కరివేపాకు సాగుతో కాసుల పంట

 • మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మరిన్ని అద్భుతాలు

కరువుతో సతమతమవుతున్న రైతును కరివేపాకు సాగు ఆదుకుంటోంది. కడపజిల్లా జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడులో 350 ఎకరాల్లో రైతులు కరివేపాకు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆరుగాలపు కష్టం దళారుల పాలుకాకుండా ఉంటుందని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.

ప్రభుత్వంనుంచి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుని సాధించుకోవాలంటే రైతులు సంఘటితమై కలిసికట్టుగా నడవాల్సిందే.
– ‘రైతు స్వరాజ్య వేదిక’ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్‌ కుమార్‌ విస్సా. 

కడపజిల్లా ఎస్‌.ఉప్పలపాడు రైతులు కొన్నేళ్లుగా పత్తి, శనగ తదితర పంటలు సాగుచేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పంటలు చేతికందక నష్టాలపాలవుతున్నారు. మరోవైపు సాగు పెట్టుబడి గణనీయంగా పెరిగి, దిగుబడి నామమాత్రమై అప్పుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో గురప్ప అనంతపురంజిల్లాలోని బంధువుల గ్రామానికి వెళ్లి కరివేపాకు సాగుగురించి తెలుసుకున్నాడు. దశాబ్దాలుగా సాగుచేస్తున్న పంటలతో నష్టపోతున్నందున కొత్త పంటవైపు మొగ్గుదామనుకున్నాడు ఆ రెతు. అలా గురప్ప తొలిసారి గ్రామంలో కరివేపాకు సాగుకు శ్రీకారంచుట్టారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంచి లాభాలు గడించడంతో ఇతర రైతులు కూడా కరివేపాకు సాగు చేపట్టి నష్టాలనుంచి గట్టెక్కారు. ప్రస్తుతం ఉప్పలపాడులో 350 ఎకరాల మేర కరివేపాకు సాగవుతుండటం విశేషం.

ధరలో హెచ్చుతగ్గులు

కరివేపాకు సాగుకు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రైతులు విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఎకరాకు 90 కిలోలదాకా విత్తనం కావాలి. ఇందుకోసం రూ.70 వేలు ఖర్చవుతుంది. ఒకసారి విత్తనం వేస్తే నేల స్వభావాన్ని బట్టి రెండుమూడేళ్లకుపైగా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎకరాకు 5 ప్యాకెట్ల ఫాస్పేట్‌ వాడాల్సి వస్తుందని, ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారు. చీడపీడల నివారణకు పది రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. నాలుగు నెలలకు ఒక కోత వంతున ఎకరాకు 6టన్నుల దిగుబడి వస్తుంది. దిగుబడి బాగుంటే 10 టన్నులు కూడా వస్తుంది. ఆకును నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్తే రైతుకు మంచి లాభం వస్తుంది. కానీ, ఎక్కడికి తీసుకెళ్లాలో రైతులకు తెలియకపోవడంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వ్యాపారులు కొందరు పొలం దగ్గరకే వచ్చి కిలోల వంతున కరివేపాకు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.2 వస్తుండగా డిసెంబరు ప్రాంతంలో రూ.15-20దాకా లభిస్తుంది. ఖర్చులుపోగా ఏటా ఎకరానికి రూ.50వేల నుంచి లక్షవరకు ఆదాయం పొందిన రైతులు కూడా ఉన్నారు. ‘‘మా పంటను తక్కువ ధరకు కొని వ్యాపారులు ప్రధాన నగరాల్లో అమ్మి మంచి లాభాలు గడిస్తున్నారని తెలుసు. కానీ, ఏం చేయాలో తెలియక వచ్చినదానితో సరిపెట్టుకుంటున్నాం’’ అంటున్నాడు గురప్ప.

ప్రభుత్వ సహకారంతో మరింత సాగు
ఈ ప్రాంతంలో వందలాది రైతులు కరివేపాకు సాగు చేస్తున్నా దీనికి సంబంధించిన ఉద్యానశాఖ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే గతంలో దీన్ని సాగు చేసిన రైతుల సలహాలతోనే నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తున్నదని వారు చెప్పారు. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తే మెరుగైన దిగుబడులు సాధిస్తామని రైతులు చెబుతున్నారు. కరివేపాకు పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే మేం పడిన కష్టం దళారుల పాలు కాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పంట సాగుకు రుణ సౌకర్యం, బీమా లాంటివి కల్పిస్తే మరింత స్థాయిలో కరివేపాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
– ఆంధ్రజ్యోతి, ప్రొద్దుటూరు 

మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
కరివేపాకు సాగు లాభదాయకంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఈ పంటను సాగు చేయడంలేదు. ఎక్కువ ఖర్చుండదు. టెన్షన్‌ ఉండదు. ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించగలిగితే రైతులకు మరింత ఆదాయం చేకూరుతుంది. మార్కెట్లో ఉన్న రేటు మాకు తెలియడంలేదు. వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చేస్తు న్నాం. కానీ, వారు అధిక ధర లభించే ప్రాంతాల్లో విక్ర యిస్తూ లాభాలు గడిస్తున్నారు.

– కృష్ణ, ఉప్పలపాడు

ప్రభుత్వ మద్దతు కావాలి 
మేం సాగు చేసిన పంటను అధికారులు పరిశీలించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే మరింత దిగుబడి సాధిస్తాం. ఈ పంట సాగుకు రుణ సౌకర్యంతోపాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే ఏ అధికారిని కలువాలనో కూడా మాకు తెలియడంలేదు. ఈ పంట సాగు చేసిన పక్క రైతులను అడిగి వారు చెప్పిన మందును పిచికారీ చేస్తున్నాం.

– హరి, ఎస్‌.ఉప్పలపాడు
Credits : Andhrajyothi

వరి సాగుతో రైతన్నలకు సిరి

 

ఆంధ్రజ్యోతి, బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపంట వరి. దేశ ఆహార భద్రత వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తులో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో మరింత ఎక్కువ దిగుబడులు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుంచి పంటకోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా సాగుఖర్చు తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చునంటున్నారు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 22.11 లక్షల హెక్టార్లలో కాల్వలు, చెరువులు, బావులు కింద వరి పంట సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 68.64 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు రైతన్నలు. సరాసరి ఎకరానికి 1240 కిలోల దిగుబడి లభిస్తున్నది. కోస్తాంధ్రలో సార్వా (ఖరీఫ్‌) జూన్‌ నుంచి నవంబర్‌ వరకు, రాయలసీమలో జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉంటుంది. అదే దాళ్వా అయితే నవంబర్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ఆ ప్రాంతంలోని వర్షపాతం, నీటి లభ్యతమీద ఆధారపడి ఉంటాయి.
 

మేలైన యాజమాన్య పద్ధతులు 
వరి వంగడాల ఎంపిక: వివిధ ప్రాంతాలకు అనువైన వరివంగడాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన ఎంపికలోనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మంచి విత్తనం ఎంపికతో రైతుకు మేలు చేకూరుతుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజిమ్‌ను కలిపి 24 గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంపనారు అయితే లీటర్‌ నీటికి ఒక గ్రాము కార్బండిజిమ్‌ కల్పి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకలను దంపనారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటర్‌ మందు నీరు సరిపోతుంది.

వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించటం: కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజలలోని నిద్రావస్థను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి లీటర్‌నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10మిల్లిలీటర్‌లు గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండెకట్టాలి.

విత్తన మోతాదు: నాటే పద్ధతికి 20 నుంచి 25కిలోలు, వెదజల్లటానికి (భూముల్లో) 24 నుండి 30కిలోలు, వెదజల్లటానికి గోదావరి జిల్లాలో 10 నుండి 12 కిలోలు గొర్రుతో విత్తటానికి (వర్షాధారపు వరి) 30 నుంచి 36 కిలోలు అవసరం ఉంటుంది. శ్రీ పద్ధతిలో అయితే ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఆరోగ్యవంతంగా నారు పెంచటం ఇలా 

 • నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరుపెట్టటానికి, తీయటానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి.
 • 5 సెంట్ల నారుమడికి రెండుకిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, కిలో పొటాష్‌నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
 • మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
 • నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.
 • జింకు లోపాన్ని గమనిస్తే లీటర్‌ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీచేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరిసాగులో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 • విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేద క్లోరోపైరిఫాస్‌ 2మిల్లిలీటర్లు లీటర్‌ నీటికి కలిపి విత్తిన 10రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదంటే నారుతీయటానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.

Credits : Andhrajyothi

పండ్ల తోటల సాగులో మేటి 

రసాయనిక ఎరువులు, పురుగు మందులను పరిమితంగా ఉపయోగిస్తూ, సేంద్రియ ఎరువులు, గోమూత్రం, చెట్ల ఆకుల కషాయాలతో పండ్ల తోటలు సాగుచేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు ఆ రైతు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా మక్కువతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లగొండ జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం ఆశోక్‌రెడ్డి.

పది ఎకరాల ఆసామి అశోక్‌రెడ్డి. ఎనిమిదేళ్ల క్రితం తన పొలంలో పండ్ల తోటల సాగుకు నడుంకట్టారాయన. అందరూ నడిచే దారిలో కాకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ పండ్ల తోటల్లో మంచి దిగుబడులు, అధిక లాభాలు గడిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో వెయ్యి బత్తాయి చెట్లు, 25 జామ, 120 కొబ్బరి, 10 నిమ్మ, 5 సీతాఫల్‌, 10 ఉసిరి, 5 గిరక తాటిచెట్లతో సాగు ప్రారంభించారు అశోక్‌రెడ్డి. మరో 23 ఎకరాల భూమిని లీజ్‌కు తీసుకున్నారు. అందులో 7 వేల దానిమ్మ చెట్లు సాగు చేశారు. బత్తాయి, నిమ్మ, దానిమ్మ మొక్కలు ప్రభుత్వ నర్సరీలనుంచి తెచ్చి నాటారు. మల్లేపల్లి ఉద్యాన శాఖనుంచి బత్తాయిని, సంగారెడ్డి ప్రభుత్వ నర్సరీ నుంచి జామ మొక్కలను, మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ నుంచి సీతాఫల్‌, నిమ్మ మొక్కలను, గిరక తాటిచెట్లను నారాయణపేట నుంచి దిగుమతి చేసుకొని నాటారు. బత్తాయి తోటల్లో రసాయనాలు, ఎరువులు వేసే పద్ధతికి ఆయన స్వస్తి చెప్పారు. సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపారు. ఎకరానికి 25 నుంచి 30 టన్నుల వరకు పశువుల ఎరువు ఉపయోగించారు. పురుగుల మందుకు బదులుగా గోమూత్రం, సీతాఫల్‌, తంగేడు తదితర చెట్ల ఆకులతో కషాయాన్ని తయారుచేసి చెట్లకు 15 రోజులనుంచి నెలలోపు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. దానికితోడు జనుము, జీలుగ విత్తనాలు సాగు చేసి పచ్చిరొట్ట్టగా వాడుతున్నారు. సేంద్రియ సేద్యం మంచి ఫలితాలు ఇవ్వడంతో గోమూత్రం, పశువుల ఎరువు కోసం ఏకంగా 15 దేశవాళీ ఆవులు కొనుగోలు చేశారు ఈ రైతు. గత ఏడాది 140 టన్నుల వరకు బత్తాయి దిగుబడి సాధించి సాటి రైతులకు ఆదర్శంగా నిలిచారాయన. ఎరువులు, రసాయనాల ఖర్చు లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయాన్ని సాధించారు ఈ రైతు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలు సాగు విధానాలను గమనించేందుకు పలువురు ప్రముఖులు సోమారం గ్రామాన్ని తరచూ సందర్శిస్తుండటం విశేషం. – ఆంధ్రజ్యోతి, రాజాపేట (నల్గొండ జిల్లా)

వ్యవసాయం ఓ పండుగ 

పండ్ల తోటల సాగు చాలా లాభదాయకం. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, గోమూత్రం వాడకాన్ని పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. ఖర్చు లు తగ్గి, లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రైతులందరూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచితే పెట్టుబడులు తగ్గి వ్యవసాయం పండుగ అవుతుంది. బత్తాయి మద్దతు ధర ఒకే తీరుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది.
– శీలం అశోక్‌రెడ్డి, సోమారం
Credits : Andhrajyothi

నిలువెత్తు పంటలు! 

 • మట్టి, నీళ్లు లేని సాగు.. ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ 
 • సీజన్‌ ఏదైనా సరే ఏడాదికి 22 పంటలు 
 • 95శాతం తక్కువ నీరు.. 
 • 75శాతం ఎక్కువ దిగుబడి 
 • అమెరికా సంస్థ ఏరోఫామ్స్‌ సాధించిన అద్భుతం 

న్యూయార్క్‌, జూన్‌ 11: మట్టి, నీళ్లు.. ఈ రెండూ లేకుండా పంటలు పండించడాన్ని ఊహించగలమా? ఊహకు కూడా అందని ఈ అద్భుతాన్ని అమెరికాకు చెందిన ఏరోఫామ్స్‌ అనే సంస్థ సాధించింది. గత పుష్కరకాలంగా ‘నిలువెత్తు పంటలు’ పండిస్తోంది. ఏరోఫామ్స్‌ సంస్థ ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌కు రూపకల్పన చేసింది. ఇన్‌డోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ అంటే.. అంటే ఆరుబయట పొలాల్లో కాకుండా ఒక షెడ్డులోపల, నిలువునా అంతస్తులుగా అరలు పేర్చి, ఎల్‌ఈడీ లైట్లు, పొగమంచు సాయంతో పంటలు పండించే విధానాన్ని రూపొందించింది. సూర్యుడు చేసే పనిని ఎల్‌ఈడీ లైట్లు చేస్తే.. నీటి అవసరాన్ని కృత్రిమ పొగమంచుతో తీరుస్తారన్నమాట. ఇలాంటి ఎనిమిది ఇండోర్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌ యూనిట్లను ఆ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. తొమ్మిదోదాన్ని.. ప్రఖ్యాత మన్‌హట్టన్‌ ప్రాంతం నుంచి కేవలం గంట దూరంలో న్యూయార్క్‌లో ఏర్పాటు చేయబోతోంది. 70వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వర్టికల్‌ ఫామ్‌ యూనిట్‌. దీనిద్వారా సాధారణం కన్నా 75 శాతం అధిక దిగుబడి సాధించవచ్చట. అదేసమయంలో సాధారణంగా పంటకు ఉపయోగించే నీటిలో 95 శాతం తక్కువ నీరు ఈ సాగుకు అవసరమవుతుందని ఏరోఫామ్స్‌ చెబుతోంది. ఆ సంస్థ 2004 సంవత్సరం నుంచి ఈ తరహా సాగు చేస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా నియంత్రిత వాతావరణంలో చేసే సాగు కావడంతో.. ఇందులో ఏడాదికి 22 పంటలు పండించే అవకాశం ఉందట.

Credits : Andhrajyothi

ఎంబీఏ చదివి.. అరటి సాగులో మెరిసి..!

 • రంగారెడ్డి జిల్లా రైతు రమేశ్‌కుమార్‌
 • ఎకరాకు ఏటా లక్ష వరకు లాభం
చదివింది ఎంబీఏ. ఉద్యోగం చేస్తూ చేతికి మట్టి అంటకుండా బతికేయవచ్చు. కానీ, రంగారెడ్డి జిల్లా పూడూరు వాస్తవ్యుడు రమేశ్‌కుమార్‌ ఇందుకు భిన్నం. వారసత్వంగా వచ్చిన వ్యవసాయంలో తల్లిదండ్రులకు అండగా అరటి సాగుద్వారా అద్భుత లాభాలు ఆర్జిస్తున్నారు. ఎందరో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రమేశ విజయ గాథ ఇది…
పూడూరు మండలం చీలాపూర్‌ రైతు మరాటి మల్లప్ప కుమారుడు రమేశ కుమార్‌ ఎంబీఏ చదివారు. ఒకరి చేతికింద ఉద్యోగం చేయడంకన్నా తల్లిదండ్రులను చూసుకుంటూ పుట్టిన ఊళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. రమేశ కుటుంబానికి 25 ఎకరాల భూమితోపాటు ఐదు బోర్లున్నాయి. మొదట అందరిలాగానే వర్షాధార పంటలు పత్తి, మొక్కజొన్న తదితరాలు సాగుచేశారు. కానీ, పంటలు బాగా పండినా ఆశించిన లాభం వచ్చేదికాదు. దీనికితోడు వర్ష్షాభావ పరిస్థితుల కారణంగా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే యోచనచేశారు. తన దృఢ సంకల్పానికి ఉద్యానశాఖ నిపుణుల తోడ్పాటు పొందాలని భావించారు. వారితో మాట్లాడిన తర్వాత తనకున్న మంచి సారవంతమైన నల్ల రేగడి పొలంలో తక్కువ నీటితో అరటి సాగు లాభదాయకమని గ్రహించారు.
ఐదు సంవత్సరాల కిందట మొట్టమొదటగా ఐదు ఎకరాల భూమిలో జి.9 రకానికి చెందిన అరటి మొక్కలను తెప్పించి నాటారు. ఒక ఏడాది పంట దిగుబడి మొత్తం పెట్టుబడికి సరిపోయింది. ఆ తరువాత మూడేళ్ల దిగుబడి నుంచి 15 లక్షల రూపాయల లాభం వచ్చింది. ప్రస్తుతం 12 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు రమేశ్‌కుమార్‌. ఈ ఏడాది కూడా ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో టన్నుకు రూ.8 వేల చొప్పున ధర లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల్లో సాగుచేసిన అరటి మొదటి ఏడాది సుమారు 300 టన్నుల దిగుబడి నివ్వగా రూ.24 లక్షల వరకు ఆర్జించారు. ఇందులో రూ. 12 లక్షలు పెట్టుబడిపోగా రూ.12 లక్షలు లాభం వస్తుందని రమేశ్‌కుమార్‌ చెబుతున్నారు.
 

తక్కువ నీటితో అధిక సాగు

ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్‌ పరికరాల ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు రమేశ్‌కుమార్‌. గుంతల తీత, మొక్కల కొనుగోలు, మొక్కలు నాటడం, ఎరువుల కొనుగోలు, బిందుసేద్యం పరికరాలు, పురుగు మందులు, కూలీలు వగైరా ఖర్చులన్నీ ప్రణాళికబద్ధంగా చూసుకోవడం ద్వారా తక్కువనీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చే యడం సాధ్యం అవుతున్నదని రమేశ చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీతో సరఫరా చేస్తున్న డ్రిప్‌ పరికరాలను సద్వినియోగం చేసుకుని పంటలకు నీరు అందిస్తున్నారు. డ్రిప్‌ లేకుండా ఎకరాకు పారే నీటిని డ్రిప్‌ద్వారా మూడు ఎకరాలకు అందిస్తున్నారు. అరటి సాగులో ఎప్పటికప్పుడు సస్య రక్షణ చర్యలు చేపడుతూ తెగుళ్లు సోకకుండా నివారణ చర్యలను కూడా స్వయంగా చేపట్టడం ఆయన ప్రత్యేకత. పొలం దగ్గరే ఇల్లు కట్టుకుని పగలు రాత్రీ తేడా లేకుండా పంటను కంటికి రెప్పల కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నాడు.
 

చీలాపూర్‌ అరటిపై రిలయన్స్‌ ఆసక్తి
ఈ రైతు పండించిన పంటను రిలయన్స్‌ సంస్థ ఆసక్తిగా కొనుగోలు చేస్తోంది. రమేశ్‌కుమార్‌ పండించే అరటి పండ్లు నాణ్యంగా ఉండటంతో ఆయన పంట మొత్తాన్ని ఆ సంస్థ కొనుగోలు చేస్తున్నది. ఏట నేరుగా తోట దగ్గరికి వచ్చి ఆ సంస్థవారే పంటను సేకరించుకు వెళ్తారు. మార్కెట్‌లో ఉన్న అరటి ధర కంటే ఎక్కువ చెల్లించి మరీ ఈ రైతు నుంచి ఆ కంపెనీ వారు ఆరేళ్లుగా అరటిని కొనుగోలు చేస్తుండటం విశేషం. జిల్లాలో వందకుపైగా అరటి తోటలను సందర్శించిన ఆ సంస్థ వారు చీలాపూర్‌ అరటివైపే మొగ్గుచూపారు. ఈ అరటిని సూపర్‌ మార్కెట్లద్వారా విజయనగరం, విశాఖపట్టణం, విజయవాడ తదితర ప్రాంతాలలో నూ విక్రయిస్తున్నారు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక అరటి రైతు నష్టాలపాలైనప్పటికీ నాణ్యమైన పంట దిగుబడితో రమేశ్‌కుమార్‌ మాత్రం మంచి లాభాలు గడించడం విశేషం.
– ఆంధ్రజ్యోతి, పూడూరు (రంగారెడ్డి జిల్లా)

అరటి సాగు ఎంతో మేలు
ఇతర పంటలతో పోలిస్తే అరటి సాగు ఎంతో మేలు. ఒకసారి మొలక నాటితే మూడు నుండి నాలుగేళ్ల వరకు పంట వస్తుంది. ఏడాదికి ఒక పంట వస్తుంది. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కేజీ ధర రూ.8 ఆపై ఉంటే రైతుకు లాభం చేకూరుతుంది. ఈ ఏడాది మాత్రం కేజీ రూ. 5 నుండి రూ.6 మాత్రమే పలికింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే నాణ్యమైన పంటలు పండించవచ్చు. మార్కెట్‌లో మంచి ధర ఉంటే ఎకరాకు రూ.లక్ష వరకు లాభాన్ని పొందవచ్చు.

Credits : Andhrajyothi

క్యాబేజీ సాగు…లాభాలు బాగు 

 • అనంతలో యువరైతు విజయగీతిక 

కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 100 ఎకరాల ఆసామి యుగంధర్‌ సేద్యం గిట్టక డీలా పడిపోయాడు. వ్యవసాయం నుంచి వ్యాపారం వైపు దృష్టి సారించాడు. పెద్ద కొడుకు కట్టా రఘుకిరణ్‌ చౌదరిని ఇంజనీర్‌ను చేయాలనుకున్నాడు. రఘు మాత్రం ఇంజనీరింగ్‌ మధ్యలో వదిలేసి తాతగారు, స్వాత్రంత్య్ర సమరయోధుడు కట్టా రామయ్య స్ఫూర్తితో వ్యవసాయం బాట పట్టాడు. వ్యవసాయం లాభసాటి కాదనే భావనను రెండేళ్లలో మార్చేశాడు. క్యాబేజీ సాగు చేపట్టి సాటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఆ యువరైతు విజయగాథ.
అనంతపురం జిల్లాలో చినుకుపడితే కానీ పంటలు పండవు. బోర్లున్నా అన్ని సీజన్లలో నీరుండదు. అందుకే ఆ జిల్లాలో సేద్యం అంటే గాలిలో దీపం. అలాంటి జిల్లాలో కొత్త ఆలోచనలతో విజయవంతంగా కూరగాయల సాగుచేపట్టాడు రఘు. ‘‘నాన్న నన్ను బీటెక్‌ మెకానికల్‌లో చేర్పించారు. ఎందుకో ఆ మార్గంమీద మనసు పోలేదు. మధ్యలోనే చదువు మానేశాను. నాన్నకు యంత్రాలు, లారీల వ్యాపారం ఉంది. ఆయనకు చేదోడువాదోడుగా సాగు పద్ధతుల్ని గమనించాను. నాన్నగారు పండ్ల తోటల సాగుతో నష్టపోయారు. ఆ దారి లాభం లేదనిపించి కొత్తగా ఏదైనా చేయాలని భావించాను. నిరుడు ఆలూ, టమోటా, బెండ, క్యాబేజి, బీర, ఉల్లి వంటి పంటలను కొద్దిపాటి బోరు నీటితోనే డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో సాగుచేశాను. ఈసారి క్యాబేజీవైపు దృష్టి సారించాను. మంచి దిగుబడి వచ్చింది. నా మీద నాన్నకు నమ్మకం కలిగింది’’ అన్నారు రఘు.

క్యాబేజీ ‘పంట’!

క్యాబేజీ చల్లని ప్రదేశాల్లో బాగా పండుతుంది. రాయదుర్గం ప్రాంతంలో కూడా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో క్యాబేజీ మంచి దిగుబడి వస్తుంది. ‘‘నేను ఏడెకరాల్లో క్యాబేజీ సాగు చేశాను. మంచి దిగుబడే వచ్చింది. బాగా ధర ఉంటే టన్ను రూ.15 వేల దాకా పలుకుతుంది. 5 వేల కంటే ధర తగ్గదు. నేను సాగు చేసిన క్యాబేజీ ఎకరాకు సరాసరిన 25 టన్నులు వచ్చింది. అప్పట్లో ధర టన్ను రూ. 8 వేలు పలికింది. మూడు నెలల పంట ఇది. నాకు సుమారు రూ.5.6 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులుపోనూ కనీసం రూ. 4 లక్షలు మిగిలింది. బోర్లలో నీరు వచ్చే మూడు నెలల కాలంలో అనంతపురం జిల్లా రైతులు క్యాబేజీని సాగు చేసుకుంటే తప్పక లాభాలు వస్తాయి’’ అన్నారు రఘు.

హిమాలయాల ప్రాంతం నుంచి విత్తనాలు

క్యాబేజీ విత్తనాలు హిమాలయాల ప్రాంతాల నుంచే వస్తాయి. ఎకరాకు 100 గ్రాముల నుండి 120 గ్రాముల వరకూ పడతాయి. ఎకరాకు విత్తన ఖర్చు సుమారు. రూ.2500 దాకా అవుతుంది. ముందుగా వాటిని మొలకలుగా నర్సరీ పద్ధతిలో పెంచి నాటుకోవాలి. మూడడుగుల దూరంతో సాళ్లు వేసుకుని డ్రిప్‌ పైపులు సిద్ధం చేసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్యన దూరం 8 అంగుళాలుంటే మంచిది. మీడియం సైజు వస్తుంది. పెద్ద సైజు కావాలనుకుంటే మొక్కకూ మొక్కకు మధ్య అడుగు దూరం కూడా పెట్టుకోవచ్చు. క్యాబేజీ పంటను పసిబిడ్డలా కాపాడుకోవాలి. అలా కాకపోతే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆకులు వచ్చేకొద్దీ పురుగు ఆశిస్తుంది. కీటక నాశని మందులు పిచికారీ చేయాలి. మరోవైపు భూసారంకోసం యూరియా, పొటాష్‌, సూక్ష్మపోషకాలు అందించాలి. మూడునాలుగు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తే మంచి దిగుబడి వస్తుంది.
– ఆంధ్రజ్యోతి, అనంతపురం 

మార్కెటింగ్‌తో మంచి లాభాలు 
సాగుచేసిన 75 రోజుల్లోనే క్యాబేజీ పంట చేతికి వస్తుంది. మూడు నెలల్లో పూర్తిగా పంటను అమ్ముకోవచ్చు. దేశంలోని ముఖ్యమైన మార్కెట్లతో సంబంధాలుంటే మంచి లాభాలకు పంటను అమ్ముకోవచ్చు. నేను అనంతపురం, బళ్లారి, కోలార్‌, బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్‌, ధార్వాడ్‌, బెల్గాంవంటి మార్కెట్ల ధరలను పరిశీలిస్తూంటాను. మాకున్న లారీల్లో ఎప్పటికప్పుడు ధర బాగా ఉన్న మా   ర్కెట్‌కు సరుకు పంపిస్తుంటాను. ప్రస్తుతం క్యాబేజీ ధర బాగుంది. టన్ను రూ. 15వేలు పలుకుతోంది. సరిపడినంత సరుకు లేదు. ఈ సమయంలో రైతు వద్ద క్యాబేజీ సరుకుంటే శ్రమకు మించి ఫలితం లభించినట్టే! 

Credits : Andhrajyothi

ఆముదానికి సూక్ష్మనీటి సేద్యం

       ఆముదం సాగులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ కె రాజారెడ్డి వివిధ సూచనలు ఇచ్చారు. వాటి వివరాలు…

రబీ ఆముదములో ఫిబ్రవరి నెల నుంచి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని 8-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. బోదెలు, కాలువల ద్వారా నీరు ఇవ్వడం వల్ల నీరు వృథా కాకుండా ఉంటుంది. డ్రిప్పు ద్వారా మూడు రోజులకొకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సూక్ష్మనీటి సేద్య పద్ధతుల ద్వారా డ్రిప్పు, స్ప్రింకర్ల ద్వారా ఇస్తే 15-20 శాతం నుండి 40 శాతం దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.

కొమ్మ, కాయతొలిచే పురుగు : ఈ పురుగు ఉధృతి పంట పుష్పించే దశ నుంచి మొదలై పంట పూర్తికాలం వరకూ ఉంటుంది. తొలిదశలో పురుగు కొమ్మలపై, కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటుంది. పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది. తర్వాత దశలో కాయలోకి చొచ్చుకొనిపోయి కాయలను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతదశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి మోనోక్రొటోఫాస్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఇండ్సాకార్బ్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పంటకోత-నిల్వ : ఆముదం పంట అంతా ఒకేసారి కోతకు రాదు. 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. గెలలో 80 శాతం వరకూ కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుంచి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను ఎండబెట్టి వేరుశనగ నూర్చి, యంత్రంతోనే జల్లెడ మార్చుకొని వాడుకోవచ్చు. గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి, గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి.

విత్తనోత్పత్తి : పూత దశలో గెల కింది భాగంలో ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు మాత్రమే ఉన్న మొక్కలను ఉంచి, మిగిలినవి తీసివేయాలి. పూత దశ తర్వాత కాయల లక్షణాలు ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కల్ని పీకేయాలి.

ఆడ, మగ మొక్కల ద్వారా వచ్చే గెలలను వేరువేరుగా కోయాలి. ఆడ మొక్కల నుంచి వచ్చే విత్తనాలను హైబ్రీడ్‌ విత్తనంగా వాడుకోవాలి. మేలైన యాజమాన్యంతో ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ళ హైబ్రీడ్‌ విత్తనం తయారుచేయవచ్చు.

మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ లేదా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ను సంప్రదించండి. 

రైతులు మరిన్ని సలహాల కోసం ఈ ఉచిత నంబరుకూ కాల్‌ చేయవచ్చు-1800 425 0430

డా. కె. రాజారెడ్డి,

విస్తరణ సంచాలకులు,

ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ

విశ్వవిద్యాలయం, గుంటూరు – 522 034.

 

Credits : www.prajasakti.com

వేస‌విలో ప‌శుగ్రాసం

<span ‘times=”” new=”” roman’;=”” font-size:=”” medium;\”=””>                      వేసవి వస్తుందంటేనే పశుగ్రాసం లోటు అధికంగా కనిపిస్తుంది. అందుకే పశుగ్రాసాన్ని పండించుకోవడం ఎంత ముఖ్యమో.. మిగిలిపోయిన పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడమూ అంతే ఉపయోగకరం. అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతులలో నిల్వ చేయవచ్చు. దాన్ని పశుగ్రాస కొరత ఉండే ఎండాకాలంలో పశువులకు మేతగా ఉపయోగించుకోవచ్చు. పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునే పద్ధతులూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్యాధికారులు ఇస్తున్న సూచనలు చూద్దాం.

పశుగ్రాసాన్ని నిల్వచేసే పద్ధతుల్లో ‘హే’ తయారీ, ‘సైలేజి’ తయారీ అని రెండు రకాలుంటాయి.

‘హే’ పద్ధతి:ఈ పద్ధతికి సన్నని మృదువైన కాండం కలిగిన పశుగ్రాసాలు అనుకూలం. ధాన్యపుజాతి గడ్డినీ, గడ్డిజాతి పంటలనూ, లేదా పప్పుజాతి పంటలనూ, పూతదశ కంటే ముందు దశలో కోసి, వాటిని ఎండబెట్టి, కొరత కాలంలో వాడుకోవడం ఈ పద్ధతిలో కనిపిస్తుంది. ‘హే’ గడ్డి లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు, కొమ్మలతో తడి లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని నిల్వచేసే పద్ధతుల్లో ఇది చాలా తేలికైనది. ఈ పద్ధతిలో గ్రాసంలోని నీటి శాతం బాగా తగ్గేవరకూ ఎండనివ్వాలి. పూయకుండా, బూజు పట్టకుండా ఉండేలా తేమ శాతాన్ని తగ్గించాలి. పప్పుజాతి గ్రాసాలతో కలిపి లేదా కలపకుండా ‘హే’ను తయారుచేసుకోవడంలో రెండు పద్ధతులున్నాయి.

సాధారణ పద్ధతి : పొలంలోనే పనలుగా వేసిన గడ్డిని బాగా ఎండబెట్టాలి. ‘హే’ తయారుచేయడానికి పంటను మంచు బిందువులన్నీ ఆవిరి అయిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన గడ్డిని పొలం లోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి బోద పనలను తిప్పుతుండాలి. తేమ 40 శాతం వరకూ వచ్చిన తర్వాత తేలికగా ఉండే కుప్పలుగా వేయాలి. తర్వాత రోజు మళ్ళీ తేమ 25 శాతం వచ్చే వరకూ వాడనివ్వాలి. ఇలా ఎండిన గడ్డిని సుమారు 20 శాతం తేమ ఉండేలా చూసుకొని, నిలువ చేసుకోవాలి. వర్షాకాలంలో షెడ్స్‌లో ఈ గడ్డిని వాడబెట్టి ‘హే’గా తయారుచేయాలి.

యాంత్రిక పద్ధతి : ఈ ప్రక్రియలో ఇనుప కంచెలను ఉపయోగించి, తయారు చేసిన ఫ్రేములలో గడ్డిని ఎండబెడతారు. బర్సీము, లూసర్న్‌ గడ్డిని ఈ విధంగా ఎండబెట్టవచ్చు. ఇలా ఎండబెట్టడం వల్ల 2-3 శాతం మాంసకృత్తులు మాత్రమే నష్టం అవుతాయి. ఆలస్యంగా కోతలు కోయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. పప్పుజాతి మొక్కలలో కోతదశలో, ఆకులు, కాయలు ఎండి రాలిపోతాయి. వాడనివ్వడం వల్ల కెరోటిన్‌, క్లోరోఫిల్‌ పరిమాణం తగ్గిపోతుంది.

సైలేజి’ (మాగుడు గడ్డి) :సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అధిక దిగుబడినిచ్చే పచ్చిమేతను ముక్కలుగా చేసి, గాలి లేకుండా పులియబెట్టి, నీరు కూడా లేకుండా ఉండే స్థితిలో నిల్వ చేయడాన్ని ‘సైలేజి’ అంటారు. ఆక్సిజన్‌ కూడా లేని పరిస్థితిలో నిలువ చేయడం వల్ల పశుగ్రాసంలోని నీటిలో కరిగే పిండిపదార్థాలన్నీ, ఆర్గానిక్‌ ఆమ్లాలుగా మారి, గ్రాసపు ఆమ్ల పరిమాణాన్ని పెంచుతాయి. ఈ పరిస్థితుల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగలేవు. దీనివల్ల పోషకాహార నష్టం జరగకుండా నాణ్యత పెరుగుతుంది. పశువులు దీన్ని చాలా ఇష్టంగా తింటాయి. బాగా అరిగించుకుంటాయి కూడా. ‘సైలేజీ’ నాణ్యత గడ్డిలోని ఎండుపదార్థం, కరిగే తీపి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ముడి మాంసకృత్తు లకు తీపి పదార్థాల నిష్పత్తీ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పంటను 50 శాతం పూతదశలో కోసినపుడు, లేదా పాలదశలో కోసినపుడు తయారుచేసే ‘సైలేజి’ మంచి నాణ్యత కలిగి ఉంటుంది. మొక్కజొన్న, జొన్న, సజ్జ, మొదలైన పంటలను 50 శాతం పూతదశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి. నేపియర్‌ గడ్డి అయితే 45-50 రోజుల వ్యవధిలో, ఇతర గడ్డినీ పూతదశలో కోసి, సైలేజీకి ఉపయోగించాలి.

 

సైలేజి తయారీ: నీటి ఊటలేని ఎత్తయిన ప్రదేశంలో పాతర తవ్వి, వాటి అడుగు భాగాన, పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. చాప్‌కట్టర్‌తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి, ట్రాక్టరుతో నడిపి, పాతరలో గాలి లేకుండా చేయాలి. ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి, 2 కిలోల రాతి ఉప్పు పొరల మధ్య చల్లాలి. పాతరను భూమికి 2-3 అడుగుల ఎత్తుకు నింపి, దానిపై మందపాటి పాలిథీóన్‌ షీట్‌ లేదా వరిగడ్డినిగానీ పరచి మట్టి, పేడ మిశ్రమంతో పూత పూసి (అలికి) ఏమాత్రం గాలి, వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్తపడాలి. గోతులను నింపే ముందు గోతుల అడుగుభాగం పక్కలకు వరిగడ్డి వేస్తే పాతర గడ్డి వృధా కాకుండా ఉంటుంది. లేనట్లయితే గాలి, నీరు సోకిన పాతరగడ్డి బూజుపట్టి చెడిపోతుంది. ఇలా నిల్వచేసిన గడ్డి త్వరగా రసాయనిక మార్పుకు గురవుతుంది. మంచి గడ్డి లేత పసుపుపచ్చ రంగులో మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. చెడిపోయిన మాగుడు గడ్డి ముదురు గోధుమరంగు లేదా నలుపు రంగులో పులుపు వాసనతో ఉంటుంది.

సౖౖెలేజీ పిట్‌: మూడు నెలల్లో ఐదు పాడి పశువులకు 12 టన్నుల సైలేజీ అవసరమవుతుంది. ఒక ఘనపుటడుగు గుంతలో తయారుచేసిన సైలేజీ బరువు 15 కిలోలు ఉంటుంది. 15 టన్నుల సైలేజీ తయారుచేయడానికి 1000 ఘనపుటడుగుల పాతర కావాలి. ఇందుకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవున్న గుంతను తవ్వుకోవాలి. సైలేజీ తయారీకి పచ్చిమేతలో 60 శాతం మించి నీరు ఉండరాదు. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను కంకి, గింజ గట్టి పడుతున్న సమయంలో.. నేపియర్‌ గడ్డిని ముదరనిచ్చి, సైలేజీ చేయడానికి వాడుకోవాలి

 

మాగుడుగడ్డి వాడుక : అలవాటుపడే వరకు పశువులు సైలేజీని తినకపోవచ్చు. పాలు పితికిన తర్వాత లేదా పాలు పిండడానికి నాలుగు గంటల ముందు సైలేజీని పశువులకు మేపాలి. లేకపోతే పాలకు సైలేజీ వాసన వస్తుంది. పాడిపశువు ఒక్కింటికి సుమారుగా 20 కిలోల సైలేజీని ఇతర ఎండుమేతతో కలిపి మేపాలి. పాతర వేసిన గడ్డి రెండు మూడు నెలలకు మాగి, కమ్మటి వాసన కలిగిన సైలేజీగా తయారవుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2-3 సంవత్సరాల వరకూ చెడిపోకుండా సైలేజీని నిల్వ ఉంచుకోవచ్చు. సైలేజీ గుంత తెరిచిన తరువాత నెలరోజులలోపు వాడుకోవాలి. లేని యెడల ఆరిపోయి చెడిపోతుంది. మొత్తం కప్పునంతా ఒకసారి తీయకుండా ఒక పక్క నుంచి బ్రెడ్‌ ముక్కల్లాగా తీసి వాడుకోవాలి.

Credits : www.prajasakti.com

చిన్నరైతుకు పట్టు సిరులు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు రైతులు మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టుసాగును మరింత ఆకర్షిణీయంగా మార్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వారావుపేట, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో రైతులు మల్బరీ సాగుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన 60 మంది రైతులు 145 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. ప్రభుత్వం మల్బరీ సాగుపై ప్రత్యేక శద్ధ చూపడం, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరింతమంది రైతులు పట్టు సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.
పట్టు సాగు వల్ల ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. నీటి వసతి తక్కువగా వున్న ప్రాంతాల్లో కూడా, అతి తక్కువ పెట్టుబడితో దీనిని సాగు చేయవచ్చు. చౌడు, నల్లరేగడి భూములు మినహా మిగతా అన్ని రకాల భూముల్లో, అన్ని కాలాల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా మంచి ఆదా యం పొందే వీలు కూడా వుండటంతో పలువురు రైతులు పట్టు సాగు చేపడుతున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం ద్వారా పట్టు పురుగుల పెంపకం గది(షెడ్డు) నిర్మాణానికి రూ.1.03 లక్షలు అందిస్తోంది.
సాగు ఖర్చుల కోసం మొదటి ఏడాది రూ.50,468, రెండో ఏడాది రూ.44,269 చొప్పున రైతుకు ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ, సన్న చిన్న కారు రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి రూ.3.49 లక్షలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటను రెండు లేదా మూడు భాగాలుగా సాగు చేస్తే ఏడాదిలో 10-11 పంటలు తీసే వీలుంటుంది. ఆధునిక పద్ధతులలో రేరింగ్‌ గది నిర్మించి తగినన్ని పరికరాలు ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరి, జనగామ జిల్లాలోని జనగామలో పట్టుగూళ్లు మార్కెట్లున్నాయి. ఇక్కడ గూళ్ల నాణ్యతను బట్టి ధరలుంటాయి. బీవీ పట్టు గూళ్లపై కిలో రూ.75, సీ, బీ, గూళ్లపై కిలో రూ.40 ప్రభుత్వం ప్రోత్సాహంగా అందజేస్తోంది. ఏడాదికి 20-30 వేలు పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు వరకు సంపాదించుకొనేందుకు అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
అధిక లాభాలు
ఎకరంలో మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచడం వల్ల 45 రోజుల్లోనే రూ. 2.84 లక్షలు ఆదాయం వచ్చింది. గతంలో పత్తి సాగు చేసేవాడిని. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఈ ఏడాది పట్టు సాగు చేశా. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయం మల్బరీ పంట.
ఎం.ముకుందరెడ్డి, లక్ష్మీపురం రైతు
మల్బరీ సాగు మేలు
సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు ఎంతో లాభదాయకం. పెట్టుబడి తక్కువ. ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది. పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి, పట్టు గూళ్లు పెంచకోవడం శ్రేయస్కరం.
credits : AndhraJyothi 02-03-2018