యాసంగిలో వరి సిరి

  • వరికి అగ్గితెగులు ముప్పు
తెలంగాణలో ఏటా యాసంగిలో 6.14 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. ఇప్పటి కే కొందరు రైతులు నాట్లు పూర్తి చేశారు. మరి కొన్నిచోట్ల నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. చలి తీవ్రంగా వున్న ప్రస్తుత తరుణంలో నారుమళ్లకు అగ్గితెగులు సోకే ప్రమాదం వుందంటున్నారు నిపుణులు. వరి సాగుకు ఏ వండగాలు ఉత్తమం? నారును ఎలా పెంచాలి? వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలనే అంశాలపై సమగ్ర కథనం.
యాసంగిలో రైతాంగం ఎక్కువగా సాగుచేసే వరి రకాలలో తెలంగాణ సోన (ఆర్‌.ఎన్‌.ఆర్‌. 15048), కునారం సన్నాలు (కె.ఎన్‌.ఎమ్‌ 118), బతుకమ్మ (జె.జి.యల్‌ 18047), శీతల్‌ (డబ్ల్యు.జి.ఎల్‌. 283), కాటన్‌ దొర సన్నాలు (ఎం.టి.యు 1010), ఐ.ఆర్‌. 64, తెల్లహంస, జగిత్యాల సాంబ (జె.జి.ఎల్‌. 3844) వంటి రకాలు అతి ముఖ్యమైనవి.
రాష్ట్రవ్యాప్తంగా వరినార్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌. జగదీశ్వర్‌ చేస్తున్న సూచనలివి.
డిసెంబర్‌ రెండవ పక్షంలో చలి తీవ్రత పెరిగినందువల్ల, రాత్రివేళలో మంచుపడి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది.
దీనికితోడు ఇంకా నారుమడి దశలో ఉన్న మొక్కలు సరిగ్గా ఎదగక నాట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నారుమడిలో, ప్రధాన పొలంలో ఈ చర్యలు తప్పకుండా పాటించాలి. చలివలన నారు ఎదుగుదల లోపించడం, నార్లు ఎర్రబడడం సర్వసాధారణం, కాబట్టి నార్లను కాపాడటానికి సన్నటి పాలిథిన్‌ పట్టాను కర్రలతో లేదా ఊచలతో అమర్చాలి. రాత్రివేళలో కప్పి ఉంచి మరునాడు ఉదయాన్నే తీసివేసినట్లయితే వేడి వలన నారు త్వరగా పెరిగి, 3-4 వారాలలో ఆకులు తొడుగుతుంది.
రాత్రివేళలో నారుమడిలో సమృద్ధిగా నీరు ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసివేసి ఉదయం 10-11 గంటల మధ్య నీటిని పెట్టినట్లయితే నారు ఎదుగుదల బాగుంటుంది. నారుమడిలో జింక్‌ లోప లక్షణాలు కనిపించిన వెంటనే జింక్‌ సల్ఫేట్‌ 2.0 గ్రాములు, లీటరు నీటికి కలిపి అవసరం మేరకు 1-2 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియాతో (2.5 కిలోలు) పాటు కార్బండాజిమ్‌ 25 శాతం + మాంకోజెబ్‌ 50 శాతం కలిగిన మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని 6.25 గ్రాములు పట్టించి నారుమడిలో వేయాలి.
అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రబీ పంట కాలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15 రోజులకు 2 గుంటల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి. చలికి నారు ఎదగక ఆలస్యమైతే నాటువేసే వారం రోజుల ముందు మరొకసారి నారుమడిలో కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి.
కాండం తొలిచే పురుగుతో జాగ్రత్త
దాదాపు అన్ని రకాలలోనూ రబీలో ఆశించే కాండం తొలిచే పురుగు వల్ల ప్రతి రైతు ఎకరాకు 3-5 బస్తాల దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌ పంట కాలంలో కూడా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కాండం తొలిచే పురుగు ఆశించి తెల్ల కంకుల వల్ల రైతాంగం చాలా నష్టపోయారు. కాబట్టి రబీలో నారుమడి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలి. ముదురు ఎండుగడ్డి లేదా పసుపు రంగులో ఉండే రెక్కల పురుగులు లేత నారుకొనల మీద గోధుమరంగు ముద్దల వలె గుడ్లు పెడతాయి. ప్రధాన పొలంలో పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోవడం, అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు రావటం గమనిస్తూ ఉంటాం.
ఎకరాకు సరిపడే నారుమడిలో ఒక లింగాకర్షక బుట్ట (2-3 గుంటలకు ఒక బుట్ట) అమర్చి కాండం తొలిచే పురుగు ఉధృతి గమనించాలి. అలాగే ప్రధాన పొలంలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు అమర్చి వారానికి బుట్టకు 25 మగ రెక్కల పురుగులు పడిన వెంటనే పిలక దశలో సస్యరక్షణ చేపట్టాలి. ఈ దశలో ఎసిఫేట్‌ 75 ఎస్‌పి 1.5 గ్రాములు (300 గ్రాములు/ఎకరాకు) లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌పి 2 గ్రా. (400 గ్రా./ఎకరాకు) లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 శాతం గుళికలు 4 కిలోలు/ఎకరాకు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు వాడుకోవాలి.
అంకురం నుండి చిరుపొట్ట దశలో తప్పనిసరిగా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌.పి 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మిల్లీలీటర్లు /లీటరు నీటికి చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం తయారుచేసుకుని పిచికారీ చేయాలి. అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లేదా ఇసోప్రోథయోలెస్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధితో వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని రెండుసార్లు పిచికారీ చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, హైదరాబాద్‌
Credits : Andhrajyothi

ఈ గ్రామం.. రసాయన రహితం

  • సేంద్రియ సాగుతో సిరులు పండిస్తున్న ఏనెబావి రైతులు
పల్లెలకు పాఠం- రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి
నిదర్శనం జనగామ జిల్లా ఏనెబావి గ్రామం. క్రిమి
సంహారకాలు లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఏనెబావినే ఉదాహరణగా చూపుతారు. రసాయనరహిత గ్రామంగా పేరొందిన ఆ గ్రామ రైతుల ప్రస్థానం ఇది.
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెబావి గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా చీడపీడల బాధ లేకుండా అధిక దిగుబడులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ‘క్రాప్స్‌’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్వతహాగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది రైతులు తమకున్న 145 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరువు నుంచి తెచ్చిన మట్టి, ఆవుపేడ, గొర్రెలు, మేకల ఎరువు, గోమూత్రం, వేప కషాయంతో ఈ రైతులు స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వానపాములతో వర్మి కంపోస్టు తయారుచేస్తూ పంటలకు బలమైన పోషకాలను అందిస్తున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు పొందుతున్నారు. క్రాప్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన శిక్షణతో ఏనెబావి గ్రామంలో ఇంటింటా వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా పిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ సేద్యమే కారణం అంటున్నారు ఈ గ్రామ రైతులు. ఎకరం కూరగాయల తోట సాగుకు 5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో మంచి ధర పలుకుతున్నది. దిగుబడులు అధికంగా రావడంతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల సేంద్రియ వరి ధాన్యం, కూరగాయలను నగరాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సేంద్రియ ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
అవగాహన పెంచాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అధిక పెట్టుబడులతో రైతులను నష్టాల బాట పట్టిస్తున్న రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా మానుకునే విధంగా ప్రోత్సహించాలి. ఐదెకరాల్లో పదేళ్లుగా కందులు, కూరగాయల పంటలు వేసి లాభం పొందుతున్నాను.
– పొన్నాల తిరుమలేషం, రైతు
Credits : Andhrajyothi

కడక్‌నాథ్‌ కోడికి భలే గిరాకీ!

కడక్‌నాథ్‌ కోడికి మరో పేరు ‘కాలిమసి’. అంటే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. మాంసం రుచిగా, నలుపు రంగులో ఉండి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ‘మెలనిన్‌’ అనే పిగ్మెంట్‌ వల్ల దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. ఈ కోడి మూడు రంగుల్లో లభిస్తుంది. అవి జెట్‌ బ్లాక్‌, పెన్సిల్‌, గోల్డెన్‌. కడక్‌నాథ్‌ కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి.
బాయిలర్‌ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్టరాల్‌ తక్కువగా ఉంటుంది. దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌ ఆసిడ్స్‌ ఉంటాయి. సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌ వారు దీని ఔషధ గుణాలపై పరిశోధనలు చేసి కడక్‌నాథ్‌ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుంది.
ఔషధ గుణాల కడక్‌నాథ్‌
కడక్‌నాథ్‌ కోడి మాంసం హోమియోపతిలో, నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కడక్‌నాథ్‌ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. కడక్‌నాథ్‌ కోడి మాంసం తింటే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇందులో నిజం కూడా ఉంది. సాధారణంగా వాడే వయాగ్రాలోని సిల్డెనాఫిల్‌ సిట్రిక్‌ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్‌ సామర్థ్యం పెంచుతుంది. కడక్‌నాథ్‌ మాంసంలోని ‘మెలనిన్‌’ పిగ్మెంట్‌ కూడా సరిగ్గా అదే పనిని చేస్తుంది.
కడక్‌నాథ్‌ కోడి మాంసం హార్మోన్లు, పిగ్మెంట్స్‌, అమైనో ఆసిడ్స్‌ మానవ శరీరంలోని రక్త కణాలను, హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతాయి. నలుపు రంగు మాంసం క్షయ వ్యాధి, గుండె సంబంధ వ్యాధులు, నరాల సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. స్త్రీలలో గర్భకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కడక్‌నాథ్‌ కోడి మాంసం బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. కడక్‌నాథ్‌ కోడి గుడ్డులో తక్కువ కొలెస్టరాల్‌, ఎక్కువ మాంసకృత్తులు ఉండడం వల్ల వీటిని వృద్ధులు, అధిక రక్తపోటుతో బాధపడే వారు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
రైతులకు మరింత అదాయం
నాటుకోడి మాదిరిగానే రుచిగా వుండే కడక్‌నాథ్‌ కోళ్లపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుంది. వీటి పిల్లలను ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రైవేట్‌ సంస్థలు కొన్ని కడక్‌నాథ్‌ కోడి పిల్లలను విక్రయిస్తున్నాయి. ఒక్కో కోడి పిల్ల 65 నుంచి 70 రూపాయల ధర పలుకుత్నుది. ఆరు మాసాల్లో ఇది పెరుగుతుంది. 99599 52345, శంకర్‌పల్లి, హైదరాబాద్‌, 9666880059, బత్తెనపల్లి, సిరిసిల్లతో పాలు పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కోడి పిల్లలను విక్రయిస్తున్నారు.
– డాక్టర్‌ గుర్రం శ్రీనివాస్‌, పశువైద్య కళాశాల, కోరుట్ల
Credits : Andhrajyothi

వరి నారు ఎదగడం లేదు.. ఎందుకని?

రబీలో నారు ఎదగడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాగే ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులేమిటి..?
– చెప్యాల పోచయ్య, రైతు, ఔరంగాబాద్‌
చలి ఎక్కువగా ఉండడం వల్ల వరినారు ముడుచుకుపోయి రంగు మారి సకాలంలో ఎదగదు. దీని నివారణకు రెండు గ్రాములు కర్పెండ్‌జిమ్‌ లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు రాత్రిపూట నారుమడిలో నీరు లేకుండా చూసుకోవాలి. నారు మీద ఎండుగడ్డి కప్పాలి. వీటన్నింటితో పాటు బాగా ఎండబెట్టిన పశువుల పేడను నారుమళ్లలో చల్లాలి. బాగా చినికిన ఎఫ్‌వైఎంను వేసుకోవాలి. నారుమడిలో 2 కిలోల యూరియా, 2 కిలోల డీఏపీ, 1 కిలో పొటాష్‌ వేయాలి. జింక్‌లోపం కనిపిస్తే 100-150 గ్రాముల సల్ఫైట్‌ను స్ర్పే చేసుకోవాలి. మడి నుంచి నారు తీసే పది రోజుల ముందు మూడు కిలోల కార్బొపురన్‌ గుళికలను వాడడం వల్ల మొగి పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు. 25 రోజులు దాటిన నారుపై 1 లీటర్‌ వేప నూనె లేదా క్లోరోఫైరిఫాస్‌ను స్ర్పే చేసుకోవాలి. నాట్లు వేసుకునే ముందు వరి కొనలు తుంచి నాట్లు వేయాలి. ఈ పద్ధతుల ద్వారా వరి నారుమళ్లను రక్షించుకోవచ్చు.
– పరుశురాం నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌
Credits : Andhrajyothi