సెల్‌ సహకారి

వ్యవసాయంలో సాంకేతిక సాయం అందిస్తే రైతు నష్టపోడు. అలాగే పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు తగ్గ ఉత్పత్తి కూడా జరుగుతుంది అంటున్నారు డాక్టర్‌ వెంకట్‌ మారోజు. ఒకప్పటి వరంగల్‌ జిల్లా, జనగాంకి చెందిన ఈయన తాను ఎదుర్కొన్న ఇంగ్లిష్‌ ఇబ్బందుల్ని వెనక్కి నెట్టి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. చదివింది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అయినా రైతుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో సాంకేతికత ద్వారా వాళ్లకు చేరువయ్యారు. జనగాం నుంచి బోస్టన్‌ వరకు ఆయన చేసిన ప్రయాణం, రైతుల కోసం అందిస్తున్న సాంకేతిక సాయం ఏమిటి అనే వివరాలు ఆయన మాటల్లోనే… 

‘‘మాది రైతు కుటుంబం కానప్పటికీ నన్ను ఈ రంగం వైపు నడిపిన అంశం గురించి తెలుసుకునే ముందు నా గురించి కొంచెం చెప్పాలి మీకు. మా నాన్న టీచర్‌ కావడం వల్ల సొంతూరు జనగాంలోనే తెలుగు మీడియంలో చదువుకున్నాను. 1982-84లో ఇంటర్మీడియట్‌ పూర్తయ్యింది. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. రిజర్వేషన్‌ ఉండడం వల్ల సీటయితే వచ్చింది. కాని ఊళ్లో తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంగ్లిష్‌ మాట్లాడడం రాకపోయేది. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ రోజుల్లో మా ఊరి మొత్తం నుంచి ఏడాదికి ఒకరికి ఇంజనీరింగ్‌లో సీటు వచ్చేది. సీటు వచ్చినోడు ఊళ్లో హీరో. కాని యూనివర్శిటీకి వస్తే మా పరిస్థితి జీరో. ఎలాగోలా కష్టపడి చదవడం వల్ల మార్కులు బాగా వచ్చాయి. ఆ తరువాత ‘గేట్‌’లో కూడా మంచి స్కోర్‌ రావడంతో బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’లో చేరాను. ఇక్కడ మాత్రం రిజర్వేషన్‌ లేకుండానే సీటు వచ్చింది. అలా కొంత అదృష్టం, కొంత శ్రమ కలిసి అమెరికాలో పిహెచ్‌డి చేయగలిగాను.
ఊహించనిది జరిగింది!
ఇదంతా ఒక ఎత్తయితే నేను కలలో కూడా ఊహించని పరిణామం మరోటి నా జీవితంలో చోటుచేసుకుంది. ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్‌వన్‌ యూనివర్శిటీ అయిన ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఎంఐటి)లో ఎంబిఎ చేయడం. ఇది నేను పనిచేసిన ‘బోస్‌’ కంపెనీ వల్ల సాధ్యమైంది. బోస్‌లోని ఆటోమోటివ్‌ ఇండస్ర్టీలో పదిహేనేళ్లు ఉద్యోగం చేశాను. లగ్జరీ కార్లలో ఉండే స్పీకర్లు తయారుచేస్తారు ఇక్కడ. డెట్రాయిట్‌లో ఉన్న ఆటోమోటివ్‌ డివిజన్‌లో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పని చేశాను. ఆ తరువాత బోస్టన్‌కి వెళ్లాను. అక్కడ ఉన్నప్పుడే కంపెనీ వాళ్లు ఎంఐటిలో ఎంబిఎ చేసేందుకు స్పాన్సర్‌ చేశారు. నేను ఎంబిఎ చదువుతున్నప్పుడు మనదేశంలో మైక్రోఫైనాన్స్‌ బాగా నడుస్తోంది. దాని మీద పరిశోధన చేసి థీసిస్‌ రాశాను. అప్పుడు రైతు ఆత్మహత్యలు నా మనసుని కదిలించాయి. దాంతో మనదేశానికి వచ్చి సామాజిక కోణం ఉన్న అంశం మీద పనిచేయాలి అనిపించింది. దాంతో 2009లో అమెరికాలో ఉద్యోగం వదిలేసి, మన దేశానికి వచ్చాను. కరీంనగర్‌లోని ముల్కనూరు సహకార సంస్థ ద్వారా రైతులకి సాయపడదాం అనుకున్నాను. అయితే అది ఎన్జీవోగా నడుస్తోందే కాని అంతకు మించి పెరగడంలేదు. ఆ సంస్థను విస్తరిస్తే చాలామందికి సాయం చేసినట్టు ఉంటుందని మొదలుపెట్టి మూడేళ్లు బాగా కష్టపడ్డాను.

ఆలోచన నచ్చి… 

ఇప్పుడు నేను సిఇఓగా ఉన్న ‘సోర్స్‌ట్రేస్‌ సిస్టమ్స్‌’ వాళ్లు మైక్రోఫైనాన్స్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌నే తయారుచేసేవాళ్లు. అమెరికాలో ఉన్న ఈ సంస్థ ఇన్వెస్టర్లకు నేను అడ్వైజరీగా చాలాకాలం ఉన్నాను. ఒకసారి వాళ్లు నాతో ‘కంపెనీ సరిగా నడవడం లేదు. మీరేమైనా చూస్తారా’ అని అడిగారు. వాళ్లు నన్ను ఆ విషయం అడిగేటప్పటికి వ్యవసాయానికి సంబంధించి నాకు కొంత పరిజ్ఞానం ఉంది. అప్పటికి మనదేశంలో మైక్రోఫైనాన్స్‌ స్కీంలో ఇబ్బందులు ఎదురై అది వెనక్కి పోయింది. దాన్ని ఈ సంస్థ చేస్తున్న పనితో కలిపితే బాగుంటుందనే నా ఆలోచనను వాళ్లకి చెప్పాను. ఆలోచన నచ్చి సంస్థ పూర్తి బాధ్యతలు నాకే అప్పగించారు. బాధ్యతలు స్వీకరించాక ‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌ ప్రొడక్ట్‌’ తయారుచేశాం. మా సంస్థ తయారుచేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ చిన్న, సన్నకారు రైతులతో పనిచేసే సహకార సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వాలు, విత్తన పంపిణీదారులకి మొబైల్‌ ద్వారానే వ్యవసాయానికి, రైతులకి సంబంధించిన సమస్త సమాచారం అందచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు దాదాపు ఒకేలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. 20 దేశాల్లో మూడు లక్షల మంది రైతులు మా కంపెనీతో ఉన్నారు. ఇండియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో మా సాంకేతిక సేవలు అందిస్తున్నాం.
 

ఉత్పత్తి పెంచాలి.. 

ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు అయితే అందులో రెండు వందల కోట్లు రైతు కుటుంబాలే. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది చిన్న రైతులు ఉన్నారు. ఈ రైతులే 70 శాతం ఆహారం ఉత్పత్తి చేస్తున్నారు. కాని ఆ రైతులు పేదరికంలో ఉంటున్నారు. మా లెక్కల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లు దాటే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడున్న దానికంటే 50 నుంచి 70 శాతం ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. కాని ఆఫ్రికాలో తప్ప మరెక్కడా పంటసాగుకి ఖాళీ భూమి లేదు. అలాగే ఈ రైతులు ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్లు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల ఎక్కువ దిగుబడి చేయలేకపోతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి పెంచే పద్ధతులు రైతులకి సూచించడం, చిన్న రైతుల సాధికారత, పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయం అనే అంశాలపై దృష్టి పెట్టాం. అలాగే లాభాల కోసం ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది, దళారుల చేతుల్లో పడకుండా పంటలాభం నేరుగా రైతులకి ఎలా చేరుతుంది అనే అంశాల మీద కూడా దృష్టి పెట్టాం. అయితే నేరుగా రైతు మా సాఫ్ట్‌వేర్‌ను వాడాలనేది మా లక్ష్యం కాదు. సహకార సంస్థలు, ప్రభుత్వం, ఎన్జీవోలు, రైతులతో పనిచేసే సంస్థలు, కంపెనీలు – వీటి ద్వారా రైతులకి సాయం అందుతుంది. ఒకరొకరుగా కాకుండా సమూహంగా ఏర్పడితే రైతులకి ఎక్కువ లాభం కలుగుతుంది.
 

మధ్యవర్తులు లేని మార్కెటింగ్‌.. 

రైతులు సమూహంగా ఉంటే విత్తనాల నుంచి పంట మార్కెటింగ్‌ వరకు మేలు జరుగుతుంది. వెయ్యిమంది రైతులు కలిసి ఉంటే వాళ్లకు బేరమాడే శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి ముల్కనూర్‌నే తీసుకుంటే అక్కడి రైతులు ఎరువులు, విత్తనాల వంటి వాటికోసం లైన్లో నిల్చోరు. రైతుల దగ్గరికే వాటిని పంపుతాయి కంపెనీలు. అలాగే అప్పు కావాలన్నా వెయ్యిమంది రైతులు కలిస్తే దొరకడం సులభం అవుతుంది. మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ఒక్కో రైతు పంట నిల్వ చేయాలన్నా సమస్యే. సమూహంగా ఉంటే కొద్ది డబ్బు జమ చేసుకుని, అప్పు తెచ్చుకుని ‘వేర్‌హౌజ్‌’లు కట్టుకోవచ్చు. అలాగే రైస్‌మిల్లులో బియ్యం పట్టించి అమ్మితే వడ్లు అమ్మిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఇలాంటి ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. మనదేశంలో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 

సరైన సమయంలో.. సరైన సమాచారం.. 
అలాగే మీకో సహకారసంస్థ ఉంటే కనుక అందులో ఉన్న రైతుల సమాచారమంతా మా దగ్గర ఉంటుంది. ఫలానా రైతుకి భూమి ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనే సమాచారాన్నంతా నిక్షిప్తం చేస్తాం. పెద్ద కంపెనీలకు ఇది ఉపయోగపడుతుంది. సరైన సమయంలో సరైన సమాచారం ఉండడం వల్ల కంపెనీలకే కాదు రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. పంట సమయంలో సూచనలు ఇవ్వడం, వర్షం ఎక్కువ పడినా, తక్కువ పడినా ఏం చేయాలి వంటివన్నీ వాళ్లు ఎప్పటికప్పుడు రైతులకి అందించొచ్చు. ఇలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మరెన్నో అంశాలు ఉన్నాయి. మనందరికీ తిండి గింజలు అందించే రైతు అప్పులపాలై, ఆర్థిక ఇబ్బందులతో దీనంగా జీవించడం మనకే మాత్రం మంచిది కాదు. రైతు రాజులా జీవించాలి. అప్పుడే మనందరం బాగుంటాం. సమాజం మెరుగుపడుతుంది.’’

‘‘జనగాంలో తెలుగు మీడియం చదివిన వెంకట్‌కు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు అంతా గందరగోళంగా అనిపించింది. ఈ ఇంగ్లి ష్‌తో నెగ్గుకురాగలనా అనుకున్నారు. కాని ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ రైతులకోసం పనిచేస్తున్నారు’’

 • ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో నన్ను చూసి మా స్నేహితుల్లో ఎక్కువమంది ‘‘సంపాదించినదంతా పొలాల మీద పెట్టి ఎందుకు వృథా చేస్తావు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టు’’ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో డబ్బులు పెడితే మనసుకు ఏం తృప్తి ఉంటుంది. అందుకే నేను నా మనసుకి తృప్తినిచ్చే ఈ రంగాన్ని వదలకుండా పనిచేస్తున్నాను.
 • 2020 వరకు కోటి మంది రైతులకు మా సాఫ్ట్‌వేర్‌ ద్వారా సేవలందించాలి. 50 దేశాల్లో కోటి మంది రైతులకు సేవలందించాలనేదే మా లక్ష్యం. ఈ సాఫ్ట్‌వేర్‌ ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం మొదట్లో చాలా కష్టం అయ్యింది. మా సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌ పేరు

‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌’. 

 • ‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌’ పనుల్లో భాగంగా ప్రతిరోజూ పది దేశాల వాళ్లతో మాట్లాడుతుంటాం.
 • మన దగ్గర అరకు లోయలో ఉండే గిరిజనులకి మా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడింది. రాజమండ్రి వద్ద యానాది వాళ్లు ఎండ్రకాయలు పట్టి అమ్ముతుంటారు. అవి అమెరికాలో చాలా ఎక్కువ ధర ఉంటాయి. కాని ఇక్కడ వాళ్లకు ఆ విషయం తెలియదు. వాళ్లకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం.
Credits : Andhrajyothi

వరిని మింగే పాముపొడ తెగులు 

 ‘‘తనకు అవసరమైన ప్రతీది చిల్లరగా కొనుగోలు చేసే రైతన్న.. తన ఉత్పత్తులను మాత్రం టోకుగా అమ్మాల్సి వస్తోంది. ఇలా రెండు విధాలుగా అన్నదాత నష్టపోతున్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో ఈ దుస్థితి ఎవరికీ లేదు’’
– జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ (అమెరికా మాజీ అధ్యక్షుడు)
రబీలో వరి, మినుము, పెసర, వేరుశనగ, చెరకు సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై శాస్త్రవేత్తల సూచనలు ఇవి. ఆంధ్రప్రదేశ రైతాంగానికి ఆచార్య ఎనజి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. చేస్తున్న ఈ సూచనలు ఏప్రిల్‌ 3 నుంచి 9వ తేదీ వరకు వర్తిస్తాయి.

వరిని వేధించే పాము పొడ తెగులు 

మార్చిలో వరి పంట చిరుపొట్ట దశ నుంచి పాలు పోసుకుని గట్టిపడే దశ వరకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వరి పంటకు పాము పొడ తెగులు సోకే ప్రమాదం ఉంది. వరి దుబ్బు మొదటి భాగం దగ్గర లేదా నీటి మట్టానికి దగ్గరగా ఆకు మట్టల మీద నల్లని నీటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపీ మొక్కల అగ్రభాగం లేదా వెన్ను వరకు వ్యాపిస్తాయి. ఫలితంగా మొక్క చనిపోతుంది. ఈ పాము పొడ తెగులు నివారణకు పొలంలో నీటిని తీసివేసి హెక్సాకోనజోల్‌ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన 20 మిల్లీలీటర్లు లేదా ప్రోపికోనజోల్‌ 1 మిల్లీలీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పిచికారీ చేయాలి. దీంతో పాటు కాండం కుళ్లు తెగులు కూడా వరి పంటను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. పొలంలో అక్కడక్కడా ఒక దుబ్బులో 1 లేదా 2 పిలక అకులు పండుబారి పిలక వడలిపోతుంది. పంట దశ పెరిగే కొద్దీ తెగులు ఎక్కువై దుబ్బు పూర్తిగా ఎండిపోతుంది. కాండం కుళ్లు తెగులును ప్రారంభ దశలోనే గుర్తించి హెక్సాకోనజోల్‌ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన 2 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి మొదళ్లు బాగా తడిసేలా పిచికారీ చేయాలి.
 

మినుము, పెసరకు తెల్లదోమ 

ఈ రెండు పంటలకు ఈ సమయంలో పల్లాకు తెగులు, తలమాడు తెగులు, సీతాఫలం తెగులు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు పైరు చుట్టూ నాలుగు వరుసలు మొక్కజొన్న లేక జొన్న విత్తుకున్నట్టయితే వైరస్‌ తెగుళ్లు వ్యాపింపజేసే తెల్లదోమ, తామరపురుగులు మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు. ఇమిడాక్లోప్రిడ్‌ 5 మిల్లీలీటర్లు లేదా ధయోమిథాక్సమ్‌ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పైరును తొలిదశలోనే వైరస్‌ తెగులు వ్యాపింపజేసే రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు.
   తెగులు సోకిన మొక్కలను తొలిదశలోనే పీకి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడా పసుపు రంగు (తెల్లదోమలకు) నీలం రంగు (తామరపురుగులకు) జిగురు అట్టలను ఉంచినట్లయితే వాటి ఉనికిని, ఉధృతిని అంచనావేయవచ్చు. రసం పీల్చే పురుగుల నివారణకు 15-20 రోజుల వయసులో వేపగింజల కషాయం 5ు లేక వేపనూనె 5 మిల్లీలీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రాము లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్‌ 1.5 మిల్లీలీటరు లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్‌ లేదా 1.5 మిల్లీలీటర్ల ఫ్రిప్రోనిల్‌ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్‌ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 

పూత దశలో పొద్దుతిరుగుడు

పొద్దుతిరుగుడు పంట ప్రస్తుతం పూత దశలో ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల తేనెటీగల సంఖ్య తగినంతగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య సున్నితమైన గుడ్డతో పువ్వుల మీద వలయాకారంలో రుద్దాలి. ఇలా 15 రోజుల పాటు చేయాలి. రోజు మార్చి రోజు కూడా ఈ పని చేస్తే గింజ బాగా కడుతుంది. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. మొగ్గతొడిగే దశ, పువ్వు వికసించే దవ, గింజకట్టే దశలను కీలక దశలుగా పరిగణించి పంటను బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. సాలు మార్చి సాలుకు నీరు పెట్టినట్టయితే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
 

ప్రత్తిలో రసం పీల్చే పురుగుల బెడద 
వేసవి ప్రత్తిలో రసం పీల్చు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఉధృతిని తగ్గించడానికి వాటి ఉనికిని నిర్ధారించుకుని ప్రత్తి పంటలో తప్పనిసరిగా పసుపురంగు జిగురు అట్టలు ఎకరాకు 20 చొప్పున పెట్టుకోవాలి. పంట మొదటి 60 రోజుల వరకు రసం పీల్చు పురుగుల అదుపునకు నియోనికోటినాయిడ్‌ మందులైన ఇమిడాక్లోప్రిడ్‌, ఎసిటామిప్రిడ్‌లను వాడకుండా ఎసిఫేట్‌, మోనోక్రోటోఫాస్‌, ఫిప్రోనిల్‌ లేక టైజోఫాస్‌ వంటి పురుగుల మందులను అవసరాన్ని బట్టి పిచికారీ చేసుకోవాలి.

Credits : Andhrajyothi

పిచికారీ మందులతో వరిలో అగ్గితెగులుకు చెక్‌

 • రంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సూచనలు
వరి రైతులకు: పైరు ఆకులపై నూలు కండె ఆకారపు అగ్గి తెగులు మచ్చలు గమనించిన వెంటనే పిచికారీ మందులు ఉపయోగించాలి. ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రాములు లేదా ఐసోస్రోథయోలేన 1.5 మిల్లీలీటరు మందును లీటరు నీటిలో కలిపి పైరుపై బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. నత్రజని ఎరువును అవసరమైన మేరకే పైపాటుగా వేయాలి.
పత్తిరైతులూ తస్మాత జాగ్రత్త: నీటి వసతి ఉన్నా పత్తి పంటను ఆరు నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలం పొడిగించడం వల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలిదశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను రోటావేటరుతో భూమిలో కలియదున్నాలి.
తలమాడు నివారణ ఇలా: వరి మాగాణులలో వేసిన మినుములు, పెసర పైర్లుకు వైరస్‌ కారణంగా తలమాడు, మొవ్వుకుళ్లు తెగులు ఆశిస్తుంది. తామరపురుగుతు దీని వ్యాప్తికి దోహదం చేస్తాయి. బెట్ట వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. మొక్క పెరిగే తలభాగం మాడి మొక్కలు ఎండిపోతాయి. తామరపురుగును నివారిస్తే ఈ తెగులు తగ్గుతుంది. అందుకోసం 200 గ్రాముల ఎసిఫేట్‌ లేదా 320 మిల్లీ గ్రాములు మోనోక్రోటోఫాస్‌ లేదా ప్రిఫోనిల్‌ 300 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్‌ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోస్లాడ్‌ 60 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి వారం వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు మినపైరు పైరును, 30-35 రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు ఆశిస్తుంది. మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమరంగు మచ్చలు ఏర్పడి, ఆ తరువాత మచ్చలు పెద్దవై ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఎండిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములు లేది మాంకోజబ్‌ 2.5 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కంది రైతుల కోసం: రబీలో కంది పంట వేస్తే అది ఇపుడు పూత, కాయ దశలో ఉంటుంది. ఈ దశలో కందిని మారుకామచ్చల పురుగు, కాయ ఈగ పురుగు సోకే అవకాశం ఉంది. గత వారం పెసర, మినుములో మారుకామచ్చ పురుగు నివారణకు చేసిన సూచనలను కంది విషయంలో కూడా పాటించాలి. కాయ ఈగ కంది రైతులకు తీవ్ర నష్టం కలుగచేస్తుంది. మామూలు ఈగ కంటే చిన్నదిగా ఉండే ఈ ఈగ ఉనికి సులువుగా తెలియదు. కాయలను ఒలిచి, గించజలను గమనిస్తే దీని ఉధృతి తెలుస్తుంది. దీని నివారణకు ఎకరాకు 8-10 కిలోలల వేపగింజల పొడి కషాయాన్ని పిందె దశలో పిచికారీ చేయాలి. అంతర్వాహిక కీటకనాశనులైన మోనోక్రోటోఫాస్‌ 36 శాతం, ఎస్‌ఎల్‌ 1.6 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్‌ 30శాతం ఇసి. 2.0 మిల్లీలీటరు, లేదా ప్రొఫినోఫాస్‌ 2.0 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిందె దశలో పిచికారీ చేయాలి.
మరిన్ని సలహాల కోసం రైతులు ఉచిత ఫోన్ నెంబర్‌
1800 425 0430 కు ఫోన చేయవచ్చు.
Credits : Andhrajyothi

వేప పిండిలో యూరియా.. వరికి సిరి!

ఆంధ్రప్రదేశ్ రైతాంగం రబీలో అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఆచార్య ఎన.బి.రంగా వ్యవసాయ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న సూచలు ఇవి. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు ఏ పంటలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలనే అంశంపై ఈ సూచనలు వర్తిస్తాయి.

అంకుర దశలో వరి పైరు

ఈ సమయంలో రబీ వరి పంట దుబ్బుకట్టే దశ నుంచి అంకురం ఏర్పడే దశ లో ఉంటుంది. ఈ దశలో వరి సాగు చేసే రైతులు ఏం చేయాలి? ఎరువులు ఎలా వాడాలో చూద్దాం. పైరు అంకురం ఏర్పడే దశలో చివరి దఫా నత్రజనిని పైపాటుగా వేయాలి. యూరియా ఎరువును పొలంలో నీటిని తీసివేసి, బురద పదునులో వేయాలి. 48 గంటల తరువాత మరలా నీరు పెట్టాలి. యూరియాను వేపపిండిలో కలిపి వేస్తే పైరుకు బాగా ప్రయోజనం చేకూరుతుంది. కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా వేయకూడదు. చిరుపొట్ట దశ తరువాత పైరుపై ఎలాంటి ఎరువులు వేయకూడదు. జింకులోపం లక్షణాలు కనిపిస్తే 0.2 శాతం చొప్పున జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

మారుకా మచ్చల పురుగు నివారణ

వరి మాగాణులలో వేసిని మినుములు, పెసర పైర్లు ప్రస్తుతం 30-40 రోజుల వయసులోను, మరికొన్ని పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో పంటకు మారుకా గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి పూత ప్రారంభం దశలో వేప నూనె లేదా వేపగింజల కషాయం 5 శాతాన్ని పిచికారీ చేస్తే ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. అలాకాక పురుగు మొగ్గలలో పిందెలలో కనపడినట్లయితే క్లోరిఫైరిఫాస్‌ 20 శాతం ఇ.సి 2.5 మిల్లీలీటర్లు లేక క్వినాల్‌ఫాస్‌ 25 శాతం ఇ.సి, 2 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్‌ 75 శాతం ఎస్‌పి 1 గ్రాము ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరులో గూళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే క్లోరిఫైరిఫాస్‌ 20 శాతం ఇసి 2.5 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన 10 శాతం ఇసి 1.0 మిల్లీలీటరు లేదా స్పైనోశాడ్‌ 45 శాతం ఎస్‌సి 0.3 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్‌ 75 శాతం డబ్ల్యు.పి. 1 గ్రాము లేక రినాక్సిఫిర్‌ 18.5 ఎనసి 0.3 మిల్లీలీటరు లేక ఇమామెక్టిన బెంజోయేట్‌ 5 శాతం ఎస్‌జి 0.4 గ్రాము లేక ఫ్లుబెండిఎమైడ్‌ 40 శాతం ఎస్‌.సి 0.2 మిల్లీలీటరు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వారం వ్యవధిలో మందును మార్చి మరల పిచికారీ చేసుకోవాలి.

పొగాకు లద్దెపురుగు నివారణ

తొలి దశలో లద్దెపురుగు ఆకులలో పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడ ఆకులుగా మారిపోతాయి. ఈ పురుగులు పెద్దవై ఆకులను, పూత, పిందెలు, కాయలను తినివేస్తాయి. పెద్దపురుగులు పగటి పూట నీడలో నీల మీద ఉండి, రాత్రిపూట పైరుకు నష్టం చేకూరుస్తాయి. పైరులో ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టి తల్లి పురుగు ఉధృతిని గమనించాలి. తల్లిపురుగులు ఆకు అడుగుభాగాన గుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ ఆకులను తుంచి, గుడ్లను నాశనం చేయాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్‌ 36 శాతం ఎస్‌ఎల్‌ 1.6 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్‌ 75 శాతం ఎస్‌పి 1 గ్రాము లేదా క్వినాల్‌ఫాస్‌ 25 శాతం ఇసి 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్‌ 20 శాతం ఇసి 2.5 మిల్లీలీటర్లు నొవాల్యురాన 10 శాతం ఇసి 1 మిల్లీలీటరు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులు పెద్దవై, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో విషపు ఎరను మొక్క మొదలు దగ్గరపడేలా చల్లి పురుగును నివారించుకోవాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, ఒక లీటరు మోనోక్రోటోఫాస్‌ 36 శాతం ఎస్‌ఎల్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌ 20శాతం ఇసిని కలిపి చిన్నచిన్న ఉండలుగా తయారు చేసుకొని, సాయంత్రం పొలంలో వెదచల్లాలి. బాగా ఎదిగిన గొంగళి పురుగులను సమర్థంగా అరికట్టడానికి ఇది సరైన పద్ధతి.

సకాలంలో తడులతో వేరుశనగకు రక్ష

రాష్ట్రంలో సాగవుతున్న రబీ శనగపంట ప్రస్తుతం పూత, వూడలు, కాయలు, గింజ అభివృద్ధి దశల్లో ఉంది. ఈ దశల్లో రైతులు పంటకు నీటి ఎద్దడి తగలకుండా భూమి స్వభావాన్ని బట్టి సకాలంలో నీటి తడులు ఇస్తే అధిగ దిగుబడులు సాధించవచ్చు. పంట ఈ దశల్లో ఉన్నప్పుడు ఆకుముడత పురుగు ఆశించే అవకాశం ఉంది. తల్లిపురుగు తెల్లని మెరిసే గుడ్లను ఆకు అడుగుభాగాన మధ్య ఈనెకి పక్కన పెడుతుంది. గ్రుడ్డు నుండి వెలువడిన గొంగళి పురుగు ఆకు పొరల మధ్య చేరి పత్రహరితాన్ని తింటుంది. తరువాత దశలో పక్కన ఉన్న ఆకులను కలిపి గూడులా కట్టుకుని లోపల పచ్చదనాన్ని తినివేసి ఆకులు ఎండిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు అంతర పంటలుగా జొన్న లేక సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి. సోయాచిక్కుడు తర్వాత వేరుశనగ సాగు చేయరాదు. ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలుపెట్టి రె క్కల పురుగు ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నప్పుడు క్రిమి సంహారక మందులు వాడవలసిన అవసరం లేదు. ఈ పురుగు నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్‌ 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన 1 మిల్లీమీటరు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి 12 రోజుల వ్యవధిలో రెండవ సారి తప్పని సరిగా పిచికారీ చేయాలి.

మాఘీ జొన్న 
కోతకు సిద్ధంగా ఉన్న పంటను కోయాలి. కంకులలోని గింజలు తెల్లగా మారి, గింజలలో పాలు ఎండిపోయి, పిండిగా మారరినప్పుడు గింజల క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడే పంటను కోయాలి. కంకులను పల్చగా ఆరబెట్టి నూర్పిడి చేసి బాగా ఆరిన గింజలను
నిల్వ చే యాలి.

పశువుల ఎరువుతో చెరకుకు చేవ 

కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మొక్కతోట నాటడానికి నేలను లోతుదుక్కి చేసి, ఎకరానికి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. మధ్యకాలిక చెరకు రకాలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రాజిన లేదా 600 గ్రాముల మెట్రి బ్యూజిన అనే కలుపునాశక మందులు చెరుకు సాళ్ళలో, దిబ్బల మీద పిచికారీ చేయాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరుకు చెత్తను కప్పాలి. జనవరిలో నాటిన మొక్క తోటలకు రెండవ దఫా నత్రజని ఎరువును మొక్కల దగ్గర గుంతలు తీసి వేయాలి.
మరిన్ని సలహాల కోసం రైతులు ఉచిత
ఫోన నెంబర్‌ 1800 425 0430 కు ఫోన చేయవచ్చు
Credits : Andhrajyothi

పత్తి రైతులూ తస్మాత జాగ్రత్త 

‘‘తనకు అవసరమైన ప్రతీది చిల్లరగా కొనుగోలు చేసే రైతన్న.. తన ఉత్పత్తులను మాత్రం టోకుగా అమ్మాల్సి వస్తోంది. ఇలా రెండు విధాలుగా అన్నదాత నష్టపోతున్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో ఈ దుస్థితి ఎవరికీ లేదు’’
-జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ (అమెరికా మాజీ అధ్యక్షుడు)

తక్షణ చర్యలతో కాయతొలిచే పురుగుకు చెక్‌ 

రాష్ట్ర రైతాంగం ఫిబ్రవరి 6 నుంచి 12 తేదీ వరకు వివిద పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఆచార్య ఎన.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి ఒకటి, రెండు వారాల్లో వరిపైరుకు నూలు కండె ఆకారంలో ఉండే అగ్గితెగులు ఆశించే ప్రమాదం ఉంది. ఆ తెగులు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రాములు లేదా ఐసోప్రాథయోలీన 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలపి పైరుపై బాగా తడిసేలా పిచికారీ చేయాలి. నత్రజని ఎరువును అవసరమైన మోతాదులో పైపాటుగా వేయాలి. ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి.

పత్తి రైతులూ జాగ్రత్త

ప్రధాన పత్తి పంట పూర్తయిన వెంటనే పంట విరామాన్ని తప్పక పాటించాలి. ఎలాంటి పరిస్థితుల్లో వేసవి పంటను కానీ, అప్పటికే ఉన్న పంటను కార్శి పంటగా పొడిగించటం కానీ చేయరాదు. అలా చేయడం వల్ల పత్తిని ఆశించే పురుగుల జీవిత చక్రాన్ని నిరోధించి, వచ్చే పంటకాలంలో పురుకు ఉనికిని, ఉధృతిని తగ్గించే వీలుంటుంది. పంట తీసి వేసిన తర్వాత పొలంలో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తిమోళ్లను పొలంలో లేక ఇళ్ల వద్ద వంట చెరకుగా వాడేందుకు నిల్వ చేయకూడదు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నిం గ్‌ చేయగా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకుండా నాశనం చేయాలి. ఈ పురుగు ఆశించిన పత్తిని కూడా రైతులు ఇళ్లవద్ద కానీ లేదా జిన్నింగ్‌ మిల్లుల వద్ద కానీ నిల్వ చేయకూడదు.

చెరకు రైతులకు సూచనలు

ఫిబ్రవరిలో నరికిన మొక్కతోటలను కార్శి చేయడానికి, నేలమట్టానికి పదునైన కత్తితో మొదళ్లు నరికి, ఆయా ప్రాంతాల నేల స్వభావాన్ని బట్టి సిఫారసు చేసిన నత్రజనిలో సగభాగం, భాస్వరం, పొటాష్‌ ఎరువులు చెక్కిన దుబ్బులు గుంతలు తీసి, ఎరువు వేసి మట్టిని కప్పాలి. తదుపరి తడి ఇవ్వాలి. మోళ్లు చెక్కిన తరువాత దుబ్బుల నుంచి బలమైన పిలకలు అభివృద్ధి చెందేందుకు వీలుగా వరుసల మధ్య నాగలితో అంతరకృషి చేయాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరుకు చెత్తను కార్శి చేసి, ఎరువులు వేసి, తడి ఇచ్చిన వెంటనే సమంగా పలుచగా కప్పాలి.

పొద్దు తిరుగుడుకు బూడిద తెగులు

ఫిబ్రవరిలో బూడిద తెగులు పొద్దుతిరుగుడు ఆకులపైన, అడుగుభాగంలో కప్పి ఉంటుంది.. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడిని లేదా 1 గ్రాము ప్రోపికొనజోల్‌ లేదా 0.5 గ్రాము డైఫ్‌నకోనజోల్‌ 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు లార్వాలు, పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగ జేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే క్వినాల్‌ఫాస్‌ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్‌ 0.3 మిల్లీలీటర్లు లేదా నొవల్యురాన 1 మిల్లీలీటరు లేదా మోనోక్రొటోఫాస్‌ లేదా ధయోడికార్బ్‌ 1 గ్రాము మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రైతులు మరిన్ని సలహాల కోసం ఈ ఉచిత ఫోన నెంబర్‌కు ఫోన చేయవచ్చు. 1800 245 0430 

మినుముకు తలమాడు తెగుళ్లు 
వరి మాగాణుల్లో వేసిన మినుము, పెసర పంటలు ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల వయసులో, కొన్ని ప్రాంతాల్లో పూత, పిందె దశల్లో ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాల్లో మినుము పంటకు తలమాడు తెగులు ఉధృతంగా ఉంది. దీన్నే మొవ్వకుళ్లు తెగులు అంటారు. ఇది వైరస్‌ వల్ల కలుగుతుంది. తామరపురుగులు దీని వ్యాప్తికి కారణం. మొక్క పెరిగే తల భాగం మాడి మెక్కలు ఎండిపోవడం ఈ తెగులు లక్షణం. ఆకుల అంచులు ముడుచుకుని గిడసబారి రాలిపోతాయి. ఈనెలు రక్తవర్ణానికి మారతాయి. తామర తెగులు నివారణకు 200 గ్రాముల ఎసిఫేట్‌ లేదా 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్‌ లేదా ఫిఫ్రోనిల్‌ 300 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్‌ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్‌ 60 మిల్లీలీటర్ల మందును ఉధృతిని బట్టి, వారం వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.

Credits : Andhrajyothi

ట్రైకోకార్డులతో పీకపురుగు చెక్‌ 

ఆంధ్రప్రదేశలో చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. పచ్చఆకు వైరస్‌ దేశవ్యాప్తంగా చెరకు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ తరుణంలో చెరకు సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలోని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి రైతులకు ఇస్తున్న సూచనలివి.

ఫిబ్రవరిలో నరికిన మొక్క తోటలను కార్శి చేపడతారు రైతులు. ఆ సమయంలో నేల మట్టానికి పదునైన కత్తితో మొదళ్లు నరికి, ఆయా ప్రాంతాలకు సిఫారసు చేసిన నత్రజనిలో సగభాగం భాస్వరం, పొటాష్‌ ఎరువులు…చెక్కిన దుబ్బుల దగ్గర గుంతలు తీసి ఎరువు వేసి మట్టితో కప్పాలి. ఆ తరువాత తడి ఇవ్వాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కార్శి చేసి, ఎరువులు వేసి తడి ఇచ్చిన వెంటనే సమంగా పలుచగా కప్పాలి. కార్శి తోటలో మొక్కల సాంద్రతను బట్టి ఖాళీల భర్తీ తప్పక చేపట్టాలి. డిసెంబర్‌/జనవరిలో కార్శి చేసిన తోటలకు 45 రోజులకు రెండవ దఫా నత్రజని ఎరువును వాడుకోవాలి. నీటి వసతిని బట్టి తేలిక నేలల్లో వారానికి ఒక తడి, బరువు నేలల్లో 12-15 రోజులకు ఒక తడి ఇస్తే పీక పురుగు నివారింపబడి చెరకు తోటలో మంచి పిలకలు అభివృద్ధి చెందుతాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో మొక్కతోట నాటడానికి నేలను లోతు దుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. మధ్యకాలిక చెరకు రకాలను నాటడానికి, మొదటిగా చాళ్ళలో భాస్వరం, పొటాష్‌ ఎరువులు వాడుకోవాలి. చెరకు నాటిన మూడు రోజులలోపు ఎకరానికి రెండు కిలోల అట్రాజిస్‌ లేదా 600 గ్రాముల మెట్రిబ్యుజిన్‌ అను కలుపు నాశన మందులు చెరకు సాళ్ళు దిబ్బలపై పిచికారీ చేయాలి. ఎకరానికి 1.3 టన్నుల చెరకు చెత్తను కప్పాలి. జనవరిలో నాటిన మొక్కతోటలకు రెండవ దఫా నత్రజని ఎరువును మొదళ్ళ దగ్గర గుంతలు తీసివేయాలి. ఫిబ్రవరి మాసంలో పిలక కార్శి తోటలలో పీకపురుగు ఉనికిని గమనించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పీకపురుగు నివారణకై ట్రైకోకార్డులు వాడకం చాలా లాభదాయకం. 87ఏ 298 (విశ్వామిత్ర) రకానికి కొరడా తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కతోటల్లో ముచ్చెలు నాటే ముందు ప్రొపికొనజోల్‌ మందుతో లీటరు నీటికి 1.0 మి.లీ. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. మొక్కతోటల్లో కంటే కార్శి తోటల్లో కొరడా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రొపికొనజోల్‌ మందును ఒక మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి కార్శి చేసిన వెంటనే ఒకసారి, కార్శి చేసిన 30-40 రోజులకు మరొకసారి పిచికారీ చేయాలి.

మార్చిలో సస్యరక్షణ ఇలా

చెరకు మొక్కతోట, కార్శి వర్షాధారపు చెరకు తోటలను నరికి చెరకును వీలైనంత తొందరగా కర్మాగారాలకు తరలించాలి. మొక్క తోటల్లో (డిసెంబరు/జనవరి తోటలకు) రెండవ దఫా నత్రజని మోతాదును వాడుకోవాలి. కూలీల లభ్యతను బట్టి మొక్కతోటలకు కొద్దిగా మొదళ్ళకు మట్టిని ఎగదోయడం వల్ల పీకపురుగు ఉధృతిని తగ్గించి, కలుపు సమస్యను కొంత మేరకు నివారించుకోవచ్చు. మొక్క తోటలకు కలుపు నివారణకు ఎకరానికి 1.8 కిలోల 2,4 డి ఒక లీటరు గ్రామక్సోన్‌ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్‌+ 1 కిలో 2,4డి కలిపిన ద్రావణాన్ని చెరకు చాళ్ళ మధ్య పిచికారీ చేసుకోవాలి. 2,4 డి గ్రామాక్సోన్‌ వాడునపుడు, ద్రావణం చెరకు చాళ్ళపై పడకుండా జాగ్రత్తపడాలి. డిసెంబరు/ జనవరిలో నాటిన మొక్క తోటలు తోటలకు నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలల్లో వారం, పది రోజులకు బరువైన నల్లనేలల్లో 15 నుంచి 20 రోజులకు ఒక తడి చొప్పున నీటి తడులు ఇచ్చి పంట పిలకలు తొడుగు దశ బెట్టుకు గురికాకుండా చూసుకోవాలి. చెరకు మొక్క లేదా కార్శి తోటల్లో పండ మార్చి మాసం (వేసవి) నుంచి పంట బెట్టకు గురికాకుండా నీటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. డిసెంబరు/జనవరి మొక్కతోటల్లో సాగు చేసిన పుష్ప ధాన్యపు అంతరపంటలను ఫలసాయం మార్చి మాసంలో తీసుకొన్న తరువాత చెరకు చాళ్ళ మధ్య అంతరకృషి యంత్రాలతో గాని నాగలితో గాని చేపట్టాలి. 87ఏ 298 (విశ్వామిత్ర) చెరకు రకాన్ని కార్శి చేసే రైతాంగం కార్శి చేసిన 30 రోజులకు ప్రొపికొనజోల్‌ 1.0 మి.లీ/లీ. నీటికి కలిపి తప్పక పిచికారీ చేయాలి. తద్వారా కాటుక తెగులును నివారించుకోవచ్చు. డిసెంబర్‌/జనవరి మొక్కతోటలకు కలుపు నివారణకు ఎకరానికి ఒక లీటరు గ్రామోక్సోన్‌ కలిపిన ద్రావణం లేదా 500 గ్రా. మెట్రిబ్యుజిన్‌+ఒక కిలో గ్రాము 2,4 డి కలిపిన ద్రావణాన్ని చాళ్ళ మధ్య పిచికారీ చేయాలి.
– అనకాపల్లి అగ్రికల్చర్‌

Credits : Andhrajyothi

జిగురు అట్టలతో పత్తిలో తెల్లదోమకు చెక్‌ 

 • కర్షకుడికి ఏదీ పరిపూర్ణ ‘మద్దతు’? 
 • మాటల మంత్రంగానే అన్నదాతా సుఖీభవ.. 
 • పంటకు సమృద్ధి ధర వస్తేనే రైతన్న బతుకు నవనవ!! 

పత్తిలో తెల్లదోమ నివారణకు జిగురు అట్టలు పెట్టాలని సూచిస్తున్నారు గుంటూరు సమీపంలోని లాంఫాం ఏడీఆర్‌ డాక్టర్‌ పావులూరి రత్నప్రసాద్‌.. ప్రస్తుత తరుణంలో పత్తి, వరి, రబీ అపరాల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఆయన రైతులకు సూచనలు చేశారు. పత్తిలో తెల్ల దోమ నివారణకు జిగురు అట్టలు పెట్టాలి. 10 నుంచి 20 దాకా జిగురు అట్టలు పెడితే తెల్లదోమను సమర్ధంగా నివారించే వీలుంటుంది. ఈ సీజనలో పలు ప్రాంతాల్లో గులాబీ రంగు పురుగు పత్తి పంట మీద ఎక్కువగా కనిపిస్తున్నది. గులాబీ రంగు పురుగుల నివారణ కోసం సింథటిక్‌ పైరిధ్రాయిడ్స్‌ పిచికారి చేస్తే తెల్లదోమ పెరుగుతుంది. అందువల్ల మామూలు మందులు పిచికారి చేసుకోవాలి. యూరియా, పొటాష్‌ కలిపి వేస్తే.. మొక్కలు పుంజుకుంటాయన్నారు. రబీ సీజనులో నల్లనేలల్లో మినుము రకాల్లో పీయూ31, తిరుపతి బీజీ 104, ఘంటశాల బీజీ రకాల విత్తనాలు వేసుకోవడం మేలు. ఈ రకాలు ఎల్లో మెజాయిక్‌ తట్టుకుంటాయి. పత్తి పక్కన వేసే మినుములోనూ బంక అట్టలు పెట్టుకుంటే తెల్ల దోమల ఆశించకుండా ఉంటుంది. ఎర్ర నేలల్లో ఎల్లో మొజాయిక్‌ తట్టుకునే ఎల్‌బీజీ 752 రకం వాడితే మంచిది. పత్తి దెబ్బతిన్న పొలాల్లోనూ పత్తి పీకేసి, అపరాల సాగు చేపట్టవచ్చన్నారు. అక్టోబరు 15-25 మధ్య అపరాల సాగు ప్రారంభానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. 

Credits : Andhrajyothi

ఆక్వాకు ఊతం..ఉత్పత్తి లక్ష్యం 

 • 2020కి రూ.70 వేలకోట మత్స్య… ఉత్పత్తుల సాధనకు ప్రభుత్వం కృషి
 • కేంద్ర సాయంతో వడివడిగా అడుగులు…సత్ఫలితాలిస్తున్న సర్కారు చర్యలు
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విశాలమైన కోస్తా తీరం.. అపారమైన మత్స్యసంపద.. కావల్సినన్ని మానవ వనరులు.. వీటితోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఇవన్నీ మత్స్య ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి! ఉత్పత్తితో పాటు ఉపాధి కల్పనలోనూ యువతకు ఈ రంగం భారీ అవకాశాలు కల్పిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మత్స్య రంగానికి మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం సాయంతో ఈ పరిశ్రమను భారీస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పుటికే ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ఏటా 20 నుంచి 30 శాతానికి పైగా మత్స్య పరిశ్రమ వృద్ధి సాధిస్తోంది. ఇదే స్ఫూర్తితో 2020కి రాష్ట్రంలో రూ.70 వేలకోట్ల ఉత్పత్తులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిని సాధించేందుకు ఇటు ఆక్వా రైతులతో పాటు మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10లక్షలకు పైగా కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డాయి. సముద్ర ఉత్పత్తులను భారీగా పెంచాలని అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం నిర్ణయించి అనేక ప్రోత్సాహాలు అందించింది. 2014-15లోరాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా ఉంది. ఇందులో భాగంగా రెండేళ్లలో వీటి విలువ దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు 25 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉంది. వీటి ద్వారా రూ.16 వేల కోట్లు.. విదేశీ మారకద్రవ్యం రూపంలో వస్తోంది. అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం.. మత్స్య పరిశ్రమల్లో నిపుణులైన ఇద్దరిని సలహాదారులుగా నియమించింది.

మత్స్యకారులకు అండగా.. 

మత్స్యకారులు, సముద్ర ఉత్పత్తుల పెంపకందార్లకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. అంతేగాక ఈరంగంలో వృద్ధి శాతాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయింపులు కూడా పెంచింది. గత ఏడాది రూ.187.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది రూ.339 కోట్లు ఇచ్చింది. అలాగే నూతన మత్స్య విధానాన్ని ప్రకటించింది. అసైన్డ్‌ భూముల్లోనూ చేపలు, రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. వేట నిషేధ కాలంలో జాలర్ల జీవన భృతిని నాలుగు వేలకు పెంచింది. ఈ కాలంలో కుటుంబానికి 30 కిలోల బియ్యాన్ని అందిస్తోంది. వీటితోపాటు రూ.20 ప్రీమియంతో గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ స్కీం అమలు చేస్తోంది మత్స్యకారులు పట్టిన చేపల్ని వెంటనే అమ్ముకోలేని పరిస్థితుల్లో వాటిని నిల్వ ఉంచుకోవడానికి ఐస్‌ బాక్సుల్ని రాయితీ ధరలకు ప్రభుత్వం అందిస్తోంది. ‘మత్స్య మిత్ర’ పేరుతో మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు.. చేపలు అమ్ముకోవడానికి, మార్కెటింగ్‌కు రూ.లక్ష రివాల్వింగ్‌ ఫండ్‌ రూపంలో అందిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో చేపల వేట సాగించేందుకు సాంకేతిక సహకారం అందించడంతో పాటు మర పడవలు, మోటార్లు, వలలు కూడా సబ్సిడీ ధరలకు అందిస్తుంది. జాలర్ల కోసం బయోమెట్రిక్‌ ఐడీకార్డులు, యానిఫాం అందజేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని ఉప్పాడ(తూర్పుగోదావరి), జువ్వలదిన్నె(నెల్లూరు), ఓడరేవు(ప్రకాశం) ప్రాంతాల్లో మినీ ఫిషింగ్‌ హార్బర్స్‌ నిర్మించబోతున్నాయి. వీటికోసం దాదాపు రూ.200కోట్లు ఖర్చు చేయబోతున్నాయి.

ఆక్వా వర్సిటీ.. మత్స్యవాణి 
మత్స్య సంబంధమైన శాసీ్త్రయ పరిశోధనలు, అధ్యయనం కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుబంధంగా ఈ ఏడాది నుంచి కాలేజీలు ఏర్పాటు చేసి, కోర్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మండల ఫిషరీస్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరిలో ఒక్కొక్కరికీ 500 హెక్టార్ల చొప్పున అప్పగించి.. మత్స్య సంపద వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఆక్వా రైతులకు సలహాలిస్తూ, సందేహాలు తీర్చడం కోసం మత్స్యవాణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే ఐదు వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో అనుసంధానమయ్యారు. వీరికి ప్రభుత్వం సిమ్‌కార్డులు అందించి.. వీటి ద్వారా రైతులకు రోజుకు నాలుగుసార్లు ఫోన్లలో సమాచారం అందిస్తారు. ఇలా మత్స్య ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.

Credits : Andhrajyothi

వేరుశనగతో విసిగి.. దానిమ్మతో ఎగసి..!

వర్షాభావం, కరువు పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట దెబ్బతిని నష్టాల ఊబిలో కూరుకుపోయిన అనంత రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. మడకశిర మండలం హలుకూరుకు చెందిన చంద్రశేఖర్‌ శనగ సాగుకు స్వస్తి చెప్పి ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు దానిమ్మ సాగు చేస్తూ ఏడాదికి 15 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. చుట్టుపక్కల మండలాల్లో వందలాది మంది రైతులు కూడా దానిమ్మ సాగుతో మంచి లాభాలు గడిస్తున్నారు.
 • ఏటా 15 లక్షల ఆదాయం
 • లాభాలు గడిస్తున్న అనంత రైతు
దశాబ్దాలుగా వేరుశనగ సాగు తప్ప అక్కడి రైతులకు మరో పంట గురించి తెలియదు. వర్షాలు కురవకపోతే పంట చేతికి వచ్చేది కాదు. ఫలితంగా అనంతపురం జిల్లా రైతులు ఏటా లక్షరూపాయలకు పైగా నషాన్ని భరిస్తూ వస్తున్నారు. మడకశిర మండలం, దాని చుట్టుపక్కల ఉన్న మండలాల రైతులు రెండుమూడేళ్లుగా న ష్టాలు మిగులుస్తున్న వేరుశనగ సాగుకు స్వస్తిచెప్పారు. ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించారు. దానిమ్మ సాగుతో మంచి లాభాలు వస్తాయని తెలుసుకున్నారు. ఆ పంట సాగకు అవసరమైన మెళకువలు గ్రహించారు. ఒకరి తరువాత మరొకరు మడకశిర నియోజకవర్గంలో అధికశాతం మంది రైతులు దానిమ్మ తోటల సాగువైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 753 హెక్టార్లలో రైతులు దానిమ్మను సాగుచేస్తున్నారు. మడకశిర మండలంలో చందకచర్ల, వైబీహళ్లి, బుళ్లసముద్రం, అగళి మండలంలో దొక్కలపల్లి, ఆర్‌జీపల్లి, మధూడి, గుడిబండ మండలంలో మందలపల్లి, సీసీగిరి, అమరాపురం మండలంలో తమ్మడేపల్లి, అమరాపురం,మద్దనకుంట రొళ్ల మండలంలోని హెచటీహళ్లి, మల్లినమడుగు, హనుమంతునిపల్లి, ఎం.రాయాపురం, బంద్రేపల్లి, చిగమతిగట్ట, కాలువేపల్లి, సోమగట్ట, బీజీహళ్లి, హుణిసేకుంట తదితర గ్రామాల పరిధిలో రైతులు దానిమ్మతోటలను విరివిగా సాగుచేస్తున్నారు.

దానిమ్మ సాగు ఇలా… 

ఎకరాకు 400 దానిమ్మ చెట్లను నాటవచ్చు. పది అడుగులకు ఒక చెట్టు చొప్పున నాటాలి. ఏడాదిలోపు పంట చేతికందుతుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా అధికంగా సోకే అవకాశముంటుంది. దానిని నివారించేందుకు శాస్త్రవేత్తల సూచనల మేరకు మూడు రోజులకోసారి మందులు పిచికారి చేయాలి. వర్షం రాకపోతే వారానికి ఒక సారి మందు పిచికారిచేయాలి. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా తోటను కాపాడితే కాసుల పంట పండుతుంది. సేంద్రీయ ఎరువులతో పాటు డీఏపీ, పొటా్‌షలను వాడితే చెట్లు బలంగా తయారవుతాయి. కాపుకు వచ్చేముందు చెట్ల కొమ్మలను కత్తిరిస్తే ఆకులు రాలిపోయి, కొత్త చిగురు వేసి పూలు బాగా పూస్తాయి. దీంతో కాయల దిగుబడి కూడా గణనీయంగా ఉంటుంది. ఎకరాకు 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇలా మూడు దఫాలుగా కాయకోసి మార్కెట్‌కు తరలించవచ్చు.

ధరలు, దిగుబడి ఆశాజనకం 
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడితో పాటు దానిమ్మ ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. మడకశిర నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంది. స్థానికంగా మార్కెట్‌ లేకపోవడంతో కర్ణాటక, మహారాష్ట్ర, మద్రాస్‌ వంటి ప్రాంతాల మార్కెట్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో మామిడి సాగు కూడా గణనీయంగా ఉంది. పండ్ల తోటల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు స్థానికంగా మార్కెట్‌ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో బ్యాక్టీరియా నివారణకు అవసరమైన మందులు, ఎరువులను సరఫరా చేస్తే మరింత మంది రైతులు దానిమ్మ సాగుకు ముందు వస్తారనడంలో సందేహం లేదు.

                                                       – ఆంధ్రజ్యోతి, మడకశిర, అనంతపురం జిల్లా
ఏటా 15 లక్షల లాభం
జిల్లాలోని అమరాపురం మండలం హలుకూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు 12 ఎకరాల భూమి ఉంది. చాలా కాలంగా వేరుశనగ సాగు చేసి విసిగిపోయాడు. ఏటా పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాడు. వేరుశనగ తో పాటు ఇతర పంటల సాగుతో ఏటా లక్షన్నర నష్టం వాటిల్లేది. నష్టాల నుంచి గట్టెక్కడానికి మూడేళ్లక్రితం పొలంలో రెండు బోర్లను తవ్వించాడు. పుష్కలంగా నీరు లభించడంతో వాణిజ్య పంట అయిన దానిమ్మను సాగు ప్రారంభించాడు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలతో మంచి దిగుబడులు సాధించడం మొదలు పెట్టాడు. దానిమ్మ నుంచి ఏటా 20 లక్షల దాకా ఆదాయం వస్తున్నదని, ఖర్చులు పోను 15 లక్షల రూపాయలు మిగులుతున్నదని ఆ రైతు చెప్పాడు.
మార్కెట్ ఉంటే మరిన్ని లాభాలు
మూడేళ్లుగా దానిమ్మ సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నాను. వర్షాకాలంలో ఈ పంటకు తీవ్రంగా తెగులు వస్తుంది. దాని నివారణకు ఉపయోగించే మందులు, ఇతర ఎరువులను ప్రభుత్వం సబ్సిడీ మీద సరఫరా చేయాలి. దానిమ్మ దిగుబడులు బాగున్నా మార్కెటింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
Credits : Andhrajyothi

వరి సాగుతో రైతన్నలకు సిరి

 

ఆంధ్రజ్యోతి, బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపంట వరి. దేశ ఆహార భద్రత వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తులో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో మరింత ఎక్కువ దిగుబడులు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుంచి పంటకోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా సాగుఖర్చు తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చునంటున్నారు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 22.11 లక్షల హెక్టార్లలో కాల్వలు, చెరువులు, బావులు కింద వరి పంట సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 68.64 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు రైతన్నలు. సరాసరి ఎకరానికి 1240 కిలోల దిగుబడి లభిస్తున్నది. కోస్తాంధ్రలో సార్వా (ఖరీఫ్‌) జూన్‌ నుంచి నవంబర్‌ వరకు, రాయలసీమలో జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉంటుంది. అదే దాళ్వా అయితే నవంబర్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ఆ ప్రాంతంలోని వర్షపాతం, నీటి లభ్యతమీద ఆధారపడి ఉంటాయి.
 

మేలైన యాజమాన్య పద్ధతులు 
వరి వంగడాల ఎంపిక: వివిధ ప్రాంతాలకు అనువైన వరివంగడాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన ఎంపికలోనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మంచి విత్తనం ఎంపికతో రైతుకు మేలు చేకూరుతుంది.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండిజిమ్‌ను కలిపి 24 గంటలు తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంపనారు అయితే లీటర్‌ నీటికి ఒక గ్రాము కార్బండిజిమ్‌ కల్పి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకలను దంపనారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటర్‌ మందు నీరు సరిపోతుంది.

వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించటం: కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజలలోని నిద్రావస్థను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి లీటర్‌నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10మిల్లిలీటర్‌లు గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండెకట్టాలి.

విత్తన మోతాదు: నాటే పద్ధతికి 20 నుంచి 25కిలోలు, వెదజల్లటానికి (భూముల్లో) 24 నుండి 30కిలోలు, వెదజల్లటానికి గోదావరి జిల్లాలో 10 నుండి 12 కిలోలు గొర్రుతో విత్తటానికి (వర్షాధారపు వరి) 30 నుంచి 36 కిలోలు అవసరం ఉంటుంది. శ్రీ పద్ధతిలో అయితే ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఆరోగ్యవంతంగా నారు పెంచటం ఇలా 

 • నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ముచేసి చదును చేయాలి. నీరుపెట్టటానికి, తీయటానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి.
 • 5 సెంట్ల నారుమడికి రెండుకిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, కిలో పొటాష్‌నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం రెట్టింపు చేయాలి.
 • మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి.
 • నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.
 • జింకు లోపాన్ని గమనిస్తే లీటర్‌ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీచేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరిసాగులో జింకు లోపం లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 • విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేద క్లోరోపైరిఫాస్‌ 2మిల్లిలీటర్లు లీటర్‌ నీటికి కలిపి విత్తిన 10రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదంటే నారుతీయటానికి ఏడు రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి.

Credits : Andhrajyothi