‘మకామ్‌’.. మహిళా రైతుల చైతన్య వేదిక

‘మకామ్‌’ అంటే ‘మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌’.
‘మకామ్‌’ వేదిక ద్వారా మహిళా రైతుల హక్కులు, వారికందాల్సిన ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి అవగాహన పెంపొందిస్తున్నాం.
స్ఫూర్తి
డా.రుక్మిణీ రావు… పట్టణాల్లోనే కాదు గ్రామీణ
ప్రాంతాల్లోని మహిళా హక్కుల కోసం… దళిత స్త్రీలు, బాలలు, మహిళా రైతుల హక్కుల కోసం… చట్టాల్లో మార్పులు తేవడం కోసం ఎంతో కీలకంగా వ్యవహరించిన యాక్టివిస్టు. అందుకోసం ఆమె ‘మకామ్‌’ అనే మహిళా రైతుల హక్కుల వేదికను కూడా
ఏర్పాటుచేశారు. ‘మానవతా సమాజస్థాపనే తన లక్ష్యం’ అంటున్న రుక్మిణీరావును ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలే ఇవి…
మనదేశంలో వ్యవసాయరంగంలో పనిచేస్తున్నది 70 శాతం మహిళా రైతులే. వారు పండిస్తే కాని మన నాలుగు వేళ్లూ నోట్లోకి పోవు. కానీ వారి హక్కుల పట్ల ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇతర రాష్ట్రాలలో కొనసాగిస్తున్న లాభదాయకమైన వ్యవసాయ విధానాలను, పద్ధతులను ఆ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతుల నుంచి తెలుసుకుని నూతన వ్యవసాయ సాగును ‘మకామ్‌’
అభివృద్ధిపరుస్తోంది.
పట్టణాల్లో, గ్రామాల్లో మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు… బాలలపై వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా… అలాగే దళితులు, వెనుకబడిన వర్గాల బాలల విద్య కోసం… బాల్య వివాహాలకు, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా… సింగిల్‌ విమెన్‌ రక్షణ విషయంలో… ఇలా ఎన్నో సామాజిక సమస్యలపై గత రెండు దశాబ్దాలకు పైగా డా. రుక్మిణీరావు పనిచేస్తున్నారు. వీటికి సంబంధించి చట్టాలు తీసుకురావడంలో, ఉన్న చట్టాలకు కొత్త సవరణలు చేపట్టేలా కృషిచేయడంలో దేశవ్యాప్తంగా ఇతర యాక్టివిస్టులతో కలిసి పనిచేశారామె.
పట్టణాల నుంచి పల్లె మహిళల కోసం…
పట్టణ ప్రాంత మహిళల కోసం పనిచేయడంతో తన పోరాటం ప్రారంభమైందని రుక్మిణి తెలిపారు. తొలుత మహి ళల వరకట్న హత్యలపై దృష్టిసారించారామె. వరకట్న మరణాలకు సంబంధించిన చాలా కేసులను యాక్సిడెంటల్‌ మరణాలుగా పోలీసులు తేల్చడం రుక్మిణిలో ఆలోచనలను రేకెత్తించాయి. ఈ సమస్య పరిష్కారానికి ‘ప్రొ-యాక్టివ్‌ అప్రోచ్‌’ అవసరమని భావించారామె. వరకట్నం పేరుతో ఆడవాళ్లపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయాలని 1981లో ‘సహేలీ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. అలా మొదలైన రుక్మిణీ రావు యాక్టివిజం విస్తృతస్థాయిలో కొనసాగుతూనే ఉంది. సమస్యలపై పోరాటానికి గ్రామాలలోని దళితులు, వెనుకబడిన వర్గాల మహిళలను బృందాలుగా ఏర్పరిచి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించారామె. ‘మకామ్‌’ కూడా ఈ లక్ష్యంతోనే ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా మహిళా రైతుల హక్కులు, వారికందాల్సిన ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి అవగాహన పెంపొందిస్తున్నారు. ‘మకామ్‌’ అంటే ‘మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌’. దీనిని తెలుగులో ‘మహిళా రైతుల హక్కుల వేదిక’ అంటారు. ఈ ఆలోచనను పలు రాష్ట్రాలలోని స్వచ్ఛంద సంస్థలు కూడా అనుసరించడం విశేషం. అసలు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అని అడిగితే ‘‘పట్టణ ప్రాంత మహిళలలో ఎక్కువమంది మధ్యతరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గాలకు చెందినవారు. వారు ఆర్థికంగా కొంతమేర అండదండలున్నవాళ్లు కాబట్టి తమ హక్కుల సాధన కోసం కోర్టులను ఆశ్రయించగలరు. పైగా చట్టాలు, హక్కుల గురించి ఎంతోకొంత చైతన్యం ఉన్న వారు కూడా. కానీ గ్రామీణ మహిళలకు తమకోసం ప్రత్యేక చట్టాలున్నాయని, ఎన్నో హక్కులున్నాయనే విషయం తెలియదు. న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందవచ్చని తెలిసినవారు వీళ్లలో చాలా తక్కువ. ఇకపోతే ప్రభుత్వం ఈ మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అసలే తెలియదు. అందుకే గ్రామీణ మహిళా రైతులలో హక్కుల చైతన్యం పెంపొందించడం కోసం పనిచేయాలనుకున్నా’’ అంటారామె.
మహిళా రైతుల హక్కుల కోసం…
‘‘మకామ్‌’’ వేదికను 2014లో ప్రారంభించాం. మనదేశంలో వ్యవసాయరంగంలో పనిచేస్తున్నది 70 శాతం మహిళా రైతులే. వారు పండిస్తే కాని మన నాలుగు వేళ్లూ నోట్లోకి పోవు. కానీ వారి హక్కుల పట్ల ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రైతులు పడుతున్న శ్రమకు గుర్తింపు లేకపోవడాన్ని గమనించాం. ‘మకామ్‌’ ఇతర రాష్ట్రాలలో కొనసాగిస్తున్న లాభదాయకమైన, అభివృద్ధిదాయకమైన వ్యవసాయ విధానాలను, పద్ధతులను ఆ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతుల నుంచి తెలుసుకుని నూతన వ్యవసాయ సాగును అభివృద్ధిపరుస్తోంది. అయితే మహిళా రైతులకు సంబంధించి ప్రస్తావించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మన దగ్గర మహిళా రైతు సంఘాలు లేనే లేవు. సాధారణ రైతు సంఘాలలో మహిళా రైతులు ఎంతమంది సభ్యులుగా ఉన్నారు? వారు అడుగుతున్న డిమాండ్లకు ఏ మేర స్పందిస్తున్నారు? మహిళా రైతుల అవసరాలను గుర్తిస్తున్నారా? ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలలో బడ్జెట్‌లో 30 శాతం మహిళా రైతులకు కేటాయించాలని ఆర్థిక సర్వే ప్రభుత్వానికి సూచించినా ఆ దిశగా ఎటువంటి ప్రణాళికా ప్రభుత్వాలు చేపట్టలేదు. అలాగే పంటలకు మద్దతు ధర పెంచితేనే మహిళా రైతులకు లాభం. ఆదివాసీ ప్రాంతాలలో మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం సాగిస్తున్నారు. వారి పెట్టుబడులకు, కూలీ ఖర్చులకు అధిక కేటాయింపులు కావాలి. అలాగే వ్యవసాయంలో మహిళా రైతుల పనిభారాన్ని తగ్గించడానికి, ఆహార భద్రత కల్పించడానికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ గణాంకాలలో మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు! జెండర్‌ పరంగా గణాంకాలను రికార్డు చేసే పద్ధతి కరువవడం వలన ప్రభుత్వ చేపడుతున్న చర్యలు మహిళా రైతులకు ఎంతవరకు అందుతున్నాయనేది అంచనా వేయలేని పరిస్థితి.
అలాగే అడవి నుంచి ఆహార సేకరణ చేసే ఆదివాసీ మహిళలకు, అడవుల నుంచి పొందాల్సిన ప్రయోజనాలను దూరం చేస్తున్నారు. అందుకే మహిళా రైతులకు గుర్తింపు, రాయితీలు, అన్ని రకాల పథకాల హక్కులను ఇవ్వాలని ‘మకామ్‌’ డిమాండ్‌ చేస్తోంది. రైతు ఆత్మహత్య కుటుంబాలలో మహిళలకు జీవనోపాధి సహాయం అందించడంతో సహా రుణ మాఫీతో సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. దీనికి అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులుండాలి. భూమి లేని వారికిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను మహిళా రైతులకు కూడా ఇవ్వాలి. ఇవే కాకుండా భూమిలేని దళిత మహిళలకు భూమి కొనుగోలు పథకాలు, కనీస మద్దతు ధర, మహిళా రైతులకు డ్రిప్‌, భూగర్భజలాల పథకాలకు ప్రోత్సాహం వంటి వాటికోసం ‘మకామ్‌’ పోరాడుతోంది అని రుక్మిణీరావు అన్నారు.
నాగసుందరి, ఫోటో:ఎల్‌.అనిల్‌కుమార్‌రెడ్డి
Credits : Andhrajyothi

మేలు చేసే మినీట్రాక్టర్‌

కలుపు తీసేందుకు,   పురుగుల మందు చల్లేందుకు సకాలంలో కూలీలు దొరకక రైతులు చాలా సందర్భాల్లో నష్టపోతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే మినీ ట్రాక్టర్‌ రైతులకు వరంగా మారింది.
నాలుగు లక్షల రూపాయల ధర ఉన్న ఈ మినీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నది. ముఖ్యంగా పత్తి, కంది, చెరుకు పంటలలో, మామిడి తోటలు పూల తోటలలో కలుపు తీస్తుంది. పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిస్తుంది. అంతేగాక చిన్న ట్రాక్టర్‌కు వెనక ఉన్న తిరిగే పరికరం (పీ.టీ.వో) ద్వారా పంపు బిగించి, ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న ట్యాంకుకు అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా ఆయా పంట పొలాల్లో క్రిమిసంహారక మందును పిచికారీ చేసుకునే అవకాశం కూడా వుంది. ఈ ట్రాక్టర్‌ ద్వారా ఒక్క రోజుకు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కలుపు తీయడం, క్రిమిసంహారక మందును పిచికారి చేసే వీలున్నది. ఈ పని చేసేందుకు నలభై మంది కూలీలు అవసరమవుతారు. అందుకోసం 12 వేల రూపాయల ఖర్చవుతుంది. మినీ ట్రాక్టర్‌తో పని వేగంగా జరగడంతో పాటు ఖర్చు కూడా తక్కువ. దీంతో రైతులు ఈ ట్రాక్టర్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతంగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయలేని రైతులు గంటకు నాలుగు వందల రూపాయల అద్దె చెల్లించి సేవలు పొందుతున్నారు.
భలే ప్రయోజనం
చిన్న ట్రాక్టర్‌ సన్న, చిన్నకారు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. కూలీల కొరత ఉన్న ఈ పరిస్థితులలో చిన్న ట్రాక్టర్‌ రైతులను ఆదుకుంటుంది. వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై ఇస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
 బుచ్చిరెడ్డి,
హత్నూర మండలం, బడంపేట
Credits : Andhrajyothi

రైతుకు వరం

 
ఆంధ్రజ్యోతి ప్రతినిది: పంటల సాగులో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబరు(1800 425 341)ను ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాల్లోని రైతుల సమస్యలకు ఇటు ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాలకు, అటు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లోని ఏరువాక/కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడవచ్చు. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఏ జిల్లా రైతు సమస్య అయితే, ఆ జిల్లాలోని ఏరువాక/ కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్తకు కాల్‌ అనుసంధానం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశువుల యాజమాన్యం, చేపల పెంపకంపై రైతులు తమ సందేహాలకు సలహాలు పొందే వీలుంది. ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుతారు. ఈ సేవలు పొందటానికి సంబంధిత జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం/ ఏరువాక కేంద్రంలో రైతులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నెంబరును ఉచితంగా నమోదు చేస్తారు. అదనపు సమాచారం కోసం 99896 25239, 97006 51031, 91778 04355 సంప్రదించవచ్చని అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పున్నారావు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబరుకు కాకుండా నేరుగా ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రం ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే, రైతుకు కాల్‌ ఛార్జీలు పడతాయి.
ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాల ప్రధాన శాస్త్రవేత్తల నంబర్లు ఇవీ : శ్రీకాకుళం – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23822, విజయనగరం- ఏరువాక కేంద్రం- 99896 23801, విశాఖపట్నం- ఏరువాక కేంద్రం – 99896 23802, తూర్పుగోదావరి- ఏరువాక కేంద్రం- 99896 23803, పశ్చిమగోదావరి- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23823, కృష్ణా- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23824, గుంటూరు- ఏరువాక కేంద్రం- 99896 23806, ప్రకాశం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23827, నెల్లూరు- కృషి విజ్ఞాన కేంద్రం – 99896 23828, కడప – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23826, కర్నూలు- ఏరువాక కేంద్రం- 99896 23910, అనంతపురం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23825, చిత్తూరు – కృషి విజ్ఞాన కేంద్రం- 80085 00320.
Credits : Andhrajyothi

ఖర్జూర సాగు.. లాభాలు బాగు

ఖర్జూర అనగానే గుర్తొచ్చేది అరబ్‌ దేశాలు.. అధిక ఉష్ణోగ్రతల్లో పండే ఖర్జూరానికి గిరాకీ
నానాటికీ పెరుగుతోంది. నాణ్యమైన ఖర్జూరాలు కావాలంటే దిగుమతి చేసుకోవాల్సిందే.
ఈ పరిస్థితిని గమనించిన నల్లగొండ సమీపంలోని నర్సింగ్‌భట్ల గ్రామానికి చెందిన
బండారు ఆగమయ్య ఖర్జూర సాగు చేపట్టారు. గణనీయంగా లాభాలు గడిస్తూ
ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎడారి పంటగా పేరుబడిన ఖర్జూరను నల్లగొండలో పండించాలనే ఆలోచనే సాహసంతో కూడుకున్నది. కానీ ఆగమయ్య ఆ దిశగా ఆలోచించారు. తనకున్న రెండెకరాల భూమిలో 2012లో ఖర్జూరపంట వేసేందుకు సిద్ధమయ్యారు. ఖర్జూర మొక్కలను కొనుగోలు చేసేందుకు గుజరాత్‌కు వెళ్లి ఒక్కో మొక్కను రూ.3వేల చొప్పున కొనుగోలు చేశారు. రెండెకరాల భూమిలో 120 మొక్కలను నాటారు. దుబాయి నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూ కల్చర్‌ ఖర్జూర మొక్కలను ఇందుకు వినియోగించారు. నిజానికి చౌడు నేలల్లో ఎలాంటి పంటలు పండవు. అలాంటి నేలల్లో ఖర్జూరం పండించాలి కాబట్టి సాధారణ రకాలు కాకుండా టిష్యూ కల్చర్‌ మొక్కలను నాటారు. రెండు అడుగుల మేరకు గుంతలు తీసి రెండు ఎకరాల్లో మొక్కలు నాటారు. పూర్తిగా చౌడు భూమి కావటంతో ఆ గుంతల్లో ఎర్రమట్టిని పోసి మొక్కలు పెంచారు. ఒక్కో పాదు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా ఎకరాకు 60 మొక్కల చొప్పున రెండెకరాల్లో 120 మొక్కలను నాటారు. వీటికి బోరు ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. అయితే వీటి కాత అంతా పరపరాగ సంపర్కం ద్వారా జరుగుతుంది. అందుకోసం ఎకరాకు 3 మగ ఖర్జూర చెట్లను నాటారు. ఈ మగ చెట్ల నుంచి వచ్చే కాయలను పొడి చేసి ఆ పొడిని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. మొక్కలు కొనేందుకు ఖర్చు తప్ప ఖర్జూరం సాగుకు మిగిలిన ఖర్చులు తక్కువే. ఎకరానికి ఏడాదికి 10 వేల వరకు ఖర్చయిందన్నారు ఆ రైతు. కిలో ఖర్జూరను రూ. 120లకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోనే ఈ పంటను అమ్మేందుకు సరిపోతోంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ నుంచి కూడా కొంతమంది వ్యాపారులు వచ్చి ఖర్జూరను కొనుగోలు చేసి వెళ్తున్నారన్నారు ఆ రైతు. ఏటా జూలైలో పంట దిగుబడి వస్తుంది. ప్రతి చెట్టుకు మొదట్లో 20 కిలోల చొప్పున దిగుబడి రాగా ప్రస్తుతం సుమారు 80 కిలోల వరకు దిగుబడి వస్తోంది. తొలి ఏడాది 24 క్వింటాళ్లకు రూ. రెండు లక్షల ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర క్వింటాకు సుమారు రూ.12వేలు పలుకుతున్నది. దీంతో రూ.10 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ రైతు స్ఫూర్తితో జిల్లాలో ఖర్జూరం సాగు ఊపందుకుంటుందంటున్నారు వ్యవసాయ నిపుణులు.
లాభాలకు ఢోకా లేదు
పత్తి, మిరప పంటలను సాగు చేసి నష్టపోవటం కంటే ఖర్జూర చెట్లను పెంచుకుంటే మేలు. లాభాలకు ఢోకా వుండదు. పండిన ఖర్జూరాన్ని ఎండు ఖర్జూరగా మార్చటానికి ప్రాసెసింగ్‌ యూనిట్లు లేకపోవటంతో కోసిన నాలుగైదు రోజుల్లోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు పాలు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
Credits : Andhrajyothi

నూతన వంగడాలేవి?

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన వంగడాలు రైతులకు అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది రైతులు మాత్రమే కొత్త వంగడాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఇప్పటికీ కందిలో వ్యవసాయ శాఖ ఎల్‌ఆర్‌జీ-47 రకం, ఐసీపిఎల్‌ 87119 రకం వంటి విత్తనాలు 30 ఏళ్లుగా అమ్ముతున్నారు. దీని వల్ల చాలా నష్టపోతున్నాం.
 కె. జోగిరెడ్డి, రైతు నందివనపర్తి
నూతన వంగడాలన్నింటినీ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. మండల వ్యవసాయ శాఖ అధికారి ఇండెంట్‌ పెడితే రాయితీపై కొత్త రకం వంగడాలను రైతులకు అందిస్తాం. జొన్న, కంది, ఆముదం, మొక్కజొన్న తదితర కొత్తరకం వంగడాలను మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పంపుతాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందరాదు. పాలెం వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్తరకం వంగడాలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి. కొత్త వంగడాలు కావాలని మండల వ్యవసాయ అధికారి దృష్టికి తెస్తే తక్షణం వాటిని పంపుతాం.
 ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త
Credits : Andhrajyothi

వరికి సిరి.. అజొల్లా

వరి మాగాణుల్లో నారు నాటిన 10-15 రోజుల తర్వాత 200 కిలోల అజొల్లాను పొలంలో చల్లితే అజొల్లా పెరిగి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది.
 
దీనివల్ల రైతులు వేయ
వలసిన నత్రజని ఎరువులను 25 శాతం వరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అజొల్లా అనేది నీటిలో పెరిగే ఫెర్న్‌ మొక్క. అజొల్లాలో అనలీనా అనే నీలి ఆకుపచ్చ నాచు బాక్టీరియా ఉండి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఆ విధంగా వరి పొలంలో నత్రజనిని అందిస్తుంది. వరి మాగాణుల్లో అజొల్లా వాడకం వల్ల వాతావరణ కలుషిత కారకమైన మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు వెలువడడం తగ్గుతుంది.
ఈ మధ్య కాలంలో అజొల్లాను పశువుల దాణాగా, కోళ్ల మేతగా కూడా వాడుతున్నారు. తడి అజొల్లాను కోళ్ల మేతగా వాడినప్పుడు ప్రతి కోడి మీద రోజుకి 20 పైసలు వంతున ఖర్చు తగ్గుతుంది. అజొల్లాను పశువుల దాణాగా వాడితే పాల దిగుబడి 15-20 శాతం పెరుగుతుందని, పాలలోని కొవ్వు 10 శాతం పెరిగినట్లు గుర్తించారు. అలాగే పాలల్లో ఎస్‌ఎస్ ఎఫ్‌ 3 శాతం పెరుగుతుంది. కోళ్ల మేతలో వాడినప్పుడు వచ్చే గుడ్లలో ఆల్బుమిన్‌, గ్లాబ్యులిన్‌, బీటాకెరోటిన్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది.
పశువుల దాణాగా, కోళ్ల మేతగా వాడుతున్న అజొల్లాలో 25-30 శాతం ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, లవణాలు, విటమిన్లు, బీటా కెరోటిన్‌ వంటి పశువులకు అత్యంత అవసరమైన మూలకాలు ఉంటాయి. మేతలో అజొల్లాను వాడినప్పుడు కోళ్లు బరువు పెరగడం, గుడ్లు పెరగడం పరిశోధనల్లో తేలింది. కోళ్లకు అజొల్లాను మేతగా వాడినప్పుడు వచ్చే గుడ్లలో బీటా కెరోటిన్‌, ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అజొల్లా వాడకం వల్ల కోళ్లు వ్యాధులను తట్టుకునే గుణం పెరుగుతుందని చెబుతున్నారు.
పురుగులు, తెగుళ్ల ఉధృతి అజొల్లాలో తక్కువ. బెడ్‌లో అజొల్లా ఎక్కువగా ఉన్నట్లైతే పురుగులు, తెగుళ్లు వచ్చే అవకాశం తక్కువ. పురుగుల నివారణకు 5ఎంఎల్‌ వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు సూడోమోనాస్‌ ప్లోరసెన్స్‌, ట్రైకోడెర్మ విరిడిలను 100 గ్రాములు చొప్పున వాడాలి. అజొల్లా నీడ ఉన్న ప్రాంతంలో వేయాలి. ప్రతి రోజు కలియతిప్పుతూ 2-5 సెంటీమీటర్ల నీళ్లు నిల్వ ఉండేలా చూడాలి. ప్రతి 10-15 రోజుల తర్వాత 2/3 భాగాలు తీసి వాడుకోవాలి.
వరిలో నీరు తీసినప్పుడు అజొల్లా మట్టిలో కలిసిపోయి సేంద్రియ పదార్ధంగా ఉపయోగపడుతుంది. అజొల్లా కలుపు మందులను తట్టుకోలేదు. కావున వరి పొలాల్లో వేసేటప్పుడు కలుపు మందులు వాడిన 3-4 రోజుల తర్వాత అజొల్లా వేసుకోవాలి. అజొల్లా దిగుబడి వర్షాకాలం, శీతాకాలం ఎక్కువ. వేసవిలో తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
Credits : Andhrajyothi

మామిడికి తేనెమంచు పురుగు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రైతులకు వివిధ పంటల సంరక్షణకై ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడి పంటకు తేనె మంచు పురుగులు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. తేనె మంచు పురుగు, పక్షికన్ను తెగులు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్‌ + 1 గ్రాము కార్బండజిమ్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు కనుక సోకినట్లయితే 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా ఒక మి.లీ. కారాతేన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న
పైరు మొలిచిన 10-15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు 25-30 రోజుల దశలో కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను ఎకరాకు 3-4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి. మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితులలో పేనుబంక ఆశించే అవకాశముంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమిటాన్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్‌ పంటలలో డైమండ్‌ రెక్కల పురుగు నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్‌ లేదా 0.3 మి.లీ. స్పినోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పంట కోతకు 15 రోజుల ముందుగా పిచికారీ చేయాలి.
వరిలో కాండం తొలుచు పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15-20 రోజుల లోపు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి.
Credits : Andhrajyothi

సిరులిచ్చే వరి వంగడం

  • 20 శాతం అధిక దిగుబడి
  • సీసీఎంబీ శాస్త్రవేత్త సృష్టి
  • త్వరలో అందుబాటులోకి..
మనుషుల్లో మాదిరిగానే మొక్కల్లో కూడా జన్యువులు ఉంటాయి. వాటిని గుర్తించి మార్పులు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. మన దేశంలో మొక్కల జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న సంస్థ సీసీఎంబీ ఒకటే!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పోలిస్తే.. 20 శాతం అదనంగా దిగుబడినిచ్చే కొత్తరకం వరిని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ (సీసీఎంబీ) శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. ఇది ఈ ఏడాది ఖరీఫ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ వంగడం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. వీటి కోసం మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సీసీఎంబీ కూడా మేలు రకం వంగడాల్లోని పది వేల రకాల జన్యువులను సేకరించి వాటి ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కొత్తరకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ‘ప్రతి వరి రకంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఉదాహరణకు కొన్ని వరి రకాలు త్వరగా పండుతాయి. కొన్నింటికి రకరకాల చీడపీడలను తట్టుకొనే శక్తి ఉంటుంది. వీటన్నింటికీ కారణం వాటిలో ఉండే జన్యువులు. ఆయా వరి రకాల్లో ఉన్న మంచి లక్షణాలకు కారణమైన జన్యువులను వేరు చేసి వాటి ద్వారా కొత్త రకాన్ని అభివృద్ధి చేశాం. దీనిపై ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి దాదాపుగా పూర్తయినట్లే. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీనిని ఈ ఏడాది మధ్యలో రైతులకు అందిస్తాం’ అని ఈ వరి రకాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్‌ హితేంద్ర పటేల్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఏదైనా కొత్తరకం వరిని విడుదల చేసే ముందు మూడేళ్ల పాటు పరీక్షలు జరుపుతారు.
ఈ పరీక్షల్లో పర్యావరణం, ఇతర పంటలు, ప్రాణులకు ఎటువంటి హాని ఉండదని తేలిన తర్వాత దానిని మార్కెట్‌లోకి విడుదల చేయటానికి అనుమతిస్తారు. సీసీఎంబీ ఇప్పటికే వివిధ రకాల చీడపీడలను తట్టుకొనే వరిని అభివృద్ధి చేసింది. ‘పంటల విషయంలో జన్యుస్థాయిలో పరిశోధనలు చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని వేల ఏళ్ల పరిణామక్రమం తర్వాత ఈ పంటలు ప్రస్తుత స్థితికి వచ్చాయి. అంటే వాటిలో ఉండే జన్యువుల కూడా అనేక రకాల మార్పులకు లోనయ్యాయి. మేము అలాంటి మార్పులు రావటానికి కారణమైన జన్యువులను ముందుగా గుర్తిస్తాం.
ఉదాహరణకు.. ఒక రకం వరి మిగిలిన వాటి కన్నా ముందే సిద్ధమవుతోందనుకుందాం. దీనికి కారణమైన జన్యువులను మేము గుర్తిస్తాం. ఈ జన్యువులను విడదీసి వేరే రకాల్లో ప్రవేశపెడతాం. ఆ తర్వాత ఈ జన్యువులు ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన మార్పులను గమనిస్తాం. ఉదాహరణకు ఎక్కువ దిగుబడినిచ్చేందుకు కారణమైన ఒక జన్యువును ప్రవేశపెడితే దాని వల్ల మొక్కకు చీడలను తట్టుకొనే శక్తి తగ్గిపోవచ్చు.. ఇలాంటి రకరకాల చర్య – ప్రతిచర్యలను గమనించిన తర్వాత కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తా’ అని వివరించారు. గత ఏడాది సీసీఎంబీ సాంబమసూరిలో ఒక కొత్త రకాన్ని రైతుల కోసం విడుదల చేసింది. ‘దక్షిణ భారత దేశంలో సాంబమసూరిని ఎక్కువగా తింటారు. అందుకే మేము ఆ రకాన్ని ఎన్నుకున్నాం. కొత్తరకం వరికి కూడా ఇదే మూలం’ అని హితేంద్ర వివరించారు.
 Credits : Andhrajyothi

సేంద్రియ మునగ

  • సత్ఫలితాలు ఇస్తున్న వేస్ట్‌ డీకంపోజర్‌
 
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బ్యాక్ట్టీరియాను తీసి, నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన వేస్ట్‌ డీకంపోజర్‌ అద్భుతాలు చేస్తున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రియ పద్ధతుల్లో ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తున్నది.
వేస్ట్‌ డీకంపోజర్‌తో మునగ సాగు విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో 2015లో 3023 మొక్కలను నాటారు. వాటిలో అంతర్‌ పంటగా, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా వేస్టు డీకంపోజర్‌, లొట్టపీస్‌ ఆకు కషాయం, పుల్లని మజ్జిగను మునగ తోటకు స్ర్పే చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు.
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బాక్టీరియాలను నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన 250 మిల్లీలీటర్ల వేస్ట్‌ డీకంపోజర్‌ను రూ. 20కు కొనుగోలు చేస్తారు. దీనిని 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లంతో పాటుగా కలపాలి. ఆరు రోజుల తరువాత దాన్ని తీయాలి. ఆ మిశ్రమాన్ని మరో ఆరు రోజుల పాటు పంటలపై పిచికారీ చేస్తే మునగ, ఇతర పంటలపై పురుగులు నాశనం అవుతాయి. మొక్కకు పోషకాలైన నైట్రోజన్‌, పాస్ఫరస్‌, పొటాషియం అంది ఏపుగా పెరుగుతాయి. కేజీ లొట్టపీస్‌ ఆకులు బాగా నూర్పిడి చేసిన తరువాత 10 లీటర్ల నీటిలో వేడిచేయాలి. ఆ తర్వాత చల్లార్చి వడపోయాలి. దానికి మరో 250 గ్రాముల సర్ఫ్‌ను కలిపి ఒక ఎకరానికి స్ర్పే చేయడానికి అవకాశం ఉంది. దీంతో పంటపై లద్దె పరుగు, పచ్చపురుగు, ఆకుచుట్ట పురుగు చనిపోతుంది. కేజీ పుల్లని పెరుగును, ఆరు లీటర్ల నీటిలో ఆరు రోజుల పాటు మురగబెట్టాలి. ఆ తరువాత వడబోసి స్ర్పేచేస్తే పూత రాలడం ఆగిపోతుంది. గతంలో బొప్పాయి సాగులో ఇలాంటి ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇప్పుడు మునగ సాగులో కూడా ఉపయోగించి అధిక దిగుబడులు పొందుతున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ నిర్వాహకులు చెప్పారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కల్వకుర్తి అర్బన్‌
Credits : Andhrajyothi

తెలంగాణకు డ్రాగన్‌ ఫ్రూట్‌ రుచులు

  • మిర్యాలగూడ రైతు వినూత్న ప్రయోగం
తెలంగాణ గడ్డపై తొలిసారి డ్రాగన్‌ఫ్రూట్‌
సాగు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి
చెందిన రైతు యాదగిరి. విదేశాల నుంచి
దిగుమతి చేసుకునే ఈ పండును మనమే
ఎందుకు పండించకూడదనుకుని ఎంతో
పరిశోధన చేసి విజయం అందుకున్నారాయన.
మిర్యాలగూడకు చెందిన రైతు, ఐరన్‌ సిండికేట్‌ వ్యాపారి యాదగిరి వ్యాపార రీత్యా థాయిలాండ్‌ వెళ్లారు. అక్కడ డ్రాగన్‌ఫ్రూట్‌ రుచి చూశారు. ఎన్నో పోషకాలున్న ఈ పండును తెలంగాణ గడ్డపై పండించాలనుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామశివారులోని తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ విజయవంతంగా సాగు చేసి తెలంగాణ రైతాంగానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇందుకోసం ఎంతో శ్రమించారు యాదగిరి. థాయిలాండ్‌లో ఆ పండు గురించి ఆరాతీశారు. మెళకువలు తెలుసుకున్నారు. కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూర్‌ వంటి నగరాల సమీపంలో సాగవుతున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలను పరిశీలించారు. కోల్‌కతాలో ఫంగస్‌, వైర్‌సలేని డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల అంట్లను వ్యయప్రయాసలకోర్చి తెప్పించారు. వాటిని ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట తన బత్తాయి తోట సమీపంలో వున్న ఎకరన్నర భూమిలో సాగు చేసి, తెలంగాణ గడ్డపై డ్రాగన్‌ ఫ్రూట్‌ను పండించిన ఘనత అందుకున్నారు. ఆ స్ఫూర్తితో మరో 14 ఎకరాల్లో తానే స్వయంగా అంట్లు కట్టుకొని డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను విస్తరించారు. 15 ఏళ్ల క్రితం 40 ప్రాంతాల్లో బత్తాయి తోటలను పరిశీలించి ఏరికోరి తిరుపతి యూనివర్సిటీ నుంచి బత్తాయి మొక్కలను తెచ్చి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక బత్తాయి దిగుబడిని సాధించిన రైతుగా కూడా గుర్తింపు పొందారు యాదగిరి. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ఖర్చుతో కూడుకున్నది. ఒక ఎకరా సాగు చేయాలంటే సిమెంట్‌ స్తంభాలు, సిమెంట్‌ రింగ్‌ (బండిచక్రంలా), డ్రిప్పు, మొక్కకు కలిపి రూ. 1400 ఖర్చవుతుంది. ఎకరాకు నాలుగు వందల స్తంభాలు పాతి ప్రతి స్తంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటాలి. డ్రిప్పు ద్వారా అడపాదడపా నీటినిస్తే సరిపోతుంది. ఏడాది తరువాత చక్రానికి పాకిన డ్రాగన్‌ చెట్టు చక్రం నుంచి కిందకు వేలాడుతూ పూత పూస్తుంది. ఏడాదిన్నర తరువాత మొదటి పంట చేతికందుతుంది. ఏటా ఆగస్టు నుంచి నవంబర్‌ మాసాల మధ్యలో పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు మూడు సంవత్సరాల తరువాత నాలుగు టన్నుల చొప్పున పంట దిగుబడి వస్తుంది. ఐదు సంవత్సరాలు దాటిన తోటల్లో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ రైతు చేతికందుతాయి.
టన్ను ధర రూ. లక్ష
డ్రాగన్‌ ఫ్రూట్‌కు మన మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వాటి కోసం ఇతర దేశాల మీదే ఎక్కువ ఆధారపడున్నాం. ప్రస్తుతం డ్రాగన్‌ ఫ్రూట్‌ టన్ను రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ధర పలుకుతోంది. తెలంగాణ రైతు యాదగిరి ఎకరన్నర పొలంలో సాగు చేసిన తోటనుంచి మొదటి విడతగా రెండు టన్నుల డ్రాగన్‌ ఫ్రూట్‌ల దిగుబడి సాధించారు. వీటిని టన్నుకు 1.15 లక్షల చొప్పున చెన్నై, కోల్‌కతా పండ్ల వ్యాపారులకు విక్రయించారు. లాభదాయకంగా ఉండడంతో కోల్‌కతా నుంచి తాను తెచ్చి సాగు చేసిన డ్రాగన్‌ మొక్కలకే అంట్లు కట్టి మొక్కలు పెంచారు. ఆ మొక్కలనే తన 14 ఎకరాల పొలంలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు యాదగిరి. ఈ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేసిన తోటను గత నెలలో తెలంగాణ హార్టికల్చర్‌ శాఖ కమిషనర్‌ వెంకట్‌రామిరెడ్డి సందర్శించారు. తెలంగాణ ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ తోటలను రైతులు విరివిగా పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రైతులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
మొక్కల సరఫరాకు సిద్ధం
తెలుగు రాష్ట్రాల రైతులకు డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను సరఫరా చేసే ఆలోచనతో నేనే స్వయంగా మొక్కల అంట్లు కట్టించే పని చేపట్టాను. విదేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతుల్ని గమనించాను. ఆ అనుభవంతో ఆసక్తి వున్న రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు సిద్ధంగా వున్నాను.
– యాదగిరి, రైతు
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మిర్యాలగూడ
Credits : Andhrajyothi