17 ఎకరాలు..107 పంటలు

 • సేంద్రియ సేద్యం…సాటి రైతులకు ఆదర్శం
మారం కరుణాకర్‌రెడ్డి తనుకున్న 17 ఎకరాల్లో కూరగాయలు, వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఆకుకూరలతో కలిపి 52 రకాల కూరగాయ పంటలు, 50 రకాల పండ్ల తోటలు, మూడు రకాల మొక్కజొన్న, సంవత్సరానికి రెండు పంటలు వచ్చే దేశవాళీ కంది, మిర్చి, పలు రకాల పూలను సాగు చేస్తున్నారు. మూడెకరాల్లో యాపిల్‌బేర్‌, రెండెకరాల్లో థాయ్‌ జామ, మూడెకరాల్లో సీతాఫలం, రెండెకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ఈ తోటల్లో అంగుళం స్థలం కూడా వృథాగా ఉంచకుండా… ఎక్కువ శాతం అంతర పంటలు పండిస్తున్నారు.
కందిలో అంతర పంటగా బేబీ కార్న్‌, దోస, థాయ్‌జామలో అంతరపంటగా మినుము సాగు చేస్తున్నారు. ఆధునిక పద్ధతిలో సేం ద్రియ వ్యవసాయం చేసి లాభాలను గడిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కరుణాకర్‌రెడ్డి. దేశీ పంటలతో పాటు విదేశీ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. యాపిల్‌బేర్‌, థాయ్‌ జామ, కివీ ఫ్రూట్‌, థాయ్‌మ్యాంగో, స్టార్‌ ఫ్రూట్‌, ఫ్యాషన్‌ ఫ్రూట్‌, ఖర్జూర, డ్రాగన్‌ లాంటి విదేశీ పంటలను పండిస్తూ మార్కెట్‌కి పంపుతున్నారు. ఈ పంటలన్నిటికీ అవసరమైన ఎరువుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలోనే సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
రసాయనాలు వద్దు..
మన రైతు.. మన ఉత్పత్తి… మన ఆహారం.. రసాయనం వద్దు… ప్రకృతి సేద్యమే ముద్దు అంటూ విన్నూత్నరీతిలో కూరగాయలు, పండ్లు సాగుచేస్తున్న కరుణాకర్‌రెడ్డి.. ‘సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతోనే ఆరోగ్యం.. ఆ పంటలనే నేరుగా మీ ఇంటికి చేరుస్తాం’ అంటున్నారాయన. సేంద్రియ పద్ధతిలో సాగు మెళకువలు చెప్తూ అన్నదాత స్వావలంబన దిశగా సూచనలిచ్చేందుకు పనిచేస్తున్న ‘ఎస్టా’ ఎన్జీవో అనే సంస్థలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థ రసాయనాలు లేకుండా, సేంద్రియ ఎరువులనే వాడేలా ఆరు సంవత్సరాల ప్రణాళికతో ముందడుగు వేస్తున్నది.
ఆరు సంవత్సరాల అనంతరం రైతులు పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులను వాడేందుకు వీలుగా అవగాహన కల్పిస్తున్నామంటున్నారు కరణాకర్‌రెడ్డి. సేంద్రియ సేద్యం చే పట్టే రైతులకు ఎస్టా కొన్ని సహజ ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తుంది. వినియోగదారుల అవసరాల మేరకు సొసైటీలోని రైతులు పంటలు ఉత్పత్తి చేయటం, ఎలాంటి రసాయనాలు లేని, కలుషితం కాని ప్రకృతి సహజపద్ధతిలో రైతులు పండించిన స్వచ్ఛమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించటం ఎస్టా సంస్థ లక్ష్యాలని రఘునాథరెడ్డి చెప్పారు. వినియోగదారుల అవసరాలు, అభిరుచుల మేరకు పంటలు పండించటం. మార్కెట్‌ ధరకే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుల ఇంటికి నేరుగా రోజూ అందించే దిశగా ఎస్టా సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆ రైతు చెప్పారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, రఘునాథపాలెం
ఆ క్షేత్రమే ఓ పుస్తకం
దేశ విదేశీ పంటలను వైవిధ్య పద్ధతుల్లో పండిస్తున్న కరుణాకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం రైతులు, వ్యవసాయ, ఇతర విద్యార్థులకు ఓ పుస్తకంలా మారింది. ఇప్పటికే పలు వ్యవసాయ కళాశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయశాఖ అధికారులు ఆయన పొలాన్ని సందర్శించారు. ఇక్కడి సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల రైతులు తరలొస్తుంటారు.
Credits : Andhrajyothi

నూనెలతో సేద్యం.. దిగుబడి పుష్కలం

ఎరువులు, పురుగు మందులు లేకుండా వరి, పత్తి పంటలను పండించలేమా? అని ఆలోచించారు కృష్ణా జిల్లా రైతులు. సాహసంతో వరి, పత్తి నూనెలతో సేద్యం ప్రారంభించారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. భూమికి కావాల్సిన అన్ని పోషకాలు ఆయిల్స్‌లో లభించడంతో బంగారాన్ని పండిస్తున్న ఆ రైతుల్ని కలుద్దాం రండి.
రేయింబవళ్లు శ్రమించినా సేద్యం లాభసాటి కాకపోవడంతో రైతన్నలు నిరంతరం భిన్న మార్గాలను అనుసరిస్తూ వుంటారు.
కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు రైస్‌ ఆయిల్‌తో పాటు కాటన్‌, గానుగ, వేప, కొబ్బరి, శనగనూనెలతో వరి, పత్తి పంటలను పండిస్తున్నారు. వీరు పండించే ధాన్యానికి మార్కెట్‌లో మంచి గిరాకీ లభిస్తున్నది. ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన ధాన్యం బస్తా రూ.1200 నుంచి రూ.1300లు ఉంటే. వీరు పండించే ధాన్యం బస్తాను రూ.1800 లకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాక రైస్‌ ఆయిల్‌, ఇతర ఆయిల్స్‌తో పండించే ధాన్యం మధు మేహ రోగులకు దివ్యౌషధంలా పని చేస్తున్నది. పత్తి పంట అయితే చెట్టు చివరి వరకు నాణ్యమైన కాయలు కాస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను మంచి దిగుబడి వస్తున్నది.
ఈ తరహా సాగును మొదట కొందరు రైతులు చిన్నచూపు చూశారు. కానీ ఆయిల్స్‌తో సాగు చేసిన వరి, పత్తి పంటలను నేరుగా పొలంలోకి వెళ్లి పరిశీలించిన రైతులు మాత్రం రానున్న రబీలో, లేదా ఖరీఫ్ లో మేమూ ఆయిల్స్‌ వాడి పంటలు పండిస్తామంటున్నారు.
పత్తిలో నూనెల వాడకం ఇలా..
పత్తి పంటలో అయితే మొత్తం 65 కిలోల ఆయిల్‌ పడుతుంది. ఇక్కడ మాత్రం కాటన్‌ ఆయిల్‌ను అధికంగా వాడుకోవాలి. కాటన్‌ ఆయిల్‌తో పాటు, విప్ప నూనె, గానుగ, వేప నూనెలను వాడుకోవాలి. 70 శాతం కాటన్‌ ఆయిల్‌, 30 శాతం ఇతర ఆయిల్స్‌ వాడుకోవాలి. భూమిలో 10 కిలోల చొప్పున వేసుకోవాలి. మిగిలిన 55 కిలోలు వివిధ దశలలో నేలమీద పిచికారీ చేసుకోవాలి.
ఇలా భూమిలో పోసిన ఆయిల్స్‌ మూడేళ్ల వరకు ఉపయోగపడుతాయి. ఈ సాగులో రైతులకు ఎకరానికి కేవలం రూ.6 వేలు మాత్రమే ఖర్చవుతోంది. అదే ఎరువులు, పురుగు మందులు వాడితే ఎకరానికి రూ.15 వేల నుంచి 18 వేల వరకు ఖర్చవుతోంది. ఆయిల్‌ వాడిన పత్తి పొలంలో సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి.
వరిలో ఎలా వాడాలి?
మాగాణిలో దమ్ము సమయంలో సుమారు 80 శాతం ముడి జింకు వాడాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. జింకు లోప నివారణకు జింకు తప్పని సరిగా వేయాలి. అయితే రైస్‌ ఆయిల్‌ వాడే పొలాలకు ముడి జింకు వేయాల్సిన అవసరం లేదు. 10 లీటర్ల రైస్‌ ఆయిల్‌, విప్ప నూనె 3.50 కిలోలు, కాటన్‌ నూనె 3.50 కిలోలు వాడుకోవాలి. అంటే వరిలో 70 శాతం రైస్‌ ఆయిల్‌, 30 శాతం ఇతర ఆయిల్స్‌ వాడుకోవాలి. వరి పూత దశలో ఉన్నప్పుడు 25 శాతం కొబ్బరి నూనె, గింజలు గట్టి పండేందుకు 30 శాతం సోయా నూనెను వాడుకుంటే సరిపోతుంది.
వరి పండించేందుకు 55 కిలోల నూనెలు సరిపోతాయి. కిలో ఆయిల్‌ ధర కేవలం రూ.80లు మాత్రమే అంటే ఎకరా వరి పండించేందుకు రైతుకు అయ్యే ఖర్చు కేవలం రూ.4 వేల నుంచి 5 వేలు మాత్రమే. అదే ఇతర పద్ధతుల్లో ఎకరా పంటకు రూ.12 వేల నుంచి 15 వేలకు వరకు ఖర్చవుతుంది. నత్రజని ఎరువులు విపరీతంగా వాడటం వల్ల ఈ ఏడాది వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైస్‌ ఆయిల్‌ వాడిన వరి పొలంలో చీడపీడలు లేవు. తెగుళ్లు లేకపోవడం విశేషం.
యూట్యూబ్‌లో చూశాను
యూటూబ్‌లో రైస్‌ ఆయిల్‌ గురించిన వీడియో చూశాను. రెండేళ్ల నుంచి రైస్‌ ఆయిల్‌ వాడి మాగాణి పండిస్తున్నాను. ఈ ఏడాది నా పంటను చూసిన వారు మాకు పది బస్తాల ధాన్యం ఉంచు అంటున్నారు.
– బొర్రా సాంబశివరావు, కవులూరు
ఆరేళ్లుగా నూనెలే ఎరువులు
ఆరేళ్లుగా ఈ తరహా సాగు చేస్తున్నా. 1229 అనే రకం వరి సాగు చేసి 60 బస్తాల వరకు దిగుబడి సాధించాను. పత్తిలో 25 క్వింటాళ్ల దిగుబడి సాధించాను. ఇతర దేశాల్లో ఈ విధానంలో సాగు చేసిన పంటలను చూసి నేను ఇక్కడ ప్రారంభించాను.
– కోగంటి ప్రసాద్‌, తాడేపల్లి
Credits : Andhrajyothi

వరిమాగాణిలో మినుము, పెసర

ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. నవంబర్‌ 19 వరకు ఈ సూచనలు వర్తిస్తాయి.
 • నవంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు మొదటి పక్షం వరకు వరిమాగాణులలో విత్తుకొనేమినుము రకాలు – ఎల్‌.బి.జి. 645, ఎల్‌.బి.జి. 648, ఎల్‌.బి.జి. 685, ఎల్‌.బి.జి. 402, ఎల్‌.బి.జి. 709, ఎల్‌.బి.జి. 752, ఎల్‌.బి.జి. 787.
 • డిసెంబరు రెండో పక్షం నుంచి చివరి వరకు వరిమాగాణులలో విత్తుకొనేమినుము రకాలు – మధ్యకాలిక రకాలైన (85 రోజులకు పంటకు వచ్చే) ఎల్‌.బి.జి. 645, ఎల్‌.బి.జి. 685, ఎల్‌.బి.జి. 709, ఎల్‌.బి.జి. 22, ఎల్‌.బి.జి. 752, ఎల్‌.బి.జి. 787.
 • నవంబరు రెండవ పక్షం నుండి జనవరి వరకు విత్తుకొనే పెసర రకాలు – ఎల్‌.బి.జి. 460, టి.యం. 96-2, ఎల్‌.బి.జి. 407, ఎల్‌.బి.జి. 410, ఐ.పి.ఎం 2-14.
ప్రొద్దుతిరుగుడు
 • ఈ పంటను రబీలో వర్షాధారం క్రింద నవంబరులో విత్తుకోవచ్చు. అదే నీటిపారుదల క్రింద అయితే నవంబరు రెండవ పక్షం నుండి జనవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
 • నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చెల్కా, రేగడి, ఒండ్రు నేలలు… నేల ఉదజని సూచిక 6.5 నుండి 8.0 ఉన్న నేలలు ఈ పంట సాగుకు చాలా అనువైనవి. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో ఈ పంటను సాగు చేయరాదు.
 • ఎంపిక చేసుకున్న నేలను గుంటకతో రెండుసార్లు కలియదున్ని తరువాత చదును చేసి ఆ తర్వాత బోదెలు వేసి విత్తనం వేసుకోవచ్చు. ఈ విధంగా బోదెలు వేయడం వలన విత్తనాన్ని నాటేందుకు 30 – 35 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో ఎరువులను పైపాటుగా వేయడానికి వీలుగా ఉంటుంది.
 • ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి రెండు నుండి మూడు గ్రాముల థైరమ్‌ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయాలి.
 • నెక్రోసిస్‌ తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి ఐదు గ్రాములు ఇమిడాక్లోప్రిడ్‌ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి.
 • ఎకరానికి మూడు టన్నుల పశువుల ఎరువును విత్తే రెండు, మూడు వారాల ముందు వేయాలి.
 • విత్తేటప్పుడు ఎకరానికి 25 కిలోల యూరియా, 220 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి.
 • గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో (ఎకరానికి 50 కిలోలు) వేయాలి.
 • సరైన మొక్కల సాంద్రత కొరకు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 30 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి.
 • విత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.
రైతులు మరిన్ని సలహాల కోసం కాల్‌ చేయాల్సిన నెంబరు.. 18004250430
Credits : Andhrajyothi

సేద్యానికి కొత్త ఊపు

 • సాగుకు సాంకేతిక సహకారం
 • ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం
 • విత్తనాల నాణ్యతకే మెగా సీడ్‌ పార్కు
 • భూసార పరీక్షకు కొత్త టెక్నాలజీ
 • ఆంధ్రజ్యోతితో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి
 
ఎరువులు, కిమ్రిసంహారకాలను మితిమీరి వాడటంతో సేద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. మార్కెటింగ్‌పై అవగాహన లేక గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. అందుకే వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్య రంగంగా ఎంచుకుని, రైతులకు నికరాదాయం పెంచాలనిముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే స్థిరమైన ఆదాయాన్ని పొందే వీలుంటుందన్నారు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి. 
రాష్ట్రంలో వ్యవసాయ రంగ పురోగతికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు?
వాతావరణ సమాచారాన్ని బట్టి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి, రైతులకు సాయిల్‌ హెల్త్‌కార్డులు ఇస్తున్నాం. పోషక లోపాల మేరకు ఎరువులు వాడాలని చెబుతున్నాం. భూమిలో సూక్ష్మపోషక లోపాలు ఉన్న పొలాల రైతులకు నూరుశాతం రాయితీపై జింక్‌, జిప్సం, బోరాన్‌ అందిస్తున్నాం. క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బందికి ట్యాబులు ఇచ్చి, ఆధునిక పరిజ్ఞానంతో ఈ-క్రాప్‌ బుకింగ్‌ పేరుతో పంటను నమోదు చేస్తు న్నాం. పంట నష్టపోయినా, ప్రభుత్వ సంస్థలకు సరుకు అమ్ముకోవాలన్నా క్రాప్‌ బుకింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఖరీఫ్ లో 66,108 మెట్రిక్‌ టన్నులు, రబీకి 20,633 మెట్రిక్‌ టన్నుల సూక్ష్మపోషకాలు సరఫరా చేశాం. ఖరీఫ్ లో సాధారణంగా 40.47 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, 36.34 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 36.28 లక్షల హెక్టార్ల పంటను ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేశాం.
మెగా సీడ్‌ పార్క్‌ లక్ష్యం?
కర్నూలు జిల్లా తంగడంచలో 623.40 ఎకరాల్లో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కుఏర్పాటు చేస్తున్నాం. దీనికి అమెరికాలోని ఐయోవా వర్సిటీ ఎంవోయూపై సాంకేతిక సహకారం అందిస్తోంది. ల్యాబ్‌, ప్రొసెసింగ్‌ యూనిట్‌, పరిపాలన విభాగాన్ని నిర్మిస్తాం. విత్తన పరిశోధనల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. సీజన్‌కు ముందే నకిలీ విత్తనాలపై నిఘాపెట్టి, అధికారులు దాడులు చేస్తున్నారు. నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్డు పెడతాం. తెగుళ్ల నివారణలో ప్లాంటెక్స్‌ యాప్‌ రైతుకు బాగా ఉపయోగపడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షల్లో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమెరికాలోని బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకుంటున్నాం.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సేద్యంలో మన రాష్ట్రం పరిస్థితి?
ఈ-క్రాప్‌ బుకింగ్‌, సాయిల్‌ హెల్త్‌కార్డులు, సూక్ష్మపోషకాల పంపిణీలో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ముం దుంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించేలా చేస్తూ రైతుకు నికరాదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఈనెల 15 నుంచి జరిగే వ్యవసాయ సదస్సులో రైతుకు సాంకేతిక సహకారం అందించే అంశాలపై చర్చ జరగనున్నది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్‌ పుడ్‌ ఇండియా సదస్సులో ఏపీకి బ్రాండ్‌ ఇమేజీ తెచ్చాం.
అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఎలా ఆదుకుంటున్నారు?
రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తున్నాం. 2016లో కొన్ని జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.1900 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.450 కోట్లు ఖర్చు చేశాం. ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పథకంలో రూ.1,127 కోట్లతో రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలు అందిస్తున్నాం. గత ఏడాది మిర్చి, పసుపు, కంది, మినుములకు ధర లేకపోతే ఎంఐఎస్‌ కింద రూ.170 కోట్లతో రైతులకు సాయం చేశాం. పత్తి రైతును ఆదుకునేందుకు దశలవారీగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. కనీస మద్దతు ధరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొన్ని మార్కెట్‌ యార్డుల్లో ఈ-నామ్‌ అమలు చేస్తున్నాం.
ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పాలేకర్‌ విధానాలతో ప్రకృతి సేద్యం చేయడం ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించవచ్చని, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలిపేలా ప్రయత్నిస్తున్నాం. జీరో బడ్జెట్‌ ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. ప్రకృతి వ్యవసాయ నిర్వహణకు రూ.10 వేల కోట్లతో అజీంప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ వంటి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం.
రైతులు పంట మార్పిడి పాటిస్తే, నేల ఆరోగ్యం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. అందుకే ఉద్యాన రైతులకు అనేక రాయితీలు ఇస్తున్నాం. ఏపీఎంఐపీ ద్వారా సేద్య పరికరాలు ఇస్తున్నాం. ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు తీసుకువెళ్లాలని సీఎం భావిస్తున్నారు. అగ్రి ప్రొసెసింగ్‌ రంగంలో పెట్టుబడుల కోసం ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జపాన్‌, శ్రీలంక వంటి దేశాలతో చర్చించాం.
Credits : Andhrajyothi

తెలుగు రైతుల సరికొత్త ఇ-నేస్తమిది!

రైతుకు… సందేహం వస్తే ఎవరు తీరుస్తారు? సమస్య ఎదురైతే ఎవరు పరిష్కరిస్తారు? ఆ బాధ్యత ‘రైతునేస్తం’ మొబైల్‌యాప్‌ తీసుకుంటోంది. ఒక్క క్లిక్కుతో తికమక తొలగిపోతుంది, ఆత్మవిశ్వాసం పొంగిపొర్లుతుంది. తెలుగు రైతుల సరికొత్త ఇ-నేస్తమిది!
   ఒకప్పుడు జేబులో డబ్బు తీసుకెళ్లి, సంచుల్లో కూరగాయలు తెచ్చేవాళ్లు. మరి ఇప్పుడో సంచుల్లో తీసుకెళ్లినా జేబు నిండా రావట్లేదని వ్యంగ్యంగా అంటుంటారు చాలామంది. ఆ కాసిన్ని కూరగాయలైనా ఆరోగ్యకరమైనవా? అంటే, అదీ లేదు. వందలకు వందలు పోసి.. రసాయనాల్లో ముంచి తేల్చిన ఆహారపంటలను కొంటున్నాం. పోనీ, వీటి వల్ల రైతులకు భారీగా లాభాలు వస్తున్నాయా అంటే, అదీ లేదు. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, పెట్టుబడి భారమైపోయింది. వచ్చే కొద్దిపాటి ఆదాయం వడ్డీలకే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో… రైతు తల ఎత్తుకు బతకాలంటే, సేంద్రియ వ్యవసాయమే మార్గం. అందుకే, రసాయనాల జాడలేని సేద్యం మీద రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘రైతు నేస్తం’ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది ‘రైతునేస్తం ఫౌండేషన్‌’. ‘మాది రైతు కుటుంబం. నేను బి.కామ్‌ చదివి గ్రాఫిక్‌ డిజైనర్‌గా జర్నీ మొదలుపెట్టి, పుస్తకాల మీద ప్రేమతో స్వంతంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ను స్థాపించాను. రసాయన ఎరువులు దొరకక, దొరికినా వాటిని ఎలా వాడాలో ఎంత మోతాదులో వాడాలో తెలియక, గ్రామీణులు పడే ఇబ్బందులను చూస్తూ పెరిగాన్నేను. రైతులకు గోరంత సాయం చేసినా, కొండంత సంతృప్తి లభిస్తుందనే ఉద్దేశంతో పన్నెండేళ్ల క్రితమే ‘రైతునేస్తం’ పేరుతో పత్రిక మొదలుపెట్టాను. కాలంతో పాటు మనమూ మారాలి. అలా మారకపోతే వెనుకబడిపోతాం. ఈ హెచ్చరిక రైతుకూ వర్తిస్తుంది. అతడికి టెక్నాలజీలోని సౌలభ్యాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో మొబైల్‌ యాప్‌ను అందిస్తున్నాను’ అంటారు ఫౌండేషన్‌ చైర్మన్‌, ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు.
ఒకే ఒక్క క్లిక్‌తో…
అందులోనూ, మొదటిసారి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వారికి ‘రైతు నేస్తం’ యాప్‌లో… ఒకే ఒక్క క్లిక్‌తో సమాధానాలు దొరికిపోతాయి. సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? సేంద్రియ పద్ధతిలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే పంటలేవి? సేంద్రియ ఎరువులను తయారుచేసుకునే పద్ధతి ఏంటి? పంటలను బట్టి, ఏ శాస్త్రవేత్తను సంప్రదించాలి? వారి ఫోన్‌ నంబర్లు ఏమిటి?…. ఇలా సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది. ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తోంది. ఈ విషయం చాలామందికి తెలీదు. అందుకే యాప్‌ ద్వారా ఆర్గానిక్‌ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఎలాగో వివరించారు. పత్రాల జారీ స్టేటస్‌ కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. రైతుల్లో ఎక్కువ మంది పెద్దగా చదువుకోనివారే. వారికి కూడా యాప్‌ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో కూడా సమాచారం చేర్చారు.
పసిడి మార్గం పాడి…
ప్రతి రైతూ రెండు, మూడు పశువులను పెంచుకుంటే… పాడి ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పంటకు కావాల్సిన సేంద్రియ ఎరువులనూ సేకరించవచ్చు. గోమూత్రం నుంచీ గో వ్యర్థాల నుంచీ సేంద్రియ ఎరువుల (బీజామృతం, జీవామృతం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం…) తయారీ విధానం ఇక్కడ ఉంటుంది. పశుపోషణకు సంబంధించిన సందేహాలకు కూడా ఈ యాప్‌లో సమాధానాలు లభిస్తాయి. సుభాష్‌ పాలేకర్‌, కొసరాజు చంద్రశేఖరరావు వంటి శాస్త్రవేత్తల నుంచి ఫోన్‌ ద్వారానో, మెసేజీల రూపంలోనో సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు.
మార్కెటింగ్‌ మార్గం…
పంటను పండించడం ఎంత కష్టమో, దాన్ని లాభసాటి ధరకు అమ్ముకోవడం అంత కంటే పదిరెట్లు కష్టం. అయితే సేంద్రియ పంటలకు, రసాయన పంటలతో పోలిస్తే మంచి ధర లభిస్తుంది. ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ఈ యాప్‌లో ఓ లింకు ఏర్పాటుచేశారు. దీని ద్వారా రైతులు నేరుగా వినియోగదారుకు విక్రయించుకోవచ్చు. అలాగే, ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులనూ కొనుకోవచ్చు. ఒకటేమిటి వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారమూ ‘రైతునేస్తం’ యాప్‌లో ఉంటుంది.
     గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తేలిగ్గా డౌన్‌లోడ్‌ చేసుకోడానికి వీలుగా… కేవలం 5ఎమ్‌బీ మెమరీ సామర్థ్యంతోనే రూపొందించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే మీ పేరు, ఊరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ మొదలైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే మీరు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ(వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన వెంటనే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ క్షణం నుంచీ ఓ వ్యవసాయ శాస్త్రవేత్త, ఓ మార్కెటింగ్‌ నిపుణుడు.. మీ జేబులో ఉన్నట్టే!
Credits : Andhrajyothi

విలక్షణ సేద్యంతో విజయపథం

 • 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం
 • రంగారెడ్డి జిల్లా రైతు ప్రస్థానం
రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, టమాట ఇలా ఏదో ఒక పంటను సాగు చేస్తారు. లేదంటే మామిడి, జామ, ద్రాక్ష, కొబ్బరి, బత్తాయి వంటి తోటలు పెంచడం పరిపాటి. కానీ ఓ రైతు మాత్రం తన పొలంలో వేల రకాల మొక్కల్ని పెంచుతూ, వైవిధ్యమైన వనాన్ని సృష్టించారు. ఆ పంటల గురించి తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామానికి వెళ్లాల్సిందే.
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, వెల్వెట్‌ యాపిల్‌, వాటర్‌ యాపిల్‌, జబోటిక, మిరాకిల్‌ఫ్రూట్‌, జామ, మామిడి, సపోటా వంటి 50 రకాలకు పైగా దేశవాళి పండ్ల రకాలూ, అ శ్వగంధ, శంఖుపుష్టి, అడ్డసర, జీవకాంచన.. ఇలా 100కు పైగా ఆయుర్వేద మొక్కలూ, దాల్చినచెక్క, లవంగం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలూ, శ్రీగంధం, ఎర్రచందనం, నేరేడు వృక్షాలు, గులాబి, సంపంగి, పారిజాతం తదితర పుష్పా లూ.. ఇలా 280 జాతులకు చెందిన 9 వేల మొక్కలకు నిలయం ఆ వ్యవసాయ క్షేత్రం. ఆ క్షేత్రం సారథి హైదరాబాద్‌కు చెందిన సుఖవాసి హరిబాబు. తనకున్న 10 ఎకరాల్లో వున్న ఇక్క బోరు సాయంతో వీటన్నింటినీ సాగు చేస్తున్నారాయన. జీవవైవిధ్యానికి తన క్షేత్రాన్ని చిరునామాగా తీర్చిదిద్దుతున్నారాయన.
నంది అవార్డుల నుంచి వ్యవసాయం దాకా…
అరుదైన వ్యవసాయాన్ని మక్కువతో చేస్తున్న హరిబాబు గతంలో రియల్‌ ఎస్టేట్‌, టెలివిజన్‌ రంగాల్లో పని చేశారు. రైతు కుటుంబాల జీవిత గాథలు ఇతివృత్తంగా తీసుకొని దర్శక నిర్మాతగా జీవనతీరాలు, జీవనసంధ్య, సీరియళ్లను తీశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియళ్లకి 6 నంది అవార్డులను అం దుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రా మంలో పుట్టి పెరిగిన ఆయన డిగ్రీ వరకు చదువుకొని 1979లో హైదరాబాద్‌కు వచ్చారు. 1984లో గచ్చిబౌలిలో కొంత పొలం కొని ఉద్యాన పంటలు పండించారు. 2013లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల పొలం కొన్నారు. ఆ నల్లరేగడి భూమిలో వైవిధ్యమైన మొక్కలు పెరగడానికి వీలుగా పొలంలో ఒక అడుగు ఎత్తున ఎర్ర మట్టిని వేయించారు.
దీంతో ఆ నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పొలం అంతటా ప్రతి 10 అడుగుల దూరంలో మూడు అడుగుల పొడువు, వెడల్పు, లోతు ఉండేలా గోతులు తవ్వించి మామిడి, సపోటా, తీపిచింత వంటి వృక్ష జాతి మొక్కల్ని నాటారు. మొక్కలు బలంగా పెరిగేందుకు వీలుగా ఎర్రమట్టి, ఆవుపేడ, ఆముదపుపిండి కలిపిన కంపోస్టు ఎరువును ఆ గోతుల్లో వేశారు. మొక్కల మధ్యలో వచ్చే ఖాళీల్లో నీడ అవసరమై, ఎత్తుగా పెరగని ఫల, ఆయుర్వేద, సుగంధద్రవ్య మొక్కల్ని నాటారు. చైనా, వియాత్నాం, జమైకో, బ్రెజిల్‌, మెక్సికో తదితర దేశాలకు చెందిన 40 రకాల వృక్ష జా తుల్ని శృంగేరి, బెంగళూరు, మంగళూరు, కాసర్‌గట్‌, కడియం నర్సరీల నుంచి తెప్పించారు. వాటితో పాటు ఆ క్షేత్రంలో వాజ్‌పాయి పండ్లు, అబ్దుల్‌కలాం పుష్పాలు. చరకుడు, శుశ్రూశుడి పేర్లతో ఆయర్వేద మొక్కల విభాగాలు ఏర్పాటు చేశారు.
అంతా సేంద్రియమే
తన పొలంలో పండించే పంటలకు సేంద్రి య ఎరువులనే ఉపయోగిస్తు న్నారు హరిబాబు. సుభా్‌షపాలేకర్‌ స్ఫూర్తితో ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి వాడుతున్నారు. అలాగే పొన్నుస్వామి నూనెల విధానాన్ని పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో వేప, ఆముదం, కానుగ, పత్తితవుడు, విప్ప, చేపకుసుమ వంటి నూనెలతో మిశ్రమం తయారు చేసి ఆ ద్రవణాన్ని నీటిలో కలిపి మొక్కల పైన పిచికారి చేస్తున్నారు. వీటి కారణంగా గత రెండు సంవత్సరాల్లో తోటలో చీడ పీడల సమస్య తలెత్తలేదని తోటలో పండే కాయల నుంచి నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారాయన. తోట చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ లోపల వైపు వాక్కాయ మొక్కల్ని నాటారు. ఇవి వేడి గాలుల్ని అడ్డుకుంటున్నాయి. సాగులో మెళకువలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు హరిబాబు. అక్కడ అనుసరిస్తున్న నీటి పొదుపు విధానాలను పాటిస్తున్నారాయన.
-వేముల కృష్ణ, మహేశ్వరం
ఒకే పంటపై ఆధారపడే విధానానికి రైతులు స్వస్తి చెప్పాలి. కాస్త పొలం వు న్నా అందులో రెండు రకాల మొక్కలు సాగు చేయాలి. దాంతో రైతుల ఆదాయం పెరుగుతుంది.
– హరిబాబు, 9441280042
Credits : Andhrajyothi

స్మార్ట్‌ సేద్యం..రైతుకు లాభం

దేశంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి జరిగినా వ్యవసాయం రంగం మాత్రం అభిలషణీయమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. యువత వ్యవసాయానికి దూరం కావడానికి ఇదే ప్రధాన కారణం. సేద్యానికి సంబంధించిన అన్ని రంగాలను సమన్వయం చేయాలి. చిన్నరైతుల ఆదాయం పెంచే దిశగా కృషి జరగాలి. దాంతో పాటు రైతులు స్మార్ట్‌ సేద్యం చేసినప్పుడే దేశం పురోగమిస్తుందంటున్నారు హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, యాజమాన్య సంస్థ (మేనేజ్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వి. ఉషారాణి.
వ్యవసాయానికి దూరం అవుతున్న రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాలంటే ఏం చేయాలి?
వ్యవసాయం బతకాలంటే రైతుల ఆదాయం పెరగాలి. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం కాదు. ఏ పంటను ఏ కాలంలో, ఎంత తక్కువ ఖర్చులో పండించాలనే ప్రణాళిక వుండాలి. పండిన పంటకు అధిక ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలి. వ్యవసాయం పనులు ఏడాది అంతా వుండవు కాబట్టి మిగిలిన రోజుల్లో చిన్నపాటి వ్యవసాయ ఆధారిత వాణిజ్యంపై దృష్టి సారించాలి. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. యువత కూడా క్రమంగా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తుంది. ఆదాయం పెరగడంతో పట్టణాలకు వలస తగ్గి పల్లెలు మళ్లీ కళకళలాడతాయి.
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ‘మేనేజ్‌’ ఎలాంటి చర్యలు చేపడుతున్నది?
వ్యవసాయ రంగ సమగ్ర వికాసం మేనేజ్‌ లక్ష్యం. రైతుల సంక్షేమం కోసం కృషి చేసే నిపుణులకు శిక్షణ ఇవ్వడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా రైతుల్ని బలోపేతం చేస్తున్నాం. 20 ఏళ్లుగా అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు నిర్వహిస్తూ దేశానికి నిపుణులైన అగ్రి మేనేజర్లను అందిస్తున్నాం. వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గ్రామీణ యువతకు అగ్రి క్లినిక్స్‌ పేరిట 13 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55 వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చాం. వారిలో 20 వేల మందికి పైగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయ ఆధారిత రంగ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. గిడ్డంగుల నిర్వహణపై యువతకు త్వరలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సప్లయ్‌ ఛైన్‌ మేనేజ్‌మెంట్‌పై సర్టిఫికెట్‌ కోర్సు తలపెట్టాం. రైతులు ఏ పంటను ఎప్పుడు పండించాలనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా వున్న వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వద్ద వున్న సమాచారాన్ని క్రోడీకరించి నాలెడ్జ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్ల ద్వారా రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి సారించేలా పనిచేస్తున్నాం.
రైతులు ఏ వ్యవసాయ అనుబంధ వాణిజ్యం చేయాలంటారు?
ఏడాదంతా పొలం పనులు వుండవు. కొన్నాళ్లు పనిచేసి, మిగిలిన రోజులు ఖాళీగా వుండటం వల్ల రైతులకు ఆదాయ భద్రత లేకుండా పోతున్నది. అందుకే రైతులు వ్యవసాయ అనుబంధ వాణిజ్యంపై దృష్టి పెట్టాలి. తేనె, కొబ్బరినూనె తయారీ, చిరుధాన్యాలతో ఫ్లేక్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించడం, పచ్చళ్లు, ప్యాకింగ్‌ వంటి వందలాది వ్యవసాయ అనుబంధ పనులపై రైతులు దృష్టి సారించాలి. వీటి ద్వారా నామమాత్ర పెట్టుబడితో రైతులు అదనపు ఆదాయం పొందుతారు. ఎగుమతులు చేసేందుకు వీలుగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు తిరుగే వుండదు.
వ్యవసాయరంగ విస్తరణ విషయంలో మిగిలిన దేశాల అనుభవాల గురించి చెబుతారా?
అభివృద్ధి చెందిన దేశాల్లో రైతు డిమాండ్‌ ఆధారంగా పంటలు పండిస్తాడు. రైతు పండించే పంటను మార్కెట్‌ ముందే సిద్ధంగా వుంటుంది. మన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఈ ఏడాది ఏ పంట పండిస్తే లాభదాయకమో రైతుకు తెలియదు. పండించిన పంటకు ఎంత ధర వస్తుందో అసలే తెలియదు. మంచి ధర రానప్పుడు సరుకును గిడ్డంగుల్లో నిల్వ చేద్దామన్నా అవకాశం వుండదు.
దేశంలో వ్యవసాయానికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ అనుసంధానం చేసినప్పుడే రైతుకు లబ్ధి చేకూరుతుంది. పండించిన పంట రైతు నుంచి కొనుగోలుదారుకు చేరే వరకు పటిష్ఠమైన వ్యవస్థ వుండాలి. అమెరికాలో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసే ఔత్సాహికుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. మనం మాత్రం బ్రాండ్ల మోజులో అంకుర సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన ఉత్పత్తులను కూడా పట్టించుకోం.
 
వ్యవసాయంపై రైతు దృక్పథంలో మార్పు రావాలంటారా?
ఖచ్చితంగా. కేవలం సాగుకు మాత్రమే పరిమితం కాకుండా రైతులు కాస్త సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు గమనించాలి. నాణ్యమైన ఉత్పత్తుల్ని ఇప్పుడు దేశంలో ఎక్కడైనా మంచి ధరకు విక్రయించుకునే వీలుంది. ఇలాంటి ఆధునిక సమాచారాన్ని రైతులు తెలుసుకోవాలి. అప్పుడే అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి సాధిస్తుంది.
Credits : Andhrajyothi

అన్న పీజీ.. తమ్ముడు బీటెక్‌

 • ఇద్దరు కలిశారు…. అనుకున్నది సాధించారు
తొర్రూరు: ఉన్నత విద్యను అభ్యసించినప్పటికి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వంత శక్తిపై ఆధారపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామ శివారు కొత్తగూడెంకు చెందిన కందాడి అశోక్‌రెడ్డి ఎంఎ్‌ససీ, ఆయన సోదరుడు కందాడి రవికిరణ్‌రెడ్డి బీటెక్‌ విద్యను చదివారు. తల్లిదండ్రులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పంటల సాగులో తగిన లాభాలు రాకపోవడంతో తమ వ్యవసాయ క్షేత్రంలో నూతన పంటలను సాగు చేయాలని ఆలోచన చేశారు. డ్రిఫ్‌ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా సబ్సీడిపై 2.5 ఎకరాల్లో శాశ్వత పందిర్ల నిర్మాణం, క్రిపర్‌ మెష్‌ ద్వారా కూరగాయల సాగు కొనసాగిస్తున్నారు. పందిరి నిర్మాణం కోసం రూ. 4.80లక్షలు, క్రిపర్‌ మెష్‌ కోసం రూ. 1.20లక్షలు ఖర్చు చేశారు.
స్వయంగా అమినో యాసిడ్స్‌ తయారు
మొక్కల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అమినో యాసిడ్స్‌ను స్వయంగా తయారు చేసుకుంటున్నారు. పది కిలోల పచ్చి చేపలను తీసుకవచ్చి ముక్కలుగా చేసి పది కేజీల బెల్లం, పది లీటర్ల నీరుపోసి ఒక పెద్ద కుండలో వేసి ప్రతిరోజు కలుపుతూ పైన గాలి సోకకుండా మూత పెడతారు. తొలుత కొన్ని రోజుల తరువాత దుర్వాసన వస్తుంది. తరువాత సువాసన వచ్చిన తరువాత 50 ఎంఎల్‌ ద్రావణంలో పది లీటర్ల నీటిని కలిపికూరగాయల మొక్కలపై పిచికారి చేస్తారు. ఎప్పటికప్పుడు ఉద్యానవన శాఖ, స్వర్ణఫల్‌ కంపెనీల సలహాలు, సూచనలను పాటిస్తున్నారు. వాస్తవానికి లైట్‌ ట్రాఫ్‌ ద్వారా రూ. 1500 ఉన్న ఉద్యానవనశాఖద్వారా 95శాతం సబ్సీడితో రూ. 150కి అందిస్తున్నారు.
పండు ఈగలను బంధించడానికి ఒక బాక్స్‌లో తియటి పదర్థాం ఏర్పాటు చేస్తారు. లైట్‌ వెలుతురుకు పురుగులు అందులోకి ప్రవేశించి మళ్లి బయటికిరాకుండా వేడితో చనిపోతాయి. కూరగాయలు సాగు చేస్తున్న క్షేత్రానికి కషాయాలు, మందుల పిచికారి మౌన్‌టెడ్‌ స్ర్పేయర్‌ వినియోగిస్తున్నారు. వాస్తవానికి ట్రాక్టర్‌ ద్వారా మామిడి తోటలకు వినియోగిస్తారు. ఈ పరికరాన్ని మార్పు చేసి ఒక ఎలక్ర్టికల్‌ మోటారును స్టాండ్‌పై బిగించి డ్రమ్ములో పోసిన మందును స్ర్పే చేస్తారు. గంటలో ఎకరం క్షేత్రానికి స్ర్పే చేయవచ్చు. పరికరం రూపకల్పన కోసం రూ.20వేల ఖర్చు వస్తుంది.
రసాయన ఎరువులు వాడకుండా పంటల సాగు
రసాయనిక ఎ రువులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన కషాయాలను వినియోగిస్తూ కూరగాయల సాగును కొనసాగిస్తున్నాడు. బీర, కాకర, టమాట, ఉల్లి, కొత్తిమీర,సోరకాయ, నేలచిక్కుడు పంటలను సాగు చేస్తున్నారు. బోజ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నారు.
పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తున్నాము
సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పంటల సాగులో ఉద్యానవన శాఖాధికారుల సలహాలు, సూచనలతో పాటు ప్రకృతి సిద్ధంగా ఆలోచనలను అమలు చేస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సీడీలతో పాటు సాంకేతికతను వినియోగించడం ద్వారా కూరగాయల దిగుబడి అధికంగా సాధిస్తున్నాం మాతో పాటు ప్రతిరోజు 20 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఎవరికైనా సూచనలు కావాలంటే 9989555855, 9849567430లో అందుబాటులో ఉంటాం
Credits : Andhrajyothi

సాఫ్ట్‌వేర్‌ను వదిలి.. సాగుబాట పట్టి

 • ముంబైలో ఉద్యోగం వదిలేసి పల్లెకు
 • కూరగాయలు పండిస్తున్న శ్రీనివాస్‌
 • చౌహన్‌క్యూ, పాలేకర్‌ విధానాలు అమలు
 • వ్యవసాయంపై మక్కువే కారణమని వెల్లడి
కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎంబీఏ విద్యనభ్యసించాడు! ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు! మంచి ఉద్యోగమే చేస్తున్నా మనసులో ఏదో అసంతృప్తి! పలు రాష్ట్రాల్లోని రైతులు లాభాలబాటలో నడుస్తుంటే మన రాష్ట్రంలోని రైతులెందుకు అప్పులపాలవుతున్నారని మథన పడ్డాడు. లక్షలు రాకున్నా వ్యవసాయంతో లక్షణంగా బతికే అవకాశముందని చెప్పేందుకు ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు! వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ యువకుడే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌. వ్యవసాయం మీద మక్కువతో ముంబైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరు వచ్చేశాడు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. దక్షిణకొరియాలో చౌహన్‌క్యూ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం అతడిని ఆకర్షించింది. దేశీయ సూక్ష్మ జీవులతో వ్యవసాయం చేయడం, మనకు అందుబాటులో ఉన్న నూనెలు, ఇంటిలో ఉండే వంట పదార్థాలు సస్యరక్షణకు స్థూల, సూక్ష్మ పోషకాలు అందించేందుకు తోడ్పడుతాయని గ్రహించాడు. వాటినే ఉపయోగించే వ్యవసాయం చేస్తున్నాడు.
రెండెకరాల్లో బోడకాకర, ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు, బెండ, మరో ఎకరంలో అనప, అలసంద, గోరుచిక్కుడు పంటలు సాగు చేస్తున్నాడు. పాలేకర్‌ వ్యసాయ విధానాలను చౌహన్‌క్యూ సిస్టమ్‌తో సమ్మిళితం చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. బోడకాకర కిలోకు హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి రైతులకు గరిష్ఠంగా రూ.120, కనిష్ఠంగా రూ.80 లభిస్తుంది. దిగుబడి ఎకరాకు కనీసంగా 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున ఒక రైతు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే, బోడకాకర సాగులో మగ, ఆడ మొక్కలను గుర్తించి వాటిని అవసరమున్న మేరకే ఉంచుకొని మిగతా వాటిని తీసేయడం ప్రధాన ప్రక్రియ. ఇతర రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు శ్రీనివాస్‌ బోడకాకర సాగును ఎంచుకున్నాడు. డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్‌వీఎ్‌సకే రెడ్డి, రవి హైబ్రిడ్‌ సీడ్స్‌ వ్యవస్థాపకులు మన్నేపల్లి రవి సూచనలతో స్ఫూర్తిపొంది రెండెకరాల్లో బోడకాకర వేశాడు. ఇప్పటికే మూడు కటింగ్‌లలో క్వింటాలున్నర బోడకాకరను మార్కెట్‌కు పంపించారు.
సేంద్రియ ఎరువులతో దేశవాళీ రకాల సాగు
ఉప్పు తప్ప ఆహార పదార్థాలన్నీ పెరటిలోనే పండించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్నివ్వాలనే లక్ష్యంతో పల్లెకు వచ్చి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. బోడకాకర, అలసంద, చిక్కుడు, గోరుచిక్కుడు, సొరకాయ, శీతాకాలంలో అయితే టమాటలను సేంద్రియ ఎరువులతో పండించవచ్చు. ఆధునిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులకు కలిపి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇలా వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి.
Credits : Andhrajyothi

కాంప్లెక్స్‌ కంటే.. సూటి ఎరువులు ఉత్తమం

 

 • కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్‌
ఈ ఏడాది ఖరీఫ్ లో ప్రత్తి పంట అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు తెలంగాణ రైతులు. నల్లగొండ జిల్లాలోనే సుమారు 3లక్షల 50వేల హెక్టార్లలో ప్రత్తి పంట సాగవుతున్నది. జూన్‌ మొదటి వారంలో వర్షం పడటంతో చాలా ప్రాంతాల్లో ప్రత్తిని విత్తారు. తె లంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఆలస్యంగా పడటంతో విత్తడం ఆలస్యమైంది. ప్రత్తిని విత్తిన ప్రాంతాల్లో పది రోజుల ఎడతెరపి లేకుండా వానలు కురిశాయి. దీంతో ప్రత్తిలో ఎదుగుదల లోపించింది. ఈ తరుణంలో ప్రత్తి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్‌ సూచించారు.
ఎండుతెగులు, వేరుకుళ్లుతో జాగ్రత్త
ముందుగా వర్షాలు పడిన ప్రాంతాల్లో నెల రోజులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్తి పంట ప్రస్తుతం మొక్క దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్తి విత్తగానే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఎక్కువ నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో బాక్టీరియా, వేరు కుళ్లు కారణంగా లేత మొక్కలు వంగి చనిపోతాయి. ఈ పరిస్థితి నివారణకు లీటరు నీటికి కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3గ్రా., ప్లాంటోమైసిన్‌ 0.1 గ్రా., కలిపి పంటకు పిచికారి చేయాలి, నల్ల రేగడి నేలల్లో వేరు కుళ్లు, ఎండు తెగులు వ్యాపిస్తుంది. దాని నివారణకు 3గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి మొదలు వద్ద భూమి తడిచేలా పిచికారి చేయాలి. ఈ తరుణంలో ప్రత్తి పంటకు ఎర్ర తెగులు సోకే ప్రమాదం ఉంది. దీని నివారణకు యూరియా 10గ్రామలు, మల్టీ-కె 10 గ్రాములు, లీటర్‌ నీటికి కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని ఆయన సూచించారు.
కలుపు సమస్య నివారణకు…
ప్రత్తిలో కలుపు నివారణకు విత్తిన 20-25 రోజులకు పర్గాసూపర్‌ లేదా క్విజలోఫాప్‌ ఇథైల్‌ అనే మందును ఎకరాకు 4వందల మి.లీ, 2వందల లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. తద్వారా కలుపు సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూలీల కొరత కారణంగా సకాలంలో కలుపుతీయకపోవడం వల్ల ఎదురయ్యే నష్టాలను నివారించవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షనీరు ఆగినప్పుడు ఆ పంటను రక్షించుకునేందుకు ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, మొక్కకు 7.10 సెం.మీ దూరంలో కాండానికి తగలకుండా పోయాలని ఆయన సూచించారు.
కాంప్లెక్స్‌ ఎరువులు వద్దు
మొక్క ఎదిగే దశలో కాంప్లెక్స్‌ ఎరువులు వేస్తే వాటిని మొక్కలు తీసుకోలేవు. వాటి స్థానంలో సూటి ఎరువులు వాడటం వల్ల అధిక ప్రయోజనం వుంటుందని ఆయన వివరించారు. అదే విధంగా పచ్చదోమ ఆశించిన ప్రత్తి పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్‌ శంకర్‌. వాతావరణంలో తేమ లేనపుడు పచ్చదోమ రసం పీల్చి పంటకు నష్టం చేకూరుస్తుంది. వేప కషాయం 5 మిల్లీలీటర్లు, ఉధృతి అధికంగా ఉంటే మోనోక్రోటోఫాస్‌ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలో పూయాలి. తగ్గకపోతే 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. లేదా జీవరసాయనం మందు వర్తికీలియంలెఖాని 5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Credits : Andhrajyothi