ఎరువు ఎదపెట్టే పరికరం

 • జింక్‌ పైపులతో ఎరువులు వేసే పరికరం
 • శాస్త్రవేత్తగా మారిన రైతుకూలీ
సాలు పంటల్లో పంట తదుపరి దశల్లో ఎరువు వేసేందుకు వీలుగా ఎదపెట్టే పరికరాన్ని రూపొందించారు ఒక రైతు కూలీ. సమయంతో పాటు డబ్బు ఆదా చేసే ఆ పరికరం విశేషాలు.
పొగాకు, మిరప తదితర సాలు పంటల్లో ఎరువులు దుక్కిలో వేస్తారు. తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నపుడు, పంటలకు నీరు పెట్టే అవకాశం ఉన్నపుడు మొక్కలకు ఎరువు అందించాలంటే తిరిగి కూలీలతో మొక్కలు పాదుల వద్ద ఎరువు వేయిస్తారు. అలా చేయాలంటే కూలీల ఖర్చు అధికంగా వుంటున్నది.
కూలీలు ఎరువు వేసినప్పుడు అదంతా ఒకేచోట పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి మొక్క చనిపోయే ప్రమాదమూ వుంది. అయితే కూలీలతో పని లేకుండా ఎరువు మొక్కలకు దగ్గరగా పడే విధంగా ఒక పరికరాన్ని రూపొందించారు ఓ రైతు కూలీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అయింది.
జింక్‌ పైపులు రెండింటిని తీసుకుని పైభాగంలో వెడల్పాటి రేకును వెల్డింగ్‌ చేశారు. పైపుల కింది భాగంలో గొర్రుకు ఉండే విధంగా పదునుగా (నేల తెగే విధంగా) కొనలు ఏర్పాటుచేశారు. పైభాగంలో ఎరువు పోస్తే గొట్టాల ద్వారా సాలులోని రెండు వైపులా ఉన్న మొక్కలకు దగ్గరగా ఎరువు పడుతుంది. ఆ తరువాత నీరు పెట్టినపుడు మొక్కలకు ఎరువు సమపాళ్లలో అందుతుంది.
గొర్రుతోలే సమయంలోనే…
మిరపలో, పొగాకులో గొర్రు తోలుతారు. ఎద్దుల గొర్రు తోలేందుకు ఒక మనిషి ఉంటారు. ఆ మనిషితోపాటు మరొకరు ముందరి గొర్రుకు రెండు వైపులా రెండు తాళ్లు కట్టి చివరలను ఎరువు ఎదబెట్టే పరికరానికి రెండు వైపులా కడతారు. ముందర వైపు గొర్రుతోలే వ్యక్తితోపాటు, వెనుకన ఎరువు ఎదబెట్టేందుకు మరొకరు ఉంటారు.
ఈ విధానంలో ఎరువును ఎదబెట్టడం ద్వారా సమయంతోపాటు దాదాపు వెయ్యి రూపాయల వరకు రైతుకు కూలి ఆదా అవుతుంది. ఎరువు అందించేందుకు ఒకరు, ఎదబెట్టేందుకు మరొకరు ఉంటే సరిపోతుంది. అదే కూలీలతో ఎకరాకు ఎరువు మొక్కల వద్ద మొదళ్లలో వేసి పైన మట్టి వేయాలంటే కనీసం రూ.పదిహేను వందలు ఖర్చు అవుతుంది. ఎరువు ఎదబెట్టేందుకు ఇద్దరు మహిళలైనా లేదా ఒక మగ, ఒక ఆడ కూలీ అయినా సరిపోతారు.
ప్రయోగంతో ప్రయోజనం
గత ఏడాది మిరపలో కూలీలతో మొక్కల మొదళ్లలో సత్తువ మందు వేయించాం. కూలీలతో సమయం, డబ్బు వృధా అవుతోంది. రైతు శేషారెడ్డి, నేను ఈ ఏడాది ఈ పరికరం చేయించాం. ఎదబెట్టడానికి బాగానే ఉంది. తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతున్నది.
– ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, నెన్నూరుపాడు
 Credits : Andhrajyothi

అన్నపూర్ణకు ఆక్వా ముప్పు!

 • ఉప్పునీటి కయ్యలుగా మారుతున్న భూములు
లాభాల వేటలో పడి ఆక్వా సాగులో నిబంధనలకు నీళ్లొదలడంతో ఉభయగోదావరి జిల్లాల్లో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. సాగుకు పనికిరాని చౌడు భూములు, పంట పండని భూములు, ముంపు భూముల్లో మాత్రమే ఆక్వా సాగు చేపట్టాలి.
సారవంతమైన భూముల్లో అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం, మంచినీటితో రొయ్యల సాగు చేస్తామని చెప్పి అనుమతులు తీసుకుని, ఉప్పునీటితో సాగు చేయటం వల్ల భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతోంది. ఉప్పునీటి కాలువల పక్కన ఉన్న చేలు మాత్రమే ఆక్వా సాగుకు అనుకూలం. సరిహద్దు రైతుల పొలాల్లో ఊటనీరు దిగకుండా చెరువు చుట్టూ మూడు మీటర్లు వదిలేసి ఊటబోదెలను తవ్వాలి. ఇందులోకి దిగిన ఊటనీరు పోవడానికి వీలుగా ఊటబోదెలను మురుగు కాలువలకు అనుసంధానం చేయాలి. ఈ నిబంధనలేవీ రైతులు పాటించడం లేదనే విమర్శలున్నాయి.
ఆక్వా సాగుదారులు భూమిలో 180-300 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వి ఉప్పు నీటిని బయటకు తెస్తున్నారు. రెండున్నర అడుగుల లోతు తవ్వాల్సిన చెరువును ఆరు అడుగుల వరకూ తవ్వుతున్నారు. ఎకరాకు 1.25 లక్షల రొయ్య పిల్లల్ని వేయాల్సి ఉండగా నాలుగు లక్షల వరకూ సీడ్‌ను వేస్తున్నారు.
రొయ్యల ఉత్పత్తి బాగుండాలని యాంటీబయాటిక్స్‌ విపరీతంగా వాడుతున్నారు. చిన్న సన్నకారు రైతులను బలవంతంగా ఒప్పించి వారి భూములను లాక్కుంటున్నారు. అనుమతులు రైతుల పేరన ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆక్వా సబ్సిడీలు, రుణమాఫీలు లీజుదారుల పరమవుతున్నాయి. సెలనీటి శాతం పెరిగిపోయి భూమి పొరల్లో సహజసిద్ధంగా ఉండే మంచినీటి వనరులు పాడైపోతున్నాయి.
పరిమితికి మించిన ఉప్పునీరు, యాంటీబయాటిక్స్‌ నేల పొరల్లో ఇంకిపోయి అంతిమంగా కెమికల్స్‌ కలిసిన ఉప్పుభూమిగా రూపాంతరం చెందుతుంది. సాగు పూర్తయిన తరువాత చెరువుల్లో ఉన్న ఉప్పునీటిని శుద్ధి చేసి మురుగు కాలువల్లోకి దింపాలి. కానీ అలా జరగడంలేదు. శుద్ధి కాని ఆ సాల్ట్‌వాటర్‌నే సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో సాగుభూములు కూడా చౌడుబారిపోయే ప్రమాదం తలెత్తింది. మంచి నీటితో రొయ్యల సాగు చేపడతామని అనుమతులు తీసుకుని ఉప్పు నీటితో సాగు చేస్తున్నారు.
దీంతో గ్రామాల్లోని మంచినీటి బావులు, పంచాయతీ చెరువులు, పంట పొలాల్లో తవ్వుతున్న ఫారమ్‌ఫాండ్స్‌ నిరుపయోగమవుతున్నాయి. ప్రభుత్వం విదేశీ మారకద్రవ్య రూపంలో వచ్చే ఆదాయాన్ని చూస్తున్నది తప్ప, సహజసిద్ధమైన వనరులు నాశనమైపోతున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్న దంటున్నారు నిపుణలు. ఈ తరహా ఆక్వా సాగు వల్ల సహజసిద్ధంగా లభించే మత్స్య సంపద కూడా అంతరించిపోతున్నది.
ఆక్వాజోన్‌ల ఏర్పాటు: ప్రసాద్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్వా చెరువుల తవ్వకానికి పలు నిబంధనలు విధించాం. ప్రాంతాలవారీగా గ్రామసభలను నిర్వహించి ఆక్వా జోన్‌లను ఏర్పాటుచేస్తున్నాం. అనుమతులు లేకుండా చెరువులు తవ్వితే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అమలాపురం, కాజులూరు, కరప తదితర ప్రాంతాల్లో అనుమతులు లేని చెరువులను ఆపేశాం.
Credits : Andhrajyothi

బహుళ పంటలు.. భలే లాభాలు

వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యాన పంటలు అది కూడా బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా బోనకల్‌ రైతులు. గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఆ రైతుల స్ఫూర్తి గాథ ఇది.
వ్యవసాయ మండలంగా పేరున్న బోనకల్‌లో కొందరు రైతులు వాణిజ్య పంటలను కాదని బహుళ పంటల సాగు వైపు మళ్లారు. పది సంవత్సరాల నుంచి ఒకే భూమిలో.. ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటల వరకు సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు, డేగల లక్ష్మీనారాయణ తదితర రైతులు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో బంతి సాగుచేశారు ఆ రైతులు. బంతిపూల దిగుబడి పూర్తవడంతో ఆ తోటలో బీరవేసి… ఆ తీగను బంతిపూల చెట్లపైకి పాకించారు. ప్రస్తుతం వేసిన బీర 45 రోజుల్లో దిగుబడి పూర్తవుతుంది. ఆ తర్వాత ఇదే భూమిలో మళ్లీ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. యాపిల్‌బెర్‌ ప్రధాన పంటగా వేసి అందులో అంతరపంటగా పచ్చిమిర్చిని వేశారు. పచ్చిమిర్చి తర్వాత కాకర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పందిరి విధానంలో దొండ సాగు, స్పేకింగ్‌ విధానంలో టమోటా, కాకరను సాగు చేస్తున్నారు. తైవాన్‌ జామలో అంతరపంటగా బంతి వేసి మంచి దిగుబడిని సాధించారు. ఒక్కో రైతు తమకున్న పొలాల్లో తక్కువ కాలవ్యవధిగల పంటలను ఎంచుకొని ఒకే ఏడాదిలో మూడు పంటలను సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నారు.
ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
ఆదర్శ సేద్యం చేస్తున్న బోనకల్‌ మండలం ముష్టికుంట్ల రైతులను ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. ఉద్యాన పంటలను సాగుచేయటంతో పాటు బహుళ వార్షిక పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను గడించి సాగులో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారంటూ అభినందించింది.
ఏటా మూడు పంటలు
నాకు 5 ఎకరాల భూమి వుంది. ఈ ఏడాది ఒక ఎకరం భూమిలో బంతి వేయగా రూ.లక్ష ఆదాయం వచ్చింది. ఆ తర్వాత అందులో బీర వేశాను. దాని తర్వాత అదే భూమిలో కూరగాయలు పండిస్తా. యాపిల్‌బెర్‌లో అంతరపంటగా పచ్చిమిర్చి వేశా. ఇప్పటికే 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పచ్చిమిర్చి తర్వాత కూరగాయల సాగుచేస్తా. మరో ఎకరం భూమిలో తైవాన్‌ జామ వేసి అందులో అంతరపంటగా బంతి వేశా. అది పూర్తయ్యాక కూరగాయలు సాగుచేస్తా.
– బొడ్డుపల్లి నాగచంద్రుడు, రైతు, ముష్టికుంట్ల
Credits : Andhrajyothi

కూలీల కొరతకు నయా మంత్రం

 • చెరుకు నరికే యంత్రం  
చెరుకు కొట్టేందుకు కూలీలు దొరకక, ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. చెరుకును నరికి, ట్రాక్టర్‌లో వేసే ఈ యంత్రం ఖరీదు కోటి 30 లక్షలు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా దీన్ని కొనడం రైతులకు సాధ్యమయ్యే పని కాదు. దాంతో సంగారెడ్డికి చెందిన కొందరు పెద్ద రైతులు తొలిసారిగా ఈ యంత్రాన్ని తమిళనాడు నుంచి అద్దెకు తెచ్చారు.
ఈ యంత్రం చెరుకును నరకడమే కాకుండా చెరుకును అరఫీటు చొప్పున ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఈ ముక్కలను పక్కనే ఉండే ప్రత్యేక ట్రాక్టర్‌లో నింపుతుంది. పొలం నుంచి ఆ ప్రత్యేక ట్రాక్టర్‌ను రైతులు రహదారి వరకు తెచ్చి, లారీలలో నింపి, షుగర్‌ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. టన్నుకు రూ.700ల చొప్పున అద్దెతో వినియోగిస్తున్న ఈ యంత్రం రోజుకు వంద టన్నుల చెరుకును నరికి ముక్కలుగా చేసి, ట్రాక్టర్లలో నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలలో రైతు బారాది నర్సింహ్మారెడ్డి ఉపయోగిస్తున్న ఈ చెరుకు నరికే యంత్రాన్ని చూసేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈయన 15 ఎకరాలలో చెరుకును పండిస్తున్నారు. కొన్నేళ్లుగా కూలీలు దొరకకపోవడంతో నిర్ణీత సమయంలో చెరుకును ఫ్యాక్టరీకి తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడినని ఆయన తెలిపారు.
కూలీలకంటే యంత్రం మిన్న
చెరుకు కొట్టేందుకు కూలీలను మాట్లాడుకున్నా వాళ్లు సకాలంలో రాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కూలీల జాప్యం కారణంగా రైతులు సమయాన్ని, పంటను నష్టపోతున్నారు. ఈ యంత్రంతో కూలీల సమస్య తగ్గుతుందన్నారు ఆ రైతు. ఎనిమిది జతల కూలీలు రోజుకు పది టన్నుల చెరుకును నరుకుతారు. అదే యంత్రమైతే రోజుకు వందటన్నుల చెరుకును నరికి ఫ్యాక్టరీకి చేరవేస్తుంది. టన్నుకు రూ.500 చొప్పున జత కూలీకి చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పది టన్నుల చెరుకు కొట్టే 8 జతల కూలీలకు రూ.5000ను చెల్లించాల్సి వస్తున్నది. పది రోజుల్లో 100 టన్నుల చెరుకును కొట్టేందుకు 8 జతల కూలీలకు 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికితోడు ఫ్యాక్టరీకి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులు అదనం.
అదే యంత్రం వినియోగిస్తే 70 వేల రూపాయల ఖర్చుతో ఒక్క రోజులోనే 100 టన్నుల చెరుకును నరికి ఫ్యాక్టరీకి తరలించవచ్చు. యంత్రం చెరుకు మొదళ్లను నరకడంతో తర్వాత వచ్చే పంట కూడా పూర్తిగా వస్తుంది. చెరుకు నుంచి వచ్చే ఆకును దుగ్గు చేయడం వల్ల అది తిరిగి ఎరువుగా మారి, చేనుకు బలమవుతుంది. చెరుకు కొట్టినపుడు ఉండే దుగ్గు చేనులోనే ఉండడం వల్ల భూమిలో తేమ తగ్గకపోవడంతో పాటు కాండం త్వరగా ఇగురు పెట్టే వీలవుతుంది. కూలీలకంటే యంత్రం వాడడం వల్ల రైతులకు ఆర్థికంగా కూడా కలిసివస్తుంది. రైతులకు ఉపయోగపడే చెరుకు నరికే యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేయాలని కాసాల రైతు నర్సింహ్మారెడ్డి కోరారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి
Credits : Andhrajyothi

సూక్ష్మ సేద్యం రైతులకు వరం

ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఉద్యాన రైతులకు వరంగా మారింది. బోరు లేదా బావి ఉంటే డ్రిప్‌ పద్ధతిలో నీరు అందించేందుకు ప్రభుత్వం ఆ పథకం కింది రాయితీపై పరికరాలు సమకూరుస్తోంది. ఇందులో డ్రిప్‌, స్ర్పింక్లర్‌, రెయిన్‌ గన్‌లలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 8.5 లక్షల హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేశారు. 2017-18లో రూ.1170 కోట్లతో 5.16 లక్షల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఉద్యాన పంటలకు నీటి వసతి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. భూమి విస్తీర్ణాన్ని బట్టి క్యాటగిరీని గుర్తించి, రాయితీలు ఇస్తారు. ఆధార్‌, రేషన్‌కార్డు, ఎస్సీఎస్టీలకు కుల ధ్రువీకరణ, టైటిల్‌ డీడ్‌ లేదా వన్‌-బి ఫారం నకలు వుండాలి. ప్రభుత్వం గుర్తించిన 36 కంపెనీల్లో నచ్చిన కంపెనీ నుంచి పరికరాలు తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేందుకు దగ్గరలోని మీ సేవా కేంద్రంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఉద్యాన రైతులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. రిజస్టర్‌ చేసుకున్న రైతు పొలాన్ని ఎంఐపీ అధికారులు, పరికరాలిచ్చే కంపెనీ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు. బోరు, బావి నుంచి నీటి లభ్యతను గుర్తిస్తారు.
విస్తీర్ణాన్ని బట్టి పరికరాలను అంచనా వేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. కంపెనీ సిబ్బంది పైపులైన్‌ మార్కింగ్‌ ఇస్తారు. తర్వాత పరికరాలు అమర్చి, ట్రయల్‌ రన్‌ వేస్తారు. పరికరాల వద్ద రైతు ఫోటో తీసుకుని, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అంచనా వేశాక కంపెనీ మెటీరియల్‌ సరఫరాకు 10 శాతం అడ్వాన్స్‌ లభిస్తుంది. ట్రయల్‌ రన్‌ విజయవంతం అయితే 50 శాతం జమ అవుతుంది. తర్వాత మిగిలిన మొత్తాన్ని ఎంఐపీ కంపెనీకి జమ చేస్తుంది.
నేరుగా ఎస్‌ఎంఎస్‌లు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేశాక రైతు సెల్‌కు మెసేజ్‌ వస్తుంది. పథకం మంజూరైన తర్వాత సబ్సిడీ వివరాలతో ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం నుంచి మరో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. రాయితీ పోగా రైతు చెల్లించాల్సిన మొత్తం నగదు రహిత బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు
ఈ ప్రాజెక్టు వివరాలు తెలుసుకోవాలన్నా, పరికరాల నిర్వహణ లోపాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 1800 425 2960కు ఫోన్‌ చేయవచ్చు. మండలానికి చెందిన ఉద్యాన అధికారి లేదా ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టు డైరెక్టరు/ఏడీలను సంప్రదించవచ్చు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అమరావతి
రాయితీ.. పరిమితులు
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదెకరాల లోపు, రూ.2 లక్షల గరిష్ఠ పరిమితితో 100 శాతం రాయితీ ఇస్తారు. అదే నిబంధనతోసన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీ వర్తిస్తుంది. రాయలసీమ నాలుగు జిల్లాల రైతులకు పదెకరాల వరకు రూ. రెండు లక్షల గరిష్ఠ పరిమితితో 90 శాతం రాయితీ ఇస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా రైతులను ఈ ప్యాకేజీలో చేర్చారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహాయించి, మిగిలిన 8 జిల్లాల రైతులకు ఐదు నుంచి పదెకరాల వరకు రూ.2.80 లక్షలకు మించకుండా 70 శాతం రాయితీ అమలు చేస్తున్నారు. ఇతరులకు రూ.4 లక్షలకు మించకుండా 50 శాతం రాయితీ ఇస్తున్నారు.
ఫలితం..ప్రయోజనం
తుంపర, బిందు సేద్యంతో వివిధ పంటల్లో దిగుబడులు పెరిగే వీలుంది. నీరు 50-60 శాతం ఆదా అవుతుంది. ప్రతి మొక్క, చెట్టుకు ఒకే మోతాదులో నీరు అందుతుంది. కొంత సమయమే మోటారు ద్వారా నీటి తడులు ఇవ్వడం వల్ల విద్యుత్‌ వినియోగంలో 40 శాతం ఆదా అవుతుంది. పోషక పదార్ధాలు నీటిలో కరిగి, నేరుగా వేరుకు పోషకాలు అందడం వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి.
రైతుల కోసం.. టోల్‌ ఫ్రీ నంబర్లు
వ్యవసాయాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించిన ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు, సమస్యల పరిష్కారానికి కొన్ని టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేసింది. ఈ నెంబర్లకు రైతులు ఉచితంగా ఫోన్‌ కాల్‌ చేసి, సంబంధిత శాఖలకు సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సమాచారం
కిసాన్‌ కాల్‌ సెంటర్‌ :—— 1551, 1800-180-1551
రైతు రుణమాఫీ సమస్యలకు :——–1100, 1800-103-2066, 1800-425-4440
ఉద్యానశాఖ, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు సమాచారానికి :——1800-425-2960
విద్యుత్‌ శాఖ రైతు సమస్యలకు :———-1912, 1800-425155333
పశుసంవర్ధకశాఖ:——-1962
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం టోల్‌ ఫ్రీ నెంబర్‌ :—-1800-425-0430
ఎరువులకు సంబంధించిన సమాచారం:———1800-115501
Credits : Andhrajyothi

రంగు గోధుమలు వస్తున్నాయ్‌!

 

వరి పొట్టు రంగులో వుండే గోధుమలు ఇక ముందు మరిన్ని రంగుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. నలుపు, నీలం, ఊదా రంగుల గోధుమలను కూడా రూపొందించారు పంజాబ్‌లోని నేషనల్‌ అగ్రి-ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ (నబీ) శాస్త్రవేత్తలు. సాధారణ గోధుమలతో పోలిస్తే పుష్కలంగా పోషక విలువలున్న రంగు గోధుమలను ఐదేళ్ల పాటు శ్రమించి రూపొందించారు నబీ నిపుణులు.
బియ్యం, గోధుమలనే దేశంలోని ప్రజలు ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. బియ్యంతో పాటు సాధారణ గోధుమల్లో పోషక విలువలు స్వల్పంగా వుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా వుండే గోధుమలను సృష్టించేందుకు నబీ శాస్త్రవేత్తలు నడుంకట్టారు.
అలా రంగు గోధుమలు రూపుదిద్దుకున్నాయి. రంగు గోధుమల్లో సూక్ష్మ పోషకాలు అధికంగా వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇనుము, జింకు వంటి సూక్ష్మపోషకాలు అధికంగా వుండడం వీటి ప్రత్యేకత. ఊబకాయం, అధిక కొవ్వు, ఇన్సులిన్‌ నిరోధకతపై రంగు గోధుమలు ప్రభావం చూపుతాయని నమూనా అధ్యయనాల్లో తేలింది. సూక్ష్మ పోషక లోపాలున్న వారికి నాణ్యత కలిగిన ఈ గోధుమల ద్వారా ఇనుము, జింకు బాగా లభిస్తాయి.
రంగు గోధుమల దిగుబడి సాధారణ గోధుమల కంటే అధికంగా వుంటుందని, రైతులకు కూడా లాభసాటిగా వుంటుందని క్షేత్ర స్థాయి పరిశోధనల్లో వెల్లడైంది. ఫలితంగా రంగు గోధుమలు వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తాయి. సహజమైన రంగులతో పండే ఈ గోధుమల పిండితో బేకరీ ఉత్పత్తులను తయారు చేసుకునే వీలుంటుంది. త్వరలో ఈ గోధుమలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నబీ సంస్థ పేర్కొంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అమరావతి
Credits : Andhrajyothi

నకిలీ విత్తనాలు..పారాహుషార్

 • ఏటా వేల కోట్లు నష్టపోతున్న రైతులు.. సొంత విత్తనం మేలంటున్న నిపుణులు
విత్తనం రైతుకు, సాగుకు ప్రాణం. అధిక దిగుబడులకు మూలం. పూర్వం రైతులు సొంతంగా విత్తనాలు తయారుచేసుకునే వారు. హైబ్రీడ్‌ విత్తనాలు వచ్చాక విత్తనాల తయారీ, అమ్మకాలు కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిశోధనలు లేకుండానే, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌, ప్రకటన ల ఆర్భాటంతో నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటకడుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు.
రైతులకు అందుబాటులో వున్న విత్తనాలలో రెండు రకాలున్నాయి. ప్రభుత్వ విత్తనం: వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థలలో శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి విత్తనాలను తయారు చేస్తారు. వీటిని ఆయా పరిశోధన సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎపి సీడ్స్‌ ద్వారా రైతులకు అమ్ముతుంటారు
ప్రైవేటు విత్తనం: ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు తయారుచేసే విత్తనాలు. నిబంధనల మేరకు సుమారు 15-20 ఎకరాలు భూమి ఉండాలి. దానిలో పండించి పరిశోధనలు చేసిన విత్తనాలను పరిశీలించడానికి ఎజిబిఎ్‌ససి, ఎంఎ్‌ససి చదివిన నిపుణులైన బ్రీడర్‌ను ఆయా సంస్థలు ఎంపిక చేయాలి. ఆ బ్రీడర్‌ ఆధ్వర్యంలో తయారైన, పరిశోధించిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేయబోయే ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల బృందం పరిశీలించాలి. నాణ్యత, ఉత్పత్తిని పరిశీలించిన తరువాత ఆ రకాలను మార్కెట్‌లోకి అమ్మడానికి అనుమతులు ఇవ్వాలి. సుమారు 2-3 ఏళ్లు ఈ రకం విత్తనాలపై ఎటువంటి ఫిర్యాదులు లేకపోతే ఆ కంపెనీ రకాలకు పూర్తి స్థాయి అమ్మకాల లైసెన్సులు ఇస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిశోధనలు, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ బి – రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌) లేకుండానే విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తులో తెలిపిన సర్వే నెంబర్లను పరిశీలించడం లేదు. ఒకే సర్వే నెంబర్‌ పేరుతో 3-4 విత్తన కంపెనీలు ఉంటున్నాయి. వీటితో పాటు ఈ కంపెనీలన్నింటికీ ఒకే బ్రీడర్‌ ఉంటున్నారు. రైతులకు ఆకర్షణీయమైన ప్యాకెట్‌లతో, వ్యాపార ప్రకటనలతో విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలక రాకపోయినా, పంట పండకపోయినా కంపెనీలు సరిగా స్పందించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కొమ్ముకాస్తున్నారు.
జాగ్రత్తలు ఇలా…
 • రైతులు విత్తనాలను లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి
 • జిన్నింగ్‌/లూజు పత్తి విత్తనాలను కొనుగోలు చేయరాదు.
 • బిల్లులో కొనుగోలు చేసిన తేదీ, విత్తనరకం, పరిమాణం, లాట్‌ నెంబర్‌, నమోదు చేయించి బిల్లును దాచుకోవాలి.
 • విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. మొలక శాతం తక్కువగా ఉంటే విత్తనాలను తిరిగి డీలర్‌కు ఇవ్వవచ్చు.
 • రైతులు బీటీ విత్తనాలతో పాటు నాన్‌ బీటీ పత్తి విత్తనాలు పొలంలో నాటటం ద్వారా కాయ తొలిచే పురుగుల తీవ్రతను తగ్గించుకోవచ్చు.
 • గ్రామాల్లో బిల్లు లేకుండా అమ్మితే మండల వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారి (ఎంఎవో) లేదా సహాయ సంచాలకులు (ఏడీ) లేదా జిల్లా కలెక్టరేట్‌లోని టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-4099కు ఫిర్యాదు చేయాలి..
 • ఏ డీలర్‌ అయినా ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి, ఏడీలకు ఫిర్యాదు చేయాలి. నకిలీ, లూజు విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిపిన వారికి ప్రభుత్వం రూ. 10వేలు పారితోషికంగా ఇస్తుంది.  – ఆంధ్రజ్యోతి ప్రతినిధి, గుంటూరు
పంట నుంచే సేకరించాలి
సాగులో విత్తనాలకు 20 శాతం ఖర్చవుతుంది. రైతుల వారు పండించిన పంటలో 2 నెలల ముందు బలమైన కంకులు, గుబ్బలు ఉన్న వాటిని సేకరించాలి. దాని ద్వారా విత్తనాలను తీసుకొని వాటిని శుద్ది చేసి భద్రపరుచుకోవాలి. ఈ విత్తనాలు వాడుకుంటే రైతుల డబ్బు ఆదా కావడంతో పాటు నకిలీ విత్తనాల బెడదను తగ్గించుకోవచ్చు. రైతులు హైబ్రీడ్‌ విత్తనాలపై వ్యామోహం తగ్గించుకోవాలి.
– డాక్టర్‌ పావులూరి రత్నప్రసాద్‌, ఎడిఆర్‌, లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం
Credits : Andhrajyothi

నకిలీ విత్తనాలు.. జర భద్రం

 • ఏటా వేల కోట్లు నష్టపోతున్న రైతులు
 • సొంత విత్తనం మేలంటున్న నిపుణులు
యాసంగికి రైతులు సిద్ధమయ్యారు. ఖరీఫ్‌లో నకిలీ విత్తనాల కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగిలో రైతులు మళ్లీ మోసపోకుండా వుండాలంటే విత్తనాల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎల్‌. జలపతిరావు.
తెలంగాణను విత్తన భాండాగారం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఈ ఖరీఫ్ లో కూడా రైతులు నకిలీ విత్తనాల కారణంగా మోసపోయారు. విత్తనాల మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. ప్రభుత్వ విత్తన సంస్థలు నిర్వీర్యం కావడంతో విత్తనాల ఉత్పత్తిలో ప్రైవేటు కంపెనీలది ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వ విత్తన సంస్థలను బలోపేతం చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో రైతులు ఏళ్లతరబడి మోసపోతూనే వున్నారు.
ఏటా వేల కోట్ల రూపాయలు నష్టపోతునే వున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న వారి ఆటలు కట్టించే పటిష్టమైన యంత్రాంగం లేదు. కొత్త విత్తన చట్టంతో వారి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు కార్యరూపం ధరించడం లేదు. డ్రాఫ్ట్‌ రూపంలో వున్న విత్తన చట్టాన్ని ఆమోదించి రైతుల్ని ఆదుకోవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. నకిలీ విత్తనాలు రాజ్యమేలడానికి రైతులు కూడా కొంతవరకు కారణం. దుకాణంలో కొన్న విత్తనాలు మాత్రమే అధిక దిగుబడులు ఇస్తాయని రైతులు భ్రమపడుతున్నారు. నాణ్యమైన పంటను మార్కెట్‌లో తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్నారు. వాటినే విత్తనాలుగా మార్కెట్‌లో ఎక్కువ డబ్బు పోసి కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారులు తమ నుంచి తక్కువ ధరకు పంట కొని, వాటికి నాసిరకం విత్తనాలు కలిపి మరీ ఎక్కవ ధరకు మళ్లీ మనకే విక్రయిస్తున్నారనే విషయం రైతులు గ్రహించాలి. రైతులు విత్తనాలను ఎక్కడినుంచో కొనాల్సిన అవసరం లేదు. వాళ్ల పండించిన పంటనే విత్తనంగా 3, 4 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. కొత్త వంగడం పండించాలంటే గ్రామంలో అంతకుముందు పండించిన వారి నుంచి విత్తనం తీసుకుంటే భరోసాగా వుంటుంది. మోసపోయే ప్రమాదం వుండదు. హైబ్రీడ్‌ విత్తనాలను మాత్రమే ఏటా కొనాల్సి వుంటుంది. వరి, పప్పులు, నూనె గింజల్లో హైబ్రీడ్‌ రకాలు లేవు. ఈ పంటలకు రైతులు తాము పండించిన పంటనే విత్తనాలుగా వేసుకోవాలి. ఈ అంశంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతులు సాధ్యమైనంత వరకు సొంత విత్తనాలను ఉపయోగించాలి.
పేరున్న కంపెనీ విత్తనాలే మేలు
నకిలీ విత్తనాలను చూడగానే గుర్తించడం కష్టం. అందుకే రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నకిలీ విత్తనాల బెడద నుంచి బయటపడవచ్చు. పేరున్న విత్తన సంస్థల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. తెలిసిన డీలర్‌ వద్ద కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ విత్తనాలను అంతకుముందు పండించిన వారికి అధిక దిగుబడులు వచ్చాయని నిర్ధారణ చేసుకున్న తరువాతే విత్తనాలు కొనాలి. కేవలం ప్రకటనలు చూసి కొనకుండా అధిక విస్తీర్ణంలో ఆ విత్తనం ఎలా దిగుబడి ఇచ్చిందో నిర్ధారించుకున్నాక కొనడం మేలు.
విత్తనం కొనుగోలు చేసినప్పుడు డీలర్‌ నుంచి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రసీదును, విత్తనం బ్యాగ్‌ కవర్‌ను పంట పండేంత వరకు భద్రపరచాలి. విత్తనం విషయంలో సమస్య ఎదురైతే రసీదును జతచేసి వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. మీడియా ద్వారా సాటి రైతులను అప్రమత్తం చేయాలి. వ్యవసాయ అధికారి వల్ల న్యాయం జరగకపోతే పరిహారం కోసం వినియోగదారుల కోర్టుకు వెళ్లేందుకు రైతులు ఏ మాత్రం సంశయించకూడదు.
విత్తన నాణ్యత తెలుసుకోండిలా…
విత్తనాల నాణ్యతను నిర్ధారించడానికి ఏ రకమైన విత్తనాలనైనా 100 గింజలు తీసుకొని ఇసుకలో నాటి తరచుగా నీరు పోయాలి. వరి విత్తనాలైతే 80, మొక్కజొన్న విత్తనాలు 90, పప్పు జాతి విత్తనాలు 70 గింజలు మొలకెత్తితే ఆ విత్తనాలను నాణ్యమైనవిగా పరిగణించవచ్చు. విత్తనాల ప్యాకెట్లపై ఉత్పత్తి చేసిన బ్యాచ్‌ నెంబర్‌, తయారైన తేదీ ముద్రించబడి ఉంటుంది. ఉత్పత్తి అయిన తొమ్మిది నెలలలోపు విత్తనాలు మాత్రమే సక్రమంగా మొలకెత్తుతాయి. ప్యాకెట్‌పై ఇంకా ఆ విత్తనం ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే సర్టిఫైడ్‌ చేసినట్లు లేక ప్రైవేట్‌ కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాలైతే కంపెనీపై గల విశ్వాసంతో కూడిన ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ ఉంటుంది. అంతేగాక విత్తనం మొలక శాతం కూడా ముద్రించబడి ఉంటుంది.
Credits : Andhrajyothi

గ్రామీణ ఆవిష్కరణల వేదిక

16వ జాతీయ గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాలు, కాఫ్ట్స్‌ మేళా హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ సంస్థ (నాబార్డ్‌పిఆర్‌) ప్రాంగణంలో జరగనుంది. రాజేంద్రనగర్‌లోని ఈ సంస్థ కార్యాలయంలో నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, సోలార్‌ టెక్నాలజీ, మట్టి అవసరం లేని ఉద్యాన పంటల సాగు (హైడ్రోఫోనిక్‌), గ్రామీణులు తయారు చేసిన హస్తకళలను ఇందులో ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధప్రాంతాలకు చెందిన సంస్థలు, రైతులు 250 మంది ఈ ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటుచేశారు. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ మేళాను 50 వేల మంది సందర్శిస్తారని అంచనా.
Credits : Andhrajyothi

సేద్యానికినవతేజం

 • పత్తి రైతుకు ధర దక్కేలా చర్యలు
 • నకిలీ విత్తనాల కంపెనీలపై ఉక్కుపాదం
 • ఉద్యాన, వాణిజ్య పంటల ద్వారా రైతుకు ఆదాయ భరోసా
 • ఆంధ్రజ్యోతితో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడటంతో పాటు వారికి ఆధునికసాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంపొందించే దిశగా పలు చర్యలు చేపడుతున్నాం అంటున్నారు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి.
ఖరీ్‌ఫలో కష్టాలు ఎదుర్కొన్న రైతాంగాన్నిప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నది?
 రాష్ట్రంలో ఈ యాసంగిలో 45 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని భావిస్తున్నాం. 25 లక్షల ఎకరాల వరకు బోర్ల కింద సాగు అవుతుంది. సింగూరు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌, ఇతర ప్రాజెక్టుల కింద ఇతర పంటలు సాగవుతాయి. వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగవుతాయని అంచనా. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా వుంచాం. ఇప్పటికే రైతులు శనగ సాగు మొదలెట్టారు. అన్ని పంటలకు కావాల్సిన సమాచారాన్ని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్నాం.
ఖరీ్‌ఫలో నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు.
రబీలో దీన్ని ఎలా అరికట్టనున్నారు?
 రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై ఉక్కుపాదం మోపుతుంది. ఆ విత్తనాలు సరఫరా చేసే యాజమాన్యాలపై చర్యలు చేపడుతున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీయాక్ట్‌ పెట్టే విధంగా చట్టాన్ని సవరిస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే బిల్లును తీసుకువస్తున్నాం. విత్తనోత్పత్తితో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రకాల చర్యలుతీసుకుంటున్నాం.
 
విస్తరణ విభాగాన్ని పటిష్టం చేయాల్సి వుందంటారా?
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంటలపై వివరించేందుకు ఐదువేల మందికి ఒక్క ఏఈవో చొప్పున 1,525 మందిని ఇటీవల నియమించాం. వీరి ద్వారా రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. విస్తరణ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసి, ఆధునిక సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
 
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు ఏవైనా చేపడుతున్నారా?
వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఈ మధ్యనే మహారాష్ట్రకు పంపించాం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పరంపర పురోగతి కృషి వికాస్‌ యోజన పథకాన్ని (పీకేవీవై) అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద రాష్ట్రంలో 390 క్లస్టర్లు తీసుకుని, ఒక్కో క్లస్టర్‌ కింద 50 ఎకరాలు తీసుకున్నాం. ఒక్కో ఎకరం ఒక్కో రైతుకు ఇచ్చి ప్రకృతి సేద్యం చేయిస్తున్నాం. ఇప్పటికే పలు దఫాలుగా రైతులకు శిక్షణ ఇచ్చాం.
రైతులకు ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటలు, కూరగాయల సాగును ఎలా ప్రోత్సహిస్తున్నారు?
 పాలిహౌజ్‌ ద్వారా పూలు, కూరగాయల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు సబ్సిడీపై 1,336 పాలిహౌజ్‌లను రైతులకు మంజూరు చేశాం. జీడిమెట్లలో 10 ఎకరాలలో సెంటర్‌ఫర్‌ కన్వెన్షన్‌ ఏర్పాటుచేశాం. ఈ కేంద్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. మొక్కలను రైతులకు అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ ద్వారా పండ్ల తోటలను ప్రోత్సహిస్తున్నాం. కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పూలసాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.
 
ఈ-నామ్‌ సక్సెస్‌కు ఏం చర్యలు చేపడుతున్నారు?
ప్రస్తుతం 44 మార్కెట్లలో ఈ-నామ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశాం. జాతీయ మార్కెట్‌లతో అనుసంధానం కల్పిస్తున్నాం. దీనిద్వారా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూస్తున్నాం. ఇతర మార్కెట్‌లలో అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఏర్పాట్లను చేస్తున్నాం. పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం తరపున చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్‌ల నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు పూర్తి అయితే ధాన్యం ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది. అప్పటి వరకు మరిన్ని గోడౌన్‌ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. రైతుబంధు పథకం ద్వారా రైతులు ఇప్పటికే గిడ్డంగులలో పంటలను నిలువ చేసుకుంటున్నారు.
పంటల బీమా పథకంలో ఆశించిన సంఖ్యలో రైతులు చేరడం లేదు కదా?
రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే రైతులు అందరికీ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన బీమాపథకం అమలు చేస్తున్నాం. రుణాలు తీసుకోని రైతులను కూడా బీమా చేయాలని కోరుతున్నాం. వారికి వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ పథకం గ్రామ యూనిట్‌గా ఉంది. దీనిని రైతు యూనిట్‌గా చేయాలని కేంద్రాన్ని కోరాం.
ఈ యేడాది ఖర్చులు కూడా రాని పత్తి రైతులను ఎలా ఆదుకుంటారు?
రాష్ట్రంలో ఈ సంవత్సరం 48 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు. 33 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇప్పటివరకు మార్కెట్‌లకు పత్తి ఐదు శాతం కూడా రాలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలోని మార్కెట్‌లకు ఒకలక్షా 50వేల మెట్రిక్‌ టన్నుల పత్తి మాత్రమే వచ్చింది. ఈ పత్తి కొనుగోలు కోసం సీసీఐ 38 కేంద్రాలను ఏర్పాటుచేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్‌లలో కొనుగోలు చేస్తున్నాం. ఆదిలాబాద్‌ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర వస్తుంది. మహారాష్ట్ర రైతులు కూడా వచ్చి అమ్మకాలు చేస్తున్నారు.
Credits : Andhrajyothi