కల్పతరువు.. కొలంబో కంది

  • ఒకసారి పెట్టుబడి.. పదిసార్లు దిగుబడి
 
కొలంబో కంది పంట ఇప్పుడు రైతులందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఒకసారి నాటితే పదిసార్లు దిగుబడినిచ్చే ఈ పంట సాధారణ కంది కంటే రెట్టింపు దిగుబడినిస్తుంది. ఖమ్మం జిల్లా రైతు పండిస్తున్న ఆ వెరైటీ పంట విశేషాలివి.
శ్రీలంకలో ఎక్కువగా పండించే ఈ కంది వంగడాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన రైతు మారం కరుణాకర్‌రెడ్డి సాగు చేస్తున్నారు. 17 ఎకరాల్లో 107 రకాల పంటలను పండిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన, కొలంబో కంది సాగుతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పంట చేతికి అందగా రెండో పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు ఈ వెరైటీ పంటను సాగు చేస్తున్నారు కరుణాకర్‌రెడ్డి. మన ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కంది సాగు చేస్తుంటారు. దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతులకు కొలంబో కంది కల్పతరువుగా మారనుంది.
ఐదేళ్లు దిగుబడి
కొలంబో కంది గింజలను మొక్క కట్టి చేలో ఒకసారి నాటితే చాలు ఐదు సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. ఎకరాకు కేజీ గింజలతో మెక్కలు నాటేతే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి దిగుబడి వస్తుంది. మళ్లీ మళ్లీ మొక్క నాటే అవసరం ఉండదు. మొదటిసారి వచ్చిన దిగుబడే చివరిసారి కూడా వస్తుందని రైతు కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. డిసెంబరు-జనవరి నెలల మధ్య ఒకసారి, జూన్‌-జూలై మధ్య రెండోసారి పంట చేతికొస్తుంది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు.. ఇలా రెండుసార్లు దిగుబడి వస్తుంది. ఈ క్రమంలో క్వింటాకు రూ.3 వేల చొప్పున అయినా సంవత్సరానికి రూ.లక్షా 20 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు ఆ రైతు. ఈ పంట పూత తియ్యగా వుంటుంది కాబట్టి పురుగు ఆశించే ప్రమాదం వుంది. అందుకే రైతులు పూత దశ నుంచి చివరి దశ వరకు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాంటున్నారు వ్యవసాయాధికారులు.
 
పెటుబడి తక్కువ ఆదాయం ఎక్కువ
ఒక పంట వేయాలంటే ప్రతీసారి దుక్కిదున్నాల్సిందే. కానీ కొలంబో కందికి ఆ అవసరం లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఐదు సంవత్సరాలు లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం మనం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్న కందిపప్పులో ఈ కొలొంబో రకమే అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని నేలలు కూడా ఈ పంటకు అనువుగా ఉంటాయి.
Credits : Andhrajyothi

క్రాప్‌ కాలనీలు భళా

  • రైతులకు రెట్టింపు ఆదాయం
  • చేవెళ్లలో ఏర్పాటుకు యోచన
తెలంగాణలో కూరగాయల కొరతను అధిగమించి, చిన్నరైతులకు నిత్యం ఆదాయం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్రాప్‌ కాలనీలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో రెండేళ్లుగా అమలవుతున్న ఈ ప్రాజెక్టును చేవెళ్లలో కూడా అమలు చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న పంటల కాలనీలు (పంటల సమూహాలు) పథకం చిన్న రైతులకు వరంగా మారింది. హైదరాబాద్‌ నగరానికి చేరువన, భూగర్భజలాలు నామమాత్రంగా వుండటంతో అంతంత మాత్రం దిగుబడులు సాధిస్తున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని నాలుగు మండలాల్లో ఈ పథకం రైతులకు సిరులు పండిస్తున్నది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో 2016 అక్టోబర్‌నుంచి ఈ పథకం అమలవుతున్నది. ఈ స్కీం అమలుకు ముందు ఇక్కడ కూరగాయల సాగు సుమారు 2500 ఎకరాల్లో జరిగేది. ఇప్పుడది అయిదు వేల ఎకరాలకు పెరిగింది. ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా రాయితీలు కల్పిస్తూ, అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద ఇప్పటికి 15 కోట్లు ఖర్చు చేశారు. రైతులకు రాయితీలపై విత్తనాలు ఇవ్వడంతో పాటు పాలీహౌజ్‌లు, డ్రిప్‌ పరికరాలు, స్ర్పింకర్లు, షేడ్‌ నెట్‌, మల్చింగ్‌ షీట్లు అందిస్తున్నారు. ఫాంపాండ్స్‌ నిర్మాణానికి రాయితీ ఇస్తున్నారు.
\
పంటను చీడపీడల నుండి కాపాడుకునేందుకు పురుగు మందులు, ఎరువులు వేసుకోవడానికి ఎకరాకు రెండు వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీలు కూడా అందిస్తున్నారు. సాధారణ దిగుబడి కంటే రెట్టింపు దిగుబడి సాధించేందుకు అవసరమైన మెళకువలు నేర్పుతున్నారు. జీడిమెట్ల నర్సరీ నుండి నాణ్యమైన కూరగాయల నారు కూడా అందజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకైతే ఉచితంగా, ఇతర రైతులకు మొక్కకు 25 పైసల చొప్పున కల్తీలేని నాణ్యమైన టమోటా, వంకాయ, మిర్చి నారును ఇక్కడ అందుబాటులో ఉంచారు. రైతులు దుక్కులు చేసుకుని దరఖాస్తు చేసుకుంటే పొలం దగ్గరకే నారును చేర్చుతున్నారు. మొదటి దశలో రైతుకు ఎక రం పొలానికి సరిపడే నారునే అందించేవారు. రెండవ దశలో రెండున్నర ఎకరాల వరకు సరిపడే నారు అందిస్తున్నారు. క్రాప్‌ కాలనీల కింద పండ్ల తోటలకు తగు ప్రోత్సాహం అందించడం విశేషం. తీగజాతి కూరగాయల పందిళ్లకుగాను ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నది. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసేందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. రెండున్నర ఎకరాల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. తీగజాతి కూరగాయలను పందిళ్లపై సాగు చేసుకుంటూ అంతరపంటల నుంచి కూడా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. టమాట రవాణా చేసే బాక్సులను కూడా ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్నది. వేసవిలో షేడ్‌ నెట్‌ కింద ఆకు కూరలు సాగు చేసుకునేందుకు కూడా ప్రభు త్వం ప్రోత్సహిస్తుందన్నారు ఇబ్రహీంపట్నం ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి కె.యాదగిరి.
 
లాభదాయకంగా ఉంది..
పందిరి కూరగాయల సాగు లాభదాయకంగా ఉంది. ఎకరంలో కాకర సాగు చేశా. ఖర్చులు పోను రెండు లక్షల ఆదా యం వచ్చింది. మరో ఎకరంలో సొర సాగు చేశా. అంతర పంటగా టమోటా వేశా. కింద మల్చింగ్‌ షీట్‌ వేసి డ్రిప్‌ పద్ధతిలో సాగు చేస్తున్నా. పంటను మార్కెట్‌లో నేనే విక్రయిస్తున్నాను.
 పిసాటి సంధ్యారాణి, రైతు
సబ్సిడీలతో సాగుకు ప్రోత్సాహం
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఇప్పటివరకు ఈ పథకం కింద పాలీహౌజ్‌లకు 7 కోట్లు, డ్రిప్‌కు 4 కోట్లు, పందిళ్లకు 50 లక్షలు అందజేశాం, ఇక్కడ పండించిన కూరగాయలు హైదరాబాద్‌లోని వివిధ రైతుబజార్లు, కాలనీల్లో మధ్య దళారీల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా విక్రయించేట్లు చర్యలు తీసుకున్నాం. ఈ ప్రాజెక్టును చేవెళ్ల డివిజన్‌లో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
 బాబు, రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి
Credits : Andhrajyothi

ఒక్కో మొక్క అమృతపు చుక్క

పెరట్లో, వరండాలో చివరకు ఇంటి లోపల గదుల్లో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే అరుదైన ఔషధ మొక్కలను మనమే పెంచుకునే వీలుందంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి ఔషధ మొక్కలేమిటో చూద్దాం రండి.
కొన్ని మొక్కలు పచ్చదనంతో నయనానందం కలిగించడంతో పాటు అరుదైన ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. అలాంటి మొక్కల్లో మల్టీవిటమిన్‌ ప్లాంట్‌, పిప్పళ్లు, తిప్పతీగ, వీట్‌గ్రాస్‌ వంటి వాటిని ఇంట్లోనే పెంచుకోవడం వల్ల ఎంతో లాభం చేకూరుతుంది. ఈ ఔషధ మొక్కలకు కొద్దిపాటి నీరు అందిస్తూ అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి కొద్దిపాటి పురుగుమందులను పిచికారీ చేస్తే సరిపోతుంది. అటవీప్రాంతం నుంచి తీసుకువచ్చిన ఈ ఔషధ మొక్కలను కడియం నర్సరీల్లో పెంచి తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు.
మల్టీ విటమిన్‌ : ఈ మొక్క 1, 2 ఆకులను ఉదయం వేళలో తీసుకోవడం ద్వారా రక్తశుద్ధి కలుగుతుంది. ఇందులో బి- కాంప్లెక్సు ఉండటం వలన నీరసం తగ్గి, చలాకీతనం వస్తుంది. ఆరడుగుల ఎత్తు వరకు ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది.
పిప్పళ్ళు : ఈ మొక్కకు కాయలు కాస్తాయి. వీటిని కోసి ఎండబెట్టుకుని పొడిచేసుకున్న తరువాత పాలలో కలిపి రోజుకొక స్పూన్‌ చొప్పున తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. ఈ మొక్క రెండడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.
మిరకిల్‌ ఫ్రూట్‌ : కేరళకు చెందిన ఈ మొక్క ఫలాలను ఇస్తుంది. ఈ ఫలం ఉదయం తీసుకుంటే సాయంత్రం వరకు పులుపు, కారం, వగరు ఉన్న వంటకాలు ఏమి తిన్నా తీపిగానే ఉంటాయి. అతి తక్కువ ఎత్తు పెరిగే ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువ ఫలాలను ఇస్తుంది.
తిప్పతీగ : ఆకు చూర్ణం ఇన్సులిన్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. డెంగ్యూ జ్వరానికి ఇది దివ్యౌషధం. ఈ మొక్కను ఎండ ఉన్న ప్రాంతంలో వేసుకుని తగిన పరిమాణంలో నీరు అందిస్తూ పెంచుకుంటే సరిపోతుంది.
వట్టివేరు : గ్రాస్‌ రకంగా కనిపించే ఈ మొక్క కాడలను ఎండబెట్టుకుని వాటిని కొబ్బరినూనెలో కలిపి తలకు రాసుకుంటే చల్లదనం కలుగుతుంది. మెదుడు చురుకుగా పనిచేస్తుంది. ఈ మొక్క ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది
Credits : Andhrajyothi

ఈత వనం.. లాభాలు ఘనం

  • మెదక్‌ జిల్లా రైతు వెరైటీ సేద్యం
మామిడి, జామ, అరటి, సపోటా, బొప్పాయి తోటలు పెంచ డం చూశాం కానీ ఈతవనాన్ని పెంచడం అరుదు. తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌ ఈతవనం పెంచి అందరికీ స్వచ్ఛమైన కల్లు అందించి, లాభాలు గడిస్తున్నారు.
మిగిలిన తోటల్లాగా నాటిన వెంటనే ఈతవనంలో లాభాలు రావు. ఈత చెట్లు నాటిన నాటి నుంచి వాటిని జాగ్రత్తగా పెంచాలి. కల్లు గీసే స్థాయికి చెట్లు ఎదిగేందుకు పదేళ్లు పడుతుంది. తనకున్న మూడెకరాల్లో 11 ఏళ్ల క్రితం ఈత మొక్కలు నాటారు మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌. ప్రభుత్వం ఇప్పుడు ఈత మొక్కలను ఉచితంగా అందిస్తున్నది. దశాబ్దం క్రితం మొక్కలను కొనాల్సిందే. 2.80 లక్షలు ఖర్చు చేసి మూడు ఎకరాల్లో 1200 ఈత మొక్కలు నాటారు. ఈత చెట్లకు రోగాలు రాకుండా, పురుగుల నుంచి రక్షించడానికి, మందులు వాడాల్సి ఉంటుంది. ఇతర చెట్లలాగే ఈత చెట్లకు నీరు పెడుతూ, యేటా ఎరువులు వేయాలి. ఈత చెట్లకు రక్షణ చర్యలు తీసుకుంటే మొక్కలు బాగా పెరిగి కల్లు సకాలంలో అందుతుంది. చెట్టు బాగా ఎదిగితే పదో ఏట నుంచి కల్లు గీసే అవకాశం వుంటుంది. కల్లు గీయడంలో జాగ్రత్తలు పాటిస్తే ఈతచెట్టు 20 నుంచి 25 ఏళ్ల పాటు కల్లును అందిస్తుంది. ఈతచెట్ల పెంపకం చేపట్టిన రైతులు ఎక్సైజ్‌శాఖకు కల్లు వచ్చే ఒక్కొక్క చెట్టుకు రూ.15 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చెట్ల నుంచి కల్లు సేకరించేందుకు చెట్టు గీయడం నేర్చుకొని టీఎఫ్‌టీ లైసెన్స్‌ పొందాలన్నారు ఆ రైతు.
నిత్యం ఆదాయం
పదేళ్ల పాటు ఖర్చు చేసినా ఆ తరువాత నుంచి ఈత చెట్లు నిత్యం ఆదాయాన్నిస్తాయి. మా తోటలో స్వచ్ఛమైన కల్లు లభిస్తుండటంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర సుదూర ప్రాంతాల నుంచి కల్లు సేవించడానికి ఇక్కడికి వస్తున్నారు. కల్లు బింకి సైజును బట్టి రూ. 100 నుంచి రూ. 200ల వరకు వస్తుంది.
Credits : Andhrajyothi

టమాటాకు స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌

రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉన్నందువల్ల ఈ సమయంలో వివిధ పంటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ గురించి ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతాంగానికి ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
వరి :
వరి పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోంది. దీని నివారణకు రెండు గ్రాముల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కంకినల్లి ఉనికి గమనించడమైంది. నివారణకు స్పైరోమేసిఫిన్‌ ఒక మి.లీ., ప్రోపికోనజోల్‌ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు :
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల తామర పురుగుల ఉధృతి పెరిగి టమాట స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌ తెగులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తామర పురుగుల నివారణకు రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వంగ పంటకు రసం పీల్చే పురుగు ఆశిస్తోంది. నివారణకు రెండు మి.లీ. డైమిథోయేట్‌ లేదా రెండు మి.లీ., మిథైల్‌ డేమటాన్‌ లేదా రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరప పంటను ఎర్రనల్లి ఆశిస్తోంది. నివారణకు 1.25 మి.లీ., స్పైరోమేసిఫెన్‌ లేదా రెండు మి.లీ., ఫెన్‌ పైరాక్సిమెట్‌ లేదా మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా ఐదు మి.లీ., డైకోఫాల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో తామర పురుగు కూడా గమనించడమైంది. దీని నివారణకు రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటల్లో తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ ఉధృతి పెరిగి వైరస్‌ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నివారణకు 0.3 మి.లీ., ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 0.3 గ్రా. థయోమిథాక్సాం మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi

నికరాదాయం ఇచ్చే పట్టు

వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ శ్రమతో కూడుకున్నా రైతులకు నికరాదాయం అందిస్తుంది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి, రెండెకరాల మల్బరీ తోటను సాగు చేసి, పట్టుపురుగులు పెంచితే నెలనెలా లాభాలు వస్తాయంటున్నారు నిపుణులు. మల్బరీ తోటను పెంచి, ఆ ఆకును పట్టు పురుగులకు ఆహారంగా వేసి, వాటిని పెంచితే, పట్టు గూళ్లు తయారవుతాయి. వాటిని అమ్ముకుని, ఆదాయం పొందవచ్చని పట్టు పరిశ్రమ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత పట్టు పరిశ్రమ ద్వారా మంచి ఉపాధి పొందవచ్చు. మల్బరీ తోటలు ఇసుక, మాగాణి, బీడు భూములు తప్ప మిగిలిన అన్ని నేలల్లో పెరుగుతాయి.
ఒక ఎకరా మల్బరీ సాగుతో ఏడాది పొడవునా ఐదుగురికి ఉపాఽధి లభిస్తుంది. 3-4 నెలల వయసు గల 6వ రకం నారు మొక్కలు 5:3:2 అడుగులు లేదా 3:3 అడుగుల పద్ధతిలో నాటాలి. నీటి వసతి తక్కువగా ఉన్న నేలల్లో కూడా మల్బరీ తోటను బిందు సేద్య పద్ధతులతో సాగు చేయవచ్చు. పట్టుపురుగులు పెంచటానికి 50:20:15 అడుగుల కొలతలతో రేకుల షెడ్డు వేసుకున్నా సరిపోతుంది. ఎకరా మల్బరీ తోటలో ఏడాదికి 4-5 పంటలు వేసుకుని రూ.75 వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందే వీలుంటుంది.
పట్టు పరిశ్రమ నిర్వాహకులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. జీరో వడ్డీతో రూ.లక్ష వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంది. ఎకరా తోటలో ఆరు వేల మల్బరీ నారు మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చులో మల్బరీ నారు మొక్కల సంఖ్య ఆధారంగా రూ.10,500 రాయితీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కింద ఎకరా మల్బరీ తోట పెంపకానికి మూడేళ్లపాటు దఫాల వారీగా రూ. 1,32,436 వస్తుంది. పట్టు పురుగుల రేరింగ్‌షెడ్‌ నిర్మాణానికి ఒక రకానికి రూ.1,59,104, రెండో రకానికి రూ.57,983 ఇస్తారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పఽథకం కింద 50 శాతంతో రేరింగ్‌ షెడ్‌ 50:20:15 అడుగుల షెడ్‌ నిర్మాణానికి రూ.1,37,500 నాలుగు దఫాలుగా సబ్సిడీ లభిస్తుంది. పట్టు పురుగుల షెడ్డు ఎల్‌ ఆకారంలో ఏర్పాటు చేసుకుంటే రూ.22,500 వస్తుంది.
షెడ్లకు సోలార్‌ లైట్లు, బ్రష్‌ కట్టర్స్‌, స్ర్పేయర్లు, సూక్ష్మపోషకాలుగా వేపపిండి వంటివి 50 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. ఎస్‌సీఎస్ పీ పథకం కింద ఎకరం తోటకు ఆరు వేల మొక్కలు నాటుకునేందుకు అయ్యే ఖర్చును 90 శాతం సబ్సిడీతో రూ.12,600 ఇస్తున్నారు. ఎస్సీ రైతులకు పట్టు పురుగుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీతో రూ.3.60 లక్షలు అందిస్తున్నారు.
పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన స్టాండ్లు, ఇతర పరికరాలకు 90 శాతం రాయితీతో రూ.63 వేలు, వ్యాధి నిరోధక మందులు, సోలార్‌ లాంతర్ల ఏర్పాటుకు ఎస్సీలకు 90 శాతం రాయితీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వ పట్టు గూళ్ల మార్కెట్లలో సీబీ రకం పట్టుగూళ్లకు కిలో రూ.20 ప్రోత్సాహం ఇస్తున్నారు. బీవీ రకానికి రూ.50 ఇస్తున్నారు. చిన్న వయస్సు పట్టు పురుగుల పెంపక కేంద్రం(చాకీ సెంటర్‌)లో 100 బీవీ గుడ్లకు రూ.వెయ్యి ప్రోత్సాహకం లభిస్తోంది. ప్రభుత్వ పట్టు గూళ్ల విక్రయ కేంద్రాలు రాయలసీమలోని మదనపల్లి, హిందూపురం, కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌, గుంటూరు ఆటోనగర్‌లో ఉన్నాయి. రెవిన్యూ డివిజన్లలోని సాంకేతిక సేవా కేంద్రాలు రైతులకు సలహాలు ఇస్తున్నాయి.
Credits : Andhrajyothi

ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వేస్ట్‌!

  • తెలుగు రైతులూ పారాహుషార్‌!
చిన్న రైతులను నిర్వీర్యం చేసే ఇజ్రాయెల్‌ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పట్ల తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు పాలస్తీనా ప్రజలు, రైతుల సంక్షేమం కోసం 15 ఏళ్లుగా కృషి చేస్తున్న ఉద్యమకారిణి, రచయిత్రి మరెన్‌ మాంటోవని. స్టాప్‌ ద వాల్‌ ఉద్యమం, పాలస్తీనీయుల భూమి పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె తెలుగు రాష్ట్రాలు ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నాయనే అంశంపై హైదరాబాద్‌ లో పాలస్తీనా రైతులతో స్కైప్‌ ద్వారా ఇష్టాగోష్టి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మరెన్‌ ‘కృషి’తో మాట్లాడారు.
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో ఎడారిని సైతం సస్యశ్యామలం చేస్తామని చెబుతున్నారు. అందులో నిజం లేదంటారా?
ఇజ్రాయెల్‌కు చెందిన నెటాఫిమ్‌ సంస్థ భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాల్లో ఇదే విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నది. పాలస్తీనా ప్రజల నుంచి వారి జీవితాలను, భూమిని, వనరులను లాక్కుని, అక్కడి రైతుకు నీరివ్వకుండా, సొంత భూముల్లో సేద్యం చేయనివ్వకుండా ఇజ్రాయెల్‌ దమనకాండ సాగిస్తున్నది. అలాంటి దేశం ప్రపంచానికి అద్భుతమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని చెబితే ఎలా నమ్మగలం. తెలుగు రాష్ట్రాలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తున్న కంపెనీల్లో ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన నెటాఫిమ్‌ కీలకంగా మారింది.
ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి తొత్తు. కుప్పంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అయిందో అందరికీ తెలిసిందే. ఆ టెక్నాలజీ పర్యావరణ హితం కాదని, సుస్థిర వ్యవసాయానికి అనుకూలం కాదని తేలింది. పలు అంతర్జాతీయ సంస్థలు నెటాఫిమ్‌ను నాణ్యత కలిగిన కంపెనీల జాబితా నుంచి తొలగించాయి. అయినా తెలుగు ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం అంటూ వందల కోట్లు వృధా చేస్తున్నాయి.
పాలస్తీనా రైతులు పడుతున్న కష్టాలకు నెటాఫిమ్‌కు ఎలా సంబంధం వుందంటారు?
గత ఏడు దశాబ్దాలుగా 75 శాతం పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ పాలకులు వారి మాతృభూమి నుంచి తరిమివేశారు. పాలస్తీనీయులకు చెందిన 93 శాతం వ్యవసాయ భూముల్ని లాక్కున్నారు. పాలస్తీనా రైతులు సాగు చేసుకునేందుకు నీరివ్వడం లేదు. బందూకుల పహారా మధ్య రైతులు దైన్యంగా సాగు చేసుకుంటున్నారు. దురాక్రమించిన భూభాగాన్ని విభజిస్తూ ఇజ్రాయెల్‌ భారీగా సరిహద్దు గోడను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో పాలస్తీనా రైతులకు ప్రాణాధారమైన లక్షలాది ఆలివ్‌ చెట్లను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నది. దురాక్రమించిన పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ పట్టణాలను, పరిశ్రమలను నిర్మించింది. అలా ఏర్పాటైన పరిశ్రమల్లో ఒకటి నెటాఫిమ్‌. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏజెంట్‌. లక్షల మంది పాలస్తీనీయుల ఉసురుపోసుకుంటున్న అలాంటి కంపెనీతో తెలుగు ప్రభుత్వాలు చేతులు కలపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
డ్రిప్‌ ఇరిగేషన్‌ను 1966లో ప్రపంచానికి తనే పరిచయం చేశానని నెటాఫిమ్‌ చెప్పుకుంటున్నది కదా?
అందులో ఏమాత్రం నిజం లేదు. చిన్న రైతులు, పాలస్తీనా ప్రజల కన్నీళ్ల మధ్య ఎదిగిన ఆ కంపెనీ తెలుగు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానంటే ఎలా నమ్మగలం? డ్రిప్‌ ఇరిగేషన్‌ పరిజ్ఞానంలో తమకు తిరుగులేదని ఆ సంస్థ తెలుగు ప్రభుత్వాలకు నమ్మబలుకుతోంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీల రూపంలో 274 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం సిఫారసు చేస్తున్న 28 కంపెనీల్లో నెటాఫిమ్‌ ఒకటి. కానీ తెలుగు ప్రభుత్వాలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ఏజెంట్‌ అయిన నెటాఫిమ్‌ ముందు నుంచే వల వేస్తున్నది. నెటాఫిమ్‌ పరికరాల నాణ్యతను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారులను ఇజ్రాయెల్‌ పంపింది. అందుకోసం కోట్లు ఖర్చు చేసింది. ఆ తరువాత వ్యవసాయ అధికారులు సహజంగానే నెటాఫిమ్‌ పరికరాలను రైతులకు సూచిస్తారు. అలా ఆ సంస్థ తెలుగు రైతుల్ని మోసం చేస్తున్నది.
కుప్పం తరహా ప్రయోగం నిష్ఫలం అంటారా?
1995లో కుప్పంలో ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో చేపట్టిన ప్రాజెక్టు వల్ల చిన్న రైతులు ఎంతో నష్టపోయారు. తెలంగాణ ప్రభుత్వం నేటికీ ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడుతూనే వున్నది. 2015లో జీడిమెట్లలో ఇండో – ఇజ్రాయెల్‌ వ్యవసాయ ప్రాజెక్టు చేపట్టారు. 10 ఎకరాల్లో బిందుసేద్యం, పాలీ, నెట్‌ సాగు పద్ధతుల్లో పండ్లు, కూరలు, పూలు ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. గత ఏడాది ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం 12.4 కోట్లు ఖర్చు చేసింది. ములుగులో ఇదే తరహాలో 11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. అందులో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో పండ్ల తోటల సాగుకు 18 కోట్ల కేటాయించారు. స్థానిక సాగు పద్ధతుల్ని వదిలేసి ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడటం విచారకరం.
తెలుగు ప్రభుత్వాలు, రైతులకు మీరిచ్చే సలహా?
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ పెద్ద రైతులు, పెద్ద కమతాలను ఉద్దేశించి రూపొందింది. చిన్న రైతులకు అది ఏమాత్రం ఉపయోగపడదని పాలస్తీనా రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. చిన్న రైతులు అధిక సంఖ్యలో వున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడదు. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణమైన టెక్నాలజీని ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటి అవుతుంది.
Credits : Andhrajyothi

కొబ్బరి, మామిడి మొక్కల నిధి

మేలైన కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసేందుకు 1991లో అశ్వారావుపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటైంది. దేశంలోని పలు రాష్ట్రాలకు మేలైన కొబ్బరి మొక్కలను ఎగుమతి చేసిన ఘనత ఈ క్షేత్రానిది.
కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో పాతికేళ్ల క్రితం కేరళలో లభించే మేలురకాలైన హైబ్రీడ్‌ కొబ్బరి రకాల మొక్కలను ఉత్పత్తి చేశారు. ఇందుకోసం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో, అచ్యుతాపురం ఉద్యానశాఖ నర్సరీలోను ఈస్ట్‌కోస్టల్‌, అండమాన్‌ ఆర్డినరీ, లక్కడాల్‌ ఆర్డినరీ మదర్‌ప్లాంట్‌లను పెంచారు. ఈ ప్లాంటులోని స్టిక్స్‌ను కొత్తగా పెంచిన మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి మొక్కలకు క్రాసింగ్‌ చేయడం ద్వారా మేలురకాలైన కొబ్బరి విత్తన ఉత్పత్తిని చేసేవారు.
 
పొట్టిరకాలు భేష్‌
ఈ క్షేత్రంలో కేరళలో దొరికే మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి చౌఘాట్‌, ఆరంజ్‌ డ్వాప్‌(డీఓడీ), గంగ బొండాం, మలియన్‌ ఆరంజ్‌ డ్వాప్‌(ఎంవోడీ), మలియన్‌ గ్రీన్‌ డ్వాప్‌(ఎన్‌జీడీ), మలియన్‌ ఎల్లో డ్వాప్‌(ఎంవైడీ) లాంటి కొబ్బరి మొక్కలను 40 ఎకరాల్లో పెంచారు. ముందుగా పెంచిన మదర్‌ప్లాంట్లలోని కాయను, ఈ విత్తనానికి క్రాసింగ్‌ చేయడం ద్వారా గోదావరి గంగ, డీఎక్స్‌డీ, ఐఎక్స్‌డీ లాంటి మేలురకాల విత్తనాలను ఉత్పత్తి చేసేవారు. ఈ మొక్కలు ఒక్కోటి 150 నుంచి 180 వరకు దిగుబడిని ఇస్తాయి. ఈ రకాలను కేరళ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ర్టాలలోని వివిధ జిల్లాలకు సరఫరా చేసేవారు. ఈ విత్తనం కేరళలో దొరికే నాణ్యత కలిగి, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే కొబ్బరి రకాలను ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం కొబ్బరి, మామిడి మొక్కల ఉత్పత్తి…
ఈ క్షేత్రం ఏర్పాటై 27 ఏళ్లు దాటింది. అప్పుడు నాటిన మొక్కలు బాగా పెద్దవి అయిపోయాయి. ప్రస్తుతం కొబ్బరి క్రాసింగ్‌ చేయడం లేదు. అయితే అప్పట్లో ఫార్మ్‌లో పెంచిన మేలురకాలైన చెట్టు నుంచి చౌఘాట్‌, గంగాబొండాం, మలియన్‌ ఆరంజ్‌ డ్వాప్‌, మలియన్‌ గ్రీన్‌ డ్వాప్‌, మలియన్‌ ఎల్లో డ్వాప్‌ వంటి మేలురకాలైన పొట్టిరకం విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటితో పాటు బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం, తోతాపురి, పునాస రకాలైన మామిడి అంట్లను ఈ క్షేత్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి మొక్క ఒక్కోదానిని రైతులకు రూ.35, మామిడి అంటును రూ.30లకు ఉద్యానశాఖ సరఫరా చేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అంట్లు కట్టడం, విత్తనాన్ని నాటడం, మొక్కలను పెంచడంతో నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఇవ్వగలుగుతుంది. ప్రైవేటు నర్సరీలలో ఒక్కో మొక్క రూ.300 నుంచి రూ.1000 వరకు వ్రికయిస్తున్నారు. అంతకంటే నాణ్యమైన మొక్కలను ఉద్యాన నర్సరీల్లో అందించడం విశేషం.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అశ్వారావుపేట
 
రైతులకు మేలురకం మొక్కలు
ప్రస్తుతం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ద్వారా ఏటా రూ.33 లక్షల ఆదాయం వస్తోంది. తెలుగు రాష్ర్టాల మొత్తంలో ఉద్యానశాఖ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఇది ఒక్కటే. ఈ క్షేత్రం ద్వారా కొబ్బరి, మామిడి మేలురకాలైన మొక్కలను ఉత్పత్తి చేసి, అతి తక్కువ ధరకు రైతులకు సరఫరా చేస్తున్నాం.
కిషోర్‌, ఉద్యానశాఖ అధికారి,
కొబ్బరి విత్తనో
Credits : Andhrajyothi

‘మకామ్‌’.. మహిళా రైతుల చైతన్య వేదిక

‘మకామ్‌’ అంటే ‘మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌’.
‘మకామ్‌’ వేదిక ద్వారా మహిళా రైతుల హక్కులు, వారికందాల్సిన ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి అవగాహన పెంపొందిస్తున్నాం.
స్ఫూర్తి
డా.రుక్మిణీ రావు… పట్టణాల్లోనే కాదు గ్రామీణ
ప్రాంతాల్లోని మహిళా హక్కుల కోసం… దళిత స్త్రీలు, బాలలు, మహిళా రైతుల హక్కుల కోసం… చట్టాల్లో మార్పులు తేవడం కోసం ఎంతో కీలకంగా వ్యవహరించిన యాక్టివిస్టు. అందుకోసం ఆమె ‘మకామ్‌’ అనే మహిళా రైతుల హక్కుల వేదికను కూడా
ఏర్పాటుచేశారు. ‘మానవతా సమాజస్థాపనే తన లక్ష్యం’ అంటున్న రుక్మిణీరావును ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలే ఇవి…
మనదేశంలో వ్యవసాయరంగంలో పనిచేస్తున్నది 70 శాతం మహిళా రైతులే. వారు పండిస్తే కాని మన నాలుగు వేళ్లూ నోట్లోకి పోవు. కానీ వారి హక్కుల పట్ల ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇతర రాష్ట్రాలలో కొనసాగిస్తున్న లాభదాయకమైన వ్యవసాయ విధానాలను, పద్ధతులను ఆ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతుల నుంచి తెలుసుకుని నూతన వ్యవసాయ సాగును ‘మకామ్‌’
అభివృద్ధిపరుస్తోంది.
పట్టణాల్లో, గ్రామాల్లో మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు… బాలలపై వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా… అలాగే దళితులు, వెనుకబడిన వర్గాల బాలల విద్య కోసం… బాల్య వివాహాలకు, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా… సింగిల్‌ విమెన్‌ రక్షణ విషయంలో… ఇలా ఎన్నో సామాజిక సమస్యలపై గత రెండు దశాబ్దాలకు పైగా డా. రుక్మిణీరావు పనిచేస్తున్నారు. వీటికి సంబంధించి చట్టాలు తీసుకురావడంలో, ఉన్న చట్టాలకు కొత్త సవరణలు చేపట్టేలా కృషిచేయడంలో దేశవ్యాప్తంగా ఇతర యాక్టివిస్టులతో కలిసి పనిచేశారామె.
పట్టణాల నుంచి పల్లె మహిళల కోసం…
పట్టణ ప్రాంత మహిళల కోసం పనిచేయడంతో తన పోరాటం ప్రారంభమైందని రుక్మిణి తెలిపారు. తొలుత మహి ళల వరకట్న హత్యలపై దృష్టిసారించారామె. వరకట్న మరణాలకు సంబంధించిన చాలా కేసులను యాక్సిడెంటల్‌ మరణాలుగా పోలీసులు తేల్చడం రుక్మిణిలో ఆలోచనలను రేకెత్తించాయి. ఈ సమస్య పరిష్కారానికి ‘ప్రొ-యాక్టివ్‌ అప్రోచ్‌’ అవసరమని భావించారామె. వరకట్నం పేరుతో ఆడవాళ్లపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయాలని 1981లో ‘సహేలీ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. అలా మొదలైన రుక్మిణీ రావు యాక్టివిజం విస్తృతస్థాయిలో కొనసాగుతూనే ఉంది. సమస్యలపై పోరాటానికి గ్రామాలలోని దళితులు, వెనుకబడిన వర్గాల మహిళలను బృందాలుగా ఏర్పరిచి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించారామె. ‘మకామ్‌’ కూడా ఈ లక్ష్యంతోనే ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా మహిళా రైతుల హక్కులు, వారికందాల్సిన ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి అవగాహన పెంపొందిస్తున్నారు. ‘మకామ్‌’ అంటే ‘మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌’. దీనిని తెలుగులో ‘మహిళా రైతుల హక్కుల వేదిక’ అంటారు. ఈ ఆలోచనను పలు రాష్ట్రాలలోని స్వచ్ఛంద సంస్థలు కూడా అనుసరించడం విశేషం. అసలు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అని అడిగితే ‘‘పట్టణ ప్రాంత మహిళలలో ఎక్కువమంది మధ్యతరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గాలకు చెందినవారు. వారు ఆర్థికంగా కొంతమేర అండదండలున్నవాళ్లు కాబట్టి తమ హక్కుల సాధన కోసం కోర్టులను ఆశ్రయించగలరు. పైగా చట్టాలు, హక్కుల గురించి ఎంతోకొంత చైతన్యం ఉన్న వారు కూడా. కానీ గ్రామీణ మహిళలకు తమకోసం ప్రత్యేక చట్టాలున్నాయని, ఎన్నో హక్కులున్నాయనే విషయం తెలియదు. న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందవచ్చని తెలిసినవారు వీళ్లలో చాలా తక్కువ. ఇకపోతే ప్రభుత్వం ఈ మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అసలే తెలియదు. అందుకే గ్రామీణ మహిళా రైతులలో హక్కుల చైతన్యం పెంపొందించడం కోసం పనిచేయాలనుకున్నా’’ అంటారామె.
మహిళా రైతుల హక్కుల కోసం…
‘‘మకామ్‌’’ వేదికను 2014లో ప్రారంభించాం. మనదేశంలో వ్యవసాయరంగంలో పనిచేస్తున్నది 70 శాతం మహిళా రైతులే. వారు పండిస్తే కాని మన నాలుగు వేళ్లూ నోట్లోకి పోవు. కానీ వారి హక్కుల పట్ల ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రైతులు పడుతున్న శ్రమకు గుర్తింపు లేకపోవడాన్ని గమనించాం. ‘మకామ్‌’ ఇతర రాష్ట్రాలలో కొనసాగిస్తున్న లాభదాయకమైన, అభివృద్ధిదాయకమైన వ్యవసాయ విధానాలను, పద్ధతులను ఆ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతుల నుంచి తెలుసుకుని నూతన వ్యవసాయ సాగును అభివృద్ధిపరుస్తోంది. అయితే మహిళా రైతులకు సంబంధించి ప్రస్తావించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మన దగ్గర మహిళా రైతు సంఘాలు లేనే లేవు. సాధారణ రైతు సంఘాలలో మహిళా రైతులు ఎంతమంది సభ్యులుగా ఉన్నారు? వారు అడుగుతున్న డిమాండ్లకు ఏ మేర స్పందిస్తున్నారు? మహిళా రైతుల అవసరాలను గుర్తిస్తున్నారా? ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలలో బడ్జెట్‌లో 30 శాతం మహిళా రైతులకు కేటాయించాలని ఆర్థిక సర్వే ప్రభుత్వానికి సూచించినా ఆ దిశగా ఎటువంటి ప్రణాళికా ప్రభుత్వాలు చేపట్టలేదు. అలాగే పంటలకు మద్దతు ధర పెంచితేనే మహిళా రైతులకు లాభం. ఆదివాసీ ప్రాంతాలలో మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం సాగిస్తున్నారు. వారి పెట్టుబడులకు, కూలీ ఖర్చులకు అధిక కేటాయింపులు కావాలి. అలాగే వ్యవసాయంలో మహిళా రైతుల పనిభారాన్ని తగ్గించడానికి, ఆహార భద్రత కల్పించడానికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ గణాంకాలలో మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు! జెండర్‌ పరంగా గణాంకాలను రికార్డు చేసే పద్ధతి కరువవడం వలన ప్రభుత్వ చేపడుతున్న చర్యలు మహిళా రైతులకు ఎంతవరకు అందుతున్నాయనేది అంచనా వేయలేని పరిస్థితి.
అలాగే అడవి నుంచి ఆహార సేకరణ చేసే ఆదివాసీ మహిళలకు, అడవుల నుంచి పొందాల్సిన ప్రయోజనాలను దూరం చేస్తున్నారు. అందుకే మహిళా రైతులకు గుర్తింపు, రాయితీలు, అన్ని రకాల పథకాల హక్కులను ఇవ్వాలని ‘మకామ్‌’ డిమాండ్‌ చేస్తోంది. రైతు ఆత్మహత్య కుటుంబాలలో మహిళలకు జీవనోపాధి సహాయం అందించడంతో సహా రుణ మాఫీతో సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. దీనికి అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులుండాలి. భూమి లేని వారికిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను మహిళా రైతులకు కూడా ఇవ్వాలి. ఇవే కాకుండా భూమిలేని దళిత మహిళలకు భూమి కొనుగోలు పథకాలు, కనీస మద్దతు ధర, మహిళా రైతులకు డ్రిప్‌, భూగర్భజలాల పథకాలకు ప్రోత్సాహం వంటి వాటికోసం ‘మకామ్‌’ పోరాడుతోంది అని రుక్మిణీరావు అన్నారు.
నాగసుందరి, ఫోటో:ఎల్‌.అనిల్‌కుమార్‌రెడ్డి
Credits : Andhrajyothi

జయ్యారంలో పచ్చ బంగారం!

కాలికట్‌, గుంటూరు, బీహార్‌ నుంచి తీసుకువచ్చిన కొత్తరకం పసుపు వంగడాలు మహబూబాబాద్‌ రైతులకు పసిడి కురిపిస్తున్నాయి. ఏసీసీ-79, ఏసీసీ-48, రాజేంద్ర సోనాలి వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు మంచి ధర కూడా పలకడం విశేషం.
 
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌ 
ఇరవై ఏళ్లుగా సంప్రదాయ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న మహబూబాబాద్‌ జిల్లా జయ్యారం రైతులు ఇటీవల కొత్త వంగడాలను ఎన్నుకున్నారు. ఏసీసీ-79, ఏసీసీ-48, రాజేంద్ర సోనాలి రకం వంగడాలు అధిక దిగుబడులు అందిస్తూ రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఈ రకాల పసుపుకు ఆకుమచ్చ, దుంపకుళ్లు, తెగుళ్లు దరిదాపులకు కూడ రావు. పంటకాలం ఏడు నెలలే కావడంతో ఈ పసుపు చేతికి వచ్చిన తర్వాత రెండవ పంటగా కూరగాయలు, ఇతర స్వల్పకాలిక రకాలు వేసి లాభాలు గడించవచ్చు.
ఈ పసుపు సాగులో కూలీల సమస్య, వేసవిలో నీటి సమస్య ఉండదు. బోజ పద్ధతిలో బిందుసేద్యం, సేంద్రియ పద్ధతి, ఆధునిక పద్ధతి ద్వారా ఈ పసుపును జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలోని కొంతమంది రైతులు పండిస్తూ, విజయం సాధించి లాభాల బాటలో పయనిస్తున్నారు. కాలికట్‌, గుంటూరు నుంచి ఏసీసీ-79, ఏసీసీ-48 రకాలను క్వింటాలుకు రూ.7500 చొప్పున తీసుకువచ్చారు వల్లూరి కృష్ణారెడ్డి. ఎకరంలో పసుపు ముక్కలు కట్‌ చేసి బోజ పద్ధతిలో నాటారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని అందించారు. పసుపు చేను ఎత్తు పెరగకపోవడం ఈ వండగం ప్రత్యేకత. మధ్యాహ్నం సమయంలో ఆకులు ముడుచుకునే గుణం ఉండడంతో సూర్యరశ్మి చెట్ల అడుగుభాగంలో తగులుతుంది.
దీంతో పసుపు వేర్లు ఎక్కువగా పెరిగి దుంపలు అధికంగా వచ్చాయి. జూన్‌ మొదటి వారంలో విత్తనాలు వేస్తే జనవరి 15 కల్లా పంటకాలం ముగుస్తుంది. సాధారణ పసుపు సాగుకంటే ఈ పసుపు పంటకాలం తక్కువగా వుండటంతో వేసవిలో నీటి సమస్య, కూలీల సమస్య ఉండదు. ఎకరానికి 195 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒక్కగడ్డ కిలో 800 గ్రాముల వరకు ఊరింది. ఈ కొత్తరకం పచ్చి పసుపును విత్తనాల కోసం ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడ జయ్యారం వచ్చిన రైతులకు క్వింటాకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు ఈ రైతు. ఈ పసుపుపై పెట్టుబడి రూ.76 వేలు కాగా రూ. 8.74 లక్షల ఆదాయం వచ్చింది. కురికిమన్‌ (పసుపురంగు) అధికంగా ఉండడంతో ధర ఎక్కువగా పలుకుతోంది. మరో రైతు బొల్లంపల్లి శ్యాంసుందర్‌రెడ్డి ఏసీసీ-48, 79 రకాలను తీసుకువచ్చి బోజ పద్ధతిలో కాకుండ సంప్రదాయ పద్ధతిలో నాగలి కట్టి ఎకరం సాగు చేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చయింది. 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి పోను రూ.4.50 లక్షల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
అవగాహన సదస్సుతో మేలు: కృష్ణారెడ్డి
ఆదిలాబాద్‌ జిల్లా ధనోరాలో జరిగిన పసుపు అవగాహన సదస్సుకు వెళ్లాను. అక్కడ బోజ పద్ధతిలో రిటైర్డ్‌ శాస్త్రవేత్త ఎల్‌.కిషన్‌రెడ్డి చెప్పినట్టుగా ఈ కొత్తరకం వంగడాలను సాగు చేయడంతో అధిక లాభాలు వచ్చాయి.
Credits : Andhrajyothi