రాతి నేలపై రతనాల పంటలు

  • ఏడు గిరిజన గూడాల్లో నవచైతన్యం
ప్రకృతిని సవాలు చేస్తూ రాతినేలపై అద్భుతమైన పంటలు పండిస్తున్నారు ఈ గిరిజన రైతులు. చైనా, వియత్నం, కంబోడియా దేశాల్లో మాత్రమే కొండలు, గుట్టలను తొలిచి పంటలను పండిస్తున్నారు. వారిని తలదన్నే రీతిలో రాతినేలపై సేంద్రియ సేద్యం చేస్తూ శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్న ఆసిఫాబాద్‌ గిరిజన రైతుల స్ఫూర్తిగాథ.
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల గుండాల అటవీ ప్రాంతం అది. పది కిలోమీటర్లు కాలినడక అడవుల గుండా వాగులు.. వంకలు.. గుట్టలు ఎక్కిదిగితే కానీ అక్కడికి చేరుకోలేం. ఆ ప్రాంతంలోని అర్జిగూడ, లచ్చిపటేల్‌గూడ, దొడ్డిగూడ, దాబాగూడ, చిక్కలగూడ, రాజుగూడ, గుడివాడ గ్రామాల పరిధిలో నేలంతా పరుపురాయి పరుచుకుని వుంటుంది.
15 ఏళ్ల క్రితం ఇక్కడ సాగు భూమి కాదుకదా కనీసం గడ్డి కూడా మొలిచే పరిస్థితి లేదు. ఇదే గ్రామానికి చెందిన ఓ విద్యాధికుడు సోయం బొజ్జిరావు గిరిజనుల దుర్భర జీవితాల్ని గమనించి చలించిపోయాడు. విదేశాల్లో కొండలపై జరుగుతున్న వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు.
రాతి నేలపై పంటలు ఎందుకు పండించకూడదన్న ఆలోచన రావడంతో దీనిపై ప్రయోగాత్మకంగా ముందు కొంత విస్తీర్ణంలో ఆచరణలో పెట్టి విజయం సాధించారు. దాంతో ఊరంతా ఈ తరహా సేద్యం చేయడానికి ముందుకొచ్చి బొజ్జిరావుతో చేతులు కలిపారు. దూరప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై మట్టిని తరలించుకొచ్చి రాతి నేలపై దాదాపు అడుగున్నర మందంతో నింపారు.
మొత్తం విస్తీర్ణాన్ని మడులుగా విభజించి నీటిని తట్టుకునే వరి వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టారు. మొదటి ఏడాది ఆశించిన దానికంటే అధిక దిగుబడులు రావడంతో మరుసటి ఏడాది నుంచి రెట్టించిన ఉత్సాహంతో మరింత మట్టిని తీసుకువచ్చి అందుబాటులో ఉన్న పశువుల పేడను ఉపయోగించి తమ పొలాలను సారవంతమైన నేలలుగా తీర్చిదిద్దారు.
ఇలా యేటా ఖరీఫ్‌, రబీ సీజన్‌ల ఆరంభానికి ముందు తమ దుక్కులను తయారుచేసుకుని సంప్రదాయ పంటలన్నీ సాగు చేస్తూ ఆకలిని జయించారు ఆ ప్రాంత గిరిజనులు. వర్షాకాలంలో అందుబాటులో ఉండే నీటిని నిలువ చేసుకుని ఖరీఫ్‌, రబీలో వరి, మొక్కజొన్న, శనగ, జొన్న, కంది వంటి పంటలే కాకుండా నిరంతర ఆదాయాన్ని సమకూర్చే కూరగాయల జాతికి చెందిన పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. సగటున ఎకరాకు 12 నుంచి 20 బస్తాల వరకు పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేయడం విశేషం.
ఆ ప్రాంత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బొజ్జిరావు అకాలమరణం పాలయ్యారు. అయినా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు గిరిజన రైతులు. వందకు పైగా ఎకరాల్లో వరి, మక్క, పెసర ఖరీఫ్‌ పంటలతో పాటు కంది, పెసర, శనగ, జొన్న పంటల్ని రబీ పంటలుగా పండిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన మైసమ్మ చెరువు నీటిని పూరి స్థాయిలో వినియోగించుకొంటున్నారు.
బొజ్జిరావు కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ 250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయన పేరుతో ఒక కుంటను నిర్మించింది. రెండు చెక్‌ డ్యాంలను నిర్మించింది. ఇక్కడి రైతుల పట్టుదలను గుర్తించి దాన్‌ ఫౌండేషన్‌ సంస్థ వారు గ్రామాన్ని దత్తత తీసుకొని స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టారు. అయిదు రైతు క్లబ్‌లను ఏర్పాటుచేసి వ్యవసాయ రంగంలో మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
అన్నానికి ఢోకా లేదు
మునుపు మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే ఒక పూట తిండి పెట్టే శక్తి మాకు ఉండేది కాదు. బొజ్జిరావు మాకు అన్నం పెట్టిండు. రాళ్ల భూముల్లో ఎలా పంటలు పండించాలో చూపించాడు. మా ఎడ్లబండ్లతో వేరే చోటు నుంచి మంచి మట్టి తెచ్చి పొలంలో పోసుకుని చెరువు నీటి పదును పెట్టి వరి పంట కూడా బాగా పండిస్తున్నాం. ఇంట్లో అందరికీ పని దొరుకుతుంది.
-మర్సుకోల తిరుపతి, గ్రామస్తుడు
బొజ్జిరావు స్పూర్తితో..
మా గ్రామ యువకుడు బొజ్జిరావు చూపిన మార్గంలో రాళ్ల భూముల్లో అడుగు మందం మట్టి పోసి మంచి పంటలు పండించుకుంటున్నాం. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరి ధాన్యం పండిస్తున్నాం. పత్తి పంట కూడా వేస్తున్నాం. చెరువు నీటిని వాడుకొని మక్క పంట వేస్తున్నాం. ఈ భూముల్లో రబీలో కంది, పెసర, జొన్న పంటలు పండిస్తున్నాం.
– కోవ హన్మంతు, గ్రామ పటేల్‌, గుండాల
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆసిఫాబాద్‌
Credits : Andhrajyothi

యాసంగిలో వరి సిరి

  • వరికి అగ్గితెగులు ముప్పు
తెలంగాణలో ఏటా యాసంగిలో 6.14 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. ఇప్పటి కే కొందరు రైతులు నాట్లు పూర్తి చేశారు. మరి కొన్నిచోట్ల నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. చలి తీవ్రంగా వున్న ప్రస్తుత తరుణంలో నారుమళ్లకు అగ్గితెగులు సోకే ప్రమాదం వుందంటున్నారు నిపుణులు. వరి సాగుకు ఏ వండగాలు ఉత్తమం? నారును ఎలా పెంచాలి? వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలనే అంశాలపై సమగ్ర కథనం.
యాసంగిలో రైతాంగం ఎక్కువగా సాగుచేసే వరి రకాలలో తెలంగాణ సోన (ఆర్‌.ఎన్‌.ఆర్‌. 15048), కునారం సన్నాలు (కె.ఎన్‌.ఎమ్‌ 118), బతుకమ్మ (జె.జి.యల్‌ 18047), శీతల్‌ (డబ్ల్యు.జి.ఎల్‌. 283), కాటన్‌ దొర సన్నాలు (ఎం.టి.యు 1010), ఐ.ఆర్‌. 64, తెల్లహంస, జగిత్యాల సాంబ (జె.జి.ఎల్‌. 3844) వంటి రకాలు అతి ముఖ్యమైనవి.
రాష్ట్రవ్యాప్తంగా వరినార్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌. జగదీశ్వర్‌ చేస్తున్న సూచనలివి.
డిసెంబర్‌ రెండవ పక్షంలో చలి తీవ్రత పెరిగినందువల్ల, రాత్రివేళలో మంచుపడి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది.
దీనికితోడు ఇంకా నారుమడి దశలో ఉన్న మొక్కలు సరిగ్గా ఎదగక నాట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నారుమడిలో, ప్రధాన పొలంలో ఈ చర్యలు తప్పకుండా పాటించాలి. చలివలన నారు ఎదుగుదల లోపించడం, నార్లు ఎర్రబడడం సర్వసాధారణం, కాబట్టి నార్లను కాపాడటానికి సన్నటి పాలిథిన్‌ పట్టాను కర్రలతో లేదా ఊచలతో అమర్చాలి. రాత్రివేళలో కప్పి ఉంచి మరునాడు ఉదయాన్నే తీసివేసినట్లయితే వేడి వలన నారు త్వరగా పెరిగి, 3-4 వారాలలో ఆకులు తొడుగుతుంది.
రాత్రివేళలో నారుమడిలో సమృద్ధిగా నీరు ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసివేసి ఉదయం 10-11 గంటల మధ్య నీటిని పెట్టినట్లయితే నారు ఎదుగుదల బాగుంటుంది. నారుమడిలో జింక్‌ లోప లక్షణాలు కనిపించిన వెంటనే జింక్‌ సల్ఫేట్‌ 2.0 గ్రాములు, లీటరు నీటికి కలిపి అవసరం మేరకు 1-2 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియాతో (2.5 కిలోలు) పాటు కార్బండాజిమ్‌ 25 శాతం + మాంకోజెబ్‌ 50 శాతం కలిగిన మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని 6.25 గ్రాములు పట్టించి నారుమడిలో వేయాలి.
అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రబీ పంట కాలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15 రోజులకు 2 గుంటల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి. చలికి నారు ఎదగక ఆలస్యమైతే నాటువేసే వారం రోజుల ముందు మరొకసారి నారుమడిలో కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి.
కాండం తొలిచే పురుగుతో జాగ్రత్త
దాదాపు అన్ని రకాలలోనూ రబీలో ఆశించే కాండం తొలిచే పురుగు వల్ల ప్రతి రైతు ఎకరాకు 3-5 బస్తాల దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌ పంట కాలంలో కూడా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కాండం తొలిచే పురుగు ఆశించి తెల్ల కంకుల వల్ల రైతాంగం చాలా నష్టపోయారు. కాబట్టి రబీలో నారుమడి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలి. ముదురు ఎండుగడ్డి లేదా పసుపు రంగులో ఉండే రెక్కల పురుగులు లేత నారుకొనల మీద గోధుమరంగు ముద్దల వలె గుడ్లు పెడతాయి. ప్రధాన పొలంలో పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోవడం, అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు రావటం గమనిస్తూ ఉంటాం.
ఎకరాకు సరిపడే నారుమడిలో ఒక లింగాకర్షక బుట్ట (2-3 గుంటలకు ఒక బుట్ట) అమర్చి కాండం తొలిచే పురుగు ఉధృతి గమనించాలి. అలాగే ప్రధాన పొలంలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు అమర్చి వారానికి బుట్టకు 25 మగ రెక్కల పురుగులు పడిన వెంటనే పిలక దశలో సస్యరక్షణ చేపట్టాలి. ఈ దశలో ఎసిఫేట్‌ 75 ఎస్‌పి 1.5 గ్రాములు (300 గ్రాములు/ఎకరాకు) లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌పి 2 గ్రా. (400 గ్రా./ఎకరాకు) లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 శాతం గుళికలు 4 కిలోలు/ఎకరాకు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు వాడుకోవాలి.
అంకురం నుండి చిరుపొట్ట దశలో తప్పనిసరిగా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌.పి 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మిల్లీలీటర్లు /లీటరు నీటికి చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం తయారుచేసుకుని పిచికారీ చేయాలి. అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లేదా ఇసోప్రోథయోలెస్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధితో వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని రెండుసార్లు పిచికారీ చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, హైదరాబాద్‌
Credits : Andhrajyothi

ఈ గ్రామం.. రసాయన రహితం

  • సేంద్రియ సాగుతో సిరులు పండిస్తున్న ఏనెబావి రైతులు
పల్లెలకు పాఠం- రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి
నిదర్శనం జనగామ జిల్లా ఏనెబావి గ్రామం. క్రిమి
సంహారకాలు లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఏనెబావినే ఉదాహరణగా చూపుతారు. రసాయనరహిత గ్రామంగా పేరొందిన ఆ గ్రామ రైతుల ప్రస్థానం ఇది.
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెబావి గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా చీడపీడల బాధ లేకుండా అధిక దిగుబడులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ‘క్రాప్స్‌’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్వతహాగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది రైతులు తమకున్న 145 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరువు నుంచి తెచ్చిన మట్టి, ఆవుపేడ, గొర్రెలు, మేకల ఎరువు, గోమూత్రం, వేప కషాయంతో ఈ రైతులు స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వానపాములతో వర్మి కంపోస్టు తయారుచేస్తూ పంటలకు బలమైన పోషకాలను అందిస్తున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు పొందుతున్నారు. క్రాప్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన శిక్షణతో ఏనెబావి గ్రామంలో ఇంటింటా వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా పిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ సేద్యమే కారణం అంటున్నారు ఈ గ్రామ రైతులు. ఎకరం కూరగాయల తోట సాగుకు 5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో మంచి ధర పలుకుతున్నది. దిగుబడులు అధికంగా రావడంతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల సేంద్రియ వరి ధాన్యం, కూరగాయలను నగరాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సేంద్రియ ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
అవగాహన పెంచాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అధిక పెట్టుబడులతో రైతులను నష్టాల బాట పట్టిస్తున్న రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా మానుకునే విధంగా ప్రోత్సహించాలి. ఐదెకరాల్లో పదేళ్లుగా కందులు, కూరగాయల పంటలు వేసి లాభం పొందుతున్నాను.
– పొన్నాల తిరుమలేషం, రైతు
Credits : Andhrajyothi

లక్క.. లాభాలు ఎంచక్కా!

  • లక్షన్నర పెట్టుబడి.. 4 లక్షల రాబడి
  • ఉద్దానంలో ఊపిరి పోసుకున్న లక్కసాగు
శ్రీకాకుళం జిల్లా కవిటికి చెందిన రాజారావు ఉన్నతస్థాయి ప్రభు త్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. సేద్యంపై ఆసక్తితో అందరిలాగానే వరి, కొబ్బరి సాగు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల కారణం గా నష్టాలపాలై ప్రత్యామ్నాయంగా లక్క వైపు దృష్టి సా రించారు. కుమారుడు సాయిరాజ్‌తో కలిసి గత ఏడాది తొలి పంట తీశారు. మరో నెలలో రెండో పంటను విక్రయించనున్నారు. ఈ రైతులు జార్ఖండ్‌లోని రాంచీ నుంచి అధిక దిగుబడి ఇచ్చే శ్యామలత రకం విత్తనం తెచ్చారు. విత్తనాలను 45 రోజులు కవర్లలో వుంచితే మొక్కలు వచ్చాయి. 6 నెలలకు ఒక్కో మొక్క కు 6 కొమ్మలు వచ్చాయి. అప్పుడు చెట్టులో మూడు కొమ్మలకు గుడ్డు (బ్రూడింగ్‌) క ట్టారు.
ఈ బ్రూడింగ్‌ను రాంచీలో కొన్నా రు. అలా ఒక్కో చెట్టుకు 50 గ్రాముల చొప్పున గుడ్డు కట్టుకున్నారు. మొత్తం ఎకరాకు అయిదు వేల చెట్లు నాటి అన్నింటికీ ఇదే పద్ధతి అమలు చేశారు. ఈ గుడ్డును జనవరి-ఫిబ్రవరి, జూన్‌ -జూలై నెలల్లోనే కట్టాలి. ఇలా గుడ్డు కట్టిన పదిరోజుల తర్వాత అందులోంచి పురుగులు బయటకు వస్తాయి. అప్పుడు ఆ గుడ్డును విప్పాలి. అలా బయటకు వచ్చిన ఆడ, మగ పురుగులు మొక్క అంతటా విస్తరిస్తాయి. అప్పుడు లక్క తయారౌతుంది.
జూలైలో గుడ్డు కడితే డిసెంబరు లో లక్క పంట కోతకు వస్తుంది. సాగు మొదలుపెట్టిన తొలి ఏడాది వీరికి 3 లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోను లక్షకు పైగా లాభం పొందారు. రెండో ఏడాది దిగుబడి రెట్టింపు అయింది. ఖర్చులన్నీ పోగా రూ.4 లక్షలు మిగిలింది. ఒకసారి మొక్క నాటితే పన్నెండేళ్ల వరకు పంట పండుతుంది. లక్క పంటను కోసిన తర్వాత దాన్ని సేకరించిన ఈ రైతులు జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లోని బలరాంపురంలో విక్రయించారు. శుద్ధి చేయని కిలో లక్క ధర రూ. 200 వుంది.
బాడీ స్ర్పే.. నెయిల్‌ పాలిష్‌లో
మనం వాడే మాత్రలు ఎక్స్‌పయిరీ డేట్‌లోగా పాడవకుండా, ఫంగస్‌ ఏర్పడకుండా కాపాడడంలో లక్క పూత కీలకం. నాణ్యమైన లక్కను మాత్రలపై పూతగా వేస్తారు. కొన్ని దేశాల్లో ఆహారపదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి తింటారు. అవి పాడవకుండా లక్క రంగు కలిపి పూత వేస్తారు. గోళ్ల రంగు, బూటుపాలిష్‌లోను వాడతారు. సిల్క్‌ వస్త్రాల తయారీలోను లక్క వినియోగిస్తారు. రెడీమేడ్‌ బంగారు ఆభరణాలు, బాడీ స్ర్పేల్లో లక్కను వినియోగిస్తున్నారు. మనం బాడీ స్ర్పేను కొట్టుకుంటే ఆ రసాయనాలు ఒంటిపై పడి చర్మానికి హాని కలగకుండా చేయడానికి అందులో లక్క కలుపుతారు.
40 ఎకరాల్లో సాగు
40 ఎకరాల్లో లక్క పంట సాగుచేస్తున్నాం. మొదట్లో చాలా కష్టంగా వున్నా క్రమంగా అవగాహన పెంచుకున్నాం. ఖర్చులన్నీ పోగా మొదటి పంటలో రూ.లక్ష, రెండో పంటలో రూ.4 లక్షల వరకు మిగులు కనిపిస్తోంది. మా సమీప పొలాల రైతుల్లో చైతన్యం తెచ్చి వారితో సాగు చేయించి 250 ఎకరాల వరకు సాగు జరిగేలా ప్రణాళికలు వేస్తున్నాం.
– పిరియా రాజారావు, లక్క రైతు
Credits : Andhrajyothi

రైతుల మరణాలు సిగ్గుచేటు!

  • క్రిమిసంహారకాలు చల్లుతూ మరణిస్తున్న రైతన్నలు
గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రిమి సంహారకాలు రైతన్నలను, వ్యవసాయ కూలీలను బలితీసుకుంటున్నాయి. కారణం ఏమిటింటారు?
దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పదుల కొద్దీ రైతులు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 40 మందికి పైగా రైతులు ఇటీవల పొలాలకు పురుగుల మందులు చల్లుతూ మరణించారు. రెండేళ్లుగా ఇలాంటి మరణాలు నమోదువుతున్నా ఈ ఏడాది ఎక్కువ మంది మరణిస్తున్నారు. 2002-2004 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పురుగు మందులు చల్లుతూ పెద్ద సంఖ్యలో రైతులు మరణించారు.
అప్పట్లో వరంగల్‌లో ఎంతోమంది రైతులు పురుగుల మందులకు బలయ్యారు. ఇప్పడు మళ్లీ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కొన్ని పెస్టిసైడ్స్‌ కంపెనీలు నిషేధించిన మందులు వాడుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచం అంతా నిషేధించిన క్రిమిసంహారకాలను మన దేశంలో మాత్రం అడ్డూఅదుపూ లేకుండా రైతులకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పెస్టిసైడ్స్‌ డబ్బాల మీద ప్రమాద సూచికలను తప్పనిసరిగా కలర్‌లో ముద్రించాలి. మన రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఈ నిబంధనలు పాటించడం లేదు. పైగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ సూచికల లేబుల్స్‌ వల్ల ప్రయోజనం ఏముంటుందని వాదించడం కంపెనీల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
రైతు మరణాలు ఈ ఏడాది ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి?
ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వుండటంతో ప్రత్తి రైతును తెగుళ్లు విపరీతంగా పీడిస్తున్నాయి. దాంతో అధిక మోతాదులో రైతులు పెస్టిసైడ్స్‌ వాడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా క్రిమిసంహారకాలు స్ర్పే చేయడం రైతుల మరణానికి ఒక కారణం. ప్రత్తి రైతులు దీర్ఘకాలంగా అధిక మొత్తంలో క్రిమి సంహారకాలను వాడటం కూడా ఈ విపత్తుకు కారణం కావచ్చు. క్రిమి సంహారకాల ప్రభావం పంట మీద, నేల మీద ఏళ్ల తరబడి వుంటుంది. తరచూ క్రిమిసంహారకాలు చల్లడం వల్ల విషపదార్థాల ప్రభావం అధికమై రైతుల్ని బలితీసుకుంటున్నాయి.
రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా మరణాలు ఎందుకు జరుగుతున్నాయి?
పొలంలో క్రిమిసంహారకాలు చల్లే రైతులు హెల్మెట్‌ ధరించాలి. ప్లాస్టిక్‌ దుస్తులు ధరించాలి. ఈ ఎండలకు హెల్మెట్‌ వేసుకుని, ప్లాస్టిక్‌ దుస్తులు ధరించి పనిచేయడం చాలా కష్టమైన పని. వర్షాకాలంలో చివరకు అక్టోబర్‌లో కూడా ఈ ఏడాది ఎండలు తీవ్రంగా వున్నాయి. ఫలితంగా చెమట ఎక్కువగా వస్తున్నది. ఉదయం లేదా సాయంత్ర వేళల్లో కాకుండా ఎండ అధికంగా వుండే వేళల్లో మందులు చల్లడం కూడా విపత్తుకు కారణం.
పెస్టిసైడ్స్‌ చల్లే రైతులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది?
క్రిమి సంహారకాలు చల్లడం వల్ల రైతులు మరణించడమనేది బయటకు కనిపించే దుష్పరిణామం. పెస్టిసైడ్స్‌ వల్ల కనిపించని ఎన్నో చెడుపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెస్టిసైడ్స్‌ చల్లే రైతుల్లో కిడ్నీ, నేత్రాలు, చర్మసంబంధ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది.
రైతులే కాదు ఎక్కువ కాలం పాటు రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలు తినే ప్రజలు కూడా తీవ్ర అనారోగ్యం పాలవడం తథ్యం. నిషేధించిన క్రిమిసంహారకాలను విక్రయించకుండా వ్యవసాయ శాఖ సత్వర చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చీడపీడల్ని తట్టుకునే వంగడాలు కనుగొనాలి. పెస్టిసైడ్స్‌ వినియోగంపై రైతుల్లో మరింత అవగాహన పెంచాలి. క్రిమి సంహారకాల వినియోగం ఓ విషవలయం. వాటి వల్ల చీడపీడలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. రైతులు పెస్టిసైడ్స్‌ వాడకానికి స్వస్తి చెప్పాలి. సహజ సేద్యమే రైతులకు, ప్రజలకు శ్రేయస్కరం.
గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి రావడం, టెక్నాలజీ పెరిగిపోయిన ఈ కాలంలో కూడా పంటలకు వేసే పురుగుల మందుల కారణంగా రైతులు మరణించడం దారుణమన్నారు సుస్థిర వ్యవసాయ కేంద్రం సారథి డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు. పురుగుల మందుల కంపెనీల అక్రమాలకు కళ్లెం వేయడం వ్యవసాయ శాఖ తక్షణ కర్తవ్యం అంటున్నారాయన.
Credits : Andhrajyothi

కరువు జిల్లాకు ఖర్జూర మాధుర్యం

  • తోటల సాగులో ‘అనంత’ రైతుల ప్రయోగం
ఖర్జూరం సాగుకు మన భూములు పనికి రావనే మాట అసత్యమని నిరూపించారు అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ. కరువుసీమలో ఖర్జూరం సాగు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారాయన.
నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందిన ఎండ్లూరి వెంకటనారాయణ చాలాకాలంగా వేరుశనగ, అరటి లాంటి పంటలు వేసి బాగా చితికిపోయాడు. వెంకట నారాయణకు 120 ఎకరాలు పొలం వుంది. మిగిలిన రైతుల్లానే ఆయన కూడా వేరుశనగ సాగు చేసేవాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట సరిగా చేతికందక తీవ్రంగా నష్టపోయాడు.
వెరైటీ పంటలు సాగు చేయాలనే తపన ఆయనకు వుండేది. ఒకసారి వ్యక్తిగత పని కోసం తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లాడు. అక్కడ అమ్ముతున్న ఖర్జూరం పండ్లను కొని తిన్నాడు. వ్యాపారి ఆ పండు ధర ఎక్కువగా చెప్పాడు.
ఖర్జూరం ఇంత ధరా…. అని వెంకటనారాయణ వ్యాపారిని ప్రశ్నించాడు. ఈ పండు మన దగ్గర పండదు అందుకే ఇంత ధర అని వ్యాపారి కాస్త వెటకారంగా బదులిచ్చేసరికి ఆ రైతు గుండె చివుక్కుమంది. మనమే ఆ పంటను ఎందుకు పండించకూడదని ఆలోచించాడు. కుమారుడు సుధీర్‌తో చర్చించాడు. నాణ్యమైన ఖర్జూరం పండ్లు తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన నిజాముద్దీన్‌ అనే వ్యాపారి సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్నారు. నిజాముద్దీన్‌ ద్వారా సౌదీ అరేబియా నుంచి ఖర్జూరం మొక్కలను దిగుమతి చేసుకున్నారు.
60 ఏళ్ల పాటు దిగుబడి
సౌదీ అరేబియా నుంచి తమిళనాడుకు చేరేసరికి ఒక్కో ఖర్జూరం మొక్క ఖరీదు రూ. 3,500 పడింది. నాలుగేళ్ళ క్రితం తమిళనాడులోని నిజాముద్దీన్‌ అనే వ్యాపారి ద్వారా మధురమైన రుచికలిగిన బర్హీ అనే ఖర్జూరం రకం మొక్కలను తెచ్చుకుని సాగు ప్రారంభించారు వెంకటనారాయణ. మూడు ఎకరాల భూమిని ఖర్జూరం సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో 210 మొక్కలు నాటాడు. సౌదీలో ఉన్న మన ప్రాంతం వారి ద్వారా ఖర్జూరం సాగు మెళుకువలు తెలుసుకున్నాడు. మొక్క కాపు మొదలైనప్పటి నుంచి 60 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెంకటనారాయణ జిల్లాలో ఇప్పుడు సాటి రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ పలువురు రైతులు ఖర్జూరం సాగు ప్రారంభించడం విశేషం.
విస్తరిస్తున్న ఖర్జూరం సాగు
శింగనమల, మడకశిర, కణేకల్లు తదితర మండలాల్లో రైతులు ఖర్జూరం పంటను సాగు చేస్తున్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఖర్జూరం పంటకు నీరు తక్కువగా వాడాలి. అనంతపురం జిల్లా వాతావరణానికి ఖర్జూరం బాగా సరిపోతుంది. ఖర్జూరం మొక్కను నాలుగేళ్ళు బతికించుకుంటే ఆ తరువాత ఏటా ఎకరాకు రూ.లక్ష మించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వుండదు. ఖర్జూరం పంటకు పేడ ఎరువులు, డిఏపీ, పొటాష్‌, విటమిన్స్‌ లాంటి ఎరువులు వాడాలి. వర్షాకాలంలో పురుగు నివారణకు సైబర్‌మెటిన్‌ అనే మందులు స్ర్పే చేయాలి.
– సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, అనంతపురం
 
అప్పుడు హేళన..ఇప్పుడు ఆశ్చర్యం
ఖర్జూరం సాగు ప్రారంభించినప్పుడు సాటి రైతులు నన్ను హేళన చేశారు. మన దగ్గర ఖర్జూరం పండదంటే పండదన్నారు. మూడు ఎకరాల ఖర్జూరం తోట నుంచి గత ఏడాది జూన్‌లో 16 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.1.50 లక్షలతో తమిళనాడు, అనంతపురం, కోయంబత్తూరు, అభినాష్‌ మార్కెట్లలో విక్రయించాం. నాకు వస్తున్న లాభాలు చూసి, రైతులు ఇప్పుడు నన్ను సలహాలడుగుతున్నారు. కొత్తగా ఖర్జూరం సాగు చేయడం వల్ల మార్కెట్ల గురించి తెలియక, పంట కోతలు తెలియక సుమారు రూ.10లక్షలు నష్టపోయాం. భవిష్యత్తులో మరిన్ని లాభాలు ఆర్జిస్తామనే నమ్మకం వుంది.
– ఎండ్లూరి వెంకటనారాయణ, రైతు
Credits : Andhrajyothi

విలక్షణ సేద్యంతో విజయపథం

  • 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం
  • రంగారెడ్డి జిల్లా రైతు ప్రస్థానం
రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, టమాట ఇలా ఏదో ఒక పంటను సాగు చేస్తారు. లేదంటే మామిడి, జామ, ద్రాక్ష, కొబ్బరి, బత్తాయి వంటి తోటలు పెంచడం పరిపాటి. కానీ ఓ రైతు మాత్రం తన పొలంలో వేల రకాల మొక్కల్ని పెంచుతూ, వైవిధ్యమైన వనాన్ని సృష్టించారు. ఆ పంటల గురించి తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామానికి వెళ్లాల్సిందే.
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, వెల్వెట్‌ యాపిల్‌, వాటర్‌ యాపిల్‌, జబోటిక, మిరాకిల్‌ఫ్రూట్‌, జామ, మామిడి, సపోటా వంటి 50 రకాలకు పైగా దేశవాళి పండ్ల రకాలూ, అ శ్వగంధ, శంఖుపుష్టి, అడ్డసర, జీవకాంచన.. ఇలా 100కు పైగా ఆయుర్వేద మొక్కలూ, దాల్చినచెక్క, లవంగం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలూ, శ్రీగంధం, ఎర్రచందనం, నేరేడు వృక్షాలు, గులాబి, సంపంగి, పారిజాతం తదితర పుష్పా లూ.. ఇలా 280 జాతులకు చెందిన 9 వేల మొక్కలకు నిలయం ఆ వ్యవసాయ క్షేత్రం. ఆ క్షేత్రం సారథి హైదరాబాద్‌కు చెందిన సుఖవాసి హరిబాబు. తనకున్న 10 ఎకరాల్లో వున్న ఇక్క బోరు సాయంతో వీటన్నింటినీ సాగు చేస్తున్నారాయన. జీవవైవిధ్యానికి తన క్షేత్రాన్ని చిరునామాగా తీర్చిదిద్దుతున్నారాయన.
నంది అవార్డుల నుంచి వ్యవసాయం దాకా…
అరుదైన వ్యవసాయాన్ని మక్కువతో చేస్తున్న హరిబాబు గతంలో రియల్‌ ఎస్టేట్‌, టెలివిజన్‌ రంగాల్లో పని చేశారు. రైతు కుటుంబాల జీవిత గాథలు ఇతివృత్తంగా తీసుకొని దర్శక నిర్మాతగా జీవనతీరాలు, జీవనసంధ్య, సీరియళ్లను తీశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియళ్లకి 6 నంది అవార్డులను అం దుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రా మంలో పుట్టి పెరిగిన ఆయన డిగ్రీ వరకు చదువుకొని 1979లో హైదరాబాద్‌కు వచ్చారు. 1984లో గచ్చిబౌలిలో కొంత పొలం కొని ఉద్యాన పంటలు పండించారు. 2013లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల పొలం కొన్నారు. ఆ నల్లరేగడి భూమిలో వైవిధ్యమైన మొక్కలు పెరగడానికి వీలుగా పొలంలో ఒక అడుగు ఎత్తున ఎర్ర మట్టిని వేయించారు.
దీంతో ఆ నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పొలం అంతటా ప్రతి 10 అడుగుల దూరంలో మూడు అడుగుల పొడువు, వెడల్పు, లోతు ఉండేలా గోతులు తవ్వించి మామిడి, సపోటా, తీపిచింత వంటి వృక్ష జాతి మొక్కల్ని నాటారు. మొక్కలు బలంగా పెరిగేందుకు వీలుగా ఎర్రమట్టి, ఆవుపేడ, ఆముదపుపిండి కలిపిన కంపోస్టు ఎరువును ఆ గోతుల్లో వేశారు. మొక్కల మధ్యలో వచ్చే ఖాళీల్లో నీడ అవసరమై, ఎత్తుగా పెరగని ఫల, ఆయుర్వేద, సుగంధద్రవ్య మొక్కల్ని నాటారు. చైనా, వియాత్నాం, జమైకో, బ్రెజిల్‌, మెక్సికో తదితర దేశాలకు చెందిన 40 రకాల వృక్ష జా తుల్ని శృంగేరి, బెంగళూరు, మంగళూరు, కాసర్‌గట్‌, కడియం నర్సరీల నుంచి తెప్పించారు. వాటితో పాటు ఆ క్షేత్రంలో వాజ్‌పాయి పండ్లు, అబ్దుల్‌కలాం పుష్పాలు. చరకుడు, శుశ్రూశుడి పేర్లతో ఆయర్వేద మొక్కల విభాగాలు ఏర్పాటు చేశారు.
అంతా సేంద్రియమే
తన పొలంలో పండించే పంటలకు సేంద్రి య ఎరువులనే ఉపయోగిస్తు న్నారు హరిబాబు. సుభా్‌షపాలేకర్‌ స్ఫూర్తితో ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి వాడుతున్నారు. అలాగే పొన్నుస్వామి నూనెల విధానాన్ని పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో వేప, ఆముదం, కానుగ, పత్తితవుడు, విప్ప, చేపకుసుమ వంటి నూనెలతో మిశ్రమం తయారు చేసి ఆ ద్రవణాన్ని నీటిలో కలిపి మొక్కల పైన పిచికారి చేస్తున్నారు. వీటి కారణంగా గత రెండు సంవత్సరాల్లో తోటలో చీడ పీడల సమస్య తలెత్తలేదని తోటలో పండే కాయల నుంచి నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారాయన. తోట చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ లోపల వైపు వాక్కాయ మొక్కల్ని నాటారు. ఇవి వేడి గాలుల్ని అడ్డుకుంటున్నాయి. సాగులో మెళకువలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు హరిబాబు. అక్కడ అనుసరిస్తున్న నీటి పొదుపు విధానాలను పాటిస్తున్నారాయన.
-వేముల కృష్ణ, మహేశ్వరం
ఒకే పంటపై ఆధారపడే విధానానికి రైతులు స్వస్తి చెప్పాలి. కాస్త పొలం వు న్నా అందులో రెండు రకాల మొక్కలు సాగు చేయాలి. దాంతో రైతుల ఆదాయం పెరుగుతుంది.
– హరిబాబు, 9441280042
Credits : Andhrajyothi

కూరగాయల హబ్‌.. యాదాద్రి!

వర్షాభావ పరిస్థితులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు… వేలు, లక్షల ఖర్చుతో పాతాళం లోతు బోర్లు… అయినా పోస్తూ.. పోస్తూ ఆగిపోతున్న జలధారలు. దశాబ్దాలుగా వరి, ప్రత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను నమ్ముకున్న రైతుల దుస్థితి ఇది. దీంతో పీకల దాకా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు నిత్యం ఆదాయం అందించే కూరగాయల సాగువైపు మళ్లుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు కూరగాయలు.. ఆకు కూరలు సాగుచేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేలలో ఖర్చు, భరోసా లేని రాబడి వున్న వరి సాగుతో విసిగిపోయిన ఆ మండలాల రైతులు కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తూ నిత్యం డబ్బు ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌ నగర సమీప యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కొంతకాలంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్నది. జిల్లాలోని బొమ్మల రామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో వరుసగా నాలుగేళ్ల్లుగా కరువుఛాయలే అలుముకుంటున్నాయి. అయినా ఇక్కడి రైతులు చాలాకాలంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే వరినే సాగు చేస్తున్నారు.
వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో వేలు, లక్షలు పెట్టి బోర్లు వేస్తున్నారు. వాటిలో కూడా నీరు రాక, పంట చేతికి రాక భారీగా నష్టపోతన్నారు. దీంతో కొందరు రైతులు హైదరాబాద్‌ నగరం, భువనగిరి జిల్లా కేంద్రాల్లో ప్రజలకు నిత్యావరసమైన కూరగాయలు.. ఆకు కూరల సాగు మెరుగ్గా వుంటుందని ఆలోచించారు. వీరంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. పెట్టుబడి.. రోజు ఆదాయం .. చేరువలో మార్కెటింగ్‌ సదుపాయం గల కూరగాయలను ఒకరి తర్వాత.. ఒకరు.. ఓ గ్రామం.. తర్వాత మరో గ్రామం.. సాగు చేస్తూ ఏకంగా కొన్ని మండలాలకు మండలాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ కళకళలాడుతున్నాయి.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 నుంచి 5 వేల ఎకరాల వరకు కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఈ రైతులే ఆదర్శంగా జిల్లాలోని నగరానికి సమీపంలోగల బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు జిల్లానే కూరగాయల హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్‌ జిల్లాకు సరిహద్దులో.. ఈసీఐఎల్‌, కుశాయిగూడ, బోయిన్‌పల్లి మార్కెట్‌కు కూతవేటు దూరంలో వున్న బొమ్మల రామారం మండలంలోని దాదాపు పది పదిహేను గ్రామాలతో పాటు తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లోని మరో పాతిక గ్రామాల రైతులు కూరగాయల సాగునే ఎంచుకున్నారు.. వరిసాగును వదిలేసి కూరగాయలు, ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టారు.
 
ఆ.. ఊరంతా.. ఆకు కూరల సాగే
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చౌదరిపల్లి గ్రామంలో దాదాపు 2వేల జనాభా ఉంది. గ్రామంలో గల రైతులు కుటుంబాలు పూర్తిగా ఆకుకూరలనే సాగు చేస్తున్నారు. ఎకరం, రెండు ఎకరాలు మొదలు నాలుగు ఎకరాల వరకు ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని రోజు భువనగిరి, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించి విక్రయిస్తుంటారు.
ఆకుకూరలను సీజన్‌ను బట్టి సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.  కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ఇచ్చే రాయితీలు మాత్రం తమకు అందడం లేదని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వారంతా చిన్న, సన్నకారు రైతులే. కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మరింత భరోసా వుంటుందని రైతులు కోరుతున్నారు.
రోజుకు వెయ్యిదాకా ఆదాయం
నాకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేసినన్నాళ్లూ పైసా మిగిలేది కాదు. పైగా అప్పులు. ప్రస్తు తం ఎకరం పొలంలో పాలకూర, కోతిమీరు సాగు చేస్తున్నాను. మార్కెట్‌లో అమ్ముకుంటే రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తున్నాయి.
– ఆకుల శోభ, చౌదర్‌పల్లి, బొమ్మల రామారం
కూరల సాగే మేలు
సోలిపేటలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాను ఎకరంన్నర భూమిలో టమాట సాగు చేసి.. రోజుకు 15 నుంచి 20 బాక్కులను మార్కెట్‌కు పంపిస్తున్నాను. రూ.5వేల వరకు ఆదాయం వస్తున్నది.
– బానోతు స్వామి, సోలిపేట, బొమ్మల రామారం
వరి ఎండింది.. తోట కూర పండింది..
ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో కూరగాయలు సాగు చేశాను. వరి ఎండిపోయింది. కూరగాయలు బాగా పండాయి. ఆ డబ్బుతోనే బతుకుతున్నాం. కూరగాయల రైతులను ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోవాలి.
– ఎనగండ్ల రాజప్ప, బొమ్మల రామారం
కూరగాయల సాగే గిట్టుబాటు
ఎనిమిది ఎకరాల్లో గతంలో వరి సాగు చేసి నష్టపోయాను. ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో వంగ సాగు చేస్తున్నాను. మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూరగాయల సాగు అభివృద్ధికి విత్తనాలు, రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి.
– ఎడ్ల నరేష్ రెడ్డి, పాముకుంట, రాజాపేట
Credits : Andhrajyothi

బీడు భూముల్లో చందన పరిమళం

ఎర్ర చందనం.. మలబారు వేప సాగు, మిశ్రమ పంటలుగా శ్రీగంధం, ఆపిల్‌ బెర్రిస్‌ తీరొక్క పంట సాగుతో లాభాల బాటలో గజ్జెల్లి శ్రీరాములు
బీడు భూములు చందన పరిమళాలు వెదజల్లుతున్నాయి. సాంప్రదాయేతర వ్యవసాయం వల్లనే లాభం ఉంటుందని ఆ రైతు భావించాడు. అందరూ పత్తి సాగు వైపు పరుగులు పెడుతుంటే ఆయన మాత్రం ఆ వైపు తొంగి చూడలేదు. వాణిజ్య పంటలే మేలని భావించి 32 ఎకరాల్లో యూకలిప్టస్‌, మలబారు వేప, ఎర్ర చందనం, నిమ్మ, సపోట, టేకు, ఆపిల్‌ బెర్రి, శ్రీగంధం సాగు చేస్తున్నారు వరంగల్‌ అర్బన్‌ జిల్లా నందనం గ్రామానికి చెందిన గజ్జెల్లి శ్రీరాములు..
నందనం గ్రామంలో వాగు పరీవాహక ప్రాంతంలో గజ్జెల్లి శ్రీరాములు భూములున్నాయి, ఇసుక మేట ఉన్న భూములు కావడంతో మెట్ట పంటలు పండించాల్సి ఉంటుంది. పత్తి పంట వేస్తే ఎంతో లాభం వస్తుందని ఎంతో మంది సలహా ఇచ్చారు. పత్తి పంట సాగు అంటే జూదం లాంటిదని శ్రీరాములు అభిప్రాయం. అందుకే వాణిజ్య పంటల వైపు మొగ్గారు. వ్యయసాయ నిపుణులు, ఉద్యానవన అధికారుల సలహాతో సాగు ప్రారంభించారు. తనకున్న 32 ఎకరాల భూమిలో తక్కువ పెట్టుబడితో, కూలీల అవసరం అంతగా ఉండని పంటల సాగు ప్రారంభించారు.
మలబారు వేప
ఇపుడు మార్కెట్లో ఫర్నీచర్‌, ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల పరికరాల తయారీ మలబారు వేప తోనే తయారవుతోంది. నిపుణుల సలహాతో రాజమండ్రి నుంచి మలబారు వేప మొక్కలను తెప్పించి 7 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దాదాపు ఎకరానికి లక్ష రూపాయలు సాగు ఖర్చు అవుతుందని ఆ రైతు వివరించారు. ఐదేళ్ళలో ఎకరానికి ఐదు లక్షల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది.
సపోట, నిమ్మ తోటలు
సపోట, నిమ్మ తోటలు 4 ఎకరాల చొప్పున సాగు చేస్తున్నారు శ్రీరాములు. సపోట ఈమధ్యే మొదటి పంట వచ్చింది. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతున్నారు. ఉసిరి 200 చెట్లు, ఆపిల్‌ బెర్రీ మరో చోట ఉన్న నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటిని సాగు యూకలిప్టస్‌ సైతం ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ అర్బన్‌
ఎర్ర చందనం తోట
ఎనిమిది ఎకరాల్లో ఎర్ర చందనం సాగు చేపట్టారు. తెలంగాణ భూములు ఎర్ర చందనం సాగుకు పనికి రావని చాలా మంది చెబుతారు. అది నిజం కాదు అంటారు శ్రీరాములు. తెలంగాణ భూములు ఎర్రచందనం సాగుకు అనువైనవే అనేందుకు తన ఎనిమిది ఎకరాల్లోని ఎర్రచందనం చెట్లే ప్రత్యక్ష నిదర్శనం అంటారాయన. దీనికి ప్రత్యేక మైన సాగు విధానం ఏదీ లేదు. ఇతర పంటలకు పడాల్సినంత కష్టం అంత కంటే ఉండదు. డ్రిప్‌ ద్వారా అవసరం అయినంత నీటిని అందించాలి. సులభంగా రొటేవేటర్‌ తిరిగేంత వెడల్పులో మాత్రం మొక్కల మధ్య దూరం ఉంచాలి. కలుపు లేకుండా ఉంచితే మొక్క ఎదుగుదల బాగా ఉంటుందన్నారు శ్రీరాములు.
పెట్టుబడి స్వల్పం.. లాభాలు ఘనం
పత్తి, వరి పంటలకంటే దీర్ఘకాలంలో దిగుబడి వచ్చే ఈ తరహా వాణిజ్య పంటలు మేలు. పత్తి సాగు జూదం లాంటిది. పత్తి ప్రధాన పంటగా కాకుండా అంతర పంటగా వేసుకుంటే మంచిది. వాణిజ్య పంటలు పండించే అవగాహన లేకపోవడంతో రాష్ట్రంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఇప్పుడిపుడే కొంత మంది ముందుకు వస్తున్నారు. 32 ఎకరాల్లో ఈ పంటలనే సాగు చేస్తున్నాను. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తే సరిపోతుంది. కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే వాడుతాను. ఆర్గానిక్‌ ఫుడ్‌ స్టోర్‌ను నడిపే సంస్థ సలహాలతో వ్యవసాయం చేస్తున్నాను.
– గజ్జెల్లి శ్రీరాములు, రైతు, నందనం. ఫోన్‌: 94410 60544
Credits : Andhrajyothi

కమాల్‌ కిసాన్‌.. బాబూలాల్‌

ఒకప్పుడు పాత రోత… కొత్త వింత… ఇప్పుడేమో… పాత వింత… కొత్త రోత… ఎందుకంటారా? ఇప్పుడు పాతదనమే ఒక మార్పుకు నాంది పలికింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దాయన దానికి కారణం. ఆయన పేరు బాబూలాల్‌ దహియా. ఈయన ఒక సామాన్య రైతు. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఒక మంచి పనిని ఆయన తన భుజాలకెత్తుకున్నాడు. ఆ కథేమిటంటే…
పాతది, పురాతనమైనది ఏదైనా సరే.. బాబూలాల్‌ కంట పడితే వదలడు. అది జనపదాల సాహిత్యం కావొచ్చు! మట్టి వాసనలు వెదజల్లే విత్తనాలు కావొచ్చు! అపురూపమైన వరి వంగడాలు కావొచ్చు! బాబూలాల్‌ సంప్రదాయ విత్తనాలను మొలకలతో మెరిపిస్తాడు. అంతేకాదండోయ్‌.. మన పూర్వుల వెరైటీ పంటల సువాసనలను నేటి తరానికి ‘రుచి’ చూపిస్తున్నాడు కూడా! ఏకంగా 110 రకాల వరి వంగడాలను పండించడమే కాదు, ఆ వంగడాల సంరక్షణకూ పూనుకున్నాడు. ఈ రైతులో ఓ కవి కూడా ఉన్నాడు.
ఆ మూడంటే ప్రాణం…
బాబూలాల్‌ దహియాది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నా జిల్లా. పొద్దున్న లేచింది మొదలు ఆయన ఓ మూడు అంశాలపైనే ఉంటుంది. అవి ధాన్యం, విత్తన సంపద సేకరణ, జానపద సాహిత్య అధ్యయనాలు. ఇప్పటిదాకా బాబూలాల్‌ 110 సంప్రదాయ వరి వంగడాలను సేకరించాడు. ఆ వెరైటీలన్నింటినీ తన రెండు ఎకరాల భూమిలో సాగు చేస్తున్నాడు. పాత వంగడాలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఈ పనికి పూనుకున్నాడు. ఇందులో కొన్ని వరి వంగడాలు వెయ్యేళ్ల క్రితం నాటివి కావడం విశేషం. మార్కెట్‌లోని పోటీ కారణంగా అపురూపమైన ఆ వంగడాలు కనుమరుగైపోయాయని బాబూలాల్‌ అంటాడు. ‘పదాలు, విత్తనాల వెనుక సుదీర్ఘ చరిత్ర దాగుంటుంది. అవి కనుమరుగైతే వాటికి సంబంధించిన అపార జ్ఞానసంపద కూడా అందకుండా పోతుంద’ంటాడు బాబూలాల్‌. ‘వరి వెరైటీల్లో తక్కువ నీటితో పండించేవి, జబ్బులను అరికట్టేవి ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. కానీ ఎక్కువ దిగుబడి, అధిక లాభాలు రావాలనే ఆశతో రైతులు హైబ్రిడ్‌ వెరైటీలు వేయడం ప్రారంభించారు. పైగా ఈ హైబ్రిడ్‌ వెరైటీలకు ఎక్కువ పురుగుమందులు, ఎరువులు కావాలి. ఇవి చాలు ఆహారం విషతుల్యం కావడానికి’ అన్నది బాబూలాల్‌ వాదన.
వెరైటీ వరి సాగులో దిట్ట…
బాబూలాల్‌ రైతు మాత్రమే కాదు మంచి కవి కూడా. అందుకేనేమో ఆయనలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. తన ఊరికి పొరుగున ఉన్న దాదాపు 24 గ్రామాల్లోని రైతులను, బడి పిల్లలను సంప్రదాయ పంటలు, కూరగాయల గురించి చైతన్య పరుస్తుంటాడు. వాటిని పెంచమని వారందరినీ ప్రోత్సహించాడు. ‘నేను 2005 సంవత్సరం నుంచి స్థానిక వరి వెరైటీలను సేకరించడం మొదలుపెట్టా. ఇప్పటికి మొత్తం 110 వరి వెరైటీలను సమీకరించాను. వీటన్నింటినీ నాకున్న రెండున్నర ఎకరాల భూమిలో వేసి సాగుచేస్తున్నాను. నేను సేకరించిన విత్తనాలను సీడ్‌ బ్యాంకులో భద్రం చేశాను. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు సహాయసహకారాలతో విత్తన బ్యాంకును మేం అభివృద్ధి చేశాం’ అని బాబూలాల్‌ తెలిపాడు.
 
విత్తనయాత్రలోనూ…
పోస్టుమ్యాన్‌గా పనిచేసి 2007లో రిటైర్‌ అయ్యాడు బాబూలాల్‌. బఘేలీ జానపద సాహిత్యం మీదున్న అభిమానంతో దాన్ని అక్షరబద్ధం చేస్తున్నాడు. జానపద కథలు, సామెతలు, పాటలు, జానపద వీరులు, రకరకాల అపోహలు… ఇలా ఎన్నో విషయాలను బాబూలాల్‌ డాక్యుమెంట్‌ చేస్తున్నాడు. మౌఖిక సాహిత్యంగా జనం నోట ప్రాచుర్యం పొందిన బఘేలీ జానపద సాహిత్యంపై ఐదు పుస్తకాలు, బఘేలీ కవితల మీద రెండు పుస్తకాలను రాశాడు. ‘జానపదపాటలు, ప్రవచనాలు, కథల్లో రకరకాల సంప్రదాయ పంటల ప్రస్తావన ఉంది. వాటిల్లో ‘కార్గి, సువర్‌ ఖాయే నసామ్‌ధీ’ల వంటి వరి వంగడాల ప్రస్తావన చూస్తాం. అప్పుడనిపించింది నాకు జానపద సాహిత్యాన్ని కాపాడితే ప్రజల సంప్రదాయ వరి వంగడాలను కూడా కాపాడినవాళ్లమవుతామ’ని అంటారు బాబూలాల్‌.
బాబూలాల్‌ అందించిన స్ఫూర్తితో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున విత్తన యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక విత్తన వెరైటీలను, కూరగాయల వెరైటీలను, ఔషధమొక్కలను బోర్డు సేకరించింది. బాబూలాల్‌, మరికొందరు పెద్దలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. ఇప్పటిదాకా 24 జిల్లాల నుంచి మొత్తం 1,600 విత్తన వెరైటీలను వీరు సేకరించారు. 1980ల్లో మధ్యప్రదేశ్‌ ఛత్తీస్ గఢ్‌లో 23,800 వరి వెరైటీలు ఉండేవి. కానీ వీటిల్లో చాలా వరకూ కనుమరుగయ్యాయి. ఒక్క సియోని జిల్లాలోనే 570 వరి వెరైటీలు ఉండేవి. అవి కాస్తా 2000 నాటికి 110కి పడిపోయాయి. అంటే 80 శాతం వరి వెరైటీలు కనిపించకుండా పోయాయి. వాటిని తిరిగి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు బాబూలాల్‌. ఇలాంటి కృషి ఇతర రాష్ట్రాల్లోనూ జరిగితే మరెన్నో వైవిధ్యమైన పంటలను వెలికి తీయగలుగుతాం.
Credits : Andhrajyothi