భూమి బాగుంటేనే రైతు బాగుండేది!

The farmer would be good if the land was good! - Sakshi

నాలుగేళ్లుగా మామిడి తోటలో దుక్కి చేయలేదు

సొంత విత్తనంతోటే వరి సాగు

ప్రకృతి సేద్యంతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రాములు

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న  పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు.

నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌  మండలంలోని తుంగూర్‌ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్‌ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు.

బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్‌లో జరిగిన పాలేకర్‌ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు.

దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్‌ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు.

చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.

రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే!
ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను.

– మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్‌పూర్‌(మం.), జగిత్యాల జిల్లా

Credit : https://www.sakshi.com/news/family/farmer-would-be-good-if-land-was-good-954471

మట్టే మన ఆహారం!

Earthworm is the pulse of the soil - Sakshi

భూమండలాన్నిభద్రంగా చూసుకోవటం..

మన కాలి కింది నేలతోనే ప్రారంభమవుతుంది!

మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్‌ మైక్రో బయాలజిస్ట్,      ఎకో సైన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (చెన్నై) అధినేత డా. సుల్తాన్‌ ఇస్మాయిల్‌.

రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్‌ సాయిల్‌) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్‌ కార్బన్‌) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది.

► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్‌ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్‌ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి.

► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం.

► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్‌/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్‌ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్‌/కంటెయినర్‌ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్‌. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి.

► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది.

► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి.

► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం.

► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్‌)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది.

► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి.

► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్‌) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్‌ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org.

Credits : https://www.sakshi.com/news/family/earthworm-pulse-soil-958293

పుట్టగొడుగులతో పూల బాట!

Flower bush with mushrooms! - Sakshiపుట్టగొడుగుల సాగు

రోజూ ఆదాయాన్ని అందించే పుట్టగొడుగుల సాగు

ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగానికి స్వస్తిచెప్పి 20 ఏళ్లుగా గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ

గ్రామీణ యువత వ్యవసాయానికి దూరం కాకుండా ఉండాలంటే అనుదినం ఆదాయాన్నందించే పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వటం ఉత్తమమని తలచాడు తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. తాను ప్రభుత్వోద్యోగం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రచారం చేయటం సరికాదని గ్రహించి.. ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు! పుట్టగొడుగుల సాగే తన జీవనాధారం చేసుకుని ఇరవయ్యేళ్లుగా ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

వ్యవసాయానికి దూరమవుతున్న గ్రామీణ యువతకు నిరంతరం ఆదాయాన్ని అందించే జీవనోపాధి చూపాలన్న తపన సుందరమూర్తిని ఉద్యోగంలో నిలవనివ్వలేదు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని గూడపాక్కం గ్రామానికి చెందిన ఆయన ఎమ్యే పీహెచ్‌డీ పూర్తిచేసి.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, సర్వశిక్ష అభియాన్‌ సమన్వయకర్తగా పనిచేశారు. 22 ఏళ్ల క్రితం ఒక రోజు క్లాసులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి లేదని గ్రహించారు.

తక్కువ ఖర్చుతో నిరంతర ఆదాయాన్ని పొందేలా వ్యవసాయం చేసే మార్గాలను గ్రామీణ యువతకు తెలియజెప్పాలని తలపెట్టాడు. తాను చీకూ చింతా లేని ఉద్యోగం చేసుకుంటూ ఎదుటి వారికి వ్యవసాయం గురించి చెప్పటం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో ఉద్యోగాన్ని కూడా వదిలెయ్యాలన్న ఆలోచన వచ్చింది. భార్య మీనాక్షికి చెప్పటంలో ‘పిల్లలు లేరు. ఆర్థిక భద్రత ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తానంటే ఎలా’ అని ఆమె ప్రశ్నించారు.

చివరికి ఆమెను ఒప్పించి.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే సాయంత్రం సమయంలో పుట్టగొడుగుల సాగుపై అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించారు. పట్టణవాసులు పుట్టగొడుగుల వాడకంపై ఆసక్తి కనపరుస్తున్నందున ఈ రంగాన్ని ఎంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చి1997లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని సుందరమూర్తి వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొంది రూ. 70 వేలతో రెండు ప్రత్యేక షెడ్‌లను ఏర్పాటు చేసుకుని.. అనుభవజ్ఞుల సాయంతో పుట్టగొడుగుల సాగులో మెళకువలను నేర్చుకున్నారు. ఎక్కువ డిమాండ్‌ వుండే పాలపుట్టగొడుగు, చిప్పి పుట్టగొడుగుల సాగు చేయడంతో పాటు విత్తనాలను ఉత్పత్తి చేసి విక్రయించారు. మరోవైపు యువతకు ఉచితంగానే శిక్షణ ఇచ్చారు.

చిప్పి రకం పుట్టగొడుగులు రుచి ఎక్కువగా వుంటుంది. మసాల పెద్దమొత్తంలో వేసినా వాటిని పీల్చుకునే శక్తి ఎక్కువ. మృదువుగానూ ఉంటుంది. ఈ రకమైన పుట్టగొడుగుల సాగు కోసం ప్రత్యేకంగా మరో  షెడ్‌ను ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తుండడంతో, తమ పుట్టగొడుగులను కొనడానికి  ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే ఆర్డర్‌లను తీసుకుని డోర్‌డెలివరీ కూడా ఇస్తుండటంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. భార్య మీనాక్షి తోడ్పాటుతో ప్రస్తుతం సుందరమూర్తి నెలకు 600 కేజీల నుండి 4 వేల కేజీల వరకు పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు. నెలకు రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతుండటం విశేషం.

యువతకు శిక్షణ ఇవ్వడంలోనే సంతృప్తి!
ముళ్ళ బాటను దాటితేనే పూల బాట వస్తుంది. సవాళ్ళను ఎదుర్కోకుండానే సక్సెస్‌ ఎలా అవుతాం అని ప్రశ్నించుకున్నా. కష్టమో నష్టమో వ్యవసాయం చేయాలనుకుని ఉద్యోగం వదిలేశాక.. మళ్ళీ వెనుకడుగు వేయలేదు. మొదట్లో కొంత భయపడ్డా తరువాత కుదురుకున్నా. ప్రతి నెలా వందలాది మంది రైతులకు, యువకులకు ఇరవయ్యేళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. పుట్టగొడుగుల సాగు చేయడం కన్నా వేలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తున్నది.
– సుందరమూర్తి, గూడపాక్కం, తిరువళ్లూరు,
తమిళనాడు   sundar1967@gmail.com
(వివరాలకు – రాజపాల్యం ప్రభు, 9655880425)
– కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు, తమిళనాడు


సంచితో వుంచిన పుట్టగొడుగులవిత్తనాలు, పుట్టగొడుగు

credits : https://www.sakshi.com/news/family/flower-bush-mushrooms-960507

ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న

Nature Farming is better than job - Sakshiరేగుమొక్కల కాయలను పరిశీలిస్తున్న వేణుగోపాలనాయుడు

ప్రకృతి సేద్యపద్ధతిలో 4 ఎకరాల్లో పశుగ్రాసం, ఎకరంలో వరి,15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ సాగు

తక్కువ ఖర్చుతో సంతృప్తికరమైన ఆదాయం

ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్‌లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్‌తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు.

ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్‌ బెర్‌ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్‌ ద్వారా అందిస్తున్నారు.  ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు.

రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్‌ బెర్‌ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్‌ బెర్‌ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్‌ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు.

– పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా

Credits : https://www.sakshi.com/news/family/nature-farming-better-job-1038143

కళాత్మక వరి పొలం!

Artful rice field! - Sakshi

అగ్రి టూరిజం

చేస్తున్న పనికి కళను, సృజనాత్మకతను జోడిస్తే చాలు.. అద్భుతమైన కళాకృతులు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఈ సూత్రం కేన్వాసుకే కాదు.. పొలానికి కూడా వర్తిస్తుంది! వరి పొలానికి కళాకాంతులు అద్దితే.. అది సందర్శకులను ఆకర్షించే పర్యాటక స్థలంగా మారిపోతుంది. జపాన్‌లోని ఇనకటడె అనే గ్రామం రైస్‌ పాడీ ఆర్ట్‌కు పెట్టింది పేరు. డజన్ల కొద్దీ రంగు రంగుల దేశీ వరి వంగడాలను భారీ కళాకృతుల రూపంలో నాటి సాగు చేయడంతో పచ్చని వరి పొలాలు పర్యాటక స్థలాలుగా మారి కాసులు కురిపిస్తున్నాయి.

ఈ అగ్రి టూరిజం టెక్నిక్‌.. మహారాష్ట్రలోని దొంజె ఫట అనే గ్రామాన్ని సైతం పర్యాటక కేంద్రంగా మార్చి వేసింది. జపాన్‌లో సంచలనం సృష్టిస్తున్న పాడీ ఆర్ట్‌ గురించి ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్న.. పుణేకి చెందిన శ్రీకాంత్‌ ఇంగాల్‌హలికర్‌ అనే ఇంజనీర్‌ తన ఐదెకరాల వరి పొలంలో 40 మీటర్ల భారీ వినాయకుడు, తదితర కళాకృతులను రూపొందించారు. ఆకుపచ్చని వరి పొలంలో నల్లగా ఉండే వరి మొక్కలను నాటడం ద్వారా ఆహ్లాదకర దృశ్యాన్ని ఆవిష్కరించారు.

credits : https://www.sakshi.com/news/family/artful-rice-field-1043080

పసుపు తవ్వే పరికరం ఇదిగో..!

Harvester/digger For Turmeric, Ginger, Potato - Sakshi

తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి  పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం.

బెడ్‌ పద్ధతికి అనువుగా నూతన పరికరం..
ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్‌ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్‌ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు.

పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్‌ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు.

రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం..
పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం.

– ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా

ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను..
ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను.

– నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా

Credits : https://www.sakshi.com/news/family/harvesterdigger-turmeric-ginger-potato-1043082