బహుళ పంటలు.. భలే లాభాలు

వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యాన పంటలు అది కూడా బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా బోనకల్‌ రైతులు. గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఆ రైతుల స్ఫూర్తి గాథ ఇది.
వ్యవసాయ మండలంగా పేరున్న బోనకల్‌లో కొందరు రైతులు వాణిజ్య పంటలను కాదని బహుళ పంటల సాగు వైపు మళ్లారు. పది సంవత్సరాల నుంచి ఒకే భూమిలో.. ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటల వరకు సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు, డేగల లక్ష్మీనారాయణ తదితర రైతులు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో బంతి సాగుచేశారు ఆ రైతులు. బంతిపూల దిగుబడి పూర్తవడంతో ఆ తోటలో బీరవేసి… ఆ తీగను బంతిపూల చెట్లపైకి పాకించారు. ప్రస్తుతం వేసిన బీర 45 రోజుల్లో దిగుబడి పూర్తవుతుంది. ఆ తర్వాత ఇదే భూమిలో మళ్లీ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. యాపిల్‌బెర్‌ ప్రధాన పంటగా వేసి అందులో అంతరపంటగా పచ్చిమిర్చిని వేశారు. పచ్చిమిర్చి తర్వాత కాకర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పందిరి విధానంలో దొండ సాగు, స్పేకింగ్‌ విధానంలో టమోటా, కాకరను సాగు చేస్తున్నారు. తైవాన్‌ జామలో అంతరపంటగా బంతి వేసి మంచి దిగుబడిని సాధించారు. ఒక్కో రైతు తమకున్న పొలాల్లో తక్కువ కాలవ్యవధిగల పంటలను ఎంచుకొని ఒకే ఏడాదిలో మూడు పంటలను సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నారు.
ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
ఆదర్శ సేద్యం చేస్తున్న బోనకల్‌ మండలం ముష్టికుంట్ల రైతులను ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. ఉద్యాన పంటలను సాగుచేయటంతో పాటు బహుళ వార్షిక పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను గడించి సాగులో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారంటూ అభినందించింది.
ఏటా మూడు పంటలు
నాకు 5 ఎకరాల భూమి వుంది. ఈ ఏడాది ఒక ఎకరం భూమిలో బంతి వేయగా రూ.లక్ష ఆదాయం వచ్చింది. ఆ తర్వాత అందులో బీర వేశాను. దాని తర్వాత అదే భూమిలో కూరగాయలు పండిస్తా. యాపిల్‌బెర్‌లో అంతరపంటగా పచ్చిమిర్చి వేశా. ఇప్పటికే 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పచ్చిమిర్చి తర్వాత కూరగాయల సాగుచేస్తా. మరో ఎకరం భూమిలో తైవాన్‌ జామ వేసి అందులో అంతరపంటగా బంతి వేశా. అది పూర్తయ్యాక కూరగాయలు సాగుచేస్తా.
– బొడ్డుపల్లి నాగచంద్రుడు, రైతు, ముష్టికుంట్ల
Credits : Andhrajyothi

చిక్కోలులో రెక్కల చిక్కుడు

రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా రెక్కల చిక్కుడు(వింజ్డ్‌ బీన్స్‌)ను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో రైతు బీన ఢిల్లీరావు సాగు చేస్తున్నారు. అది కూడా సేంద్రియ పద్ధతిలో ఈ చిక్కుడును పండించడం విశేషం. ఢిల్లీరావుకి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ. ఎనిమిదేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ.. పలు ప్రత్యేకమైన వరి విత్తనాలను తయారు చేశారు.
తాజాగా మలేషియాతో పాటు కర్నాటకలో అధికంగా సాగయ్యే రెక్కల చిక్కుడు మొక్కను నాటారు. ఇప్పుడు ఇది కాయలు కాస్తోంది. ఈ చిక్కుడులో అధిక పోషకాలు ఉండడంతోపాటు శరీరంలో చక్కెర శాతాన్ని సమపాళ్లలో వుంచుతుంది. విటమిన్‌ ఎ, సి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. పోషకాలు నిండుగా వున్న ఈ రెక్కల చిక్కుడుపై ప్రజలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ తరహా పంటలను విజయవంతంగా సాగు చేయడం వల్ల సేంద్రియ సాగుకు ఊతం లభిస్తుందంటున్నారు వెరైటీ పంటలు సాగు చేసే ఢిల్లీరావు.
Credits : Andhrajyothi

అనంతలో థాయ్‌ జామ రుచులు

హిందూపురం మండలంలోని చౌళూరు గ్రామానికి చెందిన రైతు సోమశేఖర్‌రెడ్డి, మహ్మద్‌ ఖలీల్‌లు థాయ్‌లాండ్‌ ఎల్‌-49 రకం సాగు చేపట్టారు. థాయ్‌ జామలో రెండు రకాలున్నాయి. తెల్లకండ, గులాబీకండ వున్న జామ. వీటిలో తెల్లకండ జామ పెద్దసైజులో కాస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా వుంటుంది కాబట్టి రైతులకు లాభసాటిగా వుంటుంద ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కిలో పైనే బరువు!
థాయ్‌లాండ్‌ జామ 300 నుంచి 1300 గ్రాముల వరకు బరువు వుంటుంది. పంట సాగుకు ఎకరానికి సుమారు రూ.3.5 లక్షలు ఖర్చవుతుంది. తెగుళ్లు సోకకుండా, వాతావరణ ఇబ్బందులు లేకపోతే ఒక కోతకే ఎకరానికి సుమారు రూ. 5 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. ఆరోగ్యకరమైన ఒక మొక్క ఒక్కో కోతకు 30 నుంచి 40 కేజీల దిగుబడిని ఇస్తుంది. మార్కెట్‌లో కిలో ధర రూ.40 నుంచి రూ. 120 దాకా వుంది. ఈ జామ మధుమేహ రోగులకు మేలు చేయడంతో నగరాల్లో దీనికి మంచి గిరాకీ వుంది. అలహాబాద్‌ సఫేదా రకం కంటే థాయ్‌ జామ అధిక దిగుబడి, లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఎక్కువమంది రైతులు ఈ రకం జామ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
థాయ్‌ జామను పిందెదశ నుంచీ కాపాడుకోవాలి. కాయ వంద గ్రాముల దశలో వున్నప్పటి నుంచి వాటికి పాలిథిన్‌ బ్యాగ్‌లు చుట్టి కోసేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో కాయలకు న్యూస్‌పేపర్లు చుట్టాలి. దీంతో వాతావరణ మార్పుల వల్ల సంక్రమించే ఆంత్రోక్నాక్స్‌ వ్యాధి రాకుండా కాపాడటంతో పాటు పంట దిగుబడిని పెంచుకునే వీలుంటుంది.అధిక దిగుబడి కోసం కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌, చార్డోమిక్స్‌, న్యాటివో, క్లోరిపైరిఫాస్‌, నువాన్‌, హెక్టరాకాన్స్‌ ఫార్మ వంటి మందులను పిచికారీ చేయాలి.
బెంగళూరులోని సర్జాపుర్‌లో గల క్రిష్ణ రాజేంద్ర నర్సరీ యజమాని సోమశేఖర్‌రెడ్డికి ఈ రకం జామను పరిచయం చేశారు. చత్తీ్‌సగఢ్‌ నుంచి మొక్కలను తెప్పించుకుని సాగు ప్రారంభించారు. మొక్కకూ మొక్కకూ మధ్య 5 నుంచి 6 మీటర్ల దూరం వుండేలా నాటితే ఎకరాకు 110 మొక్కలు పడతాయి. అధిక సాంద్రతతో నాటితేఎకరాకు 400 మొక్కలు పెంచవచ్చు. ఎకరాకు 20 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని అంచనా.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అనంతపురం
మార్కెటింగ్‌ సౌకర్యం ముఖ్యం
థాయ్‌ జామ సాగుకు ఖర్చు ఎక్కువే. లాభాలు కూడా బాగానే వుంటాయి. 7 ఎకరాల్లో ఽథాయ్‌ జామను సాగు చేశాను. మొక్క నాటిన 10 నెలలకు కాపు ప్రారంభమైంది. పండించిన పంటను ముంబాయి, పూనె, హైదరాబాద్‌, బెంగళూరు, కోయంబత్తూరు తదితర పట్టణాలకు తరలించి అమ్ముకోవాల్సి వస్తున్నది. దాంతో ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం చాలా అవసరం.
– సోమశేఖర్‌రెడ్డి, రైతు
Credits : Andhrajyothi

రంగాపూర్‌ నుంచి సింగపూర్‌ దాకా..

 

  • ‘చపాటా’ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
చపాటా మిర్చి… చూడ్డానికి భలే రంగు… కారం తక్కువ. దీంతో ఈ వెరైటీ మిర్చికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఫుడ్‌ కలర్‌ మేకింగ్‌, ఔషధాల తయారీకి కూడా ఈ మిర్చి అనుకూలంగా వుండటంతో రైతులకు ఈ పంట సిరులను కురిపిస్తోంది. వెరైటీ పంటకు కేరా్‌ఫగా మారిన వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని రెండు గ్రామాలు రైతుల్ని కలుద్దాం రండి.
వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపూర్‌, రేలకుంట గ్రామాల్లో చపాటా మిర్చిని ఐదు వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మూడు తరాలుగా రంగాపూర్‌ గ్రామంలో రైతులంతా చపాటా మిర్చినే సాగు చేస్తూ వస్తున్నారు. రంగాపూర్‌ గ్రామంలో 350 రైతు కుటుంబాలుండగా, 2800 ఎకరాల్లో పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా చపాటా మిర్చిని సాగు చేస్తున్నారు. మరెక్కడా లేని విధంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోఈ మిర్చి పండుతోంది.
చపాటా మిర్చి ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉం టుంది. రంగు ఎక్కువగా ఉండి, ఘాటు తక్కువగా ఉంటుంది. దీని రంగును వేరుచేసి ఆహార పదార్థాల తయారీ, బేవరేజెస్‌, ఫార్మా కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు. కృత్రిమ రంగులతో ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తున్నందున సహజసిద్ధమైన ఈ చపాటా మిర్చి రంగును వాటిల్లో ఉపయోగిస్తున్నారు. మరోవైపు కారాన్ని కూరల్లో ఉపయోగించుకోని ఇతర దేశాల్లో దీని నుంచి వేరు చేసిన ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ చపాటా మిర్చికి అంతర్జాతీయంగా బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ మిర్చికి మలేసియా, సింగపూర్‌, చైనా ప్రాంతంలో భలే గిరాకీ ఉంది. చపాటా మిర్చిలోని ఆయిల్‌ ద్వారా విదేశాల్లో వయాగ్రా లాంటి ఔషధాల్లో సైతం వాడుతున్నట్టు రైతులు చెప్తున్నారు.
రంగాపూర్‌ గ్రామంలోని రైతులు కొందరు నల్లబెల్లి మండలంలోని రంగాపూర్‌ గ్రామానికి 30 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఇలా వారి వలసతో చపాటా విత్తనం రావడంతో ఒకరి నుంచి మరొకరికి విత్తనం అంది ఇప్పుడు ఊరంతా విస్తరించింది. ఈ విత్తనం ల్యాబ్‌లో రూపొందలేదు. చాలా వరకు రైతులు ప్రకృతి మీద భారం వేసి ఈ మిర్చి పంటను సాగు చేస్తున్నారు. తరచూ వైర్‌సల బారిన పడడంతో చాలావరకు నష్టం వాటిల్లినట్టు రైతులు చెప్తున్నారు. ఈ వెరైటీ మిర్చి పంటకు సోకుతున్న తెగుళ్లను అరికట్టేందుకు అవసరమైన పరిశోధనలు లేకపోవడంతో ఒక్కోసారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది వైరస్‌ ప్రభావంతో దిగుబడి తగ్గింది. వ్యవసాయ అధికారులు వచ్చి సూచనలు ఇవ్వడం తప్ప, ఎలాంటి మందులను కనిపెట్టలేకపోతున్నారు. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న తరుణంలో చపాటా మిర్చిని విస్తృతంగా సాగు చేసేందుకు వీలుగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రంగాపూర్‌ సర్పంచ్‌ గోనె రాంబాబు కోరారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ రూరల్‌
పెట్టుబడి, దిగుబడులు ఎక్కువే
చపాటా మిర్చి సాగుకు నల్ల రేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. ఎకరానికి 50 వేల నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెడితే 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తోంది. విత్తనం నుంచి యాజమాన్య పద్ధతులకు భారీగానే పెట్టుబడులు అవసరమవుతాయి. బిందు సేద్యం ద్వారా అయితే మరింత దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో రేట్లను బట్టి ఆదాయం ఉంటుంది. గత ఏడాది ధరలు భారీగా పతనం కావడంతో రైతులకు ఆదాయం రాక నష్టాల బారిన పడ్డారు. సాధారణంగా బహిరంగ మార్కెట్‌లో ఒక్కో క్వింటాల్‌కు ధర రూ. 15వేల వరకు ఉంటుంది. ఒక ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Credits : Andhrajyothi

క్యారెట్‌ అంటే కేశవపల్లి!

వికారాబాద్‌ జిల్లా కేశవపల్లి క్యారెట్‌ సాగుకు పెట్టింది పేరు. ఊరు ఊరంతా కూరగాయల సాగుకు అంకితమయ్యారు. ఏడాది పొడవునా నీరందించే చెరువు, పుష్కలంగా భూగర్భజలాలు అందుబాటులో వుండటం ఆ గ్రామ రైతులకు వరం. రోజుకు 35 నుంచి 45 టన్నుల కూరగాయలను హైదరాబాద్‌ తరలిస్తూ 150 రైతు కుటుంబాలు ఆర్థికంగా లాభపడుతున్నాయి.
వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని కేశవపల్లి గ్రామంలో 726 ఎకరాల సాగు భూమి ఉంది. గ్రామం ఎగువన వున్న పెద్ద చెరువు ఆ రైతులకు వరం. 726 మంది జనాభా, 200 వరకు కుటుంబాలుండగా అందులో దాదాపు 120 మంది రైతులే. గ్రామంలో 47కు పైగా వ్యవసాయ బావులు, 27 వరకు బోర్లు ఉన్నాయి. చెరువు కింద గ్రామం ఉండడంతో గ్రామంలో నీటి సౌకర్యం పుష్కలంగా ఉంది. దీంతో ఏడాదంతా గ్రామ పొలాలు పచ్చగా కనిపిస్తాయి. రోజుకు సగటున 35 నుంచి 45 టన్నుల కూరగాయలు నగరంలోని బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట తదితర మార్కెట్లకు తరలిస్తుంటారు. ఇందులో దాదాపు క్యారెట్‌ 80 శాతం పండిస్తుండడం గమనార్హం.
పొలం పనుల్లో ఇంటిల్లిపాది
కూరగాయలు పండించడంలో నూతన పద్ధతులు అవలంబిస్తూ మేలు రకం వంగడాలను ఎంపిక చేసుకుంటూ రాష్ట్రంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటకు డ్రిప్‌ ద్వారానే నీటిని అందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సూచనలు, సలహాలు పాటిస్తూ దిగుబడులు పెంచుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే పనులు లేక రైతులు ఉపాధి హామీ, తదితర పనులకు వెళుతుంటారు. కానీ ఈ గ్రామం తీరు వేరు. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ నిరంతరం పొలంపనుల్లో నిమగ్నం అయి వుంటుంది కేశవపల్లి.
సేంద్రియ ఎరువుతో సేద్యం
గ్రామంలోని రైతులు చాలా వరకు సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పెంటకుప్పలు, కోడి ఎరువు, మేకలు, గొర్రెల ఎరువులు, వానపాముల ఎరువును తయారు చేసుకొని పంట పొలాలకు వినియోగిస్తున్నారు. ఇక్కడి రైతులు 80 శాతం క్యారెట్‌ పంటను సాగు చేస్తున్నారు. మిగతా 20 శాతం క్యాబేజీ, టమాట, వంకాయ, బీట్‌రూట్‌, చిక్కుడు, బీర, బెండ, ఆకుకూరల పంటలు పండిస్తారు. 15 ఏళ్లుగా గ్రామం మొత్తం మద్యనిషేధం పాటించాలని తీర్మానించింది. దాంతో వ్యవసాయమే శ్వాసగా ఆ గ్రామ రైతులు జీవిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ విత్తనాల కోసం ఈ గ్రామ రైతులు ఎదురుచూడరు. అనుకున్న సమయానికి విత్తనం లభించకపోతే పంట దిగుబడి తగ్గుతుందనే భయంతో మార్కెట్‌ నుంచే మంచి విత్తనాలు కొని తెచ్చుకుంటారు. పొలాల వద్ద ఏకంగా నర్సరీలు ఏర్పాటుచేసుకుని సొంతంగా క్యారెట్‌ నారు పోసుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వికారాబాద్‌ అర్బన్‌
ఎకరానికి 2 లక్షల ఆదాయం
గ్రామంలో దాదాపు ప్రతి ఒక్కరూ క్యారెట్‌ పంట సాగు చేస్తారు. పంట తీసే సమయంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. డ్రిప్‌తో నీళ్లు పారబెట్టడం వల్ల కలుపు తక్కువగా ఉంటుంది. మంచి ధర ఉంటే ఎకరానికి రూ. 2 లక్షల వరకు లాభం వస్తుంది.
రాఘవేందర్‌, యువరైతు, కేశవపల్లి
 
క్యారెట్‌ పండించని కుటుంబం ఉండదు
మొన్న కురిసిన వానలకు క్యారెట్‌ కాస్త దెబ్బతిన్నది. అయినా మంచి దిగుబడులు సాధించగలమనే నమ్మకం వుంది. రోజూ 40 టన్నులకు పైగా కూరగాయలు ఇక్కడి నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు చేరతాయి. కూరగాయల సాగులో మా గ్రామం జిల్లాలోనే టాప్‌ కావడం ఆనందంగా వుంది.
Credits : Andhrajyothi

అంజీర సాగు భళా!

తీవ్ర వర్షాభావంతో సతమతమయ్యే అనంతపురం జిల్లా పండ్లతోటల సాగులో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రధానంగా వేరుశనగ సాగు చేసే జిల్లా రైతులు కరవు పరిస్థితుల్లో ద్రాక్ష, అంజీర, దానిమ్మ, జామ, మామిడి లాంటి పండ్లతోటల సాగుపై దృష్టి పెట్టారు. మార్కెట్‌లో మంచి ధర పలికే అంజీరను అనంతపురం రైతులు అవలీలగా సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని కూడేరు, గార్లదిన్నె, బొమ్మనహాళ్‌, డీ హీరేహాళ్‌ మండలాల్లో రెండు వేల ఎకరాలకు పైగా అంజీర పంటను రైతులు సాగు చేస్తున్నారు. సంవత్సరంలో 270 రోజుల పాటు పంట దిగుబడి వస్తోంది. బొమ్మనహాళ్‌ మండలంలోని ఎల్‌బీనగర్‌, ఏళంజి, కొళగానహళ్లి, దేవగిరి క్రాస్‌, ఉంతకల్లు, శ్రీధరఘట్ట, హిర్దేహాళ్‌, సోమలాపురం, అంబాపురం గ్రామాల్లో అంజీర సాగవుతోంది.
సాగు ప్రారంభించిన యేడాదిలో పంట కోతకు వస్తుంది. తొలి యేడాది దిగుబడి తక్కువగా వున్నా రెండవ యేడాది నుంచి పెరుగుతుంది. కురుగోడు నుంచి తీసుకువచ్చిన మొక్కల్ని అంటు పద్ధతిలో పెంచుతున్నారు. డ్రిప్‌ ద్వారా నీటిలో కలిసే ఎరువులను వేస్తున్నారు. యేడాది కాలంలో ఆరు నెలలు పంట దిగుబడి ఎక్కువగా వుంటుందని, ఆ తరువాత తగ్గుతూ వస్తుందంటున్నారు రైతులు.
 
వేరుశనగ నుంచి అంజీర వైపు..
అనంతపురం జిల్లా కూడేరు మండలం జయపురం గ్రామంలో మారుతి అనే రైతు వేరుశనగతో నష్టాలు భరించలేక అంజీర పంటవైపు దృష్టి సారించారు. జిల్లాలోని కణేకల్లు మండల ప్రాంతంలో రైతులు అంజీర సాగు చేస్తుండటంతో అక్కడకు వెళ్లి సాగు పద్ధతులు తెలుసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి కుర్రకోడు నుంచి అంజీర మొక్కలు కొని తెచ్చుకున్నారు. ఒక్కొక్కటి రూ. 25 చొప్పున ఐదెకరాల పొలానికి 1750 మొక్కలను కొనుగోలు చేశాడు. హార్టికల్చర్‌ అధికారుల సూచనలతో పంటను కాపాడుకున్నాడు. ఏడాదికే పంట చేతికి వచ్చింది. ప్రస్తుతం రెండు సంవత్సరాల మొక్కలు ప్రతి రోజూ 180 నుంచి 200 కేజీల వరకూ దిగుబడి ఇస్తున్నాయి. తన పొలం వద్ద కిలో రూ. 35 ప్రకారం విక్రయించి రోజుకు రూ.6 వేలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నాడు.
పని తక్కువ ఫలితం ఎక్కువ
అంజీర సాగులో పని తక్కువగా వుంటుంది. దిగుబడి మాత్రం ఆశించిన మేరకు వస్తున్నది. రోజూ అంజీర కాయలను కోయాల్సి వుంటుంది. ఒక రోజు ఆలస్యం అయినా కాయలు దెబ్బతింటాయి. మార్కెట్‌లో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ వుంది. రైతులకు అంజీర సాగు వరప్రదాయిని.
– మారుతి, రైతు, 80085 55511
ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి
మొదటి యేడాది రూ.19 వేలు, రెండో యేడాది రూ. 4,500 వేలు సబ్సిడీ అందించారు. మూడో యేడాది మాత్రం ఇవ్వలేదు. మార్కెట్‌ వసతితో పాటు ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించాలి. రాయితీపై మొక్కలను పంపిణీ చేయాలి.
– వై వెంకటేశులు, ఎల్‌బీ నగర్‌, 94415 87382
మంచి దిగుబడులు
అంజీర సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. ఎకరాకు పది టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఏడెకరాల పొలంలో అంజీర సాగు చేశాను. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందితే అంజీర సాగు రైతుకు ఎంతో లాభం చేకూరుతుంది.
– శీనప్ప, ఉంతకల్లు, 95736 66709
సేంద్రియ పద్ధతిలో సాగు
సంప్రదాయంగా దొరికే పశువుల ఎరువులు, తంగిడ, జిల్లడ, ఎంపిలాకులతో పాటూ పచ్చిరొట్ట ఎరువులను చెట్ల కింద వేయడంతో అంజీర చెట్లు ఆరోగ్యంగా, ధృఢంగా పెరిగాయని మారుతి చెబుతున్నాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల పెట్టుబడులు బాగా తగ్గాయన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన అంజీర పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ వుండటం విశేషం.
ఎకరాకు ఎనిమిది టన్నులు
అంజీర పంట ఎకరాకు ఎనిమిది టన్నుల దాకా దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పండ్ల తోటల్లోకెల్లా అంజీర సాగు ఆశాజనకంగా వుంటుందంటున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి కింద రూ. 50 వేల దాకా అవుతుంది. పెట్టుబడి పోను ఎకరానికి రూ. 50 నుంచి రూ. 60 వేల దాకా మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్లో కిలో అంజీర ధర రూ. 40 దాకా వుంటోంది. ఇక్కడ పండించిన అంజీరను రైతులు అమరావతి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు తరలిస్తున్నారు. 20 కిలోల బాక్స్‌ రూ. 800 దాకా ధర పలుకుతున్నట్లు రైతులు తెలిపారు.
Credits : Andhrajyothi

కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం

  • రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
  • హార్టికల్చర్‌ హబ్‌గా రాయలసీమ
ఉద్యాన పంటల సాగుకు రాష్ట్రంలో అనువైన వాతావరణం వుంది. వనరులు పుష్కలంగా వున్నాయి. దాంతో పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్నారు రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి.
ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
ఉద్యాన తోటల విస్తీర్ణం కోటి ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఫోకస్‌ పెట్టాం. సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్నాం. నీటి కుంటల తవ్వకం, రాయితీపై బిందు, తుంపర సేద్యానికి పరికరాలు, యంత్ర పరికరాలు ఇస్తున్నాం. కూరగాయల్లో హైబ్రీడ్‌ రకాల విత్తనాల పంపిణీ చేస్తున్నాం. సీఆర్‌డీఏ పరిధిలో వినుకొండ ప్రాంతాన్ని కొత్తగా హార్టికల్చర్‌ క్లస్టర్‌గా తీసుకున్నాం.
సేంద్రియ సేద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు?
రసాయన ఎరువులు వాడకం వల్ల ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తున్న విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులకు, మంచి ధరకు సేంద్రియ పద్ధతులతో ఉద్యాన పంటలను పండించాలని రైతులకు సూచిస్తున్నాం. ముఖ్యంగా కూరగాయల ఉత్పత్తులపై రైతులను అప్రమత్తం చేస్తున్నాం. రాష్ట్రంలో 10 వేల హెక్టార్లలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. 2017-18లో మరో 8500 హెక్టార్లలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేపడుతున్నాం.
సాగు నీటి సమస్య లేకుండా తోటలను కాపాడుకునే విధానాలు ఏమిటి?
పూర్తిగా వర్షాధారంగా ఉద్యానతోటల సాగు కష్టం. అందుకే భూగర్భజలాలు, నీటి కుంటలు ఉన్న ప్రాంతాల్లో బిందు, తుంపర సేద్యానికి రాయితీపై పరికరాలు ఇస్తున్నాం. పంట కుంటల తవ్వకానికి సహకారం అందిస్తున్నాం. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం.
ఉద్యాన రైతులకు అందిస్తున్న రాయితీలు ఏమిటి?
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎంఐపీ కింద తుంపర, బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర సన్న, చిన్న కారులకు 50 శాతం రాయితీతో పరికరాలను ఇస్తున్నాం. చీడపీడల నివారణ పఽథకం కింద 30 శాతం రాయితీతో హెక్టారుకు రూ.5వేలు ఇస్తున్నాం. డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి నూతన పంటల సాగు పెంచడానికి 40 శాతం రాయితీతో హెక్టారుకు రూ.5.52 లక్షల రాయితీతో ఒక లబ్ధిదారుడికి రెండెకరాల వరకు రాయితీ వర్తిస్తుంది. పూలతోటల సాగు పెంచేందుకు 40 శాతం రాయితీతో హెక్టారుకు రూ.16వేల చొప్పున రెండెకరాలకు ఇస్తాం. కొత్త పండ్ల తోటల అభివృద్ధికి 40 శాతం రాయితీ ఇస్తాం. రైతు గ్రూపుల కమ్యూనిటీ ట్యాంకులకు 50 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2లక్షలు ఇస్తాం.
ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల భాగస్వామ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. మామిడి, టమాట ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పండ్లు, పూలు, కూరగాయలు చెడిపోకుండా సురక్షితంగా ఉంచేందుకు శీతల గిడ్డంగుల ఏర్పాటుకు 35 శాతం రాయితీ ఇస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ.30-40కోట్లు బడ్జెట్‌ కేటాయించాం. పండ్లు మగ్గబెట్టేందుకు రైపనింగ్‌ ఛాంబర్లు, రీఫల్‌ (శీతలీకరణ)వ్యాన్లు 35 శాతం రాయితీతో ఇస్తున్నాం. గ్రీన్‌హౌస్ లు, పాలిహౌస్ లకు 50 శాతం రాయితీ ఇస్తున్నాం.
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఏమిటి?
నిత్యావసరాలైన కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ట్రైల్లీస్‌ పద్ధతిలో కూరగాయల పెంపకంతో 30 శాతం దిగుబడులు పెరుగుతాయి. వేసవిలో కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు షెడ్‌ నెట్‌ నర్సరీలను కూడా ఈ పథకంలో అమలు చేస్తున్నారు. హైబ్రీడ్‌ కూరగాయ విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నాం. విత్తనం ఖరీదులో 50శాతం రాయితీ ఇస్తాం. రాష్ట్రంలో పండే మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికం, టమాట, ఎండుమిర్చి, పసుపు వంటివి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మామిడి తోటల పునరుద్ధరణకు 50 శాతం రాయితీపై హెక్టారుకు రూ.17500 ఇస్తున్నాం.
Credits : Andhrajyothi

కరువు జిల్లాకు ఖర్జూర మాధుర్యం

  • తోటల సాగులో ‘అనంత’ రైతుల ప్రయోగం
ఖర్జూరం సాగుకు మన భూములు పనికి రావనే మాట అసత్యమని నిరూపించారు అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ. కరువుసీమలో ఖర్జూరం సాగు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారాయన.
నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందిన ఎండ్లూరి వెంకటనారాయణ చాలాకాలంగా వేరుశనగ, అరటి లాంటి పంటలు వేసి బాగా చితికిపోయాడు. వెంకట నారాయణకు 120 ఎకరాలు పొలం వుంది. మిగిలిన రైతుల్లానే ఆయన కూడా వేరుశనగ సాగు చేసేవాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట సరిగా చేతికందక తీవ్రంగా నష్టపోయాడు.
వెరైటీ పంటలు సాగు చేయాలనే తపన ఆయనకు వుండేది. ఒకసారి వ్యక్తిగత పని కోసం తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లాడు. అక్కడ అమ్ముతున్న ఖర్జూరం పండ్లను కొని తిన్నాడు. వ్యాపారి ఆ పండు ధర ఎక్కువగా చెప్పాడు.
ఖర్జూరం ఇంత ధరా…. అని వెంకటనారాయణ వ్యాపారిని ప్రశ్నించాడు. ఈ పండు మన దగ్గర పండదు అందుకే ఇంత ధర అని వ్యాపారి కాస్త వెటకారంగా బదులిచ్చేసరికి ఆ రైతు గుండె చివుక్కుమంది. మనమే ఆ పంటను ఎందుకు పండించకూడదని ఆలోచించాడు. కుమారుడు సుధీర్‌తో చర్చించాడు. నాణ్యమైన ఖర్జూరం పండ్లు తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన నిజాముద్దీన్‌ అనే వ్యాపారి సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్నారు. నిజాముద్దీన్‌ ద్వారా సౌదీ అరేబియా నుంచి ఖర్జూరం మొక్కలను దిగుమతి చేసుకున్నారు.
60 ఏళ్ల పాటు దిగుబడి
సౌదీ అరేబియా నుంచి తమిళనాడుకు చేరేసరికి ఒక్కో ఖర్జూరం మొక్క ఖరీదు రూ. 3,500 పడింది. నాలుగేళ్ళ క్రితం తమిళనాడులోని నిజాముద్దీన్‌ అనే వ్యాపారి ద్వారా మధురమైన రుచికలిగిన బర్హీ అనే ఖర్జూరం రకం మొక్కలను తెచ్చుకుని సాగు ప్రారంభించారు వెంకటనారాయణ. మూడు ఎకరాల భూమిని ఖర్జూరం సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో 210 మొక్కలు నాటాడు. సౌదీలో ఉన్న మన ప్రాంతం వారి ద్వారా ఖర్జూరం సాగు మెళుకువలు తెలుసుకున్నాడు. మొక్క కాపు మొదలైనప్పటి నుంచి 60 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెంకటనారాయణ జిల్లాలో ఇప్పుడు సాటి రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ పలువురు రైతులు ఖర్జూరం సాగు ప్రారంభించడం విశేషం.
విస్తరిస్తున్న ఖర్జూరం సాగు
శింగనమల, మడకశిర, కణేకల్లు తదితర మండలాల్లో రైతులు ఖర్జూరం పంటను సాగు చేస్తున్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఖర్జూరం పంటకు నీరు తక్కువగా వాడాలి. అనంతపురం జిల్లా వాతావరణానికి ఖర్జూరం బాగా సరిపోతుంది. ఖర్జూరం మొక్కను నాలుగేళ్ళు బతికించుకుంటే ఆ తరువాత ఏటా ఎకరాకు రూ.లక్ష మించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వుండదు. ఖర్జూరం పంటకు పేడ ఎరువులు, డిఏపీ, పొటాష్‌, విటమిన్స్‌ లాంటి ఎరువులు వాడాలి. వర్షాకాలంలో పురుగు నివారణకు సైబర్‌మెటిన్‌ అనే మందులు స్ర్పే చేయాలి.
– సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, అనంతపురం
 
అప్పుడు హేళన..ఇప్పుడు ఆశ్చర్యం
ఖర్జూరం సాగు ప్రారంభించినప్పుడు సాటి రైతులు నన్ను హేళన చేశారు. మన దగ్గర ఖర్జూరం పండదంటే పండదన్నారు. మూడు ఎకరాల ఖర్జూరం తోట నుంచి గత ఏడాది జూన్‌లో 16 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.1.50 లక్షలతో తమిళనాడు, అనంతపురం, కోయంబత్తూరు, అభినాష్‌ మార్కెట్లలో విక్రయించాం. నాకు వస్తున్న లాభాలు చూసి, రైతులు ఇప్పుడు నన్ను సలహాలడుగుతున్నారు. కొత్తగా ఖర్జూరం సాగు చేయడం వల్ల మార్కెట్ల గురించి తెలియక, పంట కోతలు తెలియక సుమారు రూ.10లక్షలు నష్టపోయాం. భవిష్యత్తులో మరిన్ని లాభాలు ఆర్జిస్తామనే నమ్మకం వుంది.
– ఎండ్లూరి వెంకటనారాయణ, రైతు
Credits : Andhrajyothi

తెలుగు రైతుల సరికొత్త ఇ-నేస్తమిది!

రైతుకు… సందేహం వస్తే ఎవరు తీరుస్తారు? సమస్య ఎదురైతే ఎవరు పరిష్కరిస్తారు? ఆ బాధ్యత ‘రైతునేస్తం’ మొబైల్‌యాప్‌ తీసుకుంటోంది. ఒక్క క్లిక్కుతో తికమక తొలగిపోతుంది, ఆత్మవిశ్వాసం పొంగిపొర్లుతుంది. తెలుగు రైతుల సరికొత్త ఇ-నేస్తమిది!
   ఒకప్పుడు జేబులో డబ్బు తీసుకెళ్లి, సంచుల్లో కూరగాయలు తెచ్చేవాళ్లు. మరి ఇప్పుడో సంచుల్లో తీసుకెళ్లినా జేబు నిండా రావట్లేదని వ్యంగ్యంగా అంటుంటారు చాలామంది. ఆ కాసిన్ని కూరగాయలైనా ఆరోగ్యకరమైనవా? అంటే, అదీ లేదు. వందలకు వందలు పోసి.. రసాయనాల్లో ముంచి తేల్చిన ఆహారపంటలను కొంటున్నాం. పోనీ, వీటి వల్ల రైతులకు భారీగా లాభాలు వస్తున్నాయా అంటే, అదీ లేదు. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, పెట్టుబడి భారమైపోయింది. వచ్చే కొద్దిపాటి ఆదాయం వడ్డీలకే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో… రైతు తల ఎత్తుకు బతకాలంటే, సేంద్రియ వ్యవసాయమే మార్గం. అందుకే, రసాయనాల జాడలేని సేద్యం మీద రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘రైతు నేస్తం’ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది ‘రైతునేస్తం ఫౌండేషన్‌’. ‘మాది రైతు కుటుంబం. నేను బి.కామ్‌ చదివి గ్రాఫిక్‌ డిజైనర్‌గా జర్నీ మొదలుపెట్టి, పుస్తకాల మీద ప్రేమతో స్వంతంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ను స్థాపించాను. రసాయన ఎరువులు దొరకక, దొరికినా వాటిని ఎలా వాడాలో ఎంత మోతాదులో వాడాలో తెలియక, గ్రామీణులు పడే ఇబ్బందులను చూస్తూ పెరిగాన్నేను. రైతులకు గోరంత సాయం చేసినా, కొండంత సంతృప్తి లభిస్తుందనే ఉద్దేశంతో పన్నెండేళ్ల క్రితమే ‘రైతునేస్తం’ పేరుతో పత్రిక మొదలుపెట్టాను. కాలంతో పాటు మనమూ మారాలి. అలా మారకపోతే వెనుకబడిపోతాం. ఈ హెచ్చరిక రైతుకూ వర్తిస్తుంది. అతడికి టెక్నాలజీలోని సౌలభ్యాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో మొబైల్‌ యాప్‌ను అందిస్తున్నాను’ అంటారు ఫౌండేషన్‌ చైర్మన్‌, ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు.
ఒకే ఒక్క క్లిక్‌తో…
అందులోనూ, మొదటిసారి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వారికి ‘రైతు నేస్తం’ యాప్‌లో… ఒకే ఒక్క క్లిక్‌తో సమాధానాలు దొరికిపోతాయి. సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? సేంద్రియ పద్ధతిలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే పంటలేవి? సేంద్రియ ఎరువులను తయారుచేసుకునే పద్ధతి ఏంటి? పంటలను బట్టి, ఏ శాస్త్రవేత్తను సంప్రదించాలి? వారి ఫోన్‌ నంబర్లు ఏమిటి?…. ఇలా సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది. ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తోంది. ఈ విషయం చాలామందికి తెలీదు. అందుకే యాప్‌ ద్వారా ఆర్గానిక్‌ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఎలాగో వివరించారు. పత్రాల జారీ స్టేటస్‌ కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. రైతుల్లో ఎక్కువ మంది పెద్దగా చదువుకోనివారే. వారికి కూడా యాప్‌ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో కూడా సమాచారం చేర్చారు.
పసిడి మార్గం పాడి…
ప్రతి రైతూ రెండు, మూడు పశువులను పెంచుకుంటే… పాడి ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పంటకు కావాల్సిన సేంద్రియ ఎరువులనూ సేకరించవచ్చు. గోమూత్రం నుంచీ గో వ్యర్థాల నుంచీ సేంద్రియ ఎరువుల (బీజామృతం, జీవామృతం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం…) తయారీ విధానం ఇక్కడ ఉంటుంది. పశుపోషణకు సంబంధించిన సందేహాలకు కూడా ఈ యాప్‌లో సమాధానాలు లభిస్తాయి. సుభాష్‌ పాలేకర్‌, కొసరాజు చంద్రశేఖరరావు వంటి శాస్త్రవేత్తల నుంచి ఫోన్‌ ద్వారానో, మెసేజీల రూపంలోనో సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు.
మార్కెటింగ్‌ మార్గం…
పంటను పండించడం ఎంత కష్టమో, దాన్ని లాభసాటి ధరకు అమ్ముకోవడం అంత కంటే పదిరెట్లు కష్టం. అయితే సేంద్రియ పంటలకు, రసాయన పంటలతో పోలిస్తే మంచి ధర లభిస్తుంది. ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ఈ యాప్‌లో ఓ లింకు ఏర్పాటుచేశారు. దీని ద్వారా రైతులు నేరుగా వినియోగదారుకు విక్రయించుకోవచ్చు. అలాగే, ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులనూ కొనుకోవచ్చు. ఒకటేమిటి వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారమూ ‘రైతునేస్తం’ యాప్‌లో ఉంటుంది.
     గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తేలిగ్గా డౌన్‌లోడ్‌ చేసుకోడానికి వీలుగా… కేవలం 5ఎమ్‌బీ మెమరీ సామర్థ్యంతోనే రూపొందించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే మీ పేరు, ఊరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ మొదలైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే మీరు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ(వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన వెంటనే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ క్షణం నుంచీ ఓ వ్యవసాయ శాస్త్రవేత్త, ఓ మార్కెటింగ్‌ నిపుణుడు.. మీ జేబులో ఉన్నట్టే!
Credits : Andhrajyothi

అటు రైతుకు.. ఇటు దేశానికి శ్రేయస్కరం: వందన శివ

 

రేయింబవళ్లు శ్రమించి వ్యవసాయం చేసే రైతు ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం దారుణం. ప్రకృతి వ్యవసాయం చేసినంతకాలం రైతు కుటుంబాలు కళకళ లాడుతూ వున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా ఎరువులు, పురుగుల మందులు లక్షలాది మంది రైతుల్ని బలితీసుకున్నాయి. అందుకే ప్రకృతి వ్యవసాయం అటు రైతుకు, ఇటు దేశానికి శ్రేయస్కరం.
– వందన శివ, ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారిణి
Credits : Andhrajyothi