రైతు ఇంటికే ఎరువులు

 • ఆన్‌లైన్‌ బుకింగ్‌తో ఉచిత డెలివరీ
ఆన్‌లైన్‌ ద్వారా తమకు నచ్చిన వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసుకునే అవకాశంతో పాటు వాటిని ఉచితంగా రైతు ఇంటికే పంపించే సదుపాయాన్ని ఇండియన్‌ ఫార్మర్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(ఇఫ్కో) కల్పిస్తోంది. ఇందుకోసం ఇండియన్‌ కోఆపరేటివ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం www.iffcobazar.in అనే వెబ్‌సైట్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది తెలుగుతో సహా 13 భాషల్లో ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా నీటిలో కరిగే రసాయన ఎరువులు, ఆగ్రో కెమికల్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కొనుగోళ్లు జరిపే ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ ఐదు కిలోల లోపు ప్యాకెట్లుగా ఉంటాయి. వీటిని కొనుగోలు చేసిన రైతులకు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇంటికి పంపుతామని ఇఫ్కో ప్రకటించింది.
ఫైబర్‌ నెట్‌తో ప్రకృతి సేద్యంపై శిక్షణ
రాష్ట్రంలో ఫైబర్‌నెట్‌ సాయంతో ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించదలిచిన సీఎం చంద్రబాబు ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పద్మశ్రీ పాలేకర్‌కి శిక్షణా కార్యక్రమాల బాధ్యత అప్పగించారు. రాష్ట్రంలోని 13వేల గ్రామాల్లో ఫైబర్‌నెట్‌ ద్వారా నెలకోసారి శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఈ ఏడాది జూన్‌లోగా ప్రకృతి సేద్యంపై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు ఏర్పాటుచేసి, రైతులకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Credits : Andhrajyothi

మామిడికి తేనెమంచు పురుగు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రైతులకు వివిధ పంటల సంరక్షణకై ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడి పంటకు తేనె మంచు పురుగులు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. తేనె మంచు పురుగు, పక్షికన్ను తెగులు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్‌ + 1 గ్రాము కార్బండజిమ్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు కనుక సోకినట్లయితే 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా ఒక మి.లీ. కారాతేన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న
పైరు మొలిచిన 10-15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు 25-30 రోజుల దశలో కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను ఎకరాకు 3-4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి. మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితులలో పేనుబంక ఆశించే అవకాశముంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమిటాన్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్‌ పంటలలో డైమండ్‌ రెక్కల పురుగు నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్‌ లేదా 0.3 మి.లీ. స్పినోసాడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పంట కోతకు 15 రోజుల ముందుగా పిచికారీ చేయాలి.
వరిలో కాండం తొలుచు పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15-20 రోజుల లోపు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి.
Credits : Andhrajyothi

100 కోట్ల కోడూరు అరటి

అరటి సాగుకు కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతం వేదిక అవుతోంది. గతంలో బొప్పాయి సాగు చేసి నష్టపోయిన ఈ ప్రాంత రైతులు అరటి సాగుతో అధిక లాభాలు గడిస్తున్నారు. ఈ ప్రాంతంలో అరటి పంటపై ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
20 వేల హెక్టార్లలో సాగు
అరటి తోటలతో కడప జిల్లా రైల్వేకోడూరు, పుల్లంపేట, చిట్వేలి, ఓబులవారిపల్లె, పెనగలూరు మండలాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది సుమారు 20 వేల హెక్టార్లలో అరటి సాగు జరుగు తోంది. మార్కెటింగ్‌ సులభం కావడం, చీడపీడలు తక్కువగా వుండటంతో మరింతమంది రైతులు అరటి వైపు మొగ్గు చూపి స్తున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వుండటంతో ఎక్కువ శాతం రైతులు గ్రాండ్‌-9 రకం అరటిని సాగు చేస్తున్నారు.
గత ఏడాది పచ్చ అరటి కిలో రూ.15 ధర పలికింది. ప్రస్తుతం కిలో రూ. 10 నుంచి రూ. 11కు అమ్ముడవుతున్నాయి. పచ్చ అరటి, గ్రాండ్‌-9, టిష్యూకల్చర్‌, అమృతపాణి, సుగంధాలు, చక్కరకేళి తదితర వెరైటీలను ఈ ప్రాంత రైతులు సాగు చేస్తున్నారు.
అరటి సాగుకు ఎకరాకు రూ.30 నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతున్నది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. అరటికాయలను ఇక్కడ నుంచి తిరుపతి, రాజంపేట, చెన్నై, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఎక్కువ శాతం పంటను తిరుపతికి తరలిస్తున్నారు.
నాణ్యత వున్న పంటను విదేశాలకు కూడా పంపుతున్నారు. ఈ ప్రాంత రైతులు తమ పంటను ఏటా గల్ఫ్‌ దేశాలకు పంపడం విశేషం. కూరకు పనికి వచ్చే అరటికాయలను ఎక్కువగా తిరుపతి వంటి నగరాలకు తరలిస్తున్నారు. అరటికి ఎక్కువగా సిగటోగ, ఆకుముడత, అగ్గితెగులు, పండు ఈగ తదితర తెగుళ్లు వస్తాయి. తెగుళ్లు ఆశించినప్పుడు ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని నివారించుకోవాలి. చలికాలంలో అరటికి సిగటోగ తెగులు సోకుతుంది. దీంతో అరటిచెట్లు ఎండిపోతుంటాయి. సకాలంలో మందులు పిచికారీ చేస్తే చాలా మంచిదని ఉద్యానశాఖాధికారులు సూచిస్తున్నారు.
చాలామంది వ్యాపారులు అరటి గెలలను కోసి, గెల నుంచి హస్తాలను వేరు చేస్తారు. వాటిని మందు ద్రావణంలో ముంచి ప్రత్యేక ట్రేలలో నింపి మార్కెట్‌కు పంపుతారు. మరికొందరు ట్రేల్లోనే మాగబెడతారు. కొందరు వ్యాపారులు మూటలోవేసి మాగబెట్టి తర్వాత మార్కెట్‌కు పంపుతారు. ఈ ప్రాంతంలో సాగయ్యే అరటి నాందేడు కాయల కంటే ఎక్కువగా బరువు, సైజు వస్తున్నాయి. కొందరు రైతులు సేంద్రియ పద్ధతుల్లో అరటి సాగు చేస్తూ తమ పంటను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
అరటి పిలకల ఎంపిక కీలకం
రైతులు నాణ్యతగల అరటిపిలకలు ఎంపిక చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే వీలుంటుంది. మంచి ఎరువులు ఉపయోగించాలి. అరటికి మార్కెట్‌ సౌకర్యం బాగా ఉంది. ధరలు కూడా రైతుల ఆశించిన విధంగా వుంటున్నాయి.
– రేణుకాప్రసాద్‌, రైల్వేకోడూరు ఉద్యానశాఖాధికారి
బొప్పాయికంటే అరటి మేలు
మా ప్రాంత రైతులు గతంలో ఎక్కువగా బొప్పాయి సాగు చేసే వారు. బొప్పాయికి వేరుకుళ్లు రావడంతో చెట్లు చనిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి సాగు లాభదాయకంగా వుండటంతో ఈ ప్రాంతంలో ఎక్కువమంది అరటినే సాగు చేస్తున్నారు.
– సుదర్శన్‌రాజు, యువరైతు, రైల్వేకోడూరు
Credits : Andhrajyothi

మల్చింగ్‌తో పుచ్చ సాగు

 • ఎకరానికి 25 టన్నుల దిగుబడి .. ఐదు లక్షల లాభం
తనకున్న పదెకరాల సొంత భూమితో పాటు మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని గతేడాది నవంబర్‌లో వసుధ రకం పుచ్చను రెండు దఫాలుగా విత్తారు తిరుపతిరెడ్డి. 20 ఎకరాల్లో మల్చింగ్‌ (పాలిథిన్‌ కవర్‌ కప్పు) పద్ధతిలో సాగుచేసి డ్రిప్‌ అమర్చాడు. దీనికిగాను ఒక్కో ఎకరానికి పెట్టుబడిగా విత్తనాలు, పేపర్‌, డ్రిప్‌, వేపపిండి, ఆముదం పిండి, పొటాష్‌, డీఏపీ, యూరియా మొత్తం రూ.70 వేలు ఖర్చయింది. మల్చింగ్‌ విధానంలో కూలీల ఖర్చుతోపాటు ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గింది. 75 రోజుల అనంతరం ఎకరానికి మొదటి విడతగా 15 టన్నుల పంట దిగుబడి వచ్చింది. పదెకరాలలో తొలి విడతగా 150 టన్నులు పంట దిగుబడి వచ్చింది. ప్రస్తుత మార్కెట్‌లో టన్ను రూ. ఏడు వేలు ఉండగా, పంట అమ్మగా రూ.10 లక్షలు వచ్చాయి. ఖర్చులు పోను ఐదు లక్షలు నికర లాభం ఆర్జించారు ఈ రైతు. మండల వ్యాప్తంగా ములకలపల్లి, కమలాపురం, జగన్నాథపురం, తిమ్మంపేట, రాజుపేట తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో రైతులు పుచ్చ పంట సాగు చేశారు. వారందరిలో తిరుపతిరెడ్డి ఒక్కరే మల్చింగ్‌ విధానంలో సాగుచేసి లాభం గడించడం విశేషం. వసుధ రకం పుచ్చ సాగుకు ఎకరానికి ఐదు ట్రక్కుల పశువుల ఎరువు, 50 కేజీల వేపపిండి, 50 కేజీల ఆముదం పిండి, 50 కేజీల పొటాష్‌, 50 కేజీల డీఏపీ, యూరియా 100 కేజీలు వాడాను. డ్రిప్‌, మల్చింగ్‌ విధానంతో ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పంట దిగుబడి వచ్చింది. సాధారణ పద్ధతిలో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పంట మాత్రమే దిగుబడి వస్తుందన్నారు ఆ రైతు.
మూస పద్ధతికి స్వస్తి పలికి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అరుదైన ఫలితాలు సాధిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన గాడి
తిరుపతిరెడ్డి. మల్చింగ్‌ పద్ధతిలో పుచ్చ సాగు చేసి 75 రోజుల్లో ఐదు లక్షలు ఆర్జించారు ఆ రైతు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి,
ములకలపల్లి
Credits : Andhrajyothi

సిరులిచ్చే వరి వంగడం

 • 20 శాతం అధిక దిగుబడి
 • సీసీఎంబీ శాస్త్రవేత్త సృష్టి
 • త్వరలో అందుబాటులోకి..
మనుషుల్లో మాదిరిగానే మొక్కల్లో కూడా జన్యువులు ఉంటాయి. వాటిని గుర్తించి మార్పులు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. మన దేశంలో మొక్కల జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న సంస్థ సీసీఎంబీ ఒకటే!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పోలిస్తే.. 20 శాతం అదనంగా దిగుబడినిచ్చే కొత్తరకం వరిని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ (సీసీఎంబీ) శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. ఇది ఈ ఏడాది ఖరీఫ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ వంగడం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. వీటి కోసం మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సీసీఎంబీ కూడా మేలు రకం వంగడాల్లోని పది వేల రకాల జన్యువులను సేకరించి వాటి ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కొత్తరకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ‘ప్రతి వరి రకంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఉదాహరణకు కొన్ని వరి రకాలు త్వరగా పండుతాయి. కొన్నింటికి రకరకాల చీడపీడలను తట్టుకొనే శక్తి ఉంటుంది. వీటన్నింటికీ కారణం వాటిలో ఉండే జన్యువులు. ఆయా వరి రకాల్లో ఉన్న మంచి లక్షణాలకు కారణమైన జన్యువులను వేరు చేసి వాటి ద్వారా కొత్త రకాన్ని అభివృద్ధి చేశాం. దీనిపై ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి దాదాపుగా పూర్తయినట్లే. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీనిని ఈ ఏడాది మధ్యలో రైతులకు అందిస్తాం’ అని ఈ వరి రకాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్‌ హితేంద్ర పటేల్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఏదైనా కొత్తరకం వరిని విడుదల చేసే ముందు మూడేళ్ల పాటు పరీక్షలు జరుపుతారు.
ఈ పరీక్షల్లో పర్యావరణం, ఇతర పంటలు, ప్రాణులకు ఎటువంటి హాని ఉండదని తేలిన తర్వాత దానిని మార్కెట్‌లోకి విడుదల చేయటానికి అనుమతిస్తారు. సీసీఎంబీ ఇప్పటికే వివిధ రకాల చీడపీడలను తట్టుకొనే వరిని అభివృద్ధి చేసింది. ‘పంటల విషయంలో జన్యుస్థాయిలో పరిశోధనలు చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని వేల ఏళ్ల పరిణామక్రమం తర్వాత ఈ పంటలు ప్రస్తుత స్థితికి వచ్చాయి. అంటే వాటిలో ఉండే జన్యువుల కూడా అనేక రకాల మార్పులకు లోనయ్యాయి. మేము అలాంటి మార్పులు రావటానికి కారణమైన జన్యువులను ముందుగా గుర్తిస్తాం.
ఉదాహరణకు.. ఒక రకం వరి మిగిలిన వాటి కన్నా ముందే సిద్ధమవుతోందనుకుందాం. దీనికి కారణమైన జన్యువులను మేము గుర్తిస్తాం. ఈ జన్యువులను విడదీసి వేరే రకాల్లో ప్రవేశపెడతాం. ఆ తర్వాత ఈ జన్యువులు ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన మార్పులను గమనిస్తాం. ఉదాహరణకు ఎక్కువ దిగుబడినిచ్చేందుకు కారణమైన ఒక జన్యువును ప్రవేశపెడితే దాని వల్ల మొక్కకు చీడలను తట్టుకొనే శక్తి తగ్గిపోవచ్చు.. ఇలాంటి రకరకాల చర్య – ప్రతిచర్యలను గమనించిన తర్వాత కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తా’ అని వివరించారు. గత ఏడాది సీసీఎంబీ సాంబమసూరిలో ఒక కొత్త రకాన్ని రైతుల కోసం విడుదల చేసింది. ‘దక్షిణ భారత దేశంలో సాంబమసూరిని ఎక్కువగా తింటారు. అందుకే మేము ఆ రకాన్ని ఎన్నుకున్నాం. కొత్తరకం వరికి కూడా ఇదే మూలం’ అని హితేంద్ర వివరించారు.
 Credits : Andhrajyothi

ఏజెన్సీకి రబ్బరు మెరుపులు!

 • మారేడుమిల్లిలో 90 హెక్టార్లలో సాగు
 • 40 ఏళ్ల తరువాత రబ్బరు కలప రెడీ
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రబ్బరు తోటల సాగు గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. మారేడుమిల్లి మండలం దేవరాపల్లి, పూజారి పాకలు గ్రామాల్లో 90 హెక్టార్లలో రబ్బరు సాగవుతున్నది. మార్కెట్‌లో మంచి ధర వస్తే రబ్బరు సాగు మరింత లాభదాయకం అంటున్నారు రైతులు.
మారేడుమిల్లి మండలంలోని దేవరాపల్లి గ్రామంలో కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 1994-99 మధ్యలో 50 హెక్టార్లలో రబ్బరు తోటల సాగు మొదలైంది. ఒకేచోట రబ్బరు తోటల సముదాయం పథకం కింద 35 మంది గిరిజన రైతులతో రబ్బర్‌ గ్రోయర్స్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటుచేసి 50 హెక్టార్లలో రబ్బరు మొక్కల పెంపకం ప్రారంభించారు. 1998లో పూజారిపాకలలో మరో 40 హెక్టార్లలో 32 మంది రైతులు రబ్బరు సాగు చేపట్టారు. ఈ మొక్కలు వేసిన 10వ ఏడాది నుంచి 40 ఏళ్ల వరకు మాత్రమే పాలు వస్తాయి. మొదట్లో రబ్బరు రైతులకు ఆదాయం వుండదు కాబట్టి పని చేసిన రోజున, రోజుకు రూ.40 వంతున గౌరవ వేతనం చెల్లించారు.
2008 నుంచి చెట్లకు పాలు రావడం మొదలైంది. ఈ చెట్లు ఏపుగా పెరగడానికి యూరియా, పొటాషియం ఎరువుగా వేశారు. హెక్టారుకు సుమారు 490 చెట్ల వరకు ఉంటాయి. చెట్టు మొదటి భాగంలో పెచ్చులు ఊడేటట్టు కత్తితో కోస్తారు. అక్కడ నుంచి చిన్న దారి కింద వరకు గీస్తారు. అక్కడ ఒక కప్పును కడతారు. ఈ పాలు నెమ్మదిగా కారుతూ వచ్చి ఈ కప్పులో పడతాయి. వీటిని రెండు రోజులకు ఒకసారి తెల్లవారుఝామున మూడు నుంచి 7 గంటల వరకు సేకరిస్తారు. ఈ చెట్లకు ఆగస్టు నుంచి జనవరి వరకు మాత్రమే పాలు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి రోజుకు లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు వస్తాయి.
ఈ ప్రాంతంలో రబ్బరు తోటలను ఐటీడీఏ 1968లోనే ఆరు వేల హెక్టార్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. మార్కెట్‌ చేయలేకనో, పర్యవేక్షణ లోపమో కానీ కాలక్రమంలో ఆ తోటలను గాలికి వదిలేసింది. ప్రస్తుతం సుమారు 600 హెక్టార్లలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి. వీటి లావు 100 సెంటీమీటర్లు అయ్యింది. వీటిని ప్రస్తుతం కలపగా ఉపయోగించుకోవచ్చు. రబ్బరు చెట్టు 40 ఏళ్ల తరువాత కలపగా బాగా ఉపయోగపడుతుంది. అయితే రబ్బరు కలపను ప్రొసెసింగ్‌ చేసే రబ్బరు ఉడ్‌ ఫ్యాక్టరీ కేరళలో మాత్రమే వుంది. మన దగ్గర ఆ అవకాశం లేకపోవడంతో రెండు వేల మంది రైతులు ఈ పంట నుంచి ఏ ఫలితం రాక వాటిని వదిలేశారు. ఐటీడీఏ చొరవ తీసుకుంటే పెరిగిన చెట్ల నుంచి వేలాది మంది రైతులకు ఆదాయం వస్తుంది.
రబ్బరుకు గతంలో కేజీకి రూ. 234 ధర వుండేది. ఇప్పుడు 126కు పడిపోయింది. వియత్నాం, మలేషియా, థాయిలాండ్‌ నుంచి దిగుమతులు పెరగడం ధరల పతనానికి కారణం. మన దేశంలో కేరళలో రబ్బరు అధికంగా సాగవుతుంది. వర్షపాతం ఎక్కువగా వుండి, ఉష్ణోగ్రతలు తక్కువగా వుండటం కేరళ ప్రత్యేకత. తూర్పు ఏజెన్సీలో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కూడా రబ్బరు రైతులకు ప్రతికూలంగా మారాయన్నారు రబ్బర్‌ బోర్డు ఫీల్డ్‌ ఆఫీసర్‌ జగన్మోహన్‌రెడ్డి.
రబ్బరు తయారీ ఇలా..
రబ్బరు చెట్ల నుంచి సేకరించిన పాలను ప్రొసెసింగ్‌ యూనిట్లకు తీసుకువస్తారు. అక్కడ రెండు లీటర్లు నీళ్ళు, రెండు లీటర్లు పాలు కలిపి ఒక ట్రేలో వేస్తారు. అంతకుముందే 5 లీటర్ల నీళ్ళలో 50 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ను కలిపి ఒక ట్రేలో ఉంచుతారు. అందులో 200 నుంచి 250 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ కలిపిన నీళ్ళను పాలలో కలుపుతారు. ఒక రోజంతా ఆ ట్రేలోనే ఉంచుతారు. తెల్లవారేసరికి పెరుగులా తోడుకుంటుంది. ఒక తెల్లటి షీట్‌ వస్తుంది. దాన్ని మిషన్‌లో రోలింగ్‌ చేస్తారు. తరువాత ఒకరోజు ఆరబెడతారు. ఆ షీట్‌ను నాలుగు రోజుల పాటు స్మోక్‌ హౌస్‌లో పెడతారు. తరువాత అది తేనె కలర్‌లోకి మారుతుంది. షీట్‌ను వేరు చేసి మార్కెట్‌కు తరలిస్తారు. దాన్ని ఫ్యాక్టరీ వారు కొనుక్కొని రబ్బరు వస్తువులు తయారు చేస్తారు. దీన్ని సియట్‌, ఎంఆర్‌ఎఫ్‌ వంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
లాభదాయకమే
రబ్బరు సాగు లాభదాయకంగా ఉంది. రోజూ ఆరు నుంచి ఏడు గంటలు పనిచేస్తాం. ఎవరికి వారే రబ్బరు పాలు సేకరించి, షీట్లు తయారు చేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఆరు టన్నుల రబ్బరు షీట్లు అమ్మాం. మంచి ధర వుంటే మరిన్ని లాభాలు వచ్చేవి.
– చిన్నారెడ్డి, లక్ష్మి, రైతులు, దేవరాపల్లి
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, రాజమహేంద్రవరం
Credits : Andhrajyothi

ఇక వేసవిలోనూ టమాటా

 • 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోనూ పండే వంగడం సిద్ధం
 • అభివృద్ధి చేసిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు
పటాన్‌చెరు, జనవరి 18: టమాటాలను ఇక వేసవిలోనూ పండించవచ్చు. 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలోనూ పండించ గలిగే టమాటా వంగడాన్ని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచ కూరగాయల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రంలో టమాటాలో మెరుగైన వంగడాలను అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్‌లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ప్రముఖ విత్తన కంపెనీల ప్రతినిధులు టమాటా వంగడాలను పరిశీలించారు. వర్షాకాలం, చలికాలంలోనే పండే టమాటా వేసవి కాలంలో కొండెక్కి కూర్చుంటోంది. మిగిలిన రోజుల్లో రూ.5కు లభించే కిలో టమాటా వేసవిలో రూ.100కు చేరుతోంది. ఆలుగడ్డ, ఉల్లి తర్వాత కూరల్లో తప్పనిసరి వేయాల్సి రావడంతో ప్రజలు ఎక్కువ ధరకూ కొనాల్సి వస్తోంది. దీంతో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు టమాటా వంగడాలపై ఐదేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. కూరగాయల పరిశోధనా కేంద్రం రీజినల్‌ డైరెక్టర్‌ వార్విక్‌ ఎస్‌డౌన్‌ మాట్లాడుతూ.. వాతావరణ, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసిన 3 రకాల టమాటా వంగడాలను రైతుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అధిక ఊష్ణోగ్రతలను తట్టుకుని 45 డిగ్రీల సెల్సియన్‌లోనూ అధిక దిగుబడులు ఇచ్చే ఏవీటీఓ-1424 రకాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇక టమాటా పంటను తరచూ పీడిస్తున్న ఆకులకు వచ్చే పసుపు పచ్చ తెగులు, ఇతర వైరస్‌ తెగుల్లు, నల్లమచ్చలను తట్టుకునే ఏవీటీఓ-1609, ఏవీటీఓ-1617 రకాలను అభివృద్ధి చేశామన్నారు. ఇవి పరిశీలన దశలోనే ఉన్నాయని, రైతుల పొలాలకు చేరేందుకు మరింత సమయం పడుతుందన్నారు.
Credits : Andhrajyothi

మననేలపై ఆస్ట్రేలియా ద్రాక్ష

 •  ములుగు గిరిజన బిడ్డ విజయప్రస్థానం..
 • తెలంగాణను అగ్రగామిగా నిలుపుతానంటున్న నాయక్‌
ఆస్ట్రేలియా రకం ద్రాక్ష సాగుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం అన్నంపల్లికి చెందిన పోరిక హరికాంత్‌ నాయక్‌. వ్యవసాయంపై కోయంబత్తూర్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ చేస్తున్న ఆ యువకుడు తమిళనాడు, కర్ణాటకల్లో ద్రాక్షపై పరిశోధనలు చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతానంటున్న ఆ గిరిజన బిడ్డ విజయగాథ ఇది.
ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో మాత్రమే పండే ద్రాక్ష పంటపై పరిశోధనలు చేసి విజయం సాధించాడో తెలంగాణ గిరిజన బిడ్డ. ఆస్ర్టేలియా రకం ద్రాక్షను మనదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలిచి, అధిక దిగుబడులు సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం అన్నంపల్లికి చెందిన పోరిక హరికాంత్‌. హైదరాబాద్‌ ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ చేసిన హరి కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేస్తూ సీనియర్‌ ఫెలోషి్‌పకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులోని ఐసీఏఆర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
ద్రాక్షపై దీక్ష..
రెడ్‌గ్లోబ్‌ రకం ద్రాక్ష ఆస్ట్రేలియాలో విరివిగా పండుతుంది. లావుగా, మంచి రంగులో, తీయగా వుంటే ఈ ద్రాక్షను భారత్‌లో సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ భావించింది. దీని సాగుకు కోయంబత్తూరు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రకం పంటను అభివృద్ధి చేసే పనిని అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అక్కడే ఎమ్మెస్సీ చేస్తున్న హరికాంత్‌ నాయక్‌ ఆ బాధ్యతలు స్వీక రించాడు. విశ్వవిద్యా లయంలో కొంత భూమిని తీసుకుని ఆ విత్తనాలు నాటి సాగు ప్రారం భించాడు. ఎర్రమట్టి నేల, నీరు, తేమతో కూడిన అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పిస్తూ ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతిలో ఆస్ట్రేలియా రకం ద్రాక్షను విజయవంతంగా సాగు చేశాడు నాయక్‌.
మన ద్రాక్షతో పోల్చితే రెడ్‌గ్లోబ్‌ ఆకారంలో పెద్దది. నీరు శాతం తక్కువగా ఉంటుంది. బరువు కూడా ఎక్కువ తూగుతుంది. ఎక్కువ కాలం పాడు కాకుండా వుంటుంది. ఈ రకం ఆస్ర్టేలియాలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పండిస్తుంటే మనదేశంలో మాత్రం రెండుసార్లు కోతకు వస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఆస్ట్రేలియా రకం ద్రాక్షకు విదేశాల్లో మంచి డిమాండ్‌ వుంది. ఈ ద్రాక్షకు కిలో రూ.350 వరకు ధర పలుకుతోంది. రైతులకు క్షేత్ర స్థాయిలో కిలోకు 150 వరకు ఆదాయం వస్తుంది. డిమాండ్‌ను బట్టి ఎకరం సాగు చేస్తే రూ.15 లక్షల వరకు ఆర్జించవచ్చని హరికాంత్‌ నాయక్‌ తెలిపాడు.
రెడ్‌గ్లోబ్‌ రకం ద్రాక్షను భారత వాతావరణ పరిస్థితిలో పండించి అధిక దిగుబడి సాధించిన నాయక్‌ను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. ఎడారి ప్రాంతమైన ఇజ్రాయిల్‌లో గ్రీన్‌హౌస్‌, బిందుసేద్యం, పూర్తి యాంత్రీకరణ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న తీరును ఆయన అధ్యయనం చేశారు. వ్యవసాయరంగంలో నాయక్‌ చేసిన కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం హరికాంత్‌ను బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికచేయగా, ఫాదర్‌ ఆఫ్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ ఎంఎ్‌స. స్వామినాధన్‌ చేతులమీదుగా నాయక్‌ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితోపాటు పలువురు సీనియర్‌ శాస్త్రవేత్తలు హరికాంత్‌ సాగుచేసిన ద్రాక్ష తోటను సందర్శించి, విరగగాసిన ద్రాక్ష గుత్తులను చూసి అబ్బురపడ్డారు.
రైతే రాజు
ఇజ్రాయిల్‌ తరహా సాగు పద్ధతులు అనుసరిస్తే తెలంగాణ రైతులు రాజులు అవుతారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే అరుదైన ద్రాక్ష, యాపిల్‌తో పాటు అంతర్జాతీయంగా డిమాండ్‌ వున్న కూరగాయలను తెలంగాణలో సాగు చేస్తాను. సేద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తాను.
– హరికాంత్‌ నాయక్‌
Credits : Andhrajyothi

సహజ ఎరువుల మోహనుడు!

 • ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగడి రైతు
సేంద్రియ సేద్యం మాత్రమే నేలతల్లితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని బలంగా నమ్మడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు సాధిస్తున్నారు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కొత్తగడికి చెందిన మోహన్‌రెడ్డి.
డిగ్రీ చదివిన మోహన్‌ రెడ్డి వ్యవసాయ మీద ఉన్న ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సాగు పద్ధతుల్ని అధ్యయనం చేశారు. సేంద్రియ సేద్యం మాత్రమే రైతుకు మేలు చేస్తుందని భావించారు. సేంద్రియ పద్ధతిలో టమాట, క్యారెట్‌, బీర, కాకర, బొప్పాయి, వంకాయ, కాలీప్లవర్‌, క్యాబేజి తదితర పంటల సాగు చేపట్టారు. గత ఏడాది ఎకరంలో 40 టన్నుల టమాటా దిగుబడి సాధించానన్నారు మోహన్‌రెడ్డి. వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బాక్టీరియా, జీవామృతాలతో సేద్యం చేస్తున్నారాయన. సేంద్రియ సాగుతో రైతుకు పెట్టుబడి ఖర్చులో 70 శాతం తగ్గుతుంది.
అంతేకాకుండా సేంద్రియంగా పండించే కూరగాయలు తినే వారిపై ఎలాంటి చెడు ప్రభావం వుండదు. పెట్టుబడి తగ్గడం వల్ల రైతుకు లాభం ఎక్కువగా వస్తుందంటారాయన. విలక్షణమైన ఆయన సాగు విధానాలు చూసేందుకు సాటి రైతులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఆయన క్షేత్రాన్ని సందర్శించడం విశేషం.
వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బ్యాక్టీరియా అనేది ప్రస్తుతం కూరగాయల పంటలు సాగు చేసేవారికి వరంగా మారింది. దీన్ని రైతులు పొలంలోనే తయారు చేసుకోవచ్చు. ఒక మిల్లీలీటర్‌ మదర్‌ కల్చర్‌ నూనెను 200 లీటర్ల నీటిలో వేసి అందులో రెండు కిలోల బెల ్లం, పప్పుధాన్యాల పిండి వేయాలి. ఏడు రోజుల పాటు దీనిని నానబెట్టాలి. నానబెట్టే క్రమంలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని పొలాలపై పిచికారీ చేస్తే పంటలను ఆశించే చీడపీడలు పంటల దరిచేరవు. ముఖ్యంగా ఇది దోమపోటుకు బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని చెట్టు మొదట వేస్తే చెట్టు బలంగా పెరుగుతుంది.
సేంద్రియ సాగులో జీవామృతం అనేది చాలా కీలకం. జీవామృతం వాడటం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. పంటపై పిచికారీ చేస్తే చీడ పీడలు ఆశించవు అదే విధంగా మొక్క కాండం వద్ద జీవామృతం పోస్తే మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిని రైతు ఇంటి వద్ద, పొలం వద్ద సులువుగా తయారు చేసుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల గో మూత్రం, 10 కిలోల గోవు తాజా పేడ, 2 కిలోల బెల్లం వేసి కలపాలి. అదే విధంగా ఇందులో పప్పుధాన్యాల పిండి(ఏదైనా పప్పుధాన్యం), కొంత ఒరంగట్టు మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు నాలుగుసార్లు కలిపి 48 గంటలు నానబెట్టాలి. ఈవిధంగా తయారుచేసిన జీవామృతం మిశ్రమాన్ని నేరుగా చెట్లకు పిచికారీ చేయాలి. అదే విధంగా చెట్టు కాండం వద్ద్ద పోయవచ్చు.
Credits : Andhrajyothi

రైతును పీల్చేస్తున్న గులాబీ పురుగు

 • పత్తి మనుగడకే ముప్పంటున్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది పత్తి రైతు ఆశలను గులాబీ పురుగు భగ్నం చేసింది. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటకు రైతులు పొలంలోనే నిప్పుపెడుతున్నారు. పత్తి పంటలో, చివరకు తీసిన పత్తిలో అయినా గులాబీ పురుగు అవశేషాలుంటే వచ్చే ఏడాది వేసే పంటను కూడా ఈ పురుగు దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.
పత్తి రైతులను ఈ ఏడాది గులాబీ పురుగు తీవ్ర సంక్షోభంలో పడేసింది. ఏపుగా కాసిన పంట కాయల్లో గులాబీ పురుగు గుడ్లను చేసి పంటను నాశనం చేసింది. వడ్డీలకు అప్పులు తెచ్చి, పత్తి సాగు చేసిన రైతన్న అదే పంటను ఇప్పుడు పొలంలోనే కాల్చివేస్తున్నాడు. పంట చేతికందాల్సిన సమయంలో చెట్టుకు 50 నుంచి 100 కాయలున్నా ప్రతికాయలో గులాబీ పురుగు చొరబడి లోపల పత్తిని మొత్తం తినేస్తున్నది. పెట్టుబడి రాకున్నా కనీసం కూలీ డబ్బులన్నా మిగులుతాయనుకుంటే గులాబీ పురుగు కారణంగా ఆ ఆశలూ అడుగంటాయి. పత్తికి గులాబీ రంగు, రసం పీల్చే తెగులు సోకింది. పత్తి ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్న సమయంలో గులాబీ పురుగు, తెగులు సోకడంతో రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గులాబీ పురుగు, రసం పీల్చే తెగుళ్లతో పంట దెబ్బతినగా చేతికందిన కొద్దిపాటి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఎకరం పత్తి పంటకు 30 నుంచి 40వేల పెట్టుబడులు పెట్టారు రైతులు. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా గులాబీ పురుగు, తెగుళ్లు కారణంగా కేవలం 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట సరిగా లేకపోవడంతో గిట్టుబాటు ధర కూడా రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘బీటీ పత్తిలో 120 రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు వస్తుంది. ఇది క్యాన్సర్‌ లాంటిది. మొగ్గదశలో రెక్కల పురుగు గుడ్డు పెడుతుంది. ఆ పురుగు అండాశయంలో చొరబడి కాయలో ఉన్న మొత్తం గుజ్జును తింటుంది. దాంతో అపరిపక్వ దశలో కాయ పగిలి గుడ్డి పత్తి వస్తుంది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంద’న్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ బోడ విజయ్‌. ‘బీటీ పత్తిని నాటే ముందు నాన్‌ బీటీని చుట్టూ నాలుగు వ రుసలు నాటాలి. కాని ఆ పని ఏ ఒక్క రైతు చెయ్యలేదు. దీంతో బీటి పైనే గులాబీ రంగు తల్లిపురుగు వచ్చి చేరి బీటీని తట్టుకునే శక్తి వచ్చింది. జనవరిలో వచ్చే గులాబీ రంగు పురుగు నవంబర్‌లోనే వచ్చింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింద’న్నారు ఏరువాక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి.
‘ఖరీఫ్‌లో ఎకరానికి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. ఇప్పటివర కూ రెండు క్వింటాళ్ల పత్తిని మాత్రమే తీశా. పత్తి చేనులో ఎక్కడా చూసినా గులాబీ రంగు పురుగుతోపాటు లద్దె పురుగు ఎక్కువగా వుంది. ఎనిమిదేళ్ల నుంచి సాగుచేస్తున్నా. ఇంత దారుణం ఎన్నడూ లేద’న్నారు ఊరుగొండ గ్రామ రైతు జనుపాల రమేష్‌.
గులాబీ పురుగుకు చెక్‌ ఇలా
జనవరిలో పత్తి పంటను తొలగించి, మరో పంట వేసుకోవాలి.
తొలగించిన పత్తి చెత్తను కాల్చివేయాలి.
వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. దీంతో భూమిలో నిద్రావస్థలో ఉన్న గులాబీ రంగు పురుగు లార్వా వేడికి చ నిపోతుంది.
పత్తి మిల్లుల్లో నాసిరకం పత్తి పడేయకుండా కాల్చేయాలి. పత్తి మిల్లు ఆవరణలో లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగును అదుపు చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ రూరల్‌
Credits : Andhrajyothi