గోమూత్రం.. పెట్రోలు కంటే ప్రియం!

 • క్యాను రూ.500 పైమాటే
పల్నాడు పల్లెలు పచ్చదనాలకు నిలయాలు. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పత్తి, మిరప పంటలే సాగు చేస్తున్నారు. పంట మార్పిడి అలవాటు లేకపోవడంతో ఆ పంటలకు విపరీతంగా తెగుళ్లు ఆశిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆ పంటలకు పురుగుల మందులు వాడటం వల్ల తెగుళ్లు, పురుగుకు రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగింది. ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండడం లేదు. ఆకుముడత, బొబ్బర తెగులు, రసంపీల్చు పురుగు, కాయతొలుచు పురుగులు పంటలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
దీంతో రైతుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతున్నది. ఒకరిద్దరు రైతులు ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించడంతో మండలంలోని పలువురు రైతులు ఆ బాటన పట్టారు. దేశీ ఆవుల పంచకం చల్లితే తెగుళ్లు దరిచేరవని రైతులు గ్రహించారు. యర్రబాలెంలోని ఒక దేవాలయం ఆధీనంలో ఉన్న గోశాల నుంచి గోమూత్రం సేకరించి కొందరు రైతులు సత్ఫలితాలు సాధించారు.
ఆ నోటా ఈ నోటా గోమూత్రం విలువ తెలుసుకున్న పలువురు రైతులు యర్రబాలెం బాట పట్టారు. అక్కడ 20 ఆవులు మాత్రమే ఉన్నాయి. రోజంతా గోమూత్రం సేకరించినా 20 లీటర్లకు మించి రావడం లేదు. రెంటచింతల, దుర్గి, మాచర్ల మండలాలకు చెందిన పదికి పైగా గ్రామాల రైతులు క్యూ కట్టడంతో గోమూత్రం సరిపోవడం లేదు. క్యాను గోమూత్రం ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. అయినా రైతులు ఆ డబ్బు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు.
గో మూత్రంలో 24 ధాతువులు :వెంకటేశ్వర్లు, ఆత్మ బీటీఎం
గోమూత్రంలో 24 రకాల ధాతువులుంటాయి. అమ్మోనియం, రాగి, నత్రజని, గంధకం, పొటాషియం, మెగ్నిషియం వంటి ధాతువులన్నీ మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. గోవు విసర్జనలో భూమికి ఉపయోగపడే 300 నుంచి 500 కోట్ల జీవరాశులు వుంటాయి. గోమూత్రం, పేడ రైతుకు వరాలు.
Credits : Andhrajyothi

అప్పుల ఊబిలో ఈము రైతులు

తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది రైతులు ఎనిమిదేళ్లుగా ఈము పక్షుల పెంపకం చేపట్టారు. తెలంగాణలో 120 మంది రైతులు ఈము పక్షులను పెంచుతున్నారు. సుమారు రూ.13 కోట్ల వరకు బ్యాంకుల అప్పుల్లో కూరుకుపోయారు.
ఈము పక్షుల గుడ్లు, పిల్లలు కొవ్వుద్వారా వచ్చే నూనెకు మంచి డిమాండ్‌ ఉందని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రచారం చేశాయి. ఈము పక్షిపిల్ల ధర రూ. 5 వేలు, నూనె ధర కేజీ రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఉంటుందని చెప్పడంతో ఒక్కో రైతు రూ.5 లక్షలు విలువైన వంద పిల్లలను కొనుగోలు చేశారు. రెండేళ్లపాటు ఎలాంటి ఆదాయం లేకుండా వీటిని పెంచారు.
రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి ఆస్ర్టేలియా జాతికి చెందిన ఈము పక్షులను వేలంవెర్రిగా పెంచుకొన్నారు. పిల్లలు పెద్దవై గుడ్లుపెట్టి అవి కూడా పిల్లలు కూడా కావడంతో ఒక్కో యూనిట్‌లో వంద నుంచి 300 వరకు పెరిగాయి.
అయితే ఈము పక్షులను కానీ, పిల్లలను కాని, నూనెను కానీ కొనే నాథుడులేక పక్షులను పెంచే శక్తిలేక బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తీర్చే దారిలేక రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఈము పక్షులను పెంచే పరిస్థితి లేక స్థానికంగా వాటి మాంసాన్ని విక్రయించగా, మరికొందరు అడవుల్లో కూడా వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఈముపక్షుల యూనిట్లన్నీ ఖాళీ అయ్యాయి. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు భారమయ్యాయి. గత నాలుగేళ్లుగా అప్పులు తీర్చలేక రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు.
కనికరించని ప్రభుత్వం
తెలంగాణలో 120 మంది రైతులకు సుమారు రూ.13 కోట్లు, ఆంధ్రాలో 350 మంది రైతులకు రూ.84 కోట్లు రుణాలున్నాయి. ఏపీ ప్రభుత్వం వడ్డీని బ్యాంకుల ద్వారా మాఫీచేయిస్తూ అసల్లో 25 శాతం రైతులు, 25 శాతం బ్యాంకులు, 50 శాతం ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం తమ రుణాలు మాఫీచేయాలని, ఆదుకోవాలని ఈముపక్షుల పెంపకందారులు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి తమగోడు చెప్పుకొన్నా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.
ఈముపక్షుల రైతు సంఘం నాయకుడిగా ఖమ్మానికి చెందిన బొల్లేపల్లి హరిబాబు కూడా పలుసార్లు మంత్రులను కలిశారు. అయితే ఎలాంటి భరోసా లభించకపోవడంతో అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈము రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతు సంఘ నేతలు, పి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌. రమణారెడ్డి కోరుతున్నారు.
Credits : Andhrajyothi

మార్చిలో ఆక్వా ఎక్స్‌ ఇండియా

2018 మార్చి 15-17 తేదీల్లో హైదరాబాద్‌ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ ఆక్వా సదస్సు జరుగనున్నది. చేపల పెంపకంలో లాభాలు పెంపొందించడం, చేపల సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
Credits : Andhrajyothi

సాఫ్ట్‌వేర్‌ను వదిలి.. సాగుబాట పట్టి

 • ముంబైలో ఉద్యోగం వదిలేసి పల్లెకు
 • కూరగాయలు పండిస్తున్న శ్రీనివాస్‌
 • చౌహన్‌క్యూ, పాలేకర్‌ విధానాలు అమలు
 • వ్యవసాయంపై మక్కువే కారణమని వెల్లడి
కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎంబీఏ విద్యనభ్యసించాడు! ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు! మంచి ఉద్యోగమే చేస్తున్నా మనసులో ఏదో అసంతృప్తి! పలు రాష్ట్రాల్లోని రైతులు లాభాలబాటలో నడుస్తుంటే మన రాష్ట్రంలోని రైతులెందుకు అప్పులపాలవుతున్నారని మథన పడ్డాడు. లక్షలు రాకున్నా వ్యవసాయంతో లక్షణంగా బతికే అవకాశముందని చెప్పేందుకు ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు! వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ యువకుడే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌. వ్యవసాయం మీద మక్కువతో ముంబైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరు వచ్చేశాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. దక్షిణకొరియాలో చౌహన్‌క్యూ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం అతడిని ఆకర్షించింది. దేశీయ సూక్ష్మ జీవులతో వ్యవసాయం చేయడం, మనకు అందుబాటులో ఉన్న నూనెలు, ఇంటిలో ఉండే వంట పదార్థాలు సస్యరక్షణకు స్థూల, సూక్ష్మ పోషకాలు అందించేందుకు తోడ్పడుతాయని గ్రహించాడు. వాటినే ఉపయోగించే వ్యవసాయం చేస్తున్నాడు.
రెండెకరాల్లో బోడకాకర, ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు, బెండ, మరో ఎకరంలో అనప, అలసంద, గోరుచిక్కుడు పంటలు సాగు చేస్తున్నాడు. పాలేకర్‌ వ్యసాయ విధానాలను చౌహన్‌క్యూ సిస్టమ్‌తో సమ్మిళితం చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. బోడకాకర కిలోకు హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి రైతులకు గరిష్ఠంగా రూ.120, కనిష్ఠంగా రూ.80 లభిస్తుంది. దిగుబడి ఎకరాకు కనీసంగా 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున ఒక రైతు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే, బోడకాకర సాగులో మగ, ఆడ మొక్కలను గుర్తించి వాటిని అవసరమున్న మేరకే ఉంచుకొని మిగతా వాటిని తీసేయడం ప్రధాన ప్రక్రియ. ఇతర రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు శ్రీనివాస్‌ బోడకాకర సాగును ఎంచుకున్నాడు. డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్‌వీఎ్‌సకే రెడ్డి, రవి హైబ్రిడ్‌ సీడ్స్‌ వ్యవస్థాపకులు మన్నేపల్లి రవి సూచనలతో స్ఫూర్తిపొంది రెండెకరాల్లో బోడకాకర వేశాడు. ఇప్పటికే మూడు కటింగ్‌లలో క్వింటాలున్నర బోడకాకరను మార్కెట్‌కు పంపించారు.
సేంద్రియ ఎరువులతో దేశవాళీ రకాల సాగు
ఉప్పు తప్ప ఆహార పదార్థాలన్నీ పెరటిలోనే పండించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్నివ్వాలనే లక్ష్యంతో పల్లెకు వచ్చి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. బోడకాకర, అలసంద, చిక్కుడు, గోరుచిక్కుడు, సొరకాయ, శీతాకాలంలో అయితే టమాటలను సేంద్రియ ఎరువులతో పండించవచ్చు. ఆధునిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులకు కలిపి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇలా వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి.
Credits : Andhrajyothi

తెల్ల చేపల పెంపకం.. లక్షల్లో ఆదాయం

తెల్లచేపల పెంపకంలో మేలైన యాజమాన్య పద్దతులు పాటిస్తూ తీవ్ర నీటి కొరత ఉన్న సమయాల్లో కూడా లాభాలు గడిస్తున్నారు ఆ రైతు. చేపల పెంపకంలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఆక్వా రైతు కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్ననపూడి గ్రామానికి చెందిన రైతు సూరపనేని వెంకటేశ్వరరావు. ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం గడిస్తున్న ఆక్వా రైతు విజయగాధ ఇది.
చదివింది 5వ తరగతి. వ్యవసాయంపై మక్కువతో చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి సా ధించేవారు సూరపనేని వెంకటేశ్వరరావు. దశాబ్దం క్రితం గ్రా మంలోని పంట పొలాలు చేపల చెరువులుగా మారిపోవడం మొదలైంది. తనకున్న 15 ఎకరాల పొలాన్ని చేపల చెరువుగామార్చి స్వయంగా చేపలు సాగుచేయడం మొదలెట్టారు ఆ రైతు. లీజుకు మరో 27 ఎకరాలు తీసుకున్నారు. ఆ 27 ఎకరాల్లో కట్ల(బొచ్చె), రాహు(శీలావతి), మోసు రకం చేపలను సాగుచేస్తున్నారు. వ్యవసాయం మాదిరిగానే ఆక్వా రంగంలోను నిపుణుల నుంచి సాగు మెళుకువలను తెలుసుకొని మేలైన యాజమాన్య పద్దతు ల్లో సాగు చేయడం మొదలెట్టారాయన.
యాజమాన్య పద్దతులు
చేపలువేసే ముందు చెరువు కరకట్టలను శుభ్రంచేసి చెరువులోకి వ్యర్ధ, చెడు చేపలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఆ రైతు. చెరువులో నీరు పెట్టే ముందే ఎకరాకు బస్తా సున్నం చొప్పున పిచికారి చేసి చెరువును శుభ్రపరుస్తారు. జీరో పాయింట్‌ చేపలను కాకుండా మూడు అంగుళాల చేప పిల్లలను కొనుగోలు చేసి తన చెరువులోనే పెంచి 150 గ్రాముల సైజు రాగానే పెద్ద చెరువులో వేసి మేపడం ప్రారంభిస్తారు. నీరు పెట్టిన తరువాత నీటిలో ఫ్లాంటినం పెరిగేందుకు పేడను పిచికారి చేస్తారు. చేప పిల్లల్ని చెరువులో వేసిన తరువాత వాటికి మేత వేయకుండా ప్లాంటినం తినేలా వారం రోజుల వరకు మేత వేయకుండా నిలుపివేస్తారు ఆ రైతు. దీనివలన చేప పిల్ల ఎదుగుదల వేగంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి 20 రోజులకు ఒకసారి నీటిని పరీక్షిస్తారు. చేపల పెరుగుదలకు అవరోధంగా నిలిచే అమోనియా పెరగకుండా మందులు సకాలంలో మందులు పిచికారి చేస్తే చేప పెరుగుదలకు ఢోకా ఉండదని వెంకటేశ్వరరావు వివరించారు. నీటి కొరత కారణంగా చెరువు నీటిలో ఉప్పుశాతం అధికంగా ఉంటుంది. ఫలితంగా చేపల్లో కలిగే రెడ్డీస్‌ వ్యాధి, డిఓ పడిపోవడం వంటివి నివారించేందుకు జియోలైట్‌, గ్యాసోనెక్స్‌, బెల్లం, బయోగోల్ఫ్‌ మందులను వాడడం వల్ల చేపలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ఆక్సిజన్‌ విషయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు వెంకటేశ్వరరావు. చేపలు మెట్టెలెత్తిన సమయంలో చెరువు వద్దనే ఉండి ఎప్పుటికప్పుడు చేపలకు ఆక్సిజన్‌ అందేలా మందులను పిచికారి చేస్తే చేపలు మృత్యువాత పడకుండా వుంటాయన్నారు. మేతల వాడకం లో సైతం ప్రమాణాలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చుని ఆ రైతు వివరించారు. పంట వ్యవధికాలమైన ఆరు నెలలకాలంలో ఎకరాకు మూడు టన్నుల మే తను ఉపయోగించాలని ఆయన చెప్పారు.
ఎకరానికి లక్ష ఆదాయం
సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు రైతులు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటే చేపల చెరువుల మీద మంచి లాభాలు వస్తాయి. నాకు ఎకరాకు రూ. 2.76 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోనూ ఎంతలేదన్నా ఎకరాకు రూ. 86 వేల మేర లాభం వస్తుంది. నీటి కొరత సమయాల్లోనూ లాభాలు వస్తాయి. నీరు సక్రమంగా లభిస్తే ఎకరాకు రూ. లక్ష మేర ఆదాయం వస్తుంది.
సంఖ్యే కీలకం
శీలావతి ఎకరాకు 2,600, కట్ల 200 మైలా 100 సంఖ్యలో వేసి సాగుచేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు. ఫంగస్‌ రకం చేప ఎకరాకు 10 వేల వరకు పెంచినా ఇబ్బంది ఉండదన్నారు. ఈ రకమైన సాగుపద్దతులు పాటించడం వలన అందరికీ ఎనిమిది నెలల కాలంలో చేపలు పట్టుబడికి వస్తే తనకు మాత్రం ఆరు నెలల కాలంలోనే సంవత్సరానికి రెండు పట్టుబడులు వస్తున్నాయని వెంకటేశ్వరరావు తెలిపారు
Credits : Andhrajyothi

మేలురకం గొర్రెలతో ఆదాయం భళా

 • గొర్రెల ఆరోగ్య సంరక్షణపై డాక్టర్‌ డి. వెంకటేశ్వర్లు సూచనలు
వ్యవసాయదారులు, గొర్రెల పెంపకం కులవృత్తిగా ఉన్న యాదవ, గొల్ల, కురుమ వర్గాల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని చేపట్టింది. తెలంగాణ పల్లెసీమలను సుసంపన్నం చేసే లక్ష్యంతో తలపెట్టిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల మంది గొల్ల కురుమలకు సుమారు కోటిన్నర గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. మంచి గొర్రెలను ఎలా ఎంపిక చేసుకోవాలి? వాటికి బీమా ఎలా చేయించాలి? గొర్రెల ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్‌ డి. వెంకటేశ్వర్లు ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.
గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మన రాష్ట్రంలో గొర్రెల సంపదను వృద్ధి చేసుకుంటున్నాం. గొర్రెల ఎంపికలో, వాటిని ఆరోగ్యంగా పెంచే విషయంలో పెంపకందారులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి.
గొర్రెల ఎంపిక ఇలా…
 • మంద అభివృద్ధిలో గొర్రెల ఎంపిక కీలకం. గొర్రెల ఎంపిక, వాటి వయస్సు, బాహ్య లక్షణాలు, శారీరక స్థితి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసుకోవాలి.
 • అధిక మాంసాన్ని ఇచ్చే మేలు జాతి గొర్రెలు అయిన నెల్లూరు, డక్కని, మడ్గ్యాల్‌, మాండ్య జాతులను ఎంపిక చేసుకోవాలి.
 • ఆడ గొర్రెలు 1 నుంచి ఒకటిన్నర సంవత్సరం వయస్సు ఉండి, 25-30 కిలోల బరువు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. కింది దవడకు రెండు శాశ్వత పళ్లు వచ్చి ఉండాలి.
 • గొర్రెలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. కళ్లలో కాంతి ఉండాలి. మేత మేయడం, నెమరు వేయడం సాధారణంగా ఉండాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలి. కాళ్లు నిటారుగా ఉండాలి. దగ్గడం, కళ్లు, ముక్కుల నుంచి స్రవాలు కారడం, దవడ కింద వాపు, ఉబ్బిన పెదవులు, విరోచనాలు, నోటిలో పుండ్లు, చర్యవ్యాధులు, కుంటడం వంటి అనారోగ్య లక్షణాలు ఉండరాదు.
 • శారీరకంగా గొర్రెలు మంచి కండపుష్టి కలిగి ఉండాలి. బక్కచిక్కి ఉండకూడదు.
 • ఆడ గొర్రెల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఈత గొర్రెలు లేదా పాలు మరచిన లేదా పాలుతాగే ఆడ గొర్రెపిల్లలు కలిగిన గొర్రెలను ఎంచుకోవాలి. పొదుగు మెత్తగా ఉండాలి. చనులు సమానంగా ఉండాలి.
 • విత్తనపు పొట్టేలు మందలో సగం అని ప్రతీతి. పొట్టేలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. వృషణాలు సమానంగా ఉండాలి. ఎలాంటి వాపు ఉండకూడదు. చర్యవ్యాధులు ఉండకూడదు.
ఆరోగ్య సూత్రాలు తప్పనిసరి
మందను తీసుకువచ్చిన 3-4 గంటల తరువాత గ్లూకోజ్‌ ద్రావణం తాగించాలి. 2వ రోజు నుంచి 4వ రోజు వరకు మల్టీ విటమిన్‌ సిరప్‌ ఇవ్వాలి. 5వ రోజు (2 నెలల వయసుపైబడిన గొర్రెల పిల్లలకు కూడా) నట్టల నివారణ చేపట్టాలి. 6వ రోజు నుంచి 8వ రోజు వరకు నోటి ద్వారా బి కాంప్లెక్స్‌ ఇవ్వాలి. నట్టల నివారణ మందులు తాగించిన 3-7 రోజుల తరువాత గొంతు వాపు, చిటుకు రోగం, పిపిఆర్‌, గొర్రె మసూచి టీకాలు వేయించాలి. టీకా వ్యాధి నిరోధక కాలం ముగిసేలోగా మళ్లీ టీకాలు వేయించాలి. రెండు టీకాల మధ్య 14 రోజుల వ్యవధి ఉండాలి. 3 నెలలకు ఒక సారి నట్టల నివారణ మందులు తాగించాలి. త్వరలో ప్రతి నియోజక వర్గంలో ఒక సంచార గొర్రెల వైద్య కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. గొర్రెలకు జబ్బు చేస్తే వెంటనే 1962 నెంబరుకు సమాచారమిస్తే సంచార వైద్య శిబిరం వచ్చి వైద్యం చేస్తుంది. మరిన్ని సలహాల కోసం సమీపంలో వున్న పశు వైద్యాధికారిని సంప్రదించాలి. లేదా 73373 62131 ఫోన్‌ నెంబర్‌కు ఉచితంగా ఫోన్‌ కాల్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
బీమాతో ధీమా
లబ్ధిదారులు కొనుగోలు చేసిన గొర్రెలకు, కొనుగోలు చేసిన ప్రాంతం నుంచే బీమా సౌకర్యం ఉంటుంది. కొన్న గొర్రెల చెవికి సంబంధిత బీమా కంపెనీ ట్యాగ్‌ వేసిన తరువాత మాత్రమే వాటిని తరలించాలి. ట్యాగులు చెవి మధ్యభాగంలో వేయించాలి. ట్యాగ్‌ నెంబర్లు ఏయే లబ్దిదారులకు చెందినవో నమోదు చేసుకోవాలి. బీమా చేసిన గొర్రె అకస్మాత్తుగా లేదా వ్యాధుల వల్ల మరణిస్తే వెంటనే సంబంధిత పశువైద్యాధికారికి తెలియజేయాలి. అప్పుడే బీమా పరిష్కారం అవుతుంది.
వ్యవసాయం పరమ ప్రయోజనం కేవలం పంటలు పండించడం కాదు. నిండు మనసున్న మనుషుల అభ్యున్నతికి కృషి చేయడం.
– మసనొబు ఫుకుఒక, ప్రకృతి వ్యవసాయ ఆద్యుడు
Credits : Andhrajyothi

డెయిరీతో లాభాల భేరి

 • 100 గేదెలతో లక్షల్లో ఆర్జిస్తున్న ఖమ్మం యువకుడు
అతను ఉన్నత చదవులు చదివాడు. సొంత గ్రామమంటే ప్రాణం. వ్యవసాయం అంటే మక్కువ.. ఈ రెండు అంశాలు అతడిని పల్లెబాట పట్టించాయి. స్వగ్రామం చేరుకుని వ్యవసాయం ప్రారంభించాడు. అప్పటికే తండ్రి నడుపుతున్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి ఉద్యోగం కంటే అధికంగా సంపాదించడంతో పాటు మరో పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన నెల్లూరి రవి.
ఖమ్మంజిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు కుమారుడు రవి. జర్నలిజంలో పీజీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం పోరాటం చేయడం మనస్కరించలేదు. తల్లిదండ్రులను చూసుకుంటూ స్వగ్రామంలోనే నలుగురికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని సంకల్పించారు. తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావించారు. దానికి అనుబంధంగా నడుస్తున్న డెయిరీని ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తే లాభాలు తప్పక వస్తాయని ఆలోచించారు.
2012లో 100 గేదెలతో ప్రారంభం…
2012లో మాటూరుపేటలోని 12ఎకరాల తన సొంత స్థలంలో రెండు షెడ్లు నిర్మించి కోటి రూపాయల పెట్టుబడితో 100 గేదెలతో డెయిరీ స్థాపించాడు. ఇందుకు బ్యాంకు నుంచి రూ.70 లక్షలను రుణంగా తీసుకున్నాడు. గ్రామానికి చెందిన 12 మంది సిబ్బందిని డెయిరీ నిర్వహణకు నియమించుకున్నారు. వంద గేదెలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వాటికి కావలసిన వసతులన్నీ స్వయంగా రవి సమకూర్చుతారు. దాణాగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పెసరపొట్టు, డెయిరీల్లో వాడే బలపాలు, మొక్కజొన్న పిండి గేదెలకు ఆహారంగా ఇస్తున్నారు. ప్రతిరోజూ గేదెలతో పాటు షెడ్లను పరిశుభ్రంగా కడిగి డెయిరీని అద్దంలా ఉంచుతారు. గేదెలు, పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే పాల దిగుబడి, స్వచ్ఛత పెరుగుతాయంటారు రవి.
పాలు తీసేందుకు యంత్రాల వినియోగం
డెయిరీని సమర్థంగా నిర్వహించేందుకు తాను చదివిన చదువులను ఉపయోగిస్తున్నారాయన. గేదెల నుంచి పాలు తీసేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పాలు తీసే యంత్రాన్ని ఒక్కోటి రూ.50 వేలతో కొనుగోలు చేసి పాలు తీసేందుకు వినియోగించటంలో విజయవంతమయ్యారు. ఒక్కో గేదె రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలు రెండుపూటలా ఇస్తుంది. ఇలా తీసిన పాలను ఎలాంటి కల్తీ లేకుండా మధిర మార్కెట్‌కు తరలించి రెండు కేంద్రాల ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు రవి. పాలకేంద్రాలకు ఇస్తే లాభం పరిమితంగా ఉంటుంది. మనం విక్రయించే పాలు స్వచ్ఛమైనవని వినియోగదారులు నమ్మితే పది రూపాయలు అధికంగా ఇచ్చి మరీ కొంటారు. అందుకే నేనే స్వయంగా పాలను విక్రయిస్తున్నానంటారు రవి.
సొంత మనుషులుంటే భేష్‌
సొంత మనుషులు ఉంటే పాడిపరిశ్రమ మరింత లాభసాటిగా ఉంటుందని రవి తండ్రి నెల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చిన్న స్థాయి నుంచి మొదలైన డెయిరీ ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది. ఒక్కో గేదెకు రోజుకు రూ.75 వరకు ఖర్చవుతుంది లీటరు రూ. 60 కు నేరుగా ప్రజలకు విక్రయిస్తే రూ.180 వస్తాయి. సొంత మనుషులయితే పశువులను శ్రద్ధగా పాషిస్తారు. అప్పుడు దిగుబడులు కూడా బాగా వస్తాయి. నీటి సదుపాయం, సొంత మనుషులు ఉండి గడ్డి పెంచేందుకు అవసరమైన భూమి ఉంటే పరిశ్రమ మంచి లాభదాయకం అన్నారు వెంకటేశ్వర్లు.
పశువులకు మేత, నీటి వసతి ఎంత ముఖ్యమో వాటికి సకాలంలో వైద్యం చేయించడం కూడా అంతే ముఖ్యం. గేదెలకు అనారోగ్యం వచ్చినప్పుడు షెడ్డు వద్దకే వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తున్నారు ఈ తండ్రీకొడుకులు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మధిర
యంత్రాలతో సక్సెస్‌
పాలు తీయడానికి యంత్రాలు వినియోగిచడం వల్ల ప్రయోజనం ఉండదనే అపోహ ఉండేది. కానీ పాలు తీసే యంత్రాలు కొని వాటిని ఉపయోగించడంలో మేం సక్సెస్‌ సాధించాం. ప్రజలకు నేరుగా స్వచ్ఛమైన పాలను అందించినప్పుడు నా శ్రమ ఫలించనట్టువుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. అందుకే పాలను ప్రజలకు నేరుగా విక్రయిస్తున్నాను. పది మందికి ఉపాఽధి కల్పిస్తూ స్వగ్రామంలో ఉండటం ఆనందంగా ఉంది.
– నెల్లూరి రవి, మాటూరుపేట,
సెల్‌నెంబర్‌: 9848402111
Credits : Andhrajyothi

తేనెటీగల పెంపకం.. లాభాలు మధురం

 • విజయరాయిలో వందలాది మందికి శిక్షణ ఏటా విస్తరిస్తున్న పెంపకం 
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చేపట్టేవారు. అడవులు తగ్గిపోయి పచ్చదనం లోపించడం, పరిశ్రమలు పెరిగిపోవడం, పొలాల్లో రసాయనాల వాడకం పెరిగిపోవడం తేనెటీగ ల పెంపకానికి అవరోధంగా మారింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్తరకం పనిముట్లు, ప్రక్రియలు అందుబాటులోకి రావటంతో క్రమంగా ఇది పూర్తిస్థాయి వృత్తిగాను, పారిశ్రామిక స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రైతులతో పాటు నిరుద్యోగులు శిక్షణానంతరం ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు కూడా తేనెటీగల పెంపకం వరంగా మారింది. ఆంధ్రప్రదేశలో 700 మంది తేనెటీగల పెంపకం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలో 100 మంది, కృష్ణాజిల్లాలో 200 మంది, గుంటూరు జిల్లాలో 300 మంది ఈ తేనెటీగల పెంపకాన్ని చేస్తున్నారు. తెలంగాణలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పెంపకం ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రా‌ల్లో ఒకే కేంద్రం 

పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం విజయరాయిలోని తేనెటీగల పెంపక ం, విస్తరణ కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులకు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు.ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ ఆధ్వర్యంలో 1981 సంవత్సరంలో రెండు తెలుగు రాషా్ట్రల ప్రజల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా శిక్షణ ఇచ్చారు. రైతులు, నిరుద్యోగులు, ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తేనెటీగలను ఈ కేంద్రమే సరఫరా చేస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో తేనెటీగల ఉత్పత్తి కూడా ఇక్కడ జరిగేది. అయితే ప్రస్తుతం కేవలం ఈ కేంద్రం తేనెటీగలను రైతుల వద్దనుంచి తెచ్చి సరఫరా చేయటంతో పాటు ఈ పెంపకంపై శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

లాభాల తేనెపట్టు 
ఒక రాణి( పరిపూర్ణమైన ఆడ ఈగ). వేల సంఖ్యలో కూలి ఈగలు (అసంపూర్ణమైన ఆడ ఈగలు) , వందల సంఖ్యలో పోతు(మగ) ఈగలు ఒక గుంపుగా కలిసి ఉండటాన్ని తేనెపట్టు లేదా తేనెతుట్టె అంటారు. తేనె పట్టుకున్న బలాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను ఆ పట్టులోని శ్రామిక(కూలి) ఈగల సంఖ్య బట్టి నిర్ధారిస్తారు. ఎన్ని ఎక్కువ శ్రామిక ఈగలు ఉంటే ఆపట్టును బలమైన తేనెపట్టు అంటారు తేనెపట్టుల అభివృద్ధికి, మంచి దిగుబడికి పుప్పొడి, మకరందం ఉండే పుష్పజాతులు అందుబాటులో ఉండాలి. అన్ని ప్రాంతాల్లో ఈ పుష్పజాతులు కొన్ని మాసాల్లో విరివిగా లభించడం వల్ల తేనెదిగుబడి ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతంలో నువ్వు, ఆవాలు, జనుము, పిల్లిపెసర, దోస, పుచ్చ, కంది మొదలైన పూతల వద్దకు తరలించి మంచి తేనె దిగుబడిని పొందుతున్నారు. వేప, తాడి, జీడిమామిడి, చింత, నల్లమంది, నేరేడు, ములగ, కానుగ, కరక్కాయ, కుంకుడు, నీలగిరి, కొబ్బరి, కాఫీ, నిమ్మ, నారింజ, మామిడి, బూరుగ, ఈత, పామాయిల్‌ చెట్లతో పాటు అపరాల పంటలు ఉన్న ప్రాంతాల్లో తేనెదిగుబడి ఎక్కువగా లభిస్తోంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఏలూరు సిటీ

భారీగా సబ్సిడీలు 
విజయరాయిలోని ఈ కేంద్రంలో శిక్షణ పొందిన తర్వాత కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి కల్పనా పథకం ద్వారా జాతీయ బ్యాంకులలో రుణం పొందిన వారికి ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీలు అందజేస్తున్నారు. రూ. 10వేలు నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందిస్తుండగా ఈ పరిశ్రమ స్థాపించిన వారికి ఒసి పురుషులుకు మాత్రం 25 శాతం, మిగిలిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి మహిళలకు అందరికీ 35శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. బ్యాంకు రుణం పొందిన వారికి మాత్రమే ఈ సబ్సిడీలు అందజేస్తారు.

ఉజ్వల భవిత 
విజయరాయిలో ఉన్న రాష్ట్రస్థాయి తేనెటీగల పెంపక విస్తరణ కేంద్రంలో కేవలం శిక్షణా కార్యక్రమాలే నిర్వహిసున్నాం. ప్రస్తుతం తేనెకు మంచి గిరాకీ ఉండడంతో తేనెటీగల పరిశ్రమలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పరిశ్రమ పట్ల మొగ్గుచూపడంతో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశం ఉంది.

– తేనెటీగల విస్తరణ కేంద్రం అధికారులు వీఎస్‌ రావు, టీవీ రావు

కష్టమైనా లాభదాయకం 
అలవాటులేని వారికి కష్టమైన పరిశ్రమ, కష్టపడి పనిచేస్తే ఈ పరిశ్రమలో మంచి ఫలితాలను పొందవచ్చు. విజయరాయిలో అందించిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ శిక్షణతోపాటు ప్రయోగాత్మకంగా రైతుల వద్ద మెలకువలు నేర్చకుంటే తేనెటీగల పరిశ్రమలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 

Credits : Andhrajyothi

గొర్రెల కాపర్ల జీవితాల్లో వెలుగులు 

 • 75 శాతం సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం
 • ఆనందంలో గొర్రెలు, మేకల కాపరులు


నాగర్‌కర్నూల్‌ వ్యవసాయం:
 ఎన్నో ఏళ్లుగా గొర్రెల పెంపకంపై ఆధారపడి దుర్భర జీవితాలను వెల్లదీస్తున్న కురుమ, యాదవులు, రానురాను ఆ వృత్తికి దూరమవుతున్నారు. ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో గొర్రెల పెంపకాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. కానీ అనాదిగా వస్తున్న సంప్ర దాయ వృత్తిని వదులుకోలేని పాతతరం వ్యక్తులు అష్టకష్టాలు పడుతూ గొర్రెల మందలను ఇతర ప్రాంతాలకు తోలుకెళ్లి పెంపకాన్ని కొనసాగి స్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సబ్సిడీ గొర్రెల పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో గొర్రెల కాపరులు దాదాపుగా లక్షా 16 వేల జనాభా ఉంది. 225 గొర్రెల కాపరుల సంఘాలు ఉండగా 16,150 మంది సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కో కుటుంబానికి 20 గొర్రెల చొప్పున రానున్నాయి. ఇక అందరికీ మంచి రోజులే..

సరఫరాకు సరిపడా గొర్రెలేవి 
గొర్రెల కాపరులందరికీ రాష్ట్రంలో గొర్రె లను సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికోసం ఇతర రాషా్ట్రల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా గొర్రెల పెంపకందారులకు కూడా ఇతర జిల్లాల నుంచి తెచ్చి అందివ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని గొర్ల పెంపకందారులకు మంచి రోజులు రానున్నాయి. 75 శాతం సబ్సిడీపై జీవాల యూనిట్లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో గొర్రెల పెంపకం దారులకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో గొర్లకాపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో 20 శాతమే సబ్సిడీ 
గతంలో గొర్రెల కాపరులకు ప్రతియేటా రుణాలను మంజూరు చేసేవారు. లక్ష రూపా యల రుణంలో 20 గొర్రెలు, ఒక పొట్టేలు మం జూరు చేసేవారు. వీటిలో 20 శాతం ప్రభుత్వం సబ్సిడీ చెల్లించేది. రూ.2.68 లక్షలకు వంద గొర్రెలు, 4 పొట్టేళ్లు మంజూరు చేసేవారు. ఇందులో 20 శాతం సబ్సిడీ గొర్రెల కాపరులకు లభించేది. ప్రస్తుతం 75 శాతం సబ్సిడీపై గొర్రెలను సరఫరా చేస్తామని సీఎం ప్రకటించడంతో గొర్రెల కాప రుల్లో అనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదు 
గొర్రెల కాపరులకు సబ్సిడీతో జీవాల యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార ్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వం గొర్రెల కాపరు దారు లకు 75 శాతం సబ్సిడీతో జీవా లను అందిం చేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోష కరం. దీనికి సంబంధించిన మార్గదర్శ కాలు రాగానే తెలియజేస్తాం. అర్హులు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందవచ్చు.

డాక్టర్‌ జి.అంజిలప్ప,
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
 Credits : Andhrajyothi

పాడిని నమ్మితే… బతుకు పండింది

సొంతూళ్లో సెంటు పొలంలేదు.. సరైన ఉపాధి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడమే గగనం.. ఎలా బతకాలి? ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇక ఊళ్లో ఉండలేమని.. మూటముళ్లే సర్దుకొని చాగలమర్రికి వలస వచ్చారు సురేఖ దంపతులు. అరెకరం పొలం ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో ఓ షెడ్డు నిర్మించారు. పాడిని నమ్ముకున్నారు. ఐదారు గేదెలతో ఆరంభించి.. 24 గేదెలతో పాడిపరిశ్రమగా అభివృద్ధి చేశారు… కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఎస్‌.సురేఖ, సురే్‌షయాదవ్‌ దంపతులు.
కపడ జిల్లా పెద్దపసుపుల గ్రామానికి చెందిన ఎస్‌.సురేఖ, సురేష్‌ యాదవ్‌ దంపతులు ఉపాథి కోసం కర్నూలు జిల్లా చాగలమర్రికి ఆరేళ్లక క్రితం వలస వచ్చారు. తెలిసినవారి దగ్గర అప్పు చేసి నాలుగు గేదెలు కొన్నారు. రేయింబవళ్లు కష్టపడ్డారు. ఉయయాన్నే పాలు పితికి ఇల్లిల్లూ తిరిగి అమ్మడం మొదలుపెట్టారు. కల్లీలేని చిక్కటి పాలు ఇంటికి సరఫరా చేసే ఆ దంపతులు సరఫరా చేసే పాలకు అనతికాలంలో ఆదరణ పెరిగింది. ఉపాధి కోసం చేపట్టిన పాడిపోషణ పరిశ్రమగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటికే చేసిన అప్పు తీరింపోయింది.

మరికొన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రుణం ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. మ రో పది గేదెలను ఒకొక్కటి 45 వేల రూపాయలు ఖర్చు చేసి కొన్నారు. గ్రామంలోనే అర ఎకరా పొలంను ఐదేళ్ల లీజుకు తీసుకొని అందులో ఓ షెడ్డు నిర్మించి పాడిపరిశ్రమకు శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్‌లో మరో 6 గేదేలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాళ్ల దగ్గర మొత్తం 24 గేదెలున్నాయి.

– ఆంధ్రజ్యోతి, కర్నూలు

మా కష్టాలు తీరాయి
ఒకప్పుడు కనీస ఉపాథి లేక ఇబ్బంది పడ్డా. పాడిని నమ్ముకుని ఈ రోజున గౌరవంగా జీవిస్తున్నాం. మా పిల్లలు ఇద్దరూ చదువుకుంటున్నారు. నాలుగు పశువుల నుంచి మా ప్రయాణం 24 పశువులకు పెరిగింది. మా కష్టానికి ప్రజల నమ్మకం తోడైంది. అదే మా విజయ రహస్యం. కరువు రోజుల్లో కూడా పాడి పరిశ్రమను నమ్ముకుని, కష్టపడి పనిచేస్తే ఆదాయానికి ఏ మాత్రం ఢోకా ఉండదు.

– సురేఖ, పాడి రైతు


నెలకు పాతిక వేలకు పైనే 
రోజూ సగటున 35 నుంచి 40 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. అందులో 25 లీటర్ల వరకు ఆమే భర్త సురే్‌షయాదవ్‌ ఇంటింటికి వెళ్లి వినియోదారులకు పోస్తారు. మరో 10-15 లీటర్లు విజయ డైరీకి అమ్ముతారు. నీళ్లు కలపని చిక్కటి పాలు కావడంతో వినియోదారులు లీటరుకు 50 ఇస్తున్నారు. విజయ డైరీకి వేసే పాలకు వెన్న శాతాన్నిబట్టి రూ.38 నుంచి రూ.50ల వరకు వస్తున్నది. ఇలా రోజుకు 1500 చొప్పున నెలకు 45 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు ఆ దంపతులు. గేదేల పోషణకు మొక్కజొన్న, తౌడు, బియ్యం నూక మిశ్రమం దాణా ఇస్తున్నారు. అంతేకాదూ జొన్నమేత, పచ్చిగడ్డి మేత పశుగ్రాసంగా ఇస్తున్నారు. దాణా, పశుగ్రాసం కొనుగోలు కోసం నెలకు రూ.10 వేలు, వైద్యం కోసం రూ.3-5వేలు కలుపుకొని సగటున పోషణ ఖర్చు రూ.15 వేలకుపైగానే వస్తుంది. వివరించారు. గేదేలకు జబ్బు చేసినప్పుడు పాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, పోషణ ఖర్చులు పోనూ నెలకు సగటున రూ.20 వేల వరకు మిగులుతున్నదని ఆ దంపతులు వివరించారు. కష్టపడితే ఎంచుకున్న రంగం ఏదైనా అందులో రాణించడం సాధ్యమేనని, కరువును కూడా జయించవచ్చని నిరూపించిన ఆ దంపతులను ఆదర్శంగా తీసుకుని పాడిపరిశ్రమ వైపు దృష్టి సారిస్తున్నారు.

Credits : Andhrajyothi