అంటుతో మామిడి మధురం

ఏ పండ్ల రకంలో లేనివిధంగా మామిడిలో 70 వేల రకాలు ఉన్నాయి. నాణ్యమైన వంగడానికి మరింత నాణ్యమైన వంగడాన్ని అంటుకట్టడం ద్వారా నిరంతరం మేలైన వంగడాలు జత కావడమే ఇందుకు కారణం. అంటుకట్టే పద్ధతి ద్వారా మంచి రుచి, పరిమాణం వున్న మామిడి రకాలు మనకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. మామిడి విత్తనాల కొరత వల్ల ఈ తరహా అంటు కట్టే విధానం మొదలైంది. దీంతో మామిడి సాగులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, సంగారెడ్డి మామిడి పరిశోధనా క్షేత్రాల్లో ప్రాంతాల్లో టెంకలు (విత్తనాలు) తీసుకుని దాన్ని మొక్కలుగా పెంచుతారు. తరువాత వాటికి తొడుగు కింద మనకు కావాల్సిన రకాన్ని అంటు కట్టి మనకు కావాల్సిన రీతిలో షేడ్‌ నెట్‌లో పెంచుతారు. విత్తనం వేసి పెంచే మామిడి చెట్లు ఆరేళ్ల వరకు కాయలు కాయవు. అదే అంటు మామిడి నాలుగేళ్ల లోపే ఫలాలనిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లను పెంచే అవకాశం వుండటం, సగటు దిగుబడి అత్యధికంగా వుండటంతో అంటు మామిడికి ఆదరణ పెరిగింది.
 
బంగినపల్లిలో 40 వేల రకాలు
వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో చాలా రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అందుల్లో బంగినపల్లిలో 40 వేల రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, హిమాయత్‌, ఆల్‌ఫెన్స్‌జో, మల్లిక, కొత్తపల్లి కొబ్బరి, యలమందల, చెరుకు రసం, పునాస, రాయల్‌ స్పెషల్‌ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనా స్థానంలో 70 వేల మొక్కలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామిడి అంటే సీజనల్‌ ఫ్రూట్‌.. కానీ మామిడిలో కూడా సంవత్సరం పొడవునా ఫలాలనిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు తెలిసిన పునాసతోపాటు రాయల్‌ స్పెషల్‌ కూడా సంవత్సరం అంతా కాపునిస్తుంది. దీంతో మామిడికి సీజన్‌ కూడా అవసరం లేదన్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ వి. రమేష్‌బాబు.
Credits : Andhrajyothi

వేసవిలో పెరటి మొక్కలు పదిలం

ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మనం తీసుకునే ఆహారం మొదలుకుని దైనందిన కార్యక్రమాలన్నింటిలో మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి. చల్లని పానీయాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఐస్‌క్రీమ్‌లు తీసుకుంటూ వేడి నుంచి ఉపశమనం పొందుతాం. ఇంట్లో నీడపట్టున వుండే మనమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతగానో ప్రేమించే మొక్కలు బాల్కనీల్లో, టెర్రస్‌ మీద, గార్డెన్‌లో వేడికి ఎంత అల్లాడిపోతాయో ఆలోచించండి. అందుకే మార్చి చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు ఇంటి బయట వున్న మొక్కలు మాత్రమే కాదు ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు నిపుణులు.
షేడ్‌నెట్స్‌ : మార్చి నుంచే వాతావరణం వేడిగా మారుతుంది. వేడి గాలులకు పెరటి తోటలోని కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు వాడిపోతాయి. వేడికి సాయంత్రం అయితే వేలాడిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి పెరటి మొక్కల మీద పందిరి ఏర్పాటుచేసి 50 శాతం నీడనిచ్చే షేడ్‌నెట్‌ను కప్పాలి. మొక్కలు నిరంతరం ఎండలో వుండే పరిస్థితి వుంటే మొక్కలు ఉన్న ప్రదేశం చుట్టూ కూడా షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల పెరటి తోట కళకళలాడటంతో పాటు దిగుబడి కూడా తగ్గకుండా వుంటుంది.
నీరు ప్రాణం : మిగిలిన సీజన్‌లలో కంటే వేసవిలో పెరటి మొక్కలకు నీరు తరచూ అందించాలి.. నీడలో వుండే మొక్కలకు కూడా రెండు రోజులకొకసారి తప్పనిసరిగా నీరందించాలి. ఆకుకూరలు, పూల మొక్కలపై ఉదయం, సాయంత్రం నీరు చల్లితే అవి తాజాగా వుంటాయి. టెర్రస్‌ మీద వున్న మొక్కలకు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం నీరుపోయాలి.
పోషకాలు పెంచండి : చలికాలంలో కాకుండా ఈ సీజన్‌లో అవసరమైన మేరకు నీరందిస్తే మొక్కలు వేగంగా పెరుగుతాయి. కుండీల్లో వుండే మట్టిలో పోషకాలు లేకుంటే మొక్కలు సరిగా ఎదగవు. అందుకే కుండీల్లో లేదా తోటలో వున్న మట్టికి పోషకాలు జతచేయాలి. ఆవుపేడ, వర్మికంపోస్ట్‌ వేయడం వల్ల మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. వేడి వాతావరణంలో కొన్ని చిత్రమైన చీడపీడలు వచ్చే అవకాశం వుంది కాబట్టి వారానికి ఒకసారి మొక్కలపై వేపనూనెను నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi

కొల్లాపూర్‌ మామిడికి కొత్తకళ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నాగర్‌కర్నూల్‌: వందేళ్ల చరిత్ర వున్న కొల్లాపూర్‌ మామిడి రుచులు ప్రపంచ దేశాలకు  విస్తరించనున్నాయి. కొల్లాపూర్‌ మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ప్రాంత రైతులతో అగ్రికల్చరర్‌ ప్రాసెస్‌ ఫుడ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (అపేడ) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.
‘అపేడ’తో ఒప్పందం.. రైతులకు లాభం
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ సురభి సంస్థానంలో నాణ్యమైన మామిడి రకాల తోటల పెంపకానికి వందేళ్ల క్రితమే బీజం పడింది. అప్పటి రాజా సురభి వెంకటలక్ష్మారావు నూజివీడు నుంచి ప్రత్యేక వంగడాలను తెప్పించి 70 ఎకరాలలో మామిడి మొక్కలను నాటారు. సురభి రాజులు తెప్పించిన ప్రత్యేక వంగడాల్లో బేనీషాన్‌ రకం మామిడికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. మధురమైన రుచికి మారుపేరైన కొల్లాపూర్‌ మామిడికి అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించేందుకు అపేడారంగంలోకి దిగింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 16 వేల 165 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి.
కల్వకుర్తిలో 5,309 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 1,692 ఎకరాలు, అచ్చంపేటలో 2,280 ఎకరాలు, కొల్లాపూర్‌లో అత్యధికంగా 6,884 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. కొల్లాపూర్‌ బేనిషాన్‌ (బంగినపల్లి) మామిడికి అంతర్జాతీయ మార్కెట్‌లో కేసర్‌, ఆల్‌ఫాన్సో, నూజివీడు రసాలు, సువర్ణరేఖలతో సమానంగా డిమాండ్‌ వున్న విషయాన్ని గుర్తించిన అపేడ క్రమంగా రైతుల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నాలను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్‌ ఇ. శ్రీధర్‌ ప్రత్యేక చొరవతో అపేడతో చర్చలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన పెంపొందించారు. సాధారణంగా కిలోకు 30 నుంచి 50 రూపాయల మధ్య ధరకు విక్రయిస్తూ స్థానిక రైతులు ఏటా నష్టాలు చవిచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీజన్‌ కంటే ముందే అపేడ అధికారులు నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ఉన్న మామిడి తోటలను ఎంపిక చేసుకొని అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కాయ 350 గ్రాముల కనీస బరువు, చక్కెర శాతం 8 గ్రాముల పైబడి ఉన్న వాటిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. కొల్లాపూర్‌ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల మామిడి తోటలను ఈసారి ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి సింగపూర్‌, యుకె, పొలెండ్‌, జర్మనీ, అమెరికా, కొరియా, ఆస్ర్టేలియా దేశాలకు కొల్లాపూర్‌ బంగినపల్లి మామిడిని ఎగుమతి చేయనున్నారు. నాణ్యత వున్న కొల్లాపూర్‌ మామిడి తోట వద్దనే కిలోకు దాదాపు వంద రూపాయల ధర పలికే అవకాశాలున్నాయని అపేడ రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు.
 
అపేడా ద్వారా మంచి ధర
ఉద్యానవన శాఖ వారి సహకారంతో గత ఏడాది మామిడి కాయలను విక్రయించేందుకు అపేడ సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాం. మార్కెట్‌ ధర కంటే కిలో మామిడికి అపేడ వారు 20 రూపాయలు అధిక ధర చెల్లించారు. నా తోట నుండి 2 టన్నుల మామిడి కాయలను అపేడ సంస్థ కొనుగోలు చేసింది.
– పెబ్బెటి కృష్ణయ్య రైతు, కొల్లాపూర్‌
 
చిన్నకాయలు కూడా కొనాలి
పెద్ద సైజు కాయలను మాత్రమే అపేడ వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం కొల్లాపూర్‌ మండల పరిధిలో మామిడి తోటల పూత చాలావరకు రాలిపోయింది. దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. రైతులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సైజులను కొనుగోలు చేయాలి.
– శ్రీరాములు, రైతు, కొల్లాపూర్‌
Credits : Andhrajyothi

పెట్టుబడికి నాలుగింతల లాభం

బొప్పాయి పండు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు దాన్ని సాగు చేసే రైతులకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురంకు చెందిన రైతు ఎర్ర మధుసూదన్‌రెడ్డి ఎకరంన్నర విస్తీర్ణంలో బొప్పాయి సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.
బంధువుల స్ఫూర్తితో ఏడాదిన్నర క్రితం ఎకరంన్నర పొలంలో బొప్పాయి మొక్కలు నాటారు మధుసూధన్‌ రెడ్డి. హైదరాబాద్‌లో సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా ఆయనకు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. డిసెంబర్‌ లేదా జూన్‌ నెలలు బొప్పాయి మొక్కలు నాటడానికి ఎంతో అనుకూలం. దీంతో 2016 డిసెంబర్‌ నెలలో ఎకరాకు 910 మొక్కల చొప్పున 1,365 మొక్కలు నాటారు. అనంతపురం నుంచి తెచ్చిన నోయూ రెడ్‌ లేడీ రకం మొక్కలను ఎంచుకున్నారు. డ్రిప్‌ ద్వారా నీరందిస్తూ పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. నిపుణుల సలహా మేరకు ఎరువులను తక్కువ మోతాదులోనే వాడారు. ఏడు నెలల వ్యవధిలో పంట దిగుబడి ప్రారంభమైంది. పంట తెగుళ్ల బారిన పడకపోవడం, మంచి యాజమాన్య పద్ధతులు పాటించడంతో మెరుగైన దిగుబడి సాధించారు ఈ రైతు. ఇప్పటికే 80 టన్నుల దిగుబడి సాధించారు. మార్కెట్‌లో టన్ను రూ.5 వేలు ధర పలకడంతో రూ.4 లక్షలు ఆర్జించారు. బొప్పాయికి హైదరాబాద్‌, కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌తో పాటు ఢిల్లీ మార్కెట్‌లో కూడా మంచి గిరాకీ ఉంది. పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యం వుండి, మార్కెట్‌లో మోసాలను నివారించగలిగితే అధిక లాభాలు ఆర్జించవచ్చంటున్నారీయన. బొప్పాయి సాగుకు మొత్తం లక్ష వరకు ఖర్చయింది. పెట్టుబడికి నాలుగింతల లాభం పొందాను, ఇంకా దిగుబడి వస్తునే వుందన్నారు మధుసూదన్‌రెడ్డి.
మద్దతు ధర ఇవ్వాలి
పండ్లు, కూరగాయలకు కూడా ప్రభు త్వం కనీస మద్దతు ధర, పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. కోల్డ్‌ స్టోరేజీలు వుంటే బొప్పాయి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
 ఎర్ర మధుసూదన్‌రెడ్డి, రైతు
Credits : Andhrajyothi

కోకో సాగు భళా

  • కొబ్బరిలో అంతరపంటగా సాగు
  • కోనసీమకు తరగని ఆదాయం
కోనసీమ కొబ్బరి రైతులకు కోకో సాగు లాభాలను తెచ్చిపెడుతోంది. కొబ్బరిలో అంతరపంటగా కోకోను సాగు చేస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిస్తున్నారు. ఉద్యానవన శాఖ కోకో సాగుకు ప్రోత్సాహకాలు అందించడం రైతులకు వరంగా మారింది.
కోకోను కేడ్బరీ చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ వంటి ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉండ డంతో కోనసీమ రైతులు కోకో సాగుపై దృష్టి పెట్టారు. కొబ్బరితోటల్లో అంతరపంటగా కోకో సాగు చేసేందుకు హెక్టారుకు రూ.20వేలు వంతున ఉద్యానవన శాఖ ప్రోత్సాహకంగా రైతులకు అందిస్తున్నది. సబ్సిడీపై రెండు రూపాయలకే కోకో మొక్కను అందిస్తున్నది. మూడేళ్లపాటు హెక్టారుకు రూ.6వేలు వంతున కోకో మొక్కల ఎదుగుదలకు వీలుగా ఆకులను తొలగించేందుకు రైతులకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. వీటితోపాటు చీడపీడల నివారణకు ప్రభుత్వ పథకాలు ద్వారా కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలోని అయినవిల్లి లంకకు చెందిన విద్యావేత్త విళ్ల దొరబాబు తన 24 ఎకరాల కొబ్బరితోటలో కోకోను అంతరపంటగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించిన కోకో మొక్కలను ఎకరాకు 225 చొప్పున నాటారు. రెండున్నరేళ్ల అనంతరం ఏపుగా పెరిగిన కోకో మొక్కలు ఆదాయాన్ని అందించడం మొదలెట్టాయి.
ఒక్కో కోకో మొక్కకు సగటున కిలో గింజలు ఉత్పత్తి అవుతాయి. మొక్కలు దిగుబడికి రావడాన్ని గమనించిన రైతులు ఆ సమాచారాన్ని ఉద్యానవన శాఖాధికారుల ద్వారా కోకో గింజలు కొనుగోలు చేసే ఏజెన్సీలకు అందిస్తారు. దీనిపై ఆ ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు నేరుగా ఎంపికచేసిన ప్రాంతాలతో పాటు రైతుల పొలాల వద్దకు కూడా వచ్చి శుద్ధిచేసిన గింజలను కొనుగోలు చేసి తరలించుకుపోతారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.260 ఉండే కోకో గింజలు ధర ప్రస్తుతం రూ. 180 ఽమాత్రమే పలుకుతోంది. ధర తగ్గడం పట్ల రైతులు కొంత నిరాశకు గురవుతున్నారు. ప్రధానంగా కేడ్బరీ కంపెనీకి చెందిన మార్కెటింగ్‌ అధికారులు రైతుల వద్దకే వచ్చి వీటిని కొనుగోలు చేసుకుపోవడం రైతులకు పెద్ద ఊరట. కోకో సాగుతో ఎంత లేదన్నా ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. యేడాదిలో రెండుసార్లు దిగుబడి వస్తుంది.
22 ఏళ్లుగా సాగు
ఎంబీఏ, బీఎల్‌ చేసినా వ్యవసాయం అంటే నాకు ఆసక్తి. 22 ఏళ్లుగా కొబ్బరితోటలో కోకో సాగు చేస్తున్నాను. ప్రారంభంలో కోకో గింజల మార్కెటింగ్‌ ఇబ్బందిగా వుండేది. కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పంటను వదిలేసిన సందర్భాలూ వున్నాయి. ఉద్యానవన శాఖ చొరవతో ఇప్పుడు మార్కెటింగ్‌ ఇబ్బందులు లేవు. పైగా రాయితీలు కూడా ఇస్తున్నారు. అంతరపంటగా కోకో సాగు కొబ్బరి రైతులకు వరం.
Credits : Andhrajyothi

కల్పతరువు.. కొలంబో కంది

  • ఒకసారి పెట్టుబడి.. పదిసార్లు దిగుబడి
 
కొలంబో కంది పంట ఇప్పుడు రైతులందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఒకసారి నాటితే పదిసార్లు దిగుబడినిచ్చే ఈ పంట సాధారణ కంది కంటే రెట్టింపు దిగుబడినిస్తుంది. ఖమ్మం జిల్లా రైతు పండిస్తున్న ఆ వెరైటీ పంట విశేషాలివి.
శ్రీలంకలో ఎక్కువగా పండించే ఈ కంది వంగడాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన రైతు మారం కరుణాకర్‌రెడ్డి సాగు చేస్తున్నారు. 17 ఎకరాల్లో 107 రకాల పంటలను పండిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన, కొలంబో కంది సాగుతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పంట చేతికి అందగా రెండో పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు ఈ వెరైటీ పంటను సాగు చేస్తున్నారు కరుణాకర్‌రెడ్డి. మన ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కంది సాగు చేస్తుంటారు. దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతులకు కొలంబో కంది కల్పతరువుగా మారనుంది.
ఐదేళ్లు దిగుబడి
కొలంబో కంది గింజలను మొక్క కట్టి చేలో ఒకసారి నాటితే చాలు ఐదు సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. ఎకరాకు కేజీ గింజలతో మెక్కలు నాటేతే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి దిగుబడి వస్తుంది. మళ్లీ మళ్లీ మొక్క నాటే అవసరం ఉండదు. మొదటిసారి వచ్చిన దిగుబడే చివరిసారి కూడా వస్తుందని రైతు కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. డిసెంబరు-జనవరి నెలల మధ్య ఒకసారి, జూన్‌-జూలై మధ్య రెండోసారి పంట చేతికొస్తుంది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు.. ఇలా రెండుసార్లు దిగుబడి వస్తుంది. ఈ క్రమంలో క్వింటాకు రూ.3 వేల చొప్పున అయినా సంవత్సరానికి రూ.లక్షా 20 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు ఆ రైతు. ఈ పంట పూత తియ్యగా వుంటుంది కాబట్టి పురుగు ఆశించే ప్రమాదం వుంది. అందుకే రైతులు పూత దశ నుంచి చివరి దశ వరకు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాంటున్నారు వ్యవసాయాధికారులు.
 
పెటుబడి తక్కువ ఆదాయం ఎక్కువ
ఒక పంట వేయాలంటే ప్రతీసారి దుక్కిదున్నాల్సిందే. కానీ కొలంబో కందికి ఆ అవసరం లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఐదు సంవత్సరాలు లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం మనం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్న కందిపప్పులో ఈ కొలొంబో రకమే అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని నేలలు కూడా ఈ పంటకు అనువుగా ఉంటాయి.
Credits : Andhrajyothi

ఒక్కో మొక్క అమృతపు చుక్క

పెరట్లో, వరండాలో చివరకు ఇంటి లోపల గదుల్లో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే అరుదైన ఔషధ మొక్కలను మనమే పెంచుకునే వీలుందంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి ఔషధ మొక్కలేమిటో చూద్దాం రండి.
కొన్ని మొక్కలు పచ్చదనంతో నయనానందం కలిగించడంతో పాటు అరుదైన ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. అలాంటి మొక్కల్లో మల్టీవిటమిన్‌ ప్లాంట్‌, పిప్పళ్లు, తిప్పతీగ, వీట్‌గ్రాస్‌ వంటి వాటిని ఇంట్లోనే పెంచుకోవడం వల్ల ఎంతో లాభం చేకూరుతుంది. ఈ ఔషధ మొక్కలకు కొద్దిపాటి నీరు అందిస్తూ అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి కొద్దిపాటి పురుగుమందులను పిచికారీ చేస్తే సరిపోతుంది. అటవీప్రాంతం నుంచి తీసుకువచ్చిన ఈ ఔషధ మొక్కలను కడియం నర్సరీల్లో పెంచి తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు.
మల్టీ విటమిన్‌ : ఈ మొక్క 1, 2 ఆకులను ఉదయం వేళలో తీసుకోవడం ద్వారా రక్తశుద్ధి కలుగుతుంది. ఇందులో బి- కాంప్లెక్సు ఉండటం వలన నీరసం తగ్గి, చలాకీతనం వస్తుంది. ఆరడుగుల ఎత్తు వరకు ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది.
పిప్పళ్ళు : ఈ మొక్కకు కాయలు కాస్తాయి. వీటిని కోసి ఎండబెట్టుకుని పొడిచేసుకున్న తరువాత పాలలో కలిపి రోజుకొక స్పూన్‌ చొప్పున తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. ఈ మొక్క రెండడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.
మిరకిల్‌ ఫ్రూట్‌ : కేరళకు చెందిన ఈ మొక్క ఫలాలను ఇస్తుంది. ఈ ఫలం ఉదయం తీసుకుంటే సాయంత్రం వరకు పులుపు, కారం, వగరు ఉన్న వంటకాలు ఏమి తిన్నా తీపిగానే ఉంటాయి. అతి తక్కువ ఎత్తు పెరిగే ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువ ఫలాలను ఇస్తుంది.
తిప్పతీగ : ఆకు చూర్ణం ఇన్సులిన్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. డెంగ్యూ జ్వరానికి ఇది దివ్యౌషధం. ఈ మొక్కను ఎండ ఉన్న ప్రాంతంలో వేసుకుని తగిన పరిమాణంలో నీరు అందిస్తూ పెంచుకుంటే సరిపోతుంది.
వట్టివేరు : గ్రాస్‌ రకంగా కనిపించే ఈ మొక్క కాడలను ఎండబెట్టుకుని వాటిని కొబ్బరినూనెలో కలిపి తలకు రాసుకుంటే చల్లదనం కలుగుతుంది. మెదుడు చురుకుగా పనిచేస్తుంది. ఈ మొక్క ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది
Credits : Andhrajyothi

ఈత వనం.. లాభాలు ఘనం

  • మెదక్‌ జిల్లా రైతు వెరైటీ సేద్యం
మామిడి, జామ, అరటి, సపోటా, బొప్పాయి తోటలు పెంచ డం చూశాం కానీ ఈతవనాన్ని పెంచడం అరుదు. తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌ ఈతవనం పెంచి అందరికీ స్వచ్ఛమైన కల్లు అందించి, లాభాలు గడిస్తున్నారు.
మిగిలిన తోటల్లాగా నాటిన వెంటనే ఈతవనంలో లాభాలు రావు. ఈత చెట్లు నాటిన నాటి నుంచి వాటిని జాగ్రత్తగా పెంచాలి. కల్లు గీసే స్థాయికి చెట్లు ఎదిగేందుకు పదేళ్లు పడుతుంది. తనకున్న మూడెకరాల్లో 11 ఏళ్ల క్రితం ఈత మొక్కలు నాటారు మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాపూర్‌ (పీటీ) గ్రామానికి చెందిన పచ్చమడ్ల లచ్చాగౌడ్‌. ప్రభుత్వం ఇప్పుడు ఈత మొక్కలను ఉచితంగా అందిస్తున్నది. దశాబ్దం క్రితం మొక్కలను కొనాల్సిందే. 2.80 లక్షలు ఖర్చు చేసి మూడు ఎకరాల్లో 1200 ఈత మొక్కలు నాటారు. ఈత చెట్లకు రోగాలు రాకుండా, పురుగుల నుంచి రక్షించడానికి, మందులు వాడాల్సి ఉంటుంది. ఇతర చెట్లలాగే ఈత చెట్లకు నీరు పెడుతూ, యేటా ఎరువులు వేయాలి. ఈత చెట్లకు రక్షణ చర్యలు తీసుకుంటే మొక్కలు బాగా పెరిగి కల్లు సకాలంలో అందుతుంది. చెట్టు బాగా ఎదిగితే పదో ఏట నుంచి కల్లు గీసే అవకాశం వుంటుంది. కల్లు గీయడంలో జాగ్రత్తలు పాటిస్తే ఈతచెట్టు 20 నుంచి 25 ఏళ్ల పాటు కల్లును అందిస్తుంది. ఈతచెట్ల పెంపకం చేపట్టిన రైతులు ఎక్సైజ్‌శాఖకు కల్లు వచ్చే ఒక్కొక్క చెట్టుకు రూ.15 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చెట్ల నుంచి కల్లు సేకరించేందుకు చెట్టు గీయడం నేర్చుకొని టీఎఫ్‌టీ లైసెన్స్‌ పొందాలన్నారు ఆ రైతు.
నిత్యం ఆదాయం
పదేళ్ల పాటు ఖర్చు చేసినా ఆ తరువాత నుంచి ఈత చెట్లు నిత్యం ఆదాయాన్నిస్తాయి. మా తోటలో స్వచ్ఛమైన కల్లు లభిస్తుండటంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర సుదూర ప్రాంతాల నుంచి కల్లు సేవించడానికి ఇక్కడికి వస్తున్నారు. కల్లు బింకి సైజును బట్టి రూ. 100 నుంచి రూ. 200ల వరకు వస్తుంది.
Credits : Andhrajyothi

టమాటాకు స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌

రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉన్నందువల్ల ఈ సమయంలో వివిధ పంటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ గురించి ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతాంగానికి ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
వరి :
వరి పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోంది. దీని నివారణకు రెండు గ్రాముల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కంకినల్లి ఉనికి గమనించడమైంది. నివారణకు స్పైరోమేసిఫిన్‌ ఒక మి.లీ., ప్రోపికోనజోల్‌ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు :
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల తామర పురుగుల ఉధృతి పెరిగి టమాట స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌ తెగులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తామర పురుగుల నివారణకు రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వంగ పంటకు రసం పీల్చే పురుగు ఆశిస్తోంది. నివారణకు రెండు మి.లీ. డైమిథోయేట్‌ లేదా రెండు మి.లీ., మిథైల్‌ డేమటాన్‌ లేదా రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరప పంటను ఎర్రనల్లి ఆశిస్తోంది. నివారణకు 1.25 మి.లీ., స్పైరోమేసిఫెన్‌ లేదా రెండు మి.లీ., ఫెన్‌ పైరాక్సిమెట్‌ లేదా మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా ఐదు మి.లీ., డైకోఫాల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో తామర పురుగు కూడా గమనించడమైంది. దీని నివారణకు రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటల్లో తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ ఉధృతి పెరిగి వైరస్‌ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నివారణకు 0.3 మి.లీ., ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 0.3 గ్రా. థయోమిథాక్సాం మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi

కొబ్బరి, మామిడి మొక్కల నిధి

మేలైన కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసేందుకు 1991లో అశ్వారావుపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటైంది. దేశంలోని పలు రాష్ట్రాలకు మేలైన కొబ్బరి మొక్కలను ఎగుమతి చేసిన ఘనత ఈ క్షేత్రానిది.
కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో పాతికేళ్ల క్రితం కేరళలో లభించే మేలురకాలైన హైబ్రీడ్‌ కొబ్బరి రకాల మొక్కలను ఉత్పత్తి చేశారు. ఇందుకోసం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో, అచ్యుతాపురం ఉద్యానశాఖ నర్సరీలోను ఈస్ట్‌కోస్టల్‌, అండమాన్‌ ఆర్డినరీ, లక్కడాల్‌ ఆర్డినరీ మదర్‌ప్లాంట్‌లను పెంచారు. ఈ ప్లాంటులోని స్టిక్స్‌ను కొత్తగా పెంచిన మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి మొక్కలకు క్రాసింగ్‌ చేయడం ద్వారా మేలురకాలైన కొబ్బరి విత్తన ఉత్పత్తిని చేసేవారు.
 
పొట్టిరకాలు భేష్‌
ఈ క్షేత్రంలో కేరళలో దొరికే మేలురకాలైన పొట్టిరకం కొబ్బరి చౌఘాట్‌, ఆరంజ్‌ డ్వాప్‌(డీఓడీ), గంగ బొండాం, మలియన్‌ ఆరంజ్‌ డ్వాప్‌(ఎంవోడీ), మలియన్‌ గ్రీన్‌ డ్వాప్‌(ఎన్‌జీడీ), మలియన్‌ ఎల్లో డ్వాప్‌(ఎంవైడీ) లాంటి కొబ్బరి మొక్కలను 40 ఎకరాల్లో పెంచారు. ముందుగా పెంచిన మదర్‌ప్లాంట్లలోని కాయను, ఈ విత్తనానికి క్రాసింగ్‌ చేయడం ద్వారా గోదావరి గంగ, డీఎక్స్‌డీ, ఐఎక్స్‌డీ లాంటి మేలురకాల విత్తనాలను ఉత్పత్తి చేసేవారు. ఈ మొక్కలు ఒక్కోటి 150 నుంచి 180 వరకు దిగుబడిని ఇస్తాయి. ఈ రకాలను కేరళ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ర్టాలలోని వివిధ జిల్లాలకు సరఫరా చేసేవారు. ఈ విత్తనం కేరళలో దొరికే నాణ్యత కలిగి, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే కొబ్బరి రకాలను ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం కొబ్బరి, మామిడి మొక్కల ఉత్పత్తి…
ఈ క్షేత్రం ఏర్పాటై 27 ఏళ్లు దాటింది. అప్పుడు నాటిన మొక్కలు బాగా పెద్దవి అయిపోయాయి. ప్రస్తుతం కొబ్బరి క్రాసింగ్‌ చేయడం లేదు. అయితే అప్పట్లో ఫార్మ్‌లో పెంచిన మేలురకాలైన చెట్టు నుంచి చౌఘాట్‌, గంగాబొండాం, మలియన్‌ ఆరంజ్‌ డ్వాప్‌, మలియన్‌ గ్రీన్‌ డ్వాప్‌, మలియన్‌ ఎల్లో డ్వాప్‌ వంటి మేలురకాలైన పొట్టిరకం విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వీటితో పాటు బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం, తోతాపురి, పునాస రకాలైన మామిడి అంట్లను ఈ క్షేత్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి మొక్క ఒక్కోదానిని రైతులకు రూ.35, మామిడి అంటును రూ.30లకు ఉద్యానశాఖ సరఫరా చేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అంట్లు కట్టడం, విత్తనాన్ని నాటడం, మొక్కలను పెంచడంతో నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఇవ్వగలుగుతుంది. ప్రైవేటు నర్సరీలలో ఒక్కో మొక్క రూ.300 నుంచి రూ.1000 వరకు వ్రికయిస్తున్నారు. అంతకంటే నాణ్యమైన మొక్కలను ఉద్యాన నర్సరీల్లో అందించడం విశేషం.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అశ్వారావుపేట
 
రైతులకు మేలురకం మొక్కలు
ప్రస్తుతం కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ద్వారా ఏటా రూ.33 లక్షల ఆదాయం వస్తోంది. తెలుగు రాష్ర్టాల మొత్తంలో ఉద్యానశాఖ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఇది ఒక్కటే. ఈ క్షేత్రం ద్వారా కొబ్బరి, మామిడి మేలురకాలైన మొక్కలను ఉత్పత్తి చేసి, అతి తక్కువ ధరకు రైతులకు సరఫరా చేస్తున్నాం.
కిషోర్‌, ఉద్యానశాఖ అధికారి,
కొబ్బరి విత్తనో
Credits : Andhrajyothi