వేసవిలో పెరటి మొక్కలు పదిలం

ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మనం తీసుకునే ఆహారం మొదలుకుని దైనందిన కార్యక్రమాలన్నింటిలో మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి. చల్లని పానీయాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఐస్‌క్రీమ్‌లు తీసుకుంటూ వేడి నుంచి ఉపశమనం పొందుతాం. ఇంట్లో నీడపట్టున వుండే మనమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతగానో ప్రేమించే మొక్కలు బాల్కనీల్లో, టెర్రస్‌ మీద, గార్డెన్‌లో వేడికి ఎంత అల్లాడిపోతాయో ఆలోచించండి. అందుకే మార్చి చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు ఇంటి బయట వున్న మొక్కలు మాత్రమే కాదు ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు నిపుణులు.
షేడ్‌నెట్స్‌ : మార్చి నుంచే వాతావరణం వేడిగా మారుతుంది. వేడి గాలులకు పెరటి తోటలోని కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు వాడిపోతాయి. వేడికి సాయంత్రం అయితే వేలాడిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి పెరటి మొక్కల మీద పందిరి ఏర్పాటుచేసి 50 శాతం నీడనిచ్చే షేడ్‌నెట్‌ను కప్పాలి. మొక్కలు నిరంతరం ఎండలో వుండే పరిస్థితి వుంటే మొక్కలు ఉన్న ప్రదేశం చుట్టూ కూడా షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల పెరటి తోట కళకళలాడటంతో పాటు దిగుబడి కూడా తగ్గకుండా వుంటుంది.
నీరు ప్రాణం : మిగిలిన సీజన్‌లలో కంటే వేసవిలో పెరటి మొక్కలకు నీరు తరచూ అందించాలి.. నీడలో వుండే మొక్కలకు కూడా రెండు రోజులకొకసారి తప్పనిసరిగా నీరందించాలి. ఆకుకూరలు, పూల మొక్కలపై ఉదయం, సాయంత్రం నీరు చల్లితే అవి తాజాగా వుంటాయి. టెర్రస్‌ మీద వున్న మొక్కలకు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం నీరుపోయాలి.
పోషకాలు పెంచండి : చలికాలంలో కాకుండా ఈ సీజన్‌లో అవసరమైన మేరకు నీరందిస్తే మొక్కలు వేగంగా పెరుగుతాయి. కుండీల్లో వుండే మట్టిలో పోషకాలు లేకుంటే మొక్కలు సరిగా ఎదగవు. అందుకే కుండీల్లో లేదా తోటలో వున్న మట్టికి పోషకాలు జతచేయాలి. ఆవుపేడ, వర్మికంపోస్ట్‌ వేయడం వల్ల మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. వేడి వాతావరణంలో కొన్ని చిత్రమైన చీడపీడలు వచ్చే అవకాశం వుంది కాబట్టి వారానికి ఒకసారి మొక్కలపై వేపనూనెను నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *