వరినాటే యంత్రం..

 • 30 శాతం ఆదా..
 • ఎకరంలో నాట్లకు 3 వేల అద్దె
డీజిల్‌ సహాయంతో బురదలో నడిచే ఈ వరినాటు యంత్రం (ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్‌) ఐదెకరాలకు పైగా భూమి వున్న రైతులకు ప్రయోజనకరం. కూలీల కొరతను అధిగమించడం, ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో పాటు ఈ యంత్రం వల్ల 20 శాతం దిగుబడి అధికంగా వస్తున్నది. రోజుకు ఈ యంత్రం ఆరెకరాల పొలంలో వరి నాటుతుంది. ఇరవై సెంటీమీటర్ల దూరంతో వరినాటును క్రమం తప్పకుండా బురదలో వేస్తుంది.
కూలీల కంటే ఖర్చు తక్కువ
మాములుగా కూలీలతో పొలంలో వరినాటు వేయడానికి ఎకరానికి రూ.4500 నుంచి రూ.5000 వేలు ఖర్చు అవుతుంది. యంత్రం సహాయంతో నాటు వేయడం ద్వారా ఎకరానికి రూ.3 వేలు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. కూలీలతో పోల్చి చూస్తే రూ.1500లు రైతుకు మిగలడమే కాకుండా కూలీల సమస్యను అధిగమించవచ్చు. దుక్కి దున్ని పొలాన్ని దమ్ము చేసుకున్న తర్వాత వరి నాటే రోజున నలుగురు కూలీల సహాయంతో ఈ యంత్రంతో రోజుకు ఆరెకరాల నారు నాటుకోవచ్చు.
నారును సిద్ధం చేసుకోవడం ఇలా…
యంత్రానికి అవసరమైన నారును ముందుగానే ప్రత్యేకంగా ఎర్రమట్టి, గొర్రెలు-పశువుల ఎరువుతో పాటు మరికొన్ని సేంద్రియ ఎరువులను వినియోగించి ట్రేలలో నారును పెంచాలి. మట్టిని సన్నగా చేసి ట్రేలో ఎంత మోతాదులో మట్టి వేయాల్సి ఉంటుందో అంతే మోతాదులో ట్రేల్లోని గదులను పూర్తిగా ఎరువుల మిశ్రమంతో నింపాలి. ఎర్రమట్టి, గొర్రెలు, పశువుల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువులను సన్నని పొడిగా మార్చేందుకు ప్రత్యేకంగా గిర్ని (మర) ఉంటుంది. ఇది వరి నాటే యంత్రం వెంటే వస్తుంది.
యంత్ర యజమాని ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఎరువుల మిశ్రమాన్ని తయారుచేసుకుని వరి విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగానే ఎన్ని ఎకరాల్లో వరి నాటు వేస్తారో ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. దాని మేరకు అవసరమైన ట్రేలను సమకూరుస్తారు. ఎరువుల మిశ్రమంతో నింపిన తర్వాత ట్రేలను మరో యంత్రం వద్ద ఉంచుతారు. ఆ యంత్రంలో వరి విత్తనాలు పోస్తారు. ఒక్కో ట్రేలో ఎన్ని విత్తనాలు అవసరమో ఆ మేరకు విత్తనాలను ఆటోమెటిక్‌గా తీసుకుంటుంది.
సబ్సిడీ ఇస్తే రైతులు రెడీ
తొలిసారిగా యాసంగి సీజన్‌లో వరినాటు యంత్రంతో ప్రయోగం చేశాను. ఇది విజయవంతమైతే వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కల్లా రెండు యంత్రాలను కొనుగోలు చేస్తాను. విదేశాలల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. యంత్రం ఖరీదు ఎక్కువగా వుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే పలువురు రైతులు దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు.
– వి.యాదగిరిరెడ్డి, పెద్దారెడ్డిపేట గ్రామ రైతు, పుల్‌కల్‌ మండలం
వరి నాట్లు వేసేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. కూలీల కంటే తక్కువ ఖర్చుతో నాట్లు వేసే ఈ యంత్రం ఖరీదు 28 లక్షలు రూపాయలు. రోజుకు ఆరెకరాల పొలంలో వరి నాటే ఈ యంత్రం రైతులకు వరం అంటున్నారు నిపుణులు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి

రాతి నేలపై రతనాల పంటలు

 • ఏడు గిరిజన గూడాల్లో నవచైతన్యం
ప్రకృతిని సవాలు చేస్తూ రాతినేలపై అద్భుతమైన పంటలు పండిస్తున్నారు ఈ గిరిజన రైతులు. చైనా, వియత్నం, కంబోడియా దేశాల్లో మాత్రమే కొండలు, గుట్టలను తొలిచి పంటలను పండిస్తున్నారు. వారిని తలదన్నే రీతిలో రాతినేలపై సేంద్రియ సేద్యం చేస్తూ శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్న ఆసిఫాబాద్‌ గిరిజన రైతుల స్ఫూర్తిగాథ.
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల గుండాల అటవీ ప్రాంతం అది. పది కిలోమీటర్లు కాలినడక అడవుల గుండా వాగులు.. వంకలు.. గుట్టలు ఎక్కిదిగితే కానీ అక్కడికి చేరుకోలేం. ఆ ప్రాంతంలోని అర్జిగూడ, లచ్చిపటేల్‌గూడ, దొడ్డిగూడ, దాబాగూడ, చిక్కలగూడ, రాజుగూడ, గుడివాడ గ్రామాల పరిధిలో నేలంతా పరుపురాయి పరుచుకుని వుంటుంది.
15 ఏళ్ల క్రితం ఇక్కడ సాగు భూమి కాదుకదా కనీసం గడ్డి కూడా మొలిచే పరిస్థితి లేదు. ఇదే గ్రామానికి చెందిన ఓ విద్యాధికుడు సోయం బొజ్జిరావు గిరిజనుల దుర్భర జీవితాల్ని గమనించి చలించిపోయాడు. విదేశాల్లో కొండలపై జరుగుతున్న వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు.
రాతి నేలపై పంటలు ఎందుకు పండించకూడదన్న ఆలోచన రావడంతో దీనిపై ప్రయోగాత్మకంగా ముందు కొంత విస్తీర్ణంలో ఆచరణలో పెట్టి విజయం సాధించారు. దాంతో ఊరంతా ఈ తరహా సేద్యం చేయడానికి ముందుకొచ్చి బొజ్జిరావుతో చేతులు కలిపారు. దూరప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై మట్టిని తరలించుకొచ్చి రాతి నేలపై దాదాపు అడుగున్నర మందంతో నింపారు.
మొత్తం విస్తీర్ణాన్ని మడులుగా విభజించి నీటిని తట్టుకునే వరి వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టారు. మొదటి ఏడాది ఆశించిన దానికంటే అధిక దిగుబడులు రావడంతో మరుసటి ఏడాది నుంచి రెట్టించిన ఉత్సాహంతో మరింత మట్టిని తీసుకువచ్చి అందుబాటులో ఉన్న పశువుల పేడను ఉపయోగించి తమ పొలాలను సారవంతమైన నేలలుగా తీర్చిదిద్దారు.
ఇలా యేటా ఖరీఫ్‌, రబీ సీజన్‌ల ఆరంభానికి ముందు తమ దుక్కులను తయారుచేసుకుని సంప్రదాయ పంటలన్నీ సాగు చేస్తూ ఆకలిని జయించారు ఆ ప్రాంత గిరిజనులు. వర్షాకాలంలో అందుబాటులో ఉండే నీటిని నిలువ చేసుకుని ఖరీఫ్‌, రబీలో వరి, మొక్కజొన్న, శనగ, జొన్న, కంది వంటి పంటలే కాకుండా నిరంతర ఆదాయాన్ని సమకూర్చే కూరగాయల జాతికి చెందిన పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. సగటున ఎకరాకు 12 నుంచి 20 బస్తాల వరకు పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేయడం విశేషం.
ఆ ప్రాంత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బొజ్జిరావు అకాలమరణం పాలయ్యారు. అయినా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు గిరిజన రైతులు. వందకు పైగా ఎకరాల్లో వరి, మక్క, పెసర ఖరీఫ్‌ పంటలతో పాటు కంది, పెసర, శనగ, జొన్న పంటల్ని రబీ పంటలుగా పండిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన మైసమ్మ చెరువు నీటిని పూరి స్థాయిలో వినియోగించుకొంటున్నారు.
బొజ్జిరావు కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ 250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయన పేరుతో ఒక కుంటను నిర్మించింది. రెండు చెక్‌ డ్యాంలను నిర్మించింది. ఇక్కడి రైతుల పట్టుదలను గుర్తించి దాన్‌ ఫౌండేషన్‌ సంస్థ వారు గ్రామాన్ని దత్తత తీసుకొని స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టారు. అయిదు రైతు క్లబ్‌లను ఏర్పాటుచేసి వ్యవసాయ రంగంలో మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
అన్నానికి ఢోకా లేదు
మునుపు మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే ఒక పూట తిండి పెట్టే శక్తి మాకు ఉండేది కాదు. బొజ్జిరావు మాకు అన్నం పెట్టిండు. రాళ్ల భూముల్లో ఎలా పంటలు పండించాలో చూపించాడు. మా ఎడ్లబండ్లతో వేరే చోటు నుంచి మంచి మట్టి తెచ్చి పొలంలో పోసుకుని చెరువు నీటి పదును పెట్టి వరి పంట కూడా బాగా పండిస్తున్నాం. ఇంట్లో అందరికీ పని దొరుకుతుంది.
-మర్సుకోల తిరుపతి, గ్రామస్తుడు
బొజ్జిరావు స్పూర్తితో..
మా గ్రామ యువకుడు బొజ్జిరావు చూపిన మార్గంలో రాళ్ల భూముల్లో అడుగు మందం మట్టి పోసి మంచి పంటలు పండించుకుంటున్నాం. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరి ధాన్యం పండిస్తున్నాం. పత్తి పంట కూడా వేస్తున్నాం. చెరువు నీటిని వాడుకొని మక్క పంట వేస్తున్నాం. ఈ భూముల్లో రబీలో కంది, పెసర, జొన్న పంటలు పండిస్తున్నాం.
– కోవ హన్మంతు, గ్రామ పటేల్‌, గుండాల
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆసిఫాబాద్‌
Credits : Andhrajyothi

వరి సాగులో లాభాలు ఎలా?

వరి సాగు ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రైతులను సంక్షోభంలో పడేస్తున్న ఈ సమస్యను అధిగమించడమెలా?
– పోలిశెట్టి వీరన్న, రైతు
చీడపీడలు తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు రైతులకు అందుబాటులో వున్నాయి. సార్వాలో ఎకరాకు 45 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. దాళ్వాలో 50 బస్తాల వరకు దిగుబడి సాధించారు. ఇందుకు ఎంటీయూ 1156, ఎమ్‌టీయూ 1120 వంటి నాణ్యమైన అధిక దిగుబడులను ఇచ్చే విత్తన రకాలను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు సూచించిన రీతిలో అవసరమైన మేరకే ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల రైతులు ఖర్చులు అదుపులో వుంచుకుంటే లాభాలు పెరుగుతాయి.
– సి. భవాని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, విత్తన పరిశోధన కేంద్రం
Credits : Andhrajyothi

పెట్టుబడులు తక్కువ

సేంద్రియ సేద్యం ఈ కాలంలో తారకమంత్రంగా మారింది. పుడమితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ సేద్యం ఏకైక మార్గం. ఆరోగ్యవంతమైన నేల, పంట, ఆహారం.. ఇదే మన లక్ష్యం అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేంద్రియ సేద్యం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నది.
సేంద్రియ సాగులో ఖర్చులు తక్కువ. 2006లో ఎకరాతో మొదలు పెట్టి ఇప్పుడు మూడెకరాల్లో సేంద్రియ వరి సాగు చేస్తున్నాను. రసాయన ఎరువులతో 25-30 బస్తాల దిగుబడి వచ్చేది. సేంద్రియ ఎరువులతో 24 బస్తాల ధాన్యం వచ్చింది. ఎకరానికి రూ.10 వేల పెట్టుబడితో అనేక రెట్లు ఆదాయం లభించింది. సేంద్రియ పద్ధతి పంటకు బస్తాకు రూ.200 అదనపు ధర దక్కింది.
– బి.అప్పలనాయుడు, సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా
Credits : Andhrajyothi

వేరుశనగకు ఆకుముడత బెడద

మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేస్తున్నారు. వేరుశనగకు ఆకుముడత తెగులు సోకింది. ఈ తెగులుతో పాటు పచ్చపురుగు, వేరుపురుగు, దోమకాటు వస్తున్నాయి. దీంతో దిగుబడులు తగ్గి, భారీగా నష్టపోయే ప్రమాదం వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఆకుముడత, దోమతో పాటు వేరుపురుగు కూడా వచ్చింది. పంటకు నష్టం వాటిల్లుతోంది. నివారణకు ఏంచేయాలో తోచడం లేదు.
– స్వరూపరెడ్డి రైతు ఇబ్రహీంబాద్‌, హన్వాడ మండలం
సస్యరక్షణ చర్యలు ఇలా…
వేరుశనగ పంటకు సోకుతున్న ఆకుముడత, పచ్చపురుగు తెగుళ్ల నివారణకు రైతులు మందులు పిచికారీ చేయాలి. ఆకుముడత నివారణకు మోనోక్రొటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్ల మం దును ఒక లీటర్‌ నీటితో కలిపి లేదా క్లోరోపైరిఫాస్‌ 2.5 మి.లీ. ఒక లీటర్‌ నీటితో కలిపి పిచికారీ చేస్తే తెగుళ్లు సోకవు. పచ్చ పురుగుకు బెంజత్‌ 100 గ్రా. మందును పది లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. వేరు తినే పురుగుల నివారణకు గుళికలు ఎకరాకు 6 కేజీలు వేయాలి.
– చంద్రమౌళి, ఏ.ఓ.
Credits : Andhrajyothi

ఎకరంలో వరి సాగు..లక్ష ఆదాయం

 • ప్రకృతి సేద్యంలో కృష్ణా రైతు ఆదర్శం
కాయకష్టంతో పాటు కాలానుగుణంగా ఆధునిక సాగు పద్ధతుల్ని అందిపుచ్చుకుంటున్న రైతులు అద్భుతాలు చేస్తున్నారు. ఎకరం భూమిలో వరి సాగు చేసి లక్ష రూపాయల ఆదాయం ఆర్జించారు ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రైతు జలసూత్రం వీరవసంతరావు. తనకున్న చౌడు భూమిని ఎంతో శ్రమించి, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా సారవంతం చేశాడు ఆ రైతు. చౌడు నేలలో ప్రకృతి వ్యవసాయం ఏమిటని అందరూ అవహేళన చేశారు.
మొదటి సంవత్సరం రసాయనాలు నిండిన భూమిని సారవంతం చేసేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతాలు వాడి పంటలకు అనువుగా భూమిని సిద్ధం చేశారు. మొదటి ఏడాది ఎకరాకు 24 బస్తాలు పండించగా రెండో ఏడాది ఎకరాకు 32 బస్తాలు, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు 44 బస్తాల దిగుబడిని సాధించారు. వచ్చే ఏడాది గరిష్ఠంగా ఎకరాకు 55 బస్తాలు పండించగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది తన పొలంలో సాగు చేసిన వరి కంకికి 320 గింజల దిగుబడి వచ్చిందని, దుబ్బు 40 పిలకలు చేయడంతో మంచి దిగుబడి సాధ్యమైందన్నారు. చీడపీడలను గుర్తించేందుకు పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటుచేసి వ్యవసాయ అధికారుల సూచనలకు అనుగుణంగా కషాయాలను మాత్రమే పిచికారీ చేసి తెగుళ్లు సోకకుండా ఆరోగ్యవంతమైన పంటను పండించామన్నారు. ఈ విధానం ద్వారా పండించిన పంట నాణ్యత, రుచి అధికంగా ఉండటంతో మార్కెట్లో ఈ ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉంటోంది.
ఈ రకం బియ్యం కేజీ ధర రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. కనీస ధర రూ.50 చొప్పున అమ్మితే ఎకరాకు పండిన 3,240 కేజీల ధాన్యానికి 2,430 కేజీల బియ్యం వస్తుందని, దీనికి మార్కెట్లో రూ.1,21,500 ఆదాయం లభిస్తోంది. ‘భవిష్యత్‌లో ప్రకృతి వ్యవసాయం నిరుద్యోగ యువతకు వరం కానుంది. వరి, వేరుశనగ, మిర్చి, జామ, మామిడి, మినుము, కరివేపాకు పంటల్లో కూడా ఊహలకు అందని దిగుబడులు సాధించి చూపాం. కాలుష్యరహిత ఉత్పత్తులను సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు వ్యవసాయ అధికారి జి.వి.శ్రీనివాసరావు.
పాలేకర్‌ స్ఫూర్తిగా..
ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్‌ శిక్షణ తరగతుల ద్వారా స్ఫూర్తి పొందాను. పట్టుదలతో సాగు చేశాను. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో విజయం సాధించాను. ఎకరం పొలంలో రూ. 15 వేల ఖర్చుతో వరి సాగుచేసి లక్షకు పైగా ఆదాయం పొందుతున్నాను. మామిడితోటలో కూడా సేంద్రియ సస్యరక్షణ ద్వారా 16 చెట్ల ద్వారా గత ఏడాది రూ.1,40,000 ఆదాయం పొందాను.
– జలసూత్రం వీరవసంతరావు, రైతు వడ్లమాను, కృష్ణాజిల్లా
Credits : Andhrajyothi

రంగు గోధుమలు వస్తున్నాయ్‌!

 

వరి పొట్టు రంగులో వుండే గోధుమలు ఇక ముందు మరిన్ని రంగుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. నలుపు, నీలం, ఊదా రంగుల గోధుమలను కూడా రూపొందించారు పంజాబ్‌లోని నేషనల్‌ అగ్రి-ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ (నబీ) శాస్త్రవేత్తలు. సాధారణ గోధుమలతో పోలిస్తే పుష్కలంగా పోషక విలువలున్న రంగు గోధుమలను ఐదేళ్ల పాటు శ్రమించి రూపొందించారు నబీ నిపుణులు.
బియ్యం, గోధుమలనే దేశంలోని ప్రజలు ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. బియ్యంతో పాటు సాధారణ గోధుమల్లో పోషక విలువలు స్వల్పంగా వుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా వుండే గోధుమలను సృష్టించేందుకు నబీ శాస్త్రవేత్తలు నడుంకట్టారు.
అలా రంగు గోధుమలు రూపుదిద్దుకున్నాయి. రంగు గోధుమల్లో సూక్ష్మ పోషకాలు అధికంగా వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇనుము, జింకు వంటి సూక్ష్మపోషకాలు అధికంగా వుండడం వీటి ప్రత్యేకత. ఊబకాయం, అధిక కొవ్వు, ఇన్సులిన్‌ నిరోధకతపై రంగు గోధుమలు ప్రభావం చూపుతాయని నమూనా అధ్యయనాల్లో తేలింది. సూక్ష్మ పోషక లోపాలున్న వారికి నాణ్యత కలిగిన ఈ గోధుమల ద్వారా ఇనుము, జింకు బాగా లభిస్తాయి.
రంగు గోధుమల దిగుబడి సాధారణ గోధుమల కంటే అధికంగా వుంటుందని, రైతులకు కూడా లాభసాటిగా వుంటుందని క్షేత్ర స్థాయి పరిశోధనల్లో వెల్లడైంది. ఫలితంగా రంగు గోధుమలు వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తాయి. సహజమైన రంగులతో పండే ఈ గోధుమల పిండితో బేకరీ ఉత్పత్తులను తయారు చేసుకునే వీలుంటుంది. త్వరలో ఈ గోధుమలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నబీ సంస్థ పేర్కొంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అమరావతి
Credits : Andhrajyothi

నకిలీ విత్తనాలు..పారాహుషార్

 • ఏటా వేల కోట్లు నష్టపోతున్న రైతులు.. సొంత విత్తనం మేలంటున్న నిపుణులు
విత్తనం రైతుకు, సాగుకు ప్రాణం. అధిక దిగుబడులకు మూలం. పూర్వం రైతులు సొంతంగా విత్తనాలు తయారుచేసుకునే వారు. హైబ్రీడ్‌ విత్తనాలు వచ్చాక విత్తనాల తయారీ, అమ్మకాలు కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిశోధనలు లేకుండానే, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌, ప్రకటన ల ఆర్భాటంతో నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటకడుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు.
రైతులకు అందుబాటులో వున్న విత్తనాలలో రెండు రకాలున్నాయి. ప్రభుత్వ విత్తనం: వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థలలో శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి విత్తనాలను తయారు చేస్తారు. వీటిని ఆయా పరిశోధన సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎపి సీడ్స్‌ ద్వారా రైతులకు అమ్ముతుంటారు
ప్రైవేటు విత్తనం: ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు తయారుచేసే విత్తనాలు. నిబంధనల మేరకు సుమారు 15-20 ఎకరాలు భూమి ఉండాలి. దానిలో పండించి పరిశోధనలు చేసిన విత్తనాలను పరిశీలించడానికి ఎజిబిఎ్‌ససి, ఎంఎ్‌ససి చదివిన నిపుణులైన బ్రీడర్‌ను ఆయా సంస్థలు ఎంపిక చేయాలి. ఆ బ్రీడర్‌ ఆధ్వర్యంలో తయారైన, పరిశోధించిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేయబోయే ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల బృందం పరిశీలించాలి. నాణ్యత, ఉత్పత్తిని పరిశీలించిన తరువాత ఆ రకాలను మార్కెట్‌లోకి అమ్మడానికి అనుమతులు ఇవ్వాలి. సుమారు 2-3 ఏళ్లు ఈ రకం విత్తనాలపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోతే ఆ కంపెనీ రకాలకు పూర్తి స్థాయి అమ్మకాల లైసెన్సులు ఇస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిశోధనలు, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ బి – రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌) లేకుండానే విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తులో తెలిపిన సర్వే నెంబర్లను పరిశీలించడం లేదు. ఒకే సర్వే నెంబర్‌ పేరుతో 3-4 విత్తన కంపెనీలు ఉంటున్నాయి. వీటితో పాటు ఈ కంపెనీలన్నింటికీ ఒకే బ్రీడర్‌ ఉంటున్నారు. రైతులకు ఆకర్షణీయమైన ప్యాకెట్‌లతో, వ్యాపార ప్రకటనలతో విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలక రాకపోయినా, పంట పండకపోయినా కంపెనీలు సరిగా స్పందించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కొమ్ముకాస్తున్నారు.
జాగ్రత్తలు ఇలా…
 • రైతులు విత్తనాలను లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి
 • జిన్నింగ్‌/లూజు పత్తి విత్తనాలను కొనుగోలు చేయరాదు.
 • బిల్లులో కొనుగోలు చేసిన తేదీ, విత్తనరకం, పరిమాణం, లాట్‌ నెంబర్‌, నమోదు చేయించి బిల్లును దాచుకోవాలి.
 • విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. మొలక శాతం తక్కువగా ఉంటే విత్తనాలను తిరిగి డీలర్‌కు ఇవ్వవచ్చు.
 • రైతులు బీటీ విత్తనాలతో పాటు నాన్‌ బీటీ పత్తి విత్తనాలు పొలంలో నాటటం ద్వారా కాయ తొలిచే పురుగుల తీవ్రతను తగ్గించుకోవచ్చు.
 • గ్రామాల్లో బిల్లు లేకుండా అమ్మితే మండల వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారి (ఎంఎవో) లేదా సహాయ సంచాలకులు (ఏడీ) లేదా జిల్లా కలెక్టరేట్‌లోని టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-4099కు ఫిర్యాదు చేయాలి..
 • ఏ డీలర్‌ అయినా ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి, ఏడీలకు ఫిర్యాదు చేయాలి. నకిలీ, లూజు విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిపిన వారికి ప్రభుత్వం రూ. 10వేలు పారితోషికంగా ఇస్తుంది.  – ఆంధ్రజ్యోతి ప్రతినిధి, గుంటూరు
పంట నుంచే సేకరించాలి
సాగులో విత్తనాలకు 20 శాతం ఖర్చవుతుంది. రైతుల వారు పండించిన పంటలో 2 నెలల ముందు బలమైన కంకులు, గుబ్బలు ఉన్న వాటిని సేకరించాలి. దాని ద్వారా విత్తనాలను తీసుకొని వాటిని శుద్ది చేసి భద్రపరుచుకోవాలి. ఈ విత్తనాలు వాడుకుంటే రైతుల డబ్బు ఆదా కావడంతో పాటు నకిలీ విత్తనాల బెడదను తగ్గించుకోవచ్చు. రైతులు హైబ్రీడ్‌ విత్తనాలపై వ్యామోహం తగ్గించుకోవాలి.
– డాక్టర్‌ పావులూరి రత్నప్రసాద్‌, ఎడిఆర్‌, లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం
Credits : Andhrajyothi

నకిలీ విత్తనాలు.. జర భద్రం

 • ఏటా వేల కోట్లు నష్టపోతున్న రైతులు
 • సొంత విత్తనం మేలంటున్న నిపుణులు
యాసంగికి రైతులు సిద్ధమయ్యారు. ఖరీఫ్‌లో నకిలీ విత్తనాల కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగిలో రైతులు మళ్లీ మోసపోకుండా వుండాలంటే విత్తనాల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎల్‌. జలపతిరావు.
తెలంగాణను విత్తన భాండాగారం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఈ ఖరీఫ్ లో కూడా రైతులు నకిలీ విత్తనాల కారణంగా మోసపోయారు. విత్తనాల మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. ప్రభుత్వ విత్తన సంస్థలు నిర్వీర్యం కావడంతో విత్తనాల ఉత్పత్తిలో ప్రైవేటు కంపెనీలది ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వ విత్తన సంస్థలను బలోపేతం చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో రైతులు ఏళ్లతరబడి మోసపోతూనే వున్నారు.
ఏటా వేల కోట్ల రూపాయలు నష్టపోతునే వున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న వారి ఆటలు కట్టించే పటిష్టమైన యంత్రాంగం లేదు. కొత్త విత్తన చట్టంతో వారి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు కార్యరూపం ధరించడం లేదు. డ్రాఫ్ట్‌ రూపంలో వున్న విత్తన చట్టాన్ని ఆమోదించి రైతుల్ని ఆదుకోవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. నకిలీ విత్తనాలు రాజ్యమేలడానికి రైతులు కూడా కొంతవరకు కారణం. దుకాణంలో కొన్న విత్తనాలు మాత్రమే అధిక దిగుబడులు ఇస్తాయని రైతులు భ్రమపడుతున్నారు. నాణ్యమైన పంటను మార్కెట్‌లో తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్నారు. వాటినే విత్తనాలుగా మార్కెట్‌లో ఎక్కువ డబ్బు పోసి కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారులు తమ నుంచి తక్కువ ధరకు పంట కొని, వాటికి నాసిరకం విత్తనాలు కలిపి మరీ ఎక్కవ ధరకు మళ్లీ మనకే విక్రయిస్తున్నారనే విషయం రైతులు గ్రహించాలి. రైతులు విత్తనాలను ఎక్కడినుంచో కొనాల్సిన అవసరం లేదు. వాళ్ల పండించిన పంటనే విత్తనంగా 3, 4 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. కొత్త వంగడం పండించాలంటే గ్రామంలో అంతకుముందు పండించిన వారి నుంచి విత్తనం తీసుకుంటే భరోసాగా వుంటుంది. మోసపోయే ప్రమాదం వుండదు. హైబ్రీడ్‌ విత్తనాలను మాత్రమే ఏటా కొనాల్సి వుంటుంది. వరి, పప్పులు, నూనె గింజల్లో హైబ్రీడ్‌ రకాలు లేవు. ఈ పంటలకు రైతులు తాము పండించిన పంటనే విత్తనాలుగా వేసుకోవాలి. ఈ అంశంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతులు సాధ్యమైనంత వరకు సొంత విత్తనాలను ఉపయోగించాలి.
పేరున్న కంపెనీ విత్తనాలే మేలు
నకిలీ విత్తనాలను చూడగానే గుర్తించడం కష్టం. అందుకే రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నకిలీ విత్తనాల బెడద నుంచి బయటపడవచ్చు. పేరున్న విత్తన సంస్థల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. తెలిసిన డీలర్‌ వద్ద కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ విత్తనాలను అంతకుముందు పండించిన వారికి అధిక దిగుబడులు వచ్చాయని నిర్ధారణ చేసుకున్న తరువాతే విత్తనాలు కొనాలి. కేవలం ప్రకటనలు చూసి కొనకుండా అధిక విస్తీర్ణంలో ఆ విత్తనం ఎలా దిగుబడి ఇచ్చిందో నిర్ధారించుకున్నాక కొనడం మేలు.
విత్తనం కొనుగోలు చేసినప్పుడు డీలర్‌ నుంచి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రసీదును, విత్తనం బ్యాగ్‌ కవర్‌ను పంట పండేంత వరకు భద్రపరచాలి. విత్తనం విషయంలో సమస్య ఎదురైతే రసీదును జతచేసి వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. మీడియా ద్వారా సాటి రైతులను అప్రమత్తం చేయాలి. వ్యవసాయ అధికారి వల్ల న్యాయం జరగకపోతే పరిహారం కోసం వినియోగదారుల కోర్టుకు వెళ్లేందుకు రైతులు ఏ మాత్రం సంశయించకూడదు.
విత్తన నాణ్యత తెలుసుకోండిలా…
విత్తనాల నాణ్యతను నిర్ధారించడానికి ఏ రకమైన విత్తనాలనైనా 100 గింజలు తీసుకొని ఇసుకలో నాటి తరచుగా నీరు పోయాలి. వరి విత్తనాలైతే 80, మొక్కజొన్న విత్తనాలు 90, పప్పు జాతి విత్తనాలు 70 గింజలు మొలకెత్తితే ఆ విత్తనాలను నాణ్యమైనవిగా పరిగణించవచ్చు. విత్తనాల ప్యాకెట్లపై ఉత్పత్తి చేసిన బ్యాచ్‌ నెంబర్‌, తయారైన తేదీ ముద్రించబడి ఉంటుంది. ఉత్పత్తి అయిన తొమ్మిది నెలలలోపు విత్తనాలు మాత్రమే సక్రమంగా మొలకెత్తుతాయి. ప్యాకెట్‌పై ఇంకా ఆ విత్తనం ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే సర్టిఫైడ్‌ చేసినట్లు లేక ప్రైవేట్‌ కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాలైతే కంపెనీపై గల విశ్వాసంతో కూడిన ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ ఉంటుంది. అంతేగాక విత్తనం మొలక శాతం కూడా ముద్రించబడి ఉంటుంది.
Credits : Andhrajyothi

ఎర్రజొన్న … లాభాల్లో మిన్న

 

 • 40 వేల ఎకరాల్లో సాగు
 • అంకాపూర్‌ రైతులకు సిరిజల్లు
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆర్మూర్‌ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు సాగవుతున్నాయి. అంకాపూర్‌ ప్రాంతంలోని రైతుల లోగిళ్లు సిరిసంపదలతో తులతూగడానికి ప్రధాన కారణం అయిన ఎర్రజొన్న సాగు విశేషాలు.
ఎర్రజొన్న గడ్డి జాతిపంట. ఇక్కడ పండిన ఎర్రజొన్నల్ని ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో గడ్డి విత్తనాలుగా వాడుతారు. 1983లో అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు ఏలూరు ప్రాంతానికి వ్యవసాయ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. అక్కడ ఎర్రజొన్నలు పండడం చూసి తమ ప్రాంతానికి కావాలని ఎపీ సీడ్స్‌ అధికారులను కోరారు. మొదట్లో రెండు వందల ఎకరాల్లో సాగయిన పంట విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ 40 వేల ఎకరాలకు చేరింది. ఎర్రజొన్నలు ఆరుతడి పంట. నీరు ఎక్కువగా అవసరముండదు. దాంతో పాటు లాభాలు బాగా రావడంతో అధిక సంఖ్యలో రైతులు ఎర్రజొన్న సాగువైపు దృష్టి పెట్టారు. ఎర్రజొన్న పంట సాగు చేసిన రైతులు ఏ సంవత్సరంలోనూ నష్టపోలేదు.
ధర ఒక సంవత్సరం ఎక్కువ, మరో సంవత్సరం తక్కువ వున్నా ఇతర పంటల మాదిరి నష్టపోలేదు. ఎర్రజొన్నలు పండించినప్పటి నుంచి ఆర్మూర్‌ ప్రాంత రైతులు ఆర్ధికంగా ఎదిగారు. అంకాపూర్‌తో పాటు ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో రైతులు ఆధునాతన భవంతులు నిర్మించుకుని, కార్లలో తిరుగుతున్నారంటే ఎర్రజొన్నల సాగు కూడా ఒక కారణం. ఎర్రజొన్న పంటకాలం 120 రోజులు. అప్పుడప్పుడు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. ఎకరానికి ఆరునుంచి ఏడు వేల వరకు ఖర్చవుతుంది.
దిగుబడి ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు వస్తుంది. ధర ఉంటే పెద్దమొత్తంలో గిట్టుబాటు అవుతుంది. ఎర్రజొన్నలు ఆర్మూర్‌ ప్రాంతంలో పండుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో మార్కెటింగ్‌ లేదు. ఇక్కడ పండిన పంట ప్రాసెసింగ్‌ చేసి ఐదుకిలోల ప్యాకెట్లు తయారుచేసి ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేస్తారు. అక్కడ వీటిని గడ్డి విత్తనాలుగా వాడుతారు. ఢిల్లీ, గుజరాత్‌, హరియాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపితో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఈ విత్తనాలకు బాగా డిమాండ్‌ వుంది.
ఆర్మూర్‌ ప్రాంతంలో ఎర్రజొన్నలపై రూ. 120 కోట్లపైన వ్యాపారం జరుగుతోంది. రైతుల వద్ద స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలో 53 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నవారు ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది. రెండేళ్ల క్రితం పోటీపడి కొనుగోలు చేయడంతో నాలుగు వేల పైన ధర పలికింది. గత సంవత్సరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో ధర రెండువేలకు పడిపోయింది. ప్రభుత్వ పరంగా ఎర్రజొన్న రైతులకు ఎలాంటి ప్రోత్సాహం అందడంలేదని రైతులు చెబుతున్నారు.
యాసంగిలోనూ సిరులు
రెండెకరాల్లో 30 ఏళ్లుగా ఎర్రజొన్న సాగు చేస్తున్నాను. వానాకాలంలో సోయా, మొక్కజొన్న పంట తీసి యాసంగిలో ఎర్రజొన్నలు వేస్తాను. ఎక రానికి 20 క్వింటాళ్ల పైన దిగుబడి వస్తుంది. ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ కావడంతో ఏటా ఇదే పంట వేస్తున్నాను.
– ఉట్‌వెల్లి రాజేశ్వర్‌, రైతు, ఆర్మూర్‌
Credits : Andhrajyothi