నికరాదాయం ఇచ్చే పట్టు

వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ శ్రమతో కూడుకున్నా రైతులకు నికరాదాయం అందిస్తుంది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి, రెండెకరాల మల్బరీ తోటను సాగు చేసి, పట్టుపురుగులు పెంచితే నెలనెలా లాభాలు వస్తాయంటున్నారు నిపుణులు. మల్బరీ తోటను పెంచి, ఆ ఆకును పట్టు పురుగులకు ఆహారంగా వేసి, వాటిని పెంచితే, పట్టు గూళ్లు తయారవుతాయి. వాటిని అమ్ముకుని, ఆదాయం పొందవచ్చని పట్టు పరిశ్రమ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత పట్టు పరిశ్రమ ద్వారా మంచి ఉపాధి పొందవచ్చు. మల్బరీ తోటలు ఇసుక, మాగాణి, బీడు భూములు తప్ప మిగిలిన అన్ని నేలల్లో పెరుగుతాయి.
ఒక ఎకరా మల్బరీ సాగుతో ఏడాది పొడవునా ఐదుగురికి ఉపాఽధి లభిస్తుంది. 3-4 నెలల వయసు గల 6వ రకం నారు మొక్కలు 5:3:2 అడుగులు లేదా 3:3 అడుగుల పద్ధతిలో నాటాలి. నీటి వసతి తక్కువగా ఉన్న నేలల్లో కూడా మల్బరీ తోటను బిందు సేద్య పద్ధతులతో సాగు చేయవచ్చు. పట్టుపురుగులు పెంచటానికి 50:20:15 అడుగుల కొలతలతో రేకుల షెడ్డు వేసుకున్నా సరిపోతుంది. ఎకరా మల్బరీ తోటలో ఏడాదికి 4-5 పంటలు వేసుకుని రూ.75 వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందే వీలుంటుంది.
పట్టు పరిశ్రమ నిర్వాహకులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. జీరో వడ్డీతో రూ.లక్ష వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంది. ఎకరా తోటలో ఆరు వేల మల్బరీ నారు మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చులో మల్బరీ నారు మొక్కల సంఖ్య ఆధారంగా రూ.10,500 రాయితీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కింద ఎకరా మల్బరీ తోట పెంపకానికి మూడేళ్లపాటు దఫాల వారీగా రూ. 1,32,436 వస్తుంది. పట్టు పురుగుల రేరింగ్‌షెడ్‌ నిర్మాణానికి ఒక రకానికి రూ.1,59,104, రెండో రకానికి రూ.57,983 ఇస్తారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పఽథకం కింద 50 శాతంతో రేరింగ్‌ షెడ్‌ 50:20:15 అడుగుల షెడ్‌ నిర్మాణానికి రూ.1,37,500 నాలుగు దఫాలుగా సబ్సిడీ లభిస్తుంది. పట్టు పురుగుల షెడ్డు ఎల్‌ ఆకారంలో ఏర్పాటు చేసుకుంటే రూ.22,500 వస్తుంది.
షెడ్లకు సోలార్‌ లైట్లు, బ్రష్‌ కట్టర్స్‌, స్ర్పేయర్లు, సూక్ష్మపోషకాలుగా వేపపిండి వంటివి 50 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. ఎస్‌సీఎస్ పీ పథకం కింద ఎకరం తోటకు ఆరు వేల మొక్కలు నాటుకునేందుకు అయ్యే ఖర్చును 90 శాతం సబ్సిడీతో రూ.12,600 ఇస్తున్నారు. ఎస్సీ రైతులకు పట్టు పురుగుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీతో రూ.3.60 లక్షలు అందిస్తున్నారు.
పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన స్టాండ్లు, ఇతర పరికరాలకు 90 శాతం రాయితీతో రూ.63 వేలు, వ్యాధి నిరోధక మందులు, సోలార్‌ లాంతర్ల ఏర్పాటుకు ఎస్సీలకు 90 శాతం రాయితీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వ పట్టు గూళ్ల మార్కెట్లలో సీబీ రకం పట్టుగూళ్లకు కిలో రూ.20 ప్రోత్సాహం ఇస్తున్నారు. బీవీ రకానికి రూ.50 ఇస్తున్నారు. చిన్న వయస్సు పట్టు పురుగుల పెంపక కేంద్రం(చాకీ సెంటర్‌)లో 100 బీవీ గుడ్లకు రూ.వెయ్యి ప్రోత్సాహకం లభిస్తోంది. ప్రభుత్వ పట్టు గూళ్ల విక్రయ కేంద్రాలు రాయలసీమలోని మదనపల్లి, హిందూపురం, కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌, గుంటూరు ఆటోనగర్‌లో ఉన్నాయి. రెవిన్యూ డివిజన్లలోని సాంకేతిక సేవా కేంద్రాలు రైతులకు సలహాలు ఇస్తున్నాయి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *