పిట్ట కొంచెం..లాభాలు ఘనం!

  • కంజు పిట్టల పెంపకం.. కడక్‌నాథ్‌, దేశీ కోళ్లతో అదనపు ఆదాయం
  • మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు సరఫరా
కంజు పిట్టలతో పాటు కడక్‌నాథ్‌ కోళ్లు, నాటు కోళ్లు పెంచుతూ లాభాలు గడిస్తున్నారు ఆదిలాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి పండరి యాదవ్‌. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, మహారాష్ట్రలో కంజు మాంసానికి మంచి గిరాకీ వుండటంతో లాభాలకు ఢోకాలేదంటున్నారాయన.
మాంసాహారులకు కంజు పిట్ట మాంసం అంటే మహా ప్రీతి. ఆ మాంసానికి వున్న డిమాండ్‌ను గమనించారు రిటైర్డ్‌ ఉద్యోగి పండరియాదవ్‌. కంజుపిట్టల పెంపకాన్ని చేపట్టి ఫాంను దశలవారీగా విస్తరించారు పెంచిన కంజు పిట్టలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విక్రయుస్తున్నారు. ఆసక్తి వున్న రైతులకు కంజు పిల్లల్ని పొదిగించి అందజేస్తున్నారు. అందుకోసం గుడ్లు పొదిగే యంత్రాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కంజుపిట్టలతో పాటు కడక్‌నాథ్‌, నాటుకోళ్లను కూడా పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన నూకల పండరియాదవ్‌. ఆదిలాబాద్‌ జిల్లా బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో మొదట 1000 – 1500ల కంజుపిట్టలతో యూనిట్‌ను ప్రారంభించారాయన. ప్రారంభంలో నష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదు. 40 – 50 రోజుల్లో అమ్మకానికి వచ్చే కంజు పిట్టలకు మంచి దాణా వేసి పెంచడం మొదలుపెట్టారు. షెడ్డు నిర్మాణం, నీటి వసతి తదితర పనులకు ఖర్చు ఎక్కువగానే అయింది. అయితే ఏడాది తిరిగే సరికి లాభాలు రావడం మొదలయ్యాయన్నారు పండరి యాదవ్‌.
ఫోన్‌ల మీదే ఆర్డర్లు
ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు కంజులతో పాటు పెంపకం పిల్లలను సరఫరా చేస్తున్నారు పండరి యాదవ్‌. ఫోన్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కడప, కర్నూల్‌, ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాగపూర్‌, యవత్‌మాల్‌ పట్టణాల్లో కంజులను విక్రయిస్తున్నారు. సొంతంగా ఏర్పాటుచేసుకున్న హేచరీలో ఆర్డర్లకు అనుగుణంగా గుడ్లను పొదిగించి, 21 రోజుల తర్వాత పిల్లలను సరఫరా చేస్తున్నారు. తొలుత కంజుపిట్టల పెంపకాన్ని ప్రారంభించిన పండరియాదవ్‌ అంచలంచెలుగా కడక్‌నాథ్‌, దేశీకోళ్ల పెంపకం చేపట్టి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈయన ఫాంలో ప్రస్తుతం కడక్‌నాథ్‌ కోళ్లు గుడ్డు పెట్టే దశలో ఉన్నాయి. వీటి గుడ్లను కూడా పొదిగించి ఒక్కో పిల్లను రూ.120లకు, గుడ్డు ధర రూ.50 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 100 నుంచి 150 గుడ్లు చేతికి వస్తున్నాయి. కిలో కోడి మాంసం డిమాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1400ల వరకు అమ్ముతున్నారు. ఒక్కో కోడి 2 నుంచి 3 కిలోల వరకు బరువు వస్తుంది. ఈ లెక్కన ఒక్కో కోడి మీద రూ.3 వేల నుంచి రూ.3,400ల వరకు ఆదాయం వస్తున్నది. అలాగే దేశీకోళ్లను స్థానికంగా చికెన్‌ సెంటర్లలో, పెద్ద పెద్ద ఫంక్షన్‌లకు హోల్‌సేల్‌గా విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ రైతు.
కంజులను పెంచేదిలా..
కంజు పిట్టలను పెంచే ఆసక్తి ఉన్న రైతులు తూర్పు, పడమర దిశగా బాగా గాలి వీచేట్లు షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలి. షెడ్‌ చుట్టూ సన్నటి జాలీ అమర్చుకుని, లోపల గదులను ఏర్పాటు చేసుకోవడానికి రూ.5 నుంచి రూ.6 లక్షలు ఖర్చవుతుంది. దాణా, విద్యుత్‌, నిర్వహణ, ఇతర ఖర్చులు పక్షుల సంఖ్యను బట్టి పెరుగుతాయి. 7 నుంచి 10 రూపాయల ధరకు కంజు పిట్టల పిల్లలు దొరుకుతాయి. 40 రోజులు పెంచిన తర్వాత 250 నుంచి 400ల గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.50 నుంచి రూ.60 వరకు ఒక్కో కంజు పిట్ట ధర పలుకుతుంది. వెయ్యి పక్షులను పెంచితే ఖర్చులు పోను 40 రోజుల్లోనే రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి పక్షుల సంఖ్యను పెంచుకుంటే మరింత ఆదాయం వచ్చే అవకాశముంది.
ఆర్డర్లు పెరుగుతున్నాయి
రిటైర్‌ అయ్యాక ఖాళీగా వుండటం ఎందుకని ఈ ఫాం ప్రారంభించాను. కంజు పిట్టలకు మంచి గిరాకీ వుంది. ఆర్డర్లకు కొదవ లేదు. వాటికి తోడు కడక్‌నాథ్‌ కోళ్ల నుంచి కూడా మంచి ఆదాయం వస్తున్నది. శాస్త్రీయంగా కోళ్లను పెంచుకుంటే కంజు పిట్టల పెంపకం ఎంతో లాభదాయకం.
 ఎన్‌. పండరియాదవ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *