లాభాలు పూయిస్తున్న బంతిపూలు

  • ఎకరాకు లక్ష ఆదాయం
  • అనంతలో 40 వేల ఎకరాల్లో సాగు
‘‘ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చూస్తారు. ఉదాహరణకు నేలతల్లిని చాలామంది ఒట్టిమట్టిగా చూస్తారు. అన్నదాత మాత్రం దాని దమ్ము ఎంతో చూస్తాడు’’ – డో జంటామత, రచయిత్రి
దశాబ్దాలుగా వేరుశనగ పంటను నమ్మి నానా తంటాలు పడుతున్న అనంత పురం జిల్లా రైతులు క్రమంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ సాగు వ్యయం, పంట కాల వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు లాభాలు అధికంగా ఉన్న బంతి పూల సాగు చేపడుతున్నారు. నార్పల మండలంలో పలువురు రైతులు బంతిపూల సాగుతో లాభాలు గడిస్తున్నారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి శంకర్‌ కరువు జిల్లాలో జూదంగా మారిన వ్యవసాయంలో నలిగిపోయాడు. ప్రత్యామ్నాయ పంటలపై దృస్టి సారించాడు. వ్యవసాయంలో ఎలాగైనా గెలవాలనుకున్నాడు.. బంతి సాగు మేలని భావించాడు. తనకున్న ఆలోచనలను తోటి రైతులతో పంచుకున్నాడు. బంతి పూలసాగుపై దృష్టి పెట్టాడు. బంతిపూలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో మూడు నెలలకు రాబడి వస్తుందని తెలుసుకున్న శంకర్‌ రెండు ఎకరాలలో బంతి పూల సాగు చేశాడు. ఆ సీజన్‌ ఆయనకు కలిసొచ్చింది. ఖర్చులు పోనూ తనకు ఎకరాలో రూ. లక్ష దాకా ఆదాయం మిగిలిందని చెబుతున్నాడు.. శంకర్‌ను చూసి ఆ మండలంలోని పలువురు రైతులు బంతిసాగుకు పూనుకున్నారు. నార్పల మండలంలో సుమారు 220 ఎకరాల్లో బంతిపూల పంట సాగవుతున్నది.

ఎకరాకు రూ. లక్ష ఆదాయం.. 

బంతి సాగు 90నుంచి 120 రోజుల్లో పూర్తవుతుంది. 40రోజుల నుంచే మొగ్గ, పూలు మొదలౌతాయి. నిరంతరంగా కోతలుంటాయి. కిలో సరాసరి రూ.50కి తగ్గదని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రెండున్నర నుంచి మూడు టన్నుల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు చేతికందగా అందులో పంట సాగుకు ఎకరాకు సుమారు రూ. 40వేల దాకా ఖర్చవుతుంది. విత్తనాలు ఎకరాకు 50 గ్రాములు పడుతుంది. దీని ధర రూ. 12 నుంచి 14 వేలు అవుతుంది. పంట పూర్తయ్యేదాకా ఎకరాకు కూలీలతో కలిపి సుమారు రూ. 20నుంచి 25వేల దాకా ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.

అన్ని సీజన్లలోనూ డిమాండ్‌ 

బంతిపూలకు అన్ని సీజన్లలోనూ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటున్నది. కార్తీకమాసంలో అయితే అయ్యప్ప భక్తులు పూజలకు బంతి పూలకు ఎగబడతారు.. అప్పుడప్పుడు ధరల ఒడిదుడుకులు ఉన్నా…. నష్టం లేని పంటగా రైతులు బంతి సాగును భావిస్తారు. వేరుశనగ సాగుతో పోలిస్తే… పూలసాగు ఎంతో లాభదాయకమని రైతులు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు అనంతపురంనుంచి ప్రతిరోజూ పూలు ఎగుమతి చేస్తున్నారు. బంతిపూలు సాగుచేసిన రైతులకు కార్తీకమాసం, శ్రావణమాసం, దసరా, ఉగాది, సంక్రాంతి, శివరాత్రి తదితర పండుగల సీజన్లలో బంతిపూలకు మంచి గిరాకీ ఉంటుంది.

40వేల ఎకరాల్లో..
జిల్లాలో బంతిపూల సాగు బాగా విస్తరించినట్టు హార్టికల్చర్‌ డీడీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లాలో మడకశిర, పుట్టపర్తి, శింగనమల, కదిరి, పెనుకొండ, ధర్మవరం తదితర నియోజకవర్గాల్లో సుమారు 40వేల ఎకరాల్లో సాగు చేశారన్నారు. సాగు ఖర్చు తక్కవ, ఆదాయం ఎక్కువ ఉన్న పంటగా బంతిని ఆయన రైతులకు సిఫారసు చేస్తున్నారు. వేరుశనగకు ప్రత్యామ్నాయ పంటగా బంతిని ఎంచుకోవచ్చంటున్నారు. కొద్దిపాటి నీటి వసతి ఉన్నా డ్రిప్‌ పద్దతిలో ఈ సంట సాగు చేస్తే లాభం వస్తుందన్నారు.

– అనంతపురం, ఆంధ్రజ్యోతి


బంతి సాగుతో హ్యాపీ 

నాకున్న ఒకటిన్నర ఎకరాలో టమో టా, వేరుశనగ, మిరప సాగుచేసి తీవ్రంగా నష్టపోయాను. గత రెండేళ్లుగా బంతి, చా మంతి పూలు సాగు ప్రారంభించాను. అప్పటి నుంచి లాభం రావడం మొదలైంది. ప్రస్తుతం బంతిపూల ధర మార్కెట్‌లో కాస్త తక్కువగా ఉంది. ధరలో హెచ్చుతగ్గులున్నా బంతి సాగు లాభదాయకంగా ఉంటున్నది.

– వన్నూరప్ప, రైతు, నార్పల
Credits : Andhrajyothi

రైతుకు ఆదాయం.. ప్రజలకు ఆరోగ్యం

రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకంతో భూములు నిస్సారంగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా కొంత కాలం కొనసాగితే మన భూముల్లో పంటలు కూడా పండవని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందుతాయి. తద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే భూమిలోని సేంద్రియ కర్బన శాతం పెరిగి, భూమి ఆరోగ్యంగా మారుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ప్రకృతి సేద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని ప్రకృతి సేద్యంలో ముందడుగు వేస్తున్నారు.

యువతలో చైతన్యం 

ప్రకాశం జిల్లాలో కొరిశపాడు, ముండ్లమూరు, నాగులుప్పలపాడు, బల్లికురవ, యద్దనపూడి, సంతమాగులూరు, కొత్తపట్నం, దోర్నాల, మార్టూరు, ఎర్రగొండ పాలెం మండలాల్లో పది క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌లో 300 హెక్టార్ల విస్తీర్ణంలో 3,000 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌, ఒంగోలు సహాయ సంచాలకులు వి.సుభాషిణి తెలిపారు. సహజ సేద్యానికి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఉపయోగించి, సహజ సిద్దమైన ఎరువులను ఎలా వాడాలనే అంఽశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ తరహా సేద్యానికి ఉపయోగించే ఎరువులు, క్రిమిసంహారకాలు అన్ని చోట్లా లభించవు. చాలా ప్రాంతాల్లో రైతులు స్వయంగా సహజ ఎరువులు, క్రిమిసంహారకాలు తయారు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. అలా చేసుకోలేని వారి కోసం గ్రామాల్లో రసాయనాలు లేని పురుగుల మందులను నాన్‌ఫెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌పిఎం)షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కేవలం కషాయాలను మాత్రమే అతి తక్కువ ధరలకు విక్రయిస్తారు. ప్రకృతి సేద్యంలో రైతులు ఖరీదైన ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించరు. తద్వారా రైతులకు దిగుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పైగా రైతులు పండించిన ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంటుంది కాబట్టి వారి ఆదాయాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో యువత కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నది.

వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు 

ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి సేద్యానికి అవసరమైన ఎరువులు, క్రిమిసంహారకాల కషాయాలు తయారు చేస్తున్నారు. వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువులు తయారు చేసుకుంటున్నారు. సేంద్రీయ ఎరువులు తయారు చేసుకునే యూనిట్ల నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీగా అందిస్తున్నది. 10 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు ఉండే విధంగా ఒక్కో ఇటుకకు మధ్యలో ఆరు అంగుళాలు ఖాళీ ఉండే విధంగా నాలుగు వైపులా గోడను నిర్మిస్తారు. దీనికి సుమారు రూ.10 వేలు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. వ్యవసాయ వ్యర్థ పధార్థాలైన పంటలో వచ్చే చెత్త చెదారం, పశువుల పేడ, జల్లెడపట్టిన మట్టి, నీటితో సేంద్రియ ఎరువు తయారవుతుంది. మూడు, నాలుగు నెలల్లోనే రెండున్నర మెట్రిక్‌ టన్నులు ఎరువు సిద్ధం అవుతుంది. దీనివల్ల సాధారణ కంపోస్టు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు పోషకాలు అధికంగా లభిస్తాయి. ఈ రోజున మనం తింటున్న ఆహారంలో పురుగుల మందుల అవశేషాలు ఉంటున్నాయి. ఫలితంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ సమస్యకు ప్రకృతి సేద్యం మాత్రమే సమాధానం అన్నారు వ్యవసాయాధికారి దేవరపల్లి యుగంధర్‌ రెడ్డి.
– ఆంధ్రజ్యోతి, ఒంగోలు, వ్యవసాయం

మంచి డిమాండ్‌ 
ప్రకృతి సేద్యంలో రైతు పండించిన పంటకు మంచి డిమాండ్‌ ఉంటున్నది. రైతుల్లో ఈ తరహా సాగుపట్ల అవగాహన పెంపొందించి, వారి సందేహాలు తీర్చేందుకు క్లసర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌, క్లస్టర్‌ యాక్టివిస్టులు వారికి అందుబాటులో ఉంటున్నారు. రబీలో వరి, మిరప, కంది, వేరుశెనగ, వివిధ రకాల పండ్ల తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చే సేలా రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం.

– జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌ సుభాషిణి

ఆన్‌లైన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం
ప్రకృతి వ్యవసాయంపై ఉన్న మక్కువతో 30 ఎకరాల బీడు భూమిని కౌలుకు తీసుకున్నాను. వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో సేంద్రీయ పంటలు పండిస్తున్నాను. పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడటం లేదు. అన్ని రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటాను. మంచి గిరాకీ ఉన్న ఆ ఉత్పత్తులను ఈ రోజున ఆనలైనలో విక్రయిస్తున్నాను.

– గుళ్లపల్లి సుజాత, పెద్దారకట్ల, కొనకొనమిట్ల మండలం

నాడు మెకానిక్‌.. నేడు రైతు
మూడేళ్ల క్రితం వరకు మెకానిక్‌గా పనిచేశాను. పాలేకర్‌ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుని ప్రకృతి సేద్యం చేపట్టాను. వేరుశనగ , సజ్జ, మొక్కజొన్నలతో పాటుగా చిక్కుడు, వంగ, మిరప, కూరగాయలు పంటలు సాగు చేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో వేరుశెనగ పండించాను. నాణ్యమైన నా పంటను అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రకృతి సేద్యం వల్ల నేను ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పంచుతున్నాని సంతృప్తిగా ఉంది.

– దద్దాల రామారావు, పాదర్తి, కొత్తపట్నం
Credits : Andhrajyothi

ట్రైకోకార్డులతో పీకపురుగు చెక్‌ 

ఆంధ్రప్రదేశలో చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. పచ్చఆకు వైరస్‌ దేశవ్యాప్తంగా చెరకు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ తరుణంలో చెరకు సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలోని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి రైతులకు ఇస్తున్న సూచనలివి.

ఫిబ్రవరిలో నరికిన మొక్క తోటలను కార్శి చేపడతారు రైతులు. ఆ సమయంలో నేల మట్టానికి పదునైన కత్తితో మొదళ్లు నరికి, ఆయా ప్రాంతాలకు సిఫారసు చేసిన నత్రజనిలో సగభాగం భాస్వరం, పొటాష్‌ ఎరువులు…చెక్కిన దుబ్బుల దగ్గర గుంతలు తీసి ఎరువు వేసి మట్టితో కప్పాలి. ఆ తరువాత తడి ఇవ్వాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కార్శి చేసి, ఎరువులు వేసి తడి ఇచ్చిన వెంటనే సమంగా పలుచగా కప్పాలి. కార్శి తోటలో మొక్కల సాంద్రతను బట్టి ఖాళీల భర్తీ తప్పక చేపట్టాలి. డిసెంబర్‌/జనవరిలో కార్శి చేసిన తోటలకు 45 రోజులకు రెండవ దఫా నత్రజని ఎరువును వాడుకోవాలి. నీటి వసతిని బట్టి తేలిక నేలల్లో వారానికి ఒక తడి, బరువు నేలల్లో 12-15 రోజులకు ఒక తడి ఇస్తే పీక పురుగు నివారింపబడి చెరకు తోటలో మంచి పిలకలు అభివృద్ధి చెందుతాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో మొక్కతోట నాటడానికి నేలను లోతు దుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. మధ్యకాలిక చెరకు రకాలను నాటడానికి, మొదటిగా చాళ్ళలో భాస్వరం, పొటాష్‌ ఎరువులు వాడుకోవాలి. చెరకు నాటిన మూడు రోజులలోపు ఎకరానికి రెండు కిలోల అట్రాజిస్‌ లేదా 600 గ్రాముల మెట్రిబ్యుజిన్‌ అను కలుపు నాశన మందులు చెరకు సాళ్ళు దిబ్బలపై పిచికారీ చేయాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కప్పాలి. జనవరిలో నాటిన మొక్కతోటలకు రెండవ దఫా నత్రజని ఎరువును మొదళ్ళ దగ్గర గుంతలు తీసివేయాలి. ఫిబ్రవరి మాసంలో పిలక కార్శి తోటలలో పీకపురుగు ఉనికిని గమనించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పీకపురుగు నివారణకై ట్రైకోకార్డులు వాడకం చాలా లాభదాయకం. 87ఏ 298 (విశ్వామిత్ర) రకానికి కొరడా తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కతోటల్లో ముచ్చెలు నాటే ముందు ప్రొపికొనజోల్‌ మందుతో లీటరు నీటికి 1.0 మి.లీ. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. మొక్కతోటల్లో కంటే కార్శి తోటల్లో కొరడా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రొపికొనజోల్‌ మందును ఒక మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి కార్శి చేసిన వెంటనే ఒకసారి, కార్శి చేసిన 30-40 రోజులకు మరొకసారి పిచికారీ చేయాలి.

మార్చిలో సస్యరక్షణ ఇలా

చెరకు మొక్కతోట, కార్శి వర్షాధారపు చెరకు తోటలను నరికి చెరకును వీలైనంత తొందరగా కర్మాగారాలకు తరలించాలి. మొక్క తోటల్లో (డిసెంబరు/జనవరి తోటలకు) రెండవ దఫా నత్రజని మోతాదును వాడుకోవాలి. కూలీల లభ్యతను బట్టి మొక్కతోటలకు కొద్దిగా మొదళ్ళకు మట్టిని ఎగదోయడం వల్ల పీకపురుగు ఉధృతిని తగ్గించి, కలుపు సమస్యను కొంత మేరకు నివారించుకోవచ్చు. మొక్క తోటలకు కలుపు నివారణకు ఎకరానికి 1.8 కిలోల 2,4 డి ఒక లీటరు గ్రామక్సోన్‌ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్‌+ 1 కిలో 2,4డి కలిపిన ద్రావణాన్ని చెరకు చాళ్ళ మధ్య పిచికారీ చేసుకోవాలి. 2,4 డి గ్రామాక్సోన్‌ వాడునపుడు, ద్రావణం చెరకు చాళ్ళపై పడకుండా జాగ్రత్తపడాలి. డిసెంబరు/ జనవరిలో నాటిన మొక్క తోటలు తోటలకు నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలల్లో వారం, పది రోజులకు బరువైన నల్లనేలల్లో 15 నుంచి 20 రోజులకు ఒక తడి చొప్పున నీటి తడులు ఇచ్చి పంట పిలకలు తొడుగు దశ బెట్టుకు గురికాకుండా చూసుకోవాలి. చెరకు మొక్క లేదా కార్శి తోటల్లో పండ మార్చి మాసం (వేసవి) నుంచి పంట బెట్టకు గురికాకుండా నీటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. డిసెంబరు/జనవరి మొక్కతోటల్లో సాగు చేసిన పుష్ప ధాన్యపు అంతరపంటలను ఫలసాయం మార్చి మాసంలో తీసుకొన్న తరువాత చెరకు చాళ్ళ మధ్య అంతరకృషి యంత్రాలతో గాని నాగలితో గాని చేపట్టాలి. 87ఏ 298 (విశ్వామిత్ర) చెరకు రకాన్ని కార్శి చేసే రైతాంగం కార్శి చేసిన 30 రోజులకు ప్రొపికొనజోల్‌ 1.0 మి.లీ/లీ. నీటికి కలిపి తప్పక పిచికారీ చేయాలి. తద్వారా కాటుక తెగులును నివారించుకోవచ్చు. డిసెంబర్‌/జనవరి మొక్కతోటలకు కలుపు నివారణకు ఎకరానికి ఒక లీటరు గ్రామోక్సోన్‌ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్‌+ఒక కిలో గ్రాము 2,4 డి కలిపిన ద్రావణాన్ని చాళ్ళ మధ్య పిచికారీ చేయాలి.
– అనకాపల్లి అగ్రికల్చర్‌

Credits : Andhrajyothi

కొత్త పద్ధతిలో కంది సాగు.. పంట బహు బాగు

  • నర్సరీ పద్ధతి, సేంద్రియ ఎరువుల వాడకం
  • వీరబల్లి రైతుల వినూత్న ప్రయోగం
సాధారణ సాగు పద్ధతులకు స్వస్తి పలికారు.. కొత్త పంథాను ఆచరించి.. దిగుబడిలో రికార్డుల దిశగా పయనిస్తున్నారు కంది పంటను రాయలసీమ ప్రాంతంలో అంతర్‌పంటగా పండిస్తారు. పెద్దగా నీళ్లు అవసరం లేకుండా.. కేవలం వర్షాధారంగా మాత్రమే ఈ పంటను సాగు చేస్తారు. కానీ నర్సరీ పద్ధతిలో, సేంద్రియ ఎరువులు వాడుతూ కంది సాగు చేయడం అరుదు. అలా కంది సాగు చేసి… మంచి దిగుబడులు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దివీడు రెడ్డివారిపల్లెకు చెందిన రైతులు సుజనమ్మ, రెడ్డిశేఖర్‌.
నర్సరీ పద్దతిలో, సేంద్రీయ ఎరువులు ఉపయోగిస్తూ కందిసాగు చేయడం చాలా ఆరుదు. అలా సాగు చేసిన కంది పంటను చూసి వ్యవసాయాధికారులే ఔరా అంటున్నారు. వినూత్న పద్ధతుల్లో కందిసాగు చేస్తున్న వీరబల్లి మండలం పెద్దివీడు రెడ్డివారిపల్లెకు చెందిన రైతులు సుజనమ్మ, రెడ్డిశేఖర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. గతంలో బావి దగ్గర వరి లేకుంటే వేరుశనగ సాగు చేసే వాళ్లం. సరైన వర్షాలు లేకపోవడంతో.. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేవి కావు. గత ఏడాది దువ్వూరుకు చెందిన బాలాజీసింగ్‌ అనే వ్యక్తి ఒక ఎకరంలో నర్సరీ సాగు పద్ధతి (సాధారణంగా కంది విత్తనాలు భూమిలో వేస్తారు. అయితే ఈ నర్సరీ పద్ధతిలో 35 రోజుల పాటు మొక్కను పెంచి తర్వాత పొలంలో నాటుతారు)లో కందిసాగు చేసి ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి సాధించాడు. ఆ రైతు విజయంపై వ్యవసాయ శాఖ, ఎనపీయం అధికారులు, ఏపీడీ నాగరాజు, ఏవో ప్రవీణ్‌కిశోర్‌లు వీరబల్లిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బాలాజీసింగ్‌, వ్యవసాయాధికారులు చెప్పిన విషయాలపై నమ్మకం కుదిరింది. కంది సాగుకు తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. తెగుళ్లను ఈ పంట బాగా తట్టుకోగలుగుతుంది. అందుకే మేము కూడా ఆ పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నాం.
5 ఎకరాల్లో సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, కవర్లు తెప్పించుకుని నర్సరీ పెట్టాము. నర్సరీలో 35 రోజులు పెరిగిన తరువాత ఈ 5 ఎకరాల్లో కంది మొక్కలు నాటాము. అందుకు డ్రిప్‌లు కూడా ఉపయోగించాం. మొక్కలు 3 6 పద్ధతిలో నాటాము. ఎకరాకు 2400 మొక్కలు పట్టాయి. నాటేటప్పుడు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు ఉపయోగించాం. వంద రోజులు పూర్తి అయ్యాక కలుపు తీయించి తలలు (కొనలు) తుంచేశాం. దీంతో చెట్టుకు ఎక్కువ కొమ్మలు వచ్చాయి. దాదాపు ఒక చెట్టుకు 200 కొమ్మలు వచ్చాయి. 5 నెలలు అయ్యేసరికి పూర్తిగా మొత్తం పొలం అంతా కొమ్మలతో కమ్ముకుపోయి పూత దశలో ఉంది. ఈ పంటకు సాగుకు ఆద్మ అధికారులు సలహాలు, సహకారం అందజేశారు. వారి సలహాల మేరకు మూడుసార్లు నీమాస్త్రం (వేపకషాయం), పేడ మూత్ర ద్రావణాన్ని పిచికారి చేశాం. పూత, పిందె రాలకుండా ఉండేందుకు ద్రవజీవామృతం పిచికారి చేశాం‘‘ అన్నారు ఆ రైతు దంపతులు.
మొత్తం 18 ఎకరాల్లో వీరు కంది సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో ఎల్‌ఆర్‌జీ-59 రకాన్ని నర్సరీ పద్ధతిలో నాటగా, మరో 5 ఎకరాల్లో బీఆర్‌జీ-1, బీఆర్‌జీ-2, బీఆర్‌జీ-3 రకాలను సాగు చేసి పెడల ద్వారా నీటిని అందించారు. మరో రెండెకరాల్లో ఎనఆర్‌ఐ షీడ్స్‌ అర్జున రకాన్ని సాగు చేసి పెడల ద్వారానే నీటిని అందించారు. మరో 6 ఎకరాల్లో వర్షాధారంగా హైబ్రీడ్‌ రకాలను సాగు చేశారు. వర్షాధారంగా సాగుచేసిన పంట అంతంతమాత్రంగా ఉంది. నీరు అందించిన 12 ఎకరాల్లో పంట చాలా బాగుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు ద్వారా మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిది, రాయచోటి

ఎంత దిగుబడి వస్తుందో చూడాలి 
ఈ పద్ధతిలో కంది సాగు చేసేందుకు ఎకరాకు రూ.10 వేలు ఖర్చు అవుతున్నది. ఈ సాగు పద్ధతి ఆదర్శప్రాయంగా ఉందని ఇటీవల మా పొలాన్ని సందర్శించిన వ్యవసాయ అధికారులు అభినందించారు. నెలరోజుల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎంత దిగుబడి వస్తుందో చూడాలి.

-సుజనమ్మ, రెడ్డిశేఖర్‌, రైతు దంపతులు
Credits : Andhrajyothi

విశాఖ ఏజెన్సీలో యాపిల్‌ 

  •  అన్న, డోర్సెట్‌ గోల్డెన్‌ రకాలు అనుకూలం 
  •  100 మంది రైతులతో సాగుకు శ్రీకారం 

విశాఖ ఏజెన్సీలోని లంబసింగి ప్రాంతం యాపిల్‌ సాగులో ఆంధ్రాకశ్మీరంగా మారనుంది. 2014 జనవరిలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా యాపిల్‌ సాగును ప్రారంభించారు. సిమ్లాకు చెందిన ఉద్యాన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతం యాపిల్‌ సాగుకు అనుకూలమని ప్రకటించడంతో పాడేరు ఐటీడీఏ, ఏపీ ట్రైకార్‌ అధికారులు విశాఖ ఏజెన్సీలో కాఫీ తరహాలో యాపిల్‌ సాగును ప్రోత్సహించి గిరిజన రైతుల ఆర్థిక పురోగతికి తోడ్పడాలని సంకల్పించారు. యాపిల్‌ సాగుకు ఆసక్తిచూపుతున్న వందమంది రైతుల్ని ఎంపికచేసి వారికి మొక్కలు పంపిణీ చేశారు. సాగుకు అవసరమైన ఆర్థిక సహకారం, శిక్షణ కూడా ఇస్తున్నారు. విశాఖ ఏజెన్సీ రైతులకు శిక్షణ ఇస్తున్న అభ్యుదయ రైతు పురుషోత్తమరావు చెబుతున్న యాపిల్‌ సాగు విశేషాలు. 
అనుకూల వాతావరణం 
యాపిల్‌ సాగుకు ప్రధానంగా శీతల వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు మించి నమోదుకాకూడదు. ఒకటి రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా సమస్య ఉండదు.
అనువైన రకాలు: విశాఖ ఏజెన్సీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాణిజ్య సరళి సాగుకు 1954లో బహమాస్‌లో అభివృద్ధి చేసిన ‘డార్సెట్‌ గోల్డెన్‌’, 1959లో ఇజ్రాయిల్‌ అభివృద్ధి చేసిన ‘అన్న’ రకాలు అత్యంత అనుకూలమని హిమాచల్‌ప్రదేశ్‌ మసోబ్ర, సిమ్లాకు చెందిన డాక్టర్‌ వైఎస్‌ ఫార్మర్‌ యూనివర్సిటీ అండ్‌ ఫారెస్ర్టీ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం, శిక్షణ కేంద్రం సూచించింది.
నాట్లు: యాపిల్‌ మొక్కలను జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ నాటు కోవచ్చు. మొక్కల మధ్య ఎనిమిది, వరుసల మధ్య పది అడుగులు దూరం పాటిస్తూ నాట్లు వేసుకోవాలి.
అనుకూలమైన ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఏజెన్సీ 10 మండలాలు, తూర్పుగోదావరి ఏజెన్సీలో మూడు మండలాలు, తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లా కేరిమేరి, ఉట్నూరు, ఆసిఫాబాద్‌ అనుకూలం.
ఎరువులు: మొక్క నాటే సమయంలో ఒక్కొక్క మొక్కకు 70 గ్రాముల నత్రజని, 35 గ్రాములు పాస్పరస్‌, 70 గ్రాముల నైట్రోజన్‌ వేసుకోవాలి. మొక్కలకు పదేళ్ల వయస్సు వచ్చేవరకూ ప్రతి ఏడాది ఇదే క్రమంలో ఎరువులు వేసుకోవాలి. పదేళ్ల తరువాత ఒక మొక్కకు 700 గ్రాములు నైట్రోజన్‌, 350 గ్రాముల పాస్పరస్‌, 700 గ్రాములు నైట్రోజన్‌ వేసుకోవాలి. ఎకరానికి 800 మొక్కలు వేసుకోవాలి.
పెట్టుబడి: యాపిల్‌ మొక్క హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.250 ధర ఉంది. ఏపీకి సరఫరా చేసేందుకు నర్సరీ యజమానులు రూ.300 తీసుకుంటున్నారు. రైతు ఎకర విస్తీర్ణంలో యాపిల్‌ సాగుచేసేందుకు రూ.2.4 లక్షలు, ఎరువులు, గుంతలు తీసి నాటుకోవడానికి అదనంగా మరో రూ.40 వేలు ఖర్చు అవుతోంది. ఒకసారి మొక్కలు నాటిన తరువాత నుంచి ప్రతి ఏడాది రూ.20-40 వేలు పెట్టుబడి పెట్టాలి.
దిగుబడి: మొక్కలు నాటిన రెండో ఏడాది నుంచి కాపు ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వరకూ కాపు తక్కువగా ఉంటుంది. ఐదేళ్ల తరువాత ఒక మొక్క నుంచి 15 నుంచి 18 కిలోల దిగుబడి వస్తుంది. ఒక మొక్క 20 ఏళ్లకుపైగా దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 15 టన్నుల దిగుబడి వస్తుంది.
9 లక్షల ఆదాయం: తాజా మార్కెట్‌ ధరల ఆధారంగా కిలో యాపిల్‌ (ఎనిమిది కాయలు) ధర రూ.50-60 ఉంది. ఆవిధంగా ఏడాదికి ఎకరాకి 9 లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను 6 లక్షల నికర ఆధాయం మిగులుతుంది.
యాజమాన్యం: ఏటా జనవరిలో యాపిల్‌ మొక్కలను ప్రూనింగ్‌ (అదనపు కొమ్మలు తొలగింపు) చేసుకోవాలి. మొక్కలు 12 అడుగులు మించి ఎదగకుండగా చూసుకోవాలి.

ఏడాదికి రెండు పంటలు

విశాఖ ఏజెన్సీలో ఏడాదికి రెండు పంటలను తీసుకునే వాతావరణ పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాపిల్‌ పంట కాలం ఆరు నెలలు మాత్రమే. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మాసాల్లో యాపిల్‌ మొక్కలు పూర్తిగా నిద్రావస్థలో వుంటాయి. దీంతో ఏడాదికి ఒక పంట మాత్రమే వస్తోంది. విశాఖ ఏజెన్సీలో ఆ పరిస్థితులు లేవు. దీంతో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒక పంట, జూలైలో మరో పంట పొందే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో యాపిల్‌ సాగు చేసే రైతులు ఏడాదికి రెండింతల ఆదాయం పొందవచ్చు. ఏపీలో సంప్రదాయేతర పంటగా తొలిసారిగా సాగుచేస్తుండడంతో యాపిల్‌ సాగుకు చీడపీడలు, తెగుళ్లు పెద్దగా ఆశించే అవకాశం ఉండదు. – ఆంధ్రజ్యోతి, చింతపల్లి 

ప్రయోగాత్మక సాగు సక్సెస్‌ 
చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేపడుతున్న ప్రయోగాత్మక సాగు విజయవంతంగా కొనసాగుతోంది. మొక్కలు నాటిన రెండో ఏడాది నుంచే యాపిల్‌ మొక్కలు కాపుకొచ్చాయి. ఈ ఏడాది కాసిన యాపిల్‌ పండ్ల రంగు, రుచి బాగుంది.
– దేశగిరి శేఖర్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌, చింతపల్లి. 

నాణ్యమైన మొక్కల ఎంపిక కీలకం

యాపిల్‌ సాగులో నాణ్యమైన మొక్కల ఎంపిక చాలా కీలకం. బహిరంగ మార్కెట్‌లో విక్రయించే మొక్కలు కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏపీ, తెలంగాణ రైతులు మొక్కలను ఏవిధంగా కొనుగోలు చేయాలి, సాగు విధానంపై సలహాలు, సందేహాలు నివృతి చేసుకునేందుకు 7207501515 నంబర్‌కి కాల్‌ చేయవచ్చు. డీడీఎజిఆర్‌వోఎ్‌ఫఎఆర్‌ఎంఎస్‌ ఎట్‌ద రేటాఫ్‌ జిమెయిల్‌.కాం కి మెయిల్స్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
– పురుషోత్తంరావు, సిమ్లా సీపీఆర్‌ఐ అనుబంధ ఐపీఏ సభ్యుడు.

Credits : Andhrajyothi

రైతులకు శాపంగా నకిలీ విత్తనాలు 

  • ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు
  • ప్రైవేటు కంపెనీల ఆటకట్టించాలంటున్న నిపుణులు
నకిలీ విత్తనాలు తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల రైతుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట పండకపోవడం లేదా దిగుబడి నామమాత్రంగా ఉంటున్నది. ఫలితంగా రైతులు ఏటా వేల కోట్ల రూపాయల్లో నష్టపోతున్నారు. రైతాంగం ఆర్థిక స్థితిని దారుణంగా దెబ్బతీస్తున్న నకిలీ విత్తనాల సమస్యపై ఇటీవల గుంటూరుకు చెందిన అవగాహన అనే సామాజిక సంస్థ ప్రముఖ రైతులు, శాస్త్రవేత్తలతో సదస్సు నిర్వహించింది. ఆ సదస్సులో పాల్గొన్న నిపుణులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. 

రైతులు ఎంతో డబ్బుపోసి, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను పొలాల్లో నాటుతున్నారు. అవి మొలవకపోవడంతో అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసినట్టు అవుతున్నది. ఆ నష్టాన్ని తట్టుకోలేని చిన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న రైతులు ఆ నష్టాన్ని మౌనంగా భరిస్తున్నారు. వేరేదారి లేక మళ్లీ ఆ కంపెనీల విత్తనాలో కొనుగోలు చేసి మళ్లీ నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు సరఫరాచేసే కంపెనీలపై రైతులే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. కానీ అంత బలమైన కంపెనీలతో పోరాడే శక్తి రైతుకు ఉండదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా, సదరు కంపెనీలు ఆ రైతులకు ఏదో విధంగా పరిహారం ఇచ్చి కేసులు లేకుండా చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన ప్రకటన లు ఇచ్చి రైతుల్ని నిలువునా మోసం చేస్తున్నారు. కొందరు రైతులు సొంతగా విత్తనాలు సిద్ధం చేసుకునే ప్రయత్నాలను కూడా ప్రైవేటు కంపెనీలు అడ్డుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు సత్వరం స్పందించి నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలను కఠినంగా శిక్షించకపోతే రైతుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందంటున్నారు నిపుణులు.

– స్పెషల్‌ డెస్క్‌
 

రైతులకు కోట్లు నష్టం 
గతంలో రైతులు మంచి దిగుబడి వచ్చిన పంట నుంచి విత్తనం కట్టి భవిష్యత్తుకు అవసరమైన మేలురకం విత్తనాన్ని తనకు తానే సిద్ధం చేసుకునే వారు. ప్రభుత్వం క్రమంగా ప్రైవేటు కంపెనీల విత్తనాలను రైతులకు అలవాటు చేసింది. దీంతో సంప్రదాయ పద్ధతి అంతరించిపోయింది. ప్రైవేటు కంపెనీలకు వ్యాపారదృక్పథం తప్ప శాసీ్త్రయ విధానం లేదు. నాణ్యతలేని ఎఫ్‌-2 రకం విత్తనాలను ప్రైవేటు కంపెనీలు రైతులకు అధికధరలకు సరఫరా చేశాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు.

– కాటా సాంబశివరావు, రైతు నేత
 

ప్రభుత్వ విధానాలు… రైతులకు శాపం 
ప్రభుత్వ విధానాలు, చట్టాలు అన్నీ భూమిని వ్యవసాయ యోగ్యం చేసే రైతుకు వ్యతిరేకంగా ఉండటం దురదృష్టకరం. 1966 విత్తన చట్టం పరిధిలో జరిగిన శాస్త్రపరిశోధనల ఆధారంగా, ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సుల పుణ్యమా అని నకిలీ విత్తనాలు వచ్చాయి. ఈ నకిలీ విత్తనాలతో పాటు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కోట్లాది మంది రైతులకు శాపంగా మారాయి.

– జొన్నలగడ్డ రామారావు, వ్యవసాయనిపుణులు
 

‘నకిలీ’లకు నేతల అండ 
నకిలీ విత్తనాలు సరఫరా చేసి, రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు కంపెనీలకు రాజకీయ నేతల అండదండలు ఉంటున్నాయి. అలాంటి కంపెనీలపై రైతులు కేసు పెట్టే ధైర్యం ఎలా చేస్తాడు? నాసిరకం విత్తనాలు మొలవక, మొలిచినా దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరానికి 40 నుంచి 70 వేల వరకు ఖర్చు చేసి అహోరాత్రులు శ్ర మించిన రైతు చివరకు పెట్టుబడి కూడా తిరిగిరాక అప్పులపాలవుతున్నాడు. రైతులు ఏకమై సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి.

– డాక్టర్‌ కోలా రాజమోహన, నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు
 

అధికారులదే బాధ్యత 
విత్తన ప్రయోగశాలల్లో జెర్మినేషన, భౌతిక స్వచ్ఛత, జన్యుపరమైన స్వచ్ఛతలను పరీక్షించాలి. కానీ జన్యుపరమైన నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలలు మన రాష్ట్రంలో లేనేలేవు. నకిలీ విత్తనాల వల్ల జరుగుతున్న అనర్ధాలు ఆగాలంటే ఆ కంపెనీలకు అనుమతి ఇస్తున్న వ్యవసాయ అధికారులనే పూర్తి బాధ్యుల్ని చేయాలి. వ్యవసాయ కమిషనర్‌ సర్టిఫికేషన తరువాతే ఆ విత్తనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అలాంటప్పుడు నకిలీ విత్తనాలతో మాకు సంబంధం లేదని వారు ఎలా అనగలరు?

– సూరయ్య చౌదరి, వ్యవసాయరంగ నిపుణుడు
Credits : Andhrajyothi

చీనీ సేద్యం.. అనంత రైతు ఆనందం 

వేరుశనగ సాగుతో విసిగిపోయిన అనంత రైతులు ఇప్పుడు చీనీ బత్తాయి సాగుపై దృష్టి సారించారు. తాడిపత్రి ప్రాంతంలోని రైతులు చీనీ సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వారి విజయం ఇరుగుపొరుగు మండలాల రైతులకు స్ఫూర్తినిచ్చింది. అనంత పరిసరాల్లో వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతున్నది. రైతులకు మంచి లాభాలు ఆర్జించిపెడుతున్నది.

‘‘మనిషికి అత్యంత ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన, నిజాయితీతో కూడిన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే’’

-జార్జ్‌వాషింగ్టన్‌ (అమెరికా మాజీ అధ్యక్షుడు)
వేరుశనగ.. పప్పుశనగ సాగుకు కేరాఫ్‌ అనంతపురం జిల్లా. సాగుచేయడమే కానీ పంట చేతికందే దాకా నమ్మకం లేని పరిస్థితి. వర్షాధార భూముల్లో సాగుచేసే వేరుశనగ వరుణుడి కరుణ ఉంటేనే దిగుబడి వచ్చేది. వాన కురిస్తే కన్నీరు లేకుంటే కన్నీరు. దశాబ్దాలుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రికి చెందిన కొందరు రైతులు చీనీ బత్తాయి సాగు చేపట్టారు. మంచి సాగు విధానలతో మంచి దిగుబడులు సాధించారు. ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో చీనీ రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. దాంతోపాటు అనంతపురం జిల్లా నుండి వచ్చే బత్తాయి పండ్లు మధురంగా వుంటాయనే పేరును మార్కెట్లో సంపాదించారు. దీంతో వేలాది రైతులు ఇప్పుడు బత్తాయి సాగుపై దృష్టి సారిస్తున్నారు.

అరటితో పోలిస్తే.. ఖర్చు తక్కువే..

అరటి సాగుతో పోల్చితే చీనీ ఖర్చు తక్కువేనంటున్నారు రైతులు. పంట పెట్టినప్పుడు మొదటి ఎడాది ఎకరాకు రూ. 20వేలు, నాలుగేళ్ళ నుండి రూ. 50వేలు పెట్టుబడి పెడితే చినీ చెట్లు మంచి ఎదుగుదలతో ఆశించిన దిగుబడిని ఇస్తాయి. చెబుతున్నారు. పేడ ఎరువు, పోటాష్‌, పిండి ఎరువులు, వంటివి చినీ చెట్లకు పోషకాలుగా అందిస్తున్నామని రైతులు వివరించారు. కడప జిల్లా నుంచి అంట్లు తెచ్చుకుని నాటుతున్నారు. గత 15 ఏళ్ళ కిందట తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ చూసిన చినీ చెట్లు కనిపించేవి. వర్షాబావ పరిస్థితుల కారణంగా బోర్లు ఎండిపోయి భూగర్భజలాలు పడిపోయాయి. వందల ఎకరాల్లో చెట్లను నరికివేసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపి తీవ్రంగా న ష్టపోయారు. దీంతో నష్టాలు బారి నుండి బయటపడాలని చినీ అంట్లను కడప, పులివెందుల, హిమకుంట్ల, రైల్వేకోడూరు, రాజంపేట తదిరత ప్రాంతాల నుండి తెచ్చి నాటుతున్నారు. జిల్లాలో పుట్లూరు మండలంలో 3 వేల హెక్టార్లు, యల్లనూరులో 2500 హెక్టార్లు, నార్పలలో వెయ్యి హెక్టార్లలో సాగవుతున్నది. ఈ ఏడాది మొత్తం 2వేల హెక్టార్లలలో కొత్తగా అంట్లు నాటుతున్నారు. కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, వెంగన్నపల్లి, గోపురాజుపల్లి, వెన్నపూసపల్లి, గడ్డంవారిపల్లి తదితర గ్రామాల్లో చినీ పంటను భారీగా సాగు చేస్తున్నారు.

మార్కెట్లోకి ఆపిల్‌బేర్‌

చినీ కాయల్లో గైరంగం, సీజ్‌న కాయలు తరుచూ మార్కెట్‌కు వచ్చే సరుకు. కాని కొత్తగా ఆపిల్‌బేర్‌ అనే కొత్త రకం వంగడం రైతులకు వరంగా మారింది. మధురంగా ఉండడంతో ఈపండ్లకు ధర ఎక్కువగా వుంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ రకాలను నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 10 మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. చినీ కాయలను చెన్నై, మంగళూరు, బెంగుళూరు, హైదరాబాద్‌, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది టన్ను చినీ ధర రూ. లక్షా 5వేలు పలికింది. ప్రస్తుతం ధర పడిపోవడంతే టన్ను ధర 25 నుంచి 30వేల లోపు పలుకుతోంది. చినీ కాయలు కాపు లేకపోవడంతో ధర తగ్గిపోయిందంటున్నారు రైతులు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ధరలు భారీగా పెరుగుతాయని వారు ఆశాభావంతో ఉన్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి- అనంతపురం

11 లక్షల లాభం
15 ఏళ్ళ కొందట చినీ చెట్లను సాగుచేశాను. వర్షాబావం కారణంగా చెట్టు నరికేశాను. ఇప్పుడు నాలుగు ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టాను. గతంతో పోలిస్తే మంచి దిగుబడే వస్తున్నది. మా గ్రామం చీనీకాయలకు మంచి ధరపలుకుతుంది. 2 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఒక సారి 13, రెండోసారి 10 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను లక్ష వరకు ఉంటుంది. ధరలు ఇదేర కంగా కొనసాగితే 10 నుంచి 13 లక్షల ఆదాయం వస్తుంది. నీటి వసతి ఉంటే దిగుబడులు రెట్టింపు చేయగలం.

– మధుసూధనరెడ్డి, రైతు కోమటికుంట్ల

తెగుళ్ళతోనే తంటా 
చినీ పంటను 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. అంట్లు నాటినప్పుటి నుండి సుమారు రెండేళ్ళు తెగుళ్ళ నుండి మొక్కను కాపాడాలి. చెట్లకు సోకే తెగుళ్ళు, కాయలకు వచ్చే నల్లమంగు, జాలి, నీటి ఎద్దడితో వచ్చే ఏరు, పులుసు సమస్యగా మారాయి. వీటి నుంచి కాపాడితే దిగుబడికి ఢోకా ఉండదు. ఎడాదికి ఒక సారి పెరిగిన కొమ్మలను కత్తిరిస్తూ వుండాలి. గతంలో చేసిన అప్పులు క్రమంగా తీర్చుకుంటున్నాను. ఆదాయం మరింత పెరిగితే ఎక్కువ మంది రైతులు చీనీ సాగు చేపడతారు. 

Credits : Andhrajyothi

మట్టి లేకుండా మొక్కల పెంపకం 

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో మొక్కలు పెంచాలంటే స్థలం కొరత ఎదురవుతోంది. కానీ ఈ పరిస్థితి కారణంగా పచ్చదనం పెంచాలని ఆసక్తి ఉన్నా చేయలేనివారికి మధురవాడ జీవీపీ కళాశాలలో ట్రిపుల్‌ ఇ చదువుతున్న విద్యార్థి భమిడిపాటి అవధానిప్రశాంత్ చక్కని పరిష్కారం చూపించాడు. మట్టితో పని లేకుండా మొక్కలు పెంచే విధానం గురించి ఒక ప్రాజెక్టు రూపొందించాడు.
వ్యవసాయరంగంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందడానికి ఈ విధానాన్ని అమలు చేయవచ్చని ప్రశాంత్‌ తెలిపాడు. వ్యవసాయ క్షేత్రం పక్కన నీటికొలను ఏర్పాటు చేసుకొని, ఆ నీటిలో పీహెచ్‌ గాఢతను అనుసరించి పోషకాలు కలిపి డ్రిప్‌ పద్ధతి అందిస్తే నీరు ఆదా అవుతుందని ప్రశాంత్‌ వివరించాడు. నీటిని అందించే పైప్‌లైన్‌కు పీహెచ్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌లు అమర్చి వాటిని మన సెల్‌ఫోన్‌కు అనుసంధానించి దూరం నుంచి కూడా వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించవచ్చునని ప్రశాంత్ వివరించాడు.

కేవలం నీటితోనే.. 
మన ఇళ్లల్లో మట్టి లేకుండా ప్లాస్టిక్‌ పైప్‌లలో చిన్న కుండీలు ఏర్పాటు చేసి వాటిలో క్లేపెబల్స్‌ (మట్టి ఉండలు)వేసి మనకు నచ్చిన పూల మొక్కలు, టమాటాలు లాంటి కూరగాయలు మొక్కలు వేసుకోవచ్చు. వీటికి అందించే నీటిలోనే పోషకాలు కలపడం వల్ల మట్టి అవసరం ఉండదు. మట్టిలో ఉండే పోషకాలు ఈ నీటిలో ఉంటాయి. కనుక మట్టి ప్రసక్తి ఉండదు. ఈ విధానం ద్వారా పెంచే మొక్కలు మనం ఇంట్లో లేకున్నా వాటికి కావలసిన నీటిని తొట్టెలో ఉన్న నీటితో అనుసంధానించడం ద్వారా అవి ఏపుగా పెరుగుతుంటాయి.

నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం

మన దేశంలో వ్యవసాయరంగానికి సుమారు 70 శాతం నీరు అవసరం అవుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలకు కేవలం 23 శాతం నీరు వినియోగమవుతంది. వ్యవసాయరంగంలో నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం ఉపయోగపడుతుంది. గృహాలకు లేదా వ్యవసాయ క్షేత్రాలకు ఈ విధానం అవలంబించాలంటే వారికి అన్ని విధాల సహాయం అందిస్తాను.
Credits : Andhrajyothi

లాభాలు పూసే గులాబీ తోట

  • వరంగల్‌ రైతు వినూత్న ప్రయోగం..
  • ఇతర రైతులకు ఆదర్శం

వంట మారితేనే పంట మారుతుందన్న సత్యాన్ని ప్రభుత్వం.. ప్రజలూ గుర్తించాలి. చిరుధాన్యాలు, పప్పుదినుసుల వినియోగంతో వాటి సాగు పెరగడమేకాదు… ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది.
-ప్రొఫెసర్‌ ఎల్‌.జలపతిరావు, వ్యవసాయ శాస్త్రవేత్త

వర్షాలు పడక, పంటలు పండక చితికిపోయి బతుకు తెరువు కోసం వలస వెళ్లిన ఓ రైతు సరికొత్త ఆలోచన ఇచ్చిన సత్ఫలితంతో ఉన్న ఊరిలోనేఇప్పుడు పూలమ్ముతున్నాడు. ఆయనే వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామవాసి వరికెల హరిబాబు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన విజయగాథ ఇది…
సీతారాంపురం గ్రామంలో జలవనరులు పెద్దగా లేవు. రైతులంతా బోర్లపై ఆధారపడి పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగుచేస్తుంటారు. గ్రామవాసి హరిబాబుకు 3.5 ఎకరాల భూమి ఉంది. ఇతర రైతుల్లాగే ఆయన మొదట సంప్రదాయ పంటలే సాగుచేసి, అందరి తరహాలోనే నష్టపోయాడు. ఆర్థికం గా చితికిపోయి సకుటుంబంగా పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్ళాడు. ఒక చిన్న కంపెనీలో అతితక్కువ వేతనంతో కొంతకాలం పనిచేశాడు. తర్వాత పూలమార్కెట్‌లో గుమాస్తా గా చేరాడు. ఆ వ్యాపారంలోని మెలకువలను గ్రహించాడు. తమిళనాడు, బెంగుళూరు కోల్‌కతానుంచి పెద్దఎత్తున వివిధ రకాల పూలు తీసుకొచ్చే రైతులతో పరిచయంతోపాటు మార్కె ట్‌పై అవగాహన పెంచుకున్నాడు. అటుపైన ఒక మడిగ తీసుకుని తానే వ్యాపారం ప్రారంభించాడు.

సాగుపై ఆలోచన

ఆ సమయంలోనే స్వయంగా పూలసాగును చేపట్టాలన్న ఆలోచన హరిబాబు మదిలో మెదిలింది. వెంటనే స్వగ్రామం గులాబీ తోటకు శ్రీకారం చుట్టాడు. అయితే, అందులో చాలా ఒడిదుడుకులు ఉంటా యని తోటి రైతులు వారించారు. అయినా హరి బాబు వెనక్కు తగ్గలేదు. బెంగుళూరులోని నర్సరీ నుంచి రూ.13 చొప్పున 6500 గులాబీ మొక్కలు తెప్పించి నాటాడు. ఇందు కోసం రూ.1.5 లక్షలు ఖర్చయ్యాయి. వర్షాల్లేక మొదట ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడక పూర్తి శ్రద్ధపెట్టాడు. పొలంలో 4 బోర్లు వేయించాడు. ఇప్పుడు తోట ఏపుగా పెరిగి వివిధ రకాల గులాబీలు గుబాళిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ 100కిలోల దిగుబడి వస్తుండగా దీపావళి తర్వాత 500 కిలోలకు పెరగవచ్చు.

మంచి డిమాండ్‌

పూలను రెండు రోజులకోసారి కోస్తారు. ఒక రోజంతా పూలను సేకరించి మరునాటి తెల్లవారుజా మునే బస్సులో హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తా రు. డిమాండ్‌ను ఒక్కో కోతకు రూ.10వేలదాకా ఆదాయం వస్తోంది. పూలసాగు లాభదాయకమన్న నమ్మకం బలపడిన తర్వాత తమ బంధువులనుంచి హరిబాబు మరో అయిదెకరాలు కౌలుకు తీసుకుని రూ.1.5 లక్షలతో చామంతి సాగు చేపట్టి 70వేల మొక్కలు నాటారు. త్వరలో ఇందులోనూ పంట చేతికి రానుంది. అయితే, హైదరాబాద్‌లోనే ఉంటున్న హరిబాబు ఈ రెండు తోటల పర్యవేక్షణ బాధ్యతనుగ్రామంలోని ఓ రైతుకు అప్పగించాడు.

అయిదేళ్లపాటు పూలు
చీడపీడలు, వైపరీత్యాల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఒక్కో గులాబీ మొక్క గరిష్ఠంగా అయిదేళ్లపాటు పూలుపూస్తుంది. మధ్యలో ఒకసారి కత్తిరిస్తే మళ్లీ ఏపుగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం, నాణ్యతనుబట్టి కిలో గులాబీలకు రూ.100వరకు ధరవస్తుంది. సీజనలో రూ.150దాకా ఉంటుంది. హరిబాబు సాగుచేస్తున్న గులాబీ రకాలు చూడడానికి చిన్నగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా రవాణాకు అనువైనవి. త్వరగా వాడిపోవడం, రెక్కలు రాలిపోవడం ఉండదు. బొకేలు, మాలలు తయారు చేయడానికి అనుకూలం కావడంతో వీటికి మంచి ధర వస్తున్నది. ఈ రైతు అందించిన స్ఫూర్తితో మరికొందరు రైతులు కూడా పూలబాటలో నడిచేందుకు సిద్ధం కావటం విశేషం.

– హన్మకొండ, ఆంధ్రజ్యోతి

రోజూ ఆదాయమే 
గులాబీల సాగులో శ్రద్ధపెడితే లాభాల పంటే. సస్యరక్షణకు అయ్యే ఖర్చు కూడా స్వల్పమే. పూలతోటలను సాగుచేస్తే ఇంట్లో పాడి పశువులున్నట్టే. రోజూ ఆదాయం వస్తుంది ఒక ఎకరం తోట ద్వారా నెలకు గరిష్టంగా రూ.1.50 లక్షల ఆదాయం ఉంటుంది. తోట సాగుకయ్యే ఖర్చులు పోను ఎంతలేదన్నా రూ.75వేలు మిగులుతాయి. గులాబీ తోటలకు కాలువల ద్వారా నీరు పారించడంతో కలుపు విపరీతంగా పెరుగుతోంది. బిందుసేద్యంతో కలుపు బెడద తగ్గుతుంది. కలుపుతీత, పురుగుమందుల పిచికారి ఖర్చు కూడా తగ్గుతుంది. బిందు సేద్యం పరికరాలపై ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఉద్యానవన శాఖకు దరఖాస్తు పెట్టుకున్నాను. మంజూరైతే మరింత లాభదాయకంగా ఉంటుంది.

– వరికెల హరిబాబు, సీతారాంపురం రైతు
Credits : Andhrajyothi

చౌడు నేలలో బంగారం దిగుబడి!

చౌడు భూముల్ని సారవంతంగా మార్చి, పామాయిల్‌ సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఆ రైతు. పామాయిల్‌లో అంతర్‌ పంటలుగా కోకో, నారింజ, నిమ్మ సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఖర్చులు తగ్గించుకుని సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కర్రి రామకృష్ణారెడ్డి విజయగాథ ఇది…
ఆయన వయసు 76. వ్యవసాయంలో ఆయన ప్రయోగాలు చూసి యువకులు సైతం ఔరా అంటున్నారు. చౌడు భూముల్లో పామాయిల్‌సహా వివిధ రకాల పంటలు పండించారు. ఏది సాగుచేసినా లాభాలు పండించడం ఆయన ప్రత్యేకత. ఆ రైతు పేరు కర్రి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడు ఆయన ఊరు. శానిటేషన్‌ కోర్సు చేసిన ఆయన 1998లో రిటైర య్యారు. ఆదినుంచీ వ్యవసాయంపై ఆసక్తిగల ఆయన రిటైరయ్యాక మరింతగా దృష్టి సారించారు. ప్రత్తిపాడులో తన 16ఎకరాల చౌడు భూమిని వ్యవసాయక్షేత్రంగా మలచాలని సంకల్పించారు. వేసవిలో పొలంలో చీమల పుట్టలు పెరిగిన ప్రదేశాలను గుర్తించారు. అక్కడ బోరు వేస్తే నీళ్లుపడతాయని భావించారు. ఆయన అంచనా నిజమైంది. నీళ్లు పడ్డాయి. అలానే మరో మూడు బోర్లువేశారు. దీంతో చౌడు భూమి కాస్తా సస్యశ్యామలమైంది. ఈ భూమిలో 2004 జనవరి లో బిందుసేద్యం పరికరాలు అమర్చి పామాయుల్‌ సాగు చేపట్టారు. ఆరో ఏట నుంచే దిగుబడి వచ్చేలా తోటను అభివృద్ధిచేశారు. దీంతో ఏటా ఎకరాలో 14-15 టన్నుల దిగుబడి సాధించి అందర్నీ ఆకర్షించారు. పామాయిల్‌ తోటలోనే అంతర పంటగా కోకో, నారింజ, నిమ్మ సాగుతో అదనపు లాభం ఆర్జిస్తున్నారు. అంతటితో ఆగక మరో పదెకరాలు తీసుకుని అభివృద్ధి చేశారు.
 

ప్రయోగాలతో ఫలితం
బాల్యంనుంచే ఎన్నో ప్రయోగాలు చేశారా యన. రామాఫలం-సీతాఫలం విత్తనాలు కలిపి నాటి, వేసవిలో ఆ వృక్షాల నుంచి రెండురకాల ఫలాల దిగుబడి సాధించిన ఘనపాఠి ఆయన. ప్రస్తుతం షుగర్‌ఫ్రీ సుగంధ సాంబ వరిని, సుమతి పేరుతో బిర్యానీరైస్‌ను పండించి ఆ కొత్త వంగడాలను రైతులకు అందిస్తున్నారు. అలాగే అరటి, అల్లం, కర్రపెండలం సాగుతో లాభాలు గడిస్తున్నారు. సేంద్రి య పద్ధతిలో అధికదిగుబడి సాధించడంలో ఆయనది అందె వేసిన చేయి. 15 పాడిగేదెలతో డెయిరీకూడా నిర్వహిస్తూ ఘన జీవామృతం, గోమూత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. పొలాల్లో వర్మి కంపోస్టు యూనిట్ల ఏర్పాటుతోపాటు అజుల్లా (నాచు)వంటివి తయా రుచేస్తున్నారు. పశుదాణా ఖర్చును రోజుకు రూ.25నుంచి రూ.2కు తగ్గించగలిగారు. కొన్నిరకా ల మొక్కల ఆకులకు చీడపీడలు ఆశించకపో వడాన్ని గుర్తించారు రామకృష్ణారెడ్డి. ఆదిశగా ప్రయోగాలు చేశారు. ఆ మొక్కలనే చీడపీడల నివారణకు ఉపయోగించి దిగుబడి ఖర్చులు తగ్గించుకోవడంలో విజయం సాధించారు. పామాయిల్‌ తోట మధ్యలోగల మామిడి చెట్టుపై పలు ప్రయోగాలు చేశారు విద్యుద్దీపాల సాయంతో ఆ చెట్టు విరగబూసేలా చేయడంతో పాటు అధిక దిగుబడి సాధించారు. ఏడున్నర పదుల వయసు దాటినా రామకృష్ణారెడ్డి హుషారుగా పొలం పనులు చేసుకుంటారు. యోగసాధన, పరిమిత ఆహారం తన ఆరోగ్య రహస్యాలని చెబుతారాయన.
– ఆంధ్రజోతి, ప్రత్తిపాడు

Credits : Andhrajyothi