‘ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి మించిన దైవ పూజ లేదు’ అన్న వివేకానందుడి స్ఫూర్తితో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడో కుర్రాడు. తన కోసం తాను కాకుండా అభాగ్యుల కోసం బతుకుతున్నాడు ‘గౌతమ్ కుమార్’. ‘సర్వ్ నీడీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆకలికి చిరునామాగా మారటం దగ్గరే ఆగిపోలేదతను. ఆపన్నహస్తం కోసం అర్రులు చాచే అభాగ్యులను గాలించి, ఆదరించి, అక్కున చేర్చుకుంటున్నాడు.
‘లేవటం, తినటం, ఉద్యోగానికి పరిగెత్తటం, నిద్రపోవటం….ఇదేనా జీవితం? ఇలా నా కోసం నేను బతికి ప్రయోజనమేంటి? ఇతరుల కోసం నేను బతికేదెప్పుడు? ఇలాంటి అంతర్మథనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక ఆలోచన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి మానవ సేవ వైపు నన్ను నడిపించింది’…సర్వ్ నీడీ స్థాపనకు గౌతమ్ చెప్పిన కారణమిది! చిత్తూరు జిల్లా కలిగిరి దగ్గర చిన్న పల్లెటూరిలో పుట్టిన గౌతమ్ బాల్యం అక్కడే గడిచింది. తండ్రి వెంకటరమణా రెడ్డి సిఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫోర్స్)లో పని చేసేవారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావటంతో కుటుంబాన్ని వెంటబెట్టుకుని ఉత్తర భారతదేశమంతా తిరిగారు. గౌతమ్ తల్లి లలిత గృహిణి. గౌతమ్‌కు అనూష అనే చెల్లి కూడా ఉంది. అలా తల్లితండ్రులతో కలిసి ఊళ్లు తిరుగుతూనే ఎమ్సిఏ పూర్తి చేసిన గౌతమ్ నోయిడా, బెంగుళూరుల్లోని బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేశాడు.
చక్కని ఉద్యోగం, మంచి జీతం. అయినా గౌతమ్‌కి ఏదో అసంతృప్తి. మానవ సేవ చేయాలనే ఆలోచనతో పిన్నితో కలిసి హైదరాబాద్ వచ్చి ఓ స్వచ్ఛంద సంస్థలో చేరాడు. కానీ అక్కడా తృప్తి దొరకలేదు. అక్కడ స్పృశించలేని కోణాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం అభాగ్యులుండే ప్రదేశాలను వెతికాడు. ఆ పరిస్థితికి కారణం వాళ్ల నుంచి తెలుసుకుంటేనే సమస్య మూలాలను చేరుకోవచ్చనేది గౌతమ్ ఆలోచన. ఆ ప్రయత్నంలో ‘వాళ్లని నమ్మలేం రా! దగ్గరికి వెళ్లొద్దు, గాయపరుస్తారు’ అని చెప్పే అమ్మ మాటలు ఖాతరు చేయలేదు. ఆ క్రమంలో రోజులపాటు పస్తులుండి శుష్కించి నీరసించిన వాళ్లు కనిపించారు. గాయాలకు పురుగులు పట్టి, ప్రాణాలను గాలికొదిలేసిన వాళ్లు కనిపించారు. అనాథలైన చిన్నారులూ దొరికారు.
అన్నదాతా సుఖీభవ
అసలు సమాజంలో ఎన్ని వర్గాల అభాగ్యులున్నారు? అనే ఉత్సుకతతో మొదలైన గౌతమ్ ప్రయాణంలో అతనికి మతిస్థిమితం లేనివాళ్లు, దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు, గాయాలతో మరణానికి చేరువవుతున్నవాళ్లు, అనాథ శవాలు…ఇలా ఎన్నో వర్గాలు కనిపించాయి. మరి సేవ అంటే…అన్ని రకాల సేవలూ చేయాలి. ఏ ఒక్కదానికో పరిమితమైతే మిగతా సమస్యల మాటేమిటి? ఇలా ఆలోచించిన గౌతమ్ వేర్వేరు సమస్యల కోసం వేర్వేరు ప్రాజెక్టులు తయారు చేసుకున్నాడు. ‘‘అన్నిటికంటే మొదటి సమస్య…ఆకలి. ఆకలి చాలా భయంకరమైనది. ఆకలి ప్రాణాలను తీస్తుంది, తీసుకునేలా చేస్తుంది. ముందు దాన్ని తీర్చాలి. కానీ జీవితం సినిమా కాదు. అనుకున్న వెంటనే చకచకా జరిగిపోవటానికి. ఫండ్స్ లేవు, స్పాన్సరర్లు లేరు. అందుకే అంతమంది ఆకలి తీర్చటం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లా’’ అని చెప్పారు గౌతమ్. మొదట్లో భుజాల మీదకు భారమెత్తుకున్నా తర్వాత స్పాన్సరర్లు, ఫంక్షన్ హాళ్ల సహాయం తీసుకోవటం మొదలుపెట్టాడు. అలా 2015లో హైదరాబాద్‌లోని ఖార్ఖానాలో ‘సర్వ్ నీడీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అన్నదాతతో మొదలుపెట్టి తన ప్రాజెక్టులను పెంచుకుంటూ పోయాడు గౌతమ్.
అంతులేని సేవలు
అన్నదాత: ఆకలి తీర్చే కార్యక్రమం అన్నదాత ద్వారా ఇప్పటిదాకా 525 రోజుల్లో 3 లక్షల మంది ఆకలి తీర్చిన గౌతమ్…ఇప్పటికీ ప్రతి రోజూ 500 నుంచి వెయ్యి మందికి భోజనం పెడుతున్నాడు. ఒక్కరోజులోనే 5 వేల మంది ఆకలి తీర్చిన సందర్భాలున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఫంక్షన్ హాళ్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు, స్పాన్సరర్లు ఇచ్చే నిధులను ఉపయోగిస్తూ ఉంటాడు. ఉన్న నిధులు, సమకూరిన ఆహారాన్నిబట్టి అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, చిన్న పిల్లల అనాథాశ్రమాలు, మానసిక వ్యాధిగ్రస్థుల ఆస్పత్రులు, వితంతువుల ఆశ్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, క్యాన్సర్ ఆస్పత్రులు, మురికివాడలు, వీధులు….ఇలా ఆకలి ఎక్కడుందో ఆ ప్రాంతానికి చేరుకుంటారు సర్వ్ నీడీ వాలంటీర్లు.
సేవ్ ఎ లైఫ్: చికిత్స అందక గాయాలకు పురుగులు పట్టి ప్రాణాలను గాలికొదిలేసిన అభాగ్యులకూ ఆసరా అందిస్తున్నారు. వాళ్లకు చికిత్స చేయటానికి ఆస్పత్రులు నిరాకరిస్తే, గాయాలను స్వయంగా శుభ్రం చేసి నయం చేస్తారు. ‘సేవ్ ఎ లైఫ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా తప్పిపోయిన వాళ్లను కనిపెట్టి వాళ్లను కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుస్తారు. అప్పటిదాకా వాళ్లను అనాథ శరణాలయాల్లో చేర్పిస్తారు.
అనాధలకు అంతిమ సంస్కారాలు: అనాథ శవాల అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తుందీ స్వచ్ఛంద సంస్థ. అంతిమ సంస్కారాలు చేయటంతో ఆగిపోకుండా, వారి వారి మత విశ్వాసాలకు తగ్గట్టు, చితాభస్మాన్ని, అస్థికలను నదుల్లో కలపటం లాంటివి, పిండ ప్రదానం కార్యక్రమాలు కూడా చేస్తారు వాలంటీర్లు. సర్వ్ నీడీ సేవల కోసం 2 వ్యాన్లు, ఐదుగురు స్టాఫ్ ఉన్నారు. వీళ్లతో దాదాపు 15 మంది వాలంటీర్లు కూడా కలిసి సేవలు పంచుకుంటూ ఉంటారు.
కుటుంబ సహకారం…
36 మంది అనాథ పిల్లలకు ఆశ్రయమిస్తోంది సర్వ్ నీడీ. ఈ అనాథ శరణాలయంలో చక్కని భోజనం, చదువు, ప్రేమ నిండిన వాతావరణంలో ఆరోగ్యంగా పెరుగుతున్నాయా లేత మొక్కలు. సాధారణంగా సమాజ సేవ చేస్తానంటే వెనక్కి లాగే కుటుంబ సభ్యులే ఎక్కువ. కానీ గౌతమ్ విషయంలో ఇది పూర్తి విరుద్ధం. కొడుకుకి కుటుంబమంతా చేదోడు వాదోడుగా మారింది. తండ్రి గౌతమ్ సేవల్లో పాలు పంచుకోవటం కోసం సర్వీసులో ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. తల్లితండ్రులు, చెల్లి గౌతమ్‌తో చేతులు కలిపి అభాగ్యుల బాగోగుల కోసం అంకితమైంది. అమ్మ, నాన్న, చెల్లి అనూష..అందరూ సర్వ్ నీడీ సేవల్లో భాగస్వాములే! కాబట్టే ఇన్ని రకాల సేవలను ఒంటి చేత్తో చేయగలుగుతున్నానంటున్నాడు గౌతమ్. ఇక సర్వ్ నీడీ హోమ్‌ను సాధారణ వ్యక్తులతోపాటు ప్రముఖులూ సందర్శిస్తూ ఉంటారు. అక్కడ ఆ అనాథ పిల్లల మధ్య పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు.
స్వార్థాన్ని జయించిన సేవాతత్వం
స్వచ్ఛంద సేవలో పారదర్శకత, నిజాయితీ ఉండాలి. సేవ చేయటం ఒక ఎత్తైతే, దాన్ని నిలబెట్టుకోవటం పెద్ద పరీక్ష. ఏదో ఒక సమయంలో స్వార్థం మనల్ని కబళించి సేవ నుంచి తప్పుకునేలా చేస్తుంది.ఆ అల వెళ్లిపోయేవరకూ నిలబడగలిగితే ఇక ఎటువంటి అడ్డంకీ ఉండదు. నేనూ ఇలాంటి పరీక్షను ఎదుర్కొన్నాను. ఇక స్వచ్ఛంద సేవల గురించి ప్రజల్లో ఎన్నో అనుమానాలుంటాయి. వాళ్ల నమ్మకాన్ని చూరగొనాలంటే చేసే పనిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే వాళ్లు జేబులో నుంచి కాకుండా, మనసులో నుంచి డబ్బులు ఇస్తారు. జేబులో నుంచి వచ్చే సహాయం తాత్కాలికం. అదే..మనసులో నుంచి వచ్చే సహాయం శాశ్వతం.