శ్రీధృతి… దిగుబడిలో మేటి

పశ్చిమగోదావరి జిల్లాలో వరి రైతులు ఈ ఏడాది శ్రీధృతి (ఎంటీయు – 1121) వంగడాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో 70 శాతం ఈ వంగడాన్నే సాగుచేసి అధిక దిగుబడులు సాధించారని మార్టేరు వరి పరిశోధన సంస్ధ ఏడీఆర్‌ డాక్టర్‌ మునిరత్నం తెలిపారు. 2015లో విడుదల చేసి శ్రీధృతి ఎంటీయూ – 1121 రకం దాళ్వాకు ఎంతో అనుకూలం అన్నారు వరి పరిశోధన సంస్థ రైస్‌ విభాగం అధిపతి డాక్టర్‌ పీవీ సత్యనారాయణ. 125 రోజుల కాల పరిమితి కలిగిన ఈ రకం పంట నేలపై పడకపోవటం, గింజ రాలకపోవటం వంటి లక్షణాలతోపాటు దోమ, అగ్గి తెగులను సమర్ధవంతంగా తట్టుకుంటుంది.
మధ్యస్థ గింజ నాణ్యత కలిగి వుండటంతో పచ్చిబియ్యానికి మంచి రకమని చెప్పారు. ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. ఎంటీయూ – 1010 కంటే ఐదు నుంచి పది బస్తాలు అఽధిక దిగుబడి వస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. వెన్ను మీద గింజ ఎండి పోవటంతో కోత కోసిన తరువాత ఒకరోజు ఎండబెట్టి మిల్లుకు తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. వెన్ను మీద 14 శాతం తేమ తగ్గటంతో మిషన్‌ కోతకు అనుకూలంగా ఉండి రైతులకు ఎంతో ఉపయోగంగా వుంటుందన్నారు శాస్త్రవేత్తలు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *