క్యాబేజీ సాగు…లాభాలు బాగు 

  • అనంతలో యువరైతు విజయగీతిక 

కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 100 ఎకరాల ఆసామి యుగంధర్‌ సేద్యం గిట్టక డీలా పడిపోయాడు. వ్యవసాయం నుంచి వ్యాపారం వైపు దృష్టి సారించాడు. పెద్ద కొడుకు కట్టా రఘుకిరణ్‌ చౌదరిని ఇంజనీర్‌ను చేయాలనుకున్నాడు. రఘు మాత్రం ఇంజనీరింగ్‌ మధ్యలో వదిలేసి తాతగారు, స్వాత్రంత్య్ర సమరయోధుడు కట్టా రామయ్య స్ఫూర్తితో వ్యవసాయం బాట పట్టాడు. వ్యవసాయం లాభసాటి కాదనే భావనను రెండేళ్లలో మార్చేశాడు. క్యాబేజీ సాగు చేపట్టి సాటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఆ యువరైతు విజయగాథ.
అనంతపురం జిల్లాలో చినుకుపడితే కానీ పంటలు పండవు. బోర్లున్నా అన్ని సీజన్లలో నీరుండదు. అందుకే ఆ జిల్లాలో సేద్యం అంటే గాలిలో దీపం. అలాంటి జిల్లాలో కొత్త ఆలోచనలతో విజయవంతంగా కూరగాయల సాగుచేపట్టాడు రఘు. ‘‘నాన్న నన్ను బీటెక్‌ మెకానికల్‌లో చేర్పించారు. ఎందుకో ఆ మార్గంమీద మనసు పోలేదు. మధ్యలోనే చదువు మానేశాను. నాన్నకు యంత్రాలు, లారీల వ్యాపారం ఉంది. ఆయనకు చేదోడువాదోడుగా సాగు పద్ధతుల్ని గమనించాను. నాన్నగారు పండ్ల తోటల సాగుతో నష్టపోయారు. ఆ దారి లాభం లేదనిపించి కొత్తగా ఏదైనా చేయాలని భావించాను. నిరుడు ఆలూ, టమోటా, బెండ, క్యాబేజి, బీర, ఉల్లి వంటి పంటలను కొద్దిపాటి బోరు నీటితోనే డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో సాగుచేశాను. ఈసారి క్యాబేజీవైపు దృష్టి సారించాను. మంచి దిగుబడి వచ్చింది. నా మీద నాన్నకు నమ్మకం కలిగింది’’ అన్నారు రఘు.

క్యాబేజీ ‘పంట’!

క్యాబేజీ చల్లని ప్రదేశాల్లో బాగా పండుతుంది. రాయదుర్గం ప్రాంతంలో కూడా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో క్యాబేజీ మంచి దిగుబడి వస్తుంది. ‘‘నేను ఏడెకరాల్లో క్యాబేజీ సాగు చేశాను. మంచి దిగుబడే వచ్చింది. బాగా ధర ఉంటే టన్ను రూ.15 వేల దాకా పలుకుతుంది. 5 వేల కంటే ధర తగ్గదు. నేను సాగు చేసిన క్యాబేజీ ఎకరాకు సరాసరిన 25 టన్నులు వచ్చింది. అప్పట్లో ధర టన్ను రూ. 8 వేలు పలికింది. మూడు నెలల పంట ఇది. నాకు సుమారు రూ.5.6 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులుపోనూ కనీసం రూ. 4 లక్షలు మిగిలింది. బోర్లలో నీరు వచ్చే మూడు నెలల కాలంలో అనంతపురం జిల్లా రైతులు క్యాబేజీని సాగు చేసుకుంటే తప్పక లాభాలు వస్తాయి’’ అన్నారు రఘు.

హిమాలయాల ప్రాంతం నుంచి విత్తనాలు

క్యాబేజీ విత్తనాలు హిమాలయాల ప్రాంతాల నుంచే వస్తాయి. ఎకరాకు 100 గ్రాముల నుండి 120 గ్రాముల వరకూ పడతాయి. ఎకరాకు విత్తన ఖర్చు సుమారు. రూ.2500 దాకా అవుతుంది. ముందుగా వాటిని మొలకలుగా నర్సరీ పద్ధతిలో పెంచి నాటుకోవాలి. మూడడుగుల దూరంతో సాళ్లు వేసుకుని డ్రిప్‌ పైపులు సిద్ధం చేసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్యన దూరం 8 అంగుళాలుంటే మంచిది. మీడియం సైజు వస్తుంది. పెద్ద సైజు కావాలనుకుంటే మొక్కకూ మొక్కకు మధ్య అడుగు దూరం కూడా పెట్టుకోవచ్చు. క్యాబేజీ పంటను పసిబిడ్డలా కాపాడుకోవాలి. అలా కాకపోతే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆకులు వచ్చేకొద్దీ పురుగు ఆశిస్తుంది. కీటక నాశని మందులు పిచికారీ చేయాలి. మరోవైపు భూసారంకోసం యూరియా, పొటాష్‌, సూక్ష్మపోషకాలు అందించాలి. మూడునాలుగు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తే మంచి దిగుబడి వస్తుంది.
– ఆంధ్రజ్యోతి, అనంతపురం 

మార్కెటింగ్‌తో మంచి లాభాలు 
సాగుచేసిన 75 రోజుల్లోనే క్యాబేజీ పంట చేతికి వస్తుంది. మూడు నెలల్లో పూర్తిగా పంటను అమ్ముకోవచ్చు. దేశంలోని ముఖ్యమైన మార్కెట్లతో సంబంధాలుంటే మంచి లాభాలకు పంటను అమ్ముకోవచ్చు. నేను అనంతపురం, బళ్లారి, కోలార్‌, బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్‌, ధార్వాడ్‌, బెల్గాంవంటి మార్కెట్ల ధరలను పరిశీలిస్తూంటాను. మాకున్న లారీల్లో ఎప్పటికప్పుడు ధర బాగా ఉన్న మా   ర్కెట్‌కు సరుకు పంపిస్తుంటాను. ప్రస్తుతం క్యాబేజీ ధర బాగుంది. టన్ను రూ. 15వేలు పలుకుతోంది. సరిపడినంత సరుకు లేదు. ఈ సమయంలో రైతు వద్ద క్యాబేజీ సరుకుంటే శ్రమకు మించి ఫలితం లభించినట్టే! 

Credits : Andhrajyothi

సేంద్రియ ఆపిల్‌ సాగుకు పచ్చజెండా!

Organic apple grown green!

సీసీఎంబీ పర్యవేక్షణలో ఫలప్రదమవుతున్న ఆపిల్‌ ప్రయోగాత్మక సాగు

తెలంగాణలోని కెరిమెరిలో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం

అరకు సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు అనుకూలం..

మరో రెండేళ్లలో సాగు పద్ధతిని ప్రమాణీకరిస్తామంటున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సేంద్రియ ఆపిల్‌ సాగు ఆనందకరం..
సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఉద్యాన శాఖాధికారుల, వ్యవసాయాధికారుల సహాయంతోనే ఆపిల్‌ను సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేసిన పత్తిలో ఏటా నష్టాలు రావటంతో గడచిన ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. సీసీఎంబీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఈ విధానంలో ఎటువంటి ఇతర ఇబ్బందులు లేవు.

కాండం కుళ్లు, రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బెడద లేదు. ఎరువులు, పురుగు మందులు కొనే పనిలేకపోవటంతో ఖర్చు తగ్గింది. కష్టపడితే చాలు. ఒక వారం కషాయాలు పిచికారీ ఆలస్యమయినా మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వచ్చింది. అయితే, మాది మారుమూల ప్రాంతం కావడంతో ప్రకృతి సేద్యంలో పండించిన పంటలను మార్కెట్లో అధిక ధరకు అమ్ముకోవటం ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం సహకరించాలి.

కశ్మీర్‌ లోయలోనే కాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ప్రకృతి సేద్య విధానంలో ఆపిల్‌ పండ్లను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని నిరూపిస్తున్నారు సేంద్రియ రైతు కేంద్రే బాలాజీ.  కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలం ధనోరా ఆయన స్వగ్రామం. ఐదెకరాల పొలంలో ఆపిల్‌తో పాటు అనేక ఏళ్లుగా మామిడి, బత్తాయి, దానిమ్మ, అరటి, బత్తాయి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో బంతి, పసుపు, కొత్తమీరలను అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ అనుభవంతో బాలాజీ సేంద్రియ ఆపిల్‌ సాగుకు శ్రీకారం చుట్టారు.

ఆపిల్‌ మొక్కలకు పూత, కాత వచ్చింది..
ఆపిల్‌ నేషనల్‌ జీనోమ్‌ ప్రాజెక్టుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) చీఫ్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రధాన శాస్త్రవేత్తలు డా. రమేశ్‌ కె.అగర్వాల్, డా. ఎ. వీరభద్రరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో డా. జోగినాయుడు ఆధ్వర్యంలో ఆపిల్‌ సాగుపై అధ్యయనం జరుగుతోంది.

అదేవిధంగా, మినీ కశ్మీరంగా పేరుపొందిన కెరెమెరి పరిసరాల్లో ఆపిల్‌ ప్రయోగాత్మక సాగుకు 2015 మేలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలను పరిశీలించారు. చుట్టూ కొండలు, నడి వేసవిలోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకపోవటం వంటి కారణాలతో ధనోరా గ్రామం ఆపిల్‌ సాగుకు అనువైన ప్రాంతం అని సీసీఎంబీ నిర్ధారించింది.

శాస్త్రవేత్తలు బాలాజీ పొలానికి వచ్చి మట్టి పరీక్షలు జరిపారు. తొలుత కొన్ని ఆపిల్‌ మొక్కలను సాగు చేసి వాటి ఎదుగుదల బావుండటంతో బాలాజీని ప్రోత్సహించారు. 8–10 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సాగుకు అనువైన  ఆపిల్‌ రకాలుగా గుర్తించిన హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99, బిలాస్‌పూర్, నివోలిజన్, అన్న, రాయల్‌ బెలిషియస్‌ తదితర ఆపిల్‌ రకాలను సాగు చేస్తున్నారు. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–49 రకాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త హరిమాన్‌ శర్మ ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు.

సీసీఎంబీ సరఫరా చేసిన ఆపిల్‌ మొక్కలను 2015 ఆగస్టులో బాలాజీ నాటారు. తొలుత 2 అడుగులు లోతు, వెడల్పు ఉండేలా గుంతలు తవ్వుకున్నారు. గుంతకు 10 కిలోలు పశువుల ఎరువు వేశారు. సాళ్లు, మొక్కల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా నాటుకున్నారు. ఆపిల్‌ మొక్కలకు నష్టం కలిగించే రసంపీల్చే పురుగుల నివారణకు వారానికోసారి కలుపు తీయిస్తున్నారు.

ప్రతి 20 రోజలకోసారి మొక్కకు లీటరు జీవామృతం ఇస్తున్నారు. చీడపీడల నివారణకు వారానికోసారి 20 లీటర్ల నీటికి లీటరు దశపత్ర కషాయం కలిపి పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పూత వచ్చింది. నెల రోజుల్లో కాయలు ఒక మోస్తరుగా పెరిగాయి. వేసవిలో నాలుగు రోజులకోసారి బోరుతో నీటి తడి ఇచ్చారు. అయితే ఆపిల్‌ చెట్లకు మూడేళ్ల వయసు వచ్చే వరకు కాపు తీయవద్దని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పటంతో బాలాజీ పూతను తీసేస్తున్నారు. పరిశోధన కోసం రెండు చెట్లకు మాత్రమే కాయలు పెంచుతున్నారు. గుంతలు తవ్వేందుకు, మొక్కలు నాటేందుకు, కలుపు నివారణకు, ఇనుప కంచె, కూలీలకు, రూ. 3 లక్షల వరకు ఖర్చయిందని బాలాజీ తెలిపారు.

సేంద్రియ పండ్ల సాగులో పదేళ్ల అనుభవం
బాలాజీ అనేక ఏళ్లుగా ఎకరంలో బత్తాయిని సాగు చేస్తున్నారు. చెట్టుకు క్వింటా నుంచి క్వింటాన్నర వరకు బత్తాయిల దిగుబడి వస్తోంది. రూ. 60 వేల వరకు ఖర్చవుతుండగా, ఏడాదికి రూ. లక్ష నికరాదాయం వస్తోంది. జీవామృతం, దశపత్ర కషాయాలను వీటి సాగులో వాడతారు. బత్తాయిలో అల్చింతను అంతరపంటగా మడుల్లో సాగు చేస్తున్నారు. రబీలో గోధుమను సాగు చేస్తున్నారు. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

గతేడాది ఆగస్టు నెలలో ఎకరంలో దానిమ్మ, మరో ఎకరంలో టిష్యూకల్చర్‌ అరటì  మొక్కలను నాటుకున్నారు. ఇందులో బంతిని అంతరపంటగా సాగు చేశారు. 40 క్వింటాళ్ల పూల దిగుబడి వచ్చింది. రూ. 30 వేల నికరాదాయం లభించింది. రెండేళ్ల క్రితం దశేరి, బంగినపల్లి మామిడి మొక్కలను రెండెకరాల్లో నాటారు. ఎకరాలో అంతరపంటగా దానిమ్మను సాగు చేశారు.

అర ఎకరాలో పసుపును సాగు చేస్తున్నారు. చిన్న మడులను ఏర్పాటు చేసి వేసవిలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపికైన బాలాజీ జూన్‌ 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రూ. లక్ష నగదు పుర స్కారాన్ని అందుకున్నారు.
– సర్పం ఆనంద్, సాక్షి, కెరెమెరి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు ఆపిల్‌ సాగుకు తోడ్పాటునందించాలి!
ఆపిల్‌ సాగుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు రెండేళ్లుగా సాగుతున్న మా అధ్యయనంలో రుజువైంది. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌. తదితర రకాలు మైదాన ప్రాంతాల్లో సైతం బాగా పెరుగుతున్నాయి. కోరాపుట్‌ (ఒడిశా)లో, అరకులో, రిషివ్యాలీలో, విజయనగరం జిల్లా సాలూరులో, నాందేడ్‌లో, వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో, ఆదిలాబాద్‌ జిల్లా కెరిమెరిలో ఆపిల్‌ పండ్ల సాగు సాధ్యమేనని తేలింది. ఆపిల్‌.. గులాబీ కుటుంబానికి చెందిన మొక్క.

గులాబీ మాదిరిగానే మన దగ్గర కూడా సాగు చేయొచ్చు. శీతాకాలంలో కనీసం 100–150 గంటల పాటు 10–12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైతే ఫలితాలు బాగుంటాయి. మెదక్‌లో కూడా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలున్నాయి. కాబట్టి, ఆపిల్‌ మొక్కలు పెరుగుదల, పూత, కాత నిలబడటం వరకు సమస్య లేదు. అయితే, సమగ్ర సాగు పద్ధతిని ప్రమాణీకరించాల్సి ఉంది. ఇందుకు మరో రెండేళ్లు సమయం పడుతుంది.

ఒకేసారి విస్తారంగా పొలాల్లో కాకుండా పెరటి తోటల్లో సాగు చేయించాలి. ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు, ఉద్యాన వర్సిటీలు, ఉద్యాన శాఖలు శ్రద్ధాసక్తులు కనబరిస్తే పని సులువు అవుతుంది. వీరు ఆసక్తి చూపితే రానున్న డిసెంబర్‌ – జనవరి నెలల్లో మొత్తం 20 వేల ఆపిల్‌ మొక్కలను ఈ రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మక సాగుకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, చిత్తూరు రైతులు ఆపిల్‌ సాగుపై ఆసక్తి చూపారు.

Credits : https://www.sakshi.com/news/family/938484

పసుపు తవ్వే పరికరం ఇదిగో..!

Harvester/digger For Turmeric, Ginger, Potato - Sakshi

తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి  పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం.

బెడ్‌ పద్ధతికి అనువుగా నూతన పరికరం..
ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్‌ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్‌ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు.

పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్‌ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు.

రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం..
పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం.

– ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా

ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను..
ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను.

– నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా

Credits : https://www.sakshi.com/news/family/harvesterdigger-turmeric-ginger-potato-1043082

డాబా మీద పండించేద్దాం!

చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి గోరుముద్దలు తినిపించిన డాబా
పతంగులు ఎగరేస్తూ మెట్ల మీద పడి దెబ్బలు తగిలించుకున్న డాబా
చదువు వంక పెట్టి పక్కింటమ్మాయిని చూడ్డానికి ఇష్టంగా ఎక్కిన డాబా
పెళ్లయ్యాక నెచ్చెలితో స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకున్న డాబా
కుటుంబమంతా కలిసి వెన్నెల్లో కబుర్లు కలబోసుకున్న డాబా.
మేడ, మిద్దె డాబా… పేరేదైనా దానితో అనుబంధం మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. ఇప్పుడా డాబానే ఒత్తిడిని మాయం చేసే చలువ పందిరి అవుతోంది. కూరగాయలు పండించే మిద్దె తోటై మురిపిస్తోంది

ఒకప్పుడు డాబా మీదికి వెళ్తే… ఓ పక్కన మెట్ల మీదుగా పైకి పాకిన సన్నజాజి తీగ విరబూసి కన్పించేది. పెరటి వైపునుంచీ సపోటా చెట్టు కొమ్మో, జామచెట్టు కొమ్మో పలకరించేవి. కొబ్బరాకులు గాలికి ఊగుతూ చీకట్లో భయపెట్టేవి. పక్కింటి వారి మామిడి కొమ్మ ఒకటి అలా అందీ అందనట్లు పిట్టగోడను తాకుతుంటే లేత పిందెలు ఊరించేవి. చాపో పరుపో వేసుకుని పడుకుంటే పైన చందమామా చుట్టూ చల్లని గాలీ… హాయిగా నిద్రపట్టేసేది.

ఇప్పుడో… నీళ్ల ట్యాంకులకు తోడు రకరకాల సైజుల్లో డిష్‌ యాంటెన్నాలూ, స్విచ్‌బాక్సులూ, సెల్‌ఫోన్‌ టవర్లూ, కేబుల్‌ వైర్లతో గందరగోళానికి అర్థంలా ఉంటాయి డాబాలు. అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించే తీరికా, శుభ్రంచేసి ఉపయోగించుకునే ఓపికా ఉన్నవారు అదృష్టవంతులే. ఇక అపార్ట్‌మెంట్లకైతే పైకప్పు మీద ఏ ఒక్కరి హక్కూ ఉండదు. అది సమష్టి సొత్తు కావడంతో ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్లు తయారైంది నగరాల్లో డాబాల పరిస్థితి.

ఒక్క హైదరాబాదునే తీసుకుంటే అక్కడ ఉన్న భవనాల పైకప్పు దాదాపు 40వేల ఎకరాల వైశాల్యం ఉంటుందట. అందులో సగం విస్తీర్ణాన్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించినా ఎన్నో సమస్యలు తీరతాయంటున్నారు ఉద్యానవన నిపుణులు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడని తాజా కూరగాయలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. కేవలం 200చ.మీ. స్థలం ఉంటే అందులో ఒక్క కూరగాయలే కాదు, పండ్లూ, పూలూ చాలా పండించవచ్చు.

క్రీస్తు పూర్వమే…
డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్‌, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే.

ఇప్పటికీ చాలా దేశాల్లోని నగరాల్లో చల్లదనం కోసమూ, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా లతలూ పూల మొక్కలకూ ప్రాధాన్యమిస్తున్నారు. గుబురుగా పచ్చని పొదలుగా ఎదిగే మొక్కల్నే పెంచుతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సరదాగా ఒకటీ అరా హైబ్రిడ్‌ పండ్లమొక్కలను పెంచినా కూరగాయల పెంపకానికి డాబాలను వాడడం అంతగా లేదు. అలాంటిది వాటి మీద కూరగాయలను పెంచడం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా మాత్రమే కన్పించిన ఈ మిద్దె తోటలు సోషల్‌ మీడియావల్ల త్వరగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌, వైజాగ్‌ లాంటి నగరాల్లోనే కాక భద్రాచలం, కొత్తవలస లాంటి పట్టణాల్లోనూ వందలాది ఔత్సాహికులు మిద్దెతోటలను పెంచుతున్నారు.

ప్రయోజనాలు ఎన్నో!
మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. దానికి తోడు మిద్దెతోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. ‘తాజాగా అప్పటికప్పుడు మొక్కలనుంచి కోసి వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు’ అంటారు సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సూర్యకుమారి. ‘బజారులో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో, ఎన్ని రసాయన ఎరువులు వాడారోనన్న సందేహం వదలదు. పైగా పండ్లను మగ్గబెట్టడానికీ రసాయనాలను వాడుతున్నారు. ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకోవచ్చు’ అంటారామె. మొక్కలు పెంచడం ఆమెకు చిన్నప్పటినుంచీ ఇష్టమే. ఉద్యోగరీత్యా ఇన్నాళ్లూ సాధ్యం కాని ఆ కోరికను ఇపుడు సొంతింటి మీద తోట పెంచి తీర్చుకుంటున్న సూర్యకుమారి 900 చదరపు అడుగుల డాబా మీద నలుగురు మనుషులకు సరిపోను కూరగాయలను తేలిగ్గా పండించగలుగుతున్నారు. పువ్వులంటే ఇష్టంతో ఏకంగా 30 రకాల మందారాలను తమ తోటలో పూయిస్తున్నారామె.అరటి, మామిడి లాంటి పండ్లమొక్కల్నీ, ఔషధ మొక్కల్నీ కూడా పెంచుతున్నారు సఫీల్‌గూడ అనంతనగర్‌ కాలనీకి చెందిన కొలను పద్మావతి. మొదట పూలమొక్కలు పెంచిన ఆమె ఫేస్‌బుక్‌ మిత్రుల స్ఫూర్తితో కూరగాయలూ ఆకుకూరలూ పండించడం మొదలుపెట్టారు. తమ కుటుంబానికి సరిపోగా చుట్టుపక్కలవారికీ పంచుతున్నారు పద్మావతి. సొంతింటి డాబాని ఇంత బాగా ఉపయోగించుకోవడం తనకెంతో తృప్తినిస్తోందంటారామె.

డాబా తోటల వల్ల వ్యక్తిగతంగానే కాదు సమాజానికీ ప్రయోజనం ఉందంటారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయన సింగరేణి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడాలనుకున్నప్పుడు నగరంలో అపార్ట్‌మెంట్‌కన్నా శివార్లలో సొంత ఇల్లు కట్టుకోవడానికే మొగ్గు చూపారు. అందుకు కారణం మొక్కల పెంపకం పట్ల ప్రేమే. ఇల్లు పూర్తికాగానే తోటపనీ ప్రారంభించారు. దాదాపు 1230 చదరపు అడుగుల తోటలో కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లూ పండిస్తున్నారు. 8 అంగుళాల మడి లోతులో 20 అడుగుల పొడవు బొప్పాయిని పెంచారాయన. ఏడేళ్లుగా బయట కూరగాయలు కొనలేదని గర్వంగా చెప్తారు. ఆయన తోటలో సపోటా, అంజీర, నారింజ లాంటి పండ్లే కాదు ఆవాలు కూడా పండిస్తారు. ‘మిద్దెతోట’ పేరుతో తన అనుభవాలను క్రోడీకరించి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఓ పుస్తకం రాశారు రఘోత్తమరెడ్డి.

వేడీ కాలుష్యమూ తగ్గుతాయి
‘నగరాలను కాంక్రీట్‌ అరణ్యాలంటారు కదా… ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌక విధానం మిద్దెతోటల పెంపకం’ అనే రఘోత్తమరెడ్డి అందుకు కారణాలూ వివరిస్తారు. డాబాలన్నీ తోటలైతే ఎటుచూసినా హాయి గొలిపే పచ్చదనమే కన్పిస్తుందనీ, పైకప్పులన్నీ చల్లగా ఉండడం వల్ల ఇళ్లలో ఏసీల వాడకం తగ్గుతుందనీ అంటారు. కాలుష్యం తగ్గుతుంది. చల్లని శుభ్రమైన గాలి వస్తుంది. రూఫ్‌ గార్డెన్ల నిర్వహణ ఖర్చూ తక్కువే. ఒక్కసారి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందవచ్చు. రాలిన ఆకులూ అలములతోనే ఎరువు తయారవుతుంది. చేసే శ్రమ వ్యాయామం అవుతుంది.మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటలను పెంచుతున్నవారి మాటలే కాదు, అధ్యయనాలూ ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి.

అమెరికాలోని షికాగో సిటీ హాల్‌ రూఫ్‌ గార్డెన్‌కి పేరొందింది. రూఫ్‌ గార్డెన్‌ వల్ల ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడాలు ఉంటాయో పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఆ భవనంలో ప్రయోగాలు చేశారు. వారి పరిశీలనలో తేలిందేమిటంటే- రూఫ్‌ గార్డెన్‌ ఉన్న భవనానికీ లేని భవనానికీ ఉష్ణోగ్రతలో 10డిగ్రీల సెల్సియస్‌ (50 డిగ్రీల ఫారెన్‌హీట్‌) తేడా ఉందని. సాధారణంగానే పట్టణాలూ నగరాల్లో చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శివార్ల కన్నా అక్కడ 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందంటారు. అర్బన్‌ హీట్‌గా పేర్కొనే ఈ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి డాబా తోటలు బాగా పనికొస్తాయంటున్నారు నిపుణులు.

ఇలా చేయవచ్చు!
డాబా మీద తోట పెంచాలనుకునేవారు ఒక్కో మొక్కా పెట్టుకుంటూ నెమ్మదిగా పెంచుకోవచ్చు. లేదంటే ఒకేసారి అందుబాటులో ఉన్న స్థలాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తోటగా అభివృద్ధి చేసుకోవచ్చు. తోట వల్ల భవనానికి నష్టం జరగదు. ఎలాంటి డాబా అయినా తోటను మోయగల సామర్థ్యం ఉంటుంది. డాబా మీద తోటకి 8 అంగుళాల మందంలో మట్టి చాలు. భవనం బీమ్‌లను బట్టి వెడల్పుగా మడులు కట్టుకుంటే ఆ బరువు సమంగా వ్యాపిస్తుంది. మట్టిని డాబా నేల మీద నేరుగా పోయకుండా ప్లాస్టిక్‌ టబ్బుల్లో, తొట్లలో, కాంక్రీట్‌తో ప్రత్యేకంగా కట్టిన మడుల్లో పోసి మొక్కలు పెంచుతారు కాబట్టి నీరు కానీ మొక్కల వేళ్లు కానీ కప్పులోకి వెళ్లడమనేది ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తోటను కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా కట్టుకుంటే మంచిదంటారు రఘోత్తమరెడ్డి. ఆయన తోటపనిని ఒక కళలాగా సాధన చేస్తున్నారు. కుండీలకు ఎర్రరంగు వేసి ముగ్గులతో తీర్చిదిద్దుతారు. మొక్కల మధ్య టెర్రకోట బొమ్మల్ని అందంగా అలంకరిస్తారు. ఏడాదికోసారి మొక్కల వేళ్లు దెబ్బతినకుండా పైపైన మట్టిని కాస్త పెళ్లగించి తీసి ఆ మేరకు కొత్త మట్టిని చేరిస్తే చాలు, ఏడాదికి రెండు పంటలు తేలిగ్గా పండించుకోవచ్చంటున్నారు ఈ అనుభవజ్ఞులంతా.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వాలూ ఉద్యానశాఖల ద్వారా ఆసక్తిగల వారికి శిక్షణ ఇచ్చి, కిట్లనూ సరఫరా చేస్తున్నాయి.

ఇంటి మీద ఓ తోట ఉంటే…
ఉదయమే పక్షుల కిలకిలారావాలు వినవచ్చు.
లేలేత ఆకులపై మంచుబిందువుల్లో ప్రతిఫలించే తొలి కిరణాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఇక తోటపనితో ఒంటికి వ్యాయామమూ,
మనసుకు ఉల్లాసమూ లభిస్తాయి.
మొత్తం మీద మిద్దెతోటల పెంపకం ఓ ఆరోగ్యకరమైన కాలక్షేపం.
మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఓ మొక్క నాటి, రేపటి తోటకు శ్రీకారం చుట్టేయండి.

మొక్కలు నా ఆరోప్రాణం

నాకు ఊహ తెలిసినప్పటినుంచీ పూలమొక్కలు పెంచుతున్నాను. చదువై పోయి హైదరాబాద్‌ రాగానే ఉద్యోగంలో చేరాను. గది వెదుక్కున్న రెండో రోజే మొక్క తెచ్చుకుని పెట్టుకున్నా. ఎవరింటికి వెళ్లినా ఓ మొక్క ఇచ్చి రావడం నాకు అలవాటు. అద్దెఇళ్లల్లో ఉంటున్నప్పుడు కొంతమంది యజమానులు అభ్యంతరం చెప్పేవారు. అందుకని కేవలం మొక్కల కోసమే సొంతిల్లు కట్టుకున్నా. మా డాబా మీద నేను పెంచని పూలమొక్కలూ కూరగాయల మొక్కలూ లేవు. మునగ చెట్టు కాస్తే వీధిలో ఉన్న వాళ్లందరికీ పంచినా అయిపోవు. అయితే ఇక్కడ కోతుల బాధ ఎక్కువ. అందుకని మొత్తం డాబాకి సరిపోనూ ఇనుప పంజరం లాగా గ్రిల్‌ తయారుచేయించాం. అలా కోతుల నుంచి మొక్కల్ని రక్షించుకుంటున్నాం.

– పార్థసారథి, సికింద్రాబాద్‌
ఆరోగ్యానికి తోటపని

తోటపని శరీరానికీ మనసుకీ కూడా మంచి వ్యాయామం. మాకు సొంత వ్యాపారం ఉంది. రోజూ ఉదయం కాసేపు తోటపని చేస్తే ఒత్తిళ్లనుంచి విముక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో గత ఏడాదే డాబా మీద కూరగాయల సాగు ప్రారంభించాం. ఇప్పుడు నెలకి ఇరవై రోజులు మా తోటలో కాసిన కూరగాయలే వండుకుంటున్నాం. ఫేస్‌బుక్‌లో ‘ఇంటిపంట’ అనే గ్రూప్‌లో చేరాను. అక్కడే రూఫ్‌గార్డెన్‌ సంగతులన్నీ తెలుసుకున్నాను. వివిధ దేశాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్న ఈ గ్రూప్‌లో అందరూ తమ అనుభవాలనూ నైపుణ్యాలనూ పంచుకుంటారు. సలహాలూ సూచనలూ ఇచ్చిపుచ్చుకుంటారు. సిటీలోనే నాకు తెలిసిన వాళ్లు ఇంకా చాలామంది చేతనైన రీతిలో ఇంటిపంటల్ని పండిస్తున్నారు.

– గాంధీ ప్రసాద్‌, చింతల్‌, హైదరాబాద్‌
పల్లెనుంచీ వచ్చినవాళ్లం…

మొక్కలు పెంచకుండా ఉండలేం. అందుకే ఐదంతస్తుల బిల్డింగ్‌లో పెంట్‌హౌస్‌ కొనుక్కున్నాం. ఇంటి ముందున్న స్థలమంతా ముందు పూలమొక్కలు పెట్టాం. ఆ తర్వాత కూరగాయలూ పెంచుతున్నాం. ఎనిమిదేళ్లయింది. ఉల్లిపాయలు తప్ప ఇంకేమీ బయట కొనం. మునగ చెట్టు కూడా ఉంది. నిమ్మ, బత్తాయీ, సపోటా లాంటి పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నాం. వేసవిలో మా మొక్కలకు పూసిన మల్లెపూలు కోయడానికి గంట పడుతుంది. ఫ్లాట్స్‌లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే రూఫ్‌ గార్డెన్‌ వల్ల ఏ ఇబ్బందీ ఉండదు.

– నీలిమ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌
ఇది సరైన సమయం

డాబా మీద తోట ఏర్పాటుచేయాలనుకున్నవారు ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. కాకపోతే ఫిబ్రవరి నెల వాతావరణం పనులు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు నాటితే వేసవిలో వాడుకోవడానికి ఆకుకూరలూ, కూరగాయలూ చేతికందివస్తాయి. సారవంతమైన మట్టీ మాగిన పశువుల ఎరువూ చాలు మొక్కలు పెట్టుకోడానికి. మొక్కలకు పేనూ పురుగూ లాంటివి కన్పించగానే వాటిని వెంటనే చేత్తో తొలగించాలి. అదుపు తప్పిన స్థాయిలో ఉన్నదనుకుంటే కొద్దిగా వేపనూనె నీళ్లలో కలిపి చల్లితే సరిపోతుంది. తోటపనికి రోజూ ఒక అరగంట కేటాయిస్తే చాలు కాబట్టి డాబా ఉన్నవారు ఎవరైనా తోటల్ని పెంచుకోవచ్చు. సెలవు రోజు రెండు మూడు గంటలు చేసుకోవచ్చు

– రఘోత్తమరెడ్డి, నారపల్లి, రంగారెడ్డి జిల్లా
పురుగుమందులు అమ్మేవాణ్ని…

నేను పురుగుమందు వ్యాపారం చేసేవాణ్ని. ఆ మందుల్నే రైతులు కూరలపై చల్లడం చూసి తట్టుకోలేకపోయా. ఆ కూరగాయలు కొనడం మానేస్తే ఏంచేయాలని ఆలోచించి వంకాయ విత్తనాలు తెచ్చుకుని ఇంట్లో కుండీలో నాటాను. అలా మొదలైంది మా మిద్దెతోట సాగు. ఉన్న స్థలమంతా ఇల్లుకట్టేసుకోవడంతో డాబా మీదే కూరగాయలు పెంచుతున్నాం. పురుగుమందుల వ్యాపారం పూర్తిగా మానేసి పాలేకర్‌ సేంద్రియ విధానాలను అధ్యయనం చేశా. ఇప్పుడు వెయ్యి
చదరపు అడుగుల డాబా మీద నేను పండించని పంట లేదు. ఈ ప్రాంతంలో ద్రాక్ష పండదు. మా డాబామీద పండించాను. ఔషధ మొక్కలూ పెంచుతాను. కూరగాయలూ ఆకుకూరలూ మామూలే. మా తోట చూడడానికీ, నేర్చుకోడానికీ చాలామంది వస్తుంటారు.  వైజాగ్‌లోనే నాకు తెలిసి దాదాపు 200 మంది డాబాల మీద తోటల్ని పెంచుతున్నారు. బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు ఒకప్పుడు ఉండేవి. ఏ చికిత్సా తీసుకోకుండానే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి.

– కర్రి రాంబాబు, కొత్తవలస, విజయనగరం జిల్లా
మన ఇల్లూ -మన కూరగాయలూ

నగరాల్లో నివసించేవారు ఇంటివద్దే కూరగాయల్ని పెంచుకునేలా ప్రోత్సహించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరిది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన అనే పథకం కింద దీనికి ప్రభుత్వం ఆర్థికసాయమే కాకుండా అవసరమైన వస్తువులనూ అందజేస్తుంది.

సహాయం పొందడానికి అర్హతలు: కనీసం 50 – 200 చదరపు
అడుగుల మధ్య స్థలం(బాల్కనీ, ఇంటి పైకప్పు, పెరడు ఏదైనా సరే) ఉండాలి. ఆసక్తి కలవాళ్లెవరైనా తమ చిరునామా, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఉద్యానవనశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏమిస్తారంటే: ప్రస్తుతం ఉద్యానవనశాఖ రెండురకాల కిట్లను ఇస్తోంది. ఇంటికి రెండు కిట్లతో పాటు ఉచితంగా సాగులో శిక్షణ కూడా ఇస్తుంది. కిట్‌ ‘ఎ’ యూనిట్‌ ధర రూ.6 వేలు. 50శాతం సబ్సిడీ.
కిట్‌ ‘బి’ ధర రూ.1900. పెరట్లో సాగు చేయాలనుకునేవారికి మట్టి మిశ్రమం అవసరం ఉండదు కాబట్టి మరింత తక్కువ ధరకే ఈ కిట్లు లభిస్తాయి.

సిల్పాలిన్‌ కవర్లు, గ్రోబ్యాగ్స్‌, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేపపిండి, వేపనూనె, తోటపనికి అవసరమైన ఇతర పనిముట్లు… ఈ కిట్లలో ఉంటాయి.

పూర్తి సమాచారం …
http:///horticulture.tg.nic.in వెబ్‌సైట్‌లోని అర్బన్‌ ఫామింగ్‌ విభాగంలో చూడవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు ఫారం కూడా అందులోనే ఉంది.

– పద్మశ్రీ యలమంచిలి

Credits : EENADU  30th January 2018