వరి సాగుతో రైతన్నలకు సిరి

 

ఆంధ్రజ్యోతి, బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపంట వరి. దేశ ఆహార భద్రత వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తులో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో మరింత ఎక్కువ దిగుబడులు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుంచి పంటకోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా సాగుఖర్చు తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చునంటున్నారు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 22.11 లక్షల హెక్టార్లలో కాల్వలు, చెరువులు, బావులు కింద వరి పంట సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 68.64 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు రైతన్నలు. సరాసరి ఎకరానికి 1240 కిలోల దిగుబడి లభిస్తున్నది. కోస్తాంధ్రలో సార్వా (ఖరీఫ్‌) జూన్‌ నుంచి నవంబర్‌ వరకు, రాయలసీమలో జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉంటుంది. అదే దాళ్వా అయితే నవంబర్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ఆ ప్రాంతంలోని వర్షపాతం, నీటి లభ్యతమీద ఆధారపడి ఉంటాయి.
 

మేలైన యాజమాన్య పద్ధతులు 
వరి వంగడాల ఎంపిక: వివిధ ప్రాంతాలకు అనువైన వరివంగడాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన ఎంపికలోనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మంచి విత్తనం ఎంపికతో రైతుకు మేలు చేకూరుతుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజిమ్‌ను కలిపి 24 గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంపనారు అయితే లీటర్‌ నీటికి ఒక గ్రాము కార్బండిజిమ్‌ కల్పి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకలను దంపనారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటర్‌ మందు నీరు సరిపోతుంది.

వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించటం: కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజలలోని నిద్రావస్థను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి లీటర్‌నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10మిల్లిలీటర్‌లు గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండెకట్టాలి.

విత్తన మోతాదు: నాటే పద్ధతికి 20 నుంచి 25కిలోలు, వెదజల్లటానికి (భూముల్లో) 24 నుండి 30కిలోలు, వెదజల్లటానికి గోదావరి జిల్లాలో 10 నుండి 12 కిలోలు గొర్రుతో విత్తటానికి (వర్షాధారపు వరి) 30 నుంచి 36 కిలోలు అవసరం ఉంటుంది. శ్రీ పద్ధతిలో అయితే ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఆరోగ్యవంతంగా నారు పెంచటం ఇలా 

 • నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరుపెట్టటానికి, తీయటానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి.
 • 5 సెంట్ల నారుమడికి రెండుకిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, కిలో పొటాష్‌నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
 • మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
 • నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.
 • జింకు లోపాన్ని గమనిస్తే లీటర్‌ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీచేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరిసాగులో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 • విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేద క్లోరోపైరిఫాస్‌ 2మిల్లిలీటర్లు లీటర్‌ నీటికి కలిపి విత్తిన 10రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదంటే నారుతీయటానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.

Credits : Andhrajyothi

స్థానిక మొక్కలు బంగారం! 

 

 • వేప, కానుగ, దిరిశెన, చింత చెట్లతో జీవవైవిధ్యం..
 • అంతర్జాతీయ పర్యావరణ సంస్థ సభ్యులు ఆచార్య బి. రవిప్రసాదరావు

కేవలం అందంగా ఉండేవి కాకుండా జీవవైవిధ్యానికి మేలు చేసే మొక్కల్ని పెంచాలి. స్థానికంగా లభించే మొక్కలు మాత్రమే వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటాయి. స్థానికేతర మొక్కలకు ఆ శక్తి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క అడవిలో ఒక్కో చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఆ చెట్ల మొక్కల్ని అడవుల్లోనే పెంచి, వాటిని ప్రజలు నాటుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులు, అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం జీవవైవిధ్య పరిరక్షణ విభాగం ఆచార్యులు బి. రవిప్రసాద రావు.

ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య అట్లాస్‌ను రూపొందించడంతో పాటు నిజామాబాద్‌లో కూడా విస్తృతంగా పరిశోధనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన వృక్ష జాతుల్ని ఎలా కాపాడుకోవాలంటారు?
ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేల రకాల వృక్షజాతులు ఉన్నాయి. అందులో 500 వరకు చెట్లు కాగా మిగిలినవి గుల్మాలు, పొదలు. ఒక్కో అటవీ ప్రాంతంలో ఒక్కో మొక్క చక్కగా పెరుగుతుంది. ఆయా అడవుల్లోని అరుదైన చెట్లను అటవీ శాఖ వారు గుర్తించాలి. ఆ చెట్ల మొక్కలను అభివృద్ధి చేసి, వాటిని గ్రామాల్లో పెంచుకునేలా చేయాలి. అప్పుడే ఆ వృక్షజాతులు పదిలంగా ఉంటాయి. గతంలో పక్షులు అరుదైన వృక్షాల వ్యాప్తికి తోడ్పడేవి. అడవులు విస్తీర్ణం తగ్గి, పక్షులు కూడా తగ్గిపోతున్నాయి. అందుకోసం మనమే ఆ వృక్షాలను కాపాడేందుకు నడుంకట్టాలి.

కొన్నేళ్లుగా మొక్కలు విస్తృతంగా నాటుతున్నా వృక్షాలుగా ఎదుగుతున్నవి చాలా స్వల్పం. ఇందుకు కారణం? 

మొక్కలు నాటడం మీద ఉన్న శ్రద్ధ వాటి ఆలనా పాలనా చూసుకోవడం మీద ఉండటం లేదు. సరైన పరిజ్ఞానం లేక నీరు ఎక్కువగా అసరమయ్యే మొక్కల్ని నాటుతున్నారు. మొక్కలు నాటాక కొన్నాళ్ల వరకు నీళ్లు పోసినా ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఆ మొక్కలు చెట్లుగా ఎదగక ముందే చనిపోతున్నాయి. వృక్ష శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని పర్యావరణానికి మేలు చేసేవి, మనం ఉండే ప్రాంతంలో తక్కువ నీటితో పెరిగే మొక్కలనే నాటుకోవడం ఉత్తమం.
 

మన శీతోష్ణ పరిస్థితులను తట్టుకునే మొక్కలు ఉత్తమం అంటారా? 

స్థానిక మొక్కలు మన శీతోష్ణస్థితులను తట్టుకోగలుగుతాయి. వేప, కానుగ, చింత వంటి మొక్కలు కొన్నాళ్లు నీరు లేకున్నా బతుకుతాయి. పైగా స్థానికేతర మొక్కలకు ఎలాంటి జీవివైవిధ్య విలువ ఉండదు. ఆ మొక్కలు కేవలం అందాన్నిస్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన పెనుగాలులకు అనేక స్థానికేతర వృక్షాలు కుప్పకూలిపోయాయి. రాయలసీమలో బాగా పెరిగే నారివేప చెట్టు ఒక్కటి కూడా ఆ గాలికి పడిపోలేదు. స్థానిక జాతులకు ఉన్న బలం అలాంటిది. ఎన్ని మొక్కలు నాటాం అనే దాని కంటే ఎలాంటి మొక్కలు నాటుతున్నాం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తురాయి చెట్టు పూలు పూసిన కొద్ది రోజులు మాత్రమే అందంగా ఉంటుంది. అంతకు మించి దానివల్ల ప్రయోజనం ఉండదు. యూకలిప్టస్‌ మొక్క ఎదిగేందుకు చాలా నీరు అవసరం. పైగా ఆ మొక్క పెరిగి పెద్దదైనా దాని వల్ల లభించే ప్రయోజనం స్వల్పం. ఆ చెట్టు పక్షులు, క్రిమి కీటకాదులకు నెలవుగా పనిచేయదు. ఇలాంటి మొక్కల కంటే జీవవైవిధ్యానికి తోడ్పడే వేప, తుమ్మ, కానుగ వంటి మొక్కలు విరివిగా నాటాలి.

పర్యావరణానికి మేలు చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా చక్కగా పెరిగే అవకాశాలున్న మొక్కలు ఏవంటారు? 
వేప, కానుగ, కొండ తంగేడు, శింశుప, దిరిశెన, చింత మొక్కలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో చక్కగా పెరుగుతాయి. పక్షులకు, క్రిమికీటకాలకు ఆహారాన్ని, నీడను కల్పిస్తాయి. తెల్ల తుమ్మ చెట్టు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నెలల్లో చక్కగా పెరుగుతుంది. పచ్చదనం కోసం రెయిన్ ట్రీ, గ్రీన్ బటన్ ఉడ్‌ మొక్కలు నాటుకోవడం ఉత్తమం. వీటితో పాటు ఔషధ విలువలు ఉన్న మొక్కలను ఇళ్లలో పెంచుకోవడం ఉత్తమం. తులసి వంటి చెట్లను పెంచుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. 

Credits : Andhrajyothi

ఆధునిక సేద్యం… లాభాల పర్వం 

వ్యవసాయమంటే అతికష్టమనే భావన. అంతంత మాత్రం నీటివసతి. అత్యల్ప వర్షపాతంగల నేలలో పట్టుదల, స్వీయ పర్యవేక్షణతో లాభాలు పండిస్తున్నారు పడమటి పావని. సంప్రదాయ పంటల సాగుతో ప్రయోజనం లేదని తెలుసుకుని పౌలీహౌజ్‌, సూక్ష్మసేద్యంవంటి ఆధునిక పద్ధతుల్లో బర్బరా పూలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా పాడి, కోళ్లద్వారా మంచి ఆదాయం గడిస్తున్న మహిళారైతు విజయగాథ ఇది.

కరువు నేలలో లాభసాటి వ్యవసాయం 

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రాంతంలో నివసిస్తున్న పడమటి పావని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అవుషాపూర్‌. కుటుంబ వ్యవసాయ భూములు భూ సేకరణలో పోగా ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో బొమ్మల రామారం మండలం మర్యాలవద్ద 20 ఎకరా లు కొనుగోలుచేశారు. భర్త వెంకటరెడ్డి వ్యాపారంలో ఉండగా ముగ్గురు పిల్లలను చూసుకోవడంలో ఆమెకూ తీరికలేనందున ఆ భూమి నిరుపయోగంగా ఉండిపోయింది. విద్యావంతురాలైన పావని కొంతకాలం తర్వాత ఆ భూమిని సాగుచేయాలని భావించి, 2005లో బావి తవ్వించారు. మూడు బోర్లతో సంప్రదాయ పద్ధతుల్లో వరి, చెరుకు, మొక్కజొన్న వేస్తూ వచ్చారు. కానీ, నీరు చాలక పంటలు సరిగా పండకపోవడంతో ఆలోచనలో పడ్డారు.

పూల సాగుతో సిరులు
ఉద్యానశాఖ అందిస్తున్న పాలీహౌజ్‌ వ్యవసాయ పద్ధతిని గమనించిన ఆమె 2010లో అటువైపు మొగ్గుచూపి 50 శాతం రాయితీతో ఎకరమున్నరలో పాలీహౌజ్‌ నిర్మాణం చేపట్టారు. తమ వాటాగా రూ.42 లక్షల పెట్టుబడి పెట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అలంకరణలకు వినియోగించే పూల పెంపకం ప్రారంభించారు. నీటి కరువు రాకుండా వర్షపు నీటిని వ్యవసాయ బావిలోకి మళ్లించారు. మూడు బోర్లవద్ద ఇంకుడు గుంతలు తవ్వించారు. దీంతోపాటు సూక్ష్మ, బిందు సేద్యం వల్ల నీటి సమస్య తీరింది. దీనికి అనుబంధంగా 40ఆవులతో డెయిరీ నిర్వహిస్తూ వాటి మూత్రం, పేడను సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. దేశవాళీ కోళ్ల పెంపకం సైతం చేపట్టారు. పాలీహౌజ్‌లో ఐదు రంగులలో బర్బరా పూలను సాగుచేస్తూ రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాలకూ రవాణా చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలోని గడ్డిఅన్నారంతోపాటు ఢిల్లీ, బెంగుళూరు, చైన్నె, విజయవాడ లకు పూలు రవాణాచేస్తూ లాభాలు గడిస్తున్నారు. పూల సాగుద్వారా ఎకరాకు సగటున నెలకు రూ.లక్షదాకా ఆర్జిస్తున్నారామె. ఆధునిక పద్ధతులతో సాగుచేసే అలంకరణ పూల రకాలలో ఆదరణ ఉన్న వెరైటీలను ఎంచుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టుదల.. స్వీయ పర్యవేక్షణతోపాటు ఎటువంటి పూలకు, ఎటువంటి కూరగాయలకు గిరాకీ ఉందో నిరంతరం గమనిస్తూ లాభాల దిశగా పయనిస్తున్నారు ఆదర్శ మహిళా రైతు పావని.

– ఆంధ్రజ్యోతి, భువనగిరి

స్వీయపర్యవేక్షణతో సిరులు 

ఆధునిక పద్ధతులతో తప్పక లాభాలు వస్తాయి. నీటివసతితో చింత లేదు. ఎరువులూ ఎక్కువగా వాడన క్కర్లేదు. లక్షల పెట్టుబడితో కూడిన పాలీహౌజ్‌ సేద్యం స్వీయ పర్యవేక్షణలో చేసుకోవాలి. ఎప్పుడు ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టాలో స్వయంగా చూసుకోవాలి. ఉద్యానశాఖ రాయితీ ఇస్తుంది. నర్సరీలు మెలకువలు నేర్పుతాయి. పాలీహౌజ్‌ చేపట్టే రైతులు మార్కెట్‌ను గమనిస్తూ సాగుచేస్తే లాభాల పంట పండుతుంది.
Credits : Andhrajyothi

పప్పుధాన్యాల సాగు బహుబాగు! 

 • భూసార పరీక్షలద్వారా రైతులు నేల స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆ ఫలితం ఆధారంగా పంటల సాగు చేపట్టి, అవసరమైన ఎరువులను సరైన మోతాదులో మాత్రమే వేయాలి. 
 • – కిరణ్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త 
నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు మాగాణి భూముల్లో వరి సాగుకు అనుకూలమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఎన.వి.నాయుడు తెలిపారు. అలాగే గోదావరి జిల్లాల్లో వచ్చే వారం నుంచి వెద పద్ధతిలో వరి సాగు చేపట్టవచ్చని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో అపరాలు, చిరు ధాన్యాలు, పచ్చి రొట్ట పైర్ల సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశలో మే నెల సాధారణ వర్షపాతం 68.9 మిల్లీమీటర్లు కాగా 93.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. అలాగే ఈ నెల తొలి పక్షంలోనూ సాధారణ వర్షపాతం 44మిల్లీమీటర్లకుగాను 58.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు కింది సూచనల మేరకు పంటలు వేసుకోవచ్చు.

 • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మా గాణుల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తుకోవచ్చు. మెట్టలో వేరుశనగ, మొ క్కజొన్న, జొన్న, సజ్జ, రాగు, కంది, మినుము, పెసర వేసుకోవచ్చు. ఎత్తయి న గిరిజన మండలం పోడుసాగు, మి శ్రమ పంటలకు అనుకూలం. వేరుశనగ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, చెర కు సాగు చేయవచ్చు.
 •  ఉభయగోదావరి జిల్లాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు. మూడోవారం వెదపద్ధతిలో వరి విత్తడానికి అనుకూలం. చిరుధాన్యాలు, అపరా లు, మొక్కజొన్న సాగు చేపట్టవచ్చు.
 •  కృష్ణా, గుంటూరు, ప్రకాశం మాగాణుల్లో ఖరీఫ్‌ వరికి ముందు పచ్చిరొట్ట వేసుకోవచ్చు. సాగర్‌ ఆయకట్టులో నువ్వు, పెసర వంటి పైర్లు వేసుకోవచ్చు.
 •  మెట్టప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో అపరాలకు పరిస్థితి అనుకూలంగా ఉంది.
 •  ఎరుపు, తేలికపాటి నేలల్లో అపరాలు, చిరుధాన్యాలతోపాటు కందిలో అంతరపంటలు వేయొచ్చు.
 •  నెల్లూరు, చిత్తూరు, కడప మెట్టభూముల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, మినుము, కంది, నువ్వు వేయవచ్చు. నెల్లూరు జిల్లా మాగాణి వరినాట్లు, పచ్చిరొట్టకు అనుకూలం.
 •  కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదంతోపాటు మినుము, కంది, నువ్వు విత్తుకోవచ్చు.

ఖరీ్‌ఫ అనుకూల వరి వంగడాలు 
కృష్ణా, గుంటూరు, ప్రకాశంలలో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, దీప్తి, బాపట్ల సన్నాలు, ఇంద్ర, శ్రీరంగ, నెల్లూరు9674, స్వర్ణముఖి, అక్షయ, నెల్లూరు సోనా, భావపురి సన్నాలు. గోదావరి జిల్లాల్లో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, గోదావరి, తొలకరి, ఇంద్ర, అమర, అక్షయ, నెల్లూరు సోనా; ఉత్తరకోస్తాలో శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, విజేత, వంశధార; నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సింహపురి, తిక్కన, సావిత్రి, శ్రీరంగ, నెల్లూరు9674, పార్థివ, నెల్లూరు సోనా; కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాంబమసూరి, సోనామసూరి, దీప్తి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోనా, నెల్లూరు మసూరి; గిరిజన ప్రాంతాల్లో శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, విజేత, నెల్లూరు మసూరి, సుగంధసాంబ, జగిత్యాల సన్నాలు.

 •  మొక్కజొన్న.. డీహెచఎం 111, 113, 115, 117, 119, 121 రకాలు.
 •  సజ్జ.. హెచహెచబీ67, ఐసీఎంహెచ356, ఆర్‌ హెచబీ121, ఐసీటీపీ8203, 221, ఐహెచబీ3.
 •  రాగులు.. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య.
 •  కంది.. ఎల్‌ఆర్‌జీ41, ఎల్‌ఆర్‌జీ52, ఆశ, మారు తి, ఐసీపీఎల్‌ 85063, పీఆర్‌జీ158, పీఆర్‌జీ176.
 •  మినుము.. ఎల్‌బీజీ 752, ఎల్‌బీజీ 20, టీ 9, పీయూ 31, ఎల్‌బీజీ 787 రకాలు.
 •  పెసర.. ఎల్‌జీజీ 407, 410, 450, 460, టీఎం 96-2, డబ్ల్యూజీజీ 42 రకాలు.
 •  జొన్న.. సీఎ్‌సహెచ 4, 16, 18, పీఎ్‌సవీ 1, సీఎ్‌సవీ 15, పాలెం 2 రకాలు.

Credits : Andhrajyothi

ఆముదానికి సూక్ష్మనీటి సేద్యం

       ఆముదం సాగులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ కె రాజారెడ్డి వివిధ సూచనలు ఇచ్చారు. వాటి వివరాలు…

రబీ ఆముదములో ఫిబ్రవరి నెల నుంచి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని 8-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. బోదెలు, కాలువల ద్వారా నీరు ఇవ్వడం వల్ల నీరు వృథా కాకుండా ఉంటుంది. డ్రిప్పు ద్వారా మూడు రోజులకొకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సూక్ష్మనీటి సేద్య పద్ధతుల ద్వారా డ్రిప్పు, స్ప్రింకర్ల ద్వారా ఇస్తే 15-20 శాతం నుండి 40 శాతం దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.

కొమ్మ, కాయతొలిచే పురుగు : ఈ పురుగు ఉధృతి పంట పుష్పించే దశ నుంచి మొదలై పంట పూర్తికాలం వరకూ ఉంటుంది. తొలిదశలో పురుగు కొమ్మలపై, కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటుంది. పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది. తర్వాత దశలో కాయలోకి చొచ్చుకొనిపోయి కాయలను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతదశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి మోనోక్రొటోఫాస్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఇండ్సాకార్బ్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పంటకోత-నిల్వ : ఆముదం పంట అంతా ఒకేసారి కోతకు రాదు. 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. గెలలో 80 శాతం వరకూ కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుంచి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను ఎండబెట్టి వేరుశనగ నూర్చి, యంత్రంతోనే జల్లెడ మార్చుకొని వాడుకోవచ్చు. గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి, గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి.

విత్తనోత్పత్తి : పూత దశలో గెల కింది భాగంలో ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు మాత్రమే ఉన్న మొక్కలను ఉంచి, మిగిలినవి తీసివేయాలి. పూత దశ తర్వాత కాయల లక్షణాలు ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కల్ని పీకేయాలి.

ఆడ, మగ మొక్కల ద్వారా వచ్చే గెలలను వేరువేరుగా కోయాలి. ఆడ మొక్కల నుంచి వచ్చే విత్తనాలను హైబ్రీడ్‌ విత్తనంగా వాడుకోవాలి. మేలైన యాజమాన్యంతో ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ళ హైబ్రీడ్‌ విత్తనం తయారుచేయవచ్చు.

మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ లేదా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ను సంప్రదించండి. 

రైతులు మరిన్ని సలహాల కోసం ఈ ఉచిత నంబరుకూ కాల్‌ చేయవచ్చు-1800 425 0430

డా. కె. రాజారెడ్డి,

విస్తరణ సంచాలకులు,

ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ

విశ్వవిద్యాలయం, గుంటూరు – 522 034.

 

Credits : www.prajasakti.com

కాండం తొలిచే పురుగుతో భద్రం

వివిధ పంటలకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతాంగానికి ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
వరి : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. ఈ పరిస్థితుల్లో వరి పంటకు కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15-20 రోజుల లోపు కార్బోఫ్యూరాన్‌ 3-జి గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. వరిలో జింకు ధాతు లోపం గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి అయిదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి.
 
మొక్కజొన్న : మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితులలో పేనుబంక ఆశించే అవకాశాలున్నాయి. దీని నివారణకు రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమిటాన్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Credits : andhrajyothi

నారు నాణ్యతే రైతుకు రొక్కం!

Technical Visit to Centre Of Excellence, Jeedimetla, Telangana

జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా రైతాంగానికి విశిష్ట సేవలు

నెలకు 12 లక్షల వైరస్‌ బెడద లేని నారు సరఫరా

పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌హౌస్‌ సాగుపై రైతులు, అధికారులకు శిక్షణ

వేస్ట్‌ డీకంపోజర్‌తో నులిపురుగుల సమస్యకు చెక్‌

ఇంటిపంటల సాగుదారులకూ సేవలు

సాగు పద్ధతి ఏదైనప్పటికీ రైతు మంచి ఉత్పాదకత, అధిక నికరాదాయాన్ని ఆర్జించాలంటే.. విత్తనం.. ఆ విత్తనంతో తయారైన నారు కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. వైరస్‌ వంటి రుగ్మతల్లేని నారును సమకూర్చుకోవటం ప్రాథమిక అవసరం. ఈ అవసరాన్ని తీర్చే ఉదాత్త లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను నెలకొల్పింది. గత పది నెలలుగా లక్షలాది సంఖ్యలో పూలు, కూరగాయ పంటలకు సంబంధించి నాణ్యమైన నారును రైతులకు అందించింది. వందలాది మంది రైతులు, అధికారులు శిక్షణ పొందారు.  కూరగా యలు, పూల సాగులో ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రైతులకు అందిస్తున్న అరుదైన నైపుణ్య కేంద్రంపై ప్రత్యేక కథనం..

తెలంగాణ ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో (జీడిమెట్ల గ్రామం పైపుల రోడ్డులో) పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ పది నెలలుగా ఉద్యాన రైతులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నది. 8 పాలీహౌస్‌లు, 6 వాకింగ్‌ టన్నెల్స్, షేడ్‌నెట్‌ హౌస్‌లు ఉన్నాయి. వీటిలో జెర్బర, కార్నేషన్, ఆర్కిడ్స్‌ తదితర ఖరీదైన పూలు, క్యాప్సికం, టమాటో, కీరదోస, బ్రకోలి, చెర్రీ టమాటోలు, ఆకుకూరలను అత్యాధునిక రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కొన్ని పంటలను పురుగుమందులు చల్లకుండా సాగు చేస్తున్నారు.

నెలకు 12 లక్షల నారు సరఫరా
2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన స్వయం నియంత్రిత హరితగృహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్లగ్లింగ్స్‌ నర్సరీ పద్ధతిలో చీడపీడలు, వైరస్‌ సోకకుండా అత్యాధునిక సదుపాయాల మధ్య నెల రోజులు పెంచిన నాణ్యమైన నారును రైతులకు అందిస్తున్నారు. రసాయనిక/సేంద్రియ పద్ధతుల్లో లేదా పాలీహౌస్‌లు/షేడ్‌నెట్‌ హౌస్‌లు, సాధారణ పొలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఈ నారును తీసుకెళ్తు్తన్నారు. నెలకు 12 లక్షల నారును అందించే సామర్థ్యం ఉంది. దీన్ని 15 లక్షలకు పెంచే సన్నాహాలు చేస్తున్నారు.

ముందే చెల్లించాలి
ఈ హైటెక్‌ ఆటోమేటెడ్‌ గ్రీన్‌హౌస్‌లో పెంచిన నారును రెండు పద్ధతుల్లో రైతులకు అందిస్తున్నారు. క్యాప్సికం, బంతి, టమాటో పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు తెచ్చి ఇచ్చి, మొక్కకు 60 పైసల చొప్పున సర్వీసు చార్జిగా చెల్లిస్తే.. నెల రోజులు పెంచిన రోగరహితమైన నాణ్యమైన నారును సరఫరా చేస్తారు. సేంద్రియ, రసాయనిక సేద్యం చేసే రైతులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణ రకాల నారు కావాలనుకునే రైతులు విత్తనాలు తెచ్చి ఇవ్వనవసరం లేదు. మొక్కకు 75 పైసల చొప్పున డబ్బు చెల్లించి తమకు కావాల్సిన రకం నారును నెల రోజుల తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి వచ్చి తీసుకెళ్లవచ్చు. టమాటో, వంగ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యాప్సికం, కాకర, బీర తదితర కూరగాయ పంటలకు సంబంధించిన మేలైన నారు మొక్కలను రైతులు పొందడానికి అవకాశం ఉంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌ హౌస్‌లలోనే కాదు.. ఆరుబయట పొలాల్లో పంటలు సాగు చేసే రైతులు సైతం ఈ మొక్కలను వాడుతుండటం విశేషం.

వేస్ట్‌ డీకంపోజర్‌తో నులిపురుగులకు చెక్‌!
కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం రూపొందించిన వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పంటలకు వాడుతున్నారు. ఈ కేంద్రంలో వంద మంది రైతులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు. మట్టి ద్వారా పంటలకు సోకే తెగుళ్లను ఇది నివారిస్తున్నదని, నులిపురుగుల (నెమటోడ్స్‌)ను ఇది నూటికి నూరు శాతం నివారిస్తుందని రాజ్‌కుమార్‌ తెలిపారు. వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుందని, వానపాముల వృద్ధికి అనువైన సూక్ష్మ వాతావరణం కల్పిస్తుందన్నారు. కూరగాయల బెడ్‌ తయారీలోనూ వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణం ఉపకరిస్తోందన్నారు.

ఇంటిపంటల సాగుదారులకు చేదోడు
ఇళ్ల మీద సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి సైతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సేవలందిస్తున్నది. మేడలపైన సిల్పాలిన్‌ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటల సాగు డెమోను ఈ కేంద్రం భవనం పైన ఏర్పాటు చేశారు. గార్డెనింగ్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్యాప్సికం(మొక్క రూ.2), వంగ, టమాటో, క్యాబేజీ నారు(మొక్క రూ.2)ను, బంతి, చామంతి నారును విక్రయిస్తున్నారు. పనస, దొండ, బొప్పాయి (రెడ్‌లేడీ) మొక్కలను రూ. 20కి అమ్ముతున్నారు. కుండీలు, మట్టి+ఎరువు మిశ్రమాన్ని కూడా అందుబాటులో ఉంచారు.

గాలులను తట్టుకునే షేడ్‌నెట్‌ హౌస్‌!
తీవ్రమైన గాలులను సైతం తట్టుకొని నిలిచే కొత్త తరహా షేడ్‌నెట్‌ హౌస్‌ను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) రూపొందించింది. దీని పైకప్పు సమతలంగా ఉండదు. ఎగుడు, దిగుడుగా ఉంటుంది. మధ్యలో నుంచి గాలి, వెలుతురు పారాడుతూ ఉంటాయి. ఎండ ఏటవాలుగా దీని లోపలి మొక్కల పైకి ప్రసరిస్తూ ఉంటుంది. దీనికి 50% మోనో షేడ్‌నెట్‌ వాడటంతోపాటు, షేడ్‌నెట్‌ను ఫ్రేమ్‌కు క్లిప్పులతో అనుసంధానం చేయటం విశేషం. ఈ సరికొత్త షేడ్‌నెట్‌ హౌస్‌ను జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవి పంటగా టమాటా సాగు చేయబోతున్నారు. దీంట్లో ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లలో పంటలు సాగు చేయవచ్చు. టమాటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పుచ్చ, మస్క్‌మిలన్, వంగ, కొత్తిమీర తదితర పంటలను సాగు చేయవచ్చని, నర్సరీ పెంపకానికి కూడా ఇది అనువుగా ఉంటుందని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌చార్జ్‌ రాజ్‌కుమార్‌ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. చ. మీ.కు రూ. 500 వరకు ఖర్చవుతుందన్నారు. మేడలపైన ఇంటిపంటల సాగుకూ ఇది అనువైనదే!

నాణ్యమైన కూరగాయ పంటల నారు రైతులకు ఇస్తాం!
కూరగాయలు, పూల సాగులో తెలంగాణ రైతులను రారాజులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ప్రారంభమైన పంటల కాలనీలలో కూరగాయ పంటల రైతులకు సబ్సిడీపై ఇప్పటికే 25 లక్షల నాణ్యమైన, వైరస్‌ రహిత నారును అందించాం. ప్రస్తుతం నెలకు 12 లక్షల నాణ్యమైన నారును ఉత్పత్తి చేస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా 15 లక్షలకు పెంచబోతున్నాం. మంచి కూరగాయ పంటల నారు కావాలనుకున్న రైతులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా డబ్బు చెల్లించిన రైతులకు నెల రోజుల్లో నాణ్యమైన నారు అందిస్తున్నాం. సబ్సిడీపై నారు కావాల్సిన పంటల కాలనీల రైతులు అధికారుల ద్వారా లేఖ రాయించాలి.

– గాజుల రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు coejeedimetlahyd@gmail.com

Credits : https://www.sakshi.com/news/family/technical-visit-centre-excellence-jeedimetla-telangana-948163

పసుపు తవ్వే పరికరం ఇదిగో..!

Harvester/digger For Turmeric, Ginger, Potato - Sakshi

తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి  పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం.

బెడ్‌ పద్ధతికి అనువుగా నూతన పరికరం..
ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్‌ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్‌ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు.

పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్‌ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు.

రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం..
పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం.

– ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా

ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను..
ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను.

– నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా

Credits : https://www.sakshi.com/news/family/harvesterdigger-turmeric-ginger-potato-1043082