దృశ్యం ఆకట్టుకుంటుంది. అవి తేయాకులే కాదు. పదమూడు వేల మంది చెమట చుక్కలు. ఆ టీకప్పులు పాతికవేల హెక్టార్ల తేనీటి తోటలు. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడాలంటే.. కేరళలోని కనన్‌ దేవన్‌ తోటల్ని తిలకించాల్సిందే! ఎందుకంటే… 69 శాతం ఉద్యోగుల భాగస్వామ్యం కలిగిన కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటేనంటే ఆశ్చర్యం వేస్తుంది. కనన్‌ టీకి 136 ఏళ్ల తీయటి చరిత్ర ఉంది.
కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్‌కు వెళితే.. కనుచూపుమేరా తేయాకు తోటలు కనువిందు చేస్తాయి. ఆ పచ్చటి తోటలే ‘కనన్‌ దేవన్‌ హిల్స్‌’ టీ ఎస్టేట్స్‌. ఈ ఆకుపచ్చ సామ్రాజ్యం 1897లో ప్రాణం పోసుకుంది.
స్కాట్లాండ్‌కు చెందిన ఫిన్‌లే ముయూర్‌ అండ్‌ కంపెనీ చొరవ చూపడంతో.. సంస్థగా ఒక రూపం ఏర్పడింది. దీంతో కనన్‌దేవన్‌హిల్స్‌ ప్లాంటేషన్‌ కంపెనీ లిమిటెడ్‌ అవతరించింది. 1976లో టాటా వారితో కనన్‌ కంపెనీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నాళ్ల పాటు సంయుక్త నిర్వహణ జరిగింది. 1983లో టాటా సంస్థే టీ ఎస్టేట్లను స్వాధీనం చేసుకుంది. దేశంలోనే ఒక పెద్ద టీ కంపెనీగా 33 టీ ఎస్టేట్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం విశేషం. అప్పటి నుంచీ ఇరవై రెండేళ్ల పాటు కంపెనీకి ఎదురేలేకుండా పోయింది. లాభాలతో రివ్వున దూసుకెళ్లింది. అత్యంత నాణ్యమైన టీ ఉత్పత్తులను అందించింది. అయితే ఒక దశలో మార్కెట్‌లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. టీ ఉత్పత్తి అధికమైంది. డిమాండ్‌ కంటే సరఫరా ఎక్కువ కావడంతో.. కొన్ని టీ కంపెనీలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాంతో టాటా కంపెనీ కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
శ్రామికులే భాగస్వాములు..
ఉద్యోగులను భాగస్వాములను చేసినప్పుడే.. ‘ఈ సంస్థ నాది’ అనే భావన కలుగుతుంది. పనిలోనూ అంకితభావం పెరుగుతుంది. అనే ఆలోచన వచ్చిందే తడువు, తేయాకు పరిశ్రమలోని శ్రామికుల్ని భాగస్వాములను చేసింది టాటా కంపెనీ. వారి పేరిట షేర్లు జారీ చేసింది. ఇందులోని 12,700 మంది ఉద్యోగులకు 69 శాతం వాటాలు కేటాయించారు. కంపెనీ ఈక్విటీ షేర్‌ రూ.13.9 కోట్లు. అప్పటి వరకు అదనపు గంటలు పనిచేసే ఉద్యోగుల పనివేళలు తగ్గిపోయాయి. ఎనిమిది గంటలే పని. రోజూ రూ.320 వేతనం.
మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేదు. ఇద్దరి వేతనం సమానం అయింది. ఏడాదికి ఒకసారి ప్రతి షేర్‌హోల్డర్‌కు కొంత మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తుంది కంపెనీ.
‘‘కనన్‌ దేవన్‌తో నాది పదిహేడేళ్ల బంధం. మా కుటుంబమంతా ఇక్కడే పనిచేస్తున్నాం. చనిపోయిన మా తాత, నాన్న కూడా ఇదే పని చేసేవారు. ఎంత చేసినా మేం కూలీలమే! అనే బాధ ఇప్పుడు లేదు. మేమంతా కంపెనీలో భాగస్వాములమన్న సంతృప్తి ఉంది. బోర్డులోనూ శ్రామికులే సభ్యులుగా ఉన్నారు. ఇంతకంటే భరోసా ఏముంటుంది?’’ అంటారు ఇందులో పనిచేసే కార్మికుడు మురుగున్‌.
కనన్‌లోని మరో విశేషం.. మహిళలకు పెద్దపీట వేయడం. తోటల్లో తేయాకు కోసే వాళ్ల దగ్గర నుంచి ఫ్యాక్టరీలో టీపొడి ఉత్పత్తి చేసేవాళ్ల వరకు.. అగ్రస్థానం మహిళలదే! ఇంచుమించు 64 శాతం మహిళా ఉద్యోగులే. కేరళ అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులు.. కనన్‌ దేవన్‌ తేయాకు తోటల్నీ సందర్శించి తీరాల్సిందే! ఆ తోటల్లోని తేనీరు ఎంత రుచికరంగా అనిపిస్తుందో.. శ్రామికుల ఐక్యతను చూసినప్పుడు.. అంతకంటే ముచ్చటేస్తుంది.
కనన్‌ దేవన్‌ తేనీటి రుచే వేరు. తేనీటిప్రియుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల టీలను ఉత్పత్తి చేస్తోంది. మారిన జీవనశైలికి అనుగుణంగా మున్నార్‌ గ్రీన్‌ టీ, ఆర్గానిక్‌ టీ, క్లాసిక్‌ గ్రీన్‌ టీ, ప్రీమియమ్‌ రోజ్‌ టీ, వైట్‌ టీలను వినియోగదారులకు అందిస్తోంది. అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయివి. డస్ట్‌ టీ పావుకిలో వందరూపాయల్లోపు లభిస్తోంది. కేరళ కనుమల్లోని కనన్‌ టీ తాగినప్పుడల్లా.. కష్టజీవుల కలిసికట్టు జీవితం కమనీయమైన అనుభూతి కలిగిస్తుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *