
- ఉద్యమంగా దేశీ విత్తన సంరక్షణ
- 3 ఎకరాల్లో 250 పంటలు సాగు చేస్తున్న రాజు
ఆయనో ప్రకృతి సేద్య ప్రేమికుడు… విత్తన సంరక్షకుడు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించాలంటే దేశీ విత్తనాలతోనే సాధ్యం అని నమ్మారు. అందుకోసం అరుదైన దేశీ విత్తనాలను పరిరక్షిస్తున్నారు 3 ఎకరాల్లో 250 రకాల పంటలు పండిస్తూ ప్రకృతి సేద్యం లాభదాయకం అని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంటకు చెందిన గణపతి శివప్రసాదరాజు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంటలో మూడెకరాల విస్తీర్ణంలో వున్న వ్యవసాయ క్షేత్రం 250 రకాల అరుదైన పంటలకు నిలయం. అడవిలో మొక్కలు పెరిగిన విధంగా అన్ని పంటల్నీ కలిపి, ప్రకృతి సేద్యం చేయడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో 40 రకాల చిక్కుడు, నల్లమిర్చి, ఎర్ర మిర్చి, 3 రకాల గుమ్మడి, 12 రకాల టమాట, 8 రకాల సొరకాయలు… ఇలా 250 రకాల పంటలు సాగుచేస్తున్నాడు శివప్రసాద రాజు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రసాదరాజు డిగ్రీ వరకు చదివారు. వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఆయన దృష్టి వ్యవసాయం మీదకు మళ్లింది. 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని గోరుచిక్కుడు, వరి సాగు చేసి అనుభవం లేక ఆర్థికంగా చాలా నష్టపోయారు. విత్తనాల నుంచి ఎరువుల దాకా దిగుబడి ఖర్చులు పెరిగిపోవడమే రైతులు నష్టపోవ డానికి కారణం అని గ్రహించారు. సాగుకు ప్రాణమైన విత్తనాలను మనమే తయారు చేసుకుని, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేస్తే లాభాలు తప్పకవస్తాయని భావించారు.
2012లో నాగరకుంటలో 3.2 ఎకరాల్లో విలక్షణ సాగుకు శ్రీకారం చుట్టారు. దేశీ విత్తనాల సంరక్షణను ఉద్యమంగా చేపట్టారు. 250 రకాల పంటలను అడవిలో అన్ని రకాల చెట్లు ఎలా కలసి పెరుగుతాయో, అంతే సహజంగా… అన్ని పంటలను కలిపి సాగు ప్రారంభించారు. సీజన్‌కు అనుగుణంగా పంటలను మారుస్తున్నారు.
చీడపీడల నివారణకు కేవలం జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. పురుగుల ఉధృతి ఎక్కువగా వుంటే అగ్ని అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పంట పూత, కాయ దశలో చేపల ద్రవాన్ని బెల్లంతో కలిపి పంటలకు అందిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఈ రైతు పండిస్తున్న ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. నేను ఒక్కడినే మంచి పంటలు పండించడం కాదు.. రైతులంతా దేశీ విత్తనాలతోనే సాగు చేయాలనే లక్ష్యంతో విత్తన సంరక్షణ చేపట్టారు రాజు. ప్రకృతి ప్రేమికుడు హరినాథ్‌రెడ్డి ప్రేరణతో దేశీయ విత్తనాల ప్రాధాన్యత తెలుసుకున్నారు.
దేశమంతా పర్యటించి అరుదైన విత్తనాలు సేకరించారు. ఇప్పటివరకు 420 రకాల వరి విత్తనాలను, 250 రకాలకు పైగా కూరగాయల విత్తనాలను సేకరించారు. వాటితో విత్తనోత్పత్తి ప్రారంభించారు. మేలురకం విత్తనాలను తక్కువధరకు సాటి రైతులకు అందిస్తున్నారు. దేశీవిత్తనాన్ని పరిరక్షించే జాతీయ స్థాయి సంస్థ బీజ్ స్వరాజ్ మంచ్‌లో ఈ రైతుకు స్థానం లభించింది. జీఎం విత్తనాలకు వ్యతిరేకంగా పనిచేసే 55 సంస్థలున్న ఈ మంచ్‌లో రాజుకు స్థానం దక్కడం విశేషం.
దేశీ విత్తనాలే రక్ష : ప్రసాదరాజు
అత్యంత ఘాటైన మిరప భూత్ జిలోకియను మేఘాలయ నుంచి తెచ్చి సాగు చేస్తున్నాను. ఏడు నెలల పాటు కాసే కాశీ టమాటాను చంఢీఘర్ నుంచి తెచ్చాను. ఇండియన్ వయాగ్రాగా పిలిచే నవార రకం వరి, కేన్సర్‌ను దూరం చేసే నల్లబియ్యాన్ని సాగు చేస్తున్నాను. వాటి విత్తనాలను పరిరక్షిస్తున్నాను. లక్షల సంఖ్యలో వుండే దేశీ విత్తనాలు ఇప్పుడు వేలకు పడిపోయాయి. వాటిని కాపాడుకుంటేనే మన వ్యవసాయం బతుకుతుంది. ఆ పంటలు ఆహారంగా తీసుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా వుంటారు.
రాజు ఫోన్ : 86868 71048
Credits : Andhrajyothi