కరువు జిల్లాకు ఖర్జూర మాధుర్యం

 • తోటల సాగులో ‘అనంత’ రైతుల ప్రయోగం
ఖర్జూరం సాగుకు మన భూములు పనికి రావనే మాట అసత్యమని నిరూపించారు అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ. కరువుసీమలో ఖర్జూరం సాగు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారాయన.
నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందిన ఎండ్లూరి వెంకటనారాయణ చాలాకాలంగా వేరుశనగ, అరటి లాంటి పంటలు వేసి బాగా చితికిపోయాడు. వెంకట నారాయణకు 120 ఎకరాలు పొలం వుంది. మిగిలిన రైతుల్లానే ఆయన కూడా వేరుశనగ సాగు చేసేవాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట సరిగా చేతికందక తీవ్రంగా నష్టపోయాడు.
వెరైటీ పంటలు సాగు చేయాలనే తపన ఆయనకు వుండేది. ఒకసారి వ్యక్తిగత పని కోసం తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లాడు. అక్కడ అమ్ముతున్న ఖర్జూరం పండ్లను కొని తిన్నాడు. వ్యాపారి ఆ పండు ధర ఎక్కువగా చెప్పాడు.
ఖర్జూరం ఇంత ధరా…. అని వెంకటనారాయణ వ్యాపారిని ప్రశ్నించాడు. ఈ పండు మన దగ్గర పండదు అందుకే ఇంత ధర అని వ్యాపారి కాస్త వెటకారంగా బదులిచ్చేసరికి ఆ రైతు గుండె చివుక్కుమంది. మనమే ఆ పంటను ఎందుకు పండించకూడదని ఆలోచించాడు. కుమారుడు సుధీర్‌తో చర్చించాడు. నాణ్యమైన ఖర్జూరం పండ్లు తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన నిజాముద్దీన్‌ అనే వ్యాపారి సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్నారు. నిజాముద్దీన్‌ ద్వారా సౌదీ అరేబియా నుంచి ఖర్జూరం మొక్కలను దిగుమతి చేసుకున్నారు.
60 ఏళ్ల పాటు దిగుబడి
సౌదీ అరేబియా నుంచి తమిళనాడుకు చేరేసరికి ఒక్కో ఖర్జూరం మొక్క ఖరీదు రూ. 3,500 పడింది. నాలుగేళ్ళ క్రితం తమిళనాడులోని నిజాముద్దీన్‌ అనే వ్యాపారి ద్వారా మధురమైన రుచికలిగిన బర్హీ అనే ఖర్జూరం రకం మొక్కలను తెచ్చుకుని సాగు ప్రారంభించారు వెంకటనారాయణ. మూడు ఎకరాల భూమిని ఖర్జూరం సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో 210 మొక్కలు నాటాడు. సౌదీలో ఉన్న మన ప్రాంతం వారి ద్వారా ఖర్జూరం సాగు మెళుకువలు తెలుసుకున్నాడు. మొక్క కాపు మొదలైనప్పటి నుంచి 60 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెంకటనారాయణ జిల్లాలో ఇప్పుడు సాటి రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ పలువురు రైతులు ఖర్జూరం సాగు ప్రారంభించడం విశేషం.
విస్తరిస్తున్న ఖర్జూరం సాగు
శింగనమల, మడకశిర, కణేకల్లు తదితర మండలాల్లో రైతులు ఖర్జూరం పంటను సాగు చేస్తున్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఖర్జూరం పంటకు నీరు తక్కువగా వాడాలి. అనంతపురం జిల్లా వాతావరణానికి ఖర్జూరం బాగా సరిపోతుంది. ఖర్జూరం మొక్కను నాలుగేళ్ళు బతికించుకుంటే ఆ తరువాత ఏటా ఎకరాకు రూ.లక్ష మించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వుండదు. ఖర్జూరం పంటకు పేడ ఎరువులు, డిఏపీ, పొటాష్‌, విటమిన్స్‌ లాంటి ఎరువులు వాడాలి. వర్షాకాలంలో పురుగు నివారణకు సైబర్‌మెటిన్‌ అనే మందులు స్ర్పే చేయాలి.
– సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, అనంతపురం
 
అప్పుడు హేళన..ఇప్పుడు ఆశ్చర్యం
ఖర్జూరం సాగు ప్రారంభించినప్పుడు సాటి రైతులు నన్ను హేళన చేశారు. మన దగ్గర ఖర్జూరం పండదంటే పండదన్నారు. మూడు ఎకరాల ఖర్జూరం తోట నుంచి గత ఏడాది జూన్‌లో 16 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.1.50 లక్షలతో తమిళనాడు, అనంతపురం, కోయంబత్తూరు, అభినాష్‌ మార్కెట్లలో విక్రయించాం. నాకు వస్తున్న లాభాలు చూసి, రైతులు ఇప్పుడు నన్ను సలహాలడుగుతున్నారు. కొత్తగా ఖర్జూరం సాగు చేయడం వల్ల మార్కెట్ల గురించి తెలియక, పంట కోతలు తెలియక సుమారు రూ.10లక్షలు నష్టపోయాం. భవిష్యత్తులో మరిన్ని లాభాలు ఆర్జిస్తామనే నమ్మకం వుంది.
– ఎండ్లూరి వెంకటనారాయణ, రైతు
Credits : Andhrajyothi

విలక్షణ సేద్యంతో విజయపథం

 • 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం
 • రంగారెడ్డి జిల్లా రైతు ప్రస్థానం
రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, టమాట ఇలా ఏదో ఒక పంటను సాగు చేస్తారు. లేదంటే మామిడి, జామ, ద్రాక్ష, కొబ్బరి, బత్తాయి వంటి తోటలు పెంచడం పరిపాటి. కానీ ఓ రైతు మాత్రం తన పొలంలో వేల రకాల మొక్కల్ని పెంచుతూ, వైవిధ్యమైన వనాన్ని సృష్టించారు. ఆ పంటల గురించి తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామానికి వెళ్లాల్సిందే.
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, వెల్వెట్‌ యాపిల్‌, వాటర్‌ యాపిల్‌, జబోటిక, మిరాకిల్‌ఫ్రూట్‌, జామ, మామిడి, సపోటా వంటి 50 రకాలకు పైగా దేశవాళి పండ్ల రకాలూ, అ శ్వగంధ, శంఖుపుష్టి, అడ్డసర, జీవకాంచన.. ఇలా 100కు పైగా ఆయుర్వేద మొక్కలూ, దాల్చినచెక్క, లవంగం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలూ, శ్రీగంధం, ఎర్రచందనం, నేరేడు వృక్షాలు, గులాబి, సంపంగి, పారిజాతం తదితర పుష్పా లూ.. ఇలా 280 జాతులకు చెందిన 9 వేల మొక్కలకు నిలయం ఆ వ్యవసాయ క్షేత్రం. ఆ క్షేత్రం సారథి హైదరాబాద్‌కు చెందిన సుఖవాసి హరిబాబు. తనకున్న 10 ఎకరాల్లో వున్న ఇక్క బోరు సాయంతో వీటన్నింటినీ సాగు చేస్తున్నారాయన. జీవవైవిధ్యానికి తన క్షేత్రాన్ని చిరునామాగా తీర్చిదిద్దుతున్నారాయన.
నంది అవార్డుల నుంచి వ్యవసాయం దాకా…
అరుదైన వ్యవసాయాన్ని మక్కువతో చేస్తున్న హరిబాబు గతంలో రియల్‌ ఎస్టేట్‌, టెలివిజన్‌ రంగాల్లో పని చేశారు. రైతు కుటుంబాల జీవిత గాథలు ఇతివృత్తంగా తీసుకొని దర్శక నిర్మాతగా జీవనతీరాలు, జీవనసంధ్య, సీరియళ్లను తీశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియళ్లకి 6 నంది అవార్డులను అం దుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రా మంలో పుట్టి పెరిగిన ఆయన డిగ్రీ వరకు చదువుకొని 1979లో హైదరాబాద్‌కు వచ్చారు. 1984లో గచ్చిబౌలిలో కొంత పొలం కొని ఉద్యాన పంటలు పండించారు. 2013లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల పొలం కొన్నారు. ఆ నల్లరేగడి భూమిలో వైవిధ్యమైన మొక్కలు పెరగడానికి వీలుగా పొలంలో ఒక అడుగు ఎత్తున ఎర్ర మట్టిని వేయించారు.
దీంతో ఆ నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పొలం అంతటా ప్రతి 10 అడుగుల దూరంలో మూడు అడుగుల పొడువు, వెడల్పు, లోతు ఉండేలా గోతులు తవ్వించి మామిడి, సపోటా, తీపిచింత వంటి వృక్ష జాతి మొక్కల్ని నాటారు. మొక్కలు బలంగా పెరిగేందుకు వీలుగా ఎర్రమట్టి, ఆవుపేడ, ఆముదపుపిండి కలిపిన కంపోస్టు ఎరువును ఆ గోతుల్లో వేశారు. మొక్కల మధ్యలో వచ్చే ఖాళీల్లో నీడ అవసరమై, ఎత్తుగా పెరగని ఫల, ఆయుర్వేద, సుగంధద్రవ్య మొక్కల్ని నాటారు. చైనా, వియాత్నాం, జమైకో, బ్రెజిల్‌, మెక్సికో తదితర దేశాలకు చెందిన 40 రకాల వృక్ష జా తుల్ని శృంగేరి, బెంగళూరు, మంగళూరు, కాసర్‌గట్‌, కడియం నర్సరీల నుంచి తెప్పించారు. వాటితో పాటు ఆ క్షేత్రంలో వాజ్‌పాయి పండ్లు, అబ్దుల్‌కలాం పుష్పాలు. చరకుడు, శుశ్రూశుడి పేర్లతో ఆయర్వేద మొక్కల విభాగాలు ఏర్పాటు చేశారు.
అంతా సేంద్రియమే
తన పొలంలో పండించే పంటలకు సేంద్రి య ఎరువులనే ఉపయోగిస్తు న్నారు హరిబాబు. సుభా్‌షపాలేకర్‌ స్ఫూర్తితో ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి వాడుతున్నారు. అలాగే పొన్నుస్వామి నూనెల విధానాన్ని పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో వేప, ఆముదం, కానుగ, పత్తితవుడు, విప్ప, చేపకుసుమ వంటి నూనెలతో మిశ్రమం తయారు చేసి ఆ ద్రవణాన్ని నీటిలో కలిపి మొక్కల పైన పిచికారి చేస్తున్నారు. వీటి కారణంగా గత రెండు సంవత్సరాల్లో తోటలో చీడ పీడల సమస్య తలెత్తలేదని తోటలో పండే కాయల నుంచి నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారాయన. తోట చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ లోపల వైపు వాక్కాయ మొక్కల్ని నాటారు. ఇవి వేడి గాలుల్ని అడ్డుకుంటున్నాయి. సాగులో మెళకువలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు హరిబాబు. అక్కడ అనుసరిస్తున్న నీటి పొదుపు విధానాలను పాటిస్తున్నారాయన.
-వేముల కృష్ణ, మహేశ్వరం
ఒకే పంటపై ఆధారపడే విధానానికి రైతులు స్వస్తి చెప్పాలి. కాస్త పొలం వు న్నా అందులో రెండు రకాల మొక్కలు సాగు చేయాలి. దాంతో రైతుల ఆదాయం పెరుగుతుంది.
– హరిబాబు, 9441280042
Credits : Andhrajyothi

సాఫ్ట్‌వేర్‌ను వదిలి.. సాగుబాట పట్టి

 • ముంబైలో ఉద్యోగం వదిలేసి పల్లెకు
 • కూరగాయలు పండిస్తున్న శ్రీనివాస్‌
 • చౌహన్‌క్యూ, పాలేకర్‌ విధానాలు అమలు
 • వ్యవసాయంపై మక్కువే కారణమని వెల్లడి
కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎంబీఏ విద్యనభ్యసించాడు! ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు! మంచి ఉద్యోగమే చేస్తున్నా మనసులో ఏదో అసంతృప్తి! పలు రాష్ట్రాల్లోని రైతులు లాభాలబాటలో నడుస్తుంటే మన రాష్ట్రంలోని రైతులెందుకు అప్పులపాలవుతున్నారని మథన పడ్డాడు. లక్షలు రాకున్నా వ్యవసాయంతో లక్షణంగా బతికే అవకాశముందని చెప్పేందుకు ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు! వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ యువకుడే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌. వ్యవసాయం మీద మక్కువతో ముంబైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరు వచ్చేశాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. దక్షిణకొరియాలో చౌహన్‌క్యూ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం అతడిని ఆకర్షించింది. దేశీయ సూక్ష్మ జీవులతో వ్యవసాయం చేయడం, మనకు అందుబాటులో ఉన్న నూనెలు, ఇంటిలో ఉండే వంట పదార్థాలు సస్యరక్షణకు స్థూల, సూక్ష్మ పోషకాలు అందించేందుకు తోడ్పడుతాయని గ్రహించాడు. వాటినే ఉపయోగించే వ్యవసాయం చేస్తున్నాడు.
రెండెకరాల్లో బోడకాకర, ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు, బెండ, మరో ఎకరంలో అనప, అలసంద, గోరుచిక్కుడు పంటలు సాగు చేస్తున్నాడు. పాలేకర్‌ వ్యసాయ విధానాలను చౌహన్‌క్యూ సిస్టమ్‌తో సమ్మిళితం చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. బోడకాకర కిలోకు హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి రైతులకు గరిష్ఠంగా రూ.120, కనిష్ఠంగా రూ.80 లభిస్తుంది. దిగుబడి ఎకరాకు కనీసంగా 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున ఒక రైతు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే, బోడకాకర సాగులో మగ, ఆడ మొక్కలను గుర్తించి వాటిని అవసరమున్న మేరకే ఉంచుకొని మిగతా వాటిని తీసేయడం ప్రధాన ప్రక్రియ. ఇతర రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు శ్రీనివాస్‌ బోడకాకర సాగును ఎంచుకున్నాడు. డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్‌వీఎ్‌సకే రెడ్డి, రవి హైబ్రిడ్‌ సీడ్స్‌ వ్యవస్థాపకులు మన్నేపల్లి రవి సూచనలతో స్ఫూర్తిపొంది రెండెకరాల్లో బోడకాకర వేశాడు. ఇప్పటికే మూడు కటింగ్‌లలో క్వింటాలున్నర బోడకాకరను మార్కెట్‌కు పంపించారు.
సేంద్రియ ఎరువులతో దేశవాళీ రకాల సాగు
ఉప్పు తప్ప ఆహార పదార్థాలన్నీ పెరటిలోనే పండించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్నివ్వాలనే లక్ష్యంతో పల్లెకు వచ్చి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. బోడకాకర, అలసంద, చిక్కుడు, గోరుచిక్కుడు, సొరకాయ, శీతాకాలంలో అయితే టమాటలను సేంద్రియ ఎరువులతో పండించవచ్చు. ఆధునిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులకు కలిపి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇలా వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి.
Credits : Andhrajyothi

కూరగాయల హబ్‌.. యాదాద్రి!

వర్షాభావ పరిస్థితులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు… వేలు, లక్షల ఖర్చుతో పాతాళం లోతు బోర్లు… అయినా పోస్తూ.. పోస్తూ ఆగిపోతున్న జలధారలు. దశాబ్దాలుగా వరి, ప్రత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను నమ్ముకున్న రైతుల దుస్థితి ఇది. దీంతో పీకల దాకా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు నిత్యం ఆదాయం అందించే కూరగాయల సాగువైపు మళ్లుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు కూరగాయలు.. ఆకు కూరలు సాగుచేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేలలో ఖర్చు, భరోసా లేని రాబడి వున్న వరి సాగుతో విసిగిపోయిన ఆ మండలాల రైతులు కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తూ నిత్యం డబ్బు ఆర్జిస్తున్నారు. హైదరాబాద్‌ నగర సమీప యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కొంతకాలంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్నది. జిల్లాలోని బొమ్మల రామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో వరుసగా నాలుగేళ్ల్లుగా కరువుఛాయలే అలుముకుంటున్నాయి. అయినా ఇక్కడి రైతులు చాలాకాలంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే వరినే సాగు చేస్తున్నారు.
వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో వేలు, లక్షలు పెట్టి బోర్లు వేస్తున్నారు. వాటిలో కూడా నీరు రాక, పంట చేతికి రాక భారీగా నష్టపోతన్నారు. దీంతో కొందరు రైతులు హైదరాబాద్‌ నగరం, భువనగిరి జిల్లా కేంద్రాల్లో ప్రజలకు నిత్యావరసమైన కూరగాయలు.. ఆకు కూరల సాగు మెరుగ్గా వుంటుందని ఆలోచించారు. వీరంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. పెట్టుబడి.. రోజు ఆదాయం .. చేరువలో మార్కెటింగ్‌ సదుపాయం గల కూరగాయలను ఒకరి తర్వాత.. ఒకరు.. ఓ గ్రామం.. తర్వాత మరో గ్రామం.. సాగు చేస్తూ ఏకంగా కొన్ని మండలాలకు మండలాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ కళకళలాడుతున్నాయి.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 నుంచి 5 వేల ఎకరాల వరకు కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఈ రైతులే ఆదర్శంగా జిల్లాలోని నగరానికి సమీపంలోగల బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల రైతులు జిల్లానే కూరగాయల హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్‌ జిల్లాకు సరిహద్దులో.. ఈసీఐఎల్‌, కుశాయిగూడ, బోయిన్‌పల్లి మార్కెట్‌కు కూతవేటు దూరంలో వున్న బొమ్మల రామారం మండలంలోని దాదాపు పది పదిహేను గ్రామాలతో పాటు తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లోని మరో పాతిక గ్రామాల రైతులు కూరగాయల సాగునే ఎంచుకున్నారు.. వరిసాగును వదిలేసి కూరగాయలు, ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టారు.
 
ఆ.. ఊరంతా.. ఆకు కూరల సాగే
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చౌదరిపల్లి గ్రామంలో దాదాపు 2వేల జనాభా ఉంది. గ్రామంలో గల రైతులు కుటుంబాలు పూర్తిగా ఆకుకూరలనే సాగు చేస్తున్నారు. ఎకరం, రెండు ఎకరాలు మొదలు నాలుగు ఎకరాల వరకు ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని రోజు భువనగిరి, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించి విక్రయిస్తుంటారు.
ఆకుకూరలను సీజన్‌ను బట్టి సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.  కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ఇచ్చే రాయితీలు మాత్రం తమకు అందడం లేదని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వారంతా చిన్న, సన్నకారు రైతులే. కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మరింత భరోసా వుంటుందని రైతులు కోరుతున్నారు.
రోజుకు వెయ్యిదాకా ఆదాయం
నాకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేసినన్నాళ్లూ పైసా మిగిలేది కాదు. పైగా అప్పులు. ప్రస్తు తం ఎకరం పొలంలో పాలకూర, కోతిమీరు సాగు చేస్తున్నాను. మార్కెట్‌లో అమ్ముకుంటే రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తున్నాయి.
– ఆకుల శోభ, చౌదర్‌పల్లి, బొమ్మల రామారం
కూరల సాగే మేలు
సోలిపేటలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాను ఎకరంన్నర భూమిలో టమాట సాగు చేసి.. రోజుకు 15 నుంచి 20 బాక్కులను మార్కెట్‌కు పంపిస్తున్నాను. రూ.5వేల వరకు ఆదాయం వస్తున్నది.
– బానోతు స్వామి, సోలిపేట, బొమ్మల రామారం
వరి ఎండింది.. తోట కూర పండింది..
ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో కూరగాయలు సాగు చేశాను. వరి ఎండిపోయింది. కూరగాయలు బాగా పండాయి. ఆ డబ్బుతోనే బతుకుతున్నాం. కూరగాయల రైతులను ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోవాలి.
– ఎనగండ్ల రాజప్ప, బొమ్మల రామారం
కూరగాయల సాగే గిట్టుబాటు
ఎనిమిది ఎకరాల్లో గతంలో వరి సాగు చేసి నష్టపోయాను. ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో వంగ సాగు చేస్తున్నాను. మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూరగాయల సాగు అభివృద్ధికి విత్తనాలు, రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి.
– ఎడ్ల నరేష్ రెడ్డి, పాముకుంట, రాజాపేట
Credits : Andhrajyothi

కాంప్లెక్స్‌ కంటే.. సూటి ఎరువులు ఉత్తమం

 

 • కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్‌
ఈ ఏడాది ఖరీఫ్ లో ప్రత్తి పంట అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు తెలంగాణ రైతులు. నల్లగొండ జిల్లాలోనే సుమారు 3లక్షల 50వేల హెక్టార్లలో ప్రత్తి పంట సాగవుతున్నది. జూన్‌ మొదటి వారంలో వర్షం పడటంతో చాలా ప్రాంతాల్లో ప్రత్తిని విత్తారు. తె లంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఆలస్యంగా పడటంతో విత్తడం ఆలస్యమైంది. ప్రత్తిని విత్తిన ప్రాంతాల్లో పది రోజుల ఎడతెరపి లేకుండా వానలు కురిశాయి. దీంతో ప్రత్తిలో ఎదుగుదల లోపించింది. ఈ తరుణంలో ప్రత్తి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్‌ సూచించారు.
ఎండుతెగులు, వేరుకుళ్లుతో జాగ్రత్త
ముందుగా వర్షాలు పడిన ప్రాంతాల్లో నెల రోజులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్తి పంట ప్రస్తుతం మొక్క దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్తి విత్తగానే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఎక్కువ నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో బాక్టీరియా, వేరు కుళ్లు కారణంగా లేత మొక్కలు వంగి చనిపోతాయి. ఈ పరిస్థితి నివారణకు లీటరు నీటికి కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3గ్రా., ప్లాంటోమైసిన్‌ 0.1 గ్రా., కలిపి పంటకు పిచికారి చేయాలి, నల్ల రేగడి నేలల్లో వేరు కుళ్లు, ఎండు తెగులు వ్యాపిస్తుంది. దాని నివారణకు 3గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి మొదలు వద్ద భూమి తడిచేలా పిచికారి చేయాలి. ఈ తరుణంలో ప్రత్తి పంటకు ఎర్ర తెగులు సోకే ప్రమాదం ఉంది. దీని నివారణకు యూరియా 10గ్రామలు, మల్టీ-కె 10 గ్రాములు, లీటర్‌ నీటికి కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని ఆయన సూచించారు.
కలుపు సమస్య నివారణకు…
ప్రత్తిలో కలుపు నివారణకు విత్తిన 20-25 రోజులకు పర్గాసూపర్‌ లేదా క్విజలోఫాప్‌ ఇథైల్‌ అనే మందును ఎకరాకు 4వందల మి.లీ, 2వందల లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. తద్వారా కలుపు సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూలీల కొరత కారణంగా సకాలంలో కలుపుతీయకపోవడం వల్ల ఎదురయ్యే నష్టాలను నివారించవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షనీరు ఆగినప్పుడు ఆ పంటను రక్షించుకునేందుకు ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, మొక్కకు 7.10 సెం.మీ దూరంలో కాండానికి తగలకుండా పోయాలని ఆయన సూచించారు.
కాంప్లెక్స్‌ ఎరువులు వద్దు
మొక్క ఎదిగే దశలో కాంప్లెక్స్‌ ఎరువులు వేస్తే వాటిని మొక్కలు తీసుకోలేవు. వాటి స్థానంలో సూటి ఎరువులు వాడటం వల్ల అధిక ప్రయోజనం వుంటుందని ఆయన వివరించారు. అదే విధంగా పచ్చదోమ ఆశించిన ప్రత్తి పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్‌ శంకర్‌. వాతావరణంలో తేమ లేనపుడు పచ్చదోమ రసం పీల్చి పంటకు నష్టం చేకూరుస్తుంది. వేప కషాయం 5 మిల్లీలీటర్లు, ఉధృతి అధికంగా ఉంటే మోనోక్రోటోఫాస్‌ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలో పూయాలి. తగ్గకపోతే 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. లేదా జీవరసాయనం మందు వర్తికీలియంలెఖాని 5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Credits : Andhrajyothi

నారుమళ్లకు తెగుళ్ల బెడద.. తస్మాత్‌ జాగ్రత్త

రాష్ట్రవ్యాప్తంగా రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడిలో కాండంతొలుచు పురుగు, పచ్చదోమ, తాటాకు తెగులు, తామర పురుగుల నివారణకు క్లోరోఫైరిఫాస్‌ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు తీసేందుకు వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు ఎకరా నారుమడికి 16 కిలోల చొప్పున వేయాలి. నారును కత్తిరించే లద్దె పురుగు ఆశించినట్లయితే నారు మడిలో నీరు బాగా పెట్టి, మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్‌ 2.5 మిల్లీలీటర్లను 1 మిల్లీలీటరు డైక్లోరోవాస్‌ లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిచినట్లయితే హెక్సాకొనజోల్‌ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్‌ 2 మిల్లీలీటర్ల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కంది సాగులో మెళకువలు
జూన్‌, జూలై మాసాలు కంది విత్తేందుకు అనుకూలం. ఆగస్టులో కూడా విత్తుకోవచ్చు. ఆగస్టులో విత్తుకునేవారు మొక్కల సాళ్ల మధ్య దూరం తగ్గించుకుని మొక్కల సాంద్రత పెంచుకోవాలి.
రకాలు: ముఖ్యంగా మన ప్రాంతానికి 170-180 రోజులకు పంటకు వచ్చే మధ్యకాలిక రకాలు అనువైనవి. వీటిలో ఎల్‌.ఆర్‌.జి. 41, ఎల్‌.ఆర్‌.జి 30, ఎల్‌.ఆర్‌.జి. 38, ఎల్‌.ఆర్‌.జి. 52 ఊ, సిపిఎల్‌ 332, ఐసిపిఎల్‌ 850 లక్ష్మి, ఐసిపి 9963 మారుతి, ఐసిపిఎల్‌ 87119 ఆ శ రకాలు ముఖ్యమైనవి. ఎల్‌.ఆర్‌.జి. 41, ఐపిపిఎల్‌ 332 రకాలు శనగపచ్చ పురుగును కొంత వరకు తట్టుకుంటాయి. ఐపిపిఎల్‌ 87119 ఆశ, బిఎస్ ఎంఆర్‌ 736, బిఎస్ ఎంఆర్‌ 853 రకాలు ఎండు తెగులును సమర్థంగా తట్టుకుంటాయి. ఎర్రనేలలు, తేలిక భూములకు ఐసిపి 8863, ఎల్‌ఆర్‌జి 52 రకాలు మేలు. వీటి పంటకాలం 150-160 రోజులు. మురుగునీరు పోయే అవకాశం ఉన్న భూములు కందిసాగుకు అనుకూలం. తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో మెత్తగా నేలను దున్నాలి. ఆఖరు దుక్కిలో హెక్టారుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నాలి. విత్తేందుకు ముందు 10 కిలోల విత్తనాన్ని 200 గ్రాముల రైజోబియం కల్చరు పట్టించి విత్తుకోవాలి.
విత్తన మోతాదు: తొలకరికి నేల స్వభావాన్ని బట్టి హెక్టారుకు 5 నుంచి 6 కిలోల విత్తనం వేసుకోవాలి. కలుపు బెడద అధికంగా ఉన్నప్పుడు విత్తిన వెంటనే (24 గంటల లోపు) ఎకరానికి 1.25 నుంచి 1.50 లీటర్ల పెండిమిథాలిన్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చే యాలి.
అంతరపంటలు: కందిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ 1:3 నిష్పత్తిలో వేసుకోవాలి. అ లాగే పెసర, మినుము వేరుశనగ, సోయా చిక్కుడును నల్లరేగడి నేలలో 1:7, ఎర్రనేలల్లో 1!4 నిష్పత్తిలో అంతరపంటగా వేసుకోవచ్చు.
ప్రత్తిలో కలుపు నివారణ
ప్రత్తిని విత్తిన 20 నుంచి 30 రోజుల లోగా గొర్రు, గుంటకలతో అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణలో భాగంగా తొలి దశలో ఆశించే రసం పీల్చేపురుగుల నివారణకు విత్తిన 30, 45 రోజులకు మోనోక్రోటోఫాస్‌ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలుపుకుని కాండానికి పూత పూయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్‌ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 200 ఎస్‌ఎల్‌ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాప్రిడ్‌ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్‌ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 60 రోజుల వరకు నియోనికోటినైడ్‌ మందులైన ఇమిడాక్లోప్రిడ్‌, ఎసిటామిప్రిడ్‌ మరియు థయోమిథాక్సమ్‌ మందులను పిచికారీ చేయరాదు. జూలై 15 దాకా మొక్క జొన్న విత్తుకునేందుకు అనుకూలం. విత్తిన 20 రోజులకు మొదటి సారి, 35-40 రోజులకు రెండవసారి కూలీలతో కలుపు తీయించి లేక అంతరసేద్యం చేసి కలుపు నివారించాలి. విత్తిన వెంటనే అట్రాజిన్‌ 50 శాతం కలుపు మందును ఎకరానికి 800-1000 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడంద్వారా కూడా మొక్కజొన్నలో తొలి దశలో కలుపు నివారించవచ్చు. మొక్కజొన్న పంట నీటి ఎద్దడి ని తట్టుకోలేదు. కాబట్టి బెట్ట పరిస్థితుల్లో నీటి తడులు తప్పనిసరి. మొక్కజొన్నలో ఏ దశలో కూడా నీరు నిల్వ ఉండకూడదు.
 
ప్రొద్దుతిరుగుడు
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలం తయారు చేసుకోవాలి. అందువల్ల ఖరీఫ్‌ సీజనులో వర్షాధారంగా పంటను సకాలంలో విత్తుకోవడానికి వీలుంటుంది. ఈ పంట సాగుకు నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చెల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు అనుకూలం. నేల ఉదజని సూచిక 6.5 – 8 మధ్య ఉన్న నేలలు చాలా అనుకూలం. అమ్ల స్వభావం కలిగిన నేలల కంటే కొద్దిగా క్షార స్వభావం గల నేలల్లో ఈ పంట బాగా పండుతుంది. అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు ప్రాంతాలు, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే భూములు ఈ పంటలకు అనుకూలం కాదు. సాగు చేయాలనుకున్న భూమిలో మట్టి నమూనాలు స్వీకరించి, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించాలి. పంట సాగు చేస్తున్న పొలాల్లో గానీ, గట్ల మీద కానీ వయ్యారిభామ కలపుమొక్కలు పూర్తిగా తొలగిస్తే నెక్రోసిస్‌ వైరస్‌ తెగులు ఉధృతిని అరికట్టవచ్చు.
 
మరిన్ని సలహాల కోసం 1800 425 0430 నెంబర్‌కు ఉచితంగా ఫోన్‌కాల్‌ చే యవచ్చు.
Credits : Andhrajyothi

యాపిల్‌బేర్‌ సిరులు 

ఆయనకు ఉన్న పొలం రెండెకరాలు. ఆ పొలాన్ని ప్రయోగశాలగా మార్చారు. 120 రకాల చామంతుల్ని సాగుచేసి మన రాష్ట్రంతో పాటు పొరుగురాష్ట్రాల వారి చేత భేష్‌ అనిపించుకున్నారు. 8 ఏళ్ల క్రితమే ఆదర్శరైతు పురస్కారం అందుకున్నారు. తాజాగా యాపిల్‌ బేర్‌ సాగు చేపట్టి మంచి లాభాలు గడిస్తున్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి విజయగాధ ఇది. 

సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటలను సాగుచేసి లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి. వినూత్న సాగు పద్ధతులు పాటించడంతో పాటు లాభాల కాపుకాసే పంటల సాగు చేపడుతూ సాటిరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో దాదాపు 120 రకాలకు పైగా చామంతి పూలను సాగుచేసి ఈ ప్రాంతం పూల సాగుకు ఎంతో అనువైందని నిరూపించారు. పూల సాగులో రైతు శంకర్‌రె డ్డి చేసిన కృషిని గుర్తిస్తూ 8ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతు అవార్డుతో సత్కరించింది.

యాపిల్‌బేర్‌ సాగు ఇలా 

తనకున్న రెండెకరాల పొలంలోనే వివిధ రాష్ట్రాలలోని వ్యవసాయ యూనివర్సిటీల్లో ప్రయోగాత్మకంగా సాగుచేసిన నూతన వంగడాలను తీసుకొచ్చి సాగుచేసేవారాయన. సత్ఫలితాలు ఇచ్చిన వంగడాలను ఇతరులకు పరిచయం చేసేవారు. తాజాగా పశ్చిమబెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్‌బేర్‌ (థాయ్‌లాండ్‌ వెరైటీ) మొక్కలను తీసుకొచ్చి నాలుగెకరాల పొలాన్ని లీజుకు తీసుకుని ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. మొక్క నాటిన ఆరునెలలకే కాపు రావడం, బహిరంగ మార్కెట్‌లో యాపిల్‌బేర్‌ (గ్రీనఆపిల్‌)కు మంచి డిమాండ్‌ ఉండడంతో మంచి ఆదాయం గడిస్తున్నారు.
ఎకరా పొలంలో యాపిల్‌బేర్‌ సాగు చేయడానికి రూ.14వేల నుంచి రూ.20వేల లోపు ఖర్చు అవుతుందని శంకర్‌రెడ్డి చెబుతున్నారు. ఎకరాకు 350 మొక్కల నుంచి 450 మొక్కలు నాటితే సరిపోతుందన్నారు. ఒక్కో మొక్క నుంచి మొదటి సంవత్సరంలో 20 నుంచి 25 కిలోలు, రెండో సంవత్సరంలో 50 నుంచి 75కిలోల దాకా, మూడో సంవత్సరంలో 200 కిలోల దాకా దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో యాపిల్‌బేర్‌ ధర రూ.40 నుంచి రూ.60 దాకా పలుకుతోందన్నారు. ఏడాదికోసారి మూడడుగులు వదిలి చెట్లను కట్‌ చేస్తే జీవిత కాలం దిగుబడి వస్తుందన్నారు. చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాలలోని నేలలు ఆపిల్‌బేర్‌ సాగుకు అనుకూలమని ఆ రైతు వివరించారు. ఏ సీజనలో అయినా మొక్కలు నాటవచ్చని, మొక్క ఒకసారి నాటి వదిలేస్తే జీవిత కాలం పంట వస్తుందని శంకర్‌రెడ్డి వివరించారు. యాపిల్‌బేర్‌ పంటపై ఆసక్తి గల రైతులు సెల్‌ నెంబర్‌ 9492380723లో సంప్రదించాలని శంకర్‌రెడ్డి కోరారు.
Credits : Andhrajyothi

బీడు భూముల్లో మధుర ఫలాలు 

పొలం దుక్కి పని అనేది ఓ కళ. ఎప్పుడైతే ఈ పని మొదలవుతుందో మిగతా కళలన్నీ దాన్ని అనుసరిస్తాయి. మానవ నాగరికతకు రైతులతోనే పునాదులు పడ్డాయి.

-డేనియల్‌ వెబ్‌స్టర్‌ (అమెరికా)
 • ఆంధ్రజ్యోతితో ఐటీడీఏ ప్రాజెక్టుఉద్యానవన శాఖ అధికారి బి.ప్రకాశ్ పాటిల్‌
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి, పోడు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల పథకానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగూణంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి గిరిజన రైతులకు ఉపాధితోపాటు అభివృద్ధి ఫలాలు అందించే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, ఉపాధి హామీ పథకం కింద భారీగా నిధులు కేటాయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది గిరిజన రైతులకు ఈ ఏడు జూన 15 నుంచి 60 లక్షల పండ్ల మొక్కల పంపిణీకి లక్ష్యం పెట్టుకున్నట్లు ఐటీడీఏ ఉద్యానవన శాఖ అధికారి ప్రకాశ పాటిల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

గతంలో ఐటీడీఏ ద్వారా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు కదా ? అవి ఏ మేరకు సత్ఫలితాలనిచ్చాయి ?

గతంలో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టినా ఇంతపెద్ద మొత్తంలో చేపట్టలేదు. అప్పుడు కేవలం మామిడి మొక్కలను మాత్రమే పెంచి, పంపిణీ చేశాం. ఈ సారి భారీ ఎత్తున 8 రకాల పండ్ల తోటలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

ఏ రైతులు పండ్ల తోటల పెంపకం పథకం నుంచి లబ్ది పొందే వీలుంటుంది?

5 ఎకరాలలోపు భూమి ఉండి, నీటి వసతి కలిగి ఉన్న గిరిజన సన్నకారు రైతులందరూ పండ్ల తోటల పెంపకం పథకానికి అర్హులే. ఆసక్తిని బట్టి దళిత రైతులకు కూడా అవకాశం కల్పిస్తాం. ఈ పథకంలో 8 రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతటికి 5 లక్షల పనస మొక్కలు, 10 లక్షల సీతాఫలం, 10 లక్షల జామ, 5 లక్షల కరివేపాకు, 5 లక్షల అల్లనేరడు, 10 లక్షల అరటి, 10 లక్షల మామిడి మొక్కలను సరఫరా చేసేందుకు వీలుగా ఆ మొక్కలను నర్సరీలలో పెంచుతున్నాం. రైతుల ఆసక్తికి అనుగుణంగా ఛత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం నుంచి ఆఫిల్‌బేర్‌ మొక్కలను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఏ వెరైటీ పండ్ల మొక్కలను సిద్ధం చేస్తున్నారు?

ఐదేళ్లలోపే దిగుబడి చేతికి వచ్చే మేలు రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తాం. ముఖ్యంగా జామలో అలహాబాద్‌ సఫేద, ఎల్‌ 49 రకాలు, సీతాఫలంలో బాలానగర్‌ రకం, మామిడిలో బంగినపల్లి, దషేరి, తోతాపురి, కేసరి, రాయల్‌ స్పెషల్‌ రకాలు, పనసలో ఒరిస్సా, పీకేఎం 1, అల్లనేరడిలో బాలనగర్‌ 2, అరటిలో గ్రాండ్‌ 9, శ్రీమంతం, రోబస్టా రకాలు అందుబాటులో ఉంటాయి.

మొక్కల పెంపకానికి అయ్యే నిర్వహణ ఖర్చులను రైతులకు ఎంత మొత్తంలో అందిస్తారు?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉద్యాన మిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానమిషన పథకాల ద్వారా అర్హులైన రైతులందరికి ఉచితంగానే పండ్ల మొక్కలను అందజేయడం జరుగుతుంది. కాని మామిడి ఒక్కొ మొక్కకు రూ.25లు చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల వరకు ఒక హెక్టారుకు రూ.52 వేలను నిర్వహణ ఖర్చుగా రైతులకు అందిస్తాం.

పండ్ల దిగుబడులను అమ్ముకునేందుకు రైతులకు మార్కెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారా ?
పండ్ల దిగుబడులు చేతికి వచ్చే సమయంలోపు ఉట్నూర్‌ మండలంలో రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే స్థల పరిశీలన చేయడం జరిగింది. 24 గంటలు పండ్లను అందుబాటులో ఉంచేందుకు కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేస్తాం. 

Credits : Andhrajyothi

మల్లెల సాగు.. లాభాల గుభాళింపు 

 • మంగళగిరి మండలంలో 400 ఎకరాల్లో సాగు.. ఎకరాకు 2 లక్షల ఆదాయం
 • హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్‌కు నిత్యం ఎగుమతులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతిచేరువలో ఉన్న పెదవడ్లపూడి గ్రామం నారింజతోటలు, కరివేపాకు సాగుతోపాటు మల్లెతోటలకూ పెట్టింది పేరు. పెదవడ్లపూడితో పాటు నిడమర్రు, బేతపూడి గ్రామాల్లోనూ మల్లెలు హెచ్చు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వేసవి వస్తే చాలు…మంగళగిరి మండలంలోని ఈ మూడు పల్లెలు మల్లెల పరిమళంతో గుభాళిస్తూ ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె తోటలు సాగవుతున్నాయి. ఇక్కడ సాగయిన మల్లెలు నేరుగా హైదరాబాదుకు నిత్యం రెండు టన్నుల వరకు ఎగుమతి అవుతాయి. విజయవాడ మార్కెట్‌ నుంచి విశాఖ, హైదరాబాదుకు మరో ఐదారు టన్నుల వరకు ఎగుమతి అవుతున్నాయి.
 

పండుగలు, పెళ్లిళ్ల వేళ.. మంచి ధర 

మిగిలిన పైర్లకు, మల్లె సాగుకు ఎంతో వ్యత్యాసం ఉంది. మార్కెట్‌లో మల్లె ధరకు నిలకడ ఉండదు. రోజుకో ధర పలుకుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సందర్భాలలో పూలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీంతో ధర అమాంతం పెరుగుతుంది. ముహూర్తాలు లేకున్నా, పండుగలు, పబ్బాలు తక్కువగా ఉన్నా ధరలు దారుణంగా పడిపోతాయి. దీనికితోడు వాతావరణం కూడా మల్లెల దిగుబడిని ప్రభావితం చేస్తుంటుంది. మల్లె రైతు మోము కళకళలాడాలంటే ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండాలి. సాధారణంగా మల్లెలు బహుళ వార్షిక గుల్మాలు. ఒక్కసారి మల్లె అంట్లు వేస్తే… మూడో ఏట నుంచి మాత్రమే పెట్టుబడి సరిపడా పూలు కోతలు వస్తాయి. మూడో ఏడు దాటిన తోటలకు ఎకరాకు రూ.75 వేల వంతున తీసుకుని యజమానులు తోటలు కౌలుకు ఇస్తారు. చీడపీడల నివారణ, కోత కూలీ ఖర్చులు ఎకరాకు రూ.లక్షన్నర పైచిలుకు ఉంటాయి. వడ్లపూడి ప్రాంత రైతులు మల్లెలతోపాటు కనకాంబరం, సీజన్ల వారీగా వచ్చే బంతి, చామంతి, లిల్లీ పూలను పండిస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు.

కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్న సాగు
నిడమర్రు, బేతపూడి గ్రామాల రైతులు తమ పూలను స్కూటర్లు, బైకులపై నేరుగా విజయవాడ పూల మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఈ రెండు గ్రామాల నుంచి విజయవాడకు నిత్యం ఏడు టన్నులకు పైగా పూలు వెళుతుంటాయి. ప్రస్తుతం పెదవడ్లపూడి మల్లె సాగు మైలవరం ప్రాంత రైతులను కూడా ఆకట్టుకుంది. దీంతో మైలవరం, ఆ పొరుగునే ఉన్న చండ్రగూడెం గ్రామాల్లో కూడా ఇంచుమించు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా నిత్యం విజయవాడ మార్కెట్‌కు మల్లెలు వస్తున్నాయి. సాధారణంగా ఒకింత ఉక్కపోతతో కూడిన ఉష్ణోగ్రతలు మల్లె కంతులు విరివిగా వచ్చేందుకు దోహదపడతాయి. ఇందుకు 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరమని రైతులు చెబుతున్నారు. 30 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు వుంటే వాతావరణంలోని తేమ, మంచుకు కంతులు సరిగా రావని రైతులు చెబుతున్నారు. అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే పూలు బాగా మెత్తబడి నాణ్యతను కోల్పోతాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజనలో కిలో మల్లె ధర వంద రూపాయలు దాటిపోతుందని కమీషన్‌ వ్యాపారి అన్నం వీరాంజనేయులు తెలిపారు. మల్లె ధరలు కనిష్టంగా కిలో రూ.పది నుంచి గరిష్టంగా రూ.రెండొందల వరకు వెళుతుంటుందని ఆయన చెప్పారు.

Credits : Andhrajyothi

పూలతోటతో.. లాభాల బాట…. 

 • పూల సాగుతో అధిక లాభాలు
 • వినూత్న ఆలోచనతో ముందుకు
 • పాలిహౌస్‌లో డెకరేషన పూల సాగు
 • మహా నగరాల్లో భలే డిమాండ్‌
 • ఆదర్శంగా నిలుస్తున్న తండ్రీకొడుకులు

వ్యవసాయమే జీవనాధారంగా బతికే ఆ కుటుంబానికి మరో ఆధారం లేదు. సంప్రదాయం పంటలతో నష్టాలు… ఎన్నో ఒడిదు డుకులు.. అయినా వ్యవసాయంలోనే వినూత్నంగా ఆలోచించి అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం కాలంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న డెకరేషన పూల సాగుపై దృష్టి సారించారు. వెంటనే ఆలోచనలను అమలు చేసి లాభాల బాటపట్టారు. అర ఎకరంలో సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పాలీహౌస్‌ ఏర్పాటు చేసి.. సుమారు ఏడు రకాల డెకరేషన పూల సాగు చేపట్టారు. అనతికాలంలోనే విజయం సాధించారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

యాదాద్రి జిల్లా :యాదగిరిగుట్ట మండలం సైదాపురం మదిర గ్రామమైన మైలార్‌గూడెం గ్రామా నికి చెందిన అల్లం అంజయ్య అతడి కుమారుడు వెంకటేష్‌ ఇరువురు రైతులే.. కొన్నేళ్లుగా వరి సాగు చేస్తూ నష్టాలపాల య్యారు. దీంతో వ్యవసాయం వది కొద్దిరోజులు హైదరాబాద్‌ పరిసర ప్రాం తాల్లో చిరు వ్యాపారాలు చేశారు. అయినా సంతృప్తి కలగలేదు. చివరకు వ్యవసాయంలోనే వినూతన్న బాటను ఎంచుకున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న డెకరేషన పూల సాగుపై దృష్టి పెట్టారు. వెంటనే ఏడు రకాల(జర్బార) మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. గ్రామంలో అర ఎకరంలో రూ.లక్ష పెట్టుబడితో పాలీహౌస్‌ ఏర్పాటు చేసుకున్నాడు. రెండు రోజుకోసారి పూలను కోసి.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు ప్రత్యేక బాక్సుల ద్వారా తరలిస్తారు.
 

మొక్కలు పూణే నుంచి.. 

పూల మొక్కలను పూణే నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆర్‌కెడీయా కంపెనీలో మొక్కల పెంపకానికి కావాల్సిన పాలీహౌస్‌ లభిస్తాయి. అయితే ఒక్కో మొక్కకు సుమారు రూ.35ల ధర ఉంటుందని, జీవిత కాలం మూడేళ్లు మాత్రమే..

హైదరాబాద్‌ జంట నగరాల్లో విక్రయం 
ప్రతిరోజు సుమారు 2000వేల పూలు కోసి.. హైదరాబాద్‌ జంట నగరాలకు తరలిస్తారు. సీజన్‌ బట్టి గిరాకీ ఉంటుంది. పూల ధర ఒక్కోటి రూ.2. 50లకు విక్రయిస్తారు. సీజనను బట్టి రూ.5వరకు విక్రయిస్తారు.

పూల పెంపకమే మేలు 
వరి సాగు కంటే ఎంతో మేలు.. మొక్కలను తక్కువ నీటితో సాగు చేసుకోవచ్చు. పెంపకంలో నియమాలు పాటిస్తే సమస్యలు ఉండవు. లాభాలు అధికంగా ఉంటాయి. ప్ర స్తుతం 20గుంటలు మాత్రమే సాగుచేశాం.

అల్లం అంజయ్య, రైతు


ప్రభుత్వం సహకరిస్తే.. 
ప్రభుత్వం సహకరిస్తే మరింత విస్తరి స్తాం. మూడేళ్ల క్రితం 20గుంటల్లో పాలీహౌస్‌ వేశాం. మొదట్లో కొంత నష్టం వచ్చినా.. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాం. 15మంది కూలీలతోపాటు కుటుంబం మొత్తం నిత్యం శ్రమిస్తున్నాం. 

Credits : Andhrajyothi