‘ సైౖలేజ్‌’తో పశుగ్రాసం పుష్కలం

  • సబ్సిడీపై రైతులకు పంపిణీ కరువు ప్రాంతాలకు వరం
కరువు ప్రాంతాలలో పశువులకు గ్రాసం కొరత తలెత్తకుండా ఉండేందుకు, పోషక విలువలతో మేతను సిద్ధం చేసేందుకు వీలుగా సైలేజ్‌ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పశుసంవర్ధక శాఖ ద్వారా అంద జేస్తోంది. దీనిని రైతులకు యూనిట్‌గా కానీ, వ్యక్తిగతంగా కానీ అందజేస్తారు. మూడు కేటగిరీలలో లభించే ఈ యంత్రం మెగా సైలేజ్‌ పరికరం విలువ ఏకంగా రూ.4 కోట్లు వరకు ఉండగా, అందులో రూ.3 కోట్లు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. మీడియం సైలేజ్‌ యంత్రం విలువ రూ.కోటి ఉండగా అందులో రూ.75 లక్షలు సబ్సిడీ ఉంటుంది. ఇక మినీసైలేజ్‌ యంత్రం విలువ రూ.12 లక్షలు ఉండగా అందులో రూ.9 లక్షలు రాయితీగా వర్తిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు వాటాగా చెల్లించాలి. మొక్కజొన్న, పాతర గడ్డిని ఈ యంత్రం తగు మోతాదులో కట్‌ చేసి ప్యాకింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో మెగా యంత్రానికి ఏకంగా 400 కేజీల ప్యాకింగ్‌ సామర్థ్యం వుంది. ఇది రోజుకు 10 ఎకరాలలో గడ్డిని కత్తిరిస్తుంది. మీడియం సైజు యంత్రం 150 కేజీల ప్యాకింగ్‌ సామర్థ్యంతో రోజుకు ఐదు ఎకరాలలో గడ్డిని కోస్తుంది. మినీ యంత్రం 80 కేజీల ప్యాకింగ్‌ సామర్థ్యంతో రోజుకు రెండు ఎకరాలలో గడ్డిని కోస్తుంది.
ఈ యంత్రం ప్యాకింగ్‌ చేసిన గడ్డి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా ఏడాదిన్నర పాటు నిల్వ వుంచే వీలుంది. చిన్న కమతాలు అధికంగా వున్న మన రాష్ట్రంలో రైతులు మీడియం, మినీ యంత్రాలపై ఆసక్తి చూపుతున్నారు.
పాడి రైతులకు మేలు
సైలేజ్‌ యంత్రాల వల్ల పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వరి, జొన్న గడ్డిని గాలి తగిలేలా ప్యాకింగ్‌ చేయడం వల్ల అందులో మాంసపు తరహా పోషకాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సైలేజ్‌ పాడి పశువులకు దాణాగా అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల పూటకు కనీసం ఒక లీటరు వరకు పాల దిగుబడి పెరుగుతుందని చెబుతున్నారు. పైగా పెద్ద రైతులు ఈ సైలేజ్‌ గడ్డి మిశ్రమాన్ని రాయితీ ధరలకు అమ్ముకోనే అవకాశం కూడా వుంటుందని భావిస్తున్నారు.
 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నెల్లూరు వ్యవసాయం
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న అధునాతన సైలేజ్‌ యంత్రం పాడి రైతులకు వరప్రదాయినిగా మారనుంది, చిన్నకమతాలు అధికంగా వున్న తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు చేసే సైలేజ్‌ యంత్రం విశేషాలు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *