చెరువు నీటిపై శ్రద్ధ.. లాభాల పంట 

‘‘మట్టికి, కృషీవలుడికి సరైన గౌరవం లభించనంత కాలం ఆరోగ్యకరమైన,
సమద్ధి కరమైన సమాజాన్ని నెలకొల్పడం అసాధ్యం’’
– పీటర్‌ మారిన్‌ (సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, ఫ్రాన్స్‌) 

  •  అద్భుత దిగుబడులు సాధించిన ఆక్వారైతు శ్రీనివాసులు 

రొయ్యల సాగు అంటే… లాటరీలా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. వచ్చిన ఏడాది మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో ఆక్వారైతు ఆదాయం అస్థిరంగా మారింది. కొందరికి పెట్టుబడికి రెండు రెట్లు ఆదాయం వస్తున్నది. తక్కువ పెట్టుబడి, టెక్నాలజీ వినియోగం, నిఫుణుల సలహా తీసుకున్న ఆక్వా రైతులు లాభపడుతున్నారు. అలాంటి రైతుల్లో ముందువరుసలో ఉన్నారు ఎం.శ్రీనివాస్‌. రొయ్యల సాగులో టెక్నాలజీని వినియోగించుకుని మంచి దిగుబడి సాధిస్తున్నారాయన. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామంలో ఉన్న ఆయన చేపల చెరువు ఇప్పుడు రొయ్యలతో కళకళలాడుతున్నది. తాజా పంటలో 70 రోజులకు 80 కౌంట్‌కు వనమి రొయ్య ఎదిగింది. 5 ఎకరాల విస్తీర్ణంలో 6.50 లక్షల రొయ్యపిల్లలను వేసి, కేవలం 3టన్నుల ప్రొబయోటిక్‌ ఆహారం వేసి, మంచి దిగుబడికి రంగం సిద్ధం చేశారు ఆ రైతు.

ఎకరం నుంచి ఐదెకరాలకు

ఏడాదిన్నర క్రిందట కేవలం ఎకరం చెరువుతో రొయ్యల సాగు ప్రారంభించారు శ్రీనివాస్‌. మిగిలిన వారి మాదిరిగానే చుట్టుపక్కల రైతుల సలహాలు తీసుకుని సాగు మొదటు పెట్టారు. రొయ్యపిల్ల వేయటం నుంచి పట్టుబడి వరకూ భారీ పెట్టుబడులు పెట్టాడు. ఎకరంలో 1.50 లక్షల సీడు వేసారు. 90రోజులలో 3టన్నుల మేత వినియోగించారు. నిజానికి ఇది ఎక్కువే ఆ తర్వాత ఇతనికి భీమవరానికి చెందిన ప్రముఖ టెక్నీషియన్‌ డాక్టర్‌ జల్లి వెంకటేష్‌ సలహాదారుడయ్యారు. ఆయన సహకారంతో ఎకరం చెరువులో 3టన్నుల ఉత్పత్తి సాధించి 50కౌంట్‌లో 8లక్షలు ఆదాయం సాధించగలిగాడు. 3లక్షలు మిగిలాయి. 2వ పంటలో 4 ఎకరాలకు విస్తీర్ణం పెరిగింది. ఈసారి ప్రారంభం నుంచి వెంకటేష్‌ సలహలు తీసుకున్నాడు. 3లక్షల సీడు మాత్రమే వేసాడు. సాగులో ప్రధానంగా నీటిలో సహజంగా తయారయ్యే జంతు, వృక్ష ప్లవకాలను వృద్ధి చేయటంలో విజయం సాధించారు.. ఈసారి 4ఎకరాలకు 5 టన్నుల మేత మాత్రమే వినియోగించారు శ్రీనివాస్‌. 90 రోజులలో 5 టన్నుల దిగుబడి సాధించారు. 30 కౌంట్‌ కావటంతో 26 లక్షల రూపాయల ఆదాయం పొందారు. రూపాయి పెట్టుబడికి రూపాయన్నర ఆదాయం పొందగలిగాడు.

నిపుణుల సలహాతో లాభాలు

రొయ్యలసాగులో వాతావరణ అనుకూలత కీలకం. ఎండ, చలి, వర్షం వాతావరణ సమతుల్యత కోసం వారంలో 2-3 సార్లు నీటి పరీక్షలు, నిఫుణుడు వెంకటేష్‌ సలహలతో జంతు, వృక్ష ప్లవకాలను వృద్ధి చేసుకున్నాను. అదే నన్ను లాభాల బాటలో నడిపిస్తున్నది.

రొయ్యకు ప్లవకాలే ప్రాణం 
ఆక్వా సాగులో రొయ్యలు, చేపల ఎదుగుదలలో వృక్ష, జంతు ప్లవకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. చెరువు నీటిలోనే ప్లవకాలను అభివృద్ధి చేస్తే అధిక దిగుబడులు వస్తున్నాయి. చేప పిల్లల పెంపకానికి చెరువులో నీటిని నింపిన తరువాత నీటిలో ప్లవకాలు ఎంత శాతం ఉన్నాయో ప్రయోగశాలలో పరీక్షించాలి. నీటిలో తగినన్ని ప్లవకాలు ఉంటే చేపపిల్లలు బాగా ఎదుగుతాయి. ప్లవకాలు తక్కువగా ఉన్న చెరువులో నీరు రంగు మారుతుంది. నీరు రంగు మారితే చేపల దిగుబడి తగ్గుతుంది. హానికరమైన నాచులు, వాటివల్ల విషవాయువులు ఏర్పడి చేపపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రోబయోటిక్స్‌ ఉపయోగించి, నీటిని సహజంగా ఉంచడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
– డాక్టర్‌ జల్లి వెంకట్‌, జలపుష్ప ఆక్వాల్యాబ్‌ నిపుణులు
Credits : Andhrajyothi

పాడిని నమ్మితే… బతుకు పండింది

సొంతూళ్లో సెంటు పొలంలేదు.. సరైన ఉపాధి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడమే గగనం.. ఎలా బతకాలి? ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇక ఊళ్లో ఉండలేమని.. మూటముళ్లే సర్దుకొని చాగలమర్రికి వలస వచ్చారు సురేఖ దంపతులు. అరెకరం పొలం ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో ఓ షెడ్డు నిర్మించారు. పాడిని నమ్ముకున్నారు. ఐదారు గేదెలతో ఆరంభించి.. 24 గేదెలతో పాడిపరిశ్రమగా అభివృద్ధి చేశారు… కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఎస్‌.సురేఖ, సురే్‌షయాదవ్‌ దంపతులు.
కపడ జిల్లా పెద్దపసుపుల గ్రామానికి చెందిన ఎస్‌.సురేఖ, సురేష్‌ యాదవ్‌ దంపతులు ఉపాథి కోసం కర్నూలు జిల్లా చాగలమర్రికి ఆరేళ్లక క్రితం వలస వచ్చారు. తెలిసినవారి దగ్గర అప్పు చేసి నాలుగు గేదెలు కొన్నారు. రేయింబవళ్లు కష్టపడ్డారు. ఉయయాన్నే పాలు పితికి ఇల్లిల్లూ తిరిగి అమ్మడం మొదలుపెట్టారు. కల్లీలేని చిక్కటి పాలు ఇంటికి సరఫరా చేసే ఆ దంపతులు సరఫరా చేసే పాలకు అనతికాలంలో ఆదరణ పెరిగింది. ఉపాధి కోసం చేపట్టిన పాడిపోషణ పరిశ్రమగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటికే చేసిన అప్పు తీరింపోయింది.

మరికొన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రుణం ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. మ రో పది గేదెలను ఒకొక్కటి 45 వేల రూపాయలు ఖర్చు చేసి కొన్నారు. గ్రామంలోనే అర ఎకరా పొలంను ఐదేళ్ల లీజుకు తీసుకొని అందులో ఓ షెడ్డు నిర్మించి పాడిపరిశ్రమకు శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్‌లో మరో 6 గేదేలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాళ్ల దగ్గర మొత్తం 24 గేదెలున్నాయి.

– ఆంధ్రజ్యోతి, కర్నూలు

మా కష్టాలు తీరాయి
ఒకప్పుడు కనీస ఉపాథి లేక ఇబ్బంది పడ్డా. పాడిని నమ్ముకుని ఈ రోజున గౌరవంగా జీవిస్తున్నాం. మా పిల్లలు ఇద్దరూ చదువుకుంటున్నారు. నాలుగు పశువుల నుంచి మా ప్రయాణం 24 పశువులకు పెరిగింది. మా కష్టానికి ప్రజల నమ్మకం తోడైంది. అదే మా విజయ రహస్యం. కరువు రోజుల్లో కూడా పాడి పరిశ్రమను నమ్ముకుని, కష్టపడి పనిచేస్తే ఆదాయానికి ఏ మాత్రం ఢోకా ఉండదు.

– సురేఖ, పాడి రైతు


నెలకు పాతిక వేలకు పైనే 
రోజూ సగటున 35 నుంచి 40 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. అందులో 25 లీటర్ల వరకు ఆమే భర్త సురే్‌షయాదవ్‌ ఇంటింటికి వెళ్లి వినియోదారులకు పోస్తారు. మరో 10-15 లీటర్లు విజయ డైరీకి అమ్ముతారు. నీళ్లు కలపని చిక్కటి పాలు కావడంతో వినియోదారులు లీటరుకు 50 ఇస్తున్నారు. విజయ డైరీకి వేసే పాలకు వెన్న శాతాన్నిబట్టి రూ.38 నుంచి రూ.50ల వరకు వస్తున్నది. ఇలా రోజుకు 1500 చొప్పున నెలకు 45 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు ఆ దంపతులు. గేదేల పోషణకు మొక్కజొన్న, తౌడు, బియ్యం నూక మిశ్రమం దాణా ఇస్తున్నారు. అంతేకాదూ జొన్నమేత, పచ్చిగడ్డి మేత పశుగ్రాసంగా ఇస్తున్నారు. దాణా, పశుగ్రాసం కొనుగోలు కోసం నెలకు రూ.10 వేలు, వైద్యం కోసం రూ.3-5వేలు కలుపుకొని సగటున పోషణ ఖర్చు రూ.15 వేలకుపైగానే వస్తుంది. వివరించారు. గేదేలకు జబ్బు చేసినప్పుడు పాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, పోషణ ఖర్చులు పోనూ నెలకు సగటున రూ.20 వేల వరకు మిగులుతున్నదని ఆ దంపతులు వివరించారు. కష్టపడితే ఎంచుకున్న రంగం ఏదైనా అందులో రాణించడం సాధ్యమేనని, కరువును కూడా జయించవచ్చని నిరూపించిన ఆ దంపతులను ఆదర్శంగా తీసుకుని పాడిపరిశ్రమ వైపు దృష్టి సారిస్తున్నారు.

Credits : Andhrajyothi

మట్టి లేకుండా మొక్కల పెంపకం 

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో మొక్కలు పెంచాలంటే స్థలం కొరత ఎదురవుతోంది. కానీ ఈ పరిస్థితి కారణంగా పచ్చదనం పెంచాలని ఆసక్తి ఉన్నా చేయలేనివారికి మధురవాడ జీవీపీ కళాశాలలో ట్రిపుల్‌ ఇ చదువుతున్న విద్యార్థి భమిడిపాటి అవధానిప్రశాంత్ చక్కని పరిష్కారం చూపించాడు. మట్టితో పని లేకుండా మొక్కలు పెంచే విధానం గురించి ఒక ప్రాజెక్టు రూపొందించాడు.
వ్యవసాయరంగంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందడానికి ఈ విధానాన్ని అమలు చేయవచ్చని ప్రశాంత్‌ తెలిపాడు. వ్యవసాయ క్షేత్రం పక్కన నీటికొలను ఏర్పాటు చేసుకొని, ఆ నీటిలో పీహెచ్‌ గాఢతను అనుసరించి పోషకాలు కలిపి డ్రిప్‌ పద్ధతి అందిస్తే నీరు ఆదా అవుతుందని ప్రశాంత్‌ వివరించాడు. నీటిని అందించే పైప్‌లైన్‌కు పీహెచ్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌లు అమర్చి వాటిని మన సెల్‌ఫోన్‌కు అనుసంధానించి దూరం నుంచి కూడా వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించవచ్చునని ప్రశాంత్ వివరించాడు.

కేవలం నీటితోనే.. 
మన ఇళ్లల్లో మట్టి లేకుండా ప్లాస్టిక్‌ పైప్‌లలో చిన్న కుండీలు ఏర్పాటు చేసి వాటిలో క్లేపెబల్స్‌ (మట్టి ఉండలు)వేసి మనకు నచ్చిన పూల మొక్కలు, టమాటాలు లాంటి కూరగాయలు మొక్కలు వేసుకోవచ్చు. వీటికి అందించే నీటిలోనే పోషకాలు కలపడం వల్ల మట్టి అవసరం ఉండదు. మట్టిలో ఉండే పోషకాలు ఈ నీటిలో ఉంటాయి. కనుక మట్టి ప్రసక్తి ఉండదు. ఈ విధానం ద్వారా పెంచే మొక్కలు మనం ఇంట్లో లేకున్నా వాటికి కావలసిన నీటిని తొట్టెలో ఉన్న నీటితో అనుసంధానించడం ద్వారా అవి ఏపుగా పెరుగుతుంటాయి.

నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం

మన దేశంలో వ్యవసాయరంగానికి సుమారు 70 శాతం నీరు అవసరం అవుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలకు కేవలం 23 శాతం నీరు వినియోగమవుతంది. వ్యవసాయరంగంలో నీటి పొదుపు చేయడానికి స్మార్ట్‌ వాటర్‌ సిస్టం ఉపయోగపడుతుంది. గృహాలకు లేదా వ్యవసాయ క్షేత్రాలకు ఈ విధానం అవలంబించాలంటే వారికి అన్ని విధాల సహాయం అందిస్తాను.
Credits : Andhrajyothi

ఆక్వాకు ఊతం..ఉత్పత్తి లక్ష్యం 

  • 2020కి రూ.70 వేలకోట మత్స్య… ఉత్పత్తుల సాధనకు ప్రభుత్వం కృషి
  • కేంద్ర సాయంతో వడివడిగా అడుగులు…సత్ఫలితాలిస్తున్న సర్కారు చర్యలు
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విశాలమైన కోస్తా తీరం.. అపారమైన మత్స్యసంపద.. కావల్సినన్ని మానవ వనరులు.. వీటితోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఇవన్నీ మత్స్య ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి! ఉత్పత్తితో పాటు ఉపాధి కల్పనలోనూ యువతకు ఈ రంగం భారీ అవకాశాలు కల్పిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మత్స్య రంగానికి మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం సాయంతో ఈ పరిశ్రమను భారీస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పుటికే ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ఏటా 20 నుంచి 30 శాతానికి పైగా మత్స్య పరిశ్రమ వృద్ధి సాధిస్తోంది. ఇదే స్ఫూర్తితో 2020కి రాష్ట్రంలో రూ.70 వేలకోట్ల ఉత్పత్తులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిని సాధించేందుకు ఇటు ఆక్వా రైతులతో పాటు మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10లక్షలకు పైగా కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డాయి. సముద్ర ఉత్పత్తులను భారీగా పెంచాలని అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం నిర్ణయించి అనేక ప్రోత్సాహాలు అందించింది. 2014-15లోరాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా ఉంది. ఇందులో భాగంగా రెండేళ్లలో వీటి విలువ దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు 25 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉంది. వీటి ద్వారా రూ.16 వేల కోట్లు.. విదేశీ మారకద్రవ్యం రూపంలో వస్తోంది. అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం.. మత్స్య పరిశ్రమల్లో నిపుణులైన ఇద్దరిని సలహాదారులుగా నియమించింది.

మత్స్యకారులకు అండగా.. 

మత్స్యకారులు, సముద్ర ఉత్పత్తుల పెంపకందార్లకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. అంతేగాక ఈరంగంలో వృద్ధి శాతాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయింపులు కూడా పెంచింది. గత ఏడాది రూ.187.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది రూ.339 కోట్లు ఇచ్చింది. అలాగే నూతన మత్స్య విధానాన్ని ప్రకటించింది. అసైన్డ్‌ భూముల్లోనూ చేపలు, రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. వేట నిషేధ కాలంలో జాలర్ల జీవన భృతిని నాలుగు వేలకు పెంచింది. ఈ కాలంలో కుటుంబానికి 30 కిలోల బియ్యాన్ని అందిస్తోంది. వీటితోపాటు రూ.20 ప్రీమియంతో గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ స్కీం అమలు చేస్తోంది మత్స్యకారులు పట్టిన చేపల్ని వెంటనే అమ్ముకోలేని పరిస్థితుల్లో వాటిని నిల్వ ఉంచుకోవడానికి ఐస్‌ బాక్సుల్ని రాయితీ ధరలకు ప్రభుత్వం అందిస్తోంది. ‘మత్స్య మిత్ర’ పేరుతో మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు.. చేపలు అమ్ముకోవడానికి, మార్కెటింగ్‌కు రూ.లక్ష రివాల్వింగ్‌ ఫండ్‌ రూపంలో అందిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో చేపల వేట సాగించేందుకు సాంకేతిక సహకారం అందించడంతో పాటు మర పడవలు, మోటార్లు, వలలు కూడా సబ్సిడీ ధరలకు అందిస్తుంది. జాలర్ల కోసం బయోమెట్రిక్‌ ఐడీకార్డులు, యానిఫాం అందజేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని ఉప్పాడ(తూర్పుగోదావరి), జువ్వలదిన్నె(నెల్లూరు), ఓడరేవు(ప్రకాశం) ప్రాంతాల్లో మినీ ఫిషింగ్‌ హార్బర్స్‌ నిర్మించబోతున్నాయి. వీటికోసం దాదాపు రూ.200కోట్లు ఖర్చు చేయబోతున్నాయి.

ఆక్వా వర్సిటీ.. మత్స్యవాణి 
మత్స్య సంబంధమైన శాసీ్త్రయ పరిశోధనలు, అధ్యయనం కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుబంధంగా ఈ ఏడాది నుంచి కాలేజీలు ఏర్పాటు చేసి, కోర్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మండల ఫిషరీస్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరిలో ఒక్కొక్కరికీ 500 హెక్టార్ల చొప్పున అప్పగించి.. మత్స్య సంపద వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఆక్వా రైతులకు సలహాలిస్తూ, సందేహాలు తీర్చడం కోసం మత్స్యవాణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే ఐదు వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో అనుసంధానమయ్యారు. వీరికి ప్రభుత్వం సిమ్‌కార్డులు అందించి.. వీటి ద్వారా రైతులకు రోజుకు నాలుగుసార్లు ఫోన్లలో సమాచారం అందిస్తారు. ఇలా మత్స్య ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.

Credits : Andhrajyothi

ప్రకృతి సేద్యం.. ప్రజలకు అమృతం 

పశ్చిమగోదావరి జిల్లా నాచుగుంటలో 26 మంది రైతులు ‘కామధేను సంక్షేమ సంఘం’గా ఏర్పడ్డారు. ప్రభుత్వ సహకారంతో 60 ఎకరాల భూమిని ప్రకృతి ఆధారిత వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఆ విజయాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ పంటలతో ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ రైతులోకానికి మార్గదర్శకంగా నిలిచిన ఆ సంఘం సారథి భూపతిరాజు రామకృష్ణరాజు ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.

ప్రకృతి వ్యవసాయదారులను ప్రభుత్వం మూడేళ్లు ఆదుకోవడంద్వారా ప్రోత్సహించాలి. ఎరువుల వినియోగం ఉండదు కాబట్టి రాయితీ రూపంలో ఆదా అయ్యే నిధులను రైతుల కోసం మళ్లిస్తే వారు నిలదొక్కుకుని సేంద్రియ సాగుతో అద్భుతాలు చేస్తారు – భూపతిరాజు రామకృష్ణరాజు, ‘కామధేను సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు (పశ్చిమ గోదావరి జిల్లా )

ప్రకృతి సేద్యంతో అద్భుతాలు చేస్తున్న 26 మంది రైతన్నలు 

దేశవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులు ఇప్పుడు ఆ రైతులవైపే చూస్తున్నారు. మొదట్లో చాలామంది రైతుల కుటుంబ సభ్యులే సాగు గిట్టుబాటు కావడంలేదంటూ నసపెట్టారు. ఇప్పుడు సాటి రైతులంతా వారిని అనుసరిస్తుంటే సంతోషిస్తున్నారు. ‘గో ఆధారిత,. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు నాచుగుంట పరిధిలో 26 మంది రైతులం కలిసి కామధేను రైతుసంఘంగా ఏర్పడ్డాం. 2007లో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాం. వరుసగా మూడేళ్లు వేదిక్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ సంస్థ సేంద్రియ వ్యవసాయ భూములనుంచి మట్టి తీసుకెళ్లి పరీక్షించి, సర్టిఫికెట్‌ జారీచేసింది. సేంద్రియ సాగుతో ఉత్పత్తయ్యే పంటలకు సాగుద్వారా ఆవిర్భవించే సారవంతమైన మట్టిని పరీక్షించాకే సర్టిఫికెట్‌ ఇస్తారు. అది పొందితే సేంద్రియ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే అర్హత లభిస్తుంది. మా సంఘానికి ఆ సర్టిఫికెట్‌ లభించింది. సేంద్రియ సేద్యం ప్రారంభించాక మూడేళ్లపాటు ఎలాంటి ఫలం దక్కలేదు. ఈ పద్ధతిద్వారా భూమి సారవంతమై మా వ్యవసాయం పరుగులు తీస్తోంది’ అన్నారు సంఘం సారథి రామకృష్ణరాజు.

ఆరోగ్యం పంచుతున్నాం 

‘మిగిలిన రైతుల నుంచి ప్రజలు అనారోగ్యాన్ని కొంటుంటే మా దగ్గర ఆరోగ్యాన్ని కొంటున్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. మా పంటలు బెంగుళూరు, పుణె, చెన్నై, షోలాపూర్‌, హైదరాబాద్‌, విశాఖవంటి మహానగరాలకు వెళ్తున్నాయి. వాటిని నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నాం. ఎరువుల కోసం ప్రభుత్వం రూ.70వేల కోట్లు రాయితీకింద వెచ్చిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో ఎరువులకు స్థానం లేదు. జీవామృతాన్ని సొంతంగా చేసుకుని వాడుతున్నాం. ఆ విధంగా ప్రజాధనాన్ని ఆదా చేయడమేగాక ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్ప త్తులను అంది స్తున్నాం. ఇంతకు మించి రైతుగా కోరుకునేది ఏముంటుంది?’ అన్నారు.

విజ్ఞాన యాత్రలకు నిలయం 
నాచుగుంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం విజ్ఞాన యాత్రలకు నిలయంగా మారింది. వ్యవసాయ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అధ్యయనం కోసం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూంటారు. శిక్షణ కోసం ప్రభుత్వం రైతుల్ని నేరుగా ఇక్కడికి పంపటం మరో విశేషం. పంటను పండించడమే కాదు. నేరుగా వినియోగదారులకు విక్రయించే స్థాయికి ప్రకృతి వ్యవసాయ దారులు ఎదిగారు. ‘నగరాలనుంచి నేరుగా వినియోగదారులే మమ్మల్ని సంప్రదిస్తారు. వారికి అవసరమైన ఉత్పత్తులను పంపుతున్నాం. వారు మా ఖాతాల్లో సొమ్ము నేరుగా వేస్తుంటారు. సేంద్రియ పద్ధతిలో బీపీటీ 25 బస్తాల దిగుబడినిస్తోంది. పీఎల్‌ రకం 30 బస్తాలు వస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తయ్యే పీఎల్‌ బియ్యం మార్కెట్‌లో కిలో రూ.46కు అమ్ముడుపోతుంది. బీపీటీ రకమైతే రూ.56 వంతున అమ్ముతున్నాం. ఎకరానికి రూ.50-60వేల మధ్య మిగులు చూస్తున్నాం. ఆరోగ్యకరమైన పంటలతో ఆరోగ్యవంతమైన సమాజానికి దోహద పడుతున్న ప్రకృతి వ్యవసాయదారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఈ రైతుల్ని ప్రభుత్వం మూడేళ్లు ఆదుకోవాలి. ఎరువులు వినియో గించం కాబట్టి పరోక్షంగా ప్రభు త్వానికి రాయితీ రూపంలో ఆదా అవుతుంది. దాన్నే ప్రకృతి ఆధారిత సేద్యానికి మూడేళ్లు మళ్లిస్తే రైతులు నిలదొక్కుకుంటారు. ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయంతో అద్భుతాలు చేస్తారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, రైతులకు నేరుగా సహకారం అందించాలి’ అన్నారు రామకృష్ణరాజు.

ప్రకృతి సేద్యానికి జీవామృతం 

ప్రకృతి సేద్యంలో ఆరోగ్యవంతమైన పంటల ఉత్పత్తికి భూమిలో పోషక విలువను పెంచే జీవామృతం కారణం. పదిలీటర్ల గోమూత్రం. పదికిలోల అవుపేడ, 180 లీటర్ల నీరు, రెండు కిలోల ఉలవపిండి, 2 కిలోల నల్లబెల్లం, ఒక కిలో చెట్టు కింద మట్టి లేదా పుట్టమట్టిని డ్రమ్‌లో మిశ్రమం చేస్తున్నాం. వారం రోజులపాటు ఊరబెట్టాక జీవామృతం తయారవుతుంది. దీనిలో ఏముందిలే అని అంతా అనుకోవచ్చు. గోమూత్రంలో 23 రకాల సూక్ష్మ పోషకాలుంటాయి. ఒక గ్రాము పేడలో 300 కోట్ల బాక్టీరియా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చల్లితే పైరు ఏపుగా పెరుగుతుంది. ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.

విష అవశేషాలకు తావే లేదు 
ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఆ అవశేషాలు మిగిలే ఉంటాయి. ప్రకృతి సేద్యం అందుకు పూర్తిగా భిన్నం. తెగుళ్ల నివారణిలో 5 లీటర్ల గోమూత్రం, 5 కిలోల ఆవుపేడ, 5 లీటర్ల నీటిలో కలిపి రెండు రోజులు నానబెడతాం. బాగా కలిపి మూడో రోజున వడగట్టాలి. అందులో 200 గ్రాముల పాల ఇంగువ (ముద్ద ఇంగువ)ను లీటరున్నర గోరువెచ్చని నీటిలో కలిపిన ద్రావణాన్ని మిశ్రమం చేస్తాం. ఇది ఎకరం పొలంలో చల్లుకోవచ్చు. కీటక నివారణిలోనూ వేప, గానుగ, ఉమ్మెత్త, జిల్లేడు, కుక్కతులసి, నేలవేము ఆకులు, కిలో వెల్లుల్లి దంచి అందులో వేపనూనెను మిశ్రమం చేస్తే కషాయం తయారవుతుంది. దీనిలో రూ.10 విలువ చేసే కారం, మైలతుత్తం, ఇంగువను కలిపి చల్లితే పైరుపై కీటకాలను నివారిస్తుంది. విష పురుగులు క్షీణిస్తాయి. మిత్ర కీటకాలకు ఎటువంటి హాని ఉండదు. సేంద్రియ వ్యవసాయంలో ఇటువంటి ఔషధీయ పద్ధతులు అనేకం ఉన్నాయి. రైతు కాయకష్టమే తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆరోగ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి.
– రొక్కం కిశోర్‌, తాడేపల్లిగూడెం

Credits : Andhrajyothi

కలుపు నివారిస్తే కాసులపంటే!

తెలుగు రాష్ట్రాల రైతులందరూ ఖరీఫ్‌ సాగు మొదలు పెట్టారు. వర్షాలు ఊపందుకోవడంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కలుపు తీసేందుకు కూలీలు దొరకడం గగనం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో రసాయనాల సాయంతో కలుపును ఎలా నివారించాలో వివరిస్తున్నారు.. దశాబ్దాలుగా కలుపు నివారణలో పలు పరిశోధనలు చేసిన ప్రొఫెసర్‌ ఎ.ఎస్‌.రావు.
 

వరిలో ఇలా.. 

నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 400 మిల్లీలీటర్లను 200లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేక 3 రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా వరి విత్తిన 14, 15 రోజుల సమయంలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి సైహాలోపాప్‌ బ్యుటైల్‌ 10 శాతం ద్రావణం 400మిల్లీలీటర్లను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఊద, వెడల్పాకు మొక్కలు నారుమడిలో సమపాళ్లలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు 80 మిల్లీలీటర్ల బిస్‌పైరిబాక్‌ సోడియం 10 శాతం ద్రవాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై చల్లాలి. మాగాణి వరిలో ఊద మొదలైన ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యుటాక్లోర్‌ 50 శాతం ద్రావణం 1 నుంచి 1.5 లీటర్లు లేదా అనిలోఫాస్‌ 30 శాతం ద్రావణం 400మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 400 మిల్లీలీటర్లలో ఏదో ఒక దానిని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి.
తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకుజాతి మొక్కలు సమపాళ్లలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్‌ 5 శాతం ద్రావణం గుళికలు, 4 కిలోలు 2,4-డి, ఇథైల్‌ ఎస్టర్‌ 4 శాతం ద్రావణం గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. లేదా ఎకరాకు 50 గ్రాముల ఆక్సాడయార్జిల్‌ 80 శాతం పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజులలో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా చల్లాలి. నాటిన 25-30 రోజుల సమయంలో పొలంలో వెడల్పాటి కలుపుమొక్కలు అధికంగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్‌ 80 శాతం పొడిమందును లేదా ఇథాక్సి సల్పురాన 15 శాతం పొడిమందును 50 గ్రాములు ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేలా పిచికారీ చేయాలి.

పత్తిలో నివారణ.. 

విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండి మిథాలిన 45 శాతం ద్రావణం ఎకరాకు 1 నుంచి 1.3 లీటర్లు లేదా అలాక్లోర్‌ 50 శాతం ద్రావణం 1.5 నుంచి 2 లీటర్లు చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తి 25, 30 రోజులప్పుడు తర్వాత 50-55 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. ఖరీఫ్‌ వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వైజాలాపాప్‌ ఇథైల్‌ 5 శాతం ద్రావణంతోపాటు 250 మిల్లీలీటర్ల పైరిథయోబాక్‌ 10 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పత్తి మొక్కలమీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేట్లు స్ర్పే చేసుకోవాలి.
 

వేరుశనగలో.. 

విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా బ్యూటాక్లోర్‌ ద్రావణం 1.5 నుంచి 2 లీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20,25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. అలాగే మొక్కలు, మొదళ్లకు మట్టిని ఎగదోయాలి లేదా గడ్డిజాతి మొక్కల నిర్మూలనకోసం ఎకరాకు 250 మిల్లీలీటర్ల పెనాక్సాప్రాప్‌ ఇథైల్‌ 9 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలి.
 

కందిలో.. 

విత్తిన వెంటనే లేదా 1, 2 రోజుల్లో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1 నుంచి 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30, 60 రోజుల సమయంలో గుంటకతో కానీ, గొర్రుతో కానీ అంతరకృషి చేయాలి. లేదా ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఇమిజితాపిర్‌ 10 శాతం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలి.
 

మొక్కజొన్నలో.. 

ఎకరాకు 1 నుంచి 1.5 కిలోల అట్రాజిన 50 శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2,3 రోజుల్లో భూమిపై పిచికారీ చేయాలి. విత్తిన 30-35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేసి తర్వాత బోదె నాగలితో సాళ్లు చేసుకోవాలి,.
 

చెరుకులో… 

ముచ్చెలు నాటగానే లేదా 2, 3 రోజుల్లో అట్రాజిన 50 శాతం పొడిమందును ఎకరానికి 2 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి ఒక నెల వరకు కలుపు నివారించుకోవచ్చు. తోటనాటిన నెల తరువాత 20, 25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2, 3 సార్లు గొర్రు లేదా దంతితో అంతరకృషి చేయాలి. లేదా వెడల్పాటి కలుపుమొక్కలు ఎక్కువగా ఉంటే 2,4-డి సోడియం సాల్ట్‌ 80 శాతం పొడిమందు 500గ్రాముల చొప్పున 30, 60 రోజుల తర్వాత పిచికారీ చేయాలి. లేదా 2, 4-డి సోడియం సాల్ట్‌ 80శాతం పొడిమందు 500గ్రాములు, మొట్రిబుజిన 70 శాతం పొడిమందు అరకిలో ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య మాత్రమే పైరుపై పడకుండా 30, 60 రోజులప్పుడు స్ర్పే చేస్తే కలుపును సమర్థంగా నివారించవచ్చు.
 

సోయా చిక్కుడు.. 

విత్తిన వెంటనే లేదా 1, 2 రోజులలో పెండిమిథాలిన 30 శాతం ద్రావణం ఎకరాకు 1 ఉంచి 1.3 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. లేదా విత్తిన 20 రోజుల సమయంలో ఇమిజాతాపిర్‌ 10 శాతం ద్రావణం ఎకరాకు 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలపి స్ర్పే చే యాలి.

 ప్రొఫెసర్‌ ఎ.ఎస్‌.రావు, కలుపుమొక్కల నివారణ పరిశోధకులు,
నోడల్‌ ఆఫీసర్‌, ఆచార్య ఎన.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

Credits : Andhrajyothi

రైతు ఆశల్ని మింగేస్తున్న కలుపు 

కలుపు మందు ఇరవయ్యో శతాబ్దపు అద్భుత ఆవిష్కరణలలో ఒకటి. వీటిలో ఏ మందును, ఏ పంటకు, ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా వేయాలనే అంశాలపై మన రైతులలో అవగాహన పెంపొందిస్తే భారత వ్యవసాయ రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. 
– ప్రొఫెసర్‌ ఎ.ఎస్‌.రావు, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ నోడల్‌ అధికారి 

సరైన సమయంలో కలుపు తీయకపోవడం,
ఏ దశలో, ఎంత మోతాదులో కలుపు నివారణ మందులు వాడాలనే అవగాహన లేక రైతులు పది శాతానికి పైగా పంటను, ఏటా రూ.వందల కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నారు. సకాలంలో కలుపును నివారించుకోగలిగితే సాగు వ్యయం తగ్గవడమేగాక అధిక దిగుబడులు సాధించడం తథ్యమంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ నోడల్‌ అధికారి, కలుపు నివారణపై మూడున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్న ప్రొఫెసర్‌ ఎ.ఎస్‌.రావు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధన పత్రాలు సమర్పించిన డాక్టర్‌ రావు ఇండియన సొసైటీ ఆఫ్‌ వీడ్‌ సైన అవార్డుసహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. కలుపు నివారణపై ఆయన సూచనలు ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు ప్రత్యేకం. 

కలుపు యాజమాన్యంలో తెలుగు రాషా్ట్రల రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 
నేల స్వభావం, వేసే పంట, సాగుచేసే విధానాన్ని బట్టి కలుపు సమస్య వేర్వేరుగా ఉంటుంది. మాగాణిలో ఒక రీతిలో, ఎర్రనేలల్లో మరో తీరులో ఈ సమస్య ఎదురవుతుంది. తదనుగుణంగా కలుపు యాజమాన్య పద్ధతులు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. పంట వేసిన నాటినుంచి కలుపు సమస్య రైతు కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. ముఖ్యంగా తుంగ ప్రపంచవ్యాప్తంగా రైతుల్ని కలవరపెడుతున్నది. గతంలో రైతులు కూలీలతో కలుపు తీయించేవారు. ఇప్పుడు కూలీలు దొరకడం లేదు. దొరికినా వారినుంచి పూర్తి స్థాయిలో పని రాబట్టడం పెద్ద సమస్య. కూలీల ఖర్చు విపరీతంగా పెరిగింది. దీంతో రైతులు కలుపు నివారణ మందులపై దృష్టి సారిస్తున్నారు. అయితే, ఈ మందులను పంట ఏ దశలో, ఎంత మోతాదులో వాడాలి? ఏ పంటకు ఏ మందు వాడాలి? అనే అవగాహన లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన పంటలైన వరి, పత్తిలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి 180 రోజులకు పైగా సాగయ్యే పంట. పత్తి ప్రాథమిక దశలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పత్తి వేసిన రోజు నుంచి మొదటి 60 రోజుల్లో కలుపు లేకుండా చూసుకుంటే రైతులు మంచి దిగుబడులు సాధించే వీలుంటుంది. ఖరీఫ్‌లో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఎరువులు కూడా ఎక్కువ వేస్తారు కాబట్టి కలుపు బాగా పెరుగుతుంది. దీని నివారణకు పత్తి వేసిన రోజు నుంచి 20, 40, 60 రోజులకు ఒకసారి వంతున కలుపుతీస్తే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. దిగుబడి కూడా పెరుగుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా రైతు అన్నివిధాలా నష్టపోవాల్సి వస్తుంది. దీంతోపాటు నేల స్వభావాన్నిబట్టి పత్తి సాళ్లలో అడ్డంగా, నిలువుగా రెండుమూడు సార్లు దున్నినా కలుపును చాలా వరకు నివారించే వీలుంటుంది. ఇక వరి 120 రోజుల్లో పండే పంట. మాగాణి వరిలో నాటిన మొదటి ఆరువారాలు కలుపు తీయటానికి కీలక సమయం. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి కలుపు యాజమాన్య పద్ధతులపై అవగాహన లేక మన రైతులు ఎంతో నష్టపోతున్నారు.
కలుపు నివారణ మందులు వాడటం వల్ల నేలకు, పంటకు నష్టమనే అభిప్రాయం ఉంది కదా? 
ఆధునిక పరిజ్ఞానంవల్ల నష్టాలే కాదు ఉపయోగాలు కూడా ఉంటాయి. కలుపు మందులను ఉపయోగించే విధానం తెలుసుకుని సకాలంలో, జాగ్రత్తగా ఆ మందుల్ని చల్లడం వల్ల రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు అన్నిరకాల కలుపుమొక్కలు సమపాళ్లలో ఉన్న మాగాణి వరిలో కలుపు నిర్మూలించేందుకు ఎకరాకు 4కిలోల బ్యూటాక్లోర్‌ గుళికలు, నాలుగు కిలోల 2,4-డి ఇథైన ఎస్టర్‌ గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. వరి నాటిన 3 నుంచి 5 రోజులలో ఈ విధంగా చేస్తే రైతులు మంచి దిగుబడి సాధిస్తారు. ఈ కలుపును కూలీలతో తీయించాలంటే ఎకరాకు మూడు వేలకు పైగానే ఖర్చవుతుంది. కలుపు మందు కోసం కేవలం 300 ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ, ఇదే మందును వేరే పంటలకు వేస్తే మంచికి బదులు దుష్పరిణామాలు ఎదురవుతాయి. సరైన అవగాహనతో ఆధు నిక పరిజ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగించుకుంటే రైతులు తప్పక లబ్ధి పొందుతారు.
కలుపు మందులపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏం చేయాలి? 
కలుపును అదుపు చేయలేని కారణంగా మొత్తం దిగుబడిలో పది శాతాన్ని రైతులు నష్టపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే… మన దేశంలో ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు కలుపువల్ల నష్టపోతున్నారన్నమాట. ఆధునిక పరిజ్ఞానం సాయంతో దీన్ని నివారించుకుంటేనే రైతుల క ష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కలుపు మందుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచడమే అందుకు ఏకైక మార్గం. రైతులకే కాకుండా వ్యవసాయ అధికారులు, ఎరువులు-క్రిమి సంహారక మందుల డీలర్లకు కలుపు నివారణ మందుల వినియోగంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. వీరిని రైతులు తరచూ కలుస్తారు కాబట్టి తాజా సమాచారం వాళ్లద్వారా రైతులకు చేరే అవకాశం ఉంటుంది.

అమెరికాలో సదరన వీడ్స్‌ సైన ్స పరిశోధన కేంద్రంలో ఆధునిక శిక్షణ పొందారు. పలు కలుపు యాజమాన్య పద్ధతుల్ని గమనించారు. అభివృద్ధి చెందిన దేశాలు కలుపు యాజమాన్యంలో ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నాయి?

ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఆవిష్కరణల్లో 1944లో కనుగొన్న కలుపుమందు కూడా ఒకటి. పెరుగుతున్న జనాభాకు అనుగుణ ంగా వ్యవసాయ దిగుబడులను పెంచడంలో కలుపు మందుల పాత్ర గణనీయంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కలుపు మందులను బాగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో తలసరి కలుపు మందుల వినియోగం 20 గ్రాములు కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 250 నుంచి 500 గ్రాములదాకా ఉంది. జపానలో ఏకంగా రెండు కిలోల కలుపు మందు వాడుతున్నారు. ఆ దేశాల్లోని రైతుల్లో అక్షరాస్యత అధికంగా ఉండటం, కలుపు మందుల్ని తట్టుకునే జన్యుమార్పిడి పంటల సాగు ఎక్కువగా ఉండటం కూడా వీటిని విస్తృతంగా వినియోగించడానికి కారణం. కలుపు మందులను ఎలా, ఎప్పుడు, ఎంత మోతాదులో, ఏ పంటకు, ఏ మందు వేయాలనే అంశాలపై మన దేశంలోని రైతులలోనూ అవగాహన పెంపొందిస్తే వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి సాధించడం తథ్యం.
– స్పెషల్‌ డెస్క్‌ 

ప్రొఫెసర్‌ ఎ.ఎస్‌.రావు 
ఆచార్య ఎన.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్‌ అధికారి

Credits : Andhrajyothi

కునప జలానికి కేరళ పెద్దపీట

Vrikshayurveda Organic Farming - Sakshi

‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్న కునపజలం ద్రావణాన్ని సేంద్రియ సాగులో వినియోగించమని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సిఫారసు చేస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా దీనిపై అధ్యయనం చేసి, సంతృప్తికరమైన ఫలితాలు పొందిన తర్వాత కేరళ శాస్త్రవేత్తలు దీని వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గ్రేటర్‌ నోయిడాలో ముగిసిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌ను సందర్శించిన వారికి కునపజలం గురించి ప్రత్యేకంగా వివరించడం విశేషం. కునప జలాన్ని రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. మాంసం/గుడ్లతో ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’.. పశువులు తినని కలుపు మొక్కల ఆకులతో ‘హెర్బల్‌ కునపజలం’ తయారు చేసి వాడుకోవచ్చని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది...

నాన్‌ హెర్బల్‌ కునపజలం
కావలసిన పదార్థాలు: మాంసం/చేపలు : 2 కిలోలు లేదా 25 కోడిగుడ్లు; ఎముకల పొడి : 1 కిలో; వరి పొట్టు : 1 కిలో; కొబ్బరి చెక్క : 1 కిలో; మొలకెత్తిన మినుములు: అర కిలో (మినుముల మొలకలు దొరక్కపోతే పెసల మొలకలు వాడొచ్చు); నీరు : 85 లీటర్లు; తాజా ఆవు పేడ (దేశీ ఆవు పేడ శ్రేష్టం) : 10 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు; తేనె : పావు కిలో; నెయ్యి : పావు కిలో ; బెల్లం : 2 కిలోలు; పాలు : 1 లీటరు

తయారీ పద్ధతి : ఐదు లీటర్ల నీటిలో మాంసం లేదా చేపలు లేదా కోడిగుడ్లు + ఎముకల పొడి + వరి పొట్టు + కొబ్బరి చెక్క + మొలకెత్తిన మినుములను వేసి ఉడకబెట్టాలి. ఇనప పాత్రను, ఇనప గంటెను వాడాలి. నీరు సగానికి తగ్గే వరకు ఉడకబెట్టాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దింపి, చల్లారబెట్టాలి. చల్లారిన ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్‌ డ్రమ్ములోకి పోయాలి. తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, తేనె, బెల్లం, నెయ్యి, పాలతోపాటు మిగిలిన 80 లీటర్ల నీటిని కూడా ప్లాస్టిక్‌ డ్రమ్ములో పోయాలి. ఈ ద్రావణాన్ని వెదురు కర్రతో రోజుకు మూడు సార్లు మూడేసి నిమిషాల పాటు కలియతిప్పండి. సవ్యదిశలో కొంత సేపు, వ్యతిరేక దిశలో మరికొంత సేపు తిప్పాలి. ఇలా 15 రోజులు ఇలా కలియతిప్పిన తర్వాత ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’ వాడకానికి సిద్ధమవుతుంది. లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల కునపజలాన్ని కలిపి.. ఆ ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి.

ప్రయోజనాలు: దీన్ని చల్లిన తర్వాత పంట మొక్కలకు, చెట్లకు వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది. కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. పండ్ల చెట్లపై పిచికారీ చేస్తే పండ్ల రుచి పెరుగుతుంది. పండ్లు, కూరగాయల రుచి, వాసన, నాణ్యత మెరుగుపడతాయి. పూల రంగు మెరుగై, ఆకర్షణీయంగా అవుతాయి.
ఉపయోగించేదెలా? : పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

హెర్బల్‌ కునపజలం
పశువులు తినని జాతి మొక్కల ఆకులతో హెర్బల్‌ కునపజలం తయారు చేసుకోవాలి. ఆకులు తుంచినప్పుడు పాలు కారని జాతులు, గడ్డి జాతికి చెందని మొక్కల ఆకులు వాడాలి. వావిలి, రేల, కానుగ, అడ్డసరం, టక్కలి, కుక్క తులసి (అడవి తులసి), గాలి గోరింత, గిరిపుష్టం (గ్లైరిసీడియా) తదితర జాతుల మొక్కల ఆకులు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు : ఆకులు  : 20 కిలోలు; దేశీ ఆవు తాజా పేడ : 10 కిలోలు; మొలకెత్తిన మినుములు : 2 కిలోలు; బెల్లం : 2 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు ; నీరు : 180 లీటర్లు

తయారీ పద్ధతి : సేకరించిన ఆకులను కత్తిరించి ఈనెలను తీసేయండి. ఆకుల ముక్కలను, పైన చెప్పుకున్న పదార్థాలను ఒక డ్రమ్ములో నాలుగు, ఐదు పొరలుగా వేయండి. 180 లీటర్ల నీరు డ్రమ్ములో పోయండి. వెదురు కర్రతో రోజుకు రెండు సార్లు 3 నిమిషాల పాటు.. సవ్యదిశలో కొంత సేపు, అపసవ్య దిశలో మరికొంత సేపు కలియతిప్పండి.  15 రోజుల తర్వాత వాడకానికి హెర్బల్‌ కునపజలం సిద్ధమవుతుంది.

పిచికారీ పద్ధతి :  వార్షిక పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. చొప్పున కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

గమనిక: కేరళ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, యువ రైతు అయిన సూరజ్‌ పప్పుధాన్యాల పిండితో తయారు చేసిన కునప జలాన్ని వాడుతున్నారు. మాంసం, గుడ్లు లేదా ఆకులకు బదులు పప్పుధాన్యాల పిండిని ఆయన వాడుతున్నారు. సూరజ్‌ను 085475 70865 నంబరులో సంప్రదించవచ్చు.

సేంద్రియ పంటలు..నిర్ధారిత సాగు పద్ధతులు!
సంపూర్ణ సేంద్రియ సేద్య రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ దిశగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణాత్మక కృషి చేపట్టింది. వివిధ పంటల సేంద్రియ సాగు పద్ధతులపై విస్తృత పరిశోధనల అనంతరం ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పేరిట 328 పేజీల సమగ్ర సంపుటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసింది. వరి, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు, కలప పంటలు, పత్తి సహా అనేక పంటల సేంద్రియ సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు.. కషాయాలు, ద్రావణాల తయారీ, మోతాదు, వాడే పద్ధతులు.. సేంద్రియ పద్ధతుల్లో పశువుల పెంపకం.. మేడలు మిద్దెలపై సేంద్రియ ఇంటిపంటల సాగు తదితర అంశాలను సమగ్రంగా ఇందులో పొందుపరిచారు. గ్రేటర్‌ నోయిడాలో ఇటీవల జరిగిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌లో ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పుస్తకాన్ని విక్రయించారు. ధర రూ. 300 (పోస్టేజీ అదనం). పోస్టు ద్వారా తెప్పించుకోదలచిన వారు సంప్రదించాల్సిన చిరునామా:

Director of Extention,
Kerala Agricultural University,
KAU Main Campus,
KAU P.O., Vellanikkara, NH- 47
Thrissur, Kerala – 680656
Phone No: 0487-2438011.

Credits : https://www.sakshi.com/news/family/vrikshayurveda-organic-farming-952397

మట్టే మన ఆహారం!

Earthworm is the pulse of the soil - Sakshi

భూమండలాన్నిభద్రంగా చూసుకోవటం..

మన కాలి కింది నేలతోనే ప్రారంభమవుతుంది!

మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్‌ మైక్రో బయాలజిస్ట్,      ఎకో సైన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (చెన్నై) అధినేత డా. సుల్తాన్‌ ఇస్మాయిల్‌.

రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్‌ సాయిల్‌) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్‌ కార్బన్‌) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది.

► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్‌ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్‌ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి.

► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం.

► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్‌/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్‌ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్‌/కంటెయినర్‌ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్‌. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి.

► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది.

► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి.

► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం.

► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్‌)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది.

► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి.

► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్‌) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్‌ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org.

Credits : https://www.sakshi.com/news/family/earthworm-pulse-soil-958293