అంటుతో మామిడి మధురం

ఏ పండ్ల రకంలో లేనివిధంగా మామిడిలో 70 వేల రకాలు ఉన్నాయి. నాణ్యమైన వంగడానికి మరింత నాణ్యమైన వంగడాన్ని అంటుకట్టడం ద్వారా నిరంతరం మేలైన వంగడాలు జత కావడమే ఇందుకు కారణం. అంటుకట్టే పద్ధతి ద్వారా మంచి రుచి, పరిమాణం వున్న మామిడి రకాలు మనకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. మామిడి విత్తనాల కొరత వల్ల ఈ తరహా అంటు కట్టే విధానం మొదలైంది. దీంతో మామిడి సాగులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, సంగారెడ్డి మామిడి పరిశోధనా క్షేత్రాల్లో ప్రాంతాల్లో టెంకలు (విత్తనాలు) తీసుకుని దాన్ని మొక్కలుగా పెంచుతారు. తరువాత వాటికి తొడుగు కింద మనకు కావాల్సిన రకాన్ని అంటు కట్టి మనకు కావాల్సిన రీతిలో షేడ్‌ నెట్‌లో పెంచుతారు. విత్తనం వేసి పెంచే మామిడి చెట్లు ఆరేళ్ల వరకు కాయలు కాయవు. అదే అంటు మామిడి నాలుగేళ్ల లోపే ఫలాలనిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లను పెంచే అవకాశం వుండటం, సగటు దిగుబడి అత్యధికంగా వుండటంతో అంటు మామిడికి ఆదరణ పెరిగింది.
 
బంగినపల్లిలో 40 వేల రకాలు
వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో చాలా రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అందుల్లో బంగినపల్లిలో 40 వేల రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, హిమాయత్‌, ఆల్‌ఫెన్స్‌జో, మల్లిక, కొత్తపల్లి కొబ్బరి, యలమందల, చెరుకు రసం, పునాస, రాయల్‌ స్పెషల్‌ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనా స్థానంలో 70 వేల మొక్కలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామిడి అంటే సీజనల్‌ ఫ్రూట్‌.. కానీ మామిడిలో కూడా సంవత్సరం పొడవునా ఫలాలనిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు తెలిసిన పునాసతోపాటు రాయల్‌ స్పెషల్‌ కూడా సంవత్సరం అంతా కాపునిస్తుంది. దీంతో మామిడికి సీజన్‌ కూడా అవసరం లేదన్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ వి. రమేష్‌బాబు.
Credits : Andhrajyothi

టమాటాకు స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌

రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉన్నందువల్ల ఈ సమయంలో వివిధ పంటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ గురించి ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతాంగానికి ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
వరి :
వరి పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోంది. దీని నివారణకు రెండు గ్రాముల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కంకినల్లి ఉనికి గమనించడమైంది. నివారణకు స్పైరోమేసిఫిన్‌ ఒక మి.లీ., ప్రోపికోనజోల్‌ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు :
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల తామర పురుగుల ఉధృతి పెరిగి టమాట స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌ తెగులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తామర పురుగుల నివారణకు రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వంగ పంటకు రసం పీల్చే పురుగు ఆశిస్తోంది. నివారణకు రెండు మి.లీ. డైమిథోయేట్‌ లేదా రెండు మి.లీ., మిథైల్‌ డేమటాన్‌ లేదా రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరప పంటను ఎర్రనల్లి ఆశిస్తోంది. నివారణకు 1.25 మి.లీ., స్పైరోమేసిఫెన్‌ లేదా రెండు మి.లీ., ఫెన్‌ పైరాక్సిమెట్‌ లేదా మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా ఐదు మి.లీ., డైకోఫాల్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో తామర పురుగు కూడా గమనించడమైంది. దీని నివారణకు రెండు మి.లీ., ఫిప్రోనిల్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటల్లో తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ ఉధృతి పెరిగి వైరస్‌ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నివారణకు 0.3 మి.లీ., ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 0.3 గ్రా. థయోమిథాక్సాం మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi

ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వేస్ట్‌!

  • తెలుగు రైతులూ పారాహుషార్‌!
చిన్న రైతులను నిర్వీర్యం చేసే ఇజ్రాయెల్‌ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పట్ల తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు పాలస్తీనా ప్రజలు, రైతుల సంక్షేమం కోసం 15 ఏళ్లుగా కృషి చేస్తున్న ఉద్యమకారిణి, రచయిత్రి మరెన్‌ మాంటోవని. స్టాప్‌ ద వాల్‌ ఉద్యమం, పాలస్తీనీయుల భూమి పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె తెలుగు రాష్ట్రాలు ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నాయనే అంశంపై హైదరాబాద్‌ లో పాలస్తీనా రైతులతో స్కైప్‌ ద్వారా ఇష్టాగోష్టి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మరెన్‌ ‘కృషి’తో మాట్లాడారు.
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో ఎడారిని సైతం సస్యశ్యామలం చేస్తామని చెబుతున్నారు. అందులో నిజం లేదంటారా?
ఇజ్రాయెల్‌కు చెందిన నెటాఫిమ్‌ సంస్థ భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాల్లో ఇదే విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నది. పాలస్తీనా ప్రజల నుంచి వారి జీవితాలను, భూమిని, వనరులను లాక్కుని, అక్కడి రైతుకు నీరివ్వకుండా, సొంత భూముల్లో సేద్యం చేయనివ్వకుండా ఇజ్రాయెల్‌ దమనకాండ సాగిస్తున్నది. అలాంటి దేశం ప్రపంచానికి అద్భుతమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని చెబితే ఎలా నమ్మగలం. తెలుగు రాష్ట్రాలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తున్న కంపెనీల్లో ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన నెటాఫిమ్‌ కీలకంగా మారింది.
ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి తొత్తు. కుప్పంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అయిందో అందరికీ తెలిసిందే. ఆ టెక్నాలజీ పర్యావరణ హితం కాదని, సుస్థిర వ్యవసాయానికి అనుకూలం కాదని తేలింది. పలు అంతర్జాతీయ సంస్థలు నెటాఫిమ్‌ను నాణ్యత కలిగిన కంపెనీల జాబితా నుంచి తొలగించాయి. అయినా తెలుగు ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం అంటూ వందల కోట్లు వృధా చేస్తున్నాయి.
పాలస్తీనా రైతులు పడుతున్న కష్టాలకు నెటాఫిమ్‌కు ఎలా సంబంధం వుందంటారు?
గత ఏడు దశాబ్దాలుగా 75 శాతం పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ పాలకులు వారి మాతృభూమి నుంచి తరిమివేశారు. పాలస్తీనీయులకు చెందిన 93 శాతం వ్యవసాయ భూముల్ని లాక్కున్నారు. పాలస్తీనా రైతులు సాగు చేసుకునేందుకు నీరివ్వడం లేదు. బందూకుల పహారా మధ్య రైతులు దైన్యంగా సాగు చేసుకుంటున్నారు. దురాక్రమించిన భూభాగాన్ని విభజిస్తూ ఇజ్రాయెల్‌ భారీగా సరిహద్దు గోడను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో పాలస్తీనా రైతులకు ప్రాణాధారమైన లక్షలాది ఆలివ్‌ చెట్లను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నది. దురాక్రమించిన పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ పట్టణాలను, పరిశ్రమలను నిర్మించింది. అలా ఏర్పాటైన పరిశ్రమల్లో ఒకటి నెటాఫిమ్‌. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏజెంట్‌. లక్షల మంది పాలస్తీనీయుల ఉసురుపోసుకుంటున్న అలాంటి కంపెనీతో తెలుగు ప్రభుత్వాలు చేతులు కలపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
డ్రిప్‌ ఇరిగేషన్‌ను 1966లో ప్రపంచానికి తనే పరిచయం చేశానని నెటాఫిమ్‌ చెప్పుకుంటున్నది కదా?
అందులో ఏమాత్రం నిజం లేదు. చిన్న రైతులు, పాలస్తీనా ప్రజల కన్నీళ్ల మధ్య ఎదిగిన ఆ కంపెనీ తెలుగు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానంటే ఎలా నమ్మగలం? డ్రిప్‌ ఇరిగేషన్‌ పరిజ్ఞానంలో తమకు తిరుగులేదని ఆ సంస్థ తెలుగు ప్రభుత్వాలకు నమ్మబలుకుతోంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీల రూపంలో 274 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం సిఫారసు చేస్తున్న 28 కంపెనీల్లో నెటాఫిమ్‌ ఒకటి. కానీ తెలుగు ప్రభుత్వాలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ఏజెంట్‌ అయిన నెటాఫిమ్‌ ముందు నుంచే వల వేస్తున్నది. నెటాఫిమ్‌ పరికరాల నాణ్యతను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారులను ఇజ్రాయెల్‌ పంపింది. అందుకోసం కోట్లు ఖర్చు చేసింది. ఆ తరువాత వ్యవసాయ అధికారులు సహజంగానే నెటాఫిమ్‌ పరికరాలను రైతులకు సూచిస్తారు. అలా ఆ సంస్థ తెలుగు రైతుల్ని మోసం చేస్తున్నది.
కుప్పం తరహా ప్రయోగం నిష్ఫలం అంటారా?
1995లో కుప్పంలో ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో చేపట్టిన ప్రాజెక్టు వల్ల చిన్న రైతులు ఎంతో నష్టపోయారు. తెలంగాణ ప్రభుత్వం నేటికీ ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడుతూనే వున్నది. 2015లో జీడిమెట్లలో ఇండో – ఇజ్రాయెల్‌ వ్యవసాయ ప్రాజెక్టు చేపట్టారు. 10 ఎకరాల్లో బిందుసేద్యం, పాలీ, నెట్‌ సాగు పద్ధతుల్లో పండ్లు, కూరలు, పూలు ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. గత ఏడాది ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం 12.4 కోట్లు ఖర్చు చేసింది. ములుగులో ఇదే తరహాలో 11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. అందులో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో పండ్ల తోటల సాగుకు 18 కోట్ల కేటాయించారు. స్థానిక సాగు పద్ధతుల్ని వదిలేసి ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడటం విచారకరం.
తెలుగు ప్రభుత్వాలు, రైతులకు మీరిచ్చే సలహా?
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ పెద్ద రైతులు, పెద్ద కమతాలను ఉద్దేశించి రూపొందింది. చిన్న రైతులకు అది ఏమాత్రం ఉపయోగపడదని పాలస్తీనా రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. చిన్న రైతులు అధిక సంఖ్యలో వున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడదు. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణమైన టెక్నాలజీని ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటి అవుతుంది.
Credits : Andhrajyothi

జీడిమామిడికి కొత్త వంగడాల కళ

బాపట్లలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం 11 రకాల కొత్త జీడిమామిడి వంగడాలు రూపొందించింది. ఈ ఏడాది రైతులకు లక్ష జీడిమామిడి మొక్కలు అందించేందుకు బాపట్ల కేంద్రం సన్నాహాలు చేస్తున్నది.
జాతీయ జీడిమామిడి పరిశోధన పథకం కింద బాపట్ల పరిశోధన స్థానంలో 60 ఎకరాల్లో జీడిమామిడి చెట్లు విస్తరించి వున్నాయి. ఈ క్షేత్రంలో శాస్త్రవేత్తలు కొత్తరకాల వంగడాలను తయారుచేయటంతో పాటు ప్రాచుర్యం పొందిన వంగడాల మొక్కల అంటులను తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెట్ల నుంచి వచ్చే పంటను వేలంపాట ద్వారా విక్రయిస్తారు. పరిశోధనా స్థానం ఇప్పటివరకు 11 రకాల వంగడాలను విడుదల చేసింది. విడుదలైన వంగడాలలో బిపిపి-8 అత్యధిక ప్రాచుర్యం పొందింది. అధిక దిగుబడి ఇవ్వడంతో పాటు ఈ హైబ్రీడ్‌ రకం గింజ బరువు 7 నుంచి 8 గ్రాములు ఉంటుంది. దీంతో దీనికి జాతీయ వంగడంగా గుర్తింపు లభించింది. అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం రైతులు ఆసక్తి చూపుతున్నారు. నూతనంగా బిపిపి 10, బిపిపి 11 రకాలను కూడా విడుదల చేశారు. ఇవి కూడా అత్యధిక ప్రాచుర్యం పొందాయి. గత ఏడాది బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం నుంచి 50 వేల మొక్కలు అంటుగట్టి రైతులకు విక్రయించారు. ఈ ఏడాది లక్ష మొక్కలు టార్గెట్‌ పెట్టుకున్నట్లు సీని యర్‌ శాస్త్రవేత్త కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. జీడిమామిడికి ఆశించే పురుగు నివారణకు చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేయాకు దోమ : జీడిమామిడికి తేయాకు దోమ ఆశిస్తే లీటర్‌ నీటికి 0.6 ఎం.ఎల్‌ కరాటే మందును కలిపి పిచికారి చేసుకోవాలి. జీడిమామిడి ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది కాబట్టి ఈ రకం దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.
 
గింజతినే పురుగు : ప్రస్తుత దశలో గింజతినే పురుగు ఆశించే అవకాశం ఉంది. ప్రొఫినోఫాస్‌ మందును పిచికారీ చేసి నివారించుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Credits : Andhrajyothi

రైతుకు వరం

 
ఆంధ్రజ్యోతి ప్రతినిది: పంటల సాగులో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబరు(1800 425 341)ను ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాల్లోని రైతుల సమస్యలకు ఇటు ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాలకు, అటు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లోని ఏరువాక/కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడవచ్చు. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఏ జిల్లా రైతు సమస్య అయితే, ఆ జిల్లాలోని ఏరువాక/ కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్తకు కాల్‌ అనుసంధానం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశువుల యాజమాన్యం, చేపల పెంపకంపై రైతులు తమ సందేహాలకు సలహాలు పొందే వీలుంది. ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుతారు. ఈ సేవలు పొందటానికి సంబంధిత జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం/ ఏరువాక కేంద్రంలో రైతులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నెంబరును ఉచితంగా నమోదు చేస్తారు. అదనపు సమాచారం కోసం 99896 25239, 97006 51031, 91778 04355 సంప్రదించవచ్చని అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పున్నారావు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబరుకు కాకుండా నేరుగా ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రం ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే, రైతుకు కాల్‌ ఛార్జీలు పడతాయి.
ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాల ప్రధాన శాస్త్రవేత్తల నంబర్లు ఇవీ : శ్రీకాకుళం – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23822, విజయనగరం- ఏరువాక కేంద్రం- 99896 23801, విశాఖపట్నం- ఏరువాక కేంద్రం – 99896 23802, తూర్పుగోదావరి- ఏరువాక కేంద్రం- 99896 23803, పశ్చిమగోదావరి- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23823, కృష్ణా- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23824, గుంటూరు- ఏరువాక కేంద్రం- 99896 23806, ప్రకాశం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23827, నెల్లూరు- కృషి విజ్ఞాన కేంద్రం – 99896 23828, కడప – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23826, కర్నూలు- ఏరువాక కేంద్రం- 99896 23910, అనంతపురం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23825, చిత్తూరు – కృషి విజ్ఞాన కేంద్రం- 80085 00320.
Credits : Andhrajyothi

లాభాల్లో రారాజు ఆ కాకర

  • తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రలో డిమాండ్‌..
  • తూర్పుగోదావరి జిల్లాలో 700 ఎకరాల్లో సాగు
కూరగాయల్లో రారాజు ఆకాకర. పోషకాల గనిగా పేరుండటం, శాకాహారులతో
పాటు మాంసాహారులు కూడా ఎక్కువగా వినియోగిస్తుడడంతో ఆకాకరకు
తరగని డిమాండ్‌ వుంది. నిరంతరం మంచి ధర పలికే ఆకాకరను సాగు చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాల రైతులు.
కూరగాయల సాగు నిరంతరం ఆదాయం తెచ్చిపెట్టినా కొన్ని కూరగాయల ధరలు ఒక్కోసారి పాతాళానికి పడిపోతాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు రైతులు నిత్యం మంచి డిమాండ్‌, ధర వుండే ఆకాకర సాగు ప్రారంభించారు. మంచి రుచితో పాటు పోషకాలు పుష్కలంగా వుండటంతో ఆకాకరకు పట్టణాల్లో మంచి గిరాకీ వుంది. దానికి తోడు మంచి ధర పలకడంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి, కొడవలి, తాటిపర్తి గ్రామాలు, ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ రైతులు 700 ఎకరాల్లో అకాకర సాగు చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం కొద్ది విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ పంట సాగు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నది. కిలో వంద రూపాయల నుంచి 250 రూపాయలకు పైగా ధర పలికే ఆకాకర సాగు వల్ల అధిక ఆదాయం వచ్చినా ఖర్చులు, శ్రమ కూడా ఎక్కువే అంటున్నారు రైతులు.
 
పందిరి కోసం అధిక వ్యయం
ఆకాకర రైతులు సొంతంగానే విత్తనాన్ని తయారు చేసుకుంటారు. ఒక పొలంలో పండిన పంట నుంచి విత్తనాలు అదే పొలంలో నాటరు. అలా చేస్తే సరిగా మొలకెత్తదని రైతుల నమ్మకం. తీగ జాతికి చెందిన ఈ పంట సాగులో అధిక భాగం పందిరి వేసేందుకే ఖర్చవుతుంది. మొక్కలు పందిరికి ఎంత బాగా అల్లుకుంటే అంత అధిక దిగుబడి వస్తుంది. దీని సాగుకు ఎకరానికి సుమారు లక్ష నుంచి 1.20 లక్షల వరకూ వ్యయం అవుతుంది. పందరి వేసేందుకే రూ.40 నుంచి 55 వేల వరకూ ఖర్చు చేయాలి. పంట వేసిన 100 రోజులకు దిగుబడులు ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి కాయలను కోస్తారు. ఆరునెలలు పాటు నిరంతరాయంగా దిగుబడులు వస్తాయి. ఎకరానికి సగటున మూడు టన్నుల వరకూ దిగుబడి లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే అత్యధికంగా 4.5 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. విత్తనం వేసిన ఏడాది కాకుండా మరుసటి ఏడాది మొక్కలకు ఉన్న దుంపలతో సాగును కొనసాగిస్తారు. పంట దిగుబడి ప్రారంభంలో 10 కిలోల ఆకాకర ధర రూ.1500 వుంటుంది. పంట చివరి దశకు చేరే కొద్దీ రేటు తగ్గుతూ వచ్చి రూ.500కు చేరుకుంటుంది.
ఈ ప్రాంతంలో పండిన పంటలో 90 శాతం శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, ఇచ్చాపురం, అనకాపల్లి, గుంటూరు, ఒంగోలు మార్కెట్లతో పాటు తెలంగాణాలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్‌ మహారాష్ట్రలోని ముంబయి, కర్నాటకలోని బళ్లారి, బెంగుళూరు తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నది. వ్యాపారులు రైతుల వద్ద పంట కొనుగోలు చేసి వేరే ప్రాంతాలకు లారీల మీద తరలిస్తున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధులు,
పిఠాపురం, గొల్లప్రోలు రూరల్‌
ఎకరాకు లక్ష ఆదాయం
15 ఏళ్లుగా ఆకాకర సాగు చేస్తున్నాం. తుఫాన్లు వస్తే తప్ప ఏటా లాభం వస్తూనే ఉంది. అన్ని ఖర్చులూ పోను ఎకరాకు సుమారు లక్ష ఆదాయం వస్తుంది. గతంలో ఆకాకరను పందిరి పంటగా గుర్తించి సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు అది తీసేశారు. విత్తనాలపై రాయితీ ఇచ్చి, సబ్సిడీ ఇస్తే మరింతమంది రైతులు ఈ పంట సాగు చేస్తారు.
– కందా దొరబాబు, కె. చంటిబాబు,
ఆకాకర రైతులు, వన్నెపూడి
మధుమేహానికి చెక్‌
కాకరకాయను పోలి వుండే ఆకాకర పోషకాల గని. ఇందులో శరీరాన్ని శుద్ధి చేసే ఫినోలిక్‌ అధికంగా లభిస్తుంది. దీనికి శరీరంలోని మాలిన్యాలను తొలగించే శక్తి వుండటంతో కేన్సర్‌, ఊబకాయం వంటి వ్యాధులు దరిచేరకుండా వుంటాయి. అకాల వృద్ధాప్యాన్ని ఆకాకర దరిచేరకుండా చేస్తుంది. ఇందులో లభించే లుటిన్‌ వంటి సెరిటోనాయిడ్స్‌ వల్ల కంటి జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం దరిచేరకుండా చేస్తుంది. వందగ్రాముల ఆకాకరలో కేవలం 17 గ్రాముల కేలరీలు మాత్రమే వుంటాయి. పీచుపదార్ధం కూడా అధికంగా వుండటంతో జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు అలర్జీలను కూడా దరిచేరనివ్వదంటున్నారు నిపుణులు.
Credits : Andhrajyothi

నూతన వంగడాలేవి?

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన వంగడాలు రైతులకు అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది రైతులు మాత్రమే కొత్త వంగడాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఇప్పటికీ కందిలో వ్యవసాయ శాఖ ఎల్‌ఆర్‌జీ-47 రకం, ఐసీపిఎల్‌ 87119 రకం వంటి విత్తనాలు 30 ఏళ్లుగా అమ్ముతున్నారు. దీని వల్ల చాలా నష్టపోతున్నాం.
 కె. జోగిరెడ్డి, రైతు నందివనపర్తి
నూతన వంగడాలన్నింటినీ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. మండల వ్యవసాయ శాఖ అధికారి ఇండెంట్‌ పెడితే రాయితీపై కొత్త రకం వంగడాలను రైతులకు అందిస్తాం. జొన్న, కంది, ఆముదం, మొక్కజొన్న తదితర కొత్తరకం వంగడాలను మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పంపుతాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందరాదు. పాలెం వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్తరకం వంగడాలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి. కొత్త వంగడాలు కావాలని మండల వ్యవసాయ అధికారి దృష్టికి తెస్తే తక్షణం వాటిని పంపుతాం.
 ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త
Credits : Andhrajyothi

వరికి సిరి.. అజొల్లా

వరి మాగాణుల్లో నారు నాటిన 10-15 రోజుల తర్వాత 200 కిలోల అజొల్లాను పొలంలో చల్లితే అజొల్లా పెరిగి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది.
 
దీనివల్ల రైతులు వేయ
వలసిన నత్రజని ఎరువులను 25 శాతం వరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అజొల్లా అనేది నీటిలో పెరిగే ఫెర్న్‌ మొక్క. అజొల్లాలో అనలీనా అనే నీలి ఆకుపచ్చ నాచు బాక్టీరియా ఉండి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఆ విధంగా వరి పొలంలో నత్రజనిని అందిస్తుంది. వరి మాగాణుల్లో అజొల్లా వాడకం వల్ల వాతావరణ కలుషిత కారకమైన మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు వెలువడడం తగ్గుతుంది.
ఈ మధ్య కాలంలో అజొల్లాను పశువుల దాణాగా, కోళ్ల మేతగా కూడా వాడుతున్నారు. తడి అజొల్లాను కోళ్ల మేతగా వాడినప్పుడు ప్రతి కోడి మీద రోజుకి 20 పైసలు వంతున ఖర్చు తగ్గుతుంది. అజొల్లాను పశువుల దాణాగా వాడితే పాల దిగుబడి 15-20 శాతం పెరుగుతుందని, పాలలోని కొవ్వు 10 శాతం పెరిగినట్లు గుర్తించారు. అలాగే పాలల్లో ఎస్‌ఎస్ ఎఫ్‌ 3 శాతం పెరుగుతుంది. కోళ్ల మేతలో వాడినప్పుడు వచ్చే గుడ్లలో ఆల్బుమిన్‌, గ్లాబ్యులిన్‌, బీటాకెరోటిన్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది.
పశువుల దాణాగా, కోళ్ల మేతగా వాడుతున్న అజొల్లాలో 25-30 శాతం ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, లవణాలు, విటమిన్లు, బీటా కెరోటిన్‌ వంటి పశువులకు అత్యంత అవసరమైన మూలకాలు ఉంటాయి. మేతలో అజొల్లాను వాడినప్పుడు కోళ్లు బరువు పెరగడం, గుడ్లు పెరగడం పరిశోధనల్లో తేలింది. కోళ్లకు అజొల్లాను మేతగా వాడినప్పుడు వచ్చే గుడ్లలో బీటా కెరోటిన్‌, ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అజొల్లా వాడకం వల్ల కోళ్లు వ్యాధులను తట్టుకునే గుణం పెరుగుతుందని చెబుతున్నారు.
పురుగులు, తెగుళ్ల ఉధృతి అజొల్లాలో తక్కువ. బెడ్‌లో అజొల్లా ఎక్కువగా ఉన్నట్లైతే పురుగులు, తెగుళ్లు వచ్చే అవకాశం తక్కువ. పురుగుల నివారణకు 5ఎంఎల్‌ వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు సూడోమోనాస్‌ ప్లోరసెన్స్‌, ట్రైకోడెర్మ విరిడిలను 100 గ్రాములు చొప్పున వాడాలి. అజొల్లా నీడ ఉన్న ప్రాంతంలో వేయాలి. ప్రతి రోజు కలియతిప్పుతూ 2-5 సెంటీమీటర్ల నీళ్లు నిల్వ ఉండేలా చూడాలి. ప్రతి 10-15 రోజుల తర్వాత 2/3 భాగాలు తీసి వాడుకోవాలి.
వరిలో నీరు తీసినప్పుడు అజొల్లా మట్టిలో కలిసిపోయి సేంద్రియ పదార్ధంగా ఉపయోగపడుతుంది. అజొల్లా కలుపు మందులను తట్టుకోలేదు. కావున వరి పొలాల్లో వేసేటప్పుడు కలుపు మందులు వాడిన 3-4 రోజుల తర్వాత అజొల్లా వేసుకోవాలి. అజొల్లా దిగుబడి వర్షాకాలం, శీతాకాలం ఎక్కువ. వేసవిలో తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
Credits : Andhrajyothi

యాపిల్‌ బేర్‌తో లాభాలసిరి

  • మామిడికి ప్రత్యామ్నాయంగా పెరుగుతున్న ఆదరణ
గ్రీన్‌ యాపిల్‌, గంగరేగి సంకరంగా రూపొందించిన కొత్త వంగడం యాపిల్‌ బేర్‌ పండు రైతులకు లాభాలు పండిస్తోంది. మెట్ట రైతుకు మామిడికి ప్రత్యామ్నాయ పంటగా ఇది మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే వీలున్న యాపిల్‌బేర్‌ సాగు వేగంగా విస్తరిస్తున్నది.
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలో యాపిల్‌ బేర్‌ సాగు క్రమంగా విస్తరిస్తున్నది. మామిడిరైతుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా వుండటం, ఉద్యాన శాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఈ పంట సాగు వేగంగా విస్తరి స్తున్నది. ఈ పంటను అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. తెగుళ్ళను తట్టుకునే గుణం వుండటం, యాపిల్‌బేర్‌ కాయలు ఎక్కువ కాలం నిల్వ వుండే అవకాశం కూడా వుండటంతో రైతులు దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
కొత్త రకం ఫలం కావడంతో వినియోగదారుల నుంచి కూడా దీనికి మంచి గిరాకీ ఉంది. ఎకరాకు 400 నుంచి 600 మొక్కల వరకు నాటుతున్నారు. ఈ మొక్కలు నాటిన ఆరు మాసాల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు మినహా శీతాకాలం, వర్షాకాలాల్లో ఏడాదికి రెండు దిగుబడులను ఇస్తోంది. ఎకరాకు రూ.40 వేల పెట్టుబడి పెడితే 16 నుండి 24 టన్నుల దిగుబడి వస్తోంది.
యాపిల్‌బేర్‌ కాయలు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజి ధర రూ.50లు పలుకుతుండగా రైతులకు రూ.20లు చొప్పున గిట్టుబాటు అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఏళ్ళు గడిచేకొద్దీ దిగుబడి పెరగడంతో పాటు రైతులకు నికరలాభం పెరుగుతోంది. కేజీకి రూ.20లు ధర పలికితే ఎకరాకు ఏటా మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ ఆదా యం లభిస్తోందని రైతులు చెప్తున్నారు. నాటిన మొక్కలు 20 ఏళ్ళ వరకు దిగుబడిని ఇస్తాయంటున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ పంట సాగుకు హెక్టార్‌కు రూ.14వేల వరకు రాయితీ ఇవ్వడంతో పాటు డ్రిప్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
‘‘యాపిల్‌బేర్‌ వంగడాన్ని జంగారెడ్డిగూడెం నుంచి తెచ్చి ఆరుమాసాల కిందట సాగు చేపట్టా. ఇప్పటికి నెలరోజుల నుంచి కాపు వస్తోంది. చిన్నచెట్లకే 10 నుండి 30 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు 600 మొక్కలు సాగుచేశా. అందులో బంతి, వంగ వంటి ఆరుతడి పంటలు కూడా వేశాను. తోట ఐదేళ్లు పెరిగేసరికి ఎకరాకు 50 టన్నులు దిగుబడి వచ్చేలాగా ఉంద’’న్నారు కనసానపల్లి రైతు ఆలూరి సాంబశివరావు.
Credits : Andhrajyothi

చెరకులో రికార్డు దిగుబడి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంత రైతులు వెరైటీ చెరకు వంగ డాలతో అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరాకు 70 నుంచి 80 టన్నుల దిగుబడి సాధిస్తూ మహారాష్ట్ర రైతులకు సవాల్‌ విసురుతున్నారు. అలాంటి రైతుల్లో ఒకరు న్యాల్‌కల్‌ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు డా.రాజేశ్వర్‌రెడ్డి.
జహీరాబాద్‌ ప్రాంత రైతులు దశాబ్దాలుగా చెరకును ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రరేగడి నేలలు అధికం. ఈ నేలలు చెరకు సాగుకు అనుకూలం కావడంతో జహీరాబాద్‌ డివిజన్‌లోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లో చెరకు అధికంగా సాగవుతున్నది. చెరకులో అంతర పంటగా వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను తీసుకు వచ్చి సాగు చేపడుతున్నారు ఇక్కడి రైతులు. 86032, 93297, 83023, 850186, 89219, 86907, 88014 రకాలను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు భూసారాన్ని పరిశీలించిన తరువాత వారి సిఫారసుల మేరకే చెరకు వంగడాన్ని నాటుకుంటున్నారు. తాజాగా అధిక దిగుబడి ఇచ్చే వీథి 5354 రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు రైతులు. ఈ ప్రాంతంలో 86032 రకం ఎకరాకు 40 నుండి 60 టన్నుల వరకు దిగుబడి రాగా, మహారాష్ట్ర రైతులు ఎకరాకు 100 టన్నుల దిగుబడి సాధించారు. దీన్ని స్వల్పకాలిక రకంగా పిలుస్తారు. తక్కువ నీటితో కూడా సాగు చేసే వీలుంటుంది. 850186 రకం చెరకును హరిత రకంగా పిలుస్తారు. ఈ రకం ఎక్కువగా అడవిపందుల బెడదున్న ప్రాంతాల్లో వేసినా తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తుంది. చెరకు పంటను 5-6 ఫీట్ల మధ్య దూరంలో వేయడం వల్ల కలుపు నివారణకు అనుకూలంగా ఉంటుంది. చాళ్ళ మధ్యలో గడ్డి పెరగకుండా మినీ ట్రాక్టర్ల సహాయంతో కలుపును తీసుకోవచ్చు. దాంతో కూలీల సమస్య వుండదు. ఎకరా చెరకు సాగుకు రూ. 50 వేల మేర ఖర్చు వస్తుంది. ఈ ప్రాంతంలో పలువురు రైతులు గతేడాది ఎకరానికి70 టన్నుల దిగుబడి సాధించారు. ఈ ఏడాది 60 టన్నులకు పైగానే వస్తుందని చెబుతున్నారు. చెరకు పంటను పండించడం ఒక ఎత్తయితే, అమ్ముకోవడం సమస్యగా మారింది. జహీరాబాద్‌ ప్రాంతంలో వున్న చెరకు మిల్లులకు పంటను తరలిస్తే అన్నీ ఖర్చులు కలిపి టన్నుకు రూ. 2940 మాత్రమే ఇస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిస్తే రూ. 3930 వరకు చెల్లిస్తున్నారు. చెరకు మార్కెట్‌ విషయంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
80 టన్నుల దిగుబడి ఖాయం
20 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 17 ఎకరాల్లో ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. మరో మూడు ఎకరాల్లో చెరకు నరికేందుకు సిద్ధంగా వుంది. అందులో 80 టన్నుల వరకు దిగుబడి రావడం ఖాయం.
Credits : Andhrajyothi