లోన్‌ తీసుకుంటే బీమా వున్నట్టే

రైతు పంట బీమాకి సంబంధించి రైతులకు అవగాహన లేక చాలా నష్టపోతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారందరికీ డిఫాల్ట్‌గా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనే కేంద్ర నిబంధనతో ఇప్పుడు ఏ బ్యాంకు నుంచైనా రైతులు రుణాలు తీసుకుంటే ఇన్సూరెన్స్‌ చెల్లించారన్నమాటే. దీనిని క్లెయిమ్‌ చేసుకోవాలన్నా తేలికే. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-2000- 5544కి కాల్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.
ఈ ఇన్సూరెన్స్‌ (ప్రస్తు తం చోళమండలం) కంపెనీ వారు రైతు పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, పేరు, గ్రామం, మండలం, జిల్లాతో పాటు ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు, ఏ కారణాలతో పంట నష్టం జరిగిందనే అంశాలు తెలుసుకొని మన క్లెయిమ్‌ను రిజిస్టర్‌ చేస్తారు. ఓ నంబర్‌ కూడా ఇస్తారు. పది రోజుల్లోగా సంబంధిత అధికారి మన పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతుకు డబ్బులు చెల్లించాలి. బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్‌ కట్‌ అవుతుంది. ఆ స్లిప్‌ను తీసుకోవాలి. మనం రుణం తీసుకున్న భూమిలో ఏ పంట వేస్తున్నామో, దానినే ఇన్సూరెన్స్‌ ఫారంలో నమోదు చేయాలి. పంట దెబ్బతింటే ఫోటోలు తీసి మండల వ్యవసాయ అధికారికి కూడా పంపించవచ్చు.
నిర్లక్ష్యం జరుగుతోంది ఇలా …
రుణం తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్‌ చెల్లించిన విషయం రైతులకు అధికారులు చెప్పడం లేదు. దానికి సంబంధించిన స్లిప్పు ఇవ్వడం లేదు. రుణం తీసుకున్న భూమిలో ఏ పంట వేస్తారన్న విషయాన్ని అధికారులు అడగడం లేదు. ఒకవేళ ఇన్సూరెన్స్‌ ఫారంలో నమోదు చేసిన పంట కాకుండా వేరే పంట వేస్తే ఇన్సూరెన్స్‌కు ఆ రైతు అనర్హుడవుతున్నాడు. వ్యవసాయాధికారులు ఏయే గ్రామాల్లో పంట నష్టం జరిగిందో పరిశీలించి ఇన్సూరెన్స్‌ అధికారులకు సమాచారమివ్వాలి. ఆ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసేలా చూడాలి. కానీ అలా జరగడం లేదు. ఈ అంశాలను దృష్టిలో వుంచుకుని రైతులంతా తప్పనిసరిగా పంట బీమా చేయించాలి. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేవారు కూడా పంట బీమా తీసుకునే అవకాశం వుందని గుర్తుంచుకోవాలి.
Credits : Andhrajyothi

రైతుకు రెట్టింపు రాబడిలా?

 • ఉత్పాదకత పెంచాలి…
 • నష్టాలు నివారించాలి..
 • అనుబంధ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి..
 • కేంద్రం ఏడడుగుల వ్యూహం ఖరారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. భాగస్వాములందరితో చర్చించి వ్యవసాయ శాఖ ఏడు సూత్రాలతో వ్యూహాన్ని రచించింది. శుక్రవారం వాటిని వెల్లడించింది.
ఉత్పాదకత పెంచాలి
ఉత్పాదకత పెంచాలంటే సాగునీటి వసతి పెరగాలి. కేంద్రం ‘’ఒక బొట్టుకు అధిక పంట’’ నినాదంతో పనిచేస్తూ ఇరిగేషన్‌ బడ్జెట్‌ను కూడా పెంచింది. ప్రతీ సాగు భూమికి నీరందించాలన్న ఉద్ధేశంతో ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెండింగ్‌లో ఉన్న మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. వాటర్‌షెడ్‌ అభివృద్ధి, నీటి సంరక్షణ, నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయతలపెట్టింది.
 
ఖర్చులు తగ్గాలి
భూసారం గురించి రైతులు తెలుసుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూపరీక్షలు చేస్తూ భూసార హెల్త్‌ కార్డులను అందజేస్తోంది. దాన్ని బట్టి రైతులు భూమిలో ఏ పంట వేయాలి, ఎంత మోతాదులో ఎరువులను వేయాలన్నది నిర్ణయించుకోవాలి. తద్వారా ఖర్చులు తగ్గుతాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. వేప నూనె పూత యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కిసాన్‌ కాల్‌ సెంటర్‌, కిసాన్‌ సువిధా యాప్‌ ద్వారా కేంద్రం ఇస్తున్న సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలి.
పంట నిల్వ నష్టాలు
పంట చేతికొచ్చిన తర్వాత రైతులకు అధికంగా నష్టం జరుగుతోంది. పంటను నిల్వ చేసుకోడానికి వసతుల్లేక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీన్ని నివారించడానికి గోదాముల వినియోగాన్ని ప్రభుత్వం పోత్సహిస్తోంది. గోదాములకు పలు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోదాములను, కోల్డ్‌ స్టోరేజ్‌ చైన్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది.
అదనపు విలువ
ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పంట నాణ్యత పెరుగుతుంది. ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన పథకానికి కేంద్రం రూ.6వేల కోట్లను కేటాయించింది. ప్రాసెసింగ్‌ సామర్థ్యం పెంచడానికి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20లక్షల మంది రైతులకు లబ్ధి, 5లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
 
వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు
వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తోంది. ఈ-నామ్‌ వ్యవస్థను 445 మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది. మరిన్ని మార్కెట్లకు దీన్ని విస్తరించాలి. ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసుకోడానికి అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) చట్టాన్ని సవరించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పింది.
నష్టాలు, భద్రత, సహకారం
ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టానికి పరిహారం చెల్లించడానికి కేంద్రం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రవేశపెట్టింది. దీన్ని మరింత విస్తరించాలి. పంట నష్టాన్ని అంచనా వేయడానికి స్మార్ట్‌ఫోన్లు, శాటిలైట్‌ ఇమేజ్‌, డ్రోన్లు తదితర నూతన టెక్నాలజీ వినియోగం. ప్రీమియంను చెల్లించడానికి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సదుపాయాం కల్పించాలి. ఈ పథకం వల్ల పరిహారం 1.5 రేట్లు పెరిగింది.
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు:
ఉద్యాన పంటలు: ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధి పథకం ద్వారా మంచి మొలకలు, విత్తనాలు తదితర అవసరాల సరఫరా.
సమీకృత వ్యవసాయం: అన్ని అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను అనుసంధానం చేయాలి. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా కరువు, వరదల ప్రభావం పెద్దగా ఉండదు.
శ్వేత విప్లవం: రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కింద మెరుగైన బ్రీడ్‌ ఆవులను సంరక్షించుకోవడం. డెయిరీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోంది. నీలి విప్లవం, ఆగ్రోఫారెస్ట్రీ, పౌల్ట్రీ, తేనెటీగల పెంపకంపై రైతులు దృష్టి సారించాలి. వీటికి కేంద్రం సహకారం అందిస్తుంది.
Credits : Andhrajyothi

‘వాటర్‌ బడ్జెట్‌’ రైతుకు వరం

వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు సుమారు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుంది. సంవత్సరంలో సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం పడే ప్రాంతాలలో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడురెట్ల నీటిని ఒక పంటకాలంలోనే మనం వాడుతున్నాం. అంటే ఎకరా వరి పండించడానికి ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపు నీటిని ఒకే పంట కాలంలో వాడుకుంటున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 సంవత్సరాలు పడే వర్షపు నీటిని మనం వాడేసినట్టే.

స్థానిక వర్షపాతం, భూమి తత్త్వం, వాననీటి సంరక్షణ ఆధారంగా పంట ప్రణాళిక, సాగు పద్ధతులను రూపొందించుకోవాలి. ఇదే వాటర్‌ బడ్జెట్‌.

– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త, హైదరాబాద్‌

 

తరచూ కరువు బారినపడి పంట నష్టపోతున్న రైతులను, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి, నీళ్లు మోసుకొచ్చే మహిళలను ప్రతి వేసవిలో మనం చూస్తూంటాం. అదే సమయంలో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పంటలు మునిగిపోయి రైతులు పంట నష్టపోవడాన్నీ చూస్తున్నాం. వర్షాల కోసం రుతుపవనాల మీద ఆధారపడే భారతలాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి దాచుకుని, అవసరమైనప్పుడు వాడుకునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల ఏళ్లుగా మన దేశంలో చెరువులు, కుంటలు లాంటివి ఇందుకోసం ఏర్పాటు చేసుకుని సమర్థంగా నిర్వహిస్తున్న అనుభవాలున్నాయి. అయితే కాలక్రమేణా బోరుబావులు, ఆనకట్టలు, వాటి కాల్వలద్వారా వచ్చే నీటికి అలవాటు పడటంతో ఇవన్నీ పనికిరాకుండా పోయాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం.
ఒక మిల్లీమీటరు వర్షం కురిసినప్పుడు హెక్టారు భూమిలో సుమారు పదివేల లీటర్ల నీరు చేరుతుంది. అంటే 500 మిల్లీమీటర్ల వర్షం పడే ప్రాంతాలలో కూడా హెక్టారుకు 50 లక్షల లీటర్లు అంటే ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు చేరుతుంది. ఇందులో భూమిలోకి ఇంకిన భాగంగాక మిగిలిన నీరు బయటకు ప్రవహించి మురుగ్గుంటల్లో కలవడమో, ఆవిరి కావడమో జరుగుతున్నది. ఇందులో మూడొంతుల నీటిని కాపాడుకోగలిగితే ఒక పంటను సునాయాసంగా పండించుకోవచ్చు. నేల స్వభావం కారణంగా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ అంశం కూడా భూమిలోకి తక్కువ నీరు చేరడానికి కారణమవుతున్నది. భూమి గట్టిపడటంతో నీరు ఇంకడం తగ్గిపోతున్నది.

భూమి గట్టిపడటానికి కారణాలు

 • భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం.
 • ట్రాక్టర్‌తో దున్నటంవల్ల గట్టిపొర ఏర్పడటం.
 • పంట కోత యంత్రాల బరువువల్ల నేల గట్టి పడటం.
 • రసాయన ఎరువుల అధిక వాడకం, ఫిల్లర్‌ పదార్థాలవల్ల భూమిలోని సూక్ష్మ రంధ్రాలు, దారులు మూసుకుపోవటం.
 • ఈ అంశాల దృష్ట్యా వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని, భారీ యంత్రాల వినియోగాన్ని తగ్గించుకోవటం అవసరం. అలాగే సేంద్రియ పదార్థాల వినియోగం పెంచుకోవటం వల్ల భూమిలోకి ఎక్కువ నీరు ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పంట సరళిలో మార్పు ముఖ్యం
ఆధునిక వ్యవసాయంతో పంటల సరళిలో వచ్చిన మార్పుతో ఎక్కువ నీటి వినియోగం ఉండే పంటల వైపు, సాగు విధానాల వైపు రైతులు మళ్లుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుత పద్ధతిలో వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు 60లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది. ఏడాదిలో 500 మిల్లీమీటర్ల వర్షంపడే ప్రాంతాల్లో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడు రెట్ల నీటిని ఒక పంటకాలంలోనే ఖర్చుచేస్తు న్నాం. అంటే ఎకరా వరి పంటకు ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపునీటిని ఒకే పంటకు వాడుతున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 ఏళ్ల వర్షపునీటిని వాడేసినట్టే. మరోవిధంగా మన పొలం చుట్టుపక్కల 30 ఎకరాల్లో పడిన నీటిని వాడుకున్నట్టే! అందుకే పంట ప్రణాళిక, సాగు పద్ధతులకు స్థానిక వర్షపాతం, భూత త్త్వం, వాననీటి సంరక్షణను ఆధారం చేసుకోవా లి. ఇదే వాటర్‌ బడ్జెట్‌. సగటు వర్షపాతం కో స్తాంధ్రలో1,094, తెలంగాణలో961, రాయలసీమలో 680మిల్లీ మీటర్ల మేర ఉంది. ఇందులో చాలాభాగం వర్షపునీటిని చక్కటి పంట ప్రణాళిక, సాగు పద్ధతులతో సంరక్షించుకోవచ్చు.

ఇందుకోసం రైతులు ప్రధానంగా చేయాల్సింది

 • ఎక్కడ పడిన వర్షం అక్కడే ఇంకటానికి వీలుగా పొలంలో బోదెలకు చిన్నచిన్న అడ్డుకట్టలు వేసుకోవాలి.
 • పొలంలో పల్లం ఉన్న పాంతంలో సుమారు అడుగు వెడల్పు, ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు లోతులో ట్రెంచలు చేసుకోవాలి.
 • వీటి ద్వారా సగం నీరు భూమిలో ఇంకుతుంది అనుకుంటే బయటకు ప్రవహించి, వృథా అయ్యే నీటిని సంరక్షించుకునేందుకు నీటి కుంటలు తవ్వుకోవాలి.
 • వృథాగా పోయే నీటిని నిలబెట్టుకుని, సంరక్షించుకోవటం కోసం అడ్డుకట్టలు కట్టుకోవాలి.
 • వాలుకు అడ్డంగా దున్నుకోవటం, గట్టు వేసుకోవటం, పక్కనే ట్రెంచలు చేసుకోవడం ప్రధానం.
 • భూమిలో సేంద్రియ పదార్థం పెంచుకోవడం కోసం ఎకరాకు కనీసం 4 టన్నుల జీవ పదార్థాలు వేసుకోవాలి.
 • ఈదురు గాలులు, వేడిగాలులవల్ల పెరిగే నీటి ఆవిరిని తగ్గించటం కోసం పొలం గట్లమీద మొక్కలునాటి పెంచాలి.
– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు,
సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త,
హైదరాబాద్‌
Credits : Andhrajyothi

చిన్నరైతుకు పట్టు సిరులు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు రైతులు మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టుసాగును మరింత ఆకర్షిణీయంగా మార్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వారావుపేట, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో రైతులు మల్బరీ సాగుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన 60 మంది రైతులు 145 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. ప్రభుత్వం మల్బరీ సాగుపై ప్రత్యేక శద్ధ చూపడం, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరింతమంది రైతులు పట్టు సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.
పట్టు సాగు వల్ల ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. నీటి వసతి తక్కువగా వున్న ప్రాంతాల్లో కూడా, అతి తక్కువ పెట్టుబడితో దీనిని సాగు చేయవచ్చు. చౌడు, నల్లరేగడి భూములు మినహా మిగతా అన్ని రకాల భూముల్లో, అన్ని కాలాల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా మంచి ఆదా యం పొందే వీలు కూడా వుండటంతో పలువురు రైతులు పట్టు సాగు చేపడుతున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం ద్వారా పట్టు పురుగుల పెంపకం గది(షెడ్డు) నిర్మాణానికి రూ.1.03 లక్షలు అందిస్తోంది.
సాగు ఖర్చుల కోసం మొదటి ఏడాది రూ.50,468, రెండో ఏడాది రూ.44,269 చొప్పున రైతుకు ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ, సన్న చిన్న కారు రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి రూ.3.49 లక్షలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటను రెండు లేదా మూడు భాగాలుగా సాగు చేస్తే ఏడాదిలో 10-11 పంటలు తీసే వీలుంటుంది. ఆధునిక పద్ధతులలో రేరింగ్‌ గది నిర్మించి తగినన్ని పరికరాలు ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరి, జనగామ జిల్లాలోని జనగామలో పట్టుగూళ్లు మార్కెట్లున్నాయి. ఇక్కడ గూళ్ల నాణ్యతను బట్టి ధరలుంటాయి. బీవీ పట్టు గూళ్లపై కిలో రూ.75, సీ, బీ, గూళ్లపై కిలో రూ.40 ప్రభుత్వం ప్రోత్సాహంగా అందజేస్తోంది. ఏడాదికి 20-30 వేలు పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు వరకు సంపాదించుకొనేందుకు అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
అధిక లాభాలు
ఎకరంలో మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచడం వల్ల 45 రోజుల్లోనే రూ. 2.84 లక్షలు ఆదాయం వచ్చింది. గతంలో పత్తి సాగు చేసేవాడిని. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఈ ఏడాది పట్టు సాగు చేశా. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయం మల్బరీ పంట.
ఎం.ముకుందరెడ్డి, లక్ష్మీపురం రైతు
మల్బరీ సాగు మేలు
సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు ఎంతో లాభదాయకం. పెట్టుబడి తక్కువ. ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది. పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి, పట్టు గూళ్లు పెంచకోవడం శ్రేయస్కరం.
credits : AndhraJyothi 02-03-2018