సమగ్ర సేద్యం… మహిళారైతు విజయం

వ్యవసాయం అంటే ఎరువులు, పురుగుల మందులతో చేసేది కాదు, ప్రకృతి సిద్ధంగా చేసేదే నిజమైన వ్యవసాయం అని నిరూపిస్తున్నారు యాచారం మండల పరిధి మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కొలన పుష్పలత. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా గోవులు, గొర్రెలు, కోళ్లు పెంచుతూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారామె. సమగ్ర వ్యవసాయ విధానాలతో సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ మహిళారైతు విజయగాధ ఇది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కొలన్‌ పుష్పలతకు 12 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో మూడు ఎకరాల్లో జామతోట, మరో మూడు ఎకరాల్లో మామిడితోట, మామిడితోటలో అంతరపంటగా మునగ చెట్లు పెంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలోనే మూడు ఆవులు, 20 గొర్రెలను పెంచుతున్నారు. ఐదు బాయిలర్‌ కోళ్లషెడ్లు వేసి, ఒక్కో షెడ్డులో పదివేల కోళ్లు పెంచుతున్నారు. పంట పొలంలో వ్యర్థాలను పారవేయకుండా పొలంలోనే దుక్కిలో కలియ దున్ని నేలసారాన్ని కాపాడుకుంటున్నారు. గతంలో సాధారణ జామతోట పెంచారు. ఆశించిన మేర దిగుబడులు రాలేదు. దాంతో ఉద్యానశాఖ నిపుణుల సలహా మేరకు అలబాసఫేదా, లక్నో 49రకాల జామ మొక్కలను నాటారు. తోటలకు ఆవుపేడ, గొర్రెల ఎరువు వేశారు. తెగుళ్లు సోకడంతో వేపకషాయం, వేపనూనె పిచికారి చేశారు. దీంతో తెగుళ్ల నివారణ జరిగింది. సహజమైన ఎరువులు వాడటంతో జామతోట ఏపుగా పెరిగింది. చిన్నమొక్కకు 20 నుంచి 30 జామకాయలు పట్టాయి. కాయ బాగా లావుగా, తీయగా ఉండటంతో మంచి ధర పలికింది. కిలో జామపండ్లను 20 రూపాయలకు నేరుగా వ్యాపారులు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. దీంతో ఎకరా జామతోటతో లక్ష రూపాయల ఆదాయం వచ్చిందన్నారు పుష్పలత. మూడు ఎకరాల్లో బంగినపల్లి, మల్లిక రకాల మామడితోటను పెంచారు. ఈ ఏడాది తొలిదఫా కాతపట్టింది. మామిడితోటకు ఆకుముడత, తేనెబంక తెగులు సోకడంతో వేపనూనె పిచికారి చేశారు. దీంతో తెగులు నివారణ అయింది. ప్రస్తుతం ఒక్కో మామిడి చెట్టుకు వంద నుంచి 200 దాకా కాయలున్నాయి. మామిడితోట నుంచి కనీసం 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని భావిస్తున్నారామె. మామిడితోటలో అంతర పంటగా మునగ చెట్లు పెంచారు. గత ఏడాది మునగ కాయ కారణంగా 75వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సారి వివాహాల సమయంలో మునగ కాయ రావడంతో లక్ష రూపాయల దాక ఆదాయం పొందారామె. తోటలకు డ్రిప్‌ ద్వారా నీరందిస్తున్నారు. ప్రతి మొక్క దగ్గర పశువుల ఎరువు వేసి, డ్రిప్‌ ద్వారా నీరందించడం వల్ల నీరు ఆదా కావడంతో పాటు చెట్టు ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తున్నది.

డ్రమ్‌సీడర్‌తో నాట్లు… అధిక దిగుబడి

ఖరీ్‌ఫలో రెండెకరాలలో శ్రీవరిసాగు చేశారు పుష్పలత. డ్రమ్‌సీడర్‌తో నాట్లు వేయడంతో మొక్కలు ఏపుగా పెరిగి, ఒక్కో మొక్కకు వంద పిలకల దాకా వచ్చాయి. రెండెకరాల్లో 48 క్వింటాళ్ల బియ్యం చేతికి వచ్చింది. నాణ్యమైన ఆ బియ్యాన్ని తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే విక్రయించి లాభాలు గడించారు. శ్రీవరి సాగులో తాను అనుసరించిన విధానాల గురించి చెబుతూ, ‘‘పొలాన్ని ముందుగా బాగా కలియదున్నాలి. బాగా బురదలా ఉన్న సమయంలో వరి ముక్కు పగలగానే డ్రమ్‌సీడర్‌తో నాటుకోవాలి. అలా చేయడంతో మొక్క బలంగా పెరుగుతుంద’’న్నారామె. విత్తనాలు ఎక్కడి నుంచో కాకుండా తన పొలంలోనే విత్తనాలు పండించి, సాటి రైతులకు తక్కువ ధరకు విక్రయించారు పుష్పలత. ఇక డ్రిప్‌ పద్ధతిలో నీరందించి టమాటా సాగు చేశారు. ఎకరం పొలంలో టమాటా, మరో ఎకరం భూమిలో బీర, సొరకాయలు పండించి యాచారం కూరగాయల మార్కెట్‌లో విక్రయించారు. ఎకరం టమాటతోట నుంచి మూడు లక్షల ఆదాయం పొందారామె. బీర, సొర పంట ద్వారా మరో లక్ష రూపాయలు ఆర్జించారు. వీటి సాగుకు సేంద్రియ ఎరువులు వాడారు. దీంతో కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉంటున్నాయి.

వేపకషాయంతో తెగుళ్లకు చెక్‌

‘‘పంటలకు ఎలాంటి తెగులు సోకినా కేవలం వేపకషాయం వాడాలి. ఎలాంటి తెగులు నివారణకైనా వేప ఆకులు పది కిలోలు, కానుగ ఆకులు పదికిలోలు, వెంపలి ఆకులు పది కిలోలు, అల్లనేరేడు ఆకులు పదికిలోలు, వాయిల్‌ ఆకులు పదికిలోలు, జిల్లేడు ఆకులు పది కిలోలు, 3 కిలోల నల్లబెల్లం, అరకిలో శనగపిండి, దేశవాళీ ఆవుమూత్రంలో కలిపి బాగా నానపెట్టుకోవాలి. వారం రోజుల పాటు ఈ మిరఽశమాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం వేళ బాగా కలపాలి. ఆ రసాయనాన్ని తెగుళ్ల బారిన పడిన పంటలకు పిచికారి చేసుకుంటే పంటలకు ఎలాంటి చీడపీడలున్నా నాశనమవుతాయి. ఇలాంటి మందులు వాడడంతో పంట ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా ఉండి మానవాళికి మేలు చేస్తాయ’’టున్నారు పుష్పలత. తన పొలంలో పెంచుతున్న మూడు దేశీ ఆవుల మూత్రం, పేడతోనే ఆమె సహజ ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. దీనివల్ల రసాయనాలు, ఎరువుల ఖర్చు తగ్గి, రాబడి పెరుగుతుందంటున్నారామె.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, యాచారం


కోళ్ల పెంపకం. భలే లాభం
గతేడాది 60 గొర్రె పిల్లలు అమ్మి 80 వేల రూపాయలు సంపాదించారామె. ప్రస్తుతం మరో 20 గొర్రెలను పెంచుతున్నారు. వాటిని తన జామ, మామిడితోటల్లోనే మేపుతున్నారు. దాంతో పంటలకు మంచి ఎరువు లభించి, బాగా దిగుబడి సాధిస్తున్నారు. ఆ తరువాత వీటి ఎరువును జాగ్రత్త చేసి వరి సాగుకు ముందు పొలంలో చల్లి బాగా కలియదున్నుకుంటున్నారు. దీని వల్ల దిగుబడులు పెంచుకోగలుగుతున్నారు. పొలంలోనే పదేసి వేల సామర్థ్యం ఉన్న నాలుగు బాయిలర్‌ కోళ్ల షెడ్లు నిర్మించారు. మొత్తం 40 వేల కోళ్లు పెంచుతూ అధిక ఆదాయం గడిస్తున్నారు. నాలుగు కుటుంబాలకు జీవనోపాథి కల్పిస్తున్నారామె.

ప్రభుత్వ పథకాలతో రైతులకు మేలు
ప్రభుత్వ పథకాలు రైతుకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. రసాయన ఎరువులు వాడి, అధికదిగుబడులు సాధిద్దాం అనే ఆలోచనకు రైతులు స్వస్తి చెప్పాలి. సేంద్రీయ సాగు పట్ల అధికారులు రైతుల్లో అవగాహన పెంచాలి. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ పద్ధతులు పాటించి మన పూర్వీకులు ఎన్నో సత్ఫలితాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సద్వినియోగం చేసుకుంటూ, నీటియాజమాన్య పద్ధతులు పాటించాలి. సేంద్రీయ సేద్యంతో రైతుల ఆదాయాలు పెరిగి, వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తప్పక వస్తుంది. 

Credits : Andhrajyothi

సెల్‌ సహకారి

వ్యవసాయంలో సాంకేతిక సాయం అందిస్తే రైతు నష్టపోడు. అలాగే పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు తగ్గ ఉత్పత్తి కూడా జరుగుతుంది అంటున్నారు డాక్టర్‌ వెంకట్‌ మారోజు. ఒకప్పటి వరంగల్‌ జిల్లా, జనగాంకి చెందిన ఈయన తాను ఎదుర్కొన్న ఇంగ్లిష్‌ ఇబ్బందుల్ని వెనక్కి నెట్టి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. చదివింది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అయినా రైతుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో సాంకేతికత ద్వారా వాళ్లకు చేరువయ్యారు. జనగాం నుంచి బోస్టన్‌ వరకు ఆయన చేసిన ప్రయాణం, రైతుల కోసం అందిస్తున్న సాంకేతిక సాయం ఏమిటి అనే వివరాలు ఆయన మాటల్లోనే… 

‘‘మాది రైతు కుటుంబం కానప్పటికీ నన్ను ఈ రంగం వైపు నడిపిన అంశం గురించి తెలుసుకునే ముందు నా గురించి కొంచెం చెప్పాలి మీకు. మా నాన్న టీచర్‌ కావడం వల్ల సొంతూరు జనగాంలోనే తెలుగు మీడియంలో చదువుకున్నాను. 1982-84లో ఇంటర్మీడియట్‌ పూర్తయ్యింది. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. రిజర్వేషన్‌ ఉండడం వల్ల సీటయితే వచ్చింది. కాని ఊళ్లో తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంగ్లిష్‌ మాట్లాడడం రాకపోయేది. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ రోజుల్లో మా ఊరి మొత్తం నుంచి ఏడాదికి ఒకరికి ఇంజనీరింగ్‌లో సీటు వచ్చేది. సీటు వచ్చినోడు ఊళ్లో హీరో. కాని యూనివర్శిటీకి వస్తే మా పరిస్థితి జీరో. ఎలాగోలా కష్టపడి చదవడం వల్ల మార్కులు బాగా వచ్చాయి. ఆ తరువాత ‘గేట్‌’లో కూడా మంచి స్కోర్‌ రావడంతో బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’లో చేరాను. ఇక్కడ మాత్రం రిజర్వేషన్‌ లేకుండానే సీటు వచ్చింది. అలా కొంత అదృష్టం, కొంత శ్రమ కలిసి అమెరికాలో పిహెచ్‌డి చేయగలిగాను.
ఊహించనిది జరిగింది!
ఇదంతా ఒక ఎత్తయితే నేను కలలో కూడా ఊహించని పరిణామం మరోటి నా జీవితంలో చోటుచేసుకుంది. ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్‌వన్‌ యూనివర్శిటీ అయిన ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఎంఐటి)లో ఎంబిఎ చేయడం. ఇది నేను పనిచేసిన ‘బోస్‌’ కంపెనీ వల్ల సాధ్యమైంది. బోస్‌లోని ఆటోమోటివ్‌ ఇండస్ర్టీలో పదిహేనేళ్లు ఉద్యోగం చేశాను. లగ్జరీ కార్లలో ఉండే స్పీకర్లు తయారుచేస్తారు ఇక్కడ. డెట్రాయిట్‌లో ఉన్న ఆటోమోటివ్‌ డివిజన్‌లో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పని చేశాను. ఆ తరువాత బోస్టన్‌కి వెళ్లాను. అక్కడ ఉన్నప్పుడే కంపెనీ వాళ్లు ఎంఐటిలో ఎంబిఎ చేసేందుకు స్పాన్సర్‌ చేశారు. నేను ఎంబిఎ చదువుతున్నప్పుడు మనదేశంలో మైక్రోఫైనాన్స్‌ బాగా నడుస్తోంది. దాని మీద పరిశోధన చేసి థీసిస్‌ రాశాను. అప్పుడు రైతు ఆత్మహత్యలు నా మనసుని కదిలించాయి. దాంతో మనదేశానికి వచ్చి సామాజిక కోణం ఉన్న అంశం మీద పనిచేయాలి అనిపించింది. దాంతో 2009లో అమెరికాలో ఉద్యోగం వదిలేసి, మన దేశానికి వచ్చాను. కరీంనగర్‌లోని ముల్కనూరు సహకార సంస్థ ద్వారా రైతులకి సాయపడదాం అనుకున్నాను. అయితే అది ఎన్జీవోగా నడుస్తోందే కాని అంతకు మించి పెరగడంలేదు. ఆ సంస్థను విస్తరిస్తే చాలామందికి సాయం చేసినట్టు ఉంటుందని మొదలుపెట్టి మూడేళ్లు బాగా కష్టపడ్డాను.

ఆలోచన నచ్చి… 

ఇప్పుడు నేను సిఇఓగా ఉన్న ‘సోర్స్‌ట్రేస్‌ సిస్టమ్స్‌’ వాళ్లు మైక్రోఫైనాన్స్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌నే తయారుచేసేవాళ్లు. అమెరికాలో ఉన్న ఈ సంస్థ ఇన్వెస్టర్లకు నేను అడ్వైజరీగా చాలాకాలం ఉన్నాను. ఒకసారి వాళ్లు నాతో ‘కంపెనీ సరిగా నడవడం లేదు. మీరేమైనా చూస్తారా’ అని అడిగారు. వాళ్లు నన్ను ఆ విషయం అడిగేటప్పటికి వ్యవసాయానికి సంబంధించి నాకు కొంత పరిజ్ఞానం ఉంది. అప్పటికి మనదేశంలో మైక్రోఫైనాన్స్‌ స్కీంలో ఇబ్బందులు ఎదురై అది వెనక్కి పోయింది. దాన్ని ఈ సంస్థ చేస్తున్న పనితో కలిపితే బాగుంటుందనే నా ఆలోచనను వాళ్లకి చెప్పాను. ఆలోచన నచ్చి సంస్థ పూర్తి బాధ్యతలు నాకే అప్పగించారు. బాధ్యతలు స్వీకరించాక ‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌ ప్రొడక్ట్‌’ తయారుచేశాం. మా సంస్థ తయారుచేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ చిన్న, సన్నకారు రైతులతో పనిచేసే సహకార సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వాలు, విత్తన పంపిణీదారులకి మొబైల్‌ ద్వారానే వ్యవసాయానికి, రైతులకి సంబంధించిన సమస్త సమాచారం అందచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు దాదాపు ఒకేలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. 20 దేశాల్లో మూడు లక్షల మంది రైతులు మా కంపెనీతో ఉన్నారు. ఇండియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో మా సాంకేతిక సేవలు అందిస్తున్నాం.
 

ఉత్పత్తి పెంచాలి.. 

ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు అయితే అందులో రెండు వందల కోట్లు రైతు కుటుంబాలే. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది చిన్న రైతులు ఉన్నారు. ఈ రైతులే 70 శాతం ఆహారం ఉత్పత్తి చేస్తున్నారు. కాని ఆ రైతులు పేదరికంలో ఉంటున్నారు. మా లెక్కల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లు దాటే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడున్న దానికంటే 50 నుంచి 70 శాతం ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. కాని ఆఫ్రికాలో తప్ప మరెక్కడా పంటసాగుకి ఖాళీ భూమి లేదు. అలాగే ఈ రైతులు ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్లు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల ఎక్కువ దిగుబడి చేయలేకపోతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి పెంచే పద్ధతులు రైతులకి సూచించడం, చిన్న రైతుల సాధికారత, పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయం అనే అంశాలపై దృష్టి పెట్టాం. అలాగే లాభాల కోసం ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది, దళారుల చేతుల్లో పడకుండా పంటలాభం నేరుగా రైతులకి ఎలా చేరుతుంది అనే అంశాల మీద కూడా దృష్టి పెట్టాం. అయితే నేరుగా రైతు మా సాఫ్ట్‌వేర్‌ను వాడాలనేది మా లక్ష్యం కాదు. సహకార సంస్థలు, ప్రభుత్వం, ఎన్జీవోలు, రైతులతో పనిచేసే సంస్థలు, కంపెనీలు – వీటి ద్వారా రైతులకి సాయం అందుతుంది. ఒకరొకరుగా కాకుండా సమూహంగా ఏర్పడితే రైతులకి ఎక్కువ లాభం కలుగుతుంది.
 

మధ్యవర్తులు లేని మార్కెటింగ్‌.. 

రైతులు సమూహంగా ఉంటే విత్తనాల నుంచి పంట మార్కెటింగ్‌ వరకు మేలు జరుగుతుంది. వెయ్యిమంది రైతులు కలిసి ఉంటే వాళ్లకు బేరమాడే శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి ముల్కనూర్‌నే తీసుకుంటే అక్కడి రైతులు ఎరువులు, విత్తనాల వంటి వాటికోసం లైన్లో నిల్చోరు. రైతుల దగ్గరికే వాటిని పంపుతాయి కంపెనీలు. అలాగే అప్పు కావాలన్నా వెయ్యిమంది రైతులు కలిస్తే దొరకడం సులభం అవుతుంది. మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ఒక్కో రైతు పంట నిల్వ చేయాలన్నా సమస్యే. సమూహంగా ఉంటే కొద్ది డబ్బు జమ చేసుకుని, అప్పు తెచ్చుకుని ‘వేర్‌హౌజ్‌’లు కట్టుకోవచ్చు. అలాగే రైస్‌మిల్లులో బియ్యం పట్టించి అమ్మితే వడ్లు అమ్మిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఇలాంటి ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. మనదేశంలో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 

సరైన సమయంలో.. సరైన సమాచారం.. 
అలాగే మీకో సహకారసంస్థ ఉంటే కనుక అందులో ఉన్న రైతుల సమాచారమంతా మా దగ్గర ఉంటుంది. ఫలానా రైతుకి భూమి ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనే సమాచారాన్నంతా నిక్షిప్తం చేస్తాం. పెద్ద కంపెనీలకు ఇది ఉపయోగపడుతుంది. సరైన సమయంలో సరైన సమాచారం ఉండడం వల్ల కంపెనీలకే కాదు రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. పంట సమయంలో సూచనలు ఇవ్వడం, వర్షం ఎక్కువ పడినా, తక్కువ పడినా ఏం చేయాలి వంటివన్నీ వాళ్లు ఎప్పటికప్పుడు రైతులకి అందించొచ్చు. ఇలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మరెన్నో అంశాలు ఉన్నాయి. మనందరికీ తిండి గింజలు అందించే రైతు అప్పులపాలై, ఆర్థిక ఇబ్బందులతో దీనంగా జీవించడం మనకే మాత్రం మంచిది కాదు. రైతు రాజులా జీవించాలి. అప్పుడే మనందరం బాగుంటాం. సమాజం మెరుగుపడుతుంది.’’

‘‘జనగాంలో తెలుగు మీడియం చదివిన వెంకట్‌కు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు అంతా గందరగోళంగా అనిపించింది. ఈ ఇంగ్లి ష్‌తో నెగ్గుకురాగలనా అనుకున్నారు. కాని ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ రైతులకోసం పనిచేస్తున్నారు’’

  • ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో నన్ను చూసి మా స్నేహితుల్లో ఎక్కువమంది ‘‘సంపాదించినదంతా పొలాల మీద పెట్టి ఎందుకు వృథా చేస్తావు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టు’’ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో డబ్బులు పెడితే మనసుకు ఏం తృప్తి ఉంటుంది. అందుకే నేను నా మనసుకి తృప్తినిచ్చే ఈ రంగాన్ని వదలకుండా పనిచేస్తున్నాను.
  • 2020 వరకు కోటి మంది రైతులకు మా సాఫ్ట్‌వేర్‌ ద్వారా సేవలందించాలి. 50 దేశాల్లో కోటి మంది రైతులకు సేవలందించాలనేదే మా లక్ష్యం. ఈ సాఫ్ట్‌వేర్‌ ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం మొదట్లో చాలా కష్టం అయ్యింది. మా సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌ పేరు

‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌’. 

  • ‘ఇ-సర్వీసెస్‌ ఎవ్రీవేర్‌’ పనుల్లో భాగంగా ప్రతిరోజూ పది దేశాల వాళ్లతో మాట్లాడుతుంటాం.
  • మన దగ్గర అరకు లోయలో ఉండే గిరిజనులకి మా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడింది. రాజమండ్రి వద్ద యానాది వాళ్లు ఎండ్రకాయలు పట్టి అమ్ముతుంటారు. అవి అమెరికాలో చాలా ఎక్కువ ధర ఉంటాయి. కాని ఇక్కడ వాళ్లకు ఆ విషయం తెలియదు. వాళ్లకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం.
Credits : Andhrajyothi

చెరువు నీటిపై శ్రద్ధ.. లాభాల పంట 

‘‘మట్టికి, కృషీవలుడికి సరైన గౌరవం లభించనంత కాలం ఆరోగ్యకరమైన,
సమద్ధి కరమైన సమాజాన్ని నెలకొల్పడం అసాధ్యం’’
– పీటర్‌ మారిన్‌ (సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, ఫ్రాన్స్‌) 

  •  అద్భుత దిగుబడులు సాధించిన ఆక్వారైతు శ్రీనివాసులు 

రొయ్యల సాగు అంటే… లాటరీలా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. వచ్చిన ఏడాది మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో ఆక్వారైతు ఆదాయం అస్థిరంగా మారింది. కొందరికి పెట్టుబడికి రెండు రెట్లు ఆదాయం వస్తున్నది. తక్కువ పెట్టుబడి, టెక్నాలజీ వినియోగం, నిఫుణుల సలహా తీసుకున్న ఆక్వా రైతులు లాభపడుతున్నారు. అలాంటి రైతుల్లో ముందువరుసలో ఉన్నారు ఎం.శ్రీనివాస్‌. రొయ్యల సాగులో టెక్నాలజీని వినియోగించుకుని మంచి దిగుబడి సాధిస్తున్నారాయన. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామంలో ఉన్న ఆయన చేపల చెరువు ఇప్పుడు రొయ్యలతో కళకళలాడుతున్నది. తాజా పంటలో 70 రోజులకు 80 కౌంట్‌కు వనమి రొయ్య ఎదిగింది. 5 ఎకరాల విస్తీర్ణంలో 6.50 లక్షల రొయ్యపిల్లలను వేసి, కేవలం 3టన్నుల ప్రొబయోటిక్‌ ఆహారం వేసి, మంచి దిగుబడికి రంగం సిద్ధం చేశారు ఆ రైతు.

ఎకరం నుంచి ఐదెకరాలకు

ఏడాదిన్నర క్రిందట కేవలం ఎకరం చెరువుతో రొయ్యల సాగు ప్రారంభించారు శ్రీనివాస్‌. మిగిలిన వారి మాదిరిగానే చుట్టుపక్కల రైతుల సలహాలు తీసుకుని సాగు మొదటు పెట్టారు. రొయ్యపిల్ల వేయటం నుంచి పట్టుబడి వరకూ భారీ పెట్టుబడులు పెట్టాడు. ఎకరంలో 1.50 లక్షల సీడు వేసారు. 90రోజులలో 3టన్నుల మేత వినియోగించారు. నిజానికి ఇది ఎక్కువే ఆ తర్వాత ఇతనికి భీమవరానికి చెందిన ప్రముఖ టెక్నీషియన్‌ డాక్టర్‌ జల్లి వెంకటేష్‌ సలహాదారుడయ్యారు. ఆయన సహకారంతో ఎకరం చెరువులో 3టన్నుల ఉత్పత్తి సాధించి 50కౌంట్‌లో 8లక్షలు ఆదాయం సాధించగలిగాడు. 3లక్షలు మిగిలాయి. 2వ పంటలో 4 ఎకరాలకు విస్తీర్ణం పెరిగింది. ఈసారి ప్రారంభం నుంచి వెంకటేష్‌ సలహలు తీసుకున్నాడు. 3లక్షల సీడు మాత్రమే వేసాడు. సాగులో ప్రధానంగా నీటిలో సహజంగా తయారయ్యే జంతు, వృక్ష ప్లవకాలను వృద్ధి చేయటంలో విజయం సాధించారు.. ఈసారి 4ఎకరాలకు 5 టన్నుల మేత మాత్రమే వినియోగించారు శ్రీనివాస్‌. 90 రోజులలో 5 టన్నుల దిగుబడి సాధించారు. 30 కౌంట్‌ కావటంతో 26 లక్షల రూపాయల ఆదాయం పొందారు. రూపాయి పెట్టుబడికి రూపాయన్నర ఆదాయం పొందగలిగాడు.

నిపుణుల సలహాతో లాభాలు

రొయ్యలసాగులో వాతావరణ అనుకూలత కీలకం. ఎండ, చలి, వర్షం వాతావరణ సమతుల్యత కోసం వారంలో 2-3 సార్లు నీటి పరీక్షలు, నిఫుణుడు వెంకటేష్‌ సలహలతో జంతు, వృక్ష ప్లవకాలను వృద్ధి చేసుకున్నాను. అదే నన్ను లాభాల బాటలో నడిపిస్తున్నది.

రొయ్యకు ప్లవకాలే ప్రాణం 
ఆక్వా సాగులో రొయ్యలు, చేపల ఎదుగుదలలో వృక్ష, జంతు ప్లవకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. చెరువు నీటిలోనే ప్లవకాలను అభివృద్ధి చేస్తే అధిక దిగుబడులు వస్తున్నాయి. చేప పిల్లల పెంపకానికి చెరువులో నీటిని నింపిన తరువాత నీటిలో ప్లవకాలు ఎంత శాతం ఉన్నాయో ప్రయోగశాలలో పరీక్షించాలి. నీటిలో తగినన్ని ప్లవకాలు ఉంటే చేపపిల్లలు బాగా ఎదుగుతాయి. ప్లవకాలు తక్కువగా ఉన్న చెరువులో నీరు రంగు మారుతుంది. నీరు రంగు మారితే చేపల దిగుబడి తగ్గుతుంది. హానికరమైన నాచులు, వాటివల్ల విషవాయువులు ఏర్పడి చేపపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రోబయోటిక్స్‌ ఉపయోగించి, నీటిని సహజంగా ఉంచడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
– డాక్టర్‌ జల్లి వెంకట్‌, జలపుష్ప ఆక్వాల్యాబ్‌ నిపుణులు
Credits : Andhrajyothi

రబీలో ఆరుతడి పంటలు మేలు 

  • నీటి లభ్యతను బట్టే పంటలు సాగు
  • శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే దిగుబడుల శాతం పెరుగుతుంది
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది రబీలో ఆరుతడి పంటల సాగు శ్రేయస్కరమని, వీలైనంత వరకు వరిని సాగు చేయకపోవడం మేలంటున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ బి.గోపాల్‌రెడ్డి. నీటి తడుల లభ్యతను బట్టి రబీలో రైతులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. రబీలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ పంటలు వేసుకోవాలి? అధిక దిగుబడులకు పాటించాల్సిన పద్ధతులు తదితర విషయాలపై ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
 

ఆంధ్రప్రదేశ్‌లో ఏ నేలలు రబీలో అధిక దిగుబడులకు అనువుగా ఉంటాయి? 

రబీ సీజన్‌లో నేలల స్వభావం బట్టి మూడు రకాలుగా విభజించి రైతులు పంటలను సాగు చేసుకోవాలి. వర్షాధారంపై ఆధారపడిన నేలలు, నీటి పారుదల కింద ఆరుతడి పంటలు సాగుకు అనువుగా ఉన్న నేలలు, నీటి పారుదల, బోరు బావుల కింద వరిని సాగు చేసేందుకు అనువుగా ఉన్న నేలలను బట్టి రైతులు సాగుకు సన్నద్ధం కావాలి.
 

ఏ పంటల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది..? 

వర్షాధారం కింద నల్లరేగడి భూముల్లో తెల్లకుసుమ, ధనియాలు, వాము పంటలను సాగు చేసేందుకు అనుకూలం. నీటి పారుదల కింద ఆరుతడి పంటల్లో వేరుశనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, మినుములు, పెసర పంటల సాగుకు అనుకూలం. పప్పుశనగ, కుసుమ, ధనియాలు, వాము పంటలను నేలలో తేమ స్వభావాన్ని బట్టి నవంబర్‌ 15 వరకు విత్తుకోవచ్చు. కొర్రపంటను కూడా నీటి తడుల ఆధారంగా సాగు చేయవచ్చు. ఆవాలు కూడా మంచి దిగుబడులు వస్తాయి. కర్నూలు జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని బట్టి, నీటి లభ్యత ఆధారంగా 4-5 లక్షల హెక్టార్లల్లో పప్పు శనగను సాగు చేసే అవకాశం ఉంది.
 

రబీలో వరి సాగు అనుకూలంగా ఉంటుందా..? 

ప్రస్తుత పరిస్థితిని బట్టి వీలైనంత వరకు వరిని రైతులు సాగు చేయకపోవడమే మంచిది. నీటి పారుదల కింద వరిని సాగు చేసే రైతులు నీటి లభ్యతను బట్టి మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను(కర్నూలు సోనా) సాగు చేయరాదు.
 

రబీ పంటల సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

రబీలో పంటల సాగులో విత్తన శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకరాకు జింక్‌ 20 కేజీల చొప్పున చల్లుకోవాలి. సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వాడని రైతులు సల్ఫర్‌ ఎరువును 8 నుంచి 10 కేజీల ప్రకారం ఎకరాకు వేసుకోవాలి. ఆయా పంటల్లో సోకే తెగుళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. శనగ పైరు తొలి దశలో పచ్చరబ్బరు పురుగు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలి. పెసర, మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విత్తుకోవాలి. శిలీంద్రనాశినితో, కీటక నాశినితో(ఇమడాక్లోఫ్రిడ్‌) విత్తనశుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగులను సకాలంలో నివారించుకొని పల్లాకు తెగులు రాకుండా జాగ్రత్త పడాలి.
 

ఆరుతడి పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి? 

మూడు తడుల నీటి లభ్యత ఉంటే కందిని సాగు చేయాలి. విత్తన మోతాదు పెంచుకొని దగ్గర దగ్గరగా 3 నుంచి 4 అడుగుల దూరంలో విత్తుకోవాలి. సకాలంలో నీటి తడులను ఇవ్వాలి. నాలుగు తడుల నీటి లభ్యత ఉంటే మొక్కజొన్న సాగుకు ఎంతో అనుకూలం. మొక్కజొన్నలో మంచిపేరు ఉన్న హైబ్రీడ్‌ రకాలను ఎన్నుకోవాలి. పైరు నీటి ఎద్దడికి గురికాకుండా సకాలంలో నీటి తడులు ఇవ్వాలి. మూడు తడుల అవకాశం ఉంటే జొన్న పంటను రబీలో సాగు చేయవచ్చు. పైరు తొలి దశలో కాండం ఈగ ఆశించకుండా కార్పోఫిరాన్‌ గుళికలను వాడి నివారించుకోవాలి. రెండు తడులు ఇవ్వగలిగితే కొర్రపంటను కూడా సాగు చేయవచ్చు. రెండు తడుల నీటి లభ్యత ఉంటే ఆవాలు కూడా సాగు చేయవచ్చు. పప్పు శనగకు నీటి లభ్యత ఉంటే పంట 30-35 రోజుల మధ్య స్పీంకర్ల ద్వారా నీటిని అందిస్తే 15 నుంచి 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.
 

రబీలో పంటల సాగులో అనువైన రకాలు? 

పప్పు శనగలో ఎన్‌బీఈజీ-49, ఎన్‌బీఈజీ -47, ఎన్‌బీఈజీ-3, ఎన్‌బీఈజీ-119, జేజీ-11, జాకీ-9218, కేఏకే -2, విహార్‌ రకాలు అనుకూలం. కందిలో ఆశ, లక్ష్మి, అమరావతి(ఎల్‌ఆర్‌జీ-52), వేరుశనగలో కదిరి-9, కదిరి-6, హరితాంధ్ర, ధరణి రకాలు, మొక్కజొన్నలో బీఎంహెచ్‌ -177తో పాటు స్వల్ప, మద్యకారిక రకాల్లో పేరెన్నికగన్న కంపెనీల విత్తనాలు, కొర్రలో ఎస్‌ఐఏ-3085, సూర్యనంది, ఆవాలులో క్రాంతి, పూసాబోల్డ్‌, పూసా ధరణి, పూసా వైభవ్‌, వరి కోసిన తరువాత సంఘం రకం రైతులు సాగు చేసుకోవచ్చు.
 

రైతులు ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా..: 
నీటి లభ్యత ఉంటేనే వరి సాగు చేయాలి. లేదంటే వరి సాగు చేయవద్దు. ఆరుతడి పంటల వైపు రైతులందరూ దృష్టిసారించాలి. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.

– ఆంధ్రజ్యోతి, నంద్యాల
‘‘దుక్కుల కాలం మొదలైందంటే దానర్థం.. మానవ నాగరికతకు ఊపిరిలూదే కళను అన్నదాత మొదలుపెట్టాడనే!’’
-డేనియల్‌ వెబ్‌స్టర్‌ (అమెరికా రాజనీతిజ్ఞుడు)
Credits : AndhraJyothi