పెట్టుబడికి నాలుగింతల లాభం

బొప్పాయి పండు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు దాన్ని సాగు చేసే రైతులకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురంకు చెందిన రైతు ఎర్ర మధుసూదన్‌రెడ్డి ఎకరంన్నర విస్తీర్ణంలో బొప్పాయి సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.
బంధువుల స్ఫూర్తితో ఏడాదిన్నర క్రితం ఎకరంన్నర పొలంలో బొప్పాయి మొక్కలు నాటారు మధుసూధన్‌ రెడ్డి. హైదరాబాద్‌లో సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా ఆయనకు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. డిసెంబర్‌ లేదా జూన్‌ నెలలు బొప్పాయి మొక్కలు నాటడానికి ఎంతో అనుకూలం. దీంతో 2016 డిసెంబర్‌ నెలలో ఎకరాకు 910 మొక్కల చొప్పున 1,365 మొక్కలు నాటారు. అనంతపురం నుంచి తెచ్చిన నోయూ రెడ్‌ లేడీ రకం మొక్కలను ఎంచుకున్నారు. డ్రిప్‌ ద్వారా నీరందిస్తూ పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. నిపుణుల సలహా మేరకు ఎరువులను తక్కువ మోతాదులోనే వాడారు. ఏడు నెలల వ్యవధిలో పంట దిగుబడి ప్రారంభమైంది. పంట తెగుళ్ల బారిన పడకపోవడం, మంచి యాజమాన్య పద్ధతులు పాటించడంతో మెరుగైన దిగుబడి సాధించారు ఈ రైతు. ఇప్పటికే 80 టన్నుల దిగుబడి సాధించారు. మార్కెట్‌లో టన్ను రూ.5 వేలు ధర పలకడంతో రూ.4 లక్షలు ఆర్జించారు. బొప్పాయికి హైదరాబాద్‌, కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌తో పాటు ఢిల్లీ మార్కెట్‌లో కూడా మంచి గిరాకీ ఉంది. పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యం వుండి, మార్కెట్‌లో మోసాలను నివారించగలిగితే అధిక లాభాలు ఆర్జించవచ్చంటున్నారీయన. బొప్పాయి సాగుకు మొత్తం లక్ష వరకు ఖర్చయింది. పెట్టుబడికి నాలుగింతల లాభం పొందాను, ఇంకా దిగుబడి వస్తునే వుందన్నారు మధుసూదన్‌రెడ్డి.
మద్దతు ధర ఇవ్వాలి
పండ్లు, కూరగాయలకు కూడా ప్రభు త్వం కనీస మద్దతు ధర, పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. కోల్డ్‌ స్టోరేజీలు వుంటే బొప్పాయి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
 ఎర్ర మధుసూదన్‌రెడ్డి, రైతు
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *