అకాల వర్షంతో వరికి మెడవిరుపు

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు ఇప్పటికే కోతకు వచ్చిన లేదా గింజ గట్టిపడే దశలో ఉన్న వరిపైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో వరి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌. జగదీశ్వర్‌.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరిపంట పడిపోయి, గింజ రాలిపోయింది. ఆలస్యంగా నాటిన రబీ వరిపైరు పూత దశలో ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పుప్పొడి రాలి ఫలదీకరణం చెందలేదు. మరికొన్నిచోట్ల మెడవిరుపు తెగులు, సుడిదోమ, వరి ఈగ వలన పైరుకు కొంత మేర నష్టం వాటిల్లింది. వరిలో ఈ సమస్యలను అధిగమించేందుకు తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి.
 •  కోతకు సిద్ధంగా ఉండి పడిపోయిన వరి పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసెయ్యాలి.
 •  గింజ మొలకెత్తకుండా, రంగు మారకుండా ఉండేందుకు అయిదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల ఉప్పును ఒక లీటరు నీటిలో కలిపి) వరి పనలపైన పిచికారీ చేయాలి.
 •  పూత దశ నుండి గింజ గట్టిపడే దశలో ఉండి నేలకొరిగిన పంటను వీలైనంత వరకు నిలబెట్టి జడల మాదిరిగా కట్టాలి.\
 •  ఈ పరిస్థితుల్లో వరి పైరులో వివిధ రకాలైన శిలీంద్రపు బూజు తెగుళ్ళు పెరిగి గింజలు నాణ్యతను కోల్పోతాయి. వీటిని నివారించడానికి ప్రొపికొనజోల్‌ 1.0 మిల్లీలీటరును లీటరు నీటకి కలిపి ఒకసారి పిచికారీ చేయాలి.
 •  ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఆలస్యంగా నాటిన వరి పైరుకు మెడవిరుపు తెగులు ఉధృతి ఇంకా పెరుగుతుంది. దీనిని ముందస్తుగా నివారించడానికి కానుగామైసిన్‌ 2.5 మి.లీ. లేదా ఐసోప్రొథయెలేన్‌ 1.5 మి.లీ. లేదా ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.- ఈ అకాల వర్షాలకు రెల్ల రాల్చు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కనుక దీని నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ., డైక్లోరోవాస్‌ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.

Credits : Andhrajyothi

 

పుట్టగొడుగుల పెంపకం.. నిత్యం ఆదాయం

స్వయంకృషితో పాలపుట్టగొడుగులు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఆవిరిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి ప్రసన్న. ఆరోగ్యశాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూనే  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.
తక్కువ పెట్టుబడితో, కూలీల ఖర్చు లేకుండా పుట్టగొడుగుల్ని ఎవరైనా పెంచుకోవచ్చు. పట్టణాల్లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ వుండటంతో మార్కెటింగ్‌ ఇబ్బందులు కూడా లేవు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు పుట్టగొడుగులు పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. తొలుత ఎండుగడ్డిని అంగుళం సైజులో ముక్కలు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అనంతరం గడ్డిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన గడ్డిని 20 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టుకోవాలి. పాలిథిన్‌ కవర్లను సంచులుగా తయారుచేసుకుని ఆరబెట్టిన గడ్డిని ఐదు వరసలుగా నింపాలి. సంచుల్లో కొద్దిపాటి గడ్డివేసి దానిపైన విత్తనాలు, మరలా దానిపై గడ్డి, దానిపై విత్తనాలు ఇలా ఐదు వరసలుగా సంచిని నింపుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన సంచిని గాలి ఆడకుండా గట్టిగా మూసి ఉంచాలి. ఆ సంచికి 25 చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఆ సంచులను 21 రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి. పుట్టగొడుగుల తయారీలో భాగంగా మట్టిని సేకరించి దానిని నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన మట్టిలో చాక్‌ పౌడర్‌ కలపాలి. తదుపరి డార్క్‌ రూమ్‌లో ఉంచిన బ్యాగులను 21 రోజుల తర్వాత బ్యాగును సగానికి కట్‌ చేసి తయారుచేసుకున్న మట్టిని నింపాలి.
అనంతరం ఈ బ్యాగులను వెలుతురు గదుల్లోకి మార్చాలి. 24 గంటల గడిచిన తర్వాత రోజుకు రెండుపూటలా పల్చగా తడుపుతూ ఉండాలి. 15 రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తుతాయి. ఈ ప్రక్రియ మొత్తంలో 40 రోజులకు పుట్టగొడుగులు పూర్తిస్థాయిలో తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులు రెండు నెలలపాటు కోసుకోవచ్చు. కేజీ విత్తనాలతో ఐదు కిలోల పుట్టగొడుగులు తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులను ఆన్‌లైన్‌ ద్వారా కిలో రూ.200లకు హైదరాబాద్‌, కాకినాడ, విజయవాడలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ అకౌంట్‌లో ముందుగానే డబ్బులు వేస్తారని, అనంతరం వారి అడ్రస్‌ ప్రకారం సరుకులు పంపిస్తామని తెలిపారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆవిరిపూడి (కూచిపూడి)
నెలకు 20 వేల ఆదాయం
కూలీలపై ఆధారపడకుండా కుటుంబసభ్యులే పనిచేసుకుంటే నెలకు రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎక్కువ విస్తీర్ణంలో పుట్టగొడుగుల పెంపకాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నాను. –
ప్రసన్న
Credits : Andhrajyothi

ఆధునిక సాగుతో.. ఖర్చు సగమే..

 •  యంత్రాలతో సాగు
 •  సమయం, డబ్బు ఆదా
(వలిగొండ):నేడు వ్యవసాయంలో యాంత్రీకరణ తో కొందరు రైతులు శ్రమను, డబ్బును ఆదా చేసుకొని మంచి దిగుబడిని సా ధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను వదిలి పెడుతున్నారు. ధాన్యం నాన బెట్టే దశ నుంచి దిగుబడి సాధించి అమ్మేవరకు ఆధునిక పద్ధతిలో పలువు రు రైతులు వ్యవసాయం చేస్తూ ఆద ర్శంగా నిలుస్తున్నారు. రైతుల విజ యం వారి మాటల్లోనే. 
యంత్రంతోవరి నాట్లు వేశా…
గొల్నెపల్లి గ్రామ పరిధిలో నాకు ఐదె కరాల ఎకరాల భూమి ఉంది. దీనిలో నాలు గు ఎకరాల్లో వరిని సాగు చేశా. కూలీల కొర త తీవ్రమవడంతో నెల్లూరు ప్రాంతం నుం చి అద్దెకు వరిని నాటు వేసే యంత్రాన్ని తెచ్చి దాంతో వరిని నాటా. ముందుగా పాలిఽథీన్‌ కవర్‌ను నేలపై పరిచి దానిపై 5 ఎంఎం మట్టిని పోసి వరి విత్తనాలను చల్లా. దానిపై మట్టిని ఎరువును కలిపి పైన వేశా. సరిపడే పరిమాణంలో నీటితో తడిపా. 20 రోజులు నీరు పోసిన తదుపరి వరి ధాన్యం మొలకెత్తాక వరినాటు యంత్రంపైకి ట్రేలలో అమర్చి పొలంలో నాటా. నాలుగు గంటల్లో వరినాటడం పూర్తయింది. ఈ పద్ధతిలో ఒక ఎకరం పొలంలో 10 కిలోల వరి విత్తనాలు నాటడానికి యంత్రం అద్దెకు రూ.3,500 ఖర్చయింది.. వరిపైరు కూడా గతంలో కంటే బాగా ఉంది. గతంతో కూలీలతో నాటు వేస్తే రూ.5వేలు ఖర్చయింది. ఎకరం నాటుకు రూ.1,500 వరకు ఆదా అయింది.
కణతాల వెంకట్‌రెడ్డి, రైతు, గొల్నెపల్లి, వలిగొండ
డ్రమ్‌సీడర్‌తో వరినాటు వేశా..
నాకు వెలువర్తి పరిధిలోనాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. మూడ ఎకరాల్లో వరిని సాగు చేశా. ఎకరంలో పత్తిని సాగు చేశా. తమిళనాడు రాష్ట్రంలోని రైతులు డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నారని తెలుసుకుని అదే పద్ధతిలో నాట్లు వేశా. విత్తనాల ను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత మరో 24 గంటలు నీటి నుంచి బయట వేసి బస్తాలపై వరిగడ్డితో కప్పి ఉంచా. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను డ్రమ్‌ సీడర్‌ యంత్రంలో పోసి చదును చేసిన పొలంలో నాటా. ఒక ఎకరం భూమికి వేయి రూపాయలు ఖర్చయింది. నాకు నాలుగు వేలు ఆదా అయింది. రెండేళ్ల నుంచి ఇదే పద్ధతి అనుస రిస్తున్నా. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబ డి వచ్చింది. కోనో వీడర్‌ అనే కలుపు తీసే యంత్రంతో కలుపును తీస్తున్నా. ఈయంత్రం మొత్తం ఖరీదు రూ.8వేలు మాత్రమే.
రామ్మూర్తి, రైతు, వలిగొండ
వరి విత్తనాలను వెదజల్లుతున్నా..
నీరు సమృద్ధిగా ఉన్న వ్యవసాయ భూముల్లో విత్తనాలను వెదజల్లవచ్చు. విత్తనాలను బస్తాలలో కట్టి నానబెట్టాలి. 24గంటల తర్వాత విత్తనాలు మొలకెత్తగా మరో 24గంటలు వరిగడ్డితో కప్పి ఉంచాలి. అనంతరం చదును చేసిన పొలంలో నేరుగా వెదజల్లాలి. ఇది పురాతన పద్ధతి. నీటి వినియోగం తక్కువ. విత్తనాల ఖర్చు, కూలీ ఖర్చు కూడా తగ్గుతుంది. పంట 15 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. ఇలా వెదజల్లడంతో ఒక ఎకరానికికి రూ.6 వేలు ఆదా అయింది. వరిపైరును ఏ చీడపీడలు అంతగా ఆశించలేదు. ఆరుతడి పంటగానైనా వెదజల్లే పద్ధతిని అనుసరించవచ్చు. మందుల ను పిచికారి చేసి కలుపును నివారించవచ్చు.
 భీమిడి యాదిరెడ్డి, గొల్నెపల్లి, వలిగొండ
Credits : Andhrajyothi

యాపిల్‌ బేర్‌తో లాభాలసిరి

 • మామిడికి ప్రత్యామ్నాయంగా పెరుగుతున్న ఆదరణ
గ్రీన్‌ యాపిల్‌, గంగరేగి సంకరంగా రూపొందించిన కొత్త వంగడం యాపిల్‌ బేర్‌ పండు రైతులకు లాభాలు పండిస్తోంది. మెట్ట రైతుకు మామిడికి ప్రత్యామ్నాయ పంటగా ఇది మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే వీలున్న యాపిల్‌బేర్‌ సాగు వేగంగా విస్తరిస్తున్నది.
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలో యాపిల్‌ బేర్‌ సాగు క్రమంగా విస్తరిస్తున్నది. మామిడిరైతుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా వుండటం, ఉద్యాన శాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఈ పంట సాగు వేగంగా విస్తరి స్తున్నది. ఈ పంటను అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. తెగుళ్ళను తట్టుకునే గుణం వుండటం, యాపిల్‌బేర్‌ కాయలు ఎక్కువ కాలం నిల్వ వుండే అవకాశం కూడా వుండటంతో రైతులు దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
కొత్త రకం ఫలం కావడంతో వినియోగదారుల నుంచి కూడా దీనికి మంచి గిరాకీ ఉంది. ఎకరాకు 400 నుంచి 600 మొక్కల వరకు నాటుతున్నారు. ఈ మొక్కలు నాటిన ఆరు మాసాల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు మినహా శీతాకాలం, వర్షాకాలాల్లో ఏడాదికి రెండు దిగుబడులను ఇస్తోంది. ఎకరాకు రూ.40 వేల పెట్టుబడి పెడితే 16 నుండి 24 టన్నుల దిగుబడి వస్తోంది.
యాపిల్‌బేర్‌ కాయలు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజి ధర రూ.50లు పలుకుతుండగా రైతులకు రూ.20లు చొప్పున గిట్టుబాటు అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఏళ్ళు గడిచేకొద్దీ దిగుబడి పెరగడంతో పాటు రైతులకు నికరలాభం పెరుగుతోంది. కేజీకి రూ.20లు ధర పలికితే ఎకరాకు ఏటా మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ ఆదా యం లభిస్తోందని రైతులు చెప్తున్నారు. నాటిన మొక్కలు 20 ఏళ్ళ వరకు దిగుబడిని ఇస్తాయంటున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ పంట సాగుకు హెక్టార్‌కు రూ.14వేల వరకు రాయితీ ఇవ్వడంతో పాటు డ్రిప్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
‘‘యాపిల్‌బేర్‌ వంగడాన్ని జంగారెడ్డిగూడెం నుంచి తెచ్చి ఆరుమాసాల కిందట సాగు చేపట్టా. ఇప్పటికి నెలరోజుల నుంచి కాపు వస్తోంది. చిన్నచెట్లకే 10 నుండి 30 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు 600 మొక్కలు సాగుచేశా. అందులో బంతి, వంగ వంటి ఆరుతడి పంటలు కూడా వేశాను. తోట ఐదేళ్లు పెరిగేసరికి ఎకరాకు 50 టన్నులు దిగుబడి వచ్చేలాగా ఉంద’’న్నారు కనసానపల్లి రైతు ఆలూరి సాంబశివరావు.
Credits : Andhrajyothi

రైతు ఇంటికే ఎరువులు

 • ఆన్‌లైన్‌ బుకింగ్‌తో ఉచిత డెలివరీ
ఆన్‌లైన్‌ ద్వారా తమకు నచ్చిన వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసుకునే అవకాశంతో పాటు వాటిని ఉచితంగా రైతు ఇంటికే పంపించే సదుపాయాన్ని ఇండియన్‌ ఫార్మర్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(ఇఫ్కో) కల్పిస్తోంది. ఇందుకోసం ఇండియన్‌ కోఆపరేటివ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం www.iffcobazar.in అనే వెబ్‌సైట్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది తెలుగుతో సహా 13 భాషల్లో ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా నీటిలో కరిగే రసాయన ఎరువులు, ఆగ్రో కెమికల్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కొనుగోళ్లు జరిపే ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ ఐదు కిలోల లోపు ప్యాకెట్లుగా ఉంటాయి. వీటిని కొనుగోలు చేసిన రైతులకు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇంటికి పంపుతామని ఇఫ్కో ప్రకటించింది.
ఫైబర్‌ నెట్‌తో ప్రకృతి సేద్యంపై శిక్షణ
రాష్ట్రంలో ఫైబర్‌నెట్‌ సాయంతో ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించదలిచిన సీఎం చంద్రబాబు ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పద్మశ్రీ పాలేకర్‌కి శిక్షణా కార్యక్రమాల బాధ్యత అప్పగించారు. రాష్ట్రంలోని 13వేల గ్రామాల్లో ఫైబర్‌నెట్‌ ద్వారా నెలకోసారి శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఈ ఏడాది జూన్‌లోగా ప్రకృతి సేద్యంపై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు ఏర్పాటుచేసి, రైతులకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Credits : Andhrajyothi

ఏజెన్సీకి రబ్బరు మెరుపులు!

 • మారేడుమిల్లిలో 90 హెక్టార్లలో సాగు
 • 40 ఏళ్ల తరువాత రబ్బరు కలప రెడీ
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రబ్బరు తోటల సాగు గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. మారేడుమిల్లి మండలం దేవరాపల్లి, పూజారి పాకలు గ్రామాల్లో 90 హెక్టార్లలో రబ్బరు సాగవుతున్నది. మార్కెట్‌లో మంచి ధర వస్తే రబ్బరు సాగు మరింత లాభదాయకం అంటున్నారు రైతులు.
మారేడుమిల్లి మండలంలోని దేవరాపల్లి గ్రామంలో కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 1994-99 మధ్యలో 50 హెక్టార్లలో రబ్బరు తోటల సాగు మొదలైంది. ఒకేచోట రబ్బరు తోటల సముదాయం పథకం కింద 35 మంది గిరిజన రైతులతో రబ్బర్‌ గ్రోయర్స్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటుచేసి 50 హెక్టార్లలో రబ్బరు మొక్కల పెంపకం ప్రారంభించారు. 1998లో పూజారిపాకలలో మరో 40 హెక్టార్లలో 32 మంది రైతులు రబ్బరు సాగు చేపట్టారు. ఈ మొక్కలు వేసిన 10వ ఏడాది నుంచి 40 ఏళ్ల వరకు మాత్రమే పాలు వస్తాయి. మొదట్లో రబ్బరు రైతులకు ఆదాయం వుండదు కాబట్టి పని చేసిన రోజున, రోజుకు రూ.40 వంతున గౌరవ వేతనం చెల్లించారు.
2008 నుంచి చెట్లకు పాలు రావడం మొదలైంది. ఈ చెట్లు ఏపుగా పెరగడానికి యూరియా, పొటాషియం ఎరువుగా వేశారు. హెక్టారుకు సుమారు 490 చెట్ల వరకు ఉంటాయి. చెట్టు మొదటి భాగంలో పెచ్చులు ఊడేటట్టు కత్తితో కోస్తారు. అక్కడ నుంచి చిన్న దారి కింద వరకు గీస్తారు. అక్కడ ఒక కప్పును కడతారు. ఈ పాలు నెమ్మదిగా కారుతూ వచ్చి ఈ కప్పులో పడతాయి. వీటిని రెండు రోజులకు ఒకసారి తెల్లవారుఝామున మూడు నుంచి 7 గంటల వరకు సేకరిస్తారు. ఈ చెట్లకు ఆగస్టు నుంచి జనవరి వరకు మాత్రమే పాలు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి రోజుకు లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు వస్తాయి.
ఈ ప్రాంతంలో రబ్బరు తోటలను ఐటీడీఏ 1968లోనే ఆరు వేల హెక్టార్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. మార్కెట్‌ చేయలేకనో, పర్యవేక్షణ లోపమో కానీ కాలక్రమంలో ఆ తోటలను గాలికి వదిలేసింది. ప్రస్తుతం సుమారు 600 హెక్టార్లలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి. వీటి లావు 100 సెంటీమీటర్లు అయ్యింది. వీటిని ప్రస్తుతం కలపగా ఉపయోగించుకోవచ్చు. రబ్బరు చెట్టు 40 ఏళ్ల తరువాత కలపగా బాగా ఉపయోగపడుతుంది. అయితే రబ్బరు కలపను ప్రొసెసింగ్‌ చేసే రబ్బరు ఉడ్‌ ఫ్యాక్టరీ కేరళలో మాత్రమే వుంది. మన దగ్గర ఆ అవకాశం లేకపోవడంతో రెండు వేల మంది రైతులు ఈ పంట నుంచి ఏ ఫలితం రాక వాటిని వదిలేశారు. ఐటీడీఏ చొరవ తీసుకుంటే పెరిగిన చెట్ల నుంచి వేలాది మంది రైతులకు ఆదాయం వస్తుంది.
రబ్బరుకు గతంలో కేజీకి రూ. 234 ధర వుండేది. ఇప్పుడు 126కు పడిపోయింది. వియత్నాం, మలేషియా, థాయిలాండ్‌ నుంచి దిగుమతులు పెరగడం ధరల పతనానికి కారణం. మన దేశంలో కేరళలో రబ్బరు అధికంగా సాగవుతుంది. వర్షపాతం ఎక్కువగా వుండి, ఉష్ణోగ్రతలు తక్కువగా వుండటం కేరళ ప్రత్యేకత. తూర్పు ఏజెన్సీలో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కూడా రబ్బరు రైతులకు ప్రతికూలంగా మారాయన్నారు రబ్బర్‌ బోర్డు ఫీల్డ్‌ ఆఫీసర్‌ జగన్మోహన్‌రెడ్డి.
రబ్బరు తయారీ ఇలా..
రబ్బరు చెట్ల నుంచి సేకరించిన పాలను ప్రొసెసింగ్‌ యూనిట్లకు తీసుకువస్తారు. అక్కడ రెండు లీటర్లు నీళ్ళు, రెండు లీటర్లు పాలు కలిపి ఒక ట్రేలో వేస్తారు. అంతకుముందే 5 లీటర్ల నీళ్ళలో 50 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ను కలిపి ఒక ట్రేలో ఉంచుతారు. అందులో 200 నుంచి 250 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ కలిపిన నీళ్ళను పాలలో కలుపుతారు. ఒక రోజంతా ఆ ట్రేలోనే ఉంచుతారు. తెల్లవారేసరికి పెరుగులా తోడుకుంటుంది. ఒక తెల్లటి షీట్‌ వస్తుంది. దాన్ని మిషన్‌లో రోలింగ్‌ చేస్తారు. తరువాత ఒకరోజు ఆరబెడతారు. ఆ షీట్‌ను నాలుగు రోజుల పాటు స్మోక్‌ హౌస్‌లో పెడతారు. తరువాత అది తేనె కలర్‌లోకి మారుతుంది. షీట్‌ను వేరు చేసి మార్కెట్‌కు తరలిస్తారు. దాన్ని ఫ్యాక్టరీ వారు కొనుక్కొని రబ్బరు వస్తువులు తయారు చేస్తారు. దీన్ని సియట్‌, ఎంఆర్‌ఎఫ్‌ వంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
లాభదాయకమే
రబ్బరు సాగు లాభదాయకంగా ఉంది. రోజూ ఆరు నుంచి ఏడు గంటలు పనిచేస్తాం. ఎవరికి వారే రబ్బరు పాలు సేకరించి, షీట్లు తయారు చేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఆరు టన్నుల రబ్బరు షీట్లు అమ్మాం. మంచి ధర వుంటే మరిన్ని లాభాలు వచ్చేవి.
– చిన్నారెడ్డి, లక్ష్మి, రైతులు, దేవరాపల్లి
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, రాజమహేంద్రవరం
Credits : Andhrajyothi

సేంద్రియ మునగ

 • సత్ఫలితాలు ఇస్తున్న వేస్ట్‌ డీకంపోజర్‌
 
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బ్యాక్ట్టీరియాను తీసి, నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన వేస్ట్‌ డీకంపోజర్‌ అద్భుతాలు చేస్తున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రియ పద్ధతుల్లో ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తున్నది.
వేస్ట్‌ డీకంపోజర్‌తో మునగ సాగు విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో 2015లో 3023 మొక్కలను నాటారు. వాటిలో అంతర్‌ పంటగా, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా వేస్టు డీకంపోజర్‌, లొట్టపీస్‌ ఆకు కషాయం, పుల్లని మజ్జిగను మునగ తోటకు స్ర్పే చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు.
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బాక్టీరియాలను నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన 250 మిల్లీలీటర్ల వేస్ట్‌ డీకంపోజర్‌ను రూ. 20కు కొనుగోలు చేస్తారు. దీనిని 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లంతో పాటుగా కలపాలి. ఆరు రోజుల తరువాత దాన్ని తీయాలి. ఆ మిశ్రమాన్ని మరో ఆరు రోజుల పాటు పంటలపై పిచికారీ చేస్తే మునగ, ఇతర పంటలపై పురుగులు నాశనం అవుతాయి. మొక్కకు పోషకాలైన నైట్రోజన్‌, పాస్ఫరస్‌, పొటాషియం అంది ఏపుగా పెరుగుతాయి. కేజీ లొట్టపీస్‌ ఆకులు బాగా నూర్పిడి చేసిన తరువాత 10 లీటర్ల నీటిలో వేడిచేయాలి. ఆ తర్వాత చల్లార్చి వడపోయాలి. దానికి మరో 250 గ్రాముల సర్ఫ్‌ను కలిపి ఒక ఎకరానికి స్ర్పే చేయడానికి అవకాశం ఉంది. దీంతో పంటపై లద్దె పరుగు, పచ్చపురుగు, ఆకుచుట్ట పురుగు చనిపోతుంది. కేజీ పుల్లని పెరుగును, ఆరు లీటర్ల నీటిలో ఆరు రోజుల పాటు మురగబెట్టాలి. ఆ తరువాత వడబోసి స్ర్పేచేస్తే పూత రాలడం ఆగిపోతుంది. గతంలో బొప్పాయి సాగులో ఇలాంటి ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇప్పుడు మునగ సాగులో కూడా ఉపయోగించి అధిక దిగుబడులు పొందుతున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ నిర్వాహకులు చెప్పారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కల్వకుర్తి అర్బన్‌
Credits : Andhrajyothi

సహజ ఎరువుల మోహనుడు!

 • ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగడి రైతు
సేంద్రియ సేద్యం మాత్రమే నేలతల్లితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని బలంగా నమ్మడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు సాధిస్తున్నారు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కొత్తగడికి చెందిన మోహన్‌రెడ్డి.
డిగ్రీ చదివిన మోహన్‌ రెడ్డి వ్యవసాయ మీద ఉన్న ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సాగు పద్ధతుల్ని అధ్యయనం చేశారు. సేంద్రియ సేద్యం మాత్రమే రైతుకు మేలు చేస్తుందని భావించారు. సేంద్రియ పద్ధతిలో టమాట, క్యారెట్‌, బీర, కాకర, బొప్పాయి, వంకాయ, కాలీప్లవర్‌, క్యాబేజి తదితర పంటల సాగు చేపట్టారు. గత ఏడాది ఎకరంలో 40 టన్నుల టమాటా దిగుబడి సాధించానన్నారు మోహన్‌రెడ్డి. వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బాక్టీరియా, జీవామృతాలతో సేద్యం చేస్తున్నారాయన. సేంద్రియ సాగుతో రైతుకు పెట్టుబడి ఖర్చులో 70 శాతం తగ్గుతుంది.
అంతేకాకుండా సేంద్రియంగా పండించే కూరగాయలు తినే వారిపై ఎలాంటి చెడు ప్రభావం వుండదు. పెట్టుబడి తగ్గడం వల్ల రైతుకు లాభం ఎక్కువగా వస్తుందంటారాయన. విలక్షణమైన ఆయన సాగు విధానాలు చూసేందుకు సాటి రైతులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఆయన క్షేత్రాన్ని సందర్శించడం విశేషం.
వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బ్యాక్టీరియా అనేది ప్రస్తుతం కూరగాయల పంటలు సాగు చేసేవారికి వరంగా మారింది. దీన్ని రైతులు పొలంలోనే తయారు చేసుకోవచ్చు. ఒక మిల్లీలీటర్‌ మదర్‌ కల్చర్‌ నూనెను 200 లీటర్ల నీటిలో వేసి అందులో రెండు కిలోల బెల ్లం, పప్పుధాన్యాల పిండి వేయాలి. ఏడు రోజుల పాటు దీనిని నానబెట్టాలి. నానబెట్టే క్రమంలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని పొలాలపై పిచికారీ చేస్తే పంటలను ఆశించే చీడపీడలు పంటల దరిచేరవు. ముఖ్యంగా ఇది దోమపోటుకు బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని చెట్టు మొదట వేస్తే చెట్టు బలంగా పెరుగుతుంది.
సేంద్రియ సాగులో జీవామృతం అనేది చాలా కీలకం. జీవామృతం వాడటం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. పంటపై పిచికారీ చేస్తే చీడ పీడలు ఆశించవు అదే విధంగా మొక్క కాండం వద్ద జీవామృతం పోస్తే మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిని రైతు ఇంటి వద్ద, పొలం వద్ద సులువుగా తయారు చేసుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల గో మూత్రం, 10 కిలోల గోవు తాజా పేడ, 2 కిలోల బెల్లం వేసి కలపాలి. అదే విధంగా ఇందులో పప్పుధాన్యాల పిండి(ఏదైనా పప్పుధాన్యం), కొంత ఒరంగట్టు మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు నాలుగుసార్లు కలిపి 48 గంటలు నానబెట్టాలి. ఈవిధంగా తయారుచేసిన జీవామృతం మిశ్రమాన్ని నేరుగా చెట్లకు పిచికారీ చేయాలి. అదే విధంగా చెట్టు కాండం వద్ద్ద పోయవచ్చు.
Credits : Andhrajyothi

నారు ఎదగడం లేదు..ఏం చేయాలి?

ఖరీఫ్ లో వరి పంట చేతికి వచ్చే సమయంలో దోమపోటుతో పంట నష్టపోయాం. రబీ నార్లు చలి కారణంగా సరిగా ఎదగడం లేదు. దీనికితోడు నార్లకు అగ్గితెగులు, మొగి పురుగు సోకుతున్నాయి. నారు దశలోనే రెండు, మూడుసార్లు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. నారు సక్రమంగా ఎదిగేందుకు ఏం చేయాలి?
– ముత్యాల గంగారెడ్డి, రైతు, తాటిపెల్లి
రబీ సీజన్‌లో సాధారణంగా చలి తీవ్రత పెరుగుతుంది. అందుకోసం స్వల్పకాలిక, చలిని తట్టుకునే వరి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఫిబ్రవరి 15 తర్వాత వరి పంట పూత దశ దాటే విధంగా చూసుకోవాలి. పూత దశలో చలి ఎక్కువగా వుంటే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌ మొదటి వారంలోపు పంట కోత పూర్తయ్యే విధంగా చూసుకోవాలి. లేదంటే ఎండ వేడిమి పెరగడంతోపాటు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే జనవరి 10లోపు వరినాట్లు పూర్తయ్యే విధంగా చూసుకోవడం తప్పనిసరి.
చలికి పోషకాల లోపంతో నారు సరిగా ఎదగకపోవడంతో పాటు ఆకుల రంగు మారిపోతోంది. జింక్‌లోపం, ఇతర పోషకాల లోపం గానీ ఉంటే రైతులు గమనించి ఎగ్రోమిన్‌ వాక్స్‌ గానీ, ఫార్ములా – 4, ఫార్ములా – 6 వంటి మందులను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి నారుపై పిచికారీ చేయాలి. అలాగే అగ్గి తెగులు సోకినట్లైతే ట్రైసైక్లోజోన్‌ లీటరు నీటికి 0.6 గ్రాములు, మొగి పురుగు ఉధృతి ఉంటే ఎకరానికి సరిపోయే నారుకు 600-800 గ్రాముల 3జీ గానీ, 4జీ గానీ చల్లుకోవాలి. అలాగే నారుమడిలో ఉండే నీటిని ఉదయం తీసేసి, మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. దీనివల్ల తెగుళ్ల ఉధృతి తగ్గే అవకాశం ఉంది.
Credits : Andhrajyothi

రైతును పీల్చేస్తున్న గులాబీ పురుగు

 • పత్తి మనుగడకే ముప్పంటున్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది పత్తి రైతు ఆశలను గులాబీ పురుగు భగ్నం చేసింది. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటకు రైతులు పొలంలోనే నిప్పుపెడుతున్నారు. పత్తి పంటలో, చివరకు తీసిన పత్తిలో అయినా గులాబీ పురుగు అవశేషాలుంటే వచ్చే ఏడాది వేసే పంటను కూడా ఈ పురుగు దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.
పత్తి రైతులను ఈ ఏడాది గులాబీ పురుగు తీవ్ర సంక్షోభంలో పడేసింది. ఏపుగా కాసిన పంట కాయల్లో గులాబీ పురుగు గుడ్లను చేసి పంటను నాశనం చేసింది. వడ్డీలకు అప్పులు తెచ్చి, పత్తి సాగు చేసిన రైతన్న అదే పంటను ఇప్పుడు పొలంలోనే కాల్చివేస్తున్నాడు. పంట చేతికందాల్సిన సమయంలో చెట్టుకు 50 నుంచి 100 కాయలున్నా ప్రతికాయలో గులాబీ పురుగు చొరబడి లోపల పత్తిని మొత్తం తినేస్తున్నది. పెట్టుబడి రాకున్నా కనీసం కూలీ డబ్బులన్నా మిగులుతాయనుకుంటే గులాబీ పురుగు కారణంగా ఆ ఆశలూ అడుగంటాయి. పత్తికి గులాబీ రంగు, రసం పీల్చే తెగులు సోకింది. పత్తి ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్న సమయంలో గులాబీ పురుగు, తెగులు సోకడంతో రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గులాబీ పురుగు, రసం పీల్చే తెగుళ్లతో పంట దెబ్బతినగా చేతికందిన కొద్దిపాటి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఎకరం పత్తి పంటకు 30 నుంచి 40వేల పెట్టుబడులు పెట్టారు రైతులు. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా గులాబీ పురుగు, తెగుళ్లు కారణంగా కేవలం 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట సరిగా లేకపోవడంతో గిట్టుబాటు ధర కూడా రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘బీటీ పత్తిలో 120 రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు వస్తుంది. ఇది క్యాన్సర్‌ లాంటిది. మొగ్గదశలో రెక్కల పురుగు గుడ్డు పెడుతుంది. ఆ పురుగు అండాశయంలో చొరబడి కాయలో ఉన్న మొత్తం గుజ్జును తింటుంది. దాంతో అపరిపక్వ దశలో కాయ పగిలి గుడ్డి పత్తి వస్తుంది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంద’న్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ బోడ విజయ్‌. ‘బీటీ పత్తిని నాటే ముందు నాన్‌ బీటీని చుట్టూ నాలుగు వ రుసలు నాటాలి. కాని ఆ పని ఏ ఒక్క రైతు చెయ్యలేదు. దీంతో బీటి పైనే గులాబీ రంగు తల్లిపురుగు వచ్చి చేరి బీటీని తట్టుకునే శక్తి వచ్చింది. జనవరిలో వచ్చే గులాబీ రంగు పురుగు నవంబర్‌లోనే వచ్చింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింద’న్నారు ఏరువాక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి.
‘ఖరీఫ్‌లో ఎకరానికి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. ఇప్పటివర కూ రెండు క్వింటాళ్ల పత్తిని మాత్రమే తీశా. పత్తి చేనులో ఎక్కడా చూసినా గులాబీ రంగు పురుగుతోపాటు లద్దె పురుగు ఎక్కువగా వుంది. ఎనిమిదేళ్ల నుంచి సాగుచేస్తున్నా. ఇంత దారుణం ఎన్నడూ లేద’న్నారు ఊరుగొండ గ్రామ రైతు జనుపాల రమేష్‌.
గులాబీ పురుగుకు చెక్‌ ఇలా
జనవరిలో పత్తి పంటను తొలగించి, మరో పంట వేసుకోవాలి.
తొలగించిన పత్తి చెత్తను కాల్చివేయాలి.
వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. దీంతో భూమిలో నిద్రావస్థలో ఉన్న గులాబీ రంగు పురుగు లార్వా వేడికి చ నిపోతుంది.
పత్తి మిల్లుల్లో నాసిరకం పత్తి పడేయకుండా కాల్చేయాలి. పత్తి మిల్లు ఆవరణలో లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగును అదుపు చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ రూరల్‌
Credits : Andhrajyothi