మిద్దె తోటలపై అవగాహనా సదస్సు

నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. ఫలితంగా మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి అంతా కలుషితం అవుతున్నాయి. మిద్దె తోటల పెంపకం వల్ల వాతావరణంలో ఆక్సిజన్‌ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న వారికి అండగా నిలబడేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్‌ మిద్దెతోటలపై ఒక రోజు అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నది. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హైదరాబాద్‌ లక్డీకాపూల్‌ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీభవన్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ సారథి యడవల్లి వెంకటేశ్వరావు తెలిపారు. ఉద్యానశాఖ డైరెక్టర్‌ ఎల్‌. వెంకట్రాంరెడ్డి, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమ్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు.
Credits : Andhrajyothi

పెరటి తోటలతో ఆరోగ్యం.. ఆహ్లాదం

  • ఎన్‌జి రంగా వీసీ దామోదర్‌నాయుడు చొరవ

పెరట్లో లేదా టెర్రస్‌ మీద

సహజసిద్ధంగా పండించిన కూరగాయలు ఎంతో తాజాగా, రుచిగా వుంటాయి. వాటిని ఇరుగు పొరుగులకు ఇవ్వడం, వాళ్లు పండించిన కూరలను తీసుకోవడంలో మానవ సంబంధాల మధురిమ కూడా వుంటుంది. కొన్నేళ్లుగా కనుమరుగైన ఆ సంప్రదాయం తిరిగి చిగుళ్లు తొడుగుతున్నది..
వల్లభనేని దామోదర్‌నాయుడు ప్రస్తుతం గుంటూరులోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా వున్నారు. ఆరు నెలల క్రితం వరకు ఆయన నెల్లూరు పుట్టవీధిలోని తన నివాసంలోనే ఉన్నారు. వ్యవసాయం గురించి పాఠాలు చెప్పడమే కాదు సేద్యం అంటే అమితమైన ఆసక్తి కలిగిన ఆయన తన టెర్రస్ పై టమోటా, వంగ, మిరప, క్యాబేజీ, బీన్స్‌, పొట్ల, సొర, చుక్కకూర, పాలకూర, పుదీనా, మునగ రకాలతో పాటు మరిన్ని కూరగాయల సాగు చేపట్టారు.
ఎరువులను వాడకుండా గోమూత్రం, ఆవుపేడను ఉపయోగిస్తున్నారు. చీడపీడలకు వేపనూనె, వర్మికంపోస్టు ఎరువులను వాడటం విశేషం. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గుంటూరులో ఉంటున్న దామోదర్‌నాయుడు నెల్లూరులోని తన అక్క లీలావతమ్మ, చెల్లెలు విజయలక్ష్మిలకు వీటి సాగు బాధ్యతలు అప్పగించారు. దామోదర్‌కు వ్యవసాయం అంటే అమితమైన ఆసక్తి. అందుకే ఎంత చదివినా, ఉన్నత పదవుల్లో వున్నా సాగు మాత్రం మానలేదన్నారు లీలావతమ్మ, విజయలక్ష్మి. సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా మొక్కలను మురిపెంగా చూసుకుని వెళ్లాడు. తాను ప్రకృతి సేద్యం చేయడంతో పాటు స్నేహితుల్ని కూడా ఆ దిశగా ప్రోత్సాహిస్తున్నాడన్నారు.
పట్టణాల్లో పెరటి సాగు పెరగాలి
పట్టణ ప్రాంతాల్లో పెరటి సాగు గణనీయంగా పెరగాలి. అది కూడా సేంద్రియ పద్ధతుల్లో జరగాలి. పొలాల్లో రసాయనాలు ఉపయోగించి కూరగాయలు పండించడం వల్ల ప్రజలు కేన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధుల బారిని పడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో మనకు అవసరమైన కూరలు, పండ్లను మనమే పండించుకుంటే మనతో పాటు నేలతల్లి కూడా ఆరోగ్యంగా వుంటుంది.
– వల్లభనేని దామోదర్‌నాయుడు
Credits : Andhrajyothi

మన ఇల్ల్లు.. మన కూరగాయలు

పట్టణ ప్రజలు వారి ఇళ్లలో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు, సహజ ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నది. ఆసక్తి వున్న వారికి కూరగాయలు పండించడంలో శిక్షణ కూడా ఇస్తున్నది.
మార్కెట్‌లో కొంటున్న ఆకు కూరలు, కూరగాయలు రుచీ పచీ వుండవు. మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని అందోళన చెందని పట్టణవాసులు వుండరు. సిటీలో మన ఇంటి డాబా మీద, పెరట్లో, ఇంటి ముందు కుండీల్లో మనం తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మన సొంతం అవుతుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మన ఇల్లు – మన కూరగాయల పథకం. జంట నగరాల్లో నివసిస్తున్న ఇలాంటి పర్యావరణ ప్రియుల కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఇల్లు – మన కూరగాయలు పథకాన్ని అమలు చేస్తున్నది.
రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద మన ఇల్లు- మన కూరగాయలు పథకంలో భాగంగా అర్బన్‌ ఫార్మింగ్‌ యూనిట్లను ప్రభుత్వం జంటనగరాల ప్రజలకు సబ్సిడీపైన సరఫరా చేస్తున్నది. పట్టణంలో నివసిస్తూ 50 నుంచి వంద చదరపు అడుగుల వరకు ఇంటి పైకప్పు/పెరటి స్థలం/బాల్కనీ ఉండి.. నీటి సదుపాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారుడు తన అడ్రస్‌ ప్రూఫ్‌తో పాటుగా పాస్‌ పోర్టు సైజు ఫొటోనూ జత చేర్చి ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం 200 చదరపు అడుగులకు మించి మంజూరు చేయరు.
కిట్‌ – ఏ లో ఉండే వస్తువులు : నాలుగు సిల్పాలిన్‌ కవర్లు(40 ఇంచుల డయా, 12 ఇంచుల లోతు, 250జీఎస్ ఎం), 52 ఘనపు అడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువు, 2:1 నిష్పత్తిలో 20 పాలీ బ్యాగులు), 12 రకాల కూరగాయల విత్తనాలు, 25 కిలోల వేపపిండి, 500 మిల్లీలీటర్ల వేపనూనె, కుర్ఫీ, సికేచర్‌, చిన్న స్ర్పేయర్‌, షవర్‌ వంటి పనిముట్లు ఇస్తారు. కిట్‌ – బిలో ఇచ్చే వస్తువులు : 12 అంగుళాల డయా, 12 అంగుళాల లోతు వున్న 22 బ్యాగులు, 26 ఘనపుటడుగుల మట్టి, పశువుల ఎరువు, 2:1 నిష్పత్తిలో పాలీ బ్యాగుల మట్టి మిశ్రమం, 25 కిలోల వేప పిండి, 500 మిల్లీలీటర్ల వేపనూనె, కుర్ఫీ, సికేచర్‌, చిన్న స్ర్పేయర్‌, షవర్‌ వంటి పనిముట్లు ఉంచిన చేతి సంచిని ఇస్తారు.
ఈ పథకంలో భాగంగా కూరగాయలను గచ్చు/బాల్కనీ/పైకప్పులపై పెంచుకోవచ్చు. 3 నుంచి4 అడుగుల వెడల్పు, 9-20 అంగుళాల లోతు ఉండే బెడ్లను తయారుచేసి పెంచవచ్చు. సూర్యరశ్మి, సాగునీటి లభ్యత చూసుకోవాలి. కాగా.. ఎర్రమట్టి, సేంద్రియ ఎరువులను 2:1 నిష్పత్తిలో ఉపయోగించాలి. సేంద్రియ ఎరువులుగా పూర్తిగా కుళ్లిన పశువుల ఎరువు/వర్మీ కంపోస్టు/కోకాపీట్‌లను లేదా వీటి మిశ్రమాన్ని ఉపయోగించాలి.
మన ఇల్లు మన కూరగాయలు కార్యక్రమంలో ఆకు కూరలు (పాలకూర, మెంతికూర, కొత్తిమీర, చుక్కకూర, గోంగూర, బచ్చలి, తోటకూర, పుదీన తదితరాలు), దుంప కూరలు(ముల్లంగి, క్యారట్‌, ఆలుగడ్డ, ఉల్లిపరక, బీట్‌ రూట్‌), పూల కూరలు(కాలి ఫ్లవర్‌, అరటి, క్యాబేజీ), గింజ కూరలు(బీన్స్‌, బఠానీలు, తీయని మొక్కజొన్న), కూరగాయలు(బెండ, వంకాయ, టమాటా, గోరుచిక్కుడు, తీగజాతి పందిరి రకాలైన సొరకాయ, కాకర, బీర, పొట్లకాయ), పండ్లు(ఆపిల్‌, రేగు, సీతాఫలం, బొప్పాయి)… పండడానికి అనువైన కూరగాయలు, పండ్ల రకాలు. పెరుగుతున్న జనాభా, కూరగాయల ఖర్చు, పోషకాహార లోపం, పట్టణాల్లో స్థలాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యానవనశాఖ జంటనగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచీ ఈ పథకం కింద ఉద్యానవన శాఖ ఇప్పటివరకు 1886 యూనిట్లను లబ్ధిదారులకు అందజేసింది.
పర్యావరణ ప్రేమికులకు ఉచిత శిక్షణ
ఈ పథకంలో భాగంగా కూరగాయలు పెంచేందుకు కావాల్సిన సిల్పాలిన్‌ కవర్లు, మట్టి మిశ్రమం, విత్తన సంచి, వేపపిండి, వేపనూనె, పనిముట్లను సగం సబ్సిడీపైన ఉద్యానవనశాఖ పౌరులకు అందిస్తుంది. ప్రతి ఇంటికీ 2 యూనిట్లను ఇవ్వడంతో పాటుగా సాగుపై ఉచిత శిక్షణా ఇస్తుంది. కిట్‌- ఏ యూనిట్‌ ధర రూ. 6 వేలు కాగా.. సబ్సిడీ పోను రూ. 3 వేలకు అందించనుంది. మట్టి మిశ్రమం లేకుండా అయితే సబ్సిడీ పోను రూ. 2 వేలకు కిట్‌ను అందిస్తుంది. కిట్‌ – బిని మట్టి మిశ్రమంతో అయితే రూ. 1900, మట్టి మిశ్రమం లేకుండా అయితే రూ. 1400కు పంపిణీ చేయనుంది.

ఆమె ఇల్లు ఉద్యానవనం

ఆమె వయసు 70 ఏళ్లు, గతంలో సర్పంచ్‌గా, ఎంపిటిసి సభ్యురాలిగా పనిచేశారు. వ్యవసాయం కూడా చేశారు. వయోభారంతో పొలం వెళ్లకపోయినా ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నారు. రుచికరమైన జామ, ద్రాక్ష పండ్లను పెరట్లో పండిస్తూ, ఇరుగు పొరుగులకు ఉచితంగా పంచుతున్నారు.
మేడిశెట్టి సూర్యకాంతం కుటుంబానికి పదెకరాల మాగాణి వుంది. ఖాళీగా కూర్చున్నా ఆమెకు దర్జాగా రోజులు వెళ్లిపోతాయి. కానీ ఆమె ఆ పని చేయడం లేదు. అందరూ వ్యాపకం కోసం టీవీ ముందు కూర్చుంటారు. కానీ ఆమె మాత్రం పండ్ల మొక్కలు పెంచుతూ ఇంటిని వ్యవసాయక్షేత్రంగా మార్చారు. పెరట్లో జామ, ద్రాక్ష పెంచుతూ చుట్టుపక్కల వారికి మధురమైన రుచులను పంచుతున్నారు. రెండేళ్ల క్రితం వైజాగ్‌లోని కుమార్తె దగ్గరకు వెళ్లారు తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వాకాడ గ్రామానికి చెందిన సూర్యకాంతం. అక్కడి నుంచి నాణ్యమైన జామపండ్లు తెచ్చారు. ఆ విత్తనాలను జాగ్రత్త చేసి పెరట్లో చల్లారు. వాటి నుంచి 40 మొక్కలు వచ్చాయి. ఆవుపేడతో ఎరువు తయారుచేసి ఈ మొక్కలకు వేశారు. దాంతో జామకాయలు విరగకాశాయి. ఒక్కో కాయ అర కేజీపైనే ఉంటుంది. ఒక్కో చెట్టుకు 30, 40 కాయలు కాస్తున్నాయి. ఇంట్లో కూరల కోసం వంగ, మిరప వంటివీ పెంచుతున్నారు. ఈ కాలంలో మొక్కలు పెంచే తీరిక ఎవరికీ వుండటం లేదు. మార్కెట్‌లో మం దులు వేసి పండించిన కూరలు కొని తింటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏడు పదుల మహిళ పెరట్లో కూరల సాగు చేపట్టడం విశేషం.
ప్రతి ఇల్లూ వనం కావాలి
ఇంటి ముందు, పెరట్లో ఖాళీ స్థలంలో కూరలు, పండ్ల మొక్కలు పెంచాలి. దానివల్ల నాణ్యమైన ఆహారం దొరుకుతుంది. ఎవరో కూరగాయలు పండించాలనుకోవడం వల్లే వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో తోటల పెంపకంతో శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు నాణ్యమైన కూరలు లభిస్తాయి.
– మేడిశెట్టి సూర్యకాంతం
Credits : Andhrajyothi

మట్టి లేకుండా మొక్కల పెంపకం 

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో మొక్కలు పెంచాలంటే స్థలం కొరత ఎదురవుతోంది. కానీ ఈ పరిస్థితి కారణంగా పచ్చదనం పెంచాలని ఆసక్తి ఉన్నా చేయలేనివారికి మధురవాడ జీవీపీ కళాశాలలో ట్రిపుల్‌ ఇ చదువుతున్న విద్యార్థి భమిడిపాటి అవధానిప్రశాంత్ చక్కని పరిష్కారం చూపించాడు. మట్టితో పని లేకుండా మొక్కలు పెంచే విధానం గురించి ఒక ప్రాజెక్టు రూపొందించాడు.
వ్యవసాయరంగంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందడానికి ఈ విధానాన్ని అమలు చేయవచ్చని ప్రశాంత్‌ తెలిపాడు. వ్యవసాయ క్షేత్రం పక్కన నీటికొలను ఏర్పాటు చేసుకొని, ఆ నీటిలో పీహెచ్‌ గాఢతను అనుసరించి పోషకాలు కలిపి డ్రిప్‌ పద్ధతి అందిస్తే నీరు ఆదా అవుతుందని ప్రశాంత్‌ వివరించాడు. నీటిని అందించే పైప్‌లైన్‌కు పీహెచ్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌లు అమర్చి వాటిని మన సెల్‌ఫోన్‌కు అనుసంధానించి దూరం నుంచి కూడా వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించవచ్చునని ప్రశాంత్ వివరించాడు.

కేవలం నీటితోనే.. 
మన ఇళ్లల్లో మట్టి లేకుండా ప్లాస్టిక్‌ పైప్‌లలో చిన్న కుండీలు ఏర్పాటు చేసి వాటిలో క్లేపెబల్స్‌ (మట్టి ఉండలు)వేసి మనకు నచ్చిన పూల మొక్కలు, టమాటాలు లాంటి కూరగాయలు మొక్కలు వేసుకోవచ్చు. వీటికి అందించే నీటిలోనే పోషకాలు కలపడం వల్ల మట్టి అవసరం ఉండదు. మట్టిలో ఉండే పోషకాలు ఈ నీటిలో ఉంటాయి. కనుక మట్టి ప్రసక్తి ఉండదు. ఈ విధానం ద్వారా పెంచే మొక్కలు మనం ఇంట్లో లేకున్నా వాటికి కావలసిన నీటిని తొట్టెలో ఉన్న నీటితో అనుసంధానించడం ద్వారా అవి ఏపుగా పెరుగుతుంటాయి.

నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం

మన దేశంలో వ్యవసాయరంగానికి సుమారు 70 శాతం నీరు అవసరం అవుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలకు కేవలం 23 శాతం నీరు వినియోగమవుతంది. వ్యవసాయరంగంలో నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం ఉపయోగపడుతుంది. గృహాలకు లేదా వ్యవసాయ క్షేత్రాలకు ఈ విధానం అవలంబించాలంటే వారికి అన్ని విధాల సహాయం అందిస్తాను.
Credits : Andhrajyothi

బాబాగూడ.. కూరగాయల సాగులో భళా 

ఆంధ్రజ్యోతి, శామీర్‌పేట (రంగారెడ్డి జిల్లా): ఆ గ్రామంలోని 180 మంది రైతుల్లో 120మంది యువకులే. చాలా మంది డిగ్రీవరకు చదువుకున్నారు. ఉద్యోగ వేటమాని నేలతల్లిని నమ్ముకున్నారు. ఆధునిక పద్ధతుల్లో తీగజాతి కూరగాయల సాగుతో రైతులకు తలమానికంగా నిలుస్తున్నారు. నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ ఏడాది పొడవునా లాభాలు పండిస్తున్న బాబాగూడ రైతుల విజయగాథ ఇది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బాబాగూడ గ్రామ రైతులలో 150 మందికి 3 నుంచి 10 ఎకరాలవరకు పొలాలున్నాయి. కాకర, సొర, బీర, దొండ, పొట్ల వంటి తీగజాతి కూరగాయలను వీరు ఏడాది పొడవునా పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది 300 ఎకరాల్లో 130మంది కాకర వేశారు. మరో 30 మంది బీర, పొట్లతోపాటు బెండ, టొమాటో సాగుచేశారు. బాబాగూడ ప్రాంతంలో బోరుబావులే సాగుకు ఆధారం. దీనివల్ల కొన్ని సందర్భాల్లో నష్టాలు చవిచూస్తున్నా పట్టుదలతో కూరగాయలు సాగుచేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
 

కాకర సాగుతో అద్భుతాలు 
బాబాగూడలో కౌకుట్ల సురేందర్‌రెడ్డి పాతికేళ్లుగా కూరగాయలు సాగుచేస్తూ మిగిలిన రైతులకు మార్గదర్శకుడయ్యారు. పదెకరాల భూమిలో మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న ఈయన, పన్నెండేళ్లుగా తీగజాతి కూరగాయల సాగుపై దృష్టిపెట్టారు. తొలుత 2004లో ఐదెకరాల్లో వేశారు. తర్వాత 2015లో మరో ఐదెకరాల్లో పందిరివేసి బీర, కాకర వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. నిరడు ఐదెకరాల్లో బీర వేసి మంచి లాభాలు గడించారు. ఈసారి మిగతా ఐదెకరాల్లో థాయ్‌లాండ్‌ ప్రాంతానికి చెందిన ఈస్ట్‌వెస్ట్‌ మాయా వెరైటీ కాకర హైబ్రిడ్‌ విత్తనాలను మూడు నెలల కిందట నాటారు. ఇటీవల 15 రోజులుగా ఈ పంట దిగుబడి మొదలవగా రోజు విడిచి రోజు 1500 కిలోల కాకరను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. కాగా 15 రోజులముందు కాకర కిలో రూ.60 పలుకగా ప్రస్తుతం రూ.20కి పడిపోయింది. ఎకరా కాకర సాగుకు రూ.1.3లక్షలు ఖర్చవు తుంది. పంట రెండున్నర నెలలపాటు ఉం టుంది. ఐదు నెలల్లో పూర్తిగా అయిపోతుంది. మెదక్‌ జిల్లాలోని ఒంటిమామిడి, నగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌లకు కాకరను సరఫరా చేస్తున్నారు. తీగజాతి కూరగాయల సాగులో సురేందర్‌రెడ్డికి ప్రభుత్వం మండల ఉత్తమ రైతు అవార్డును ప్రదానం చేసింది. భారతీయ కిసాన్‌ సంఘ్‌ సభ్యుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కూడా అయిన ఆయన, మండల, జిల్లా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి మంచి దిగుబడులు సాధిస్తున్న సురేందర్‌ రెడ్డిని అభినందించారు.

నీటి సంపులకు సబ్సిడీ ఇవ్వాలి 

కూరగాయలు సాగు చేసే రైతులు నీటి సంపులను సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కూరగాయలు సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించేందుకు గాను నీటి సంపు నిర్మాణానికి అయ్యే 2 లక్షల 80 వేల రూపాయల్లో 50 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాలి. నేను డ్రిప్‌ పద్ధతిలో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాను. డ్రిప్‌ మీద 90 శాతం సబ్సిడీ వచ్చింది. పందిరి ఏర్పాటుకు రాషీ్ట్రయ కృషి యోజన వారు 70 శాతం సబ్సిడీ ఇచ్చారు. తీగజాతి కూరగాయల సాగుకు కూలీలు ఎక్కువగా కావాలి. కూలీల క్వార్టర్లకు, సంప్‌ నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కూరగాయల రైతుల్ని ప్రోత్సహించాలి.
Credits : Andhrajyothi

పండ్ల తోటల సాగులో మేటి 

రసాయనిక ఎరువులు, పురుగు మందులను పరిమితంగా ఉపయోగిస్తూ, సేంద్రియ ఎరువులు, గోమూత్రం, చెట్ల ఆకుల కషాయాలతో పండ్ల తోటలు సాగుచేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు ఆ రైతు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా మక్కువతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లగొండ జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం ఆశోక్‌రెడ్డి.

పది ఎకరాల ఆసామి అశోక్‌రెడ్డి. ఎనిమిదేళ్ల క్రితం తన పొలంలో పండ్ల తోటల సాగుకు నడుంకట్టారాయన. అందరూ నడిచే దారిలో కాకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ పండ్ల తోటల్లో మంచి దిగుబడులు, అధిక లాభాలు గడిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో వెయ్యి బత్తాయి చెట్లు, 25 జామ, 120 కొబ్బరి, 10 నిమ్మ, 5 సీతాఫల్‌, 10 ఉసిరి, 5 గిరక తాటిచెట్లతో సాగు ప్రారంభించారు అశోక్‌రెడ్డి. మరో 23 ఎకరాల భూమిని లీజ్‌కు తీసుకున్నారు. అందులో 7 వేల దానిమ్మ చెట్లు సాగు చేశారు. బత్తాయి, నిమ్మ, దానిమ్మ మొక్కలు ప్రభుత్వ నర్సరీలనుంచి తెచ్చి నాటారు. మల్లేపల్లి ఉద్యాన శాఖనుంచి బత్తాయిని, సంగారెడ్డి ప్రభుత్వ నర్సరీ నుంచి జామ మొక్కలను, మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ నుంచి సీతాఫల్‌, నిమ్మ మొక్కలను, గిరక తాటిచెట్లను నారాయణపేట నుంచి దిగుమతి చేసుకొని నాటారు. బత్తాయి తోటల్లో రసాయనాలు, ఎరువులు వేసే పద్ధతికి ఆయన స్వస్తి చెప్పారు. సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపారు. ఎకరానికి 25 నుంచి 30 టన్నుల వరకు పశువుల ఎరువు ఉపయోగించారు. పురుగుల మందుకు బదులుగా గోమూత్రం, సీతాఫల్‌, తంగేడు తదితర చెట్ల ఆకులతో కషాయాన్ని తయారుచేసి చెట్లకు 15 రోజులనుంచి నెలలోపు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. దానికితోడు జనుము, జీలుగ విత్తనాలు సాగు చేసి పచ్చిరొట్ట్టగా వాడుతున్నారు. సేంద్రియ సేద్యం మంచి ఫలితాలు ఇవ్వడంతో గోమూత్రం, పశువుల ఎరువు కోసం ఏకంగా 15 దేశవాళీ ఆవులు కొనుగోలు చేశారు ఈ రైతు. గత ఏడాది 140 టన్నుల వరకు బత్తాయి దిగుబడి సాధించి సాటి రైతులకు ఆదర్శంగా నిలిచారాయన. ఎరువులు, రసాయనాల ఖర్చు లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయాన్ని సాధించారు ఈ రైతు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలు సాగు విధానాలను గమనించేందుకు పలువురు ప్రముఖులు సోమారం గ్రామాన్ని తరచూ సందర్శిస్తుండటం విశేషం. – ఆంధ్రజ్యోతి, రాజాపేట (నల్గొండ జిల్లా)

వ్యవసాయం ఓ పండుగ 

పండ్ల తోటల సాగు చాలా లాభదాయకం. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, గోమూత్రం వాడకాన్ని పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. ఖర్చు లు తగ్గి, లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రైతులందరూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచితే పెట్టుబడులు తగ్గి వ్యవసాయం పండుగ అవుతుంది. బత్తాయి మద్దతు ధర ఒకే తీరుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది.
– శీలం అశోక్‌రెడ్డి, సోమారం
Credits : Andhrajyothi

నిలువెత్తు పంటలు! 

  • మట్టి, నీళ్లు లేని సాగు.. ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ 
  • సీజన్‌ ఏదైనా సరే ఏడాదికి 22 పంటలు 
  • 95శాతం తక్కువ నీరు.. 
  • 75శాతం ఎక్కువ దిగుబడి 
  • అమెరికా సంస్థ ఏరోఫామ్స్‌ సాధించిన అద్భుతం 

న్యూయార్క్‌, జూన్‌ 11: మట్టి, నీళ్లు.. ఈ రెండూ లేకుండా పంటలు పండించడాన్ని ఊహించగలమా? ఊహకు కూడా అందని ఈ అద్భుతాన్ని అమెరికాకు చెందిన ఏరోఫామ్స్‌ అనే సంస్థ సాధించింది. గత పుష్కరకాలంగా ‘నిలువెత్తు పంటలు’ పండిస్తోంది. ఏరోఫామ్స్‌ సంస్థ ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌కు రూపకల్పన చేసింది. ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ అంటే.. అంటే ఆరుబయట పొలాల్లో కాకుండా ఒక షెడ్డులోపల, నిలువునా అంతస్తులుగా అరలు పేర్చి, ఎల్‌ఈడీ లైట్లు, పొగమంచు సాయంతో పంటలు పండించే విధానాన్ని రూపొందించింది. సూర్యుడు చేసే పనిని ఎల్‌ఈడీ లైట్లు చేస్తే.. నీటి అవసరాన్ని కృత్రిమ పొగమంచుతో తీరుస్తారన్నమాట. ఇలాంటి ఎనిమిది ఇండోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ యూనిట్లను ఆ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. తొమ్మిదోదాన్ని.. ప్రఖ్యాత మన్‌హట్టన్‌ ప్రాంతం నుంచి కేవలం గంట దూరంలో న్యూయార్క్‌లో ఏర్పాటు చేయబోతోంది. 70వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వర్టికల్‌ ఫామ్‌ యూనిట్‌. దీనిద్వారా సాధారణం కన్నా 75 శాతం అధిక దిగుబడి సాధించవచ్చట. అదేసమయంలో సాధారణంగా పంటకు ఉపయోగించే నీటిలో 95 శాతం తక్కువ నీరు ఈ సాగుకు అవసరమవుతుందని ఏరోఫామ్స్‌ చెబుతోంది. ఆ సంస్థ 2004 సంవత్సరం నుంచి ఈ తరహా సాగు చేస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా నియంత్రిత వాతావరణంలో చేసే సాగు కావడంతో.. ఇందులో ఏడాదికి 22 పంటలు పండించే అవకాశం ఉందట.

Credits : Andhrajyothi

డాబా మీద పండించేద్దాం!

చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి గోరుముద్దలు తినిపించిన డాబా
పతంగులు ఎగరేస్తూ మెట్ల మీద పడి దెబ్బలు తగిలించుకున్న డాబా
చదువు వంక పెట్టి పక్కింటమ్మాయిని చూడ్డానికి ఇష్టంగా ఎక్కిన డాబా
పెళ్లయ్యాక నెచ్చెలితో స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకున్న డాబా
కుటుంబమంతా కలిసి వెన్నెల్లో కబుర్లు కలబోసుకున్న డాబా.
మేడ, మిద్దె డాబా… పేరేదైనా దానితో అనుబంధం మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. ఇప్పుడా డాబానే ఒత్తిడిని మాయం చేసే చలువ పందిరి అవుతోంది. కూరగాయలు పండించే మిద్దె తోటై మురిపిస్తోంది

ఒకప్పుడు డాబా మీదికి వెళ్తే… ఓ పక్కన మెట్ల మీదుగా పైకి పాకిన సన్నజాజి తీగ విరబూసి కన్పించేది. పెరటి వైపునుంచీ సపోటా చెట్టు కొమ్మో, జామచెట్టు కొమ్మో పలకరించేవి. కొబ్బరాకులు గాలికి ఊగుతూ చీకట్లో భయపెట్టేవి. పక్కింటి వారి మామిడి కొమ్మ ఒకటి అలా అందీ అందనట్లు పిట్టగోడను తాకుతుంటే లేత పిందెలు ఊరించేవి. చాపో పరుపో వేసుకుని పడుకుంటే పైన చందమామా చుట్టూ చల్లని గాలీ… హాయిగా నిద్రపట్టేసేది.

ఇప్పుడో… నీళ్ల ట్యాంకులకు తోడు రకరకాల సైజుల్లో డిష్‌ యాంటెన్నాలూ, స్విచ్‌బాక్సులూ, సెల్‌ఫోన్‌ టవర్లూ, కేబుల్‌ వైర్లతో గందరగోళానికి అర్థంలా ఉంటాయి డాబాలు. అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించే తీరికా, శుభ్రంచేసి ఉపయోగించుకునే ఓపికా ఉన్నవారు అదృష్టవంతులే. ఇక అపార్ట్‌మెంట్లకైతే పైకప్పు మీద ఏ ఒక్కరి హక్కూ ఉండదు. అది సమష్టి సొత్తు కావడంతో ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్లు తయారైంది నగరాల్లో డాబాల పరిస్థితి.

ఒక్క హైదరాబాదునే తీసుకుంటే అక్కడ ఉన్న భవనాల పైకప్పు దాదాపు 40వేల ఎకరాల వైశాల్యం ఉంటుందట. అందులో సగం విస్తీర్ణాన్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించినా ఎన్నో సమస్యలు తీరతాయంటున్నారు ఉద్యానవన నిపుణులు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడని తాజా కూరగాయలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. కేవలం 200చ.మీ. స్థలం ఉంటే అందులో ఒక్క కూరగాయలే కాదు, పండ్లూ, పూలూ చాలా పండించవచ్చు.

క్రీస్తు పూర్వమే…
డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్‌, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే.

ఇప్పటికీ చాలా దేశాల్లోని నగరాల్లో చల్లదనం కోసమూ, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా లతలూ పూల మొక్కలకూ ప్రాధాన్యమిస్తున్నారు. గుబురుగా పచ్చని పొదలుగా ఎదిగే మొక్కల్నే పెంచుతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సరదాగా ఒకటీ అరా హైబ్రిడ్‌ పండ్లమొక్కలను పెంచినా కూరగాయల పెంపకానికి డాబాలను వాడడం అంతగా లేదు. అలాంటిది వాటి మీద కూరగాయలను పెంచడం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా మాత్రమే కన్పించిన ఈ మిద్దె తోటలు సోషల్‌ మీడియావల్ల త్వరగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌, వైజాగ్‌ లాంటి నగరాల్లోనే కాక భద్రాచలం, కొత్తవలస లాంటి పట్టణాల్లోనూ వందలాది ఔత్సాహికులు మిద్దెతోటలను పెంచుతున్నారు.

ప్రయోజనాలు ఎన్నో!
మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. దానికి తోడు మిద్దెతోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. ‘తాజాగా అప్పటికప్పుడు మొక్కలనుంచి కోసి వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు’ అంటారు సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సూర్యకుమారి. ‘బజారులో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో, ఎన్ని రసాయన ఎరువులు వాడారోనన్న సందేహం వదలదు. పైగా పండ్లను మగ్గబెట్టడానికీ రసాయనాలను వాడుతున్నారు. ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకోవచ్చు’ అంటారామె. మొక్కలు పెంచడం ఆమెకు చిన్నప్పటినుంచీ ఇష్టమే. ఉద్యోగరీత్యా ఇన్నాళ్లూ సాధ్యం కాని ఆ కోరికను ఇపుడు సొంతింటి మీద తోట పెంచి తీర్చుకుంటున్న సూర్యకుమారి 900 చదరపు అడుగుల డాబా మీద నలుగురు మనుషులకు సరిపోను కూరగాయలను తేలిగ్గా పండించగలుగుతున్నారు. పువ్వులంటే ఇష్టంతో ఏకంగా 30 రకాల మందారాలను తమ తోటలో పూయిస్తున్నారామె.అరటి, మామిడి లాంటి పండ్లమొక్కల్నీ, ఔషధ మొక్కల్నీ కూడా పెంచుతున్నారు సఫీల్‌గూడ అనంతనగర్‌ కాలనీకి చెందిన కొలను పద్మావతి. మొదట పూలమొక్కలు పెంచిన ఆమె ఫేస్‌బుక్‌ మిత్రుల స్ఫూర్తితో కూరగాయలూ ఆకుకూరలూ పండించడం మొదలుపెట్టారు. తమ కుటుంబానికి సరిపోగా చుట్టుపక్కలవారికీ పంచుతున్నారు పద్మావతి. సొంతింటి డాబాని ఇంత బాగా ఉపయోగించుకోవడం తనకెంతో తృప్తినిస్తోందంటారామె.

డాబా తోటల వల్ల వ్యక్తిగతంగానే కాదు సమాజానికీ ప్రయోజనం ఉందంటారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయన సింగరేణి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడాలనుకున్నప్పుడు నగరంలో అపార్ట్‌మెంట్‌కన్నా శివార్లలో సొంత ఇల్లు కట్టుకోవడానికే మొగ్గు చూపారు. అందుకు కారణం మొక్కల పెంపకం పట్ల ప్రేమే. ఇల్లు పూర్తికాగానే తోటపనీ ప్రారంభించారు. దాదాపు 1230 చదరపు అడుగుల తోటలో కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లూ పండిస్తున్నారు. 8 అంగుళాల మడి లోతులో 20 అడుగుల పొడవు బొప్పాయిని పెంచారాయన. ఏడేళ్లుగా బయట కూరగాయలు కొనలేదని గర్వంగా చెప్తారు. ఆయన తోటలో సపోటా, అంజీర, నారింజ లాంటి పండ్లే కాదు ఆవాలు కూడా పండిస్తారు. ‘మిద్దెతోట’ పేరుతో తన అనుభవాలను క్రోడీకరించి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఓ పుస్తకం రాశారు రఘోత్తమరెడ్డి.

వేడీ కాలుష్యమూ తగ్గుతాయి
‘నగరాలను కాంక్రీట్‌ అరణ్యాలంటారు కదా… ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌక విధానం మిద్దెతోటల పెంపకం’ అనే రఘోత్తమరెడ్డి అందుకు కారణాలూ వివరిస్తారు. డాబాలన్నీ తోటలైతే ఎటుచూసినా హాయి గొలిపే పచ్చదనమే కన్పిస్తుందనీ, పైకప్పులన్నీ చల్లగా ఉండడం వల్ల ఇళ్లలో ఏసీల వాడకం తగ్గుతుందనీ అంటారు. కాలుష్యం తగ్గుతుంది. చల్లని శుభ్రమైన గాలి వస్తుంది. రూఫ్‌ గార్డెన్ల నిర్వహణ ఖర్చూ తక్కువే. ఒక్కసారి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందవచ్చు. రాలిన ఆకులూ అలములతోనే ఎరువు తయారవుతుంది. చేసే శ్రమ వ్యాయామం అవుతుంది.మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటలను పెంచుతున్నవారి మాటలే కాదు, అధ్యయనాలూ ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి.

అమెరికాలోని షికాగో సిటీ హాల్‌ రూఫ్‌ గార్డెన్‌కి పేరొందింది. రూఫ్‌ గార్డెన్‌ వల్ల ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడాలు ఉంటాయో పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఆ భవనంలో ప్రయోగాలు చేశారు. వారి పరిశీలనలో తేలిందేమిటంటే- రూఫ్‌ గార్డెన్‌ ఉన్న భవనానికీ లేని భవనానికీ ఉష్ణోగ్రతలో 10డిగ్రీల సెల్సియస్‌ (50 డిగ్రీల ఫారెన్‌హీట్‌) తేడా ఉందని. సాధారణంగానే పట్టణాలూ నగరాల్లో చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శివార్ల కన్నా అక్కడ 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందంటారు. అర్బన్‌ హీట్‌గా పేర్కొనే ఈ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి డాబా తోటలు బాగా పనికొస్తాయంటున్నారు నిపుణులు.

ఇలా చేయవచ్చు!
డాబా మీద తోట పెంచాలనుకునేవారు ఒక్కో మొక్కా పెట్టుకుంటూ నెమ్మదిగా పెంచుకోవచ్చు. లేదంటే ఒకేసారి అందుబాటులో ఉన్న స్థలాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తోటగా అభివృద్ధి చేసుకోవచ్చు. తోట వల్ల భవనానికి నష్టం జరగదు. ఎలాంటి డాబా అయినా తోటను మోయగల సామర్థ్యం ఉంటుంది. డాబా మీద తోటకి 8 అంగుళాల మందంలో మట్టి చాలు. భవనం బీమ్‌లను బట్టి వెడల్పుగా మడులు కట్టుకుంటే ఆ బరువు సమంగా వ్యాపిస్తుంది. మట్టిని డాబా నేల మీద నేరుగా పోయకుండా ప్లాస్టిక్‌ టబ్బుల్లో, తొట్లలో, కాంక్రీట్‌తో ప్రత్యేకంగా కట్టిన మడుల్లో పోసి మొక్కలు పెంచుతారు కాబట్టి నీరు కానీ మొక్కల వేళ్లు కానీ కప్పులోకి వెళ్లడమనేది ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తోటను కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా కట్టుకుంటే మంచిదంటారు రఘోత్తమరెడ్డి. ఆయన తోటపనిని ఒక కళలాగా సాధన చేస్తున్నారు. కుండీలకు ఎర్రరంగు వేసి ముగ్గులతో తీర్చిదిద్దుతారు. మొక్కల మధ్య టెర్రకోట బొమ్మల్ని అందంగా అలంకరిస్తారు. ఏడాదికోసారి మొక్కల వేళ్లు దెబ్బతినకుండా పైపైన మట్టిని కాస్త పెళ్లగించి తీసి ఆ మేరకు కొత్త మట్టిని చేరిస్తే చాలు, ఏడాదికి రెండు పంటలు తేలిగ్గా పండించుకోవచ్చంటున్నారు ఈ అనుభవజ్ఞులంతా.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వాలూ ఉద్యానశాఖల ద్వారా ఆసక్తిగల వారికి శిక్షణ ఇచ్చి, కిట్లనూ సరఫరా చేస్తున్నాయి.

ఇంటి మీద ఓ తోట ఉంటే…
ఉదయమే పక్షుల కిలకిలారావాలు వినవచ్చు.
లేలేత ఆకులపై మంచుబిందువుల్లో ప్రతిఫలించే తొలి కిరణాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఇక తోటపనితో ఒంటికి వ్యాయామమూ,
మనసుకు ఉల్లాసమూ లభిస్తాయి.
మొత్తం మీద మిద్దెతోటల పెంపకం ఓ ఆరోగ్యకరమైన కాలక్షేపం.
మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఓ మొక్క నాటి, రేపటి తోటకు శ్రీకారం చుట్టేయండి.

మొక్కలు నా ఆరోప్రాణం

నాకు ఊహ తెలిసినప్పటినుంచీ పూలమొక్కలు పెంచుతున్నాను. చదువై పోయి హైదరాబాద్‌ రాగానే ఉద్యోగంలో చేరాను. గది వెదుక్కున్న రెండో రోజే మొక్క తెచ్చుకుని పెట్టుకున్నా. ఎవరింటికి వెళ్లినా ఓ మొక్క ఇచ్చి రావడం నాకు అలవాటు. అద్దెఇళ్లల్లో ఉంటున్నప్పుడు కొంతమంది యజమానులు అభ్యంతరం చెప్పేవారు. అందుకని కేవలం మొక్కల కోసమే సొంతిల్లు కట్టుకున్నా. మా డాబా మీద నేను పెంచని పూలమొక్కలూ కూరగాయల మొక్కలూ లేవు. మునగ చెట్టు కాస్తే వీధిలో ఉన్న వాళ్లందరికీ పంచినా అయిపోవు. అయితే ఇక్కడ కోతుల బాధ ఎక్కువ. అందుకని మొత్తం డాబాకి సరిపోనూ ఇనుప పంజరం లాగా గ్రిల్‌ తయారుచేయించాం. అలా కోతుల నుంచి మొక్కల్ని రక్షించుకుంటున్నాం.

– పార్థసారథి, సికింద్రాబాద్‌
ఆరోగ్యానికి తోటపని

తోటపని శరీరానికీ మనసుకీ కూడా మంచి వ్యాయామం. మాకు సొంత వ్యాపారం ఉంది. రోజూ ఉదయం కాసేపు తోటపని చేస్తే ఒత్తిళ్లనుంచి విముక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో గత ఏడాదే డాబా మీద కూరగాయల సాగు ప్రారంభించాం. ఇప్పుడు నెలకి ఇరవై రోజులు మా తోటలో కాసిన కూరగాయలే వండుకుంటున్నాం. ఫేస్‌బుక్‌లో ‘ఇంటిపంట’ అనే గ్రూప్‌లో చేరాను. అక్కడే రూఫ్‌గార్డెన్‌ సంగతులన్నీ తెలుసుకున్నాను. వివిధ దేశాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్న ఈ గ్రూప్‌లో అందరూ తమ అనుభవాలనూ నైపుణ్యాలనూ పంచుకుంటారు. సలహాలూ సూచనలూ ఇచ్చిపుచ్చుకుంటారు. సిటీలోనే నాకు తెలిసిన వాళ్లు ఇంకా చాలామంది చేతనైన రీతిలో ఇంటిపంటల్ని పండిస్తున్నారు.

– గాంధీ ప్రసాద్‌, చింతల్‌, హైదరాబాద్‌
పల్లెనుంచీ వచ్చినవాళ్లం…

మొక్కలు పెంచకుండా ఉండలేం. అందుకే ఐదంతస్తుల బిల్డింగ్‌లో పెంట్‌హౌస్‌ కొనుక్కున్నాం. ఇంటి ముందున్న స్థలమంతా ముందు పూలమొక్కలు పెట్టాం. ఆ తర్వాత కూరగాయలూ పెంచుతున్నాం. ఎనిమిదేళ్లయింది. ఉల్లిపాయలు తప్ప ఇంకేమీ బయట కొనం. మునగ చెట్టు కూడా ఉంది. నిమ్మ, బత్తాయీ, సపోటా లాంటి పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నాం. వేసవిలో మా మొక్కలకు పూసిన మల్లెపూలు కోయడానికి గంట పడుతుంది. ఫ్లాట్స్‌లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే రూఫ్‌ గార్డెన్‌ వల్ల ఏ ఇబ్బందీ ఉండదు.

– నీలిమ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌
ఇది సరైన సమయం

డాబా మీద తోట ఏర్పాటుచేయాలనుకున్నవారు ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. కాకపోతే ఫిబ్రవరి నెల వాతావరణం పనులు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు నాటితే వేసవిలో వాడుకోవడానికి ఆకుకూరలూ, కూరగాయలూ చేతికందివస్తాయి. సారవంతమైన మట్టీ మాగిన పశువుల ఎరువూ చాలు మొక్కలు పెట్టుకోడానికి. మొక్కలకు పేనూ పురుగూ లాంటివి కన్పించగానే వాటిని వెంటనే చేత్తో తొలగించాలి. అదుపు తప్పిన స్థాయిలో ఉన్నదనుకుంటే కొద్దిగా వేపనూనె నీళ్లలో కలిపి చల్లితే సరిపోతుంది. తోటపనికి రోజూ ఒక అరగంట కేటాయిస్తే చాలు కాబట్టి డాబా ఉన్నవారు ఎవరైనా తోటల్ని పెంచుకోవచ్చు. సెలవు రోజు రెండు మూడు గంటలు చేసుకోవచ్చు

– రఘోత్తమరెడ్డి, నారపల్లి, రంగారెడ్డి జిల్లా
పురుగుమందులు అమ్మేవాణ్ని…

నేను పురుగుమందు వ్యాపారం చేసేవాణ్ని. ఆ మందుల్నే రైతులు కూరలపై చల్లడం చూసి తట్టుకోలేకపోయా. ఆ కూరగాయలు కొనడం మానేస్తే ఏంచేయాలని ఆలోచించి వంకాయ విత్తనాలు తెచ్చుకుని ఇంట్లో కుండీలో నాటాను. అలా మొదలైంది మా మిద్దెతోట సాగు. ఉన్న స్థలమంతా ఇల్లుకట్టేసుకోవడంతో డాబా మీదే కూరగాయలు పెంచుతున్నాం. పురుగుమందుల వ్యాపారం పూర్తిగా మానేసి పాలేకర్‌ సేంద్రియ విధానాలను అధ్యయనం చేశా. ఇప్పుడు వెయ్యి
చదరపు అడుగుల డాబా మీద నేను పండించని పంట లేదు. ఈ ప్రాంతంలో ద్రాక్ష పండదు. మా డాబామీద పండించాను. ఔషధ మొక్కలూ పెంచుతాను. కూరగాయలూ ఆకుకూరలూ మామూలే. మా తోట చూడడానికీ, నేర్చుకోడానికీ చాలామంది వస్తుంటారు.  వైజాగ్‌లోనే నాకు తెలిసి దాదాపు 200 మంది డాబాల మీద తోటల్ని పెంచుతున్నారు. బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు ఒకప్పుడు ఉండేవి. ఏ చికిత్సా తీసుకోకుండానే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి.

– కర్రి రాంబాబు, కొత్తవలస, విజయనగరం జిల్లా
మన ఇల్లూ -మన కూరగాయలూ

నగరాల్లో నివసించేవారు ఇంటివద్దే కూరగాయల్ని పెంచుకునేలా ప్రోత్సహించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరిది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన అనే పథకం కింద దీనికి ప్రభుత్వం ఆర్థికసాయమే కాకుండా అవసరమైన వస్తువులనూ అందజేస్తుంది.

సహాయం పొందడానికి అర్హతలు: కనీసం 50 – 200 చదరపు
అడుగుల మధ్య స్థలం(బాల్కనీ, ఇంటి పైకప్పు, పెరడు ఏదైనా సరే) ఉండాలి. ఆసక్తి కలవాళ్లెవరైనా తమ చిరునామా, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఉద్యానవనశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏమిస్తారంటే: ప్రస్తుతం ఉద్యానవనశాఖ రెండురకాల కిట్లను ఇస్తోంది. ఇంటికి రెండు కిట్లతో పాటు ఉచితంగా సాగులో శిక్షణ కూడా ఇస్తుంది. కిట్‌ ‘ఎ’ యూనిట్‌ ధర రూ.6 వేలు. 50శాతం సబ్సిడీ.
కిట్‌ ‘బి’ ధర రూ.1900. పెరట్లో సాగు చేయాలనుకునేవారికి మట్టి మిశ్రమం అవసరం ఉండదు కాబట్టి మరింత తక్కువ ధరకే ఈ కిట్లు లభిస్తాయి.

సిల్పాలిన్‌ కవర్లు, గ్రోబ్యాగ్స్‌, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేపపిండి, వేపనూనె, తోటపనికి అవసరమైన ఇతర పనిముట్లు… ఈ కిట్లలో ఉంటాయి.

పూర్తి సమాచారం …
http:///horticulture.tg.nic.in వెబ్‌సైట్‌లోని అర్బన్‌ ఫామింగ్‌ విభాగంలో చూడవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు ఫారం కూడా అందులోనే ఉంది.

– పద్మశ్రీ యలమంచిలి

Credits : EENADU  30th January 2018