- నీటి లభ్యతను బట్టే పంటలు సాగు
- శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే దిగుబడుల శాతం పెరుగుతుంది
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది రబీలో ఆరుతడి పంటల సాగు శ్రేయస్కరమని, వీలైనంత వరకు వరిని సాగు చేయకపోవడం మేలంటున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ బి.గోపాల్‌రెడ్డి. నీటి తడుల లభ్యతను బట్టి రబీలో రైతులు పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. రబీలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఏ పంటలు వేసుకోవాలి? అధిక దిగుబడులకు పాటించాల్సిన పద్ధతులు తదితర విషయాలపై ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ నేలలు రబీలో అధిక దిగుబడులకు అనువుగా ఉంటాయి?
రబీ సీజన్లో నేలల స్వభావం బట్టి మూడు రకాలుగా విభజించి రైతులు పంటలను సాగు చేసుకోవాలి. వర్షాధారంపై ఆధారపడిన నేలలు, నీటి పారుదల కింద ఆరుతడి పంటలు సాగుకు అనువుగా ఉన్న నేలలు, నీటి పారుదల, బోరు బావుల కింద వరిని సాగు చేసేందుకు అనువుగా ఉన్న నేలలను బట్టి రైతులు సాగుకు సన్నద్ధం కావాలి.
ఏ పంటల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది..?
వర్షాధారం కింద నల్లరేగడి భూముల్లో తెల్లకుసుమ, ధనియాలు, వాము పంటలను సాగు చేసేందుకు అనుకూలం. నీటి పారుదల కింద ఆరుతడి పంటల్లో వేరుశనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, మినుములు, పెసర పంటల సాగుకు అనుకూలం. పప్పుశనగ, కుసుమ, ధనియాలు, వాము పంటలను నేలలో తేమ స్వభావాన్ని బట్టి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కొర్రపంటను కూడా నీటి తడుల ఆధారంగా సాగు చేయవచ్చు. ఆవాలు కూడా మంచి దిగుబడులు వస్తాయి. కర్నూలు జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని బట్టి, నీటి లభ్యత ఆధారంగా 4-5 లక్షల హెక్టార్లల్లో పప్పు శనగను సాగు చేసే అవకాశం ఉంది.
రబీలో వరి సాగు అనుకూలంగా ఉంటుందా..?
ప్రస్తుత పరిస్థితిని బట్టి వీలైనంత వరకు వరిని రైతులు సాగు చేయకపోవడమే మంచిది. నీటి పారుదల కింద వరిని సాగు చేసే రైతులు నీటి లభ్యతను బట్టి మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను(కర్నూలు సోనా) సాగు చేయరాదు.
రబీ పంటల సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
రబీలో పంటల సాగులో విత్తన శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకరాకు జింక్ 20 కేజీల చొప్పున చల్లుకోవాలి. సింగిల్ సూపర్ పాస్పేట్ వాడని రైతులు సల్ఫర్ ఎరువును 8 నుంచి 10 కేజీల ప్రకారం ఎకరాకు వేసుకోవాలి. ఆయా పంటల్లో సోకే తెగుళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. శనగ పైరు తొలి దశలో పచ్చరబ్బరు పురుగు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలి. పెసర, మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విత్తుకోవాలి. శిలీంద్రనాశినితో, కీటక నాశినితో(ఇమడాక్లోఫ్రిడ్) విత్తనశుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగులను సకాలంలో నివారించుకొని పల్లాకు తెగులు రాకుండా జాగ్రత్త పడాలి.
ఆరుతడి పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి?
మూడు తడుల నీటి లభ్యత ఉంటే కందిని సాగు చేయాలి. విత్తన మోతాదు పెంచుకొని దగ్గర దగ్గరగా 3 నుంచి 4 అడుగుల దూరంలో విత్తుకోవాలి. సకాలంలో నీటి తడులను ఇవ్వాలి. నాలుగు తడుల నీటి లభ్యత ఉంటే మొక్కజొన్న సాగుకు ఎంతో అనుకూలం. మొక్కజొన్నలో మంచిపేరు ఉన్న హైబ్రీడ్ రకాలను ఎన్నుకోవాలి. పైరు నీటి ఎద్దడికి గురికాకుండా సకాలంలో నీటి తడులు ఇవ్వాలి. మూడు తడుల అవకాశం ఉంటే జొన్న పంటను రబీలో సాగు చేయవచ్చు. పైరు తొలి దశలో కాండం ఈగ ఆశించకుండా కార్పోఫిరాన్ గుళికలను వాడి నివారించుకోవాలి. రెండు తడులు ఇవ్వగలిగితే కొర్రపంటను కూడా సాగు చేయవచ్చు. రెండు తడుల నీటి లభ్యత ఉంటే ఆవాలు కూడా సాగు చేయవచ్చు. పప్పు శనగకు నీటి లభ్యత ఉంటే పంట 30-35 రోజుల మధ్య స్పీంకర్ల ద్వారా నీటిని అందిస్తే 15 నుంచి 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.
రబీలో పంటల సాగులో అనువైన రకాలు?
పప్పు శనగలో ఎన్‌బీఈజీ-49, ఎన్‌బీఈజీ -47, ఎన్‌బీఈజీ-3, ఎన్‌బీఈజీ-119, జేజీ-11, జాకీ-9218, కేఏకే -2, విహార్ రకాలు అనుకూలం. కందిలో ఆశ, లక్ష్మి, అమరావతి(ఎల్‌ఆర్‌జీ-52), వేరుశనగలో కదిరి-9, కదిరి-6, హరితాంధ్ర, ధరణి రకాలు, మొక్కజొన్నలో బీఎంహెచ్ -177తో పాటు స్వల్ప, మద్యకారిక రకాల్లో పేరెన్నికగన్న కంపెనీల విత్తనాలు, కొర్రలో ఎస్ఐఏ-3085, సూర్యనంది, ఆవాలులో క్రాంతి, పూసాబోల్డ్, పూసా ధరణి, పూసా వైభవ్, వరి కోసిన తరువాత సంఘం రకం రైతులు సాగు చేసుకోవచ్చు.
రైతులు ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా..:
నీటి లభ్యత ఉంటేనే వరి సాగు చేయాలి. లేదంటే వరి సాగు చేయవద్దు. ఆరుతడి పంటల వైపు రైతులందరూ దృష్టిసారించాలి. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
– ఆంధ్రజ్యోతి, నంద్యాల
‘‘దుక్కుల కాలం మొదలైందంటే దానర్థం.. మానవ నాగరికతకు ఊపిరిలూదే కళను అన్నదాత మొదలుపెట్టాడనే!’’
-డేనియల్ వెబ్‌స్టర్ (అమెరికా రాజనీతిజ్ఞుడు)