పామాయిల్‌ హబ్‌ ఖమ్మం

 • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12,600 హెక్టార్లలో సాగు
 • ఏటా 4 వేల హెక్టార్లలో పంట విస్తరణ వ్యూహం
పామాయిల్‌ రాకతో నూనెపంటల సాగు కొత్తబాట పట్టింది. వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు వంటి పంటల ద్వారా నూనె ఉత్పత్తి అవుతున్నప్పటికీ పామాయిల్‌ పంట ద్వారా దీర్ఘకాలం పాటు అధిక దిగుబడులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాగవుతున్న పామాయిల్‌ తోటల్లో తెలంగాణలో పదిశాతానికి పైగా పామాయిల్‌ సాగు కావడం విశేషం.
పామాయిల్‌ తోటల సాగులో దేశంలోనే తెలుగురాష్ట్రాలు అగ్రగామిగా వున్నాయి. కర్నాటక, కేరళ, తమిళనాడుల్లో ఈ పంట సాగవుతున్నా దేశవ్యాప్తంగా సాగవుతున్న 1,25,000 హెక్టార్లలో 90 వేల హెక్టార్లు తెలుగు రాష్ర్టాల్లోనే ఉంది. ఇందులో తెలంగాణలో 17,000 హెక్టార్లలో పామాయిల్‌ సాగులో ఉంది. అందులో ఖమ్మంలో 3 వేల హెక్టార్లు, ఽభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9వేల హెక్టార్లు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి హెక్టార్లలో సాగు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్‌ సాగు విస్తరించింది
రాష్ట్రంలో పామాయిల్‌ పంట 1992 నుంచి సాగవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12,600 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగవుతున్నది. వీటిలో 10 వేల హెక్టార్లలో పామాయిల్‌ గెలల దిగుబడి వస్తోంది. సగటున హెక్టారుకు 6.5 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పుష్కలంగా వుండటం, సారవంతమైన నేలలు వుండటంతో పామాయిల్‌కు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంది. దీనికితోడు అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మించడంతో ఆయిల్‌పామ్‌ పంట వేగంగా పెరగటానికి అవకాశం కలిగింది. ఇటీవలే అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తోడు అదనంగా దమ్మపేట మండలం అప్పారావు పేటలో మరో ఫ్యాక్టరీని నిర్మించడంతో ఈ ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ తోటల సాగు విస్తీర్ణం పెరగటానికి తోడ్పడింది.
భలే రాయితీలు
మేలురకం పామాయిల్‌ విత్తనం అమెరికాలోని కోస్టారికాలో దొరుకుతుంది. ఆయిల్‌ఫెడ్‌ కోస్టారికా నుంచి సీడల్‌లింక్‌ను ప్రత్యేకంగా దిగుమతి చేసుకొని అశ్వారావుపేటలో ఏర్పాటుచేసిన పామాయిల్‌ నర్సరీలో ఈ విత్తనాల ద్వారా మొక్కలను పెంచి రైతులకు అందిస్తోంది. పామాయిల్‌ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అనేక రాయితీలను కల్పిస్తోంది. ఆయిల్‌ఫెడ్‌కు ఒక్కో మొక్కను పెంచడానికి రూ.91 ఖర్చవుతుంది. అయితే ఉద్యానశాఖ ఒక్కో మొక్కకు రూ.77 రాయితీని కల్పించడంతో రైతుకు ఒక్కో మొక్క కేవలం రూ.14కే దక్కుతోంది. పామాయిల్‌ పంట వేసిన రైతుకు నాలుగు సంవత్సరాల పాటు రాయితీపై ఎరువులను అందజేస్తోంది.
ఏడాదికి ఎకరానికి రూ.4వేల చొప్పున నాలుగు సంవత్సరాలలో రూ.20వేలు రాయితీ కల్పిస్తున్నారు. తోటలకు నీటిని అందించేందుకు వేసే డ్రిప్‌ ఎస్సీ, ఎస్టీ, చిన్నకారు రైతులకు 90శాతంపైన, 5 ఎకరాలు దాటిన రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ పంట వేసే రైతులకు ఆయిల్‌ఫెడ్‌ హామీతో బ్యాంకుల ద్వారా రుణ సహాయాన్ని అందిస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బందులు లేవు.
దిగుమతి సుంకంతో ఊతం
దేశీయ మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా విదేశీ నూనెలు వచ్చి పడుతుండటంతో దేశీయనూనె ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేకపోయేవారు. ఈ ప్రభావం ధరలపై పడేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 25 శాతం వరకు పెంచడంతో దేశీయ నూనెలకు ఊరట లభించింది.
Credits : Andhrajyothi

అప్పుల ఊబిలో ఈము రైతులు

తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది రైతులు ఎనిమిదేళ్లుగా ఈము పక్షుల పెంపకం చేపట్టారు. తెలంగాణలో 120 మంది రైతులు ఈము పక్షులను పెంచుతున్నారు. సుమారు రూ.13 కోట్ల వరకు బ్యాంకుల అప్పుల్లో కూరుకుపోయారు.
ఈము పక్షుల గుడ్లు, పిల్లలు కొవ్వుద్వారా వచ్చే నూనెకు మంచి డిమాండ్‌ ఉందని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రచారం చేశాయి. ఈము పక్షిపిల్ల ధర రూ. 5 వేలు, నూనె ధర కేజీ రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఉంటుందని చెప్పడంతో ఒక్కో రైతు రూ.5 లక్షలు విలువైన వంద పిల్లలను కొనుగోలు చేశారు. రెండేళ్లపాటు ఎలాంటి ఆదాయం లేకుండా వీటిని పెంచారు.
రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి ఆస్ర్టేలియా జాతికి చెందిన ఈము పక్షులను వేలంవెర్రిగా పెంచుకొన్నారు. పిల్లలు పెద్దవై గుడ్లుపెట్టి అవి కూడా పిల్లలు కూడా కావడంతో ఒక్కో యూనిట్‌లో వంద నుంచి 300 వరకు పెరిగాయి.
అయితే ఈము పక్షులను కానీ, పిల్లలను కాని, నూనెను కానీ కొనే నాథుడులేక పక్షులను పెంచే శక్తిలేక బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తీర్చే దారిలేక రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఈము పక్షులను పెంచే పరిస్థితి లేక స్థానికంగా వాటి మాంసాన్ని విక్రయించగా, మరికొందరు అడవుల్లో కూడా వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఈముపక్షుల యూనిట్లన్నీ ఖాళీ అయ్యాయి. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు భారమయ్యాయి. గత నాలుగేళ్లుగా అప్పులు తీర్చలేక రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు.
కనికరించని ప్రభుత్వం
తెలంగాణలో 120 మంది రైతులకు సుమారు రూ.13 కోట్లు, ఆంధ్రాలో 350 మంది రైతులకు రూ.84 కోట్లు రుణాలున్నాయి. ఏపీ ప్రభుత్వం వడ్డీని బ్యాంకుల ద్వారా మాఫీచేయిస్తూ అసల్లో 25 శాతం రైతులు, 25 శాతం బ్యాంకులు, 50 శాతం ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం తమ రుణాలు మాఫీచేయాలని, ఆదుకోవాలని ఈముపక్షుల పెంపకందారులు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి తమగోడు చెప్పుకొన్నా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.
ఈముపక్షుల రైతు సంఘం నాయకుడిగా ఖమ్మానికి చెందిన బొల్లేపల్లి హరిబాబు కూడా పలుసార్లు మంత్రులను కలిశారు. అయితే ఎలాంటి భరోసా లభించకపోవడంతో అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈము రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతు సంఘ నేతలు, పి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌. రమణారెడ్డి కోరుతున్నారు.
Credits : Andhrajyothi

కరువు జిల్లాకు ఖర్జూర మాధుర్యం

 • తోటల సాగులో ‘అనంత’ రైతుల ప్రయోగం
ఖర్జూరం సాగుకు మన భూములు పనికి రావనే మాట అసత్యమని నిరూపించారు అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ. కరువుసీమలో ఖర్జూరం సాగు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారాయన.
నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందిన ఎండ్లూరి వెంకటనారాయణ చాలాకాలంగా వేరుశనగ, అరటి లాంటి పంటలు వేసి బాగా చితికిపోయాడు. వెంకట నారాయణకు 120 ఎకరాలు పొలం వుంది. మిగిలిన రైతుల్లానే ఆయన కూడా వేరుశనగ సాగు చేసేవాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట సరిగా చేతికందక తీవ్రంగా నష్టపోయాడు.
వెరైటీ పంటలు సాగు చేయాలనే తపన ఆయనకు వుండేది. ఒకసారి వ్యక్తిగత పని కోసం తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లాడు. అక్కడ అమ్ముతున్న ఖర్జూరం పండ్లను కొని తిన్నాడు. వ్యాపారి ఆ పండు ధర ఎక్కువగా చెప్పాడు.
ఖర్జూరం ఇంత ధరా…. అని వెంకటనారాయణ వ్యాపారిని ప్రశ్నించాడు. ఈ పండు మన దగ్గర పండదు అందుకే ఇంత ధర అని వ్యాపారి కాస్త వెటకారంగా బదులిచ్చేసరికి ఆ రైతు గుండె చివుక్కుమంది. మనమే ఆ పంటను ఎందుకు పండించకూడదని ఆలోచించాడు. కుమారుడు సుధీర్‌తో చర్చించాడు. నాణ్యమైన ఖర్జూరం పండ్లు తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన నిజాముద్దీన్‌ అనే వ్యాపారి సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్నారు. నిజాముద్దీన్‌ ద్వారా సౌదీ అరేబియా నుంచి ఖర్జూరం మొక్కలను దిగుమతి చేసుకున్నారు.
60 ఏళ్ల పాటు దిగుబడి
సౌదీ అరేబియా నుంచి తమిళనాడుకు చేరేసరికి ఒక్కో ఖర్జూరం మొక్క ఖరీదు రూ. 3,500 పడింది. నాలుగేళ్ళ క్రితం తమిళనాడులోని నిజాముద్దీన్‌ అనే వ్యాపారి ద్వారా మధురమైన రుచికలిగిన బర్హీ అనే ఖర్జూరం రకం మొక్కలను తెచ్చుకుని సాగు ప్రారంభించారు వెంకటనారాయణ. మూడు ఎకరాల భూమిని ఖర్జూరం సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో 210 మొక్కలు నాటాడు. సౌదీలో ఉన్న మన ప్రాంతం వారి ద్వారా ఖర్జూరం సాగు మెళుకువలు తెలుసుకున్నాడు. మొక్క కాపు మొదలైనప్పటి నుంచి 60 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెంకటనారాయణ జిల్లాలో ఇప్పుడు సాటి రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ పలువురు రైతులు ఖర్జూరం సాగు ప్రారంభించడం విశేషం.
విస్తరిస్తున్న ఖర్జూరం సాగు
శింగనమల, మడకశిర, కణేకల్లు తదితర మండలాల్లో రైతులు ఖర్జూరం పంటను సాగు చేస్తున్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఖర్జూరం పంటకు నీరు తక్కువగా వాడాలి. అనంతపురం జిల్లా వాతావరణానికి ఖర్జూరం బాగా సరిపోతుంది. ఖర్జూరం మొక్కను నాలుగేళ్ళు బతికించుకుంటే ఆ తరువాత ఏటా ఎకరాకు రూ.లక్ష మించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వుండదు. ఖర్జూరం పంటకు పేడ ఎరువులు, డిఏపీ, పొటాష్‌, విటమిన్స్‌ లాంటి ఎరువులు వాడాలి. వర్షాకాలంలో పురుగు నివారణకు సైబర్‌మెటిన్‌ అనే మందులు స్ర్పే చేయాలి.
– సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, అనంతపురం
 
అప్పుడు హేళన..ఇప్పుడు ఆశ్చర్యం
ఖర్జూరం సాగు ప్రారంభించినప్పుడు సాటి రైతులు నన్ను హేళన చేశారు. మన దగ్గర ఖర్జూరం పండదంటే పండదన్నారు. మూడు ఎకరాల ఖర్జూరం తోట నుంచి గత ఏడాది జూన్‌లో 16 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.1.50 లక్షలతో తమిళనాడు, అనంతపురం, కోయంబత్తూరు, అభినాష్‌ మార్కెట్లలో విక్రయించాం. నాకు వస్తున్న లాభాలు చూసి, రైతులు ఇప్పుడు నన్ను సలహాలడుగుతున్నారు. కొత్తగా ఖర్జూరం సాగు చేయడం వల్ల మార్కెట్ల గురించి తెలియక, పంట కోతలు తెలియక సుమారు రూ.10లక్షలు నష్టపోయాం. భవిష్యత్తులో మరిన్ని లాభాలు ఆర్జిస్తామనే నమ్మకం వుంది.
– ఎండ్లూరి వెంకటనారాయణ, రైతు
Credits : Andhrajyothi

స్మార్ట్‌ సేద్యం..రైతుకు లాభం

దేశంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి జరిగినా వ్యవసాయం రంగం మాత్రం అభిలషణీయమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. యువత వ్యవసాయానికి దూరం కావడానికి ఇదే ప్రధాన కారణం. సేద్యానికి సంబంధించిన అన్ని రంగాలను సమన్వయం చేయాలి. చిన్నరైతుల ఆదాయం పెంచే దిశగా కృషి జరగాలి. దాంతో పాటు రైతులు స్మార్ట్‌ సేద్యం చేసినప్పుడే దేశం పురోగమిస్తుందంటున్నారు హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, యాజమాన్య సంస్థ (మేనేజ్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వి. ఉషారాణి.
వ్యవసాయానికి దూరం అవుతున్న రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాలంటే ఏం చేయాలి?
వ్యవసాయం బతకాలంటే రైతుల ఆదాయం పెరగాలి. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం కాదు. ఏ పంటను ఏ కాలంలో, ఎంత తక్కువ ఖర్చులో పండించాలనే ప్రణాళిక వుండాలి. పండిన పంటకు అధిక ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలి. వ్యవసాయం పనులు ఏడాది అంతా వుండవు కాబట్టి మిగిలిన రోజుల్లో చిన్నపాటి వ్యవసాయ ఆధారిత వాణిజ్యంపై దృష్టి సారించాలి. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. యువత కూడా క్రమంగా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తుంది. ఆదాయం పెరగడంతో పట్టణాలకు వలస తగ్గి పల్లెలు మళ్లీ కళకళలాడతాయి.
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ‘మేనేజ్‌’ ఎలాంటి చర్యలు చేపడుతున్నది?
వ్యవసాయ రంగ సమగ్ర వికాసం మేనేజ్‌ లక్ష్యం. రైతుల సంక్షేమం కోసం కృషి చేసే నిపుణులకు శిక్షణ ఇవ్వడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా రైతుల్ని బలోపేతం చేస్తున్నాం. 20 ఏళ్లుగా అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు నిర్వహిస్తూ దేశానికి నిపుణులైన అగ్రి మేనేజర్లను అందిస్తున్నాం. వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గ్రామీణ యువతకు అగ్రి క్లినిక్స్‌ పేరిట 13 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55 వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చాం. వారిలో 20 వేల మందికి పైగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయ ఆధారిత రంగ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. గిడ్డంగుల నిర్వహణపై యువతకు త్వరలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సప్లయ్‌ ఛైన్‌ మేనేజ్‌మెంట్‌పై సర్టిఫికెట్‌ కోర్సు తలపెట్టాం. రైతులు ఏ పంటను ఎప్పుడు పండించాలనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా వున్న వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వద్ద వున్న సమాచారాన్ని క్రోడీకరించి నాలెడ్జ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్ల ద్వారా రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి సారించేలా పనిచేస్తున్నాం.
రైతులు ఏ వ్యవసాయ అనుబంధ వాణిజ్యం చేయాలంటారు?
ఏడాదంతా పొలం పనులు వుండవు. కొన్నాళ్లు పనిచేసి, మిగిలిన రోజులు ఖాళీగా వుండటం వల్ల రైతులకు ఆదాయ భద్రత లేకుండా పోతున్నది. అందుకే రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి పెట్టాలి. తేనె, కొబ్బరినూనె తయారీ, చిరుధాన్యాలతో ఫ్లేక్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించడం, పచ్చళ్లు, ప్యాకింగ్‌ వంటి వందలాది వ్యవసాయ అనుబంధ పనులపై రైతులు దృష్టి సారించాలి. వీటి ద్వారా నామమాత్ర పెట్టుబడితో రైతులు అదనపు ఆదాయం పొందుతారు. ఎగుమతులు చేసేందుకు వీలుగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు తిరుగే వుండదు.
వ్యవసాయరంగ విస్తరణ విషయంలో మిగిలిన దేశాల అనుభవాల గురించి చెబుతారా?
అభివృద్ధి చెందిన దేశాల్లో రైతు డిమాండ్‌ ఆధారంగా పంటలు పండిస్తాడు. రైతు పండించే పంటను మార్కెట్‌ ముందే సిద్ధంగా వుంటుంది. మన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఈ ఏడాది ఏ పంట పండిస్తే లాభదాయకమో రైతుకు తెలియదు. పండించిన పంటకు ఎంత ధర వస్తుందో అసలే తెలియదు. మంచి ధర రానప్పుడు సరుకును గిడ్డంగుల్లో నిల్వ చేద్దామన్నా అవకాశం వుండదు.
దేశంలో వ్యవసాయానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ అనుసంధానం చేసినప్పుడే రైతుకు లబ్ధి చేకూరుతుంది. పండించిన పంట రైతు నుంచి కొనుగోలుదారుకు చేరే వరకు పటిష్ఠమైన వ్యవస్థ వుండాలి. అమెరికాలో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసే ఔత్సాహికుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. మనం మాత్రం బ్రాండ్ల మోజులో అంకుర సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన ఉత్పత్తులను కూడా పట్టించుకోం.
 
వ్యవసాయంపై రైతు దృక్పథంలో మార్పు రావాలంటారా?
ఖచ్చితంగా. కేవలం సాగుకు మాత్రమే పరిమితం కాకుండా రైతులు కాస్త సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు గమనించాలి. నాణ్యమైన ఉత్పత్తుల్ని ఇప్పుడు దేశంలో ఎక్కడైనా మంచి ధరకు విక్రయించుకునే వీలుంది. ఇలాంటి ఆధునిక సమాచారాన్ని రైతులు తెలుసుకోవాలి. అప్పుడే అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి సాధిస్తుంది.
Credits : Andhrajyothi

ఇందూరు పసుపు సోయగం

 • ఏటా రూ. 700 కోట్ల టర్నోవర్‌
 • పసుపు బోర్డు ఏర్పాటుపై మీనమేషాలు
 • ప్రారంభం కాని పసుపు పార్క్‌ పనులు
నాణ్యమైన పసుపు పంటకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిజామాబాద్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఏటా 600 నుంచి 700 కోట్ల రూపాయల టర్నోవర్‌ జరిగే ఈ మార్కెట్‌ రైతులకు వరప్రదాయిని. పసుపు దిగుబడి బాగా వస్తున్నా ఈ పంటకు కేంద్రం మద్దతు ధర నిర్ణయించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
తెలంగాణ జిల్లాలో నిజామాబాద్‌లో అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగవుతున్నది. ఏటా పసుపు సాగు విస్తీర్ణం పెరగడంతో నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌కు పంట పోటెత్తుతున్నది. ఈ మార్కెట్‌లో ఏటా రూ.600 నుంచి 700 కోట్ల రూపాయల టర్నోవర్‌ జరుగుతోంది. ఏటా సాగు విస్తీర్ణం పెరిగి, దిగుబడులు పెరుగుతున్నా లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడం, కేంద్ర ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర నిర్ణయించకపోవడం వల్ల రైతులు మార్కెట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో గత సంవత్సరం 30వేల ఎకరాల్లో పసుపు సాగు అయ్యింది. ఇక్కడి మార్కెట్‌లో 9లక్షల 75వేల క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరిగాయి. వీటితో పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు మరో రెండు లక్షల క్వింటాళ్ల వరకు తరలించారు.
గత ఏడాది నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.6,000 – 8,500 మధ్య కొనుగోలు చేశారు. ఒక దశలో 4,500 రూపాయలకు కూడా ధర పడిపోయింది. సమస్యలు ఎదురైనా పసుపు సాగులో ఆదాయ భద్రత వుండటంతో రైతులు పసుపు వైపే మొగ్గు చూపుతున్నారు. భారీ టర్నోవర్‌ జరుగుతున్నా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. పైగా సుగంధ ద్రవ్యం కింద ఉన్న పసుపునకు మద్దతు ధరను ప్రకటించడం లేదు. ఈ మార్కెట్‌లో కూడా ఈ-నామ్‌ పద్ధతిని ప్రవేశపెట్టినా ఏ రాష్ట్రం నుంచి కూడా స్పందన రావడం లేదు. ఫలితంగా స్థానిక వ్యాపారులు తమకు తోచిన ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే జిల్లాలో పసుపుపార్క్‌ ఏర్పాటుపై జీవో జారీ చేసింది. అందుకోసం 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. పసుపు పార్క్‌కు అవసరమైన భూమిని వేల్పూర్‌ మండలం పడకల్‌లో సిద్ధం చేశారు. జిల్లాలో ఎక్కువగా ఎర్రగుంటూరు, ఆర్మూర్‌, ప్రతిభ, ఏసీసీ79 రకాలను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న తీసివేయగానే పసుపును కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో పసుపును తవ్వి తీస్తారు. ప్రతీ రైతు పసుపు సాగుపై ఎకరాకు రూ.30 నుంచి 50వేల వరకు ఖర్చు చేస్తున్నారు. తొమ్మిదినెలల పాటు సాగు చేశాక, పండిన పసుపును తవ్వితీసి దానిని ప్రత్యేక పద్ధతులలో ఉడికిస్తారు. ఆ తర్వాత 12 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత మార్కెట్‌లో విక్రయిస్తారు.
ఈ-నామ్‌లో జాతీయ అవార్డు
ఈ ఏడాది నిజామాబాద్‌ ప్రాంతంలో గత ఏడాది కంటే ఎక్కువగా సుమారు 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. జిల్లాతో పాటు జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో కూడా భారీగా పసుపు సాగవుతున్నది. ఈ సంవత్సరం మార్కెట్‌కు మరింత ఎక్కువగా పసుపు వచ్చే అవకాశం ఉంది. ‘నిజామాబాద్‌ మార్కెట్‌కు ఈ-నామ్‌ అమల్లో జాతీయ అవార్డు లభించింది. మహారాష్ట్రలో మాదిరిగా పసుపు పంటకు మెరుగైన ధర వచ్చే విధంగా మార్కెట్‌లో చర్యలు చేపడుతున్నాం’ అని మార్కెటింగ్‌ శాఖ ఏడీ రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు.
వ్యాపారుల ఇష్టారాజ్యం
పసుపు మార్కెటింగ్‌ రైతుకు భారంగా మారుతున్నది. వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. మద్దతు ధర ప్రకటిస్తే పసుపు రైతు బాగుపడతాడు.
– బద్దం గంగాధర్‌, వేల్పూర్‌
పసుపు పార్క్‌ ప్రారంభించాలి
పసుపు బోర్డు ఏర్పాటు చేయక పోవడంతో మాకేవీ ప్రోత్సాహకాలు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తక్షణం పసుపు పార్క్‌ ఏర్పాటు చేయాలి.
– వన్నెల భూమన్న, పచ్చల నడ్కుడ
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ని
Credits : Andhrajyothi

కూరగాయల హబ్‌.. యాదాద్రి!

వర్షాభావ పరిస్థితులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు… వేలు, లక్షల ఖర్చుతో పాతాళం లోతు బోర్లు… అయినా పోస్తూ.. పోస్తూ ఆగిపోతున్న జలధారలు. దశాబ్దాలుగా వరి, ప్రత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను నమ్ముకున్న రైతుల దుస్థితి ఇది. దీంతో పీకల దాకా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు నిత్యం ఆదాయం అందించే కూరగాయల సాగువైపు మళ్లుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు కూరగాయలు.. ఆకు కూరలు సాగుచేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేలలో ఖర్చు, భరోసా లేని రాబడి వున్న వరి సాగుతో విసిగిపోయిన ఆ మండలాల రైతులు కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తూ నిత్యం డబ్బు ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌ నగర సమీప యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కొంతకాలంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్నది. జిల్లాలోని బొమ్మల రామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో వరుసగా నాలుగేళ్ల్లుగా కరువుఛాయలే అలుముకుంటున్నాయి. అయినా ఇక్కడి రైతులు చాలాకాలంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే వరినే సాగు చేస్తున్నారు.
వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో వేలు, లక్షలు పెట్టి బోర్లు వేస్తున్నారు. వాటిలో కూడా నీరు రాక, పంట చేతికి రాక భారీగా నష్టపోతన్నారు. దీంతో కొందరు రైతులు హైదరాబాద్‌ నగరం, భువనగిరి జిల్లా కేంద్రాల్లో ప్రజలకు నిత్యావరసమైన కూరగాయలు.. ఆకు కూరల సాగు మెరుగ్గా వుంటుందని ఆలోచించారు. వీరంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. పెట్టుబడి.. రోజు ఆదాయం .. చేరువలో మార్కెటింగ్‌ సదుపాయం గల కూరగాయలను ఒకరి తర్వాత.. ఒకరు.. ఓ గ్రామం.. తర్వాత మరో గ్రామం.. సాగు చేస్తూ ఏకంగా కొన్ని మండలాలకు మండలాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ కళకళలాడుతున్నాయి.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 నుంచి 5 వేల ఎకరాల వరకు కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఈ రైతులే ఆదర్శంగా జిల్లాలోని నగరానికి సమీపంలోగల బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు జిల్లానే కూరగాయల హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్‌ జిల్లాకు సరిహద్దులో.. ఈసీఐఎల్‌, కుశాయిగూడ, బోయిన్‌పల్లి మార్కెట్‌కు కూతవేటు దూరంలో వున్న బొమ్మల రామారం మండలంలోని దాదాపు పది పదిహేను గ్రామాలతో పాటు తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లోని మరో పాతిక గ్రామాల రైతులు కూరగాయల సాగునే ఎంచుకున్నారు.. వరిసాగును వదిలేసి కూరగాయలు, ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టారు.
 
ఆ.. ఊరంతా.. ఆకు కూరల సాగే
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చౌదరిపల్లి గ్రామంలో దాదాపు 2వేల జనాభా ఉంది. గ్రామంలో గల రైతులు కుటుంబాలు పూర్తిగా ఆకుకూరలనే సాగు చేస్తున్నారు. ఎకరం, రెండు ఎకరాలు మొదలు నాలుగు ఎకరాల వరకు ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని రోజు భువనగిరి, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించి విక్రయిస్తుంటారు.
ఆకుకూరలను సీజన్‌ను బట్టి సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.  కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ఇచ్చే రాయితీలు మాత్రం తమకు అందడం లేదని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వారంతా చిన్న, సన్నకారు రైతులే. కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మరింత భరోసా వుంటుందని రైతులు కోరుతున్నారు.
రోజుకు వెయ్యిదాకా ఆదాయం
నాకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేసినన్నాళ్లూ పైసా మిగిలేది కాదు. పైగా అప్పులు. ప్రస్తు తం ఎకరం పొలంలో పాలకూర, కోతిమీరు సాగు చేస్తున్నాను. మార్కెట్‌లో అమ్ముకుంటే రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తున్నాయి.
– ఆకుల శోభ, చౌదర్‌పల్లి, బొమ్మల రామారం
కూరల సాగే మేలు
సోలిపేటలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాను ఎకరంన్నర భూమిలో టమాట సాగు చేసి.. రోజుకు 15 నుంచి 20 బాక్కులను మార్కెట్‌కు పంపిస్తున్నాను. రూ.5వేల వరకు ఆదాయం వస్తున్నది.
– బానోతు స్వామి, సోలిపేట, బొమ్మల రామారం
వరి ఎండింది.. తోట కూర పండింది..
ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో కూరగాయలు సాగు చేశాను. వరి ఎండిపోయింది. కూరగాయలు బాగా పండాయి. ఆ డబ్బుతోనే బతుకుతున్నాం. కూరగాయల రైతులను ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోవాలి.
– ఎనగండ్ల రాజప్ప, బొమ్మల రామారం
కూరగాయల సాగే గిట్టుబాటు
ఎనిమిది ఎకరాల్లో గతంలో వరి సాగు చేసి నష్టపోయాను. ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో వంగ సాగు చేస్తున్నాను. మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూరగాయల సాగు అభివృద్ధికి విత్తనాలు, రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి.
– ఎడ్ల నరేష్ రెడ్డి, పాముకుంట, రాజాపేట
Credits : Andhrajyothi

మల్లెల సాగు.. లాభాల గుభాళింపు 

 • మంగళగిరి మండలంలో 400 ఎకరాల్లో సాగు.. ఎకరాకు 2 లక్షల ఆదాయం
 • హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్‌కు నిత్యం ఎగుమతులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతిచేరువలో ఉన్న పెదవడ్లపూడి గ్రామం నారింజతోటలు, కరివేపాకు సాగుతోపాటు మల్లెతోటలకూ పెట్టింది పేరు. పెదవడ్లపూడితో పాటు నిడమర్రు, బేతపూడి గ్రామాల్లోనూ మల్లెలు హెచ్చు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వేసవి వస్తే చాలు…మంగళగిరి మండలంలోని ఈ మూడు పల్లెలు మల్లెల పరిమళంతో గుభాళిస్తూ ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె తోటలు సాగవుతున్నాయి. ఇక్కడ సాగయిన మల్లెలు నేరుగా హైదరాబాదుకు నిత్యం రెండు టన్నుల వరకు ఎగుమతి అవుతాయి. విజయవాడ మార్కెట్‌ నుంచి విశాఖ, హైదరాబాదుకు మరో ఐదారు టన్నుల వరకు ఎగుమతి అవుతున్నాయి.
 

పండుగలు, పెళ్లిళ్ల వేళ.. మంచి ధర 

మిగిలిన పైర్లకు, మల్లె సాగుకు ఎంతో వ్యత్యాసం ఉంది. మార్కెట్‌లో మల్లె ధరకు నిలకడ ఉండదు. రోజుకో ధర పలుకుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సందర్భాలలో పూలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీంతో ధర అమాంతం పెరుగుతుంది. ముహూర్తాలు లేకున్నా, పండుగలు, పబ్బాలు తక్కువగా ఉన్నా ధరలు దారుణంగా పడిపోతాయి. దీనికితోడు వాతావరణం కూడా మల్లెల దిగుబడిని ప్రభావితం చేస్తుంటుంది. మల్లె రైతు మోము కళకళలాడాలంటే ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండాలి. సాధారణంగా మల్లెలు బహుళ వార్షిక గుల్మాలు. ఒక్కసారి మల్లె అంట్లు వేస్తే… మూడో ఏట నుంచి మాత్రమే పెట్టుబడి సరిపడా పూలు కోతలు వస్తాయి. మూడో ఏడు దాటిన తోటలకు ఎకరాకు రూ.75 వేల వంతున తీసుకుని యజమానులు తోటలు కౌలుకు ఇస్తారు. చీడపీడల నివారణ, కోత కూలీ ఖర్చులు ఎకరాకు రూ.లక్షన్నర పైచిలుకు ఉంటాయి. వడ్లపూడి ప్రాంత రైతులు మల్లెలతోపాటు కనకాంబరం, సీజన్ల వారీగా వచ్చే బంతి, చామంతి, లిల్లీ పూలను పండిస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు.

కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్న సాగు
నిడమర్రు, బేతపూడి గ్రామాల రైతులు తమ పూలను స్కూటర్లు, బైకులపై నేరుగా విజయవాడ పూల మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఈ రెండు గ్రామాల నుంచి విజయవాడకు నిత్యం ఏడు టన్నులకు పైగా పూలు వెళుతుంటాయి. ప్రస్తుతం పెదవడ్లపూడి మల్లె సాగు మైలవరం ప్రాంత రైతులను కూడా ఆకట్టుకుంది. దీంతో మైలవరం, ఆ పొరుగునే ఉన్న చండ్రగూడెం గ్రామాల్లో కూడా ఇంచుమించు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా నిత్యం విజయవాడ మార్కెట్‌కు మల్లెలు వస్తున్నాయి. సాధారణంగా ఒకింత ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలు మల్లె కంతులు విరివిగా వచ్చేందుకు దోహదపడతాయి. ఇందుకు 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరమని రైతులు చెబుతున్నారు. 30 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు వుంటే వాతావరణంలోని తేమ, మంచుకు కంతులు సరిగా రావని రైతులు చెబుతున్నారు. అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే పూలు బాగా మెత్తబడి నాణ్యతను కోల్పోతాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజనలో కిలో మల్లె ధర వంద రూపాయలు దాటిపోతుందని కమీషన్‌ వ్యాపారి అన్నం వీరాంజనేయులు తెలిపారు. మల్లె ధరలు కనిష్టంగా కిలో రూ.పది నుంచి గరిష్టంగా రూ.రెండొందల వరకు వెళుతుంటుందని ఆయన చెప్పారు.

Credits : Andhrajyothi

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుకు భరోసా

 • తూ.గో. .జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు
ఉపాధిహామీ దెబ్బతో కూలీల కొరత, కోతుల బెడద వంటి అనేక కారణాలతో జిల్లాలో మెట్టప్రాంతంలో పత్తి, మిర్చి వంటి కొన్ని పంటల సాగు అసాధ్యంగా మారింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వందలాది మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌ సాగు బాగా సులభంగా ఉంటుంది. మొక్కనాటిన మూడేళ్లకు గెలలు వస్తాయి. మొదట్లో గెలలను తొలి దశలోనే తుంచివేస్తారు. తర్వాత వచ్చే గెలలను ఫ్యాక్టరీకి తరలించి విక్రయిస్తారు. నాలుగు, ఐదేళ్ల నుంచి తోట ఫలసాయం వస్తుంది. తోట నాటిన ఏడేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు.. అంటే ఎనిమిదేళ్లపాటు అధిక దిగుబడి వస్తుంది. మొత్తం 25 ఏళ్ల వయసు వరకు ఆయిల్‌పామ్‌ లాభసాటి దిగుబడి ఇస్తుంది. ఎరువులు, మొక్కల సబ్సిడీ కలిపి హెక్టారుకి రూ 26 వేల వరకు ప్రభుత్వం నుంచి రైతుకు సబ్సిడీ రూపంలో అందుతోంది. ఇది కాకుండా డ్రిప్‌ ఇరిగేషన్‌కు 5 ఎకరాలలోపు రైతులకు 90 శాతం, 10 ఎకరాల వరకు 70 శాతం, ఆపై ఎన్ని ఎకరాలున్నా 50 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇస్తున్నారు. సాగు ఖర్చు తక్కువగా ఉండటం, సబ్సిడీలు ఎక్కువగా రావడం, కూలీల అవసరం పెద్దగా లేకపోవడంతో ఆయిల్‌ పామ్‌ ఈ ప్రాంత రైతుల పాలిట వరంగా మారింది.

సులభ సాగు పద్దతులు
కొబ్బరి ఇతర పంటలతో పోలిస్తే దొంగల భయం ఉండని పంట ఇది. అలాగే పక్షులు, పశువులు కూడా ఆయిల్‌పామ్‌ గెలల జోలికి వెళ్లవు. దీంతో ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, గండేపల్లి, రంగంపేట, జగ్గంపేట, పెద్దాపురం, బిక్కవోలు, తుని రూరల్‌, రౌతులపూడి, శంఖవరం తదితర మండలాల పరిధిలో ఆయిల్‌పామ్‌ తోటలు అధికంగా సాగుచేస్తున్నారు. యాజమాన్య పద్దతులు సక్రమంగా పాటించే రైతులకు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌ ధర టన్నుకి రూ 8,150 ఉంది. ఎ.కరాకు రూ 80 వేల ఆదాయం వస్తే.. అందులో రూ 25 నుంచి రూ 30 వేల వరకు పెట్టుబడిపోతుంది. సొంత రైతుకు రూ 50 వేల వరకు మిగులుతున్నది. రూ 25 వేల వరకు కౌలుకి తీసివేస్తే.. మరో రూ 25 వేల వరకు కౌలు రైతుకు మిగులుతుంది.

– ఆంధ్రజ్యోతి ప్రతినిధి – కాకినాడ
ఎకరాకు పది టన్నుల దిగుబడి
ఐదెకరాల ఆయిల్‌ పామ్‌ తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఏటా 50 టన్నులకు పైగా దిగుబడి వస్తున్నది. ఈ ఏడాది 55 నుంచి 58 టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నాను. డ్రిప్‌ పద్ధతిలో నీరు అందిస్తున్నాను. ఎరువులు సక్రమంగా అందిస్తే ఎకరాకు పది టన్నుల దిగుబడి సాధించడం కష్టం ఏమీ కాదు. రంగంపేట, గండేపల్లి మండలాలలో ఎకరాకు పదిటన్నులకుపైగా దిగుబడి సాధిస్తున్న రైతులు అనేకమంది ఉన్నారు.
– కూసి వెంకట రమణ, గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ఆయిల్‌పామ్‌ రైతు.
Credits : Andhrajyothi

ఆధునిక సేద్యం… లాభాల పర్వం 

వ్యవసాయమంటే అతికష్టమనే భావన. అంతంత మాత్రం నీటివసతి. అత్యల్ప వర్షపాతంగల నేలలో పట్టుదల, స్వీయ పర్యవేక్షణతో లాభాలు పండిస్తున్నారు పడమటి పావని. సంప్రదాయ పంటల సాగుతో ప్రయోజనం లేదని తెలుసుకుని పౌలీహౌజ్‌, సూక్ష్మసేద్యంవంటి ఆధునిక పద్ధతుల్లో బర్బరా పూలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా పాడి, కోళ్లద్వారా మంచి ఆదాయం గడిస్తున్న మహిళారైతు విజయగాథ ఇది.

కరువు నేలలో లాభసాటి వ్యవసాయం 

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రాంతంలో నివసిస్తున్న పడమటి పావని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అవుషాపూర్‌. కుటుంబ వ్యవసాయ భూములు భూ సేకరణలో పోగా ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో బొమ్మల రామారం మండలం మర్యాలవద్ద 20 ఎకరా లు కొనుగోలుచేశారు. భర్త వెంకటరెడ్డి వ్యాపారంలో ఉండగా ముగ్గురు పిల్లలను చూసుకోవడంలో ఆమెకూ తీరికలేనందున ఆ భూమి నిరుపయోగంగా ఉండిపోయింది. విద్యావంతురాలైన పావని కొంతకాలం తర్వాత ఆ భూమిని సాగుచేయాలని భావించి, 2005లో బావి తవ్వించారు. మూడు బోర్లతో సంప్రదాయ పద్ధతుల్లో వరి, చెరుకు, మొక్కజొన్న వేస్తూ వచ్చారు. కానీ, నీరు చాలక పంటలు సరిగా పండకపోవడంతో ఆలోచనలో పడ్డారు.

పూల సాగుతో సిరులు
ఉద్యానశాఖ అందిస్తున్న పాలీహౌజ్‌ వ్యవసాయ పద్ధతిని గమనించిన ఆమె 2010లో అటువైపు మొగ్గుచూపి 50 శాతం రాయితీతో ఎకరమున్నరలో పాలీహౌజ్‌ నిర్మాణం చేపట్టారు. తమ వాటాగా రూ.42 లక్షల పెట్టుబడి పెట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అలంకరణలకు వినియోగించే పూల పెంపకం ప్రారంభించారు. నీటి కరువు రాకుండా వర్షపు నీటిని వ్యవసాయ బావిలోకి మళ్లించారు. మూడు బోర్లవద్ద ఇంకుడు గుంతలు తవ్వించారు. దీంతోపాటు సూక్ష్మ, బిందు సేద్యం వల్ల నీటి సమస్య తీరింది. దీనికి అనుబంధంగా 40ఆవులతో డెయిరీ నిర్వహిస్తూ వాటి మూత్రం, పేడను సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. దేశవాళీ కోళ్ల పెంపకం సైతం చేపట్టారు. పాలీహౌజ్‌లో ఐదు రంగులలో బర్బరా పూలను సాగుచేస్తూ రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాలకూ రవాణా చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలోని గడ్డిఅన్నారంతోపాటు ఢిల్లీ, బెంగుళూరు, చైన్నె, విజయవాడ లకు పూలు రవాణాచేస్తూ లాభాలు గడిస్తున్నారు. పూల సాగుద్వారా ఎకరాకు సగటున నెలకు రూ.లక్షదాకా ఆర్జిస్తున్నారామె. ఆధునిక పద్ధతులతో సాగుచేసే అలంకరణ పూల రకాలలో ఆదరణ ఉన్న వెరైటీలను ఎంచుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టుదల.. స్వీయ పర్యవేక్షణతోపాటు ఎటువంటి పూలకు, ఎటువంటి కూరగాయలకు గిరాకీ ఉందో నిరంతరం గమనిస్తూ లాభాల దిశగా పయనిస్తున్నారు ఆదర్శ మహిళా రైతు పావని.

– ఆంధ్రజ్యోతి, భువనగిరి

స్వీయపర్యవేక్షణతో సిరులు 

ఆధునిక పద్ధతులతో తప్పక లాభాలు వస్తాయి. నీటివసతితో చింత లేదు. ఎరువులూ ఎక్కువగా వాడన క్కర్లేదు. లక్షల పెట్టుబడితో కూడిన పాలీహౌజ్‌ సేద్యం స్వీయ పర్యవేక్షణలో చేసుకోవాలి. ఎప్పుడు ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టాలో స్వయంగా చూసుకోవాలి. ఉద్యానశాఖ రాయితీ ఇస్తుంది. నర్సరీలు మెలకువలు నేర్పుతాయి. పాలీహౌజ్‌ చేపట్టే రైతులు మార్కెట్‌ను గమనిస్తూ సాగుచేస్తే లాభాల పంట పండుతుంది.
Credits : Andhrajyothi

పప్పుధాన్యాల సాగు బహుబాగు! 

 • భూసార పరీక్షలద్వారా రైతులు నేల స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆ ఫలితం ఆధారంగా పంటల సాగు చేపట్టి, అవసరమైన ఎరువులను సరైన మోతాదులో మాత్రమే వేయాలి. 
 • – కిరణ్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త 
నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు మాగాణి భూముల్లో వరి సాగుకు అనుకూలమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఎన.వి.నాయుడు తెలిపారు. అలాగే గోదావరి జిల్లాల్లో వచ్చే వారం నుంచి వెద పద్ధతిలో వరి సాగు చేపట్టవచ్చని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో అపరాలు, చిరు ధాన్యాలు, పచ్చి రొట్ట పైర్ల సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశలో మే నెల సాధారణ వర్షపాతం 68.9 మిల్లీమీటర్లు కాగా 93.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. అలాగే ఈ నెల తొలి పక్షంలోనూ సాధారణ వర్షపాతం 44మిల్లీమీటర్లకుగాను 58.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు కింది సూచనల మేరకు పంటలు వేసుకోవచ్చు.

 • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మా గాణుల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తుకోవచ్చు. మెట్టలో వేరుశనగ, మొ క్కజొన్న, జొన్న, సజ్జ, రాగు, కంది, మినుము, పెసర వేసుకోవచ్చు. ఎత్తయి న గిరిజన మండలం పోడుసాగు, మి శ్రమ పంటలకు అనుకూలం. వేరుశనగ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, చెర కు సాగు చేయవచ్చు.
 •  ఉభయగోదావరి జిల్లాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు. మూడోవారం వెదపద్ధతిలో వరి విత్తడానికి అనుకూలం. చిరుధాన్యాలు, అపరా లు, మొక్కజొన్న సాగు చేపట్టవచ్చు.
 •  కృష్ణా, గుంటూరు, ప్రకాశం మాగాణుల్లో ఖరీఫ్‌ వరికి ముందు పచ్చిరొట్ట వేసుకోవచ్చు. సాగర్‌ ఆయకట్టులో నువ్వు, పెసర వంటి పైర్లు వేసుకోవచ్చు.
 •  మెట్టప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో అపరాలకు పరిస్థితి అనుకూలంగా ఉంది.
 •  ఎరుపు, తేలికపాటి నేలల్లో అపరాలు, చిరుధాన్యాలతోపాటు కందిలో అంతరపంటలు వేయొచ్చు.
 •  నెల్లూరు, చిత్తూరు, కడప మెట్టభూముల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, మినుము, కంది, నువ్వు వేయవచ్చు. నెల్లూరు జిల్లా మాగాణి వరినాట్లు, పచ్చిరొట్టకు అనుకూలం.
 •  కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదంతోపాటు మినుము, కంది, నువ్వు విత్తుకోవచ్చు.

ఖరీ్‌ఫ అనుకూల వరి వంగడాలు 
కృష్ణా, గుంటూరు, ప్రకాశంలలో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, దీప్తి, బాపట్ల సన్నాలు, ఇంద్ర, శ్రీరంగ, నెల్లూరు9674, స్వర్ణముఖి, అక్షయ, నెల్లూరు సోనా, భావపురి సన్నాలు. గోదావరి జిల్లాల్లో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, గోదావరి, తొలకరి, ఇంద్ర, అమర, అక్షయ, నెల్లూరు సోనా; ఉత్తరకోస్తాలో శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, విజేత, వంశధార; నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సింహపురి, తిక్కన, సావిత్రి, శ్రీరంగ, నెల్లూరు9674, పార్థివ, నెల్లూరు సోనా; కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాంబమసూరి, సోనామసూరి, దీప్తి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోనా, నెల్లూరు మసూరి; గిరిజన ప్రాంతాల్లో శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, విజేత, నెల్లూరు మసూరి, సుగంధసాంబ, జగిత్యాల సన్నాలు.

 •  మొక్కజొన్న.. డీహెచఎం 111, 113, 115, 117, 119, 121 రకాలు.
 •  సజ్జ.. హెచహెచబీ67, ఐసీఎంహెచ356, ఆర్‌ హెచబీ121, ఐసీటీపీ8203, 221, ఐహెచబీ3.
 •  రాగులు.. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య.
 •  కంది.. ఎల్‌ఆర్‌జీ41, ఎల్‌ఆర్‌జీ52, ఆశ, మారు తి, ఐసీపీఎల్‌ 85063, పీఆర్‌జీ158, పీఆర్‌జీ176.
 •  మినుము.. ఎల్‌బీజీ 752, ఎల్‌బీజీ 20, టీ 9, పీయూ 31, ఎల్‌బీజీ 787 రకాలు.
 •  పెసర.. ఎల్‌జీజీ 407, 410, 450, 460, టీఎం 96-2, డబ్ల్యూజీజీ 42 రకాలు.
 •  జొన్న.. సీఎ్‌సహెచ 4, 16, 18, పీఎ్‌సవీ 1, సీఎ్‌సవీ 15, పాలెం 2 రకాలు.

Credits : Andhrajyothi