జీడిమామిడికి కొత్త వంగడాల కళ

బాపట్లలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం 11 రకాల కొత్త జీడిమామిడి వంగడాలు రూపొందించింది. ఈ ఏడాది రైతులకు లక్ష జీడిమామిడి మొక్కలు అందించేందుకు బాపట్ల కేంద్రం సన్నాహాలు చేస్తున్నది.
జాతీయ జీడిమామిడి పరిశోధన పథకం కింద బాపట్ల పరిశోధన స్థానంలో 60 ఎకరాల్లో జీడిమామిడి చెట్లు విస్తరించి వున్నాయి. ఈ క్షేత్రంలో శాస్త్రవేత్తలు కొత్తరకాల వంగడాలను తయారుచేయటంతో పాటు ప్రాచుర్యం పొందిన వంగడాల మొక్కల అంటులను తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెట్ల నుంచి వచ్చే పంటను వేలంపాట ద్వారా విక్రయిస్తారు. పరిశోధనా స్థానం ఇప్పటివరకు 11 రకాల వంగడాలను విడుదల చేసింది. విడుదలైన వంగడాలలో బిపిపి-8 అత్యధిక ప్రాచుర్యం పొందింది. అధిక దిగుబడి ఇవ్వడంతో పాటు ఈ హైబ్రీడ్‌ రకం గింజ బరువు 7 నుంచి 8 గ్రాములు ఉంటుంది. దీంతో దీనికి జాతీయ వంగడంగా గుర్తింపు లభించింది. అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం రైతులు ఆసక్తి చూపుతున్నారు. నూతనంగా బిపిపి 10, బిపిపి 11 రకాలను కూడా విడుదల చేశారు. ఇవి కూడా అత్యధిక ప్రాచుర్యం పొందాయి. గత ఏడాది బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం నుంచి 50 వేల మొక్కలు అంటుగట్టి రైతులకు విక్రయించారు. ఈ ఏడాది లక్ష మొక్కలు టార్గెట్‌ పెట్టుకున్నట్లు సీని యర్‌ శాస్త్రవేత్త కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. జీడిమామిడికి ఆశించే పురుగు నివారణకు చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేయాకు దోమ : జీడిమామిడికి తేయాకు దోమ ఆశిస్తే లీటర్‌ నీటికి 0.6 ఎం.ఎల్‌ కరాటే మందును కలిపి పిచికారి చేసుకోవాలి. జీడిమామిడి ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది కాబట్టి ఈ రకం దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.
 
గింజతినే పురుగు : ప్రస్తుత దశలో గింజతినే పురుగు ఆశించే అవకాశం ఉంది. ప్రొఫినోఫాస్‌ మందును పిచికారీ చేసి నివారించుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Credits : Andhrajyothi

మేలు చేసే మినీట్రాక్టర్‌

కలుపు తీసేందుకు,   పురుగుల మందు చల్లేందుకు సకాలంలో కూలీలు దొరకక రైతులు చాలా సందర్భాల్లో నష్టపోతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే మినీ ట్రాక్టర్‌ రైతులకు వరంగా మారింది.
నాలుగు లక్షల రూపాయల ధర ఉన్న ఈ మినీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నది. ముఖ్యంగా పత్తి, కంది, చెరుకు పంటలలో, మామిడి తోటలు పూల తోటలలో కలుపు తీస్తుంది. పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిస్తుంది. అంతేగాక చిన్న ట్రాక్టర్‌కు వెనక ఉన్న తిరిగే పరికరం (పీ.టీ.వో) ద్వారా పంపు బిగించి, ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న ట్యాంకుకు అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా ఆయా పంట పొలాల్లో క్రిమిసంహారక మందును పిచికారీ చేసుకునే అవకాశం కూడా వుంది. ఈ ట్రాక్టర్‌ ద్వారా ఒక్క రోజుకు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కలుపు తీయడం, క్రిమిసంహారక మందును పిచికారి చేసే వీలున్నది. ఈ పని చేసేందుకు నలభై మంది కూలీలు అవసరమవుతారు. అందుకోసం 12 వేల రూపాయల ఖర్చవుతుంది. మినీ ట్రాక్టర్‌తో పని వేగంగా జరగడంతో పాటు ఖర్చు కూడా తక్కువ. దీంతో రైతులు ఈ ట్రాక్టర్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతంగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయలేని రైతులు గంటకు నాలుగు వందల రూపాయల అద్దె చెల్లించి సేవలు పొందుతున్నారు.
భలే ప్రయోజనం
చిన్న ట్రాక్టర్‌ సన్న, చిన్నకారు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. కూలీల కొరత ఉన్న ఈ పరిస్థితులలో చిన్న ట్రాక్టర్‌ రైతులను ఆదుకుంటుంది. వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై ఇస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
 బుచ్చిరెడ్డి,
హత్నూర మండలం, బడంపేట
Credits : Andhrajyothi

రైతుకు వరం

 
ఆంధ్రజ్యోతి ప్రతినిది: పంటల సాగులో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబరు(1800 425 341)ను ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాల్లోని రైతుల సమస్యలకు ఇటు ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాలకు, అటు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లోని ఏరువాక/కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడవచ్చు. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఏ జిల్లా రైతు సమస్య అయితే, ఆ జిల్లాలోని ఏరువాక/ కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్తకు కాల్‌ అనుసంధానం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశువుల యాజమాన్యం, చేపల పెంపకంపై రైతులు తమ సందేహాలకు సలహాలు పొందే వీలుంది. ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుతారు. ఈ సేవలు పొందటానికి సంబంధిత జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం/ ఏరువాక కేంద్రంలో రైతులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నెంబరును ఉచితంగా నమోదు చేస్తారు. అదనపు సమాచారం కోసం 99896 25239, 97006 51031, 91778 04355 సంప్రదించవచ్చని అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పున్నారావు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబరుకు కాకుండా నేరుగా ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రం ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే, రైతుకు కాల్‌ ఛార్జీలు పడతాయి.
ఏపీలోని 13 జిల్లాల ఏరువాక కేంద్రం/ కృషి విజ్ఞాన కేంద్రాల ప్రధాన శాస్త్రవేత్తల నంబర్లు ఇవీ : శ్రీకాకుళం – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23822, విజయనగరం- ఏరువాక కేంద్రం- 99896 23801, విశాఖపట్నం- ఏరువాక కేంద్రం – 99896 23802, తూర్పుగోదావరి- ఏరువాక కేంద్రం- 99896 23803, పశ్చిమగోదావరి- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23823, కృష్ణా- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23824, గుంటూరు- ఏరువాక కేంద్రం- 99896 23806, ప్రకాశం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23827, నెల్లూరు- కృషి విజ్ఞాన కేంద్రం – 99896 23828, కడప – కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23826, కర్నూలు- ఏరువాక కేంద్రం- 99896 23910, అనంతపురం- కృషి విజ్ఞాన కేంద్రం- 99896 23825, చిత్తూరు – కృషి విజ్ఞాన కేంద్రం- 80085 00320.
Credits : Andhrajyothi

ఖర్జూర సాగు.. లాభాలు బాగు

ఖర్జూర అనగానే గుర్తొచ్చేది అరబ్‌ దేశాలు.. అధిక ఉష్ణోగ్రతల్లో పండే ఖర్జూరానికి గిరాకీ
నానాటికీ పెరుగుతోంది. నాణ్యమైన ఖర్జూరాలు కావాలంటే దిగుమతి చేసుకోవాల్సిందే.
ఈ పరిస్థితిని గమనించిన నల్లగొండ సమీపంలోని నర్సింగ్‌భట్ల గ్రామానికి చెందిన
బండారు ఆగమయ్య ఖర్జూర సాగు చేపట్టారు. గణనీయంగా లాభాలు గడిస్తూ
ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎడారి పంటగా పేరుబడిన ఖర్జూరను నల్లగొండలో పండించాలనే ఆలోచనే సాహసంతో కూడుకున్నది. కానీ ఆగమయ్య ఆ దిశగా ఆలోచించారు. తనకున్న రెండెకరాల భూమిలో 2012లో ఖర్జూరపంట వేసేందుకు సిద్ధమయ్యారు. ఖర్జూర మొక్కలను కొనుగోలు చేసేందుకు గుజరాత్‌కు వెళ్లి ఒక్కో మొక్కను రూ.3వేల చొప్పున కొనుగోలు చేశారు. రెండెకరాల భూమిలో 120 మొక్కలను నాటారు. దుబాయి నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూ కల్చర్‌ ఖర్జూర మొక్కలను ఇందుకు వినియోగించారు. నిజానికి చౌడు నేలల్లో ఎలాంటి పంటలు పండవు. అలాంటి నేలల్లో ఖర్జూరం పండించాలి కాబట్టి సాధారణ రకాలు కాకుండా టిష్యూ కల్చర్‌ మొక్కలను నాటారు. రెండు అడుగుల మేరకు గుంతలు తీసి రెండు ఎకరాల్లో మొక్కలు నాటారు. పూర్తిగా చౌడు భూమి కావటంతో ఆ గుంతల్లో ఎర్రమట్టిని పోసి మొక్కలు పెంచారు. ఒక్కో పాదు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా ఎకరాకు 60 మొక్కల చొప్పున రెండెకరాల్లో 120 మొక్కలను నాటారు. వీటికి బోరు ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. అయితే వీటి కాత అంతా పరపరాగ సంపర్కం ద్వారా జరుగుతుంది. అందుకోసం ఎకరాకు 3 మగ ఖర్జూర చెట్లను నాటారు. ఈ మగ చెట్ల నుంచి వచ్చే కాయలను పొడి చేసి ఆ పొడిని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. మొక్కలు కొనేందుకు ఖర్చు తప్ప ఖర్జూరం సాగుకు మిగిలిన ఖర్చులు తక్కువే. ఎకరానికి ఏడాదికి 10 వేల వరకు ఖర్చయిందన్నారు ఆ రైతు. కిలో ఖర్జూరను రూ. 120లకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోనే ఈ పంటను అమ్మేందుకు సరిపోతోంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ నుంచి కూడా కొంతమంది వ్యాపారులు వచ్చి ఖర్జూరను కొనుగోలు చేసి వెళ్తున్నారన్నారు ఆ రైతు. ఏటా జూలైలో పంట దిగుబడి వస్తుంది. ప్రతి చెట్టుకు మొదట్లో 20 కిలోల చొప్పున దిగుబడి రాగా ప్రస్తుతం సుమారు 80 కిలోల వరకు దిగుబడి వస్తోంది. తొలి ఏడాది 24 క్వింటాళ్లకు రూ. రెండు లక్షల ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర క్వింటాకు సుమారు రూ.12వేలు పలుకుతున్నది. దీంతో రూ.10 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ రైతు స్ఫూర్తితో జిల్లాలో ఖర్జూరం సాగు ఊపందుకుంటుందంటున్నారు వ్యవసాయ నిపుణులు.
లాభాలకు ఢోకా లేదు
పత్తి, మిరప పంటలను సాగు చేసి నష్టపోవటం కంటే ఖర్జూర చెట్లను పెంచుకుంటే మేలు. లాభాలకు ఢోకా వుండదు. పండిన ఖర్జూరాన్ని ఎండు ఖర్జూరగా మార్చటానికి ప్రాసెసింగ్‌ యూనిట్లు లేకపోవటంతో కోసిన నాలుగైదు రోజుల్లోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు పాలు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
Credits : Andhrajyothi

పుట్టగొడుగుల పెంపకం.. నిత్యం ఆదాయం

స్వయంకృషితో పాలపుట్టగొడుగులు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఆవిరిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి ప్రసన్న. ఆరోగ్యశాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూనే  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.
తక్కువ పెట్టుబడితో, కూలీల ఖర్చు లేకుండా పుట్టగొడుగుల్ని ఎవరైనా పెంచుకోవచ్చు. పట్టణాల్లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ వుండటంతో మార్కెటింగ్‌ ఇబ్బందులు కూడా లేవు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు పుట్టగొడుగులు పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. తొలుత ఎండుగడ్డిని అంగుళం సైజులో ముక్కలు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అనంతరం గడ్డిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన గడ్డిని 20 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టుకోవాలి. పాలిథిన్‌ కవర్లను సంచులుగా తయారుచేసుకుని ఆరబెట్టిన గడ్డిని ఐదు వరసలుగా నింపాలి. సంచుల్లో కొద్దిపాటి గడ్డివేసి దానిపైన విత్తనాలు, మరలా దానిపై గడ్డి, దానిపై విత్తనాలు ఇలా ఐదు వరసలుగా సంచిని నింపుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన సంచిని గాలి ఆడకుండా గట్టిగా మూసి ఉంచాలి. ఆ సంచికి 25 చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఆ సంచులను 21 రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి. పుట్టగొడుగుల తయారీలో భాగంగా మట్టిని సేకరించి దానిని నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన మట్టిలో చాక్‌ పౌడర్‌ కలపాలి. తదుపరి డార్క్‌ రూమ్‌లో ఉంచిన బ్యాగులను 21 రోజుల తర్వాత బ్యాగును సగానికి కట్‌ చేసి తయారుచేసుకున్న మట్టిని నింపాలి.
అనంతరం ఈ బ్యాగులను వెలుతురు గదుల్లోకి మార్చాలి. 24 గంటల గడిచిన తర్వాత రోజుకు రెండుపూటలా పల్చగా తడుపుతూ ఉండాలి. 15 రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తుతాయి. ఈ ప్రక్రియ మొత్తంలో 40 రోజులకు పుట్టగొడుగులు పూర్తిస్థాయిలో తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులు రెండు నెలలపాటు కోసుకోవచ్చు. కేజీ విత్తనాలతో ఐదు కిలోల పుట్టగొడుగులు తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులను ఆన్‌లైన్‌ ద్వారా కిలో రూ.200లకు హైదరాబాద్‌, కాకినాడ, విజయవాడలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ అకౌంట్‌లో ముందుగానే డబ్బులు వేస్తారని, అనంతరం వారి అడ్రస్‌ ప్రకారం సరుకులు పంపిస్తామని తెలిపారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆవిరిపూడి (కూచిపూడి)
నెలకు 20 వేల ఆదాయం
కూలీలపై ఆధారపడకుండా కుటుంబసభ్యులే పనిచేసుకుంటే నెలకు రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎక్కువ విస్తీర్ణంలో పుట్టగొడుగుల పెంపకాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నాను. –
ప్రసన్న
Credits : Andhrajyothi

సాఫ్ట్‌వేర్‌ జంట సేద్యం బాట

  • 400 గొర్రెల పెంపకంతో లాభాలు …
  • మాంసం విక్రయానికి సన్నాహాలు
 
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు కిరణ్‌, సుష్మ దంపతులు. ఉద్యోగాలు సంతృప్తినివ్వకపోవడంతో స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని కృష్ణాజీగూడెం చేరుకున్నారు. గొర్రెలు, మేకల ఫామ్‌ ఏర్పాటు చేశారు. మంచి లాభాలు గడిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మాంసం విక్రయాలు చేపట్టి వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్న ఆ దంపతుల సక్సెస్‌ స్టోరీ. 
స్వయం ఉపాధికి బెస్ట్‌:  కృష్ణాజిగూడెంలో పుట్టిన కిరణ్‌ వరంగల్‌లో చదువుకున్నాడు. బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు. భార్య సుష్మ కూడా ఉద్యోగిని, ఇద్దరికీ వారు చేస్తున్న ఉద్యోగాలు సంతృప్తినివ్వలేదు. ఇద్దరూ కలిసి స్వగ్రామం చేరుకున్నారు. మొదట 50 ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేశారు. సేంద్రియ వ్యవసాయంలో అనుభవం లేకపోవడంతో లాభాలు రాలేదు. గొర్రెల ఫామ్‌ పెడితే లాభదాయకంగా వుంటుందని నిపుణులు సలహా ఇవ్వడంతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసి గొర్రెల ఫామ్‌ నెలకొల్పారు. మొదటగా షెడ్‌ నిర్మించి 35 గొర్రెలతో ఫామ్‌ ప్రారంభించారు. ఒక్కో పొట్టేలును మూడు వేలకు కొనుగోలు చేసి వాటిని పెంచారు. మూడు నెలల్లో రెట్టింపు లాభాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరో నాలుగు షెడ్లు నెలకొల్పారు. ఇప్పుడు 400 గొర్రెలతో వారి ఫామ్‌ కళకళలాడుతోంది. గొర్రెలు, పొట్టేళ్ల కోసం నీటితొట్లను, దాణా తినేందుకు ట్రేలను ఏర్పాటు చేశారు. వాటి పిల్లల కోసం వేరుగా ఒక షెడ్‌ ఏర్పాటు చేశారు. మేతకు అవసరమైన పచ్చి జొన్న చొప్పను సొంతంగా పండించుకుంటే లాభదాయకం అని భావించారు. పదెకరాల భూమిని లీజుకు తీసుకుని పచ్చిజొన్న పండించారు. దీంతో ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది. గొర్రెలు, పొట్టేళ్లను పెంచేందుకు పెద్దగా శ్రమ వుండదు. అవసరమైన మేరకు పనివాళ్లను నియమించుకుని ఫామ్‌ను శ్రద్ధగా అభివృద్ధి చేస్తున్నారు ఆ దంపతులు. పొట్టేళ్ల విక్రయం మంచి లాభాలను తెచ్చి పెడుతుందంటున్నారు సుష్మ. ఖర్చులు పోగా ఏటా రెండు లక్షలకు పైగా లాభాలు ఆర్జిస్తున్నారు ఆ దంపతులు.
మాంసం విక్రయ కేంద్రాలు
కేవలం పొట్టేళ్లు విక్రయిస్తే లాభాలు పరిమితంగా వుంటాయి. అలా కాకుండా మంచి వాతావరణంలో పెంచిన గొర్రెలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తే వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చని ఆలోచించారు కిరణ్‌, సుష్మ. ప్రస్తుతం మార్కెట్‌లో పొట్టేలు మాంసానికి మంచి డిమాండ్‌ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.400 ఉంటే, పట్టణ ప్రాంతాల్లో రూ.600ల పైచిలుకు ధర పలుకుతోంది. త్వరలో గ్రామాల్లోనే కాక, పట్టణాల్లో కూడా మాంసం విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేసి, ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి విక్రయించాలని ఆలోచిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ యువతకు ఉపాథి కల్పించేందుకు ఈ దంపతులు సన్నాహాలు చేస్తున్నారు.
 ఆంధ్రజ్యోతి వ్యవసాయ ప్రతినిధి, జగిత్యాల
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత గొర్రెల ఫామ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఫాం కోసం ఎక్కువ మంది పనివారు అవసరం లేదు. ఖర్చు. శ్రమ కూడా తక్కువే. శ్రద్ధగా పనిచేస్తే ఉద్యోగానికి మించి ఆదాయం వస్తుంది. కొండంత సంతృప్తి మిగులుతుంది.
 కిరణ్‌, సుష్మ
Credits : Andhrajyothi

బూమ్‌ స్ర్పేయర్‌ భళా

పంటలకు మందులు చల్లేందుకు ఇప్పటివరకు రైతులు ఉపయోగిస్తున్న పవర్‌ స్ర్పేయర్‌, ట్రాక్టర్‌ స్ర్పేయర్‌ల స్థానంలో మరో ఆధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. పురుగుల మందు ఏమాత్రం వృధాకాకుండా, మొక్క మొత్తం మందును చల్లే వీలున్న బూమ్‌ స్ర్పేయర్‌ విశేషాలు.
పొలంలో పవర్‌ స్ర్పేయర్‌తో పురుగుల మందు చల్లినప్పుడు ఆవిరి రూపంలో ఎక్కువ మందు గాలిలో కలిసిపోతుంది. ట్రాక్టర్‌ స్ర్పేయర్‌తో మందు పిచికారి చేసినా 30 శాతం వరకు నష్టం కలుగుతుంది. పైగా ట్రాక్టర్‌ వల్ల పంట నష్టం కూడా 15 శాతం వరకు వుంటున్నది. ఈ సమస్యలను అధిగమించి పంట నష్టం జరగకుండా, తక్కువ ఖర్చుతో, మొక్క అంతటికీ మందు పడే విధంగా పురుగులు మందును చల్లే బూమ్‌ స్ర్పేయర్‌ మార్కెట్‌లోకి వచ్చింది. రక్షక్‌-400 పేరుతో శక్తిమాన్‌ కంపెనీ ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ర్పేయర్‌ను తయారుచేసింది. దీని ధర రూ.11 లక్షలు. 400 లీటర్ల డబుల్‌ లేయర్‌ హైడెన్సిటీ పాలిథిన్‌ కెమికల్‌ ట్యాంక్‌ కలిగి ఉంటుంది. ఈ యంత్రానికి 12 మీటర్లు (40 అడుగులు) పొడవైన బూమ్‌ కలిగి ఉంటుంది. మందు పిచికారి సమయంలో దీనిని విచ్చుకునేలా చేసి తర్వాత మడతపెట్టే విధంగా డిజైన్‌ చేశారు. ఈ యంత్రానికి సిరామిక్‌ డిస్క్‌తో టువే ట్రిపుల్‌ యాక్షన్‌ 24 నాజిల్స్‌ ఉంటాయి. దీని వలన పెద్దగా పంట నష్టం వుండదు. వరి మళ్లలో వరి సాలు తీయకుండానే ఈ స్ర్పేయర్‌తో మందు కొడితే సాలు ఏర్పరిచే కూలీల ఖర్చు కూడా మిగులుతుంది.
ఖర్చు తక్కువ.. ఫలితం ఎక్కువ
‘మా సంస్థ ద్వారా బూమ్‌ స్ర్పేయర్‌ను కొనుగోలు చేశాం. ఈ యంత్రంతో వరి, పత్తి, శనగ, మిరప, కందిపైర్లలో మందు పిచికారీ చేశాం. ఈ స్ర్పేయర్‌ వల్ల పురుగుల మందు మొక్కలపై పూర్తిగా పడుతుంది. ఎత్తుగా పెరిగే వరి, కంది, జొన్న పంటలకు నష్టం వాటిల్లకుండా, సునాయాసంగా తిరుగుతూ స్ర్పే చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ట్రాక్టర్‌ ద్వారా మందు పిచికారీ చేసేందుకు ఒక హెక్టారుకు రూ.300 తీసుకుంటున్నారు. ఈ యంత్రం కోసం నాలుగు ఎకరాల్లో మందు చల్లేందుకు రూ.700 తీసుకుంటున్నాం’ అన్నారు కామనూరు గ్రామంలోని రాధాప్రకృతి ఫార్మస్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ అధ్యక్షుడు నంద్యాల రాఘవరెడ్డి.
Credits : Andhrajyothi

బాగు.. సొర సాగు

తుర్కపల్లి, ఫిబ్రవరి 18: వర్షాభావ పరి స్థితుల్లో వరి సాగుకంటే కూరగాయల సాగు వైపే రైతులు మక్కువ చూపిస్తున్నారు. మం డలంలోని ముల్కలపల్లి, రామాపురం, తు ర్కపల్లి తదితర గ్రామాల్లో ఈ ఏడా ది చెరు వులు, కుంటలు నిండలేదు. వరిసాగుకు నీటి వసతి బాగుండాలి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బోర్లు ఎండిపోయి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు భావించారు. అందు బాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో కూరగాయల సాగు చేస్తున్నారు. తుర్కపల్లి మండలం ము ల్కలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రామా పురం గ్రామానికి చెందిన ధీరావత్‌ బిచ్చా మూడేళ్లుగా కూరగాయల తోటలను సాగు చేస్తున్నాడు.
ప్రధానంగా టమాట, సొరకాయ, దోసకాయ, మోరంగడ్డ, వంకాయ తదితర కూ రగాయలు పండిస్తూ లాభాలు పొందుతున్నా డు. బిచ్చా దంపతులు నిత్యం తోటకు వెళ్లి ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. వరి సాగుతో పోల్చితే కూరగాయల సాగుకు నీటి వినియోగంతో పా టు పెట్టుబడి కూడా చాలాతక్కువని ఆ రైతు పేర్కొంటున్నాడు. అరఎకరంలో టమాట సా గు చేస్తే ఎరువు మందులు, కలుపు కూళ్లు, వి త్తనాలు కలుపుకొని రూ.7,500 ఖర్చు అయిం దని, లాభం కూడా ఎక్కువే వస్తుందని రైతు పేర్కొన్నాడు.సొరకాయ సాగుతో పాటు టమాట సాగు కూడా చేశానని, టమాటకు మార్కెట్‌లో ధర లేనందున గిట్టుబాటు కావ డంలేదన్నాడు. ధర తక్కువగా ఉన్నందున తా ను పండించిన టమాటను ఆటోలో తీసుకువె ళ్లి విక్రయిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఈ ప్రాం తాన్ని కూరగాయల హబ్‌గా గుర్తించించామని ప్రకటించినా తనకు ఎటువంటి ప్రోత్సాహం అందలేదన్నారు.
 
డ్రిప్‌ పైపులు అందించి ప్రోత్సహించాలి..
వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల సాగు చేసి కుటుం బాన్ని పోషించుకుంటున్నా. మాకున్న రెండు బోర్లు అంతంత మాత్రం గా పోస్తున్నాయి. డ్రిప్‌ పైపుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసినా మంజూరుకాలేదు. ఉన్నతాధికారులు స్పందించి డ్రిప్‌ పైపులతో పాటు కూరగాయల విత్తనాలు అందించి సాగును ప్రోత్సహించాలి.
ధిరావత్‌ బిచ్చా, రైతు, రామాపురం తండా
Credits : Andhrajyothi

లాభాల్లో రారాజు ఆ కాకర

  • తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రలో డిమాండ్‌..
  • తూర్పుగోదావరి జిల్లాలో 700 ఎకరాల్లో సాగు
కూరగాయల్లో రారాజు ఆకాకర. పోషకాల గనిగా పేరుండటం, శాకాహారులతో
పాటు మాంసాహారులు కూడా ఎక్కువగా వినియోగిస్తుడడంతో ఆకాకరకు
తరగని డిమాండ్‌ వుంది. నిరంతరం మంచి ధర పలికే ఆకాకరను సాగు చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాల రైతులు.
కూరగాయల సాగు నిరంతరం ఆదాయం తెచ్చిపెట్టినా కొన్ని కూరగాయల ధరలు ఒక్కోసారి పాతాళానికి పడిపోతాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు రైతులు నిత్యం మంచి డిమాండ్‌, ధర వుండే ఆకాకర సాగు ప్రారంభించారు. మంచి రుచితో పాటు పోషకాలు పుష్కలంగా వుండటంతో ఆకాకరకు పట్టణాల్లో మంచి గిరాకీ వుంది. దానికి తోడు మంచి ధర పలకడంతో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి, కొడవలి, తాటిపర్తి గ్రామాలు, ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ రైతులు 700 ఎకరాల్లో అకాకర సాగు చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం కొద్ది విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ పంట సాగు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నది. కిలో వంద రూపాయల నుంచి 250 రూపాయలకు పైగా ధర పలికే ఆకాకర సాగు వల్ల అధిక ఆదాయం వచ్చినా ఖర్చులు, శ్రమ కూడా ఎక్కువే అంటున్నారు రైతులు.
 
పందిరి కోసం అధిక వ్యయం
ఆకాకర రైతులు సొంతంగానే విత్తనాన్ని తయారు చేసుకుంటారు. ఒక పొలంలో పండిన పంట నుంచి విత్తనాలు అదే పొలంలో నాటరు. అలా చేస్తే సరిగా మొలకెత్తదని రైతుల నమ్మకం. తీగ జాతికి చెందిన ఈ పంట సాగులో అధిక భాగం పందిరి వేసేందుకే ఖర్చవుతుంది. మొక్కలు పందిరికి ఎంత బాగా అల్లుకుంటే అంత అధిక దిగుబడి వస్తుంది. దీని సాగుకు ఎకరానికి సుమారు లక్ష నుంచి 1.20 లక్షల వరకూ వ్యయం అవుతుంది. పందరి వేసేందుకే రూ.40 నుంచి 55 వేల వరకూ ఖర్చు చేయాలి. పంట వేసిన 100 రోజులకు దిగుబడులు ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి కాయలను కోస్తారు. ఆరునెలలు పాటు నిరంతరాయంగా దిగుబడులు వస్తాయి. ఎకరానికి సగటున మూడు టన్నుల వరకూ దిగుబడి లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే అత్యధికంగా 4.5 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. విత్తనం వేసిన ఏడాది కాకుండా మరుసటి ఏడాది మొక్కలకు ఉన్న దుంపలతో సాగును కొనసాగిస్తారు. పంట దిగుబడి ప్రారంభంలో 10 కిలోల ఆకాకర ధర రూ.1500 వుంటుంది. పంట చివరి దశకు చేరే కొద్దీ రేటు తగ్గుతూ వచ్చి రూ.500కు చేరుకుంటుంది.
ఈ ప్రాంతంలో పండిన పంటలో 90 శాతం శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, ఇచ్చాపురం, అనకాపల్లి, గుంటూరు, ఒంగోలు మార్కెట్లతో పాటు తెలంగాణాలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్‌ మహారాష్ట్రలోని ముంబయి, కర్నాటకలోని బళ్లారి, బెంగుళూరు తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నది. వ్యాపారులు రైతుల వద్ద పంట కొనుగోలు చేసి వేరే ప్రాంతాలకు లారీల మీద తరలిస్తున్నారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధులు,
పిఠాపురం, గొల్లప్రోలు రూరల్‌
ఎకరాకు లక్ష ఆదాయం
15 ఏళ్లుగా ఆకాకర సాగు చేస్తున్నాం. తుఫాన్లు వస్తే తప్ప ఏటా లాభం వస్తూనే ఉంది. అన్ని ఖర్చులూ పోను ఎకరాకు సుమారు లక్ష ఆదాయం వస్తుంది. గతంలో ఆకాకరను పందిరి పంటగా గుర్తించి సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు అది తీసేశారు. విత్తనాలపై రాయితీ ఇచ్చి, సబ్సిడీ ఇస్తే మరింతమంది రైతులు ఈ పంట సాగు చేస్తారు.
– కందా దొరబాబు, కె. చంటిబాబు,
ఆకాకర రైతులు, వన్నెపూడి
మధుమేహానికి చెక్‌
కాకరకాయను పోలి వుండే ఆకాకర పోషకాల గని. ఇందులో శరీరాన్ని శుద్ధి చేసే ఫినోలిక్‌ అధికంగా లభిస్తుంది. దీనికి శరీరంలోని మాలిన్యాలను తొలగించే శక్తి వుండటంతో కేన్సర్‌, ఊబకాయం వంటి వ్యాధులు దరిచేరకుండా వుంటాయి. అకాల వృద్ధాప్యాన్ని ఆకాకర దరిచేరకుండా చేస్తుంది. ఇందులో లభించే లుటిన్‌ వంటి సెరిటోనాయిడ్స్‌ వల్ల కంటి జబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం దరిచేరకుండా చేస్తుంది. వందగ్రాముల ఆకాకరలో కేవలం 17 గ్రాముల కేలరీలు మాత్రమే వుంటాయి. పీచుపదార్ధం కూడా అధికంగా వుండటంతో జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు అలర్జీలను కూడా దరిచేరనివ్వదంటున్నారు నిపుణులు.
Credits : Andhrajyothi

ఆధునిక సాగుతో.. ఖర్చు సగమే..

  •  యంత్రాలతో సాగు
  •  సమయం, డబ్బు ఆదా
(వలిగొండ):నేడు వ్యవసాయంలో యాంత్రీకరణ తో కొందరు రైతులు శ్రమను, డబ్బును ఆదా చేసుకొని మంచి దిగుబడిని సా ధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను వదిలి పెడుతున్నారు. ధాన్యం నాన బెట్టే దశ నుంచి దిగుబడి సాధించి అమ్మేవరకు ఆధునిక పద్ధతిలో పలువు రు రైతులు వ్యవసాయం చేస్తూ ఆద ర్శంగా నిలుస్తున్నారు. రైతుల విజ యం వారి మాటల్లోనే. 
యంత్రంతోవరి నాట్లు వేశా…
గొల్నెపల్లి గ్రామ పరిధిలో నాకు ఐదె కరాల ఎకరాల భూమి ఉంది. దీనిలో నాలు గు ఎకరాల్లో వరిని సాగు చేశా. కూలీల కొర త తీవ్రమవడంతో నెల్లూరు ప్రాంతం నుం చి అద్దెకు వరిని నాటు వేసే యంత్రాన్ని తెచ్చి దాంతో వరిని నాటా. ముందుగా పాలిఽథీన్‌ కవర్‌ను నేలపై పరిచి దానిపై 5 ఎంఎం మట్టిని పోసి వరి విత్తనాలను చల్లా. దానిపై మట్టిని ఎరువును కలిపి పైన వేశా. సరిపడే పరిమాణంలో నీటితో తడిపా. 20 రోజులు నీరు పోసిన తదుపరి వరి ధాన్యం మొలకెత్తాక వరినాటు యంత్రంపైకి ట్రేలలో అమర్చి పొలంలో నాటా. నాలుగు గంటల్లో వరినాటడం పూర్తయింది. ఈ పద్ధతిలో ఒక ఎకరం పొలంలో 10 కిలోల వరి విత్తనాలు నాటడానికి యంత్రం అద్దెకు రూ.3,500 ఖర్చయింది.. వరిపైరు కూడా గతంలో కంటే బాగా ఉంది. గతంతో కూలీలతో నాటు వేస్తే రూ.5వేలు ఖర్చయింది. ఎకరం నాటుకు రూ.1,500 వరకు ఆదా అయింది.
కణతాల వెంకట్‌రెడ్డి, రైతు, గొల్నెపల్లి, వలిగొండ
డ్రమ్‌సీడర్‌తో వరినాటు వేశా..
నాకు వెలువర్తి పరిధిలోనాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. మూడ ఎకరాల్లో వరిని సాగు చేశా. ఎకరంలో పత్తిని సాగు చేశా. తమిళనాడు రాష్ట్రంలోని రైతులు డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నారని తెలుసుకుని అదే పద్ధతిలో నాట్లు వేశా. విత్తనాల ను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత మరో 24 గంటలు నీటి నుంచి బయట వేసి బస్తాలపై వరిగడ్డితో కప్పి ఉంచా. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను డ్రమ్‌ సీడర్‌ యంత్రంలో పోసి చదును చేసిన పొలంలో నాటా. ఒక ఎకరం భూమికి వేయి రూపాయలు ఖర్చయింది. నాకు నాలుగు వేలు ఆదా అయింది. రెండేళ్ల నుంచి ఇదే పద్ధతి అనుస రిస్తున్నా. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబ డి వచ్చింది. కోనో వీడర్‌ అనే కలుపు తీసే యంత్రంతో కలుపును తీస్తున్నా. ఈయంత్రం మొత్తం ఖరీదు రూ.8వేలు మాత్రమే.
రామ్మూర్తి, రైతు, వలిగొండ
వరి విత్తనాలను వెదజల్లుతున్నా..
నీరు సమృద్ధిగా ఉన్న వ్యవసాయ భూముల్లో విత్తనాలను వెదజల్లవచ్చు. విత్తనాలను బస్తాలలో కట్టి నానబెట్టాలి. 24గంటల తర్వాత విత్తనాలు మొలకెత్తగా మరో 24గంటలు వరిగడ్డితో కప్పి ఉంచాలి. అనంతరం చదును చేసిన పొలంలో నేరుగా వెదజల్లాలి. ఇది పురాతన పద్ధతి. నీటి వినియోగం తక్కువ. విత్తనాల ఖర్చు, కూలీ ఖర్చు కూడా తగ్గుతుంది. పంట 15 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. ఇలా వెదజల్లడంతో ఒక ఎకరానికికి రూ.6 వేలు ఆదా అయింది. వరిపైరును ఏ చీడపీడలు అంతగా ఆశించలేదు. ఆరుతడి పంటగానైనా వెదజల్లే పద్ధతిని అనుసరించవచ్చు. మందుల ను పిచికారి చేసి కలుపును నివారించవచ్చు.
 భీమిడి యాదిరెడ్డి, గొల్నెపల్లి, వలిగొండ
Credits : Andhrajyothi