కొల్లాపూర్‌ మామిడికి కొత్తకళ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నాగర్‌కర్నూల్‌: వందేళ్ల చరిత్ర వున్న కొల్లాపూర్‌ మామిడి రుచులు ప్రపంచ దేశాలకు  విస్తరించనున్నాయి. కొల్లాపూర్‌ మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ప్రాంత రైతులతో అగ్రికల్చరర్‌ ప్రాసెస్‌ ఫుడ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (అపేడ) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.
‘అపేడ’తో ఒప్పందం.. రైతులకు లాభం
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ సురభి సంస్థానంలో నాణ్యమైన మామిడి రకాల తోటల పెంపకానికి వందేళ్ల క్రితమే బీజం పడింది. అప్పటి రాజా సురభి వెంకటలక్ష్మారావు నూజివీడు నుంచి ప్రత్యేక వంగడాలను తెప్పించి 70 ఎకరాలలో మామిడి మొక్కలను నాటారు. సురభి రాజులు తెప్పించిన ప్రత్యేక వంగడాల్లో బేనీషాన్‌ రకం మామిడికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. మధురమైన రుచికి మారుపేరైన కొల్లాపూర్‌ మామిడికి అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించేందుకు అపేడారంగంలోకి దిగింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 16 వేల 165 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి.
కల్వకుర్తిలో 5,309 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 1,692 ఎకరాలు, అచ్చంపేటలో 2,280 ఎకరాలు, కొల్లాపూర్‌లో అత్యధికంగా 6,884 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. కొల్లాపూర్‌ బేనిషాన్‌ (బంగినపల్లి) మామిడికి అంతర్జాతీయ మార్కెట్‌లో కేసర్‌, ఆల్‌ఫాన్సో, నూజివీడు రసాలు, సువర్ణరేఖలతో సమానంగా డిమాండ్‌ వున్న విషయాన్ని గుర్తించిన అపేడ క్రమంగా రైతుల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నాలను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్‌ ఇ. శ్రీధర్‌ ప్రత్యేక చొరవతో అపేడతో చర్చలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన పెంపొందించారు. సాధారణంగా కిలోకు 30 నుంచి 50 రూపాయల మధ్య ధరకు విక్రయిస్తూ స్థానిక రైతులు ఏటా నష్టాలు చవిచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీజన్‌ కంటే ముందే అపేడ అధికారులు నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ఉన్న మామిడి తోటలను ఎంపిక చేసుకొని అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కాయ 350 గ్రాముల కనీస బరువు, చక్కెర శాతం 8 గ్రాముల పైబడి ఉన్న వాటిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. కొల్లాపూర్‌ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల మామిడి తోటలను ఈసారి ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి సింగపూర్‌, యుకె, పొలెండ్‌, జర్మనీ, అమెరికా, కొరియా, ఆస్ర్టేలియా దేశాలకు కొల్లాపూర్‌ బంగినపల్లి మామిడిని ఎగుమతి చేయనున్నారు. నాణ్యత వున్న కొల్లాపూర్‌ మామిడి తోట వద్దనే కిలోకు దాదాపు వంద రూపాయల ధర పలికే అవకాశాలున్నాయని అపేడ రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు.
 
అపేడా ద్వారా మంచి ధర
ఉద్యానవన శాఖ వారి సహకారంతో గత ఏడాది మామిడి కాయలను విక్రయించేందుకు అపేడ సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాం. మార్కెట్‌ ధర కంటే కిలో మామిడికి అపేడ వారు 20 రూపాయలు అధిక ధర చెల్లించారు. నా తోట నుండి 2 టన్నుల మామిడి కాయలను అపేడ సంస్థ కొనుగోలు చేసింది.
– పెబ్బెటి కృష్ణయ్య రైతు, కొల్లాపూర్‌
 
చిన్నకాయలు కూడా కొనాలి
పెద్ద సైజు కాయలను మాత్రమే అపేడ వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం కొల్లాపూర్‌ మండల పరిధిలో మామిడి తోటల పూత చాలావరకు రాలిపోయింది. దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. రైతులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సైజులను కొనుగోలు చేయాలి.
– శ్రీరాములు, రైతు, కొల్లాపూర్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *