
పశుపోషణ లాభదాయకమే కానీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయిస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు జనగాం జిల్లా పాడి రైతులు. సొంతంగా పనీర్ తయారుచేసి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు బచ్చన్నపేట మండలం పోచన్నపేట, ఇటుకాలపల్లి పాడి రైతులు.
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఎత్తయిన ప్రాంతంలో వుండటం, వర్షపాతం తక్కువగా వుండటంతో రైతులకు వర్షాధార పంటలే శరణ్యం. దేవాదుల పథకం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. దాంతో తక్కువ నీరు సరిపోయే పాడి పరిశ్రమ వైపు ఈ ప్రాంత రైతులు దృష్టి పెట్టారు. పాలను తక్కువ ధరకు ఎవరికో అమ్ముకునే కంటే పాల ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, వాటిని విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని ఆలోచించారు బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రాజిరెడ్డి. స్వగ్రామంలో కరవు పరిస్థితుల దృష్ట్యా పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ పనీర్ తయారీ కేంద్రంలో సూపర్వైజర్గా పనిచేశారాయన.
నేనే ఎందుకు పనీర్ తయారు చేయకూడదనుకున్నారు. స్వగ్రామం చేరుకుని 50 లీటర్ల పాలు సేకరించి పనీర్ తయారుచేయడం ప్రారంభించారు. క్రమంగా వెయ్యి లీటర్ల పాలతో పనీర్ తయారుచేసే స్థాయికి ఎదిగారు. రాజిరెడ్డి స్ఫూర్తితో అదే గ్రామానికి చెందిన అనిల్, తిరుపతి పనీర్ తయారీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇటుకాలపల్లి గ్రామంలో అన్నదమ్ములు బొడిగం నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఎనిమిదేళ్లుగా పనీర్ తయారుచేస్తూ హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. డెయిరీలు రైతులకు చెల్లిస్తున్న పాల ధరకన్నా రూ.2 చొప్పున అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు వారికే పాలు పోయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
పనీర్ తయారీ ఇలా..
రైతుల వద్ద నుంచి సేకరించిన పాలను 50 లీటర్ల చొప్పున గిన్నెల్లో పోసి కట్టెల పొయ్యి మీద 85 డిగ్రీల సెల్సియస్ వరకు కాగేలా మరుగబెడతారు. అనంతరం ప్లాస్టిక్ డబ్బాలో పోస్తారు. ఇందులో 100 ఎం.ఎల్ వెనిగర్‌ను కలిపి కలియబెడతారు. దీంతో జున్నుగడ్డలా పనీర్ మిశ్రమం తయారవుతుంది. పనీర్ గడ్డను బట్టలో మూటగట్టి బరువు పెడతారు. రెండు నుంచి మూడు గంటలు అలా ఉంచి ప్లాస్టిక్ సంచుల్లో వేసి అమ్మకానికి హైదరాబాద్‌కు తరలిస్తారు. సాధారణ వెన్న శాతం కలిగిన ఆరు లీటర్ల ఆవుపాలకు కిలో పనీర్ వస్తుంది. మార్కెట్లో హోల్‌సేల్‌గా కిలోకు రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. రిటైలర్లు 200 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఆకర్షణీయమైన కవర్లలో ప్యాక్ చేసి మూడు రెట్ల అధిక ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారని వారు తెలిపారు. దళారీల బెడదతో కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదంటున్నారు పనీర్ తయారీదారులు. పైగా ఇటీవల మహారాష్ట్రలోని బీదర్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సోయాపాలతో తయారుచేసిన పనీర్ మార్కెట్లోకి వస్తున్నది. దాన్నీ పాలతో తయారుచేసిన పన్నీరుగా చెబుతూ తక్కువ రేటుకు అమ్మడంతో ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామన్నారు పనీర్ తయారీదారులు.
నా బాటలో పలువురు
పనీర్ తయారు చేస్తానంటే మొదట అంతా ఆశ్చర్యపోయారు. పాలు కూడా పోయలేదు. నేనే డెయిరీ ప్రారంభించాను. క్రమంగా అందరూ పాలు పోయ సాగారు. పనీర్ తయారీతో పాడి రైతుతో పాటు పదిమందికీ ఉపాథి కలుగుతున్నది. ఎంతోమంది ఈ విధానాన్ని తెలుసుకుని పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటున్నారు.
దండ్యాల రాజిరెడ్డి
Credits : Andhrajyothi