జయ్యారంలో పచ్చ బంగారం!

కాలికట్‌, గుంటూరు, బీహార్‌ నుంచి తీసుకువచ్చిన కొత్తరకం పసుపు వంగడాలు మహబూబాబాద్‌ రైతులకు పసిడి కురిపిస్తున్నాయి. ఏసీసీ-79, ఏసీసీ-48, రాజేంద్ర సోనాలి వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు మంచి ధర కూడా పలకడం విశేషం.
 
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌ 
ఇరవై ఏళ్లుగా సంప్రదాయ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న మహబూబాబాద్‌ జిల్లా జయ్యారం రైతులు ఇటీవల కొత్త వంగడాలను ఎన్నుకున్నారు. ఏసీసీ-79, ఏసీసీ-48, రాజేంద్ర సోనాలి రకం వంగడాలు అధిక దిగుబడులు అందిస్తూ రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఈ రకాల పసుపుకు ఆకుమచ్చ, దుంపకుళ్లు, తెగుళ్లు దరిదాపులకు కూడ రావు. పంటకాలం ఏడు నెలలే కావడంతో ఈ పసుపు చేతికి వచ్చిన తర్వాత రెండవ పంటగా కూరగాయలు, ఇతర స్వల్పకాలిక రకాలు వేసి లాభాలు గడించవచ్చు.
ఈ పసుపు సాగులో కూలీల సమస్య, వేసవిలో నీటి సమస్య ఉండదు. బోజ పద్ధతిలో బిందుసేద్యం, సేంద్రియ పద్ధతి, ఆధునిక పద్ధతి ద్వారా ఈ పసుపును జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలోని కొంతమంది రైతులు పండిస్తూ, విజయం సాధించి లాభాల బాటలో పయనిస్తున్నారు. కాలికట్‌, గుంటూరు నుంచి ఏసీసీ-79, ఏసీసీ-48 రకాలను క్వింటాలుకు రూ.7500 చొప్పున తీసుకువచ్చారు వల్లూరి కృష్ణారెడ్డి. ఎకరంలో పసుపు ముక్కలు కట్‌ చేసి బోజ పద్ధతిలో నాటారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని అందించారు. పసుపు చేను ఎత్తు పెరగకపోవడం ఈ వండగం ప్రత్యేకత. మధ్యాహ్నం సమయంలో ఆకులు ముడుచుకునే గుణం ఉండడంతో సూర్యరశ్మి చెట్ల అడుగుభాగంలో తగులుతుంది.
దీంతో పసుపు వేర్లు ఎక్కువగా పెరిగి దుంపలు అధికంగా వచ్చాయి. జూన్‌ మొదటి వారంలో విత్తనాలు వేస్తే జనవరి 15 కల్లా పంటకాలం ముగుస్తుంది. సాధారణ పసుపు సాగుకంటే ఈ పసుపు పంటకాలం తక్కువగా వుండటంతో వేసవిలో నీటి సమస్య, కూలీల సమస్య ఉండదు. ఎకరానికి 195 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒక్కగడ్డ కిలో 800 గ్రాముల వరకు ఊరింది. ఈ కొత్తరకం పచ్చి పసుపును విత్తనాల కోసం ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడ జయ్యారం వచ్చిన రైతులకు క్వింటాకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు ఈ రైతు. ఈ పసుపుపై పెట్టుబడి రూ.76 వేలు కాగా రూ. 8.74 లక్షల ఆదాయం వచ్చింది. కురికిమన్‌ (పసుపురంగు) అధికంగా ఉండడంతో ధర ఎక్కువగా పలుకుతోంది. మరో రైతు బొల్లంపల్లి శ్యాంసుందర్‌రెడ్డి ఏసీసీ-48, 79 రకాలను తీసుకువచ్చి బోజ పద్ధతిలో కాకుండ సంప్రదాయ పద్ధతిలో నాగలి కట్టి ఎకరం సాగు చేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చయింది. 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి పోను రూ.4.50 లక్షల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
అవగాహన సదస్సుతో మేలు: కృష్ణారెడ్డి
ఆదిలాబాద్‌ జిల్లా ధనోరాలో జరిగిన పసుపు అవగాహన సదస్సుకు వెళ్లాను. అక్కడ బోజ పద్ధతిలో రిటైర్డ్‌ శాస్త్రవేత్త ఎల్‌.కిషన్‌రెడ్డి చెప్పినట్టుగా ఈ కొత్తరకం వంగడాలను సాగు చేయడంతో అధిక లాభాలు వచ్చాయి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *