
ఫిబ్రవరిలో నరికిన మొక్క తోటలను కార్శి చేపడతారు రైతులు. ఆ సమయంలో నేల మట్టానికి పదునైన కత్తితో మొదళ్లు నరికి, ఆయా ప్రాంతాలకు సిఫారసు చేసిన నత్రజనిలో సగభాగం భాస్వరం, పొటాష్ ఎరువులు…చెక్కిన దుబ్బుల దగ్గర గుంతలు తీసి ఎరువు వేసి మట్టితో కప్పాలి. ఆ తరువాత తడి ఇవ్వాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కార్శి చేసి, ఎరువులు వేసి తడి ఇచ్చిన వెంటనే సమంగా పలుచగా కప్పాలి. కార్శి తోటలో మొక్కల సాంద్రతను బట్టి ఖాళీల భర్తీ తప్పక చేపట్టాలి. డిసెంబర్/జనవరిలో కార్శి చేసిన తోటలకు 45 రోజులకు రెండవ దఫా నత్రజని ఎరువును వాడుకోవాలి. నీటి వసతిని బట్టి తేలిక నేలల్లో వారానికి ఒక తడి, బరువు నేలల్లో 12-15 రోజులకు ఒక తడి ఇస్తే పీక పురుగు నివారింపబడి చెరకు తోటలో మంచి పిలకలు అభివృద్ధి చెందుతాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో మొక్కతోట నాటడానికి నేలను లోతు దుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. మధ్యకాలిక చెరకు రకాలను నాటడానికి, మొదటిగా చాళ్ళలో భాస్వరం, పొటాష్ ఎరువులు వాడుకోవాలి. చెరకు నాటిన మూడు రోజులలోపు ఎకరానికి రెండు కిలోల అట్రాజిస్ లేదా 600 గ్రాముల మెట్రిబ్యుజిన్ అను కలుపు నాశన మందులు చెరకు సాళ్ళు దిబ్బలపై పిచికారీ చేయాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కప్పాలి. జనవరిలో నాటిన మొక్కతోటలకు రెండవ దఫా నత్రజని ఎరువును మొదళ్ళ దగ్గర గుంతలు తీసివేయాలి. ఫిబ్రవరి మాసంలో పిలక కార్శి తోటలలో పీకపురుగు ఉనికిని గమనించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పీకపురుగు నివారణకై ట్రైకోకార్డులు వాడకం చాలా లాభదాయకం. 87ఏ 298 (విశ్వామిత్ర) రకానికి కొరడా తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కతోటల్లో ముచ్చెలు నాటే ముందు ప్రొపికొనజోల్ మందుతో లీటరు నీటికి 1.0 మి.లీ. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. మొక్కతోటల్లో కంటే కార్శి తోటల్లో కొరడా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రొపికొనజోల్ మందును ఒక మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి కార్శి చేసిన వెంటనే ఒకసారి, కార్శి చేసిన 30-40 రోజులకు మరొకసారి పిచికారీ చేయాలి.
చెరకు మొక్కతోట, కార్శి వర్షాధారపు చెరకు తోటలను నరికి చెరకును వీలైనంత తొందరగా కర్మాగారాలకు తరలించాలి. మొక్క తోటల్లో (డిసెంబరు/జనవరి తోటలకు) రెండవ దఫా నత్రజని మోతాదును వాడుకోవాలి. కూలీల లభ్యతను బట్టి మొక్కతోటలకు కొద్దిగా మొదళ్ళకు మట్టిని ఎగదోయడం వల్ల పీకపురుగు ఉధృతిని తగ్గించి, కలుపు సమస్యను కొంత మేరకు నివారించుకోవచ్చు. మొక్క తోటలకు కలుపు నివారణకు ఎకరానికి 1.8 కిలోల 2,4 డి ఒక లీటరు గ్రామక్సోన్ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్+ 1 కిలో 2,4డి కలిపిన ద్రావణాన్ని చెరకు చాళ్ళ మధ్య పిచికారీ చేసుకోవాలి. 2,4 డి గ్రామాక్సోన్ వాడునపుడు, ద్రావణం చెరకు చాళ్ళపై పడకుండా జాగ్రత్తపడాలి. డిసెంబరు/ జనవరిలో నాటిన మొక్క తోటలు తోటలకు నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలల్లో వారం, పది రోజులకు బరువైన నల్లనేలల్లో 15 నుంచి 20 రోజులకు ఒక తడి చొప్పున నీటి తడులు ఇచ్చి పంట పిలకలు తొడుగు దశ బెట్టుకు గురికాకుండా చూసుకోవాలి. చెరకు మొక్క లేదా కార్శి తోటల్లో పండ మార్చి మాసం (వేసవి) నుంచి పంట బెట్టకు గురికాకుండా నీటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. డిసెంబరు/జనవరి మొక్కతోటల్లో సాగు చేసిన పుష్ప ధాన్యపు అంతరపంటలను ఫలసాయం మార్చి మాసంలో తీసుకొన్న తరువాత చెరకు చాళ్ళ మధ్య అంతరకృషి యంత్రాలతో గాని నాగలితో గాని చేపట్టాలి. 87ఏ 298 (విశ్వామిత్ర) చెరకు రకాన్ని కార్శి చేసే రైతాంగం కార్శి చేసిన 30 రోజులకు ప్రొపికొనజోల్ 1.0 మి.లీ/లీ. నీటికి కలిపి తప్పక పిచికారీ చేయాలి. తద్వారా కాటుక తెగులును నివారించుకోవచ్చు. డిసెంబర్/జనవరి మొక్కతోటలకు కలుపు నివారణకు ఎకరానికి ఒక లీటరు గ్రామోక్సోన్ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్+ఒక కిలో గ్రాము 2,4 డి కలిపిన ద్రావణాన్ని చాళ్ళ మధ్య పిచికారీ చేయాలి.
– అనకాపల్లి అగ్రికల్చర్