శాటిలైట్ సేద్యం

వర్షాభావాలు, వెంటాడుతున్న అప్పులు, పడిపోతున్న ధరలు, పాలకుల నిర్లిప్తతలు… అన్నీ కలిసి అన్నదాతను ఆత్మహత్య వైపు నడిపిస్తున్నాయి. సమస్యలతో కుదేలైపోతున్న రైతన్నకు ఆధునిక టెక్నాలజీతో అండ అందించేందుకు ఓ స్టార్టప్‌ కృషిచేస్తోంది… పేరు శాట్‌స్యూర్‌. ఆ ప్రయోగాలకు వేదిక శ్రీకాకుళం జిల్లా.
దేశ జనాభాలో కోటీ తొంభై లక్షల మందికి కడుపునిండా అన్నం అందడం లేదు. నూట ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే… 2050 కల్లా ఆ జనాభా నూట డెబ్బయి కోట్లకు చేరుకుంటుందే! అప్పుడెలా?
ఆ దుస్థితి దరిచేరకూడదంటే వ్యవసాయమే దిక్కు. సేద్యమే భవితకు ఆధారం. కానీ, ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల జీవితం దుర్భరంగా మారిందే!
ఒక పక్క పేదల ఆకలి కేకలు, మరో పక్క అన్నదాతల ఆత్మహత్యలు… ఈ పరిస్థితుల్లో పంటల దిగుబడి పెంచుకోవడమెలా? రేపటి తరానికి మెతుకు భరోసా ఇచ్చేదెలా?
‘పరిష్కారం మేం సూచిస్తాం’ అంటూ ఎన్నో స్టార్టప్‌లు ముందుకు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీని అంతరిక్షాన్ని చేరుకోవడానికే కాదు… భూమి తల్లిని పచ్చగా మార్చేందుకూ ఉపయోగించుకోవచ్చంటున్నాయి. ఆ లక్ష్యంతో పుట్టుకొచ్చిన సంస్థే శాట్‌స్యూర్‌.
తొలి అడుగు …
యూకేలో పుట్టి… ఇండియాతో పాటు అనేక దేశాల్లో రైతులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చిన స్టార్టప్‌ శాట్‌స్యూర్‌. 2015లో ఇస్రో నుంచి బయటికి వచ్చిన అంతరిక్ష శాస్త్రవేత్తల సృష్టి ఇది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించి… శాటిలైట్‌ ఫోటోల ద్వారా నేల స్వభావాన్ని తెలుసుకోవడమే శాట్‌స్యూర్‌ చేసే పని. భూమి తత్వాన్ని గ్రహించడం ద్వారా… ఆ నేలలో ఏ పంటలు పండుతాయి? ఎన్ని రోజుల్లో పంటను అందుకోవచ్చు? అక్కడి వాతావరణ పరిస్థితులేంటీ? ఆ తేమకు ఎలాంటి పంటలు వేయడం మంచిది?… వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. శాట్‌స్యూర్‌ ఇప్పటికే తన పనిని ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళంలో మొదలుపెట్టింది. అనుకున్న ఫలితాలను పొందింది. గతేడాది విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సమన్వయంతో నిర్వహించిన ‘గ్లోబల్‌ అగ్‌టెక్‌ పిచ్‌’ కార్యక్రమంలో ఈ స్టార్టప్‌ విజేతగా నిలిచింది. ఆ ఆలోచన నచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వినూత్నమైన బాధ్యత అప్పగించారు. అందులో భాగంగానే, పైలెట్‌ ప్రాజెక్టుగా సిక్కోలు ప్రాంతాన్ని పరిశోధనలకు ఎంచుకుంది శాట్‌స్యూర్‌.
తొలి విజయం…
ముందుగా, శ్రీకాకుళంలో నేల స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు శాట్‌స్యూర్‌ సభ్యులు. వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి… వాటిని భాగాలుగా చేశారు. ఎక్కువ ఎరువులు వేసి పండించాల్సిన భూమి, తక్కువ ఎరువులతో పండించాల్సిన భూమి, అధిక నీరు కావాల్సిన భూమి, తక్కువ నీటితోనే పండే భూమి… ఇలా రకరకాలుగా విభజించారు. ఆ ఫలితాలను కంప్యూటర్‌లో నమోదు చేశారు. పలుచోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేక యంత్రాల్ని పెట్టి… శాటిలైట్‌కు అనుసంధానం చేశారు. వాటి ద్వారా అందుకున్న సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు తీసిన ఫోటోలనూ వివరాలనూ శాస్త్రవేత్తల కంప్యూటర్‌కు పంపింది శాటిలైట్‌. సమాచారాన్ని విశదీకరించి… శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో… ఏ పంటలు పండే అవకాశం ఉందో గుర్తించి ఓ నివేదిక తయారు చేశారు. దాని ప్రకారం, జిల్లాలోని పాతపట్నం, పాలకొండ ప్రాంతాల్లో పంటల పరిస్థితిని విశ్లేషించారు. ఆ ప్రకారంగానే, మొక్కజొన్న పండేందుకు దాదాపు 1248 హెక్టార్ల భూమి అనుకూలంగా ఉండగా… ప్రస్తుతం 1361 హెక్టార్లలో ఆ పంటను పండిస్తున్నారు. అలాగే చెరుకు 1248 హెక్టార్లలో పండే అవకాశం ఉండగా… ప్రస్తుతం 1083 హెక్టార్లలో పండిస్తున్నారు. మొత్తానికి సిక్కోలులో ప్రారంభించిన పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం అయినట్టే.
భవిష్యత్తులో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరిన్ని పరిశోధనలను చేపట్టేందుకు శాట్‌స్యూర్‌ సిద్ధంగా ఉంది. ఆ కంపెనీ సీఈవో అమర్‌దీప్‌ మాటల్లో చెప్పాలంటే… కేవలం ఒక రూపాయి వ్యయంతో ఎకరా పొలానికి సంబంధించిన విశ్లేషణను రైతులకు అందించేందుకు శాట్‌స్యూర్‌ కృషి చేస్తోంది. నేల నైజాన్ని తెలపడమే కాదు… రైతుకు ఆర్ధికపరమైన భరోసాను అందించడం కూడా సంస్థ లక్ష్యాలలో ఒకటి. ప్రతి రైతు చేతా పంటను బీమా చేయించేందుకు, తేడావస్తే ఇన్సూరెన్స్‌ డబ్బు త్వరగా ఇప్పించేందుకు కూడా.. తమ వంతు సాంకేతిక సహకారం అందిస్తుంది శాట్‌స్యూర్‌.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *